AP: ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 36,205 మందికి ఉద్యోగాలు | 36205 Jobs in Electronics Sector: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీ: ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 36,205 మందికి ఉద్యోగాలు

Published Tue, Mar 26 2024 5:19 AM | Last Updated on Tue, Mar 26 2024 7:19 AM

36205 Jobs in Electronics Sector: Andhra Pradesh - Sakshi

24 దిగ్గజ కంపెనీల ద్వారా రూ.10,705 కోట్ల పెట్టుబడులు

బ్లూస్టార్, డైకిన్, హావెల్స్‌ వంటి ఏసీ తయారీ యూనిట్లు ఏర్పాటు

దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఏసీల్లో ఒకటి మేకిన్‌ ఆంధ్రానే

విశాఖ జీఐఎస్‌లో రూ.15,711 కోట్ల విలువైన మరో 23 ఒప్పందాలు

వీటి ద్వారా మరో 55,140 మందికి లభించనున్న ఉపాధి

కొప్పర్తిలో ఈఎంసీ పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే మరిన్ని అవకాశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఓవైపు భారీ ఎత్తున పెట్టుబడులు, మరోవైపు యువతకు ఉద్యోగాల వెల్లువ కొనసాగింది. ముఖ్యంగా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌ రంగం రికార్డు స్థాయి పెట్టుబడులను ఆకర్షించింది. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి. అంతేకాకుండా మరో రూ.15,711 కోట్ల విలువైన కొత్త పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి.

ఈ ఐదేళ్ల కాలంలో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో బ్లూస్టార్, డైకిన్, పానాసోనిక్, డిక్సన్, హావెల్స్, సన్సీఆప్‌టెక్స్‌ వంటి అనేక దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రారంభించడంతోపాటు భారీ ఎత్తున విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2019 మే నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 24 కంపెనీల ద్వారా రూ.10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవం రూపంలోకి రావడంతో ఏకంగా 36,205 మందికి ఉపాధి లభించింది. 

మరో 55,140 మందికి ఉపాధి
గతేడాది మార్చిలో విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఎలక్ట్రానిక్స్‌ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 23 ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా మరో రూ.15,711 కోట్ల పెట్టుబడులతోపాటు 55,140 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌ కండీషనర్లు, సెల్‌ఫోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాలు, మొబైల్‌ ఫోన్ల తయారీ రంగంలో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. కోవిడ్‌ తర్వాత ఎలక్ట్రానిక్స్‌ రంగంలో చైనా దిగుమతులను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంది. ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అనేక కంపెనీలను స్వాగతించింది. అంతేకాకుండా వీటికి వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో కంపెనీలు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి.

శ్రీసిటీలో భారీగా తయారీ యూనిట్లు
కాగా దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఎయిర్‌ కండీషనర్లలో ఒకటి మనం రాష్ట్రంలోనే తయారవుతుండటం విశేషం. తిరుపతి జిల్లా శ్రీసిటీలో జపాన్‌ ఏసీ తయారీ సంస్థ డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్‌ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఇందులో ఒక్క డైకినే తొలి దశలో ఏటా 10 లక్షల యూనిట్లను తయారుచేస్తోంది. అంతేకాకుండా రెండో దశలో మరో 15 లక్షలు తయారుచేసేలా విస్తరణ చేపట్టనుంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులను ఈ జపాన్‌ సంస్థ పెట్టింది. అలాగే, బ్లూస్టార్‌ ఏటా 12 లక్షల యూనిట్లను తయారుచేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 

కొప్పర్తి ఈఎంసీతో మరో 28,250 మందికి ఉపాధి
ప్రస్తుతం ఏటా దేశవ్యాప్తంగా 75 లక్షల గృహ వినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షలకుపైనే ఉంటుందని అంచనా. ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవి కాకుండా రూ.749 కోట్లతో కొప్పర్తిలో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రూ.8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 28,250 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే డిక్సన్‌ వంటి కంపెనీలు కొప్పర్తిలో ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement