Davos
-
ఫ్యూచర్ మనీ అదే.. ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిజిటల్ కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) క్రాస్-బోర్డర్ చెల్లింపులను ఖర్చుతో కూడుకున్నది కాకుండా మరింత సమర్థవంతం, వేగవంతం చేయగలదని ఆయన భావిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగించారు. "CBDC గొప్ప ప్రయోజనం అంతర్జాతీయ చెల్లింపులు. దీని వల్ల అంతర్జాతీయ చెల్లింపులు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, చౌకగా మారతాయి. ఇతర దేశాలు ఈ డిజిటల్ కరెన్సీని స్వీకరించినప్పుడు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు సమర్ధత, వేగం, ఖర్చు అంశాల్లో లాభపడతాయి. అంతిమంగా ఇది ఫ్యూచర్ మనీగా మారుతుందని నేను భావిస్తున్నాను" అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పైలట్ వెర్షన్ విజయవంతంపైనే దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అమలు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ‘దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇంతలోపే దీన్ని సాధించాలన్న లక్ష్యం అంటూ ఏమీ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అనవసరమైన తొందరపాటు లేదు. ఎందుకంటే అది కరెన్సీ అయిన తర్వాత, దాని భద్రత, సమగ్రత, సామర్థ్యాన్ని నిర్ధారించాలి’ అన్నారు. దేశంలో 2022లో నవంబర్-డిసెంబర్ టోకు, రిటైల్ కేటగిరీలలో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాతిపదికన ఆర్బీఐ ప్రారంభించింది. ప్రస్తుతం రిటైల్ విభాగంలో 40 లక్షల మంది, వ్యాపారుల్లో 4 లక్షల మంది ఈ డిజిటల్ కరెన్సీ వినియోగిస్తున్నారు. -
విమానంలో లీకేజీ.. ప్రయాణానికి తప్పని తిప్పలు
బోయింగ్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. అయితే వాటిలో తరచూ వస్తున్న సాంకేతికలోపాలతో ప్రయాణికులు, సంస్థ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బోయింగ్ విమానం గాల్లోనే ఉండగా డోర్ ఊడిపోయిన ఘటనలు, టేకాఫ్ అయిన కాసేపటికే కాక్‌పిట్ అద్దాలు పగలడం చూశాం. ఈ తిప్పలు కేవలం సామాన్యులకే కాదు ఏకంగా అగ్రరాజ్యంలో దౌత్యవేత్తకు తప్పలేదు. తాజాగా అమెరికా దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సదస్సు నుంచి తిరిగివెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ప్రయానిస్తున్న బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌లో లోపాన్ని గుర్తించారు. అందులో ఆక్సిజన్ లీకేజీ అవుతున్నట్లు సిబ్బంది గమనించారు. దాంతో వెంటనే ఆ సమాచారాన్ని ఆంటోనీకి చేరవేశారు. చాలా సమయం వరకు సిబ్బంది సమస్యను పరిష్కరించకపోవడంతో తన అమెరికా ప్రయాణం ఆలస్యమైనట్టు మీడియా కథనాలు తెలిపాయి. అయితే గతంలో ఈ విమానంలో ఇదే సమస్య తలెత్తినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్10 కరెన్సీలు ఇవే.. సెప్టెంబరులో జస్టిన్ ట్రూడోకు ఇలాంటి సంఘటన ఎదురైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానంలో మెకానికల్ లోపం కారణంగా జీ20 శిఖరాగ్ర సమావేశం తర్వాత భారతదేశంలోని న్యూదిల్లీలో చిక్కుకున్నారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు గతంలోనే తెలిపింది. -
రూ.37,870 కోట్ల పెట్టుబడితో 6 కంపెనీలు సిద్ధం!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,870 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌తో గౌతమ్ అదానీ సమావేశమైన అనంతరం ఏరోస్పేస్, డిఫెన్స్ సీఈవో ఆశిష్‌రాజ్ వంశీ అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులతోపాటు యువతకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు గౌతం అదానీ ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని అదానీ తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంగల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా రూ.2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో రూ.8,000 కోట్ల పెట్టుబడితో ఆర్ అండ్ డీతోపాటు గిగా సేల్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి సమావేశమయ్యారు. తెలంగాణలో రూ.5,200 కోట్లతో డాటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌వర్క్స్ ముందుకొచ్చింది. డాటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటేన్ అనుబంధ సంస్థ వెబ్‌వర్స్. ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్‌వర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీ సీఎంతో సమావేశమై తెలంగాణలో డాటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్ రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రూ.1,000 కోట్లతో కెమికల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖమ్మంలో తొలిదశలో రూ.270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సమీకృత ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే.. రాష్ట్ర పెట్టుబడి ఒప్పందాలు (రూ.కోట్లలో) అదానీ గ్రూప్ : రూ.12,400 కోట్లు ఆరాజెన్ : రూ.2,000 కోట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ : రూ.9,000 కోట్లు గోడి ఇండియా : రూ.8,000 కోట్లు వెబ్ వర్స్ : రూ.5,200 కోట్లు గోద్రెజ్ : రూ.1,270 కోట్లు -
విషయాలను మరచి సీఎం జగన్‌పై విషం చిమ్ముతున్న ఈనాడు
ఆంధ్రప్రదేశ్ నుంచి దావోస్ సభలకు సీఎం జగన్ వెళ్ళలేదంటూ ఈనాడు విషం చిమ్ముతోంది. నిజానికి మొత్తం 29 రాష్ట్రాల్లో దావోస్‌కు వెళ్లింది కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులే. గతంలో ఐదు సార్లు దావోస్ వెళ్లానని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఒక్క విదేశీ పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. చంద్రబాబు.. నేనే తెచ్చినట్లు గొప్పగా చెప్పుకునే కియా పరిశ్రమ కూడా ప్రధాని మోదీ కొరియా పర్యటనలో ఉన్నప్పుడు చేసిన సూచన మేరకు ఆ కంపెనీ ఏపీకి వచ్చిందనేది వాస్తవం. అయితే ఈ కంపెనీ తీసుకు వచ్చింది నేనే అంటూ బాబు ఇప్పటికీ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. సీఎం జగన్ దావోస్ ఇప్పుడు దావోస్ సభలకు వెళ్లకపోయినా.. ఇప్పటి వరకు తన పాలనలో రాష్ట్రంలో రూ. 30000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 3.94 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 26.29 లక్షలమంది ఉపాధి పొందుతున్నారనే విషయం తెలిసిందే. చంద్రబాబు పాలనలో ఉన్నన్ని రోజులు (దిగిపోయేనాటికి) రాష్ట్రానికి వచ్చిన ఎంఎస్ఎంఈల సంఖ్య 1.93 లక్షలు మాత్రమే. దీంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈలు రెట్టింపు అని స్పష్టమవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే 2023 మార్చిలో జరిగిన విశాఖ సమ్మిట్‌లో మాత్రమే పారిశ్రామిక వేత్తలు రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా.. ఫోర్టుల అభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ప్రస్తుతం ఏపీ పారిశ్రామిక వృద్ధిలో దూసుకెళ్తోందన్న విషయం పారదర్శకంగా కనిపిస్తున్నాయనే.. విషయాలన్నీ తెలిసినా విష ప్రచారాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. -
దావోస్‌లో సీఎం బృందం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పలు భేటీల్లో పాల్గొంటోంది. ఐటీ, జీవ, వైద్య రంగాల్లో తెలంగాణ శక్తిని ప్రపంచానికి చాటడంతో పాటు, భారీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కీలక చర్చలను ప్రారంభించింది. తొలిరోజు డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమైన సీఎం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఇథియోపియా ఉప ప్రధాని డెమెక్ హసెంటోతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్‌పై చర్చించారు. సీఎం, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జాని ఘోష్తోనూ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనకు సాయం అందించడంపై సంప్రదింపులు జరిపారు. తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు.. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ‘వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్’నినాదంతో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. బతుకమ్మ, బోనాల పండుగలు, చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నం చారి్మనార్‌తో పాటు చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, టీ హబ్‌తో పాటు విభిన్న రంగాల విజయాలు చాటే లా పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ అనుకూలతలను వివరించేలా నినాదాలు ఏర్పాటు చేశారు. జ్యూరిచ్‌లో ప్రవాస భారతీయుల స్వాగతం మూడు రోజుల పాటు జరిగే డబ్ల్యూఈఎఫ్ 54వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం రేవంత్ బృందానికి మార్గం మధ్యలోని జ్యూరిచ్‌లో ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. సమ్మిళిత, సంతులిత అభివద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి తమ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావటంపై హర్షం వ్యక్తం చేశారు. -
Davos: బ్యాంకులతో ఉక్రెయిన్ అధ్యక్షుడి కీలక చర్చలు
జ్యురిచ్: రష్యాతో యుద్ధంలో చితికిపోయిన ఉక్రెయిన్ దేశాన్ని పునర్నిర్మించేందుకు ఆ దేశ అధ్యకక్షుడు జెలెన్స్కీ నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ఆయన స్విట్జర్లాండ్ వెళ్లారు. సదస్సులో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు, అగ్రశ్రేణి ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల యాజమాన్యాలను జెలెన్స్కీ కలుస్తున్నారు. తమ దేశాన్ని పునర్నిర్మించేందుకు అప్పులివ్వడంతో పాటు పెట్టుబడులు పెట్టాల్సిందిగా జెలెన్స్కీ వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేస్ సీఈవో జేమీ డైమన్తో జెలెన్స్కీ సమావేశమయ్యారు. డైమన్తోనే కాక ప్రముఖ పీఈ సంస్థలు బ్లాక్‌రాక్, బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్, కార్లైల్ గ్రూపు, బ్లాక్‌స్టోన్ సంస్థల యాజమాన్యాలతోనూ జెలెన్స్కీ చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ ‘2023లో ఉక్రెయిన్ ఎకానమీ 5 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది మరో 4.6 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ఈ సమయంలో మాకు ప్రభుత్వ పెట్టుబడితో పాటు ప్రైవేటు పెట్టుబడి కూడా ఎంతో ముఖ్యం’అని జెలెన్ స్కీ తెలిపారు. కాగా, తాజాగా ఐక్యరాజ్యసమితి ఉక్రెయిన్‌కు తక్షణమే 4.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కావాలని తన భాగస్వామ్య దేశాలను కోరడం గమనార్హం. ఇదీచదవండి.. చైనాను వణికిస్తున్న మంచు తుఫాన్లు -
WEF: దావోస్ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీ, సాక్షి: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్(స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. -
భారీ పెట్టుబడులే లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం దావోస్ పర్యటనకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. ఇందులో నోవార్టీస్, మెడ్ ట్రానిక్స్, ఆ్రస్టాజనిక్, గూగుల్, ఉబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు ఉన్నారు. భారత్‌కు చెందిన టాటా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులు, సీఐఐ, నాస్కాం వంటి చాంబర్స్ ప్రతినిధులతోనూ రాష్ట్ర బృందం సమావేశం కానుంది. దావోస్ పర్యటనలో భాగంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహారశుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సీఎం బృందం సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఏఐపై శ్రీధర్‌బాబు ప్రసంగం: కృత్రిమ మేధ (ఏఐ) పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో ‘‘డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ’’అనే అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడనున్నారు. టెక్ కంపెనీలు, వర్తక సంస్థలు, ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా రాష్ట్ర బృందం కలవనున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్తో సమావేశం కానున్నట్టు తెలిపారు. తెలంగాణతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు బలమైన వ్యవస్థీకృత సంబంధాలు ఉన్నాయని.. హెల్త్ కేర్– లైఫ్ సైన్సెస్ రంగంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలోని ‘సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండ్రస్టియల్ రెవెల్యూషన్ (సీ4ఐఆర్)’సదస్సు హైదరాబాద్‌లో జరగబోతోందని గుర్తు చేశారు. దావోస్ పర్యటనలో తెలంగాణ బలాబలాలను, ప్రాధాన్యతలను చాటనున్నట్టు వివరించారు. ఫోరం చర్చల్లో మాట్లాడనున్న రేవంత్ తొలిసారి దావోస్ పర్యటనలోనే సీఎం రేవంత్‌రెడ్డికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో మాట్లాడే అవకాశం దక్కింది. అక్కడ జరిగే చర్చాగోష్టిలో.. పురోగమిస్తున్న వైద్యరంగంపై రేవంత్ తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ‘‘ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్’’అంశంపై జరిగే అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొని ‘అగ్రి–ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం–రైతుల జీవనోపాధి పరిరక్షణలో భాగంగా వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యల’పై సీఎం ప్రసంగించనున్నారు. -
TS: ఎమ్మెల్సీలు.. నామినేటెడ్ జాబితా..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈ నెల 18 నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో అధిష్టానం నుంచి ఆమోదం పొందేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 14న దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోపే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి, హైకమాండ్ ఆమోదముద్ర వేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల పేర్లతో పాటునామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కొందరి పేర్లతో కూడిన జాబితాను సీఎం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఈ విషయమై శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియాగాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అవుతారని తెలిసింది. పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుస్తారని సమాచారం. ఆ ఇద్దరు ఎవరో..? రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీలో అంతర్గతంగా చాలామంది పోటీ పడుతుండగా, సీఎం ఢిల్లీ వెళ్లడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్ అభిప్రాయాన్ని తీసుకుని అధిష్టానానికి నివేదించారు. రెండురోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి అభిప్రాయం కూడా పార్టీ పెద్దలు తీసుకున్నారు. కాగా ఈ స్థానాల కోసం ఎస్సీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గానికి చెందిన నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. అద్దంకి దయాకర్, మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్‌తో పాటు చిన్నారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం? గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా స్థానం భర్తీపై కూడా హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుండగా, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టులకు పోటీ పదుల సంఖ్యలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులకు నామినేట్ అయ్యేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. అయితే వీటిలో ప్రధానమైన కార్పొరేషన్ల విషయంలో, ఇటీవలి ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నాయకులు, పార్టీ కోసం కష్టపడిన పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. రాహుల్‌తో కలిసి ఇంఫాల్‌కు సీఎం మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ప్రారంభం కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 14న ఢిల్లీ నుంచి రాహుల్‌తో కలిసి ఆయన ఇంఫాల్ వెళతారు. యాత్ర ప్రారంభం తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుని అదేరోజు సాయంత్రం దవోస్కు బయలుదేరి వెళ్తారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్తారు. -
‘దావోస్’ పెట్టుబడులు రూ. 21 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం రూ. 21 వేల కోట్ల మేర పెట్టుబడులను సాధించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తనతోపాటు అధికారుల బృందం 4 రోజులపాటు అక్కడి సమావేశాల్లో పాల్గొని తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించినట్లు ఆయన ట్విట్టర్లో వివరించారు. అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ కంపెనీలకు చెందిన చైర్మన్లు, సీఈఓలు తదితరులతో 52 సమావేశాలు, 6 రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు, విధానాల రూపకర్తలు సందర్శించారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం, మౌలిక వసతులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వ విధానాలపై రూపొందించిన ప్రత్యేక వీడియోలను ఈ పెవిలియన్‌లో ప్రదర్శించారు. యువతకు భారీగా ఉద్యోగాల కోసం.. వరుసగా ఐదోసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరైన కేటీఆర్... దావోస్‌లో అడుగు పెట్టింది మొదలు వరుసగా వివిధ దిగ్గజ కంపెనీల అధినేతలతో ముఖాముఖి చర్చలు జరిపారు. దావోస్ పర్యటన మార్గమధ్యలో స్విట్జర్లాండ్‌లోని అతిపెద్ద నగరమైన జూరిచ్‌లో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణకు పెట్టుబడులతో రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనే నిరంతరం తమను నడిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. దావోస్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ బృందం శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. దావోస్‌లో రాష్ట్రం సాధించిన పెట్టుబడులు ►హైదరాబాద్‌లో మరో 3 డేటా సెంటర్ల ఏర్పాటు కోసం మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన. ►హైదరాబాద్‌లో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు భారతీ ఎయిర్టెల్ గ్రూప్ రూ. 2 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్. ►రూ. వెయ్యి కోట్లతో హైదరాబాద్ కేంద్రంగా భారతీయ మార్కెట్లోకి ఫ్రాన్స్ ఔషధ పరిశోధన, తయారీ సంస్థ యూరోఫిన్స్ విస్తరణ ూలండన్ తరువాత హైదరాబాద్‌లో అపోలో టైర్స్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్. ►రూ.210 కోట్ల పెట్టుబడితో అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ►తెలంగాణలో పెప్సీకో కార్యకలాపాలు రెట్టింపు ►హైదరాబాద్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన కేంద్రం ►హైదరాబాద్‌లో రూ. 150 కోట్లతో రీహాబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్ సేవలను అందించే వెబ్‌పీటీ ప్రపంచ సామర్థ్య కేంద్రం. -
పుతిన్ బతికే ఉన్నాడా! తెలియడం లేదు!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జెలెన్స్కీ గురువారం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్)లోని వీడియో కాల్లో ప్రసంగిస్తూ..నాకు పుతిన్ బతికే ఉన్నారో లేదో తెలియడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో శాంతి చర్చలు ఎప్పుడూ ప్రారంభమవుతాయన్న అంశంపై ప్రశ్నలు రావడంతో జెలెన్స్కీ ఈ విధంగా స్పందించారు. అయినా పుతిన్ తాను ఉనికిలో ఉండేందుకే ఇష్టపడరంటూ విమర్శించారు. ఆ సమావేశంలోని బ్రేక్‌ఫాస్ట్ ఈవెంట్లో జెలెన్స్కీ మాట్లాడుతూ..ఈ రోజు ఎవరితో దేని గురించి మాట్లాడాలో అస్సలు అర్థం కావడం లేదు. ఆయన గ్రీన్ స్క్రీన్(శాంతికి)కి వ్యతిరేకంగా కనిపించే పుతిన్ సరైన వారని అనిపించడం లేదు. అసలు ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడో లేదా అక్కడ ఇంకోకరెవరైనా ఆయన స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదంటూ పుతిన్‌పై జోక్‌లు పేల్చారు. మీరంతా యూరోపియన్ నాయకులకు శాంతి చర్చలు గురించి ఎలా వాగ్దానం చేస్తారో నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన శాంతి అంటూనే తర్వాత రోజే పూర్తి స్థాయిలో దళాలతో దాడులు నిర్వహిస్తాడు. అందువల్ల తనకు శాంతి చర్చలు అంటే ఎవరితోనో తనకు అర్థం కావడం లేదంటూ జెలెన్స్కీ తనదైన శైలిలో రష్యాకి గట్టి కౌంటరిచ్చారు. జెలెన్స్కీ ప్రసంగం అయిన కొద్ది గంటల్లోనే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "దీన్ని బట్టి రష్యా, పుతిన్, ఉక్రెయిన్, జెలెన్స్కీ ఒక పెద్ద సమస్య అని స్పష్టంగా తెలుస్తోందని గట్టి కౌంటరిచ్చారు. అదీగాక జెలెన్స్కీ మానసికంగా రష్యా లేదా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఉనికిలో ఉండకుండా ఉండేందుకు ఇష్టపడుతున్నారని ప్రత్యక్షంగానే అవగతమవుతోంది. అంతేగాదు రష్యా ఉనికిలోనే ఉంటుంది, తమ దేశ అధ్యక్షుడు పుతిన్ కూడా ఉనికిలోనే ఉంటారు. అదే ఉక్రెయిన్ వంటి దేశానికి మంచిది" అని పెస్కోవ్ ధీటుగా సమాధానమిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్లింట తెగ వైరల్ అవుతోంది. కాగా పుతిన్ ఇటీవల కాస్త పబ్లిక్ ఇవెంట్లకి దూరంగా ఉండటంతో జెలెన్ స్కీ పుతిన్‌ని అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదీగాక పుతిన్ కూడా డిసెంబర్లో జరగాల్సిన వార్షిక విలేకరులు సమావేశాన్ని సైతం రద్దు చేసుకున్నట్లు సమాచారం. ⚡️Zelensky refuses to negotiate with Putin because he is not sure that the Russian president is alive. Zelensky said this at the Ukrainian Breakfast in Davos this morning🤣 pic.twitter.com/KphpbM1eND — nicolasorin (@alocin96983806) January 20, 2023 (చదవండి: నో డౌట్! రష్యా గెలుపు పక్కా!: పుతిన్) -
దావోస్ లేఖపై తప్పుడు ప్రచారం... ఏపీ ప్రభుత్వం హెచ్చరిక
సాక్షి, అమరావతి: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనావిుక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానిస్తూ రాసిన లేఖపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎంను ఆహ్వానిస్తూ నవంబర్ 25న వరల్డ్ ఎకనావిుక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండే రాసిన లేఖ నకిలీదంటూ పచ్చ మీడియా తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తొలుత దావోస్‌కు సీఎంకు ఆహ్వానం అందలేదంటూ చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలడంతో, ఆ లేఖ నకిలీదని మరో తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ రాసిన లేఖను యథాతథంగా విడుదల చేశామని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గురువారం ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. Due to the brutal nature of the negative campaign on the authenticity of the Invitation letter from @wef, we are reiterating, that any false claim will attract legal action. The Invitation letter is authentic and was shared as received.@GummallaSrijana@AP_EDB@ApiicOfficial https://t.co/pyeN1lMYax — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) January 19, 2023 -
రాష్ట్రంలో డబ్ల్యూహెచ్‌వో టీకా కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల వైద్య రంగంలో ఉన్న లోపాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయన్నారు, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తమ దగ్గర కావాల్సినన్ని వెంటిలేటర్లు లేవని న్యూయార్క్ గవర్నర్ అన్నారని, ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తే లైఫ్ సైన్సెస్‌కు పెద్దపీట వేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. ఈ మేరకు చేసిన కృషి వల్ల ప్రపంచంలోకెల్లా మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలోనే 40 శాతం ఫార్మసీ ఉత్పత్తులు తయారవుతున్నాయని చెప్పారు. కరోనా తరహాలో మరే ఇతర మహమ్మారులు వచ్చినా ఎదుర్కొనే రీతిలో టీకాలు అవసరమని గుర్తించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను సంప్రదించామని, అందుకు ఆ సంస్థ కూడా ఆసక్తి ప్రదర్శించిందని... త్వరలోనే తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హబ్‌ను డబ్లు్యహెచ్‌వో ఏర్పాటు చేయబోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే.. దేశంలో అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే ఉన్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కోవిడ్ ఉన్నా.. నోట్ల రద్దు చేసినా.. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకువెళ్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 15 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ కేంద్రం తమకు సహకరించి ఉంటే తెలంగాణ మరింత వేగంగా వృద్ధి సాధించేదని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాలన్నీ పనిచేసుంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల మార్కును దాటేదన్నారు. మోదీ సర్కార్ అప్పు రూ.100 లక్షల కోట్లు.. మోదీ ప్రధాని కావడానికి ముందు దేశ అప్పు రూ. 56 లక్షల కోట్లుగా ఉండగా మోదీ పాలనలో దేశం కొత్తగా రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులపాలైనట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ. 3.68 లక్షల కోట్లు అందించినా తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ. 1.68 లక్షల కోట్లేనని కేటీఆర్ తెలిపారు. -
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి... మరో రూ. 16వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. గత సంవత్సరం ప్రారంభంలో రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో ఒక్కోటీ సగటున 100 మెగావాట్ల ఐటీలోడ్ (సర్వర్లు, నెట్వర్క్ పరికరాలు వినియోగించిన లేదా వాటి కోసం కేటాయించే విద్యుత్ మొత్తం)తో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ తాజాగా దావోస్ వేదికగా మరో 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన 3 డేటా సెంటర్ల ఏర్పాటుకు మరో రూ. 16 వేల కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మొత్తంగా 6 డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే 10–15 ఏళ్లలో ఈ డేటా సెంటర్లు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయని పేర్కొంది. క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకే ఈ భారీ పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ వివరించింది. మైక్రోసాఫ్ట్‌తో బంధం బలోపేతం: కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్ అడాప్షన్ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో కలసి పనిచేస్తున్నట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 డేటా సెంటర్లు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం సంతోషకరమన్నారు. తెలంగాణ కేంద్రంగా మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఆసియా హెడ్ అహ్మద్ మజారీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్లో హైదరాబాదే కీలకమని, భవిష్యత్తులోనూ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. భారత్ కేంద్రంగా తమ సంస్థ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు కీలకంగా మారతాయన్నారు. -
ఎయిర్టెల్ రూ.2,000 కోట్ల పెట్టుబడి.. హైదరాబాద్‌లో హైపర్ స్కేల్ డేటా సెంటర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో టెలికం రంగంలోని అగ్రగామి సంస్థ భారతీ ఎయిర్టెల్ హైదరాబాద్‌లో రూ. 2వేల కోట్ల భారీ పెట్టుబడితో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను తన అనుబంధ సంస్థ అయిన ‘నెక్స్ ట్రా’ ద్వారా భారతీ ఎయిర్టెల్ నెలకొల్పనుంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 2వేల కోట్లను పెట్టుబడిగా పెడుతామని ఎయిర్టెల్ ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆహారం, పర్యావరణం, ఔషధాలు, కాస్మోటిక్స్ పరీక్షల సంస్థ యూరోఫిన్స్.. జీనోమ్ వ్యాలీలో అధునాతన ప్రయోగశాల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. –దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవీలియన్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, వైస్ చైర్మన్, ఎండీ రాజన్ భారతీ మిట్టల్, యూరోఫిన్స్ సీఈవో డాక్టర్ గిల్లెస్ మారి్టన్లు విడివిడిగా సమావేశమయ్యారు. సమావేశానంతరం 60 మెగావాట్ల సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. డేటా భద్రతలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ డేటాసెంటర్ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె.రామారావు మాట్లాడుతూ ఎయిర్టెల్–నెక్స్ ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కలి్పంచడంలో ఎయిర్ టెల్– నెక్సాట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని తెలిపారు. –భారతీ ఎయిర్టెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయే హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా పేర్కొన్నారు. 2022 మే లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో ప్రారంభమైన డేటా సెంటర్ ఏర్పాటు చర్చలు నెలల వ్యవధిలోనే కార్యరూపం దాల్చడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి కారణమన్నారు. జీనోమ్ వ్యాలీలో..యూరోఫిన్స్ ప్రయోగశాల... హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రయోగశాల (టెస్టింగ్ ల్యాబ్) ఏర్పాటు చేయనున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన యూరోఫిన్స్ ప్రకటించింది. ఆహారం, పర్యావరణం, ఫార్మా, కాస్మెటిక్ ఉత్పత్తుల పరీక్షలతో పాటు బయో అనలిటికల్ టెస్టింగ్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న యూరోఫిన్స్ హైదరాబాద్‌లో అధునాతన ప్రయోగశాలను నెలకొల్పాలని నిర్ణయించింది. తద్వారా భారతీయ ఔషధ మార్కెట్లోకి విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది. 90,000 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ అత్యాధునిక ప్రయోగశాలలో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ ఆర్ అండ్ డీ, బయో అనలిటికల్ సరీ్వసెస్, ఇన్–వివో ఫార్మకాలజీ, సేఫ్టీ టాక్సికాలజీ రంగాలకు చెందిన దేశ, విదేశ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో పాటు చిన్న బయోటెక్ కంపెనీలకు అవసరమైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. తన అనుబంధ సంస్థ ‘యూరోఫిన్స్ అడ్వినస్’ ద్వారా హైదరాబాద్‌లో ఈ ప్రయోగశాలను యూరోఫిన్స్ ఏర్పాటు చేయనుంది. ఫార్ములేషన్ డెవలప్మెంట్తో పాటు ఇన్–విట్రో, ఇన్–వివో బయాలజీ విభాగాల్లో తన సేవలను విస్తరించేందుకు 2023 వ సంవత్సరం ప్రారంభం నుంచే యూరోఫిన్స్ అడ్వినస్‌కు ఈ ల్యాబ్‌తో అవకాశం కలుగుతుంది. ఔషధాల తయారీలో భారత్ ప్రాధన్యతను గుర్తించే...: గిల్లెస్ మార్టిన్ ఈ సందర్భంగా యూరోఫిన్స్ సీఈఓ డాక్టర్ గిల్లెస్ మారి్టన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడంతో పాటు లే»ొరేటరీ నెట్‌వర్క్‌ను మరింత సుస్థిరం చేసుకునే దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఔషధాల పరిశోధన, తయారీలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ క్యాంపస్ ద్వారా ఔషధాల అభివృద్ధి, ఆవిష్కరణల్లో కీలకం కానున్నట్లు చెప్పారు. కాగా హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోకి యూరోఫిన్స్ ప్రవేశించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమ విస్తరణ–వృద్ధి ప్రణాళికల కోసం హైదరాబాద్ ను ప్రధాన కేంద్రంగా యూరోఫిన్స్ పరిగణిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ పాల్గొన్నారు. -
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ జాబితాలో మంత్రి కేటీఆర్‌కు చోటు!
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. స్విర్జర్లాండ్లోని దావోస్ వేదికగా జనవరి 16 నుంచి జనవరి 20 వరకు వరల్డ్ ఎకనమిక్స్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో మంత్రి కేటీఆర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో కేటీఆర్ 12వ స్థానాన్ని దక్కించుకోగా.. రాఘవ్ చద్దా 23వ స్థానంలో నిలిచారు. ఇక కేటీఆర్ హ్యాండిల్ చేసే ట్విటర్ అకౌంట్ @కేటీఆర్టీఆర్ఎస్కు 12వ ర్యాంక్, @మినిస్టర్కేటీఆర్ అకౌంట్‌కు 22 ర్యాంక్ ఇచ్చింది. @truckdriverpleb @CyrilRamaphosa @ValaAfshar @rwang0 @AlinejadMasih @montymetzger @MinisterKTR @raghav_chadha @EU_Commission @vonderleyen @GBBCouncil @Oxfam @Gabucher @LassoGuillermo @ODI_Global https://t.co/KiTyPCbJIz#WEF23 #WEF #Davos #socialmedia #smm pic.twitter.com/AMjO0RKion — Jim Harris #WEF23 (@JimHarris) January 17, 2023 -
తెలంగాణలో మల్టీగిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటుకానుంది. బ్యాటరీల తయారీలో అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కేంద్రాన్ని నెలకొల్పుతుంది. లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు ఈ తయారీ కేంద్రంలో ఉత్పత్తి అవుతాయి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి కేటీఆర్ సమక్షంలో అలాక్స్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో తొలుత 210 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు గిగా వాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని అలాక్స్ తెలిపింది. ఈ సామర్థ్యాన్ని భవిష్యత్తులో పది గిగావాట్లకు పెంచుతామన్నారు. 2030 సంవత్సరం నాటికి మొత్తంగా 750 కోట్ల రూపాయలను ఈ కేంద్రం పై పెట్టుబడిగా పెట్టనున్నారు. ప్రతిపాదిత తయారీ కేంద్రంతో సుమారు 600 మంది అత్యుత్తమ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని అలాక్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు రాష్ట్రంలో తయారీ ఈకో సిస్టం ను పెంచేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ -అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణ కీలకంగా మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2020 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వెహికల్, ఈ ఎస్ ఎస్ పాలసీని తీసుకొచ్చిందన్న కేటీఆర్, ఇలాంటి ప్రత్యేక పాలసీని దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ప్రభుత్వం తమదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణమేనని అలాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య సుంకవల్లి స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహన రంగంతో పాటు ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో కీలకంగా మారేందుకు తమ సంస్థ ప్రయత్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ,పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, ఈవీ సెక్టార్ డైరెక్టర్ ఆటోమోటివ్ గోపాలకృష్ణన్ విసి పాల్గొన్నారు. -
Oxfam: 1 శాతం మంది గుప్పిట్లో... 40% దేశ సంపద!
దావోస్: ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది చేతిలో ఉన్న సంపద అంతా కలిపితే ఎంతో తెలుసా? మిగతా వారందరి దగ్గరున్న దానికంటే ఏకంగా రెట్టింపు! ఈ విషయంలో మన దేశమూ ఏమీ వెనకబడలేదు. దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కేవలం 1 శాతం సంపన్నుల చేతుల్లోనే పోగుపడిందట!! మరోవైపు, ఏకంగా సగం మంది జనాభా దగ్గరున్నదంతా కలిపినా మొత్తం సంపదలో 3 వంతు కూడా లేదు! ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్ అనే హక్కుల సంఘం వార్షిక అసమానతల నివేదికలో పేర్కొన్న చేదు నిజాలివి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఈ నివేదికను ఆక్స్‌ఫాం విడుదల చేసింది. 2020 మార్చిలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి 2022 నవంబర్ దాకా భారత్‌లో బిలియనీర్ల సంపద ఏకంగా 121 శాతంపెరిగిందని అందులో పేర్కొంది. అంటే రోజుకు ఏకంగా రూ.3,608 కోట్ల పెరుగుదల! భారత్‌లో ఉన్న వ్యవస్థ సంపన్నులను మరింతగా కుబేరులను చేసేది కావడమే ఇందుకు కారణమని ఓక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా దేశంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, అసంఘటిత కార్మికుల వంటి అణగారిన వర్గాల వారి వెతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయన్నారు. భారత్‌లో పేదలు హెచ్చు పన్నులు, సంపన్నులు తక్కువ పన్నులు చెల్లిస్తుండటం మరో చేదు నిజమని నివేదిక తేల్చింది. ‘‘2021–22లో వసూలైన మొత్తం రూ.14.83 లక్షల కోట్ల జీఎస్టీలో ఏకంగా 62 శాతం ఆదాయ సూచీలో దిగువన ఉన్న 50 శాతం మంది సామాన్య పౌరుల నుంచే వచ్చింది! టాప్ 10లో ఉన్న వారినుంచి వచ్చింది కేవలం 3 శాతమే’’ అని పేర్కొంది. ‘‘దీన్నిప్పటికైనా మార్చాలి. సంపద పన్ను, వారసత్వ పన్ను తదితరాల ద్వారా సంపన్నులు కూడా తమ ఆదాయానికి తగ్గట్టుగా పన్ను చెల్లించేలా కేంద్ర ఆర్థిక మంత్రి చూడాలి’’ అని బెహర్ సూచించారు. ఈ చర్యలు అసమానతలను తగ్గించగలవని ఎన్నోసార్లు రుజువైందన్నారు. ‘‘అపర కుబేరులపై మరింత పన్నులు వేయడం ద్వారానే అసమానతలను తగ్గించి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోగలం’’ అని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియేలా బుచ్ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్‌లో నెలకొన్న అసమానతలు, వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు సేకరించిన పరిమాణాత్మక, గుణాత్మక సమాచారాలను కలగలిపి ఈ నివేదికను రూపొందించాం. సంపద అనమానత, బిలియనీర్ల సంపద సంబంధిత గణాంకాలను ఫోర్బ్స్, క్రెడిట్సుసీ వంటి సంస్థల నుంచి సేకరించాం. నివేదికలో పేర్కొన్న వాదనలన్నింటికీ కేంద్ర బడ్జెట్, పార్లమెంటు ప్రశ్నోత్తరాలు తదితరాలు ఆధారం’’ అని ఆక్స్‌ఫాం తెలిపింది. కేంద్రానికి సూచనలు... ► అసమానతలను తగ్గించేందుకు ఏకమొత్త సంఘీభావ సంపద పన్ను వంటివి వసూలు చేయాలి. అత్యంత సంపన్నులైన 1 శాతం మందిపై పన్నులను పెంచాలి. పెట్టుబడి లా భాల వంటివాటిపై పన్ను పెంచాలి. ► వారసత్వ, ఆస్తి, భూమి పన్నులను పెంచాలి. నికర సంపద పన్ను వంటివాటిని ప్రవేశపెట్టాలి. ► ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను 2025 కల్లా జీడీపీలో 2.5 శాతానికి పెంచాలి. ► ప్రజారోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ► విద్యా రంగానికి బక్జెట్ కేటాయింపులను ప్రపంచ సగటుకు తగ్గట్టుగా జీడీపీలో 6 శాతానికి పెంచాలి. ► సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీస మౌలిక వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఈ కనీస వేతనాలు గౌరవంగా బతికేందుకు చాలినంతగా ఉండేలా చూడాలి. నివేదిక విశేషాలు... ► భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 2020లో 102 ఉండగా 2022 నాటికి 166కు పెరిగింది. ► దేశంలో టాప్–100 సంపన్నుల మొత్తం సంపద ఏకంగా 660 బిలియన్ డాలర్లకు, అంటే రూ.54.12 లక్షల కోట్లకు చేరింది. ఇది మన దేశ వార్షిక బడ్జెట్‌కు ఒకటిన్నర రెట్లు! ► భారత్‌లోని టాప్ 10 ధనవంతుల సంపదలో 5 శాతం చొప్పున, లేదా టాప్ 100 ధనవంతుల సంపదలో 2.5 శాతం చొప్పున పన్నుగా వసూలు చేస్తే ఏకంగా రూ.1.37 లక్షల కోట్లు సమకూరుతుంది. ఇది కేంద్ర కుటుంబ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం నిధుల కంటే ఒకటిన్నర రెట్ల కంటే కూడా ఎక్కువ! ఈ మొత్తం దేశంలో ఇప్పటిదాకా స్కూలు ముఖం చూడని చిన్నారులందరి స్కూలు ఖర్చులకూ సరిపోతుంది. ► 2017–21 మధ్య భారత కుబేరుడు గౌతం అదానీ ఆర్జించిన (పుస్తక) లాభాలపై పన్ను విధిస్తే ఏకంగా రూ.1.79 లక్షల కోట్లు సమకూరుతుంది. దీనితో 50 లక్షల మంది టీచర్లను నియమించి వారికి ఏడాదంతా వేతనాలివ్వొచ్చు. ► వేతనం విషయంలో దిన కూలీల మధ్య లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. పురుషుల కంటే మహిళలకు 37 శాతం తక్కువ వేతనం అందుతోంది. ► ఇక ఉన్నత వర్గాల కూలీలతో పోలిస్తే ఎస్సీలకు, పట్టణ కూలీలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల వారికీ సగం మాత్రమే గిడుతోంది. ► సంపన్నులపై, కరోనా కాలంలో రికార్డు లాభాలు ఆర్జించిన సంస్థలపై మరింత పన్ను విధించాలని 2021లో జరిపిన ఫైట్ ఇనీక్వాలిటీ అలియన్స్ ఇండియా సర్వేలో 80 శాతం మందికి పైగా డిమాండ్ చేశారు. ► అసమానతలను రూపుమాపేందుకు సార్వ త్రిక సామాజిక భద్రత, ఆరోగ్య హక్కు తదితర చర్యలు చేపట్టాలని 90 శాతానికి పైగా కోరారు. 5 శాతం మందిపై పన్నుతో.. 200 కోట్ల మందికి పేదరికం నుంచి ముక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక్క శాతం సంపన్నుల వద్దనున్న మొత్తం, మిగిలిన ప్రపంచ జనాభా సంపద కంటే రెండున్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఆక్స్‌ఫాం నివేదిక తెలిపింది. వారి సంపద రోజుకు ఏకంగా 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతున్నట్టు పేర్కొంది. అది ఇంకేం చెప్పిందంటే... ► ప్రపంచంలోని మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే ఏటా 1.7 లక్షల కోట్ల డాలర్లు వసూలవుతుంది. ఈ మొత్తంతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేయొచ్చు. ► 2020 నుంచి ప్రపంచమంతటా కలిసి పోగుపడ్డ 42 లక్షల కోట్ల డాలర్ల సంపదలో మూడింత రెండొంతులు, అంటే 26 లక్షల కోట్ల డాలర్లు కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే పోగుపడింది! ► అంతేకాదు, గత దశాబ్ద కాలంలో కొత్తగా పోగుపడ్డ మొత్తం ప్రపంచ సంపదలో సగం వారి జేబుల్లోకే వెళ్లింది!! ► మరోవైపు పేదలు, సామాన్యులేమో ఆహారం వంటి నిత్యావసరాలకు సైతం అంగలార్చాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ► వాల్‌మార్ట్ యజమానులైన వాల్టన్ కుటుంబం గతేడాది 850 కోట్ల డాలర్లు ఆర్జించింది. ► భారత కుబేరుడు గౌతం అదానీ సంపద ఒక్క 2022లోనే ఏకంగా 4,200 కోట్ల డాలర్ల మేరకు పెరిగింది! ► కుబేరులపై వీలైనంతగా పన్నులు విధించడమే ఈ అసమానతలను రూపుమాపేందుకు ఏకైక మార్గం. -
దావోస్‌కు కేటీఆర్ బృందం
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నేతృత్వంలో అధికారుల బృందం శనివారం రాత్రి బయలుదేరి వెళ్లింది. నేడు జూరిచ్‌కు చేరుకోనున్న కేటీఆర్ బృందం రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరుకుంటుంది. 2018లో తొలిసారిగా తెలంగాణ నుంచి దావోస్‌కు ప్రతినిధులు వెళ్లగా 2019, 2020, 2022లోనూ హాజరయ్యారు. దావోస్ సమావేశాలకు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందం వెళ్లడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. ప్రతీ ఏటా జనవరిలో వరల్డ్ ఎకనామిక్ సమావేశాలు జరగనుండగా కోవిడ్ పరిస్థితుల్లో గత ఏడాది మేలో జరిగాయి. ‘కో ఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్’ నినాదంతో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఆల్పైన్ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 1,500 మీటర్ల ఎత్తున ఉన్న విడిది పట్టణం దావోస్ ఆతిథ్యమిస్తోంది. కాగా దావోస్‌లో ఏర్పాటయ్యే తెలంగాణ పెవిలియన్‌లో పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు చెందిన అధినేతలతో భేటీకావడంతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో భాగంగా జరిగే రౌండ్ టేబుల్ భేటీల్లో కేటీఆర్ పాల్గొంటారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడం ద్వారా ప్రైవేటు రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా కేటీఆర్ ప్రసంగాలు, భేటీలు ఉంటాయి. -
అంతర్జాతీయ రోడ్‌షోలతో పెట్టుబడుల ఆకర్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేపడుతున్న అంతర్జాతీయ రోడ్‌షోలు సత్ఫలితాలిస్తున్నాయి. కరోనాతో రెండున్నరేళ్లుగా ఆన్లైన్ సమావేశాలకే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ రోడ్‌షోలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అధికారుల బృందం వెళ్లివచ్చింది. అంతకుముందు అప్పటి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొంది. తాజాగా పరిశ్రమలశాఖ డైరెక్టర్ సృజన నేతృత్వంలో అధికారుల బృందం జర్మనీలోని హాన్ఓవర్ మెస్సే ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొంది. ఈ మూడు రోడ్‌షోలు మంచి ఫలితాలు అందించడంతో రానున్న కాలంలో మరిన్ని అంతర్జాతీయ రోడ్‌షోలను నిర్వహించడానికి పరిశ్రమలశాఖ సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ ట్రేడ్ ఫెయిర్‌గా పిలిచే హన్ఓవర్లో మే 30 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగిన ట్రేడ్ ఫెయిర్‌లో రాష్ట్రం పాల్గొనడమే కాకుండా రాష్ట్రంలో తయారీ, పోర్టులు, లాజిస్టిక్స్, ఎగుమతుల రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన ‘సాక్షి’కి చెప్పారు. ఏబీబీ, ఎయిర్‌బస్, బోష్, జెస్సీ కర్ల్, ఫెస్టో, షెఫ్లర్ టెక్నాలజీస్ వంటి కంపెనీలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేసిన జర్మనీ, ఇజ్రాయిల్‌లకు చెందిన షెఫ్లర్ టెక్నాలజీస్, ఫెస్టో వంటి కంపెనీలు రాష్ట్రంలోని అవకాశాలపై ఆసక్తిని వ్యక్తం చేసినట్లు చెప్పారు. రోబోటిక్, హెల్త్‌కేర్, డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపాయన్నారు. దుబాయ్, దావోస్, జర్మనీ రోడ్‌షోలు మంచి ఫలితాలివ్వడంతో త్వరలో నార్వే, దక్షిణ కొరియాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా దక్షిణ కొరియా రోడ్‌షోను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంపై మల్క్హోల్డింగ్ ఆసక్తి ఈ ఏడాది దుబాయ్ ఎక్స్పో సందర్భంగా రూ.5,150 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగ్గా అందులో కీలకమైన అమెరికాకు చెందిన మల్క్ హోల్డింగ్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ విషయమై ఇప్పటికే సీఎం జగన్‌ను కలిసిన మల్క్హోల్డింగ్స్ ప్రతినిధులు వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో రూ.1,500 కోట్లతో అల్యూమినియం కాయల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించారు. ఇటీవల దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రపంచానికి ఏపీని రోల్‌మోడల్‌గా చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఈ ఒక్క రంగంలోనే నాలుగు అంతర్జాతీయస్థాయి కంపెనీల నుంచి రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించగలిగింది. మిట్టల్, అదానీ, అరబిందో, గ్రీన్కో వంటి కంపెనీలతో పాటు బైజూస్, టెక్ మహీంద్రా, డసల్ట్ వంటి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ రోడ్‌షోల్లో వివిధ కంపెనీలతో జరిపిన చర్చలు, ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథ్ తెలిపారు. -
దావోస్‌కు బై బై...తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేకతలను వివరించి, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చేపట్టిన పర్యటన ముగిసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా జరిపిన చర్చలు, సంప్రదింపులతో కేటీఆర్ బృందం రాష్ట్రానికి సుమారు రూ.4,200 కోట్ల మేర పెట్టుబడులు రాబట్టగలిగింది. కేటీఆర్ శుక్రవారం తన బృందంతో కలిసి తిరుగు పయనమయ్యారు. శనివారం ఉదయం రాష్ట్రానికి చేరుకోనున్నారు. తొలుత యూకేలో.. ఈనెల 18న హైదరాబాద్ నుంచి యూకేకు చేరుకున్న కేటీఆర్.. నాలుగు రోజుల పాటు యూకే బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ నెల 22న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్న కేటీఆర్ 26వ తేదీ వరకు 45 కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. నాలుగు రౌండ్ టేబుల్ సమావేశాలు, మరో నాలుగు చర్చా గోష్టుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేకతలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను కేటీఆర్ వివరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌కు బహుళజాతి కంపెనీల ప్రతినిధుల నుంచి ప్రశంసలు దక్కడంతోపాటు.. పలు అవగాహన ఒప్పందాలు, పెట్టుబడి ప్రకటనలు, చర్చలకు ఈ పెవిలియన్ వేదికగా నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ ప్రధాన సమావేశ మందిరం, ఇండియా పెవిలియన్, సీఐఐ పెవిలియన్‌లో జరిగిన చర్చలు, తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఫార్మా లైఫ్ సైన్స్, దేశంలోని ప్రముఖ యూనికార్న్ వ్యవస్థాపకులతో జరిగిన గోష్టుల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రభుత్వ విధానాలను, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, ముఖ్యంగా యూకే, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ప్రవాస భారతీయులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. జెడ్ఎఫ్ కంపెనీ ప్రతినిధులతో భేటీ దావోస్‌లో చివరిరోజున స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్లో జెడ్ఎఫ్ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని జెడ్ఎఫ్ ప్రతినిధులు చెప్పారు. తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్న క్యాంపస్ 3 వేల మంది సిబ్బందితో తమ అతిపెద్ద కార్యాలయంగా ఉండబోతుందన్నారు. జూన్ 1న నానక్‌రామ్‌గూడలో జెడ్ఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. జెడ్ఎఫ్ కంపెనీ విస్తరణతో తెలంగాణలో మొబిలిటీ రంగానికి అదనపు బలం చేకూరుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మళ్లీ వచ్చే ఏడాది దాకా! సాక్షి, హైదరాబాద్: వారం రోజుల పాటు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ చివరి రోజు స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌లో సరదాగా గడిపారు. ఓ వీధి పక్కన రెస్టారెంట్లో సేదతీరుతున్న ఫొటోను ట్వీట్ చేశారు. ‘దావోస్‌కు బై బై.. వచ్చే ఏడాది దాకా’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
దావోస్ లో ఏపీ ఉజ్వల భవిష్యత్తుకు నిర్మాణాత్మక పునాదులు
-
Telangana: హ్యుందాయ్ పెట్టుబడులు రూ.1,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా తెలంగాణ గురువారం మరో భారీ పెట్టుబడి సాధించింది. రాష్ట్రంలో ఏర్పా టుచేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ హ్యూండాయ్ రూ.1,400 కోట్ల పెట్టుబడిని పెడుతున్నట్లు ప్రక టించింది. మాస్టర్‌కార్డ్, జీఎంఎం ఫాడ్లర్, ఈఎం పీఈ తదితర సంస్థలూ రాష్ట్రంలో పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలపై కీలక ప్రకటనలు చేశాయి. కేటీఆర్‌తో హ్యుందాయ్ ప్రెసిడెంట్ భేటీ హ్యుందాయ్ ప్రెసిడెంట్ యంగ్చో చి గురువారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలం గాణలో పెట్టుబడిపై ప్రకటన చేశారు. మొబిలిటీ క్లస్టర్లో పెట్టుబడులకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ లోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. తెలంగాణలో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా టెస్ట్ ట్రాక్‌లతో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంది. హ్యుందాయ్ రాకతో మొబిలిటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పౌరసేవలే లక్ష్యంగా.. డిజిటల్ టెక్నాలజీల ద్వారా తెలంగాణ పౌరులకు ప్రపంచ స్థాయి పౌర సేవలు అందించేందుకు అమెరికాకు చెందిన ‘మాస్టర్ కార్డ్’తో రాష్ట్ర ప్రభుత్వం గురువారం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులతో పాటు ఇతర పౌర సేవా రంగాల్లో ఈ ఒప్పందం కీలకమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పౌర సేవలు, చిన్న తరహా వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను తమ ఎంవోయూ వేగవంతం చేస్తుందని మాస్టర్ కార్డ్ వైస్ చైర్మన్ మైఖేల్ ఫ్రొమన్ వెల్లడించారు. ఈఎంపీఈ డయోగ్నొస్టిక్స్ యూనిట్ క్షయ వ్యాధి డయోగ్నొస్టిక్ కిట్ల అంతర్జాతీయ తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు స్వీడన్‌కు చెందిన ‘ఈఎంపీఈ డయోగ్నొస్టిక్స్’ ప్రకటించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో నెలకు 20 లక్షల కిట్లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తారు. తర్వాతి దశలో రూ.50 కోట్ల పెట్టుబడి పెడతామని సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ పవన్ అసలాపురం చెప్పారు. హైదరాబాద్‌లో జీఎంఎం ఫాడ్లర్ విస్తరణ ఫార్మా కంపెనీలకు అవసరమైన గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్‌లను తయారు చేసే జీఎంఎం ఫాడ్లర్ హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈఓ థామస్ కెహ్ల్, డబ్ల్యూఈఎఫ్ డైరెక్టర్ అశోక్ జె పటేల్ గురువారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రెండేళ్ల క్రితం రూ.48 కోట్లకు పైగా పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన జీఎంఎం ఫాడ్లర్ అదనంగా మరో రూ.28 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా సంస్థలో ఉద్యోగుల సంఖ్య 300కు చేరుకుంటుంది. కాగా హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ ఆసక్తి చూపింది. -
తెలంగాణతో జట్టు కట్టిన మాస్టర్ కార్డ్స్
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా తెలంగాణతో జట్టు కట్టేందుకు మాస్టర్స్ కార్డ్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాస్టర్ కార్డ్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రోమాన్‌తో మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజటల్ స్టేట్ పార్టనర్షిప్ విషయంలో ఇరువురి మధ్య అవగాహాన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రజలకు అత్యంగ వేగంగా డిజిటల్ సేవలు అందివ్వడానికి మాస్టర్ కార్డ్స్ తెలంగాణల మధ్య కుదిరిన ఒప్పందం దోహదం చేస్తుంది. అంతే కాకుండా రైతులు, మధ్య, చిన్నతరహా వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వేగవంతం కావడానికి ఉపకరిస్తుంది. సైబర్‌క్రైం, డిజిటల్ లిటరసీ విషయంలోనూ మాస్టర్‌కార్డ్స్ తెలంగాణతో కలిసి పని చేయనుంది. In line with its vision of a Digital Telangana, the Govt. of Telangana entered into an MoU with @Mastercard to formalize a Digital State Partnership. The announcement was made in the presence of Minister @KTRTRS & Mastercard VC & President Michael Froman in Davos #InvestTelangana pic.twitter.com/zHx23l3Wra — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 26, 2022 చదవండి: తెలంగాణకి గుడ్‌న్యూస్ ! ఫెర్రింగ్ ఫార్మా మరో రూ.500 కోట్లు.. -
దావోస్‌లో జోష్‌గా.. తెలంగాణకు భారీ పెట్టుబడులు..
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ భారీ పెట్టుబడులు సాధిస్తోంది. పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. పలు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బుధవారం రెండు భారీ పెట్టుబడులు సాధించింది. రైల్వే కోచ్‌ల తయారీలో పేరొందిన స్టాడ్లర్ రైల్ సంస్థ వచ్చే రెండేళ్లలో రూ.1,000 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో స్టాడ్లర్ రైల్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ఆన్స్ గార్డ్ బ్రొక్‌మెయ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మోకిలలో ఇప్పటికే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన మేధా సర్వోడ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి స్టాడ్లర్ రైల్ ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత పెట్టుబడి ద్వారా సుమారు 2,500 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే కోచ్‌లు భారత్‌కే కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతానికి కూడా ఎగుమతి అవుతాయి. కాగా స్టాడ్లర్ రైల్ పెట్టుబడిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విదేశాలకు కూడా కోచ్‌లు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందనే విషయం మరోసారి నిరూపితమైందని చెప్పారు. తెలంగాణలో ఏర్పాటు చేసే తమ యూనిట్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందనిబ్రొక్‌మెయ్ పేర్కొన్నారు. తమ కంపెనీ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందన్నారు. స్వల్ప వ్యవధిలోనే ఫెర్రింగ్ ఫార్మా విస్తరణ భారత్‌లో తమ విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు మరో స్విస్ సంస్థ ఫెర్రింగ్ ఫార్మా ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో బుధవారం మంత్రి కేటీఆర్‌తో సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అల్లేసండ్రో గిలియో ప్రతినిధి బృందం సమావేశం అయ్యింది. క్రోన్, అల్సరేటివ్ కోలైటిస్ వంటి (జీర్ణకోశ సంబంధిత) వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ‘పెంటసా‘ను ఉత్పత్తి చేసేందుకు తెలంగాణలోని కొత్త ప్లాంట్‌ను వినియోగించుకోనున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద మేసాలజైన్ అనే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ (ఏపీఐ) తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఫెర్రింగ్ ఫార్మా ప్రస్తుతం వివిధ దేశాల్లో తన ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటికి అదనంగా హైదరాబాద్ నగరంలో తన ఫార్ములేషన్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నెలరోజుల క్రితమే తమ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సంస్థ స్వల్ప వ్యవధిలోనే అదనంగా మరో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ‘ష్నైడర్ ఎలక్ట్రిక్’మరో యూనిట్ తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫ్రెంచ్ కంపెనీ ష్నైడర్ ఎలక్ట్రిక్ రాష్ట్రంలో మరో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో బుధవారం భేటీ సందర్భంగా సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు లుక్ రిమోంట్ ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న తమ యూనిట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీగా అడ్వాన్సŠడ్ లైట్ హౌస్ అవార్డును అందుకున్నదని రిమోంట్ తెలిపారు. ఐఓటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనలిటిక్స్, ఏఐ డీప్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం వాడినందుకు ఈ అవార్డు దక్కిందన్నారు. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయంటూ, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణంపై ఆయన ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే తమ కంపెనీ విస్తరణకు పూనుకున్నట్లు తెలిపారు. తమ నూతన తయారీ ప్లాంట్ ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ సంబంధిత ఉత్పత్తులను తయారు చేస్తుందని చెప్పారు. ష్నైడర్ ఎలెక్ట్రిక్ అదనపు తయారీ యూనిట్ వలన కొత్తగా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు.