Engineering Seat replacement
-
ముగిసిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. స్లైడింగ్‌లో బ్రాంచీలు మారిన విద్యార్థులు రిపోర్టు చేసే గడువు ఆదివారంతో ముగిసింది. ఈ దశలోనూ మిగిలిన 11,836 సీట్లకు ప్రతి కాలేజీ స్పాట్ అడ్మిషన్లు చేపడతాయి. యాజమాన్య కోటా కింద 30 శాతం సీట్లను కాలేజీలు నింపేశాయి. వాటిల్లో వాస్తవాలను పరిశీలించిన తర్వాత అధికారులు ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకూ సన్నాహాలు మొదలయ్యాయి. ప్రతిరోజూ కొన్ని కాలేజీలు ర్యాటిఫై కోసం ఉన్నత విద్యా మండలికి వస్తాయి. మొత్తం మీద ఈ నెలాఖరు నుంచి అన్ని కాలేజీలు క్లాసులు మొదలు పెడతాయని అధికారులు చెబుతున్నారు. ప్రధాన కాలేజీల్లో 100 శాతం కనీ్వనర్ కోటా కింద 175 కాలేజీల్లో ఈ ఏడాది 86,943 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. స్లైడింగ్ పూర్తయ్యాక 75,107 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 11,836 సీట్లు మిగిలాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ సహా పలు కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో 61,587 సీట్లు అందుబాటులో ఉండగా ఇప్పటివరకు 57,637 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 3,950 సీట్లు మిగిలాయి. అందులో సీఎస్ఈలో 1,305 సీట్లు, ఐటీలో 385, డేటా సైన్స్‌లో 712, ఏఐఎంఎల్‌లో 787 సీట్లు మిగిలాయి. అవన్నీ చిన్న కాలేజీల్లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని టాప్ కాలేజీల్లో కంప్యూటర్ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. స్పాట్ అడ్మిషన్లలోనూ మిగిలిన సీట్లకు డిమాండ్ ఉండదని అధికారులు చెబుతున్నారు. ఆ మూడు కోర్సులకు కనిపించని ఆదరణ బీటెక్ సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లో ఈ ఏడాది దాదాపు 10 వేల సీట్లు తగ్గాయి. వాటి స్థానంలో సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. అయితే అందుబాటులో ఉన్న సీట్లలోనూ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో 1,708 సీట్లు, ఈఈఈలో 2,162, సివిల్‌లో 1,442, మెకానికల్‌లో 1,803 సీట్లు మిగిలాయి. తొలి కౌన్సెలింగ్ నుంచి స్లైడింగ్ వరకు ఈ బ్రాంచీల్లో ఇదే ట్రెండ్ కనిపించింది. స్లైడింగ్ సమయంలో దాదాపు 5 వేల మందికి బ్రాంచీలు మారాయి. అందులో 3,500 మందికి కంప్యూటర్, అనుబంధ బ్రాంచీల్లో సీట్లు లభించాయి. యాజమాన్య కోటాపై నిఘా యాజమాన్య కోటా కింద 30 శాతం సీట్లను కాలేజీలు భర్తీ చేస్తాయి. 15 శాతం జేఈఈ, ఈఏపీసెట్ ర్యాంకర్లకు కేటాయించి ఆ తర్వాత ఇంటర్ మార్కులను ప్రామాణికంగా తీసుకోవాలి. మిగిలిన 15 శాతం సీట్లను ప్రవాస భారతీయులు స్పాన్సర్ చేసిన వారికి ఇస్తారు. అయితే యాజమాన్య కోటా సీట్లలో కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయనే ఫిర్యాదులొచ్చాయి. ర్యాంకర్లను పట్టించుకోకుండా ఎక్కువ డబ్బు ఇచ్చిన వారికే సీట్లు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించి ప్రతి దరఖాస్తునూ ర్యాటిఫై చేసేప్పుడు సాంకేతిక, ఉన్నత విద్యామండలి అధికారులు నిశితంగా పరిశీలించాలి. కానీ ఏటా ఇది నామమాత్రపు తంతుగా నడుస్తోంది. ఈసారి అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని, అనర్హులకు సీట్లు ఇస్తే ర్యాటిఫై చేయొద్దని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ర్యాటిఫికేషన్‌కు ఈసారి యంత్రాంగాన్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు చివరి చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కన్వినర్ సీటు కౌన్సెలింగ్ ద్వారా పొందడానికి ఇదే చివరి అవకాశం. ఇప్పటివరకూ సీటు కోసం ప్రయత్నించని వారు ఉంటే ఈ నెల 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవ్వాలని సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 19 వరకూ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 23వ తేదీన ప్రత్యేక దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో సీటు వచ్చిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లను ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్ల పేరిట ఆన్లైన్లో కాకుండా నేరుగా కాలేజీల్లోనే భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సాంకేతిక విద్య విభాగం విడుదల చేయాల్సి ఉంది. అందుబాటులో 19 వేల సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన సీట్లు దాదాపు 4 వేలకు పైనే ఉన్నాయి. ఒక్క సీఎస్సీలోనే 3,034 సీట్లు మిగిలాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 2,505, ఈసీఈలో 2,721, ఈఈఈలో 2,630, ఐటీలో 1,785, మెకానికల్‌లో 2,542 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది పలు కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకుని, ఆ స్థానంలో కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచుకున్నాయి. వీటితో పాటు మరో 7 వేల సీట్లు కొత్తగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో పెరిగాయి. మొత్తంగా కంప్యూటర్ సైన్స్ సీట్లు 14 వేల వరకు పెరిగాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నా అక్కడ చేరేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదు. ఆయా కాలేజీల్లో మౌలిక వసతులు, సరైన ఫ్యాకల్టీ లేదని విద్యార్థులు భావిస్తున్నారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు 90 శాతం వరకూ భర్తీ అయ్యాయి. లక్షకు చేరువలో చేరికలు ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి లక్ష మంది వరకు చేరే వీలుందని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 174 కాలేజీలుంటే, వీటిలో 83,766 కన్వినర్ కోటా సీట్లు, మరో 33 వేలు యాజమాన్య కోటా సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో ఇప్పటికే 65 వేల మంది వరకూ చేరారు. ప్రత్యేక కౌన్సెలింగ్, స్పాట్ అడ్మిషన్ల ద్వారా మరో 6 వేల మంది వరకూ చేరే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇక యాజమాన్య కోటా కింద దాదాపు 30 వేల వరకూ భర్తీ అయ్యే వీలుందని భావిస్తున్నారు. -
ఫీజులపై కాలేజీల తీరు సరికాదు: కడియం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీ సమయంలో ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ధారించిన ఫీజులకు అంగీకరించి కౌన్సెలింగ్‌లో పాల్గొన్న కాలేజీలు.. విద్యా సంవత్సరం మధ్యలో కోర్టులకెళ్లి ఫీజులను పెంచడం సరికాదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఫీజుల పెంపు విషయంలో విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఇందుకు సంబంధించి కోర్టు ఆదేశాలపై వెకేట్ పిటిషన్ దాఖలు చేశామని, అప్పీల్‌కు కూడా వెళ్తామన్నారు. గురువారం జేఎన్టీయూలో కడియం విలేకరులతో మాట్లాడారు. కాలేజీల ఫీజులను ఏటా అడ్మిషన్లకు ముందే ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయిస్తుందని, ఈసారీ అలాగే చేసిందని.. ఆ ఫీజులకు కాలేజీలు అంగీకరించిన తర్వాతే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. కానీ విద్యా సంవత్సరం మధ్యలో కోర్టుకెళ్లి ఫీజులను పెంచుతూ కాలేజీల యాజమాన్యాలు అనుమతి తెచ్చుకున్నాయన్నారు. రూ.1,13,000 ఫీజును రూ. 2 లక్షలకు పెంచుతూ అనుమతి తెచ్చుకుని ఆ మొత్తం కట్టమనడంతో తల్లిదండ్రులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఫీజులు పెంపు తల్లిదండ్రులకు భారం అవుతుందనే తిరస్కరించామని తెలిపారు. ఫీజులు పెంచుకోవాలంటే వచ్చే ఏడాది కమిటీ ఆమోదం పొంది పెంచుకోవాలని కాలేజీలకు సూచించారు. అడ్మిషన్ల సమయంలోనే తల్లిదండ్రుల నుంచి ఫీజు పెంపునకు సంబంధించి అఫిడవిట్లు తీసుకున్నామనే అంశం ప్రభుత్వ దృష్టిలో లేదని కడియం అన్నారు. కమిటీ నిర్ణయానికి భిన్నంగా తల్లిదండ్రుల వద్ద అఫిడవిట్లు తీసుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఫీజుల పెంపుపై ఫీజుల నియంత్రణ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
56,046 ఇంజనీరింగ్ సీట్ల భర్తీ
- 7,347 మందికి లభించని సీట్లు - వచ్చే నెల 15 తర్వాత చివరి దశ కౌన్సెలింగ్! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 56,046 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. ఎంసెట్ మొదటి దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రవేశాల కమిటీ బుధవారం సీట్లను కేటాయించింది. రాష్ట్రంలోని 197 ఇంజనీరింగ్ కాలేజీల్లో 70 శాతం కన్వీనర్ కోటాలో 64,300 సీట్లు అందుబాటులో ఉండగా.. అందులో మొదటి దశ కౌన్సెలింగ్‌లో 56,046 మంది విద్యార్థులకు సీట్లు లభించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. మరో 8,254 సీట్లు మిగిలిపోయినట్లు వెల్లడించారు. తెలంగాణ ఎంసెట్‌లో 1,06,058 మంది విద్యార్థులు అర్హత సాధించినా సర్టిఫికెట్ల వెరిఫికే షన్‌కు కేవలం 64,402 మంది మాత్రమే హాజరయ్యారు. అందులో 63,588 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారిలో 7,347 మంది విద్యార్థులకు సీట్లు లభించ లేదు. ఇక ఇంజనీరింగ్పాటు బీ ఫార్మసీ, ఫార్మ్–డీ కలుపుకుంటే మొత్తంగా 309 కాలేజీల్లో 67,698 సీట్లు ఉండగా, 56,241 సీట్లు భర్తీ అయ్యాయి. 11,457 సీట్లు మిగిలిపోయాయి. 91 కాలేజీల్లో వంద శాతం భర్తీ రాష్ట్రంలో 309 ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్–డీ కాలేజీల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు చర్యలు చేపట్టగా.. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 91 కాలేజీల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. 22 బ్రాంచీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. 9 బ్రాంచీల్లోనే సీట్లు మిగిలి పోయాయి. ఈసారి ఒక్క విద్యార్థి చేరని కాలేజీ ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. 12 కాలేజీల్లో 50 మంది లోపే చేరగా, మరో నాలుగు కాలేజీల్లో 10 మంది లోపు చేరారు. త్వరలో ప్రవేశాల కమిటీ భేటీ మిగిలిన సీట్లలో ప్రవేశాలకు చివరి దశ కౌన్సెలింగ్‌ను వచ్చే నెలలోనే నిర్వహించే అవకాశం ఉంది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరుకున్న తర్వాతే రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశాల చివరి దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఐఐటీ, ఎన్ఐటీల ఆరో దశ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు జూలై 29న ముగియనుంది. అంతవరకు కాకపోయినా వచ్చేనెల 15 తర్వాతే చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఐదు దశల కౌన్సెలింగ్‌లో జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో సీట్లు లభించని వారు రాష్ట్ర విద్యా సంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది. త్వరలోనే ప్రవేశాల కమిటీ సమావేశమై ఇంజనీరింగ్ తరగతుల ప్రారంభ తేదీతోపాటు చివరి దశ కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.