
విజన్ ఉన్న ఏ నాయకుడు కూడా విధ్వంసాన్ని ప్రేరేపించడు. అలా చేసేవారు పాలకులైతే పెట్టుబడులు రాకపోవడం అటుంచి ఉన్న పరిశ్రమలూ వేరే చోటుకు తరలిపోతాయి. దావోస్‌లో ఇటీవల జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ సదస్సుకు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నారా వారు చేసిన పెట్టుబడుల సాధన పర్యటన నీరు గారిపోయింది. ఇందుకు కారణం వారి ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ ప్రకారం సృష్టించిన విధ్వంసకాండే అనేది వేరే చెప్పవలసిన పనిలేదు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంతోమంది పారిశ్రామిక దిగ్గజాలను కలిసినా వారితో ఒక్క మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాడింగ్ (ఎంఓయూ)ను కూడా ఏపీ ప్రభుత్వం కుదుర్చుకోలేక పోయింది. ‘ఉద్యోగం కోసం... ఉపాధి కోసం నువ్వీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లు. నువ్వు అక్కడకు వెళ్లే లోపే నీ చరిత్ర అక్కడ టేబుల్ మీద ఉంటుంది’ అని ఓ ఇంగ్లీష్ సామెత ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో చిందించిన రక్తాన్ని దావోస్‌కి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, వారి తాలూకు ప్రతినిధులు ఎలా మర్చిపోగలరు? లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ధాటికి పెట్టుబడులు కూడా ముఖం చాటేశాయి.
సాధారణంగా పారిశ్రామిక వేత్తలు వ్యాపారానికి అనుకూల పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా శాంతిభద్రతలు బాగుంటేనే కొత్త పరిశ్రమలు వస్తాయి. విధ్వంసం, రక్తపాతాన్ని ప్రోత్సహించేవారు పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో నయాపైసా పెట్టుబడి పెట్టినా వ్యర్థమని పారి శ్రామికవేత్తలు అనుకుంటారు. ఇప్పుడు దావోస్‌లో ఏపీ ప్రభుత్వం సంప్రదించినవారు ఇందుకే పెట్టు బడులకు ఆసక్తి చూపించలేదని పరిశీలకుల అంచనా.
అధికారంలోకి వచ్చీ రాగానే రెడ్‌బుక్ చేతిలో పట్టుకుని చూపిస్తూ... తమ వ్యతిరేకులను అక్ర మంగా అరెస్టుచేసి జైళ్లలో కుక్కడం, దాడులు, హత్యలు చేయడంతో ప్రజలతో పాటు పెట్టుబడి దారులు కూడా భయపడిపోయారు. ‘సింగిల్‌విండో’ విధానంలో అన్ని అనుమతులు ఇస్తా మన్నా ఏపీలో పెట్టుబడులు పెట్టే ప్రసక్తే లేదని ముక్తకంఠంతో తీర్మానించుకున్నట్లున్నారు పారి శ్రామికవేత్తలు. అందుకే ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు.
నేను చేసేది చేసేదే. ఇది నా రాజ్యం. ఇది నా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్లు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి వ్యవహరిస్తుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? దావోస్ వేదికగా ఇది ఏపీకి జరిగిన అవమానం కాక మరేమిటి? తండ్రీ – కొడుకులు చేసిన తప్పిదాలే ఇప్పుడు ఏపీ ప్రజలకు శాపాలుగా పరిణమించాయి. ఈ అవమానంనుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇంకో ‘కల్తీ తిరుమల లడ్డు’ను తెరమీదకు తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
పెట్టుబడులు తీసు కొస్తామని దావోస్ వెళ్లి నయాపైసా పెట్టుబడి తేకుండా వచ్చిన మన ప్రభుత్వ నిర్వాకం వల్ల అయిన ఖర్చు దాదాపు 75 కోట్ల రూపాయల పైమాటే! మరి ఇంత డబ్బూ బూడిదలో పోసిన పన్నీరేనా? పాలకులకు ఎకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా? ఈ ప్రజా ధన నష్టానికి బాధ్యత వహిస్తూ ఏమి చేయగలరో సీఎం, ఐటీ మంత్రులే చెప్పాలి.
తాజాగా దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం రూ. 1.79 లక్షల కోట్లు, మహా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ముందు శాంతి భద్రతల మీద పట్టు సాధించి ఆ దిశగా పురోగమిస్తే ఏ రాష్ట్రమైనా ఇటువంటి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతే తప్ప... రెడ్ బుక్ రాజ్యాంగాలు అమలు చేసే నెత్తుటి గడ్డలపై ఉన్న పాలకులు ‘మేం సుద్దపూసలం. మా రాష్ట్రం వెన్నపూస’ అంటే అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఎంత మాత్రమూ విశ్వసించే పరిస్థితి లేదు. ఇది మన రాష్ట్ర ప్రస్తుత పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
– ఆర్కేడి నాయుడు ‘ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment