సీట్లొచ్చినా.. చేరేదెవరు? | Engineering counseling complete: Telangana | Sakshi
Sakshi News home page

సీట్లొచ్చినా.. చేరేదెవరు?

Published Wed, Oct 23 2024 5:49 AM | Last Updated on Wed, Oct 23 2024 5:49 AM

Engineering counseling complete: Telangana

ఇప్పటికే పూర్తయిన ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌.. మొదలైన తరగతులు

హైకోర్టు తీర్పుతో కాలేజీల్లో పెరగనున్న 3వేల సీట్లు..

సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన సర్కార్‌

న్యాయపోరాటానికి వెనుకాడని కాలేజీలు

సీట్ల పెంపు వ్యవహారంలో నాటకీయ పరిణామాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల పెంపు వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీట్ల పెంపును ప్రభుత్వం అడ్డుకుంటే, కాలేజీలే సీట్లు భర్తీ చేసుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయింది. క్లాసులు కూడా మొదలయ్యాయి. విద్యార్థులంతా ఇంజనీరింగ్, డిగ్రీ, లేదా ఇతర రాష్ట్రాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు.

ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో పెరిగే దాదాపు 3 వేల సీట్లు ఎలా భర్తీ అవుతాయనేది అర్థం కావడం లేదు. కోర్టు తీర్పు రాగానే ప్రైవేటు కాలేజీలు స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టాయి. ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకుంటున్నాయి. విద్యాజ్యోతి కాలేజీలో 120 సీట్లు పెరిగితే 15 మంది స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా చేరారు. మిగతా మూడు కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత మేర జరిగాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్‌ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీట్ల పెంపును అడ్డుకునేందుకు ప్రభుత్వం.. ఎలాగైనా సీట్లు పెంచుకునేందుకు ప్రైవేటు కాలేజీలు న్యాయపోరాటానికీ వెనుకాడటం లేదు.

వచ్చే ఏడాదిపైనే ఆశ
డిమాండ్‌ లేని ఇతర కోర్సుల్లో సీట్లు తగ్గించుకుని కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో ప్రైవేటు కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి. అనుమతులూ తెచ్చుకున్నాయి. దీనికి ప్రభుత్వం ససేమిరా అనడం, వివాదం కోర్టు మెట్లెక్కడం తెలిసిందే. ఆలస్యంగా తీర్పు వచ్చినా ప్రైవేటు కాలేజీలు సీట్లపై ఎందుకు ఆసక్తి చూపుతున్నాయనే సందేహాలు కలుగుతున్నాయి. కాలేజీలు ఈ సంవత్సరాన్నే దృష్టిలో పెట్టుకోలేదు.

ఇప్పుడు సీట్లు పెరిగితే, వచ్చే ఏడాదీ ఇది కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రవేశాలు కాకున్నా, కంప్యూటర్‌ సీట్లు కావడం వల్ల వచ్చే ఏడాది అన్నీ భర్తీ అయ్యే వీలుంది. ఒక్కో బ్రాంచీలో 120 సీట్లు ఉంటే, మేనేజ్‌మెంట్‌ కోటా కింద దాదాపు 33 సీట్లు ఉంటాయి. కంప్యూటర్‌ సైన్స్‌లో ఒక్కో సీటు రూ.16 లక్షలపైనే పలుకుతుంది. డిప్లొమా కోర్సుల ద్వారా రెండో ఏడాదిలోనూ ఇంజనీరింగ్‌ సీట్లు కేటాయిస్తారు. ఇందులోనూ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు పెంచుకునే వీలుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి కాలేజీలు సిద్ధపడుతున్నాయి.

ప్రభుత్వం పట్టుదల ఎందుకు?
హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే స్పాట్‌ ద్వారా చేరిన విద్యార్థులకు ఇబ్బంది తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. సీట్ల పెంపును అడ్డుకోవడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రైవేటు కాలేజీలపై నియంత్రణ దిశగా వెళ్లాలనుకుంటున్న ప్రభుత్వానికి ఈ విషయం కీలకమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు సీట్ల పెంపును అనుమతిస్తే, భవిష్యత్‌లో ప్రతీ కాలేజీ సివిల్, మెకానికల్‌ సీట్లు రద్దు చేసుకునే ప్రమాదం ఉందని, సీఎస్‌ఈ దాని అనుబంధ కోర్సులే ఉండే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగానే సీట్ల పెంపును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకూ పోరాడుతోందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

ఇది ప్రభుత్వం కక్షే
మౌలిక వసతులన్నీ ఉండటం వల్లే సీట్ల పెంపును కోరాం. ఏఐసీటీఈ, జేఎన్‌టీయూహెచ్‌ అనుమతించింది. కోర్టు కూడా పెంచుకోవచ్చని తెలిపింది. అయినా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణం. విద్యారంగంలోకి రాజకీయాలను తీసుకురావడం మంచిది కాదు. సీఎస్‌ఈ సీట్ల కోసం విద్యార్థుల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సీట్లు లేకుండా చేయడం సమంజసం కాదు.  - సూర్యదేవర నీలిమ (ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ నిర్వాహకురాలు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement