మిగిలింది ఇక స్పాట్ అడ్మిషన్లే
యాజమాన్య సీట్లకు త్వరలో ర్యాటిఫికేషన్
చిన్న కాలేజీల్లోనే మిగిలిపోయిన సీట్లు
నెలాఖరు నుంచి ఇంజనీరింగ్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. స్లైడింగ్‌లో బ్రాంచీలు మారిన విద్యార్థులు రిపోర్టు చేసే గడువు ఆదివారంతో ముగిసింది. ఈ దశలోనూ మిగిలిన 11,836 సీట్లకు ప్రతి కాలేజీ స్పాట్ అడ్మిషన్లు చేపడతాయి. యాజమాన్య కోటా కింద 30 శాతం సీట్లను కాలేజీలు నింపేశాయి. వాటిల్లో వాస్తవాలను పరిశీలించిన తర్వాత అధికారులు ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకూ సన్నాహాలు మొదలయ్యాయి. ప్రతిరోజూ కొన్ని కాలేజీలు ర్యాటిఫై కోసం ఉన్నత విద్యా మండలికి వస్తాయి. మొత్తం మీద ఈ నెలాఖరు నుంచి అన్ని కాలేజీలు క్లాసులు మొదలు పెడతాయని అధికారులు చెబుతున్నారు.
ప్రధాన కాలేజీల్లో 100 శాతం
కనీ్వనర్ కోటా కింద 175 కాలేజీల్లో ఈ ఏడాది 86,943 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. స్లైడింగ్ పూర్తయ్యాక 75,107 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 11,836 సీట్లు మిగిలాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ సహా పలు కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో 61,587 సీట్లు అందుబాటులో ఉండగా ఇప్పటివరకు 57,637 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 3,950 సీట్లు మిగిలాయి. అందులో సీఎస్‌ఈలో 1,305 సీట్లు, ఐటీలో 385, డేటా సైన్స్‌లో 712, ఏఐఎంఎల్‌లో 787 సీట్లు మిగిలాయి. అవన్నీ చిన్న కాలేజీల్లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని టాప్ కాలేజీల్లో కంప్యూటర్ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. స్పాట్ అడ్మిషన్లలోనూ మిగిలిన సీట్లకు డిమాండ్ ఉండదని అధికారులు చెబుతున్నారు.
ఆ మూడు కోర్సులకు కనిపించని ఆదరణ
బీటెక్ సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లో ఈ ఏడాది దాదాపు 10 వేల సీట్లు తగ్గాయి. వాటి స్థానంలో సీఎస్‌సీ, ఇతర కంప్యూటర్ కోర్సులకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. అయితే అందుబాటులో ఉన్న సీట్లలోనూ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో 1,708 సీట్లు, ఈఈఈలో 2,162, సివిల్‌లో 1,442, మెకానికల్‌లో 1,803 సీట్లు మిగిలాయి. తొలి కౌన్సెలింగ్ నుంచి స్లైడింగ్ వరకు ఈ బ్రాంచీల్లో ఇదే ట్రెండ్ కనిపించింది. స్లైడింగ్ సమయంలో దాదాపు 5 వేల మందికి బ్రాంచీలు మారాయి. అందులో 3,500 మందికి కంప్యూటర్, అనుబంధ బ్రాంచీల్లో సీట్లు లభించాయి.
యాజమాన్య కోటాపై నిఘా
యాజమాన్య కోటా కింద 30 శాతం సీట్లను కాలేజీలు భర్తీ చేస్తాయి. 15 శాతం జేఈఈ, ఈఏపీసెట్ ర్యాంకర్లకు కేటాయించి ఆ తర్వాత ఇంటర్ మార్కులను ప్రామాణికంగా తీసుకోవాలి. మిగిలిన 15 శాతం సీట్లను ప్రవాస భారతీయులు స్పాన్సర్ చేసిన వారికి ఇస్తారు. అయితే యాజమాన్య కోటా సీట్లలో కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయనే ఫిర్యాదులొచ్చాయి. ర్యాంకర్లను పట్టించుకోకుండా ఎక్కువ డబ్బు ఇచ్చిన వారికే సీట్లు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి.
యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించి ప్రతి దరఖాస్తునూ ర్యాటిఫై చేసేప్పుడు సాంకేతిక, ఉన్నత విద్యామండలి అధికారులు నిశితంగా పరిశీలించాలి. కానీ ఏటా ఇది నామమాత్రపు తంతుగా నడుస్తోంది. ఈసారి అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని, అనర్హులకు సీట్లు ఇస్తే ర్యాటిఫై చేయొద్దని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ర్యాటిఫికేషన్‌కు ఈసారి యంత్రాంగాన్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment