2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనికోసం కొత్త ట్యాక్స్ కోడ్ అవసరమని నిపుణులు బడ్జెట్‌కు ముందే చెప్పారు. ఆర్ధిక వ్యవస్థను శక్తివంతం చేస్తూ.. నికర రాబడిని పెంచడం వంటివి అవసరం. 2025-26 ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించనున్నారు.
''ది న్యూ టాక్స్ కోడ్: రేపటి భారతదేశాన్ని నిర్మించడానికి ఆలోచనలు" అనే సెమినార్‌ను థింక్ చేంజ్ ఫోరమ్ (TCF) నిర్వహించింది. ఈ సెమినార్‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ మాజీ చైర్మన్ పీసీ ఝా, పాలసీ అడ్వైజరీ & స్పెషాలిటీ సర్వీసెస్ పార్టనర్ అండ్ లీడర్ రాజీవ్ చుగ్, మేనేజింగ్ పార్టనర్ సూరజ్ మాలిక్, సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ మొదలైనవారు పాల్గొన్నారు.
జీఎస్‌టీ కింద చాలా పన్ను రేట్లు ఉండటం మంచి పరిస్థితి కాదు. జీఎస్‌టీ అనేది ఒక పన్ను రేటుగా మాత్రమే ఉండాలి. కానీ.. మన దేశంలో ఒక పన్ను రేటును కలిగి ఉండటం సాధ్యం కాదు. కాబట్టి మూడు పన్ను రేట్లను పరిశీలించే అవకాశం ఉంది. అవి 5 శాతం, 16 శాతం & 28 శాతం. 16 శాతం అనేది.. 12 శాతం, 18 శాతానికి బదులుగా రానుందని పీసీ ఝా చెప్పారు.
పన్నుల వ్యవస్థలో ప్రస్తుత నిబంధనలను సరళీకృతం చేయాల్సిన అవసరాన్ని సమర్ధిస్తూ.. పన్ను రేట్ల తగ్గింపు పౌరులు.. కంపెనీల చేతుల్లో ఆదాయం పెరగడానికి దారి తీస్తుందని, తద్వారా ఆర్ధిక వృద్ధి పెరుగుతుందని రాజీవ్ చుగ్ పేర్కొన్నారు. సెమినార్‌లో పాల్గొన్న ప్రముఖులందరూ కూడా పన్ను చట్టాలలో మార్పుల అవసరని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment