బాబు కక్ష ఖరీదు.. రూ.3 లక్షల కోట్లు! | AP lost huge investment opportunity with Industrialists Fear On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

బాబు కక్ష ఖరీదు.. రూ.3 లక్షల కోట్లు!

Published Thu, Jan 23 2025 1:38 AM | Last Updated on Thu, Jan 23 2025 1:38 AM

AP lost huge investment opportunity with Industrialists Fear On Chandrababu Govt

భారీగా పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ

రెడ్‌బుక్‌ రాజ్యాంగం, ప్రముఖ పారిశ్రామికవేత్తపై వేధింపులకు చెల్లించిన మూల్యం

వేలాదిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండి

ఏపీలో పెట్టుబడులకు జేఎస్‌డబ్లూ గ్రూపు విముఖత

మహారాష్ట్రలో జిందాల్‌ రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు

గడ్చిరోలి, నాగ్‌పూర్‌లో ఉక్కు, సోలార్, ఆటోమొబైల్, సిమెంట్‌ పరిశ్రమలు

చైనా సంస్థతో కలసి ఈవీలు, బ్యాటరీ తయారీ పరిశ్రమల ఏర్పాటు

తెలంగాణలో రూ.800 కోట్లతో జిందాల్‌ డ్రోన్‌ టెక్నాలజీ యూనిట్‌

దావోస్‌ వేదికగా బహిర్గతమైన కూటమి సర్కారు నిర్వాకాలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు బరితెగించి అమలు చేస్తున్న  రెడ్‌బుక్‌ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌ అంటేనే హడ­లెత్తిపోతున్నారు. పెట్టుబడులు కాదు కదా కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతు­న్నారు. ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొ­క్కటిగా బహిర్గతమవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్‌డబ్లూ గ్రూపు ఏపీ అంటేనే ముఖం చాటేయడం దీనికి తాజా తార్కాణం. 

వైఎస్సార్‌సీపీ  హయాంలో రాష్ట్రంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని.. మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా రూ.800 కోట్లతో తెలంగాణలో డ్రోన్‌ టెక్నాలజీ యూనిట్‌ నెలకొల్పాలని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ నిర్ణయించింది. జేఎస్‌డబ్లూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్‌అంటే హడలిపోయి మహారాష్ట్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. టీడీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఇలా ఉంది...

జిందాల్‌ను వేధించిన బాబు సర్కారు
– మాయలేడిని అడ్డం పెట్టుకుని కుట్రలు..
దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సజ్జన్‌ జిందాల్‌ను చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధించింది. వలపు వల (హనీట్రాప్‌)తో బడా బాబులను బురిడీ కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే ఓ మాయలేడీని అడ్డం పెట్టుకుని సజ్జన్‌ జిందాల్‌ లాంటి పారిశ్రామికవేత్తను వేధించడం యావత్‌ దేశాన్ని నివ్వెరపరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కుట్రకు తెర తీసింది. వలపు వల విసిరి బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడి ఆస్తులు కొల్లగొట్టడమే ట్రాక్‌ రికార్డుగా కలిగిన ముంబైకి చెందిన కాదంబరి జత్వానీ అనే మోడల్‌ను టీడీపీ పెద్దలు తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఆమె ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తులను విక్రయించేందుకు యత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ హయాంలో కుక్కల విద్యాసాగర్‌ అనే పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తమ దర్యాప్తులో దీనిపై పూర్తి ఆధారాలు లభించడంతో విజయవాడ పోలీసులు ముంబై  వెళ్లి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం అనుమతితో ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు రిమాండ్‌ విధించడంతో జైలుకు పంపించారు. అనంతరం ఆమెకు బెయిల్‌ మంజూరైంది. అంతా చట్టబద్ధంగా సాగిన ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్‌ గున్నీలపై కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్‌ చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసింది. 

కాదంబరి జత్వానిని గతంలో పోలీసులు అరెస్టు చేయడం వెనుక ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌ ఉన్నారంటూ చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి ప్రచారంలోకి తెచ్చింది. ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జత్వానీ గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు... విచారణకు హాజరు కాకుండా అడ్డుకునేందుకే వైఎస్సార్‌సీపీ హయాంలో ఏపీ పోలీసులు ముంబై వెళ్లి జత్వానీని అరెస్టు చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం సాగించింది. జిందాల్‌ రాష్ట్రానికి వస్తే కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్‌ చేస్తారనే రీతిలో కూటమి సర్కారు హడావుడి చేసింది.

ఏపీలో పెట్టుబడులకు ససేమిరా...
– అనుకూల పరిస్థితులు లేవని గ్రహించే..
చంద్రబాబు సర్కారు తన నిర్వాకాలతో పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌ పరపతికి తీవ్ర భంగం కలిగించింది. తాను ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటే... చంద్రబాబు ప్రభుత్వం తనను వేధించడం పట్ల ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తించారు. దాంతో రాష్ట్రంలో కొత్త పెట్టుబడి ఒప్పందాలను ఆయన వ్యతిరేకించినట్లు సమాచారం.

మహారాష్ట్రకు తరలిపోయిన రూ.3 లక్షల కోట్లు..
– ఈవీ, సోలార్‌ పరిశ్రమలతో వేలాది ఉద్యోగాలు
సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్లూ గ్రూపు మహారాష్ట్రంలో ఏకంగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈమేరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, గడ్చిరోలి, నాగ్‌పూర్‌ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇనుము–ఉక్కు, సౌర విద్యుత్తు, ఆటోమొబైల్, సిమెంట్‌ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించింది. చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ మోటార్స్‌తో సంయుక్తంగా ఎలక్ట్రానిక్‌ వాహనాలు (ఈవీ), హైపర్‌ఫార్మెన్స్‌ బ్యాటరీల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 

2027 డిసెంబరుకు ఈవీ వాహనాలను మారెŠక్ట్‌లోకి ప్రవేశపెడతామని తెలిపింది. జేఎస్‌డబ్లూ గ్రూపు ద్వారా రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులతో మహారాష్ట్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సజ్జన్‌ జిందాల్‌ ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ని అక్రమ కేసులతో వేధించకుంటే ఆ పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కే వచ్చి ఉండేవని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.

నాడు.. పెట్టుబడులకు రాచబాట..
– పారిశ్రామికవేత్తలకు వైఎస్‌ జగన్‌ భరోసా
వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉండేవి. వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే పరిష్కరిస్తామని.. పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. అందువల్లే సజ్జన్‌ జిందాల్‌ గ్రూపు నాడు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. కడపలో రూ.8,500 కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధపడింది. 

విజయనగరం జిల్లాలో భారీ ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు, వేధింపులతో పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్లూ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా మహారాష్ట్ర, తెలంగాణలో రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందం చేసుకోవడం దీనికి తాజా నిదర్శనం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement