
ట్యాక్స్ కాలంలో ఎన్టీఆర్ ఉమ్మడి కుటుంబం, ఏఎన్నార్ మంచి కుటుంబం ప్రస్తావన ఎందుకొచ్చింది.. అంటే ఒకే గూడు కింద ఉమ్మడిగా ఉంటూ, వ్యాపారం చేస్తూ, పన్ను భారం పడకుండా, చట్టం దృష్టిలో ‘మంచి కుటుంబం’గా పేరు పడ్డ అయ్యర్ కథే.. ట్యాక్స్ ప్లానింగ్‌కి ప్రేరణ.
పాల్ఘాట్ నుంచి పావలా పట్టుకుని పారిపోయినప్పుడు పరమేశ్వరన్ అయ్యర్ వయస్సు 10 ఏళ్లు. 1960లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వేళ అయ్యర్‌కి తన స్వశక్తితో పాటు కృషి కూడా తోడు కావడంతో అదృష్టం కలిసి వచ్చింది. ఇడ్లీ, సాంబార్, దోశలు అమ్ముతూ బాగా సంపాదించాడు. ఎకరం పైగా జాగా కొన్నాడు. పెళ్లి, పిల్లలు, అందరూ ఒకే చోట నివాసం.. ఒకే పొయ్యి.. ఒకే వంట. ముగ్గురు మగపిల్లలు పిల్లలు తండ్రి మాట విని, వారికి చేదోడు వాదోడుగా ఉంటూ అదే వ్యాపారం కొనసాగిస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు అయ్యర్. అప్పు సొప్పు లేకుండా తనకో ఇల్లు, ముగ్గురు పిల్లలకు తలా ఇల్లు కట్టించాడు. నాలుగు ఇళ్లు.. మెయిన్ రోడ్డుకు పక్కనే వ్యాపారానికి అనువుగా మల్గీలు. అందరివీ క్యాంటీన్లే. ఒక్కొక్కరు ఒక్కో రకం వంటకాలతో ఒకరికొకరు పోటీ కాకుండా, సమిష్టి కృషితో, పాతిక మంది పనివాళ్లతో వ్యాపారం సాగిస్తున్నారు.
ఎవరి వ్యాపారం వారిదే, ఎవరి బ్యాంక్ అకౌంటు, ఎవరి లెక్కలు వారివే. అందరికీ పెళ్లిళ్లయి, చదువుకుంటున్న పిల్లలున్నారు. కార్లు, స్కూటర్లు ఉన్నాయి. అయ్యర్ భార్య పేరు మీద ఆస్తి ఉంది. ఓనర్ గారికి అయ్యర్, కొడుకులు నెలవారీగా అద్దె ఇస్తుంటారు. ఆవిడదో ప్రత్యేక ఇన్‌కం ట్యాక్స్ అసెస్‌మెంట్. అందరూ బాగానే సంపాదిస్తున్నారు. జీఎస్‌టీ పరిధిలో లేరు. నామమాత్రంగా పన్ను కడతారు. పాత పద్ధతి ప్రకారం అవకాశం ఉన్నన్ని రాయితీలు, తగ్గింపులు, మినహాయింపులు పొందేవారు. ఇప్పుడు కొత్త పన్ను విధానం వైపు మొగ్గు చూపుతున్నారు.
అనుకోని ఆదా ఏమిటంటే, తిండి మీద ఖర్చులు, కుటుంబ పోషణ అంతా క్యాంటీన్ల ఖర్చుతో వెళ్లిపోతుంది. చుట్టాలు పక్కాలకు మర్యాదలకు లోటు ఉండదు. మిగతా ఖర్చులు మాత్రమే చూసుకోవాల్సి ఉంటోంది. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 50 లక్షలు దాటుతున్నా పన్నుభారం సున్నా.. లేదా అత్యంత కనిష్ట స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. వాళ్ల ఎకరం జాగా, ఇళ్ల విలువ ప్రస్తుతం వంద కోట్లు దాటుతుంది. స్థిరాస్తి చెక్కు చెదరదు. ఆదాయం నిత్య పంట. పుష్కలంగా ఉంటుంది. ఇలా అయ్యర్ కుటుంబం ఉమ్మడిగా ఉంటూ, పన్ను భారం భారీగా పడకుండా చక్కని ఆర్థిక ప్రణాళికలతో మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తోంది.
ట్యాక్సేషన్ నిపుణులు
కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి
కె.వి.ఎన్ లావణ్య