సాధారణంగా పన్ను క్లెయిమ్ చేసే విధానంలో ఎక్కువ మంది చేసే పొరపాట్లు కొన్ని కావాలని.. కొన్ని తెలియక చేసేవి ఉంటాయి. తప్పుడు క్లెయిమ్ చేసే వారికి ఆదాయపు పన్ను శాఖవారు నోటీసులు ఇస్తున్నారు. వివరాలు అడుగుతున్నారు. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టం’ అని సీబీడీటీ వారు అంటున్నప్పటికీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఈ కింద ఉదహరించిన కేసులన్నీ మీకు ఇబ్బంది కలిగించేవే. క్లెయిం రిజెక్షన్‌కు గురై పన్ను భారాన్ని పెంచేవి.. పెంచినవి కింద ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త వహించండి. ఈ పొరపాట్లు చేయకపోవడమే మీ ప్లానింగ్‌కి కీలకంగా ఉంటుంది.
కామేశ్వర్రావుగారు ఠంచనుగా ప్రతి నెలా రెంట్ పే చేస్తారు. బ్యాంకు అకౌంటులో ఖర్చు కనిపిస్తుంది. అయితే, ఓనర్ గారు ఇండియాలో లేరు. అమెరికాలో స్థిరనివాసం. ఆయన గారికి ఈ ఇంటికి వచ్చి చూసేటంత టైం లేదు.. ఓపికా లేదు. ఇద్దరు మంచివారే. ‘అవసరం లేదు’ అనుకున్నారు అగ్రిమెంటు గురించి. ఏ కాగితాలు లేవు. అగ్రిమెంటు లేదు. సంతకాలూ లేవు. దీంతో ఇంటద్దె అలవెన్సు క్లెయిమ్ చేయడానికి వీల్లేని పరిస్థితి.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మోతుబరి రైతు వామనరావుకు హైదరాబాద్‌లో లంకంత ఇల్లు ఉంది. దాన్ని అద్దెకిచ్చాడు. కానీ అగ్రిమెంటు రాయలేదు. బ్యాంకు చెల్లింపులు తీసుకోడు. అంతా నగదే. పిల్లల చదువుకని ఆ ఇంట్లోనే ఉంటున్నాడు విద్యాధర రావు. ఆయనకీ ఇంటద్దె అలవెన్స్ క్లెయమ్ చేయడానికి కాగితాలు లేవు.
ముందు జాగ్రత్తగా అగ్రిమెంటు రాసుకున్నాడు వాసుదేవరావు. కానీ ఆస్తేమో ఓనరు పేరు మీద.. అగ్రిమెంటేమో భార్య వసుంధర పేరు మీద.. మ్యుటేషన్ జరగలేదు. దీంతో ఈ అగ్రిమెంటును కంపెనీవారు ఒప్పుకోలేదు.
మావగారింట్లో బంటులా చేరి ఒంటెలా తయారయ్యాడు తాయార్రావు. మామగారు జరిగిపోయారు. అయినా అగ్రిమెంటు మీద తానే రెండు సంతకాలు పెట్టి, రశీదులు రాసి, పాన్ కార్డు వాడుతున్నాడు సదరు మంచి అల్లుడు.
తప్పుడు సమాచారంతో అగ్రిమెంటు బనాయించాడు బాబూరావు. అసలు ఆ ఇల్లు లేదు. అద్దె లేదు.. ఓనరు లేడు .. వ్యవహారం లేదు. అద్దె మాత్రం ఏడాది మొత్తం మీద రూ.1,00,000 దాటకుండా మేనేజ్ చేస్తున్నాడు.
అద్దె ఇంటి అగ్రిమెంట్లలో తప్పులు.. సమాచారం తప్పు.. తేదీలు తప్పు.. అమౌంటు తప్పు.. రెన్యువల్ జరగదు. బ్యాంకులో జమకి, వ్యవహారంలో మొత్తానికి పొంతనే లేదు. అన్నీ తేడానే. ఏ సమాచారంలో నిజమెంతో సరిపోలదు. పేమెంట్ చేసినట్లు ప్రూఫ్‌లు చూపించడం లేదు. ఇలా చేయడమూ తప్పే.
కొడుకు ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటున్నారు. తండ్రి కొడుక్కి అద్దె ఇస్తున్నట్లు కాగితాలు సృష్టించారు. నిజానికి ఏ వ్యవహారం లేదు.
ఇలాగే విదేశాల్లోని పిల్లల పేరు మీద ఆస్తులుంటాయి. అగ్రిమెంట్లు, తల్లిదండ్రుల పేరు మీద ఎడాపెడా ఎంటర్ అవుతున్నాయి. ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం వారి అకౌంట్లలో పడుతోంది. అయినా వారు అకౌంట్లలో చూపించడం లేదు .. పోనీ పిల్లల అకౌంట్లలోనూ చూపించడం లేదు. ‘అక్కడ ఏమీ వద్దని’ ఆ పిల్లలు చెప్పడం.. వారి మాటను పెద్దలు జవదాటని వైనం. ఎంత రిస్కో చూడండి.
హైదరాబాదులో సొంతిల్లు. అందులో ఉండటం.. అద్దె ఇచ్చినట్లు దొంగ రశీదులు ఇవ్వడం.. అమ్మ పేరు మీదో .. ఆలి పేరు మీదో దొంగ రశీదు.
చిన్న చిన్న ఊళ్లలో ఎక్కువ అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు.
సగం బ్యాంకు ద్వారా ఇవ్వడం, సగం నగదు ఇవ్వడం వల్ల బ్యాంకు వ్యవహారానికి మాత్రమే క్లెయిం చేసుకోగలరు.
తనకెన్ని ఇళ్లు ఉన్నాయో తనకే తెలియదు ఒక ఓనరుకు. అంతా నగదు వసూళ్లే. ఎవరికీ రసీదు ఇవ్వరు. తన పాన్ కార్డు కాపీ ఇవ్వరు.
ఇదీ చదవండి: మహిళకూ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్
ఇలా ఎందరో ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. ఏ పొరపాటు చేయకపోవడమే ప్లానింగ్‌లో ముఖ్యమైనది. భయపెట్టడమని కాదు. కానీ ఒక చేదు నిజం ఏమిటంటే దాదాపు 90,000 మంది అసెస్సీలతో రూ.వెయ్యి కోట్ల మినహాయింపును విత్‌డ్రా చేయించి మరీ వారితో పన్ను కట్టించారు. యజమానులు, సంస్థలు జాగ్రత్తగా ఉండాలని హితవు చెబుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది డిపార్టుమెంటు. మనమూ జాగ్రత్తపడదాం.
- కే.సీ.హెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి
కె.వి.ఎన్.లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment