దేశంలో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం
పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలి
‘సెమీకాన్–2024’ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
గ్రేటర్ నోయిడా: దేశంలో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రాబట్టడానికి చర్యలు ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బుధవారం నోయిడాలో ‘సెమీకాన్–2024’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ 150 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు.
ఈ దశాబ్దం ఆఖరు నాటికి దీన్ని 500 బిలియన్ డాలర్లు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ రంగంలో వృద్ధితో సెమీకండక్టర్ రంగం లబ్ధి పొందుతుందని ఉద్ఘాటించారు. దేశంలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్ పరికరాలు వంద శాతం ఇక్కడే తయారు కావాలన్నది తమ ధ్యేయమన్నారు.
85 వేల మందికి శిక్షణ
భారత్‌లో అమలవుతున్న సంస్కరణలు, స్థిరమైన ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు ఊతం ఇస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ల తయారీ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో చిప్‌లకు డిమాండ్ తగ్గినా, భారత్‌లో మాత్రం పెరుగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.
ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్రతి ఎల్రక్టానిక్ పరికరంలో భారత్‌లో తయారైన చిప్ ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ల డిజైనింగ్, తయారీ కోసం 85 వేల మందిని నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వీరిలో సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, ఆర్‌అండ్‌డీ నిపుణులు ఉంటారని వెల్లడించారు. ప్రపచంలో ఎక్కడా కనిపించని 3డీ పవర్(త్రి–డైమెన్షనల్ పవర్) ఇండియాలో ఉందని ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment