గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) అమలులోకి వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత.. మొదటిసారి పన్ను రేట్లలలో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన తుది నిర్ణయం ఈనెల 21న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెలువడుతుంది.
పన్ను రేటు హేతుబద్దీకరణలో భాగంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల మీద మాత్రమే కాకుండా శీతలపానీయాల మీద జీఎస్టీని 28 శాతం నుంచి 35 శాతానికి పెంచే అవకాశం ఉంది. రెడీమేడ్ వస్త్రాలపై కూడా జీఎస్టీ రేటు పెరుగుతుందని.. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ అధ్యక్షతన జరిగిన జీవోఎం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతం అనే నాలుగు అంచెల పన్ను శ్లాబులు మాత్రమే ఉండేవి. త్వరలో 35 శాతం కొత్త రేటు కూడా శ్లాబులో చేరనున్నట్లు సమాచారం.
రూ.1,500 విలువైన రెడీమేడ్ దుస్తులపై 5 శాతం, రూ.1,500 నుంచి రూ.10,000 మధ్య ధర ఉన్న దుస్తులపై 18 శాతం, రూ. 10వేలు కంటే ఎక్కువ ధర ఉన్న వస్త్రాల మీద 28 శాతం జీఎస్టీ విధించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కొత్తగా 148 ఉత్పత్తులపై ట్యాక్స్ విధించనున్నట్లు జీవోఎం సూచించింది. సౌందర్య సాధనాలు, గడియారాలు, బూట్లు వంటి వాటిపై కూడా ట్యాక్స్ పెంచే అవకాశం ఉందని జీవోఎం ప్రతిపాదించింది.
ఇదీ చదవండి: రూ.2000 నోట్లపై ఆర్‌బీఐ అప్డేట్..
జిఎస్‌టి కౌన్సిల్ డిసెంబర్ 21న జైసల్మేర్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై కూడా కీలక ప్రతిపాదనలు వెల్లడించే అవకాశం ఉంది. కార్లు, వాషింగ్ మెషిన్స్ వంటివి 28 శాతం జీఎస్టీ కింద ఉన్నాయి. వీటిని 35 శాతం శ్లాబులోకి చేరుస్తారా? లేదా.. 28 శాతం వద్దనే ఉంచుతారా అనే విషయాలు 21వ తేదీ తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment