
న్యూఢిల్లీ: సేవల రంగం ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) 450 బిలియన్ డాలర్లను (సుమారు రూ.39లక్షల కోట్లు) చేరుకోవాలని.. తద్వారా వస్తు ఎగుమతుల విలువను అధిగమించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ లక్ష్యంతో పనిచేయాలని పరిశ్రమకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వస్తు ఎగుమతులు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. కనుక సేవల రంగం ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 385–390 బిలియన్ డాలర్ల నుంచి 2025–26లో 450 బిలియన్ డాలర్లను చేర్చేందుకు పరిశ్రమ కృషి చేయాలని కోరారు.
2023–24లో సేవల ఎగుమతులు 341 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పెరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో సేవల ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 14 శాతం పెరిగి 355 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో వస్తు ఎగుమతులు 3.1 శాతం క్షీణించి 437 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో మరింత పెద్ద లక్ష్యాలతో పనిచేయాలంటూ ‘నాస్కామ్ గ్లోబల్ కన్‌ఫ్లూయెన్స్’ ఆరంభ సమావేశంలో భాగంగా మంత్రి పరిశ్రమకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: ఐపీవోకు ఫిజిక్స్‌వాలా
జీసీసీల తోడ్పాటు..
దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) పెద్ద ఎత్తున ఏర్పాటవుతుండడం, కొత్త టెక్నాలజీలతో సేవల ఎగుమతుల్లో ఏటా 15–18 శాతం వృద్ధి సాధించగలమన్నారు. దేశంలో 1,650 జీసీసీలు పనిచేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. పర్యాటకం, ఫైనాన్షియల్ రంగాల్లో అవకాశాలు దేశ సేవల ఎగుమతుల్లో 200 బిలియన్ డాలర్ల మేర ఐటీ, ఐటీ సంబంధిత సేవలే ఉన్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. అదే సమయంలో పర్యాటకం, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోనూ సేవల ఎగుమతుల వృద్ధికి పెద్ద మొత్తంలో అవకాశాలు రానున్నట్టు చెప్పారు. అయినప్పటికీ సేవల ఎగుమతుల్లో ఐటీ, ఐటీఈఎస్ ముందుంటాయన్నారు. క్లయింట్ లొకేషన్ నుంచి కాకుండా, మారుమూల ప్రాంతాల నుంచి మరిన్ని సేవలను అందించడంపై ఐటీ పరిశ్రమ దృష్టి పెట్టాలని కోరారు. దీనివల్ల పోటీతత్వం పెరిగి, వ్యయాలు తగ్గుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, భారత్‌లో వేతనాలు చెల్లించడం ఇందులో ఉన్న మరో ప్రయోజనంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment