
తయారీలో భారత్‌కు అవకాశాలు అపారం
కావాల్సింది ప్రభుత్వ ప్రోత్సాహం
శిక్షణ, నైపుణ్య అభివృద్ధికి నిధుల కేటాయింపు
తద్వారా ప్రపంచ డిమాండ్‌లో కీలకస్థానం
8–10% వాటా దక్కించుకునే అవకాశం
ఆరేళ్లలో 40 బిలియన్ డాలర్ల వ్యాపారావకాశాలు
ఇండియా ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ అసోసియేషన్ అంచనా
సాక్షి, స్పెషల్ డెస్క్: సెమీకండక్టర్ తయారీ వ్యవస్థలో భారత్ కు బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి.. వాటిని అందుకోవడమే తరువాయి అని ఇండియా ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్‌ఏ) అంటోంది. ‘ప్రపంచ సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ విలువ 2022లో 240 బిలియన్ డాలర్లు. 2030 నాటికి ఇది 420 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రపంచ డిమాండ్‌లో భారత్ 8–10% వాటా దక్కించుకునే అవకాశం ఉంది. తద్వారా 2030 నాటికి 40 బిలియన్‌డాలర్ల వ్యాపార అవకాశాలను అందుకోవచ్చు’అని (ఐఈఎస్‌ఏ) నివేదిక తెలిపింది.
ప్రపంచ సంస్థలను ఆహ్వానించడం ద్వారా సెమీకండక్టర్ ఫ్యాబ్, ఔట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ (ఓఎస్‌ఏటీ) విభాగాల్లో పెట్టుబడులను పెంచడానికి కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ ప్రాముఖ్యత పట్ల అవగాహనను సృష్టించాయి. అలాగే దేశీయ సరఫరాదార్లలో ఆసక్తిని పెంచాయని నివేదిక పేర్కొంది.
మానవ వనరులు: సెమికండక్టర్ రంగంలో 2026–27 నాటికి 15 లక్షల మంది నిపుణులు, 50 లక్షల మంది పాక్షిక–నైపుణ్యం గలవారు అవసరం.
సరఫరా వ్యవస్థను నిర్మించడం ద్వారా
భారత సెమీకండక్టర్ వ్యూహం చిప్ తయారీని దాటి పూర్తి సరఫరా వ్యవస్థను నిర్మించడం వరకు విస్తరించింది. ముడి పదార్థాల నుంచి హై–ఎండ్ ప్యాకేజింగ్, టెస్టింగ్ వరకు కవర్ చేస్తోంది. బలమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థకు సిలికాన్ వేఫర్స్, స్పెషాలిటీ గ్యాసెస్, రసాయనాల వంటి కీలక పదార్థాల స్థిర సరఫరా అవసరం. వీటిని ప్రస్తుతం ప్రపంచ సరఫరాదార్ల నుంచి సేకరిస్తున్నారు. దేశీయంగా ఈ ముఖ్యమైన ముడిపదార్థాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పాలసీల రూపకల్పనకు కృషి చేస్తోంది.
వెల్లువెత్తుతున్న పెట్టుబడులు
దేశీయ సెమీకండక్టర్ తయారీకి వెన్నుదన్నుగా నిలవడానికి భారత ప్రభుత్వం రూ.76,000 కోట్లతో ప్రోత్సాహక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిప్, డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ సౌకర్యాలు, అలాగే టెస్టింగ్ మౌలిక సదుపాయాలకు ప్రాజెక్ట్ ఖర్చులలో దాదాపు 50% సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని రాష్ట్రాలు 20% వరకు అదనపు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ప్రాజెక్టు వ్యయంలో మొత్తం ఆర్థిక మద్దతు 70%కి తీసుకువస్తున్నాయి.
ఈ చర్యలు గణనీయంగా పెట్టుబడులను ఆకర్షించాయి. తైవాన్ పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ సహకారంతో టాటా ఎల్రక్టానిక్స్ 11 బిలియన్ డాలర్ల చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌తో సహా ఐదు ప్రధాన ప్రాజెక్టులలో దాదాపు 18 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ సంస్థలైన యూఎస్‌కు చెందిన మైక్రాన్, జర్మనీకి చెందిన ఇన్ఫినియాన్ సైతం దేశీయ కంపెనీలతో జత కట్టాయి.
ప్రాసెసింగ్ ఇక్కడే..
ఇప్పటికే బలమైన స్థానాన్ని కలిగి ఉన్న సెమీకండక్టర్ డిజైన్‌పై భారత్ దృష్టి సారిస్తోంది. సరఫరాదార్లు, విడిభాగాల తయారీదార్లు, లాజిస్టిక్స్ ప్రొవైడర్ల నెట్‌వర్క్‌ను సృష్టించడం ద్వారా భారత్ స్వయం–ఆధారిత సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటెల్, క్వాల్‌కామ్, ఎన్‌విడియా వంటి గ్లోబల్ చిప్ దిగ్గజాలు భారత్‌లో ప్రధాన డిజైన్ కేంద్రాలను కలిగి ఉన్నాయి. ఈ నైపుణ్యాన్ని స్థానిక తయారీ పర్యావరణ వ్యవస్థలో ఏకీకృతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తయారైన చిప్‌లను చివరి దశల కోసం విదేశాలకు పంపకుండా దేశంలోనే పూర్తిగా ప్రాసెస్ చేసేందుకు అధునాతన చిప్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయడం భారత్ ప్రత్యేకత. సిలికా¯న్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్‌లో హైదరాబాద్‌కు చెందిన మాస్‌చిప్ టెక్నాలజీస్ 25 ఏళ్లకుపైగా సేవలందిస్తోంది. దేశ, విదేశాలకు చెందిన 75కుపైగా దిగ్గజ సంస్థలకు డిజైన్ సర్వీసెస్ అందిస్తోంది. 600లకుపైగా ప్రాజెక్టుల్లో తనదైన ముద్రవేసింది.