electronics sector
-
SEMICON India 2024: ప్రపంచమంతా ఇండియా చిప్‌లు
గ్రేటర్ నోయిడా: దేశంలో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రాబట్టడానికి చర్యలు ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బుధవారం నోయిడాలో ‘సెమీకాన్–2024’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ 150 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు. ఈ దశాబ్దం ఆఖరు నాటికి దీన్ని 500 బిలియన్ డాలర్లు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ రంగంలో వృద్ధితో సెమీకండక్టర్ రంగం లబ్ధి పొందుతుందని ఉద్ఘాటించారు. దేశంలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్ పరికరాలు వంద శాతం ఇక్కడే తయారు కావాలన్నది తమ ధ్యేయమన్నారు. 85 వేల మందికి శిక్షణ భారత్‌లో అమలవుతున్న సంస్కరణలు, స్థిరమైన ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు ఊతం ఇస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ల తయారీ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో చిప్‌లకు డిమాండ్ తగ్గినా, భారత్‌లో మాత్రం పెరుగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్రతి ఎల్రక్టానిక్ పరికరంలో భారత్‌లో తయారైన చిప్ ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ల డిజైనింగ్, తయారీ కోసం 85 వేల మందిని నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వీరిలో సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, ఆర్అండ్డీ నిపుణులు ఉంటారని వెల్లడించారు. ప్రపచంలో ఎక్కడా కనిపించని 3డీ పవర్(త్రి–డైమెన్షనల్ పవర్) ఇండియాలో ఉందని ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు. -
AP: ఎలక్ట్రానిక్స్ రంగంలో 36,205 మందికి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఓవైపు భారీ ఎత్తున పెట్టుబడులు, మరోవైపు యువతకు ఉద్యోగాల వెల్లువ కొనసాగింది. ముఖ్యంగా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ రంగం రికార్డు స్థాయి పెట్టుబడులను ఆకర్షించింది. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి. అంతేకాకుండా మరో రూ.15,711 కోట్ల విలువైన కొత్త పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ ఐదేళ్ల కాలంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో బ్లూస్టార్, డైకిన్, పానాసోనిక్, డిక్సన్, హావెల్స్, సన్సీఆప్టెక్స్ వంటి అనేక దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రారంభించడంతోపాటు భారీ ఎత్తున విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2019 మే నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 24 కంపెనీల ద్వారా రూ.10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవం రూపంలోకి రావడంతో ఏకంగా 36,205 మందికి ఉపాధి లభించింది. మరో 55,140 మందికి ఉపాధి గతేడాది మార్చిలో విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 23 ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా మరో రూ.15,711 కోట్ల పెట్టుబడులతోపాటు 55,140 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఎయిర్ కండీషనర్లు, సెల్‌ఫోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. కోవిడ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా దిగుమతులను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంది. ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అనేక కంపెనీలను స్వాగతించింది. అంతేకాకుండా వీటికి వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో కంపెనీలు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. శ్రీసిటీలో భారీగా తయారీ యూనిట్లు కాగా దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఎయిర్ కండీషనర్లలో ఒకటి మనం రాష్ట్రంలోనే తయారవుతుండటం విశేషం. తిరుపతి జిల్లా శ్రీసిటీలో జపాన్ ఏసీ తయారీ సంస్థ డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఇందులో ఒక్క డైకినే తొలి దశలో ఏటా 10 లక్షల యూనిట్లను తయారుచేస్తోంది. అంతేకాకుండా రెండో దశలో మరో 15 లక్షలు తయారుచేసేలా విస్తరణ చేపట్టనుంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులను ఈ జపాన్ సంస్థ పెట్టింది. అలాగే, బ్లూస్టార్ ఏటా 12 లక్షల యూనిట్లను తయారుచేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. కొప్పర్తి ఈఎంసీతో మరో 28,250 మందికి ఉపాధి ప్రస్తుతం ఏటా దేశవ్యాప్తంగా 75 లక్షల గృహ వినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షలకుపైనే ఉంటుందని అంచనా. ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవి కాకుండా రూ.749 కోట్లతో కొప్పర్తిలో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రూ.8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 28,250 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే డిక్సన్ వంటి కంపెనీలు కొప్పర్తిలో ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. -
శరవేగంగా విస్తరిస్తున్న ఎల్రక్టానిక్స్ రంగం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగం శరవేగంగా విస్తరిస్తోందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. ఎల్రక్టానిక్స్, టెలికాం నెట్వర్కింగ్ ఉత్పత్తుల రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం సత్ఫలితాలను ఇస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2021లో పీఎల్ఐ పథకం ప్రారంభించిన తర్వాత అతి తక్కువ కాలంలోనే దేశంలో టెలికాం ఉత్పత్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ చర్యల కారణంగా 2014–15లో రూ.1,80,000 కోట్లు ఉన్న ఎల్రక్టానిక్ పరికరాల ఉత్పాదన 2022–23 నాటికి రూ.8,22,000 కోట్లకు చేరుకుందన్నారు. 2014లో 78 శాతం మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకోగా, మేడిన్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 99.2 శాతం మొబైల్ ఫోన్ల తయారీ దేశంలోనే జరుగుతోందని మంత్రి వివరించారు. తూర్పు తీరంలో సమృద్ధిగా మత్స్య సంపద ఆంధ్రప్రదేశ్ సహా తూర్పు తీర రాష్ట్రాల్లో మత్స్య సంపద నిల్వలు సమృద్ధిగా (97 శాతం) ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) ప్రచురించిన మెరైన్ ఫిష్ స్టాక్ స్టేటస్ ఆఫ్ ఇండియా–2022 నివేదికలో పేర్కొన్నట్లు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. 2022లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేసిన 135 ఫిష్ స్టాక్ ప్రాంతాల్లో 91.1% మంచి నాణ్యత, పరిమాణం గల చేపల లభ్యత ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఫిషరీస్ మెనేజ్మెంట్ పాలన వ్యవస్థ కింద ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా సముద్ర చేపల నిల్వల స్థితి అంచనా వేసి, అన్ని వివరాలతో కూడిన పూర్తి సమాచారం అందించడమే ఈ అధ్యయనం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. మేనేజ్మెంట్ యూనిట్స్ నిర్వచించిన ప్రకారం చేపల పంట స్థాయి, సమృద్ధి ఆధారంగా బయోలాజికల్ స్థిరత్వం కోసం ఫిష్ స్టాక్స్ అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మెరైన్ ఫిష్ స్టాక్ స్టేటస్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో రాష్ట్రాలవారీగా ఫిష్ స్టాక్స్ అంచనా వేయలేదన్నారు. -
ఎలక్ట్రానిక్ రంగంలో భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి : ఎల్రక్టానిక్స్ అండ్ డిజైనింగ్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగానే పెట్టుబడులు ఆకర్షించింది. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఎల్రక్టానిక్స్ రంగంలో రూ.15,711 కోట్ల విలువైన 23 ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా 57,640 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు విస్తరణ చేపట్టేలా ఒప్పందం చేసుకోగా మరికొన్ని కొత్త కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇందులో అత్యధిక పెట్టుబడులు తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనే వచ్చాయి. అత్యధికంగా టీసీఎల్ గ్రూప్.. టీసీఎల్ గ్రూపు రాష్ట్రంలో అత్యధికంగా రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. టీవీ డిస్ప్లే ప్యానల్స్‌ను టీసీఎల్ గ్రూపు ఉత్పత్తి చేయనుంది. ♦ సెల్‌ఫోన్ కెమెరాలు, ఇయర్ ఫోన్స్ వంటి ఉపకరణాలను తయారుచేసేందుకు సన్నీఆపె్టక్ రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ♦ అలాగే, ఇప్పటికే శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టిన బ్లూస్టార్, డైకిన్ సంస్థలు తమ విస్తరణ కార్యక్రమాలను ప్రకటించాయి. డైకిన్ సంస్థ రూ.2,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకోగా.. బ్లూస్టార్ రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ♦ ఇవికాక.. డ్రోన్స్, లాజిస్టిక్ సొల్యూషన్స్, డిఫెన్స్, వ్యవసాయ రంగాల్లో ఎల్రక్టానిక్ ఉత్పత్తులను తయారుచేసే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం 23 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా మరిన్ని సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అపిటా గ్రూపు సీఈఓ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇక తిరుపతిలో రెండు, శ్రీసిటీలో ఒకటి, వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీ మొత్తం నాలుగు ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్ అందుబాటులో ఉండటంతో ఎల్రక్టానిక్స్ సంస్థలు రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్‌లో ‘ఫార్ములా–ఈ’
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ వాహన రంగానికి చిరునామాగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. హైదరాబాద్‌లో ‘ఫార్ములా–ఈ రేసింగ్’ నిర్వహించనున్నామని.. చారిత్రక, ఆధునిక సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ రేస్ నిర్వహణ ద్వారా ‘ఈ– మొబిలిటీ’ రంగంలో రాష్ట్రానికి అనేక అవకాశాలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లో రేసింగ్ నిర్వహణపై ఆసక్తి వ్యక్తీకరిస్తూ గ్రీన్కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం, ‘ఫార్ములా–ఈ’ మ ధ్య సోమవారం ఒప్పందం (లెటర్ ఆఫ్ ఇంటెంట్) కుదిరింది. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో పేరొందిన ఆటోమొబైల్ తయారీ సంస్థలతో మొబిలిటీ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామని.. చార్జింగ్ రంగంలో రెడ్కోతో కలిసి పనిచేసేందుకు మౌలిక వసతుల కంపెనీలను ఆహ్వానిస్తామని, అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో దివిటిపల్లి, సీతారాంపూర్‌లో రెండు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామని.. త్వరలో నాలుగు ఈ–బస్ తయారీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని వెల్లడించారు. అంతేగాకుండా మూడు సెల్‌ఫోన్ తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు. రాబోయే రోజుల్లో బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తామని.. మొత్తంగా భవిష్యత్ టెక్నాలజీ, సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలతో హైదరాబాద్‌ను ‘ఈవీ హబ్’గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ‘ఈవీ’ సదస్సుతో ఆకర్షించేలా.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను గుర్తిస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ విప్లవానికి హైదరాబాద్‌ను కేంద్రంగా నిలుపుతామని.. దేశాన్ని ముందుండి నడిపిస్తామని కేటీఆర్ అన్నారు. ‘ఫార్ములా–ఈ’ నిర్వహిస్తే.. ప్రపంచంలో పారిస్, రోమ్, లండన్, హాంకాంగ్, న్యూయార్క్, ర్లిన్, మొనాకో వంటి 18 నగరాల సరసన హైదరాబాద్ చేరుతుందని చెప్పారు. వచ్చే ఏడాది మొదట్లో జరిగే ఫార్ములా–ఈ రేస్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఈవీ సంస్థలను ఆహ్వానించి ‘ఈవీ సదస్సు’ నిర్వహిస్తామని.. ఈవీ రంగంలో భారత్‌కు, ప్రత్యేకించి తెలంగాణకు ఉన్న ప్రత్యేకతలను వివరిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఫార్ములా–ఈ రేస్ నిర్వహించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు పోటీ పడుతున్నా.. హైదరాబాద్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటైజ్, డీ కార్బనైజ్, డీ సెంట్రలైజ్ మంత్రాన్ని పఠిస్తోందని.. కర్బన రహిత ఉద్గారాల దిశగా పారిశ్రామిక రంగం కూడా తన దిశను మార్చుకుంటోందని వివరించారు. సీఎం కేసీఆర్ కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ హరితహారాన్ని చేపట్టారని.. ఆ కార్యక్రమం ద్వారా ఏడున్నరేండ్లలో రాష్ట్రంలో 147 రెట్ల పచ్చదనం పెరిగిందని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనలో తెలంగాణలో రెండో స్థానానికి చేరిందన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఫార్ములా–ఈ సహ వ్యవస్థాపకులు, చీఫ్ చాంపియన్‌షిప్ ఆఫీసర్ ఆల్బెర్టో లాంగో, డైరెక్టర్ ఆగస్ జొమానో, మహీంద్రా రేసింగ్ సీఈవో దిల్బాగ్ సింగ్, గ్రీన్కో సీఈవో అనిల్ చలమలశెట్టి, ఈవీ డైరెక్టర్ సుజయ్ కారంపూరి, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ రేస్ కార్లతో.. కన్నుమూసి తెరిచేలోగా అత్యంత వేగంగా మలుపులు తిరుగుతూ దూసుకెళ్లే ‘ఫార్ములా–వన్’ రేసింగ్ అందరికీ తెలిసిందే. అయితే శిలాజ ఇంధనాలు వాడకుండా.. ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ప్రపంచస్థాయి రేసింగ్ పోటీలే.. ‘ఫార్ములా–ఈ’. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా ఆదరణ పొందుతున్న కార్ రేసింగ్ చాంపియన్‌షిప్ ఇదే. దీనికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికిపైగా వీక్షకులు ఉన్నట్టు అంచనా. అలాంటి ప్రఖ్యాత రేసింగ్ హైదరాబాద్‌లో జరిగితే.. వివిధ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం (లెటర్ ఆఫ్ ఇంటెంట్) ప్రకారం.. మౌలిక వసతుల కల్పన, ఏర్పాట్లు, అవసరాలను పరిశీలిస్తారు. మూడు నెలల్లో తుది ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి మధ్య హైదరాబాద్‌లో ‘ఫార్ములా–ఈ’ రేసింగ్ జరుగనుంది. కేటీఆర్ నా కల నెరవేరుస్తున్నారు ప్రతిష్టాత్మక ‘ఫార్ములా–ఈ’ వరల్డ్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనుండటంపై ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సొంత గడ్డపై మహీంద్రా రేసింగ్ కార్లు పరుగులు పెట్టబోతున్నాయి. చిరకాల కల నెరవేరబోతోంది. ఈ కలను నెరవేర్చేదిశగా అడుగు వేసిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. -
భారీ పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఏపీ అడుగులు
సాక్షి, అమరావతి: ఎలక్రానిక్స్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2021–24కి భారీ పెట్టుబడులు తీసుకువచ్చే సత్తా ఉందని పారిశ్రామిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఉత్పత్తి ఆథారిత రాయితీలను ప్రత్యేకంగా ఇవ్వడం విశేషమని పేర్కొంటున్నారు. సెమీ కండక్టర్, ఎల్సీడీ ఫ్యాబ్స్‌లో రూ.7,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే వారికి మరిన్ని అదనపు రాయితీలు ఇస్తామని ప్రకటించడం వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ప్రోత్సాహకాలు ఇలా.. ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2021–24లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, వెయ్యి మందికి ఉపాధి కల్పించే సంస్థలకు ఈ పాలసీ వర్తిస్తుంది. ఏటా పెరిగే ఉత్పత్తి ఆధారంగా గరిష్టంగా 5 శాతం వరకు సబ్సిడీ ఇస్తారు. ఇలా పదేళ్లపాటు సబ్సిడీ లభిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఈఎంసీ–1, ఈఎంసీ–2కి అదనంగా కొత్తగా కొప్పర్తిలో నిర్మిస్తున్న వైఎస్సార్ ఈఎంసీ వంటి గ్రీన్‌ఫీల్డ్ ఈఎంసీల్లో ఏర్పాటయ్యే సంస్థలకు యూనిట్ విద్యుత్ రూ.4.50కే అందుతుంది. ఏడాదికి గరిష్టంగా రూ.50 లక్షల వరకు రవాణా వ్యయంలో రాయితీ లభిస్తుంది. సెమీ కండక్టర్, ఎల్సీడీ ఫ్యాబ్స్ల్లో రూ.7,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే సంస్థలకు మరిన్ని అదనపు రాయితీలు అందుతాయి. గరిష్టంగా ఏడాదికి రూ.1.50 కోట్ల వరకు ఐదేళ్లపాటు 5 శాతం వడ్డీకే రుణాలు అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు విద్యుత్, ఇన్పుట్ సబ్సిడీల్లో అదనపు రాయితీలు లభిస్తాయి. ఎలక్ట్రానిక్స్ పాలసీని ఆహ్వానిస్తున్నాం ఏ రాష్ట్రంలో లేనివిధంగా భారీ ఉత్పత్తి ఆధారిత రాయితీలను ప్రకటించడం, ఎలక్ట్రానిక్స్ రంగం కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వంటి పలు నిర్ణయాల వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయి. ఎలక్ట్రానిక్స్ రంగం నైపుణ్యం గల మానవ వనరుల కొరత ఎదుర్కొంటోంది. దీనిని పరిష్కరించేందుకు నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. –డి.రామకృష్ణ, సీఐఐ ఏపీ చాప్టర్ మాజీ చైర్మన్ పెట్టుబడులు ఆకర్షించే సత్తా ఉంది భారీ రాయితీలు ప్రకటించడంతో కొత్త పెట్టుబడులను ఆకర్షించే సత్తా ఈ పాలసీకి ఉంది. వైఎస్సార్ జిల్లాలో కొత్త ఈఎంసీని అభివృద్ధి చేస్తూ అక్కడ ఏర్పాటు చేసే కంపెనీలకు అదనపు రాయితీలు ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్రం ప్రకటించిన పీఎల్ఐకి అదనంగా రాష్ట్రం మరిన్ని రాయితీలు ప్రకటించడంతో కంపెనీలు క్యూ కడతాయి. – సీవీ అచ్యుతరావు,అధ్యక్షుడు, ఫ్యాప్సీ మానవ వనరులు అందించే బాధ్యత మాది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ స్కీం ప్రకారం కొత్తగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాం. దీనివల్ల ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్రం కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుంది. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగాలు రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్‌ను ప్రోత్సహిస్తున్నాం. ఇందులో భాగంగా కొప్పర్తిలో అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ ఈఎంసీలో పెట్టుబడులు పెట్టే వారికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. కొత్త ఎలక్ట్రానిక్స్ పాలసీ ద్వారా మూడేళ్లలో వచ్చే 39 వేల ఉద్యోగాల్లో మహిళలకు అత్యధికంగా ఉంటాయి. – జి.జయలక్ష్మి, కార్యదర్శి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ -
ఆరింటా అలరారేలా!
సాక్షి, అమరావతి: ఇప్పటికే ఎల్రక్టానిక్స్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం 13 రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఉత్పాదక ఆథారిత ప్రోత్సాహకాలు (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్–పీఎల్ఐ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కీలక రంగాలకు చెందిన పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఓవైపు రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తూనే మార్కెట్ డిమాండ్ అనాలసిస్ నిర్వహిస్తోంది. ఇప్పటికే పీఎల్ఐ స్కీం కింద ఎల్రక్టానిక్స్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల(ఈఎంసీ)ను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం కీలకమైన మరో ఆరు రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించింది. నక్కపల్లి పారిశ్రామికవాడ కోసం ఎల్ అండ్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ సంస్థ నిర్వహించిన మార్కెట్ డిమాండ్ ఎనాలసిస్‌లో ఆటోమొబైల్ దాని అనుబంధ రంగాలు, ఫార్ములేషన్స్–డ్రగ్స్, ఇంజనీరింగ్, పెట్రో కెమికల్స్–స్పెషాల్టీ కెమికల్స్, ఏరో స్పేస్–డిఫెన్స్, ఇంటిగ్రేటెడ్ సోలార్ పీవీ సెల్స్ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రం అనువుగా ఉంటుందని అంచనా వేసింది. 69,200 ఎకరాలు అవసరం: ఈ రంగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా ఎంత భూమి అవసరం అవుతుంది, ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎంత భూమి అందుబాటులో ఉందన్న విషయంపై ఎల్ అండ్ టీ నివేదిక తయారు చేసింది. ఈ ఆరు కీలక రంగాల్లో 2022 నుంచి 2032 వరకు అంటే వచ్చే పదేళ్ల కాలానికి కొత్త యూనిట్లు ఏర్పాటు చేయడానికి సుమారు 69,200 ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా ఆటోమొబైల్ రంగానికి 27వేలు, ఫార్మాస్యూటికల్స్ రంగానికి 17 వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా. రాష్ట్రంలో 13 జిల్లాల్లో మొత్తం 266 పారిశ్రామిక పార్కులు, కార్యకలాపాలు కొనసాగిస్తున్న సెజ్‌లు 32 వరకు ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు లక్ష ఎకరాలను అభివృద్ధి చేసిన ఏపీఐఐసీ రానున్న కాలంలో దీన్ని 10 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అభివృద్ధి చేసిన పార్కుల్లో 6,221 ఎకరాలు, సెజ్‌లలో 16,821 ఎకరాలు కలిపి మొత్తం 23,042 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త పెట్టుబడులకు అనుగుణంగా పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధిపై ఏపీఐఐసీ దృష్టి సారించింది. సుమారు 1.02 లక్షల ఎకరాల్లో మొత్తం 12 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి దశలో 8,673 ఎకరాల్లో ఆరు క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా నక్కపల్లిలో పెట్రో కెమికల్స్, ప్రత్యేక రసాయనాలు, అచ్యుతాపురంలో ఇంజనీరింగ్, కాకినాడలో బల్క్ డ్రగ్స్ పార్క్, కృష్ణపట్నం నోడ్‌లో ఆటోమొబైల్, సోలార్ పీవీ సెల్స్, దొనకొండ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ రంగాలను ఆకర్షించే విధంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
ఏపీలో ఫాక్స్‌కాన్ మరిన్ని పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఇండియా శ్రీ సిటీలోని యూనిట్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం శ్రీ సిటీ యూనిట్ ద్వారా సుమారుగా 15 వేల మంది మహిళలకు ఉపాధి కలి్పస్తున్నామని, త్వరలోనే ఈ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఫాక్స్‌కాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జోష్ ఫాల్గర్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన తరువాత రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. స్థానికులకు ఉపాధి కలి్పంచే విధంగా వారందరికీ వృత్తిపరమైన శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం నెలకు 35 లక్షలకు పైగా మొబైల్స్‌ను విక్రయిస్తున్నట్లు తెలిపారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌లో భాగస్వామ్యం కండి ఎల్రక్టానిక్స్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా రాష్ట్రాన్ని ఎల్రక్టానిక్ హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారముంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించడానికి మానవ వనరులను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమంలో ఫాక్స్‌కాన్ భాగస్వామ్యం కావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కలి్పంచడమే దీని ఉద్దేశమని వెల్లడించారు. -
రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్‌లో రూ.100 కోట్ల పెట్టుబడి
ముందుకొచ్చిన విన్యాస్ గ్రూప్ ♦ పీసీబీ, కేబుల్స్ తయారీ యూనిట్ల ఏర్పాటు ♦ కేజేఆర్ గ్రూప్ సీఎండీ కె.జె.రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న మైసూరుకు చెందిన విన్యాస్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఎల్సినా రాగమయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్‌లో రెండు యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి అవసరమైన పీసీబీ, కేబుల్స్‌ను ఇక్కడ తయారు చేస్తారు. పార్క్‌లో యాంకర్ యూనిట్‌గా అడుగుపెట్టిన విన్యాస్ గ్రూప్ ఈ యూనిట్ల స్థాపనకు వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్లు వెచ్చించనుంది. విన్యాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ పీసీబీల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోం ది. విన్యాస్, అమెరికాకు చెందిన డీసీఎక్స్ చోల్ల జేవీ అయిన డీసీఎక్స్ కేబుల్ అసెంబ్లీస్ కేబుల్స్ యూనిట్‌ను నెలకొల్పుతోంది. 2017 మార్చికల్లా ఉత్పత్తి ప్రారంభం కానుంది. నాలుగేళ్లలో రూ.3,000 కోట్ల విలువైన ఆర్డర్లను సాధించాలన్నది లక్ష్యం. రియల్టీ, ఇన్ఫ్రా రంగంలో ఉన్న కేజేఆర్ గ్రూప్ ఎల్సినా రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్‌ను ప్రమోట్ చేస్తోంది. డిఫెన్స్ రంగంలో హబ్‌గా.. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో దిగ్గజ సంస్థలైన ఇజ్రాయెల్ కంపెనీలు ఎల్టా సిస్టమ్స్, రాఫెల్, ఎల్బిట్ సిస్టమ్స్‌తో విన్యాస్ చేతులు కలిపింది. ఈ సంస్థలు పీసీబీ, కేబుల్స్ తయారీకి కావాల్సిన మెషినరీని విన్యాస్ గ్రూప్‌నకు సరఫరా చేస్తాయి. అలాగే ఇక్కడ తయారైన పీసీబీ, కేబుల్స్‌ను కొనుగోలు చేస్తాయి. రానున్న రోజుల్లో ఈ మూడు కంపెనీలతో కలసి విన్యాస్ జేవీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విన్యాస్ రాకతో ఆంధ్రప్రదేశ్‌లో తమ ఎలక్ట్రానిక్స్ పార్క్ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి హబ్ కానుందని కేజేఆర్ గ్రూప్ సీఎండీ కె.జె.రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పార్క్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు మరిన్ని కంపెనీలను ఆహ్వానించేందుకు ఇజ్రాయెల్‌కు ఆగస్టులో వెళ్తున్నట్టు చెప్పారు. వేలాది మందికి ఉపాధి..: విన్యాస్ యూనిట్లలో మూడేళ్లలో ప్రత్యక్షంగా 1,200 మందికి ఉపాధి లభిం చనుంది. అనుబంధ యూనిట్లూ రానున్నాయి. మానవ వనరుల కోసం ఈ కంపెనీతో కలసి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్టు కేజేఆర్ గ్రూప్ సీఈవో కె.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఐటీఐ, పాలి టెక్నిక్, ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతకు ఇక్కడ శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 6 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత్‌లో ప్రైవేటు రంగంలో అనుమతి పొందిన తొలి ఎలక్ట్రానిక్స్ పార్క్ తమదేనని పేర్కొన్నారు. -
యువ శాస్త్రవేత్తలకు దారిచూపిన ఏఎస్ రావు
ఆయన ఘనత వల్లే ఈసీఐఎల్‌కు పేరు కొనియాడిన సాంకేతిక సలహా మండలి చైర్మన్ చిదంబరం ఈసీఐఎల్ ఆవరణలో అట్టహాసంగా సాగిన రావు శతజయంతి వేడుకలు ఉప్పల్ : ఎలక్ట్రానిక్స్ రంగంలో నాయకుడిగా ముందుండి దేశాన్ని, యువ శాస్త్రవేత్తలను నడిపించిన డాక్టర్ ఏఎస్ రావు మానవతా వాది అని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారుడు, సాంకేతిక సలహా మండలి చైర్మన్, అణు ఇంధన శాఖ మాజీ చైర్మన్ డాక్టర్ ఆర్.చిదంబరం పేర్కొన్నారు. జగద్విఖ్యాత డాక్టర్ ఏఎస్ రావు శత జయంతి వేడుకల్లో భాగంగా ఈసీఐఎల్ కంపెనీ ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ అయ్యగారి సాంబశివరావు జీవిత విశేషాలతో రూపొందించిన ‘ఈసీఐఎల్-న్యూస్’ మాసపత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం చిదంబరం మాట్లాడుతూ డాక్టర్ రావు మానస పుత్రిక ఈసీఐఎల్ సంస్థ పురోభివృద్ధికి ప్రతి ఉద్యోగి ముందుండాలని సూచించారు. రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో ఈసీఐఎల్ తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందని చెప్పారు. ఈవీఎం అంటేనే ఈసీఐఎల్ అనేవిధంగా ప్రసిద్ధిగాంచిందని అభినందించారు. డాక్టర్ రావు అప్పట్లోనే ఆధార్ కార్డు తరహాలో ‘మల్టీపర్పస్ పర్సనల్ కార్డు’ రూపకల్పనకు చేసిన కృషి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరుగున పడిందని గుర్తు చేశారు. అణు ఇంధన కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పి.రామారావు మాట్లాడుతూ ‘అప్సర’ నుంచి మొదలుకొని ‘టెస్ట్’ రియాక్టర్ వరకు అణు రియాక్టర్ల తయారీలో నేటికీ ఈసీఐఎల్దే పైచేయి కావడం గర్వకారణమన్నారు. ఈసీఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పి.సుధాకర్ మాట్లాడుతూ 60వ దశకంలోనే అణు రియాక్టర్‌కు కంట్రోల్ సిస్టమ్ రూపొందించి ప్రపంచ దేశాలకు దీటుగా భారత్‌ను నిలిపిన డాక్టర్ రావు చూపిన బాటలో ఈసీఐఎల్ ముందుకు సాగుతుందన్నారు. మాజీ సీఎండీలు ఎస్ఆర్ విజయకర్, వీఎస్ రాన్, జీపీ శ్రీవాస్తవ, వైఎస్ మయ్యా, ఎన్ఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఎన్.సాయిబాబా, అటామిక్ మినరల్స్ డెరైక్టర్ పీఎస్ పరిహార్, అమెరికా నుంచి వచ్చిన ఏఎస్ రావు కుటుంబ సభ్యులు వెంకటాచలం, డాక్టర్ రాంచందర్ రావు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు జి.యాదగిరి రావు, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.