
చాకిరొకరిది.. సౌఖ్యమొకరిదా?
అపార సంపద పొందడమే కాకుండా సంపన్నులు దాన్ని విచ్చలవిడిగా ప్రదర్శించే విధం పేదరికంలో అలమటిస్తున్న వారికి పుండుపై కారం చల్లినట్టుంటుంది.
సమకాలీనం
అపార సంపద పొందడమే కాకుండా సంపన్నులు దాన్ని విచ్చలవిడిగా ప్రదర్శించే విధం పేదరికంలో అలమటిస్తున్న వారికి పుండుపై కారం చల్లినట్టుంటుంది. ఇటీవలి కాలంలో ఈ తత్వం పెరిగింది. విలాసవంతమైన జీవితం, పెద్ద పెద్ద బంగళాలు, విల్లాలు, కార్లు, ఆభరణాలు, విందులు- వినోదాలకు ధనికులు పెద్దమొత్తాల్లో డబ్బు వెదజల్లుతున్నారు. పక్కనే, తిండి-గుడ్డ-నీడ వంటి కనీసావసరాల కోసం నిత్యం బతుకు పోరాటం చేసే నిరుపేదలు తీవ్ర క్షోభకు గురవుతుంటారు.
‘మన ప్రస్తుత ఆర్థిక నమూనా కావాలనే రూపొందించిన అసమానతల చట్రం’ అని అంతర్జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య (ఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి శారన్ బురో దావోస్‌లో భేటీ అయిన ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి తొలిరోజు (బుధవారం) మాట్లాడుతూ అన్నారు. ఆయన మాటలు అక్షరసత్యాలని నేడు ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు స్పష్టం చేస్తు న్నాయి. ఈ అసమానతలు అసాధారణ, ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతు న్నాయి. శాస్త్ర సాంకేతికత చేదోడుతో, ఇంతగా ప్రగతి సాధించామని చెప్పు కుంటున్న ప్రస్తుత సమాజాభివృద్ధి క్రమంలో ఇవి చెడు సంకేతాలు. ఈ పరిస్థి తుల్ని ఇలాగే కొనసాగనిస్తే... 2030 నాటికి కూడా ప్రపంచవ్యాప్తంగా యాభయ్ కోట్ల మంది కటిక దారిద్య్రంలో మగ్గుతారని ప్రపంచ బ్యాంకు తాజా అంచనాలు చెబుతున్నాయి. ధనవంతులు మరింత సంపన్నులవు తుంటే; పేద, అల్పాదాయవర్గాల వారు మరింత పేదరికంలోకి జారుతు న్నారు. ఆర్థిక అంతరాలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. అభివృద్ధి సమ్మిళిత పద్ధతిన సాగలేదనడానికి స్పష్టమైన సూచికలివి. ప్రపంచ రాజ్యాధి నేతలు, మేధావులు, ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు... ఇలా విభిన్నవ ర్గాలకు చెందిన ముఖ్యులంతా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నప్ప టికీ, క్రియాత్మకంగా చేసిందేమీ లేదు.
దావోస్‌లో మూడు రోజుల పాటు జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నేపథ్యంలో పేదరిక నిర్మూలనకు పనిచేస్తున్న లాభాపేక్షలేని సేవా సంస్థ ‘ఆక్స్‌ఫామ్’ తేల్చిన గణాంకాలు గగుర్పాటు కల్పించేలా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది (360 కోట్లు) ఆస్తికి సరిసమానమైన సంపద కేవలం 62 మంది వద్దే ఉండ టం విస్మయం కలిగించే విషయం. ఆ 62 మంది కుబేరుల్లోనూ 53 మంది పురుషులే కావడం లింగపరమైన మరో అసమానతకు నిలువుటద్దం! మొత్తం జనాభాలోని ఒక శాతం సుసంపన్నుల సంపద, మిగతా యావన్మంది (99 శాతం) సమస్త సంపదను మించుతోందంటే... పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ అంతరాలు ముఖ్యంగా గత రెండున్నర దశాబ్దాల కాలంలో, మరీ ముఖ్యంగా గడచిన ఐదారేళ్లలో పెరిగినవే! ఆర్థిక సరళీకరణ విధానాలు, సరికొత్త మార్కెట్ ఆవిష్కరణలు... కొన్ని వర్గాలకే ప్రయోజనం కలిగించాయి తప్ప సంపద పంపిణీని న్యాయబద్ధం చేయలేదని స్పష్టమౌతోంది. సంపద సృష్టి ముఖ్యమే! ఒక దశ దాటిన తర్వాత సంపద పంపిణీ అంతకన్నా ముఖ్య మని కమ్యూనిస్టు యోధుడు కారల్ మార్క్స్ చెప్పింది అందుకేనేమో!
దావోస్ సంకటస్థితిని గమనించాలి
రువాండా అధ్యక్షుడు పాల్ కగామె దావోస్ సదస్సులో మాట్లాడుతూ, ‘జీవన ప్రమాణాలు పెంచే అవకాశమే అతిపెద్ద వ్యాపారావకాశం’ అని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన సమాజాలు ఈ దృక్కోణంలో ఆలోచిస్తే గాని విశ్వ సమా జంలోని ఆర్థిక అసమానతలు తొలగించలేము. మనుషులు, విభిన్న సమా జాల మధ్య ఆదాయ వ్యత్యాసాలే పలు ఆర్థిక-సామాజిక సమస్యలకు, రాజ కీయ అనిశ్చితికి కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వినియోగ తరుగుదల నుంచి రాజకీయ-సామాజిక అశాంతి వరకు వివిధ అనర్థాలు దీని వల్లే! భవిష్యత్ ఆర్థిక స్వస్థతకూ ఇది ప్రమాదకారే! ఆర్థికవృద్ధి, జీవన ప్రమాణాల పెంపులో విశాల దృక్పథం అవసరమనేది ఈ అంతరాలతో మరోమారు స్పష్టమైంది. మానవేతిహాసంలోనే అతి పెద్దదైన ఇటీవలి ఆర్థిక మాంద్యం తర్వాత... ఉత్పత్తి-వాణిజ్య సంస్థల వ్యాపార ముఖ్యులు, విధాన నిర్ణేతల ఆలోచనా ధోరణిలో కొంత మార్పొచ్చింది. వ్యాపార పంథాలో, ఆర్థికాభివృద్ధి నమూనాల్లో సంస్కరణల అవసరాన్ని వారు విధిగా గుర్తించా ల్సిన స్థితి. అందుకే, ఆర్థికవృద్ధితో పాటు సమ్మిళిత సామాజికాభివృద్ధి జమిలి సాగాల్సిందేనన్న స్థిరాభిప్రాయానికి వచ్చారు.
తామెదుర్కొంటున్న విశ్వ సవాళ్ల విరుగుడుకు తీసుకునే చొరవలో వేదిక (డబ్ల్యూఈఎఫ్) తగు జాగ్రత్తల్ని పొందుపరుస్తోంది. ముఖ్యంగా పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యంతో లక్ష్యాల్ని సాధించాలని, ఈ చొరవలో ప్రధానంగా విశ్లేషణ-సంప్రదింపులు- చర్యలు అన్న మూడంశాలు ప్రాతిపదికగా ఉండాలనేది వేదిక వివిధ నివేది కలు చేసిన సిఫారసు. విశ్వవ్యాప్తంగా సరికొత్త మార్కెట్లు ఆశావహ వాతావర ణాన్ని ఆవిష్కరిస్తున్నా... వినియోగ వస్తువుల ధరలు పెరగటం, పతన దిశలో వివిధ కరెన్సీలు విలువ కోల్పోతుండటం వేదికను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిణామం కూడా పెరుగుతున్న ఆర్థిక అంతరాల్లో పేదల్ని కాటేసేదే కావడం మరింత కృంగదీస్తోంది. లోలోపల ఈ అంశం కేంద్రకంగానే దావోస్ చర్చలు సాగుతున్నాయి. మాంద్యం పడగ నీడన ఓ వైపు ఆర్థిక వృద్ధి మంద గింపు మరోవైపు ఆర్థిక అసమానతల వృద్ధి ... ఈ సంక్లిష్ట స్థితిలో అత్యధికుల జీవన ప్రమాణాలు పడిపోకుండా మెరుగుపర్చడమెలా? భవిష్యత్ ఆర్థిక పురోగమనాన్ని పరిరక్షించడమెలా? అన్నది ఆర్థికవేత్తల ముందున్న సవాల్!
భారత్ పరిస్థితి భిన్నమేమీ కాదు!
ఆర్థిక అసమానతలు పెరిగి అశాంతికి దారితీస్తున్న పరిస్థితి మన దేశంలోనూ ప్రమాదకర స్థాయిలోనే ఉంది. గడచిన పాతిక సంవత్సరాల్లో కొన్ని వర్గాల సంపద అసాధారణంగా పెరిగింది. విశ్వీకరణ, ఆర్థిక సరళీకరణ ప్రయోజ నాలు నేరుగా అందడం, పాలనా వ్యవస్థల్లో విలువలు నశించి అధికారం గుప్పిట పట్టిన వారిలో స్వార్థం-ఆశ్రీత పక్షపాతం-బంధుప్రీతి శిఖర స్థాయికి చేరింది. దీనికి తోడు రాజకీయ-ఆర్థిక విధానాల్లో లొసుగుల్ని, అంతకు మించి అమలు వైఫల్యాల్ని సానుకూలంగా మలచుకోవడం వంటి పరిణా మాల వల్ల ఆయా వర్గాలు తేలిగ్గా సంపద కూడగట్టే వాతావరణం బలప డింది. స్వాతంత్య్రానంతరం పేదరిక నిర్మూలనకు వరుస ప్రభుత్వాలు చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలు కొంత మార్పు తెచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితాలివ్వలేదు. అపరిమిత జనాభా వృద్ధి, పాలకుల ప్రాధాన్యతా లోపాలు, అక్షరాస్యతలేమి వల్ల అవకాశాలు అందిపుచ్చుకోవడంలో అంతరాలు పేదరిక నిర్మూలనకు అవరోధంగా పరిణమించాయి.
పేదలు మరింత పేదలవుతున్నారు. సమతుల్యత కోల్పోయిన వింత సమాజం ఆవిష్కరణే కాకుండా అది విలువల పతనానికీ దారి తీస్తోందని సామాజిక శాస్త్రవేత్తలం టున్నారు. దశాబ్దాల కాలంలో పేదరిక నిర్వచనం కూడా మారుతూ వస్తోంది. మన దేశంలో 2005కు పూర్వం... ఎన్ని కాలరీల తిండి, బతకడానికి అవస రమయ్యే వినియోగాలపై మనిషి తలసరి వ్యయం ప్రాతిపదికన పేదరికాన్ని లెక్కగట్టే వారు. తర్వాత పరిస్థితి మారి, భారత ప్రభుత్వం టెండూల్కర్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆదాయం, వస్తు వినియోగం, గ్రామీణ- పట్టణ ప్రాంతాల్లో జరిపే కనీస వ్యయం తదితరాలతో కూడిన సమ్మేళనం ఆధారంగా పేదరికాన్ని గణించే పద్ధతి వచ్చింది.
ఈ తరహాలోనే ప్రపంచ బ్యాంకు కూడా 1990 తర్వాత పేదరికం నిర్వచనాన్ని, గణించే పద్ధతిని మార్చింది. మన దేశంలో 21.9 శాతం జనాభా పేదరికంలో ఉన్నట్టు 2012లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2005 నాటి కొనుగోలు శక్తి వ్యత్యాస సూచీ (పీపీపీ) ఆధారంగా 2011లో 27.6 కోట్ల మంది (23.6 శాతం జనాభా) దారిద్య్ర రేఖ దిగువన (రోజుకు 1.25 డాలర్లకన్నా తక్కువ పీపీపీ) ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అదే కాలంలో (2011-12) భారత్‌లో 21.9 శాతం జనాభా, అంటే 1.20 కోట్ల జనాభాలో 27 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్య పథకం (ఎమ్జీడీ) నివేదిక వెల్లడించింది. సవరించిన తాజా నిర్వచనం ప్రకారం 2014లో భారతదేశంలో 18 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువన (ప్రపంచ జనాభాలో 17.5 శాతం) ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.
గణాంకాలెప్పుడూ అర్థసత్యాలే! అన్నది నానుడి. విస్మయం కలిగించే ఈ అంకెల కంటే కూడా పెరుగుతున్న అంతరాల విషయంలో భవిష్యత్ సంకేతాలు మరింత ప్రమాద కరంగా ఉన్నాయి. ఉదాహరణకు: ప్రపంచ పరిస్థితి పరిశీలిస్తే, సగం సంప దకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక శాతం వారి ఆస్తి 2010 నుంచి అయిదేళ్లలో 44 శాతం వృద్ది చెందింది. అడుగునున్న మరో సగం సంపదకు ప్రాతినిధ్యం వహిస్తున్న 99 శాతం మంది ఆస్తి మాత్రం 41 శాతం క్షీణించింది. ఈ పరిస్థితి దాదాపుగా మన దేశంలోనూ ప్రతిబింబిస్తోంది.
పెచ్చుమీరుతున్న ప్రదర్శనతత్వం
అపారంగా సంపద పొందడమే కాకుండా సంపన్నులు దాన్ని విచ్చలవిడిగా ప్రదర్శించే తత్వం పేదరికంలో అలమటిస్తున్న వారికి పుండుపై కారం చల్లినట్టుంటుంది. ఇటీవలి కాలంలో ఈ తత్వం పెరిగింది. విలాసవంతమైన జీవితం, పెద్ద పెద్ద బంగళాలు, విల్లాలు, కార్లు, ఆభరణాలు, విందులు- వినోదాలకు ధనికులు పెద్దమొత్తాల్లో డబ్బు వెదజల్లుతున్నారు. పక్కనే, తిండి-గుడ్డ-నీడ వంటి కనీసావసరాల కోసం నిత్యం బతుకు పోరాటం చేసే నిరుపేదలు తీవ్ర క్షోభకు గురవుతుంటారు. చిన్న చిన్న సంప్రదాయిక ఉత్సవాలకు కూడా లక్షలు, కోట్లు ఖర్చు చేసే సరికొత్త సంపన్నవర్గం పుట్టుకొ స్తోంది. ఇంట్లో చంటి పిల్లలకు పుట్టు ఒల్లె, పుట్టు పంచెలు కట్టిస్తే, తొట్టెల (నామకరణ) పండుగ చేస్తే కూడా ఓ వంద టేబుళ్లు వేసి విదేశీ మద్యం సరఫ రాతో విందులిచ్చే నయా కల్చర్ పెరిగిపోయింది. గోడ ఇవతల ఖరీదయిన షామియానా కింద మద్యం మత్తులో సంపద కరిగిస్తూ కొందరు చిందు లేస్తుంటే, దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ దక్షిణ ముంబైలో నిర్మించిన ‘ఆంటిలియా’ ప్రైవేటు నివాస సౌధం 27 (ఎలివేటెడ్ కావడం వల్ల 60 అంతస్తుల ఇతర సౌధాల ఎత్తుకు సమానం) అంతస్తులు.
నిరంతరం 600 మంది పనివాళ్లు నిర్వహించే ఈ భవనం ఖరీదు, అధికారికంగా ప్రకటించినదే 6,500 కోట్ల రూపాయలు. దీని గురించి పారిశ్రామిక వేత్త రతన్‌టాటా చేసిన(ట్టు వికిపీడియా వెల్లడించిన) వ్యాఖ్య దేశంలోని ఆర్థిక అంతరాలకు అద్దం పడుతుంది. ‘‘పేదల పట్ల, పేదరికం పట్ల ఈ దేశంలోని సంపన్నులకు స్పృహ, పట్టింపు లేదనడానికి ఈ బంగళా ఒక ఉదాహరణగా నిలుస్తుంది‘‘ అన్నారు. పంచవర్ష ప్రణాళికలు, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర దేశంలో ఏటా లక్షల కోట్ల రూపాయల్ని హరించినా ఆర్థిక అంతరాలు తగ్గట్లేదు సరికదా పెరుగుతున్నాయి. చట్టాలు, వ్యవస్థలు, విధానాలు... అన్నీ సంపన్నులకే అనుకూలంగా ఊడిగం చేస్తున్నాయని, పేదల్ని ఏవిధంగానూ ఆదుకోవడం లేదన్నది సగటు మనిషి ఆవేదన. దావోస్ వేదికపై ఆర్థికవేత్తలూ ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలు ఆలోచించండి!
దిలీప్ రెడ్డి, ఈమెయిల్: dileepreddy@sakshi.com