Hra
-
ఇంటి అద్దె క్లెయిమ్ విధానంలో ఈ పొరపాట్లు వద్దు..
సాధారణంగా పన్ను క్లెయిమ్ చేసే విధానంలో ఎక్కువ మంది చేసే పొరపాట్లు కొన్ని కావాలని.. కొన్ని తెలియక చేసేవి ఉంటాయి. తప్పుడు క్లెయిమ్ చేసే వారికి ఆదాయపు పన్ను శాఖవారు నోటీసులు ఇస్తున్నారు. వివరాలు అడుగుతున్నారు. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టం’ అని సీబీడీటీ వారు అంటున్నప్పటికీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఈ కింద ఉదహరించిన కేసులన్నీ మీకు ఇబ్బంది కలిగించేవే. క్లెయిం రిజెక్షన్‌కు గురై పన్ను భారాన్ని పెంచేవి.. పెంచినవి కింద ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త వహించండి. ఈ పొరపాట్లు చేయకపోవడమే మీ ప్లానింగ్‌కి కీలకంగా ఉంటుంది.కామేశ్వర్రావుగారు ఠంచనుగా ప్రతి నెలా రెంట్ పే చేస్తారు. బ్యాంకు అకౌంటులో ఖర్చు కనిపిస్తుంది. అయితే, ఓనర్ గారు ఇండియాలో లేరు. అమెరికాలో స్థిరనివాసం. ఆయన గారికి ఈ ఇంటికి వచ్చి చూసేటంత టైం లేదు.. ఓపికా లేదు. ఇద్దరు మంచివారే. ‘అవసరం లేదు’ అనుకున్నారు అగ్రిమెంటు గురించి. ఏ కాగితాలు లేవు. అగ్రిమెంటు లేదు. సంతకాలూ లేవు. దీంతో ఇంటద్దె అలవెన్సు క్లెయిమ్ చేయడానికి వీల్లేని పరిస్థితి.వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మోతుబరి రైతు వామనరావుకు హైదరాబాద్‌లో లంకంత ఇల్లు ఉంది. దాన్ని అద్దెకిచ్చాడు. కానీ అగ్రిమెంటు రాయలేదు. బ్యాంకు చెల్లింపులు తీసుకోడు. అంతా నగదే. పిల్లల చదువుకని ఆ ఇంట్లోనే ఉంటున్నాడు విద్యాధర రావు. ఆయనకీ ఇంటద్దె అలవెన్స్ క్లెయమ్ చేయడానికి కాగితాలు లేవు.ముందు జాగ్రత్తగా అగ్రిమెంటు రాసుకున్నాడు వాసుదేవరావు. కానీ ఆస్తేమో ఓనరు పేరు మీద.. అగ్రిమెంటేమో భార్య వసుంధర పేరు మీద.. మ్యుటేషన్ జరగలేదు. దీంతో ఈ అగ్రిమెంటును కంపెనీవారు ఒప్పుకోలేదు.మావగారింట్లో బంటులా చేరి ఒంటెలా తయారయ్యాడు తాయార్రావు. మామగారు జరిగిపోయారు. అయినా అగ్రిమెంటు మీద తానే రెండు సంతకాలు పెట్టి, రశీదులు రాసి, పాన్ కార్డు వాడుతున్నాడు సదరు మంచి అల్లుడు.తప్పుడు సమాచారంతో అగ్రిమెంటు బనాయించాడు బాబూరావు. అసలు ఆ ఇల్లు లేదు. అద్దె లేదు.. ఓనరు లేడు .. వ్యవహారం లేదు. అద్దె మాత్రం ఏడాది మొత్తం మీద రూ.1,00,000 దాటకుండా మేనేజ్ చేస్తున్నాడు.అద్దె ఇంటి అగ్రిమెంట్లలో తప్పులు.. సమాచారం తప్పు.. తేదీలు తప్పు.. అమౌంటు తప్పు.. రెన్యువల్ జరగదు. బ్యాంకులో జమకి, వ్యవహారంలో మొత్తానికి పొంతనే లేదు. అన్నీ తేడానే. ఏ సమాచారంలో నిజమెంతో సరిపోలదు. పేమెంట్ చేసినట్లు ప్రూఫ్‌లు చూపించడం లేదు. ఇలా చేయడమూ తప్పే.కొడుకు ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటున్నారు. తండ్రి కొడుక్కి అద్దె ఇస్తున్నట్లు కాగితాలు సృష్టించారు. నిజానికి ఏ వ్యవహారం లేదు.ఇలాగే విదేశాల్లోని పిల్లల పేరు మీద ఆస్తులుంటాయి. అగ్రిమెంట్లు, తల్లిదండ్రుల పేరు మీద ఎడాపెడా ఎంటర్ అవుతున్నాయి. ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం వారి అకౌంట్లలో పడుతోంది. అయినా వారు అకౌంట్లలో చూపించడం లేదు .. పోనీ పిల్లల అకౌంట్లలోనూ చూపించడం లేదు. ‘అక్కడ ఏమీ వద్దని’ ఆ పిల్లలు చెప్పడం.. వారి మాటను పెద్దలు జవదాటని వైనం. ఎంత రిస్కో చూడండి.హైదరాబాదులో సొంతిల్లు. అందులో ఉండటం.. అద్దె ఇచ్చినట్లు దొంగ రశీదులు ఇవ్వడం.. అమ్మ పేరు మీదో .. ఆలి పేరు మీదో దొంగ రశీదు.చిన్న చిన్న ఊళ్లలో ఎక్కువ అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు.సగం బ్యాంకు ద్వారా ఇవ్వడం, సగం నగదు ఇవ్వడం వల్ల బ్యాంకు వ్యవహారానికి మాత్రమే క్లెయిం చేసుకోగలరు.తనకెన్ని ఇళ్లు ఉన్నాయో తనకే తెలియదు ఒక ఓనరుకు. అంతా నగదు వసూళ్లే. ఎవరికీ రసీదు ఇవ్వరు. తన పాన్ కార్డు కాపీ ఇవ్వరు.ఇదీ చదవండి: మహిళకూ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్ఇలా ఎందరో ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. ఏ పొరపాటు చేయకపోవడమే ప్లానింగ్‌లో ముఖ్యమైనది. భయపెట్టడమని కాదు. కానీ ఒక చేదు నిజం ఏమిటంటే దాదాపు 90,000 మంది అసెస్సీలతో రూ.వెయ్యి కోట్ల మినహాయింపును విత్‌డ్రా చేయించి మరీ వారితో పన్ను కట్టించారు. యజమానులు, సంస్థలు జాగ్రత్తగా ఉండాలని హితవు చెబుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది డిపార్టుమెంటు. మనమూ జాగ్రత్తపడదాం.- కే.సీ.హెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తికె.వి.ఎన్.లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. ఇటీవల కేంద్రం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ 4శాతం పెంచింది. అయితే తాజాగా హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) వంటి నిర్దిష్ట అలవెన్సులు సవరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ప్రకారం..త్వరలో హెచ్ఆర్ఏ పెంపుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నట్లు తెలుస్తోంది.దీంతో డీఏ 50శాతానికి చేరినందున హెచ్ఆర్ఏ పెంపును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా? ఒకే వేళ విడుదల చేస్తే హెచ్ఆర్ఏలో ఎంత పెంపు ఉంటుందా? అని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతానికి చేరినందున హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుంది? హెచ్ఆర్ఏ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నివాసం ఉండే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. హెచ్ఆర్ఏ గణన కోసం జనాభా లెక్కలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా నగరాలను టైప్ ఎక్స్, వై, జెడ్‌గా వర్గీకరించబడ్డాయి. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జులై 1, 2017 నుండి ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ రూ.35,000లలో ఎక్స్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 27శాతం = రూ. 9,450 వై కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 18శాతం అంటే = రూ. 6,300 జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లో 9శాతం అంటే = రూ. 3,150 దీన్ని బట్టి 7వ పే కమీషన్ డీఏ 50శాతానికి చేరుకున్నప్పుడు ఉద్యోగికి చెల్లించే బేసిక్ పేలో ఎక్స్ కేటగిరీ నగరాల ఉద్యోగులకు 30 శాతం, వై కేటగిరీ నగరాల ఉద్యోగులకు 20 శాతం, వై కేటగిరీ నగరాల ఉద్యోగులకు 10 శాతంతో హెచ్ఆర్ఏ రేట్లు సవరించాలని సిఫార్సు చేసింది. దీన్ని బట్టి ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హెచ్ఆర్ఏకి ఎక్స్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 30శాతం అంటే = రూ. 10,500 వై కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 20శాతం అంటే = రూ. 7,000 జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లో 10శాతం = రూ. 3,500 లు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు: హెచ్ఆర్ఏ సవరణకు సంబంధించి కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏలో ఈ సవరణను ప్రస్తావిస్తూ కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా అన్న ప్రశ్నలకు ఆర్ధిక నిపుణులు మాట్లాడుతూ.. జూలై 7, 2017 నాటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండం ప్రకారం డీఏ 50శాతం దాటిన తర్వాత హెచ్ఆర్ఏకి సంబంధించి స్పష్టమైన సూచనలు ఉన్నాయి. అందువల్ల, మరొక నోటిఫికేషన్ అవసరం లేదని, ఈ నోటిఫికేషన్ నేరుగా అమలు చేస్తుందని చెబుతున్నారు. -
ఆ జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు 16 శాతం హెచ్ఆర్ఏ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల కేంద్రాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యాన్ని (హెచ్ఆర్ఏ) 16 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనాభా నిబంధనల మేరకు కొన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు 12 శాతమే ఇంటి అద్దె భత్యం వస్తోంది. అయితే ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు జనాభా నిబంధనలను ప్రభుత్వం సడలించింది. 12 శాతం ఇంటి అద్దె భత్యాన్ని 16 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపుదల వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జనాభా నిబంధనల మేరకు కొత్త జిల్లాల కేంద్రాలైన పార్వతీపురం, పాడేరు, అమలాపురం, భీమవరం, బాపట్ల, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటిల్లో పనిచేసే ఉద్యోగులకు 12 శాతం ఇంటి అద్దె భత్యాన్ని మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని 16 శాతానికి పెంచారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు ఒకేలా 16 శాతం ఇంటి అద్దె భత్యం అందుతుంది. పీఎస్టీయూ హర్షం రాష్ట్రంలో కొత్త జిల్లాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 12 శాతం నుంచి 16 శాతానికి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పెంచడంపై ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (పీఎస్టీయూ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏసీవీ గురువారెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఒక్కొక్కటిగా తమ డిమాండ్లను పరిష్కరిస్తుండడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. డీఏ బకాయిలు, ఆర్జిత సెలవులకు నగదు చెల్లింపు డిమాండ్లను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని వారు కోరారు. సీఎం జగన్‌కు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కృతజ్ఞతలు తమ సంఘం అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం 16 శాతం హెచ్ఆర్ఏను పెంచడంపై ఏపీ ఎన్జీవో అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. హెచ్ఆర్ఏను పెంచిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే తమకు ఇచ్చిన హామీ ప్రకారం అందరి ఉద్యోగులతోపాటు పోలీసు సిబ్బందికి కూడా సరెండర్ లీవులను మే నెలాఖరున వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. పీఆర్సీ, డీఏ ఎరియర్స్‌ను సెప్టెంబర్‌లోగా ఇవ్వాలని విన్నవించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. -
ఏపీ: ప్రభుత్వ ఉద్యోగుల HRA పెంచుతూ ఉత్తర్వులు
-
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. హెచ్ఆర్ఏ పెంపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తించనుంది. ఇక, హెచ్ఆర్ఏను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు పెంపు వర్తించనుంది. ఇది కూడా చదవండి: వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవో విడుదల
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా...!
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి కేంద్రం తీపికబురును అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాన్ని 17 శాతం నుంచి 28 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. డీఎ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. సుమారు 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరొ బొనాంజాను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పెరిగిన హెచ్ఆర్ఏ రేట్లను 2021 ఆగస్టు 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నివసించే ప్రాంతాల ప్రకారం హెచ్ఆర్ఏ పెంపు ఉండనుంది. హెచ్ఆర్ఏ పెంపులో భాగంగా మూడు రకాల కేటగిరీ ప్రాంతాలను కేంద్రం ప్రకటించింది. ‘ఎక్స్’ కేటగిరీ నగరాల్లో నివసించేవారికి, పెంపు 27 శాతం ఉంటుంది. ‘వై’, ‘జెడ్’ నగరాల్లో నివాసితులకు వరుసగా 18 శాతం, 9 శాతం హెచ్ఆర్ఏ పెంపును నిర్ణయించింది. డీఏ 50 శాతం దాటినప్పుడు, హెచ్ఆర్ఏ రేట్లు వరుసగా 30%, 20% , 10% కు సవరించబడతాయి. X, Y, Z నగరాల వర్గాలు X కేటగిరి నగరాలు 50 లక్షలకు పైగా జనాభా ఉన్నవి. Y కేటగిరి నగరాలు 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నవి Z కేటగిరి ఐదు లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్నవి అంతకుముందు X, Y, Z నగరాల్లో వరుసగా 24 శాతం, 16 శాతం, 8 శాతం హెచ్ఆర్ఏ ఉండేది. -
ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏలో కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రస్తుతమున్న ఇంటి అద్దె అలవెన్సు (హెచ్ఆర్ఏ)లో కోత పడింది. కేంద్ర ప్రభుత్వ 7వ వేతన సవరణ సంఘం జనాభా ప్రతిపాదిక రూపొందించిన హెచ్ఆర్ఏ ప్రామాణికతనే.. సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని రాష్ట్ర తొలి వేతన సవరణ కమిషన్ కూడా సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటినే ఆమోదించింది. ఇందులో హెచ్ఆర్ఏ శాతాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులకు అందే ఫిట్మెంట్ ప్రయోజనాలు ఆ మేర తగ్గనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగులకు నష్టం ఎక్కువగా ఉండనుంది. స్పష్టతతో ఉత్తర్వులు: ఉద్యోగులకు కేవలం ఏడు శాతం ఫిట్‌మెంట్‌ను తెలంగాణ తొలి పీఆర్సీ సిఫార్సు చేయగా.. సీఎం కేసీఆర్ దానిని 30 శాతానికి పెంచడం, కేబినెట్ ఆమోదించడం తెలిసిందే. కానీ పీఆర్సీలో హెచ్ఆర్ఏ తగ్గింపు వద్దని, ప్రస్తుతమున్నట్టుగానే కొనసాగించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఫలితం రాలేదు. తాజాగా ఎక్కడెక్కడ ఉద్యోగులకు ఎంత హెచ్ఆర్ఏ లభిస్తుందన్న అంశంపై స్పష్టతనిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరువు భత్యం (డీఏ) 50శాతం దాటితే.. ఈ హెచ్ఆర్ఏ శాతాన్ని కూడా పెంచనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అంటే 24 నుంచి 27 శాతానికి, 17 నుంచి 18.5 శాతానికి , 13 నుంచి 14 శాతానికి, 11 నుంచి 11.5 శాతానికి పెరుగుతాయని వివరించింది. ఎక్కడెక్కడ ఎంత హెచ్ఆర్ఏ? ►50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి+ దానికి ఎనిమిది కిలోమీటర్ల పరిధి లోపల 24% హెచ్ఆర్ఏ అమలు చేస్తారు. (ఇక్కడ ఇప్పటివరకు 30 శాతంగా ఉంది) ►రెండు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు.. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్‌లలో 17 శాతం హెచ్ఆర్ఏ ఇస్తారు. (వీటిలో ఇప్పటివరకు 20 శాతంగా ఉంది) ►యాభై వేల నుంచి రెండు లక్షల మధ్య జనాభా ఉన్న పెద్ద పట్టణాలు/మున్సిపాలిటీలు: ఆదిలాబాద్, కాగజ్‌నగర్, నిర్మల్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిద్దిపే ట, జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, తాం డూరు, వనపర్తి, గద్వాల, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, జనగాం, కొత్తగూడెం, పాల్వంచ, జూలపల్లి, బాదేపల్లి, నస్పూర్, షాద్‌నగర్‌లలో 13 శాతం ఇస్తారు. (వీటిల్లో ఇప్పటివరకు 14.5 శాతంగా ఉంది) ►యాభై వేల లోపు జనాభా ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాలు.. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నారాయణపేట, మెదక్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, షామీర్పేట, శంషాబాద్‌లలో 13 శాతం అమలు చేస్తారు. (ఇక్కడ ఇప్పటివరకు 14.5 శాతంగా ఉంది) ►50 వేలకన్నా తక్కువ జనాభా ఉన్న మండలాలు, గ్రామాల్లో 11 శాతం ఇస్తారు. (ఇక్కడ ఇప్పటివరకు 12 శాతంగా ఉంది) ఎంత వచ్చేది.. ఎంత వస్తుంది? రూ. 19 వేల మూత వేతనం ఉన్న ఉద్యోగిని ఉదాహరణగా తీసుకుని చూస్తే.. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఎంత హెచ్ఆర్ఏ వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుందనే వివరాలివీ.. ప్రాంతం ఇంతకుముందు ప్రస్తుతం జీహెచ్ఎంసీ+ 5,700 4,569 పెద్ద పట్టణాలు 3,800 3,230 చిన్న పట్టణాలు 2,755 2,470 గ్రామీణ ప్రాంతాలు 2,280 2,090 -
ఇంటి నుంచి పనిచేసినా పన్ను పడుద్ది!
ఒకప్పుడు ఏ కొద్ది మందికో వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే ఉద్యోగ విధులు) భాగ్యం ఉండేది. కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం అన్నది ఐటీ ఉద్యోగులకు పరిచయమే. కానీ, కరోనా మహమ్మారి వచ్చి.. ఎక్కువ మంది ఇంటి నుంచే పనిచేసుకునేలా చేసింది. తప్పనిసరైన ఏ కొద్ది మందో తప్పించి మిగిలినవారు ప్రస్తుతానికి ఈ విధానంలోనే కొనసాగుతున్నారు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉద్యోగుల జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. అత్యాధునిక టెక్నాలజీలు, ఇంటర్నెట్ సదుపాయాల విస్తరణ ఇందుకు అనుకూలిస్తున్నాయి కూడా. కానీ, నాణేనికి రెండో కోణం కూడా ఉన్నట్టే.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను అధిగమించడమే కాదు.. పన్ను పరమైన అంశాలను కూడా ఉద్యోగులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యాలయాలకు వెళ్లి పనిచేయడం వల్ల తీసుకుంటున్న కొన్ని రకాల అలవెన్స్‌లు ఇంటి నుంచి చేయడం కారణంగా పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ విషయమై ఆదాయపన్ను శాఖ నుంచి ప్రత్యేక మినహాయింపులు, వివరణలు వస్తే తప్ప పన్ను చెల్లింపుల బాధ్యత ఉద్యోగులపై ఉంటుంది. ఈ అంశాల గురించి తెలియజేసే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. ప్రస్తుతమున్న ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం.. పనిచేసే సంస్థ నుంచి ఉద్యోగి అందుకుంటున్న వేతనం, అలవెన్స్‌లు (మినహాయింపుల్లో ఉన్నవి కాకుండా) పన్ను పరిధిలోకే వస్తాయి. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) అన్నవి నిర్దేశిత పరిమితుల వరకు పన్ను మినహాయింపు కలిగినవి. కానీ, బయటకు వెళితే కరోనా రిస్క్ ఉంటుందన్న కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్నప్పుడు.. పర్యటనలకు వెళ్లే అవకాశాలు తక్కువ. ఇంటి నుంచి కార్యాలయానికి రోజువారీ రవాణా కూడా తక్కువగానే ఉంటుంది. మరి వీటికి సంబంధించి ఇస్తున్న అలవెన్స్‌లను ఖర్చు చేసే పరిస్థితి లేప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. మినహాయింపులపై ప్రభావం.. వేతనంలో హెచ్ఆర్ఏ ఒక భాగం. ఉద్యోగులు అద్దె ఇంట్లో ఉంటూ.. అద్దె చెల్లింపులు చేస్తున్నట్టయితే నిర్దేశిత పరిమితి మేరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వేతనంలో నిర్ణీత శాతం, వాస్తవంగా తీసుకున్న హెచ్ఆర్ఏ, వాస్తవంగా చెల్లించిన అద్దె వీటిల్లో ఏది తక్కువ అయితే దానిని మినహాయింపుగా చూపించుకోవచ్చు. మెట్రోల్లో నివసించే వారికి మూల వేతనంలో 50 శాతం, ఇతర పట్టణాల్లో ఉంటున్నట్టు అయితే మూల వేతనంలో 40 శాతాన్ని క్లెయిమ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. కరోనా కారణంగా చాలా మంది నగరాలు, పట్టణాల్లో అద్దె ఇళ్లను ఖాళీ చేసి సొంత గ్రామాలకు ప్రయాణమయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించడంతో.. వారికి ఈ వెసులుబాటు లభించింది. దీనివల్ల అనవసర ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కాస్తంత రక్షణ ఉంటుందన్న అభిప్రాయం వారిది. సొంత ఇల్లు... హెచ్ఆర్ఏ! కొందరు ఇప్పటి వరకు ఉంటున్న అద్దె ఇళ్ల నుంచి తక్కువ అద్దె ఇళ్లలోకి మారుతున్నారు. హెచ్ఆర్ఏ తీసుకుంటూ అద్దె ఇంట్లో ఉండని వారు కచ్చితంగా ఆ మొత్తంపై పన్ను చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు చెల్లించిన అద్దెతో పోలిస్తే తక్కువ అద్దెకు మారిన వారిపైనా పన్ను భారం ఆ మేరకు పడుతుంది. అలాగే, తమ నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చుకున్న వారి విషయంలోనూ నిబంధనలు మారిపోతాయి. ఎందుకంటే మెట్రో నగరాల్లో, పట్టణాల్లో నివసిస్తున్న వారికి మినహాయింపుల పరంగా స్వల్ప వ్యత్యాసం ఉందన్న విషయాన్ని గమనించాలి. ట్రూఅప్ౖపై దృష్టి... ఆర్థిక సంవత్సరం ప్రారంభం లోనే (ఏప్రిల్) ఉద్యోగులు తమ పెట్టుబడులు, ట్యూషన్ ఫీజుల అంచనాలు, ఇంటి అద్దె చెల్లింపుల వివరాలను పనిచేస్తున్న సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే సంబంధిత సంవత్సరంలో ఉద్యోగి పన్ను బాధ్యతను కంపెనీ నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా పన్ను మొత్తాన్ని నెలవాయిదాల రూపంలో వేతనం నుంచి మినహాయించి ఆదాయపన్ను శాఖకు కంపెనీలు చెల్లింపులు చేస్తాయి. ఆర్థిక సంవత్సరం మొదట్లో ఉద్యోగి సమర్పించిన డిక్లరేషన్.. అదే విధంగా ఆర్థిక సంవత్సరం చివర్లో (జనవరి తర్వాత) ఉద్యోగి ఇచ్చే తుది డిక్లరేషన్, డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత అదనంగా పన్ను వసూలైందా లేక తక్కువ పన్ను వసూలైందా అన్న నిర్ధారణకు వస్తాయి. దీన్నే ట్రూఅప్‌గా పేర్కొంటారు. కనుక ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఇచ్చిన వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఉద్యోగి తప్పకుండా సంస్థకు తెలియజేయాలి. ఉదాహరణకు ఇంటి అద్దెలో మార్పులు జరిగినా లేక నివాసిత ప్రాంతం మారిపోయినా చెప్పాల్సి ఉంటుంది. దీనివల్ల ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో పన్ను వసూలు పరంగా మార్పులు, చేర్పులకు వీలు కలుగుతుంది. ఎల్‌టీఏ... ప్రయోజనం పోయినట్లే! ఎల్‌టీఏ విషయంలో నాలుగు సంవత్సరాలను ఒక బ్లాక్‌గా పరిగణి స్తారు. ఒక బ్లాక్ కాలంలో రెండు పర్యటనల కోసం వాస్తవంగా చేసిన ఖర్చుకు పన్ను మినహాయింపును కోరొచ్చు. ప్రస్తుత బ్లాక్ 2018–2021గా అమల్లో ఉంది. ఎల్‌టీఏ మినహాయింపును ఒక బ్లాక్‌లో వినియోగించుకోని పరిస్థితుల్లో తదుపరి బ్లాక్‌కు దాన్ని బదలాయించుకోవచ్చు. కాకపోతే తదుపరి బ్లాక్‌లో మొదటి సంవ్సరంలోనే దీన్ని వినియోగించుకోవాలి. అయినప్పటికీ.. ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటనల పట్ల ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు, కరోనా ఎప్పుడు సమసిపోతుందో తెలియని పరిస్థితుల్లో.. సమీప కాలానికీ పర్యటనల ప్రణాళికలు పెట్టుకోవడం లేదు. దీంతో కొందరు ఉద్యోగులు ఎల్‌టీఏ అలవెన్స్‌పై పన్ను చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా.. అనువైన టేబుల్స్, కుర్చీల ఏర్పాటు, కరెంటు, ఇంటర్నెట్ వినియోగం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్స్‌ల రూపంలో మద్దతుగా నిలుస్తున్నాయి. కానీ, ఇటువంటి ప్రోత్సాహకాల గురించి ఆదాయపన్ను చట్టంలో స్పష్టంగా ఇప్పటి వరకు అయితే నిర్దేశించలేదు. కనుక ఈ విధమైన అలవెన్స్‌లు కూడా పన్ను పరిధిలోకే వస్తాయి. -
సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!
సొంతిల్లు చాలా మంది స్వప్నం. సొంతింటితో పెనవేసుకున్న జ్ఞాపకాలను మధురంగా పరిగణించే వారు ఎందరో... అయితే, ఎంతో ఖర్చు చేసి కొన్న ఇంటిలో నివాసం ఉండేవారు కొందరు అయితే... అద్దెకు ఇచ్చేవారు కూడా కొందరు ఉంటారు. సొంతంగా నివాసం ఉండేవారు, అద్దెకు ఇచ్చిన వారిపై ఆదాయపన్ను చట్టం కింద పలు బాధ్యతలు ఉన్నాయి. వాటిని తప్పక తెలుసుకోవాలి. సొంతిల్లు ఉండి, ఉద్యోగ సంస్థ నుంచి హెచ్ఆర్ఏ పొందుతూ పన్ను మినహాయింపు పొందడం కుదరదు. రెండుకు మించిన ఇళ్లను సొంత వినియోగంలో ఉంచుకున్నా కానీ దానిపై అద్దె వస్తున్నట్టుగానే చట్టం పరిగణిస్తుంది. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల మేరకు ఇంటి చుట్టూ ముడిపడిన పన్నుల అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నదే ఈ కథనం ఉద్దేశం. ఇంటిని కొంటుంటే...? మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంటే... సంబంధిత లావాదేవీ పన్ను అధికారుల దృష్టికి వెళుతుందని గ్రహించాలి. ఇంటి కొనుగోలుపై మీరు చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును పొందే అవకాశం అందుబాటులో ఉంది. అంతేకాదు, ఇంటి కొనుగోలుతో ఓ వ్యక్తి పన్నుల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఒకవేళ బహుమతిగా తీసుకుంటుంటే మాత్రం ఆ ఇంటి విలువ మీ ఆదాయంలోనే కలుస్తుందని గుర్తుంచుకోవాలి. దానిపై పన్ను కూడా చెల్లించాల్సి రావచ్చు. కొనుగోలుపై టీడీఎస్ ఇంటి కొనుగోలు విలువ రూ.50 లక్షలు, అంతకుమించి ఉంటే విక్రయదారుకు నిర్ణీత విలువ చెల్లించడానికి ముందుగానే, దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఈ టీడీఎస్‌ను ఎన్ ఎస్డీఎల్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫామ్ 26బిక్యూ ను ఫిల్ చేసి, కొనుగోలుదారు పాన్ , విక్రయదారు పాన్ వివరాలు ఇచ్చి చెల్లించాలి. లావాదేవీ జరిగిన నెల చివరి నుంచి 30 రోజుల్లోపు టీడీఎస్‌ను చెల్లించా ల్సి ఉంటుంది. అంతేకాదు మీకు విక్రయించిన వ్యక్తి కి టీడీఎస్ సర్టిఫికెట్ (ఫామ్ 16)ను ఇవ్వాలి. ట్రేసెస్ వెబ్సైట్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత సమయంలోపు టీడీఎస్‌ను డిపాజిట్ చేయకపోతే, అప్పుడు 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ చార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఎన్ ఆర్ఐ నుంచి ఇంటిని కొనుగోలు చేస్తుంటే, అప్పుడు ఇంటి విలువ ఎంత ఉన్నా గానీ దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకుని చెల్లింపులు చేయాలి. అయితే, ఈ టీడీఎస్‌ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది. బహుమతి అయితే పన్ను పడుద్ది మీ బంధువు లేదా స్నేహితులు మీకు ఇంటిని బహుమతిగా ఇస్తే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. బహుమతి విలువ రూ.50,000 దాటితే గిఫ్ట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. స్టాంప్ డ్యూటీ విలువను మీ ఆదాయంలో ఇతర మూలాల (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) నుంచి వచ్చినట్టు చూపించాలి. ఆదాయపన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రతీ నిబంధనలోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయని తెలుసు కదా. అలాగే, గిఫ్ట్ ట్యాక్స్‌లోనూ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఒకవేళ ఇంటిని మీ వివాహ సందర్భంలో బహుమతిగా పొందుతుంటే లేదా వీలునామా కింద మీకు దక్కుతున్నా లేదా వారసత్వంగా లేదా కొన్ని ప్రత్యేకంగా పేర్కొన్న ఇనిస్టిట్యూషన్ల నుంచి తీసుకుంటున్నా దానిపై పన్ను చెల్లించక్కర్లేదని చట్టం చెబుతోంది. ఇక అత్యంత సమీప బంధువుల నుంచి గిఫ్ట్‌గా తీసుకున్నా పన్ను భారం ఉండదు. ఈ పరిధిలోకి జీవిత భాగస్వామి, మీ సోదరులు, సోదరీమణులు లేక సంతానం, అలాగే మీ భార్య సోదరులు, సోదరీమణులు, తల్లిదండ్రులు వస్తారు. స్టాంప్ డ్యూటీపై పన్ను మినహాయింపు ఇంటిని కొనే సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుముల భారం భరించక తప్పదు. ఇవన్నీ కలసి ప్రాపర్టీ కొనుగోలు విలువలో గరిష్టంగా 10 శాతం వరకూ ఉంటుంటాయి. అయితే దీనిపై ఆదాయపన్ను చట్టం కింద కొంత వెసులుబాటు పొందే అవకాశం ఉంది. ఈ చార్జీలను సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందేందుకు ఆదాయపన్ను చట్టం అనుమతిస్తోంది. కానీ, ఇక్కడే ఓ చిన్న తిరకాసు కూడా ఉంది. ఒకవేళ మీరు కొన్న ఇంటిపై ఈ చార్జీలను సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొంది, ఐదేళ్లు పూర్తి కాకముందే సంబంధిత ఇంటిని విక్రయిస్తే... గతంలో పొందిన మినహాయింపు మొత్తాన్ని తిరిగి మీ ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుందని మరవొద్దు. ఇంటిపై పెట్టుబడితో తగ్గనున్న పన్ను దీర్ఘకాల పెట్టుబడుల రూపంలో ఉన్న బంగారం లేదా ఈక్విటీ షేర్లు లేదా రియల్ ఎస్టేట్ లేదా ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తంతో తిరిగి ఇంటిని కొనుగోలు చేస్తే... క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ భారం తగ్గుతుంది. నూతనంగా సమకూర్చుకున్న మొదటి ఇల్లు... దీర్ఘకాలిక పెట్టుబడులను విక్రయించడానికి ఏడాది ముందు లేదా తర్వాత రెండేళ్లలోపు సమకూర్చుకున్నప్పుడే ఈ ప్రయోజనం సిద్ధిస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ దీర్ఘకాల పెట్టుబడుల విక్రయం ద్వారా పొందిన మూలధన లాభాల మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం రిటర్నులు ఫైల్ చేసే గడువు నాటికి నూతన ఇంటిపై ఇన్వెస్ట్ చేయకపోతే, అదే సమయంలో చట్టంలో ఇచ్చిన గడువు లోపు నూతన ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు అయితే... అప్పుడు ఆ మొత్తాన్ని పన్ను మినహాయింపు కోసం నిర్దేశిత బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్‌కు బదలాయించాల్సి ఉంటుంది. దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను మినహాయింపును తిరిగి ఒక ఇంటి కొనుగోలుకే పరిమితం అన్నది ప్రస్తుత నిబంధన కాగా, దీన్ని కేంద్రం సడలించి 2020 ఏప్రిల్ 1 నుంచి రెండు ఇళ్ల కొనుగోలుకూ వర్తింపజేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటి విక్రయంపై రూ.2 కోట్లు దాటకుండా వచ్చిన మూలధన లాభాల మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండు ఇళ్ల కొనుగోలుపై ఇన్వెస్ట్ చేసినా గానీ పన్ను భారం నుంచి ఊపిరి పీల్చుకోవచ్చన్న విషయం ఇక్కడ గమనార్హం. ఇంటి యజమాని అయితే... ఓ ఇంటికి యజమాని అయితే ఇందుకు సంబంధించి నిబంధనలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. సొంతంగా నివాసం ఉంటున్న ప్రాపర్టీయా లేక అద్దెకు ఇచ్చారా..? ఒకవేళ అద్దెకు ఇస్తే అద్దె ఆదాయంపై ఇంటి యజమాని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అద్దె ఎవరి చేతికి వెళ్లినా కానీ, ఈ ఇంటి యజమానిగా రికార్డుల్లో ఉన్న వారే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తమ ఇంట్లో తామే నివాసం ఉంటుంటే దాన్ని సెల్ఫ్ ఆక్యుపెయిడ్ ప్రాపర్టీ (ఎస్వోపీ)గా చట్టం పరిగణిస్తోంది. అటువంటి సందర్భాల్లో ఇంటిపై ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎస్వోపీలపై పన్ను ఉండదు. అయితే, సొంత నివాసం కోసం ఉంచుకునే ఇళ్ల విషయంలో ఐటీ చట్టం పరిమితి విధించింది. 2019–20 నుంచి ఒక వ్యక్తి రెండు ఎస్‌వోపీలను కలిగి ఉండొచ్చు. అంటే, మూడో ఇల్లు, అంతకంటే ఎక్కువ ఇళ్లను తమ పేరిట కలిగి ఉండి, వాటిని అద్దెకు ఇచ్చినా, లేక సొంత వినియోగానికి ఉంచుకున్నా గానీ వాటిపై అద్దె అదాయం వస్తున్నట్టుగానే చట్టం పరిగణిస్తుంది. కనుక నోషనల్ రెంట్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇలా మూడు, అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న వారు వాటిల్లో తమ వంతు రెండు ఎస్‌వోపీలు ఏవన్నది ఎంపిక చేసుకునే స్వేచ్చ ఉంటుంది. అంటే ఎక్కువ అద్దె విలువ వచ్చే వాటిని తమ పేరిట ఉన్నట్టు చూపించుకోవచ్చు. పొందొచ్చు. రుణం తీసుకుని కొన్న ఇంటిపై... ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలుపై సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక ఇంటి రుణంపై అసలుతోపాటు ఏటా చేసే వడ్డీ చెల్లింపులకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులకు మినహాయింపు అన్నది... ఆ ఇంటి నిర్మాణం పూర్తయిన ఏడాది లేదా దాన్ని సమకూర్చుకున్న ఏడాదిగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ఒకవేళ రుణాన్ని 1999 ఏప్రిల్ 1కి ముందు తీసుకుని, ఆ రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నాటి నుంచి ఐదేళ్లలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం పూర్తి కాకపోయి ఉంటే... వడ్డీ చెల్లింపులపై గరిష్టంగా రూ.30,000 వరకే పన్ను మిహాయింపు చూపించుకునే పరిమితి విధించారు. ఇక మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. అంటే మొత్తం రూ.2.5 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. నిర్మాణంలో ఉన్న సమయంలో రుణంపై చేసిన వడ్డీ చెల్లింపులకూ మినహాయింపు పొందొచ్చు. రుణం తీసుకున్న నాటి నుంచి నిర్మాణం పూర్తయి లేదా స్వాధీనం చేసుకునే నాటి వరకు చేసిన వడ్డీ చెల్లింపుల మినహాయింపునకు చట్టం అనుమతిస్తోంది. నిర్మాణం పూర్తయి లేదా స్వాధీనం చేసుకున్న సంవత్సరం తర్వాతి నుంచి 5 వాయిదాల్లో ఈ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. హెచ్ఆర్ఏ... పనిచేసే సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు దానిపై ఐటీ మినహాయింపు పొందవచ్చు. 1. సంస్థ నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో పొందిన మొత్తం హెచ్ఆర్ఏ. 2. మెట్రో నగరాల్లో వేతనంలో 50 శాతం, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వారి వేతనంలో 40 శాతం. 3. వాస్తవంగా మీరు చెల్లించిన ఇంటి అద్దె నుంచి... మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని మినహాయించగా వచ్చేది. ఈ మూడింటిలో ఏది తక్కువగా ఉంటే ఆదాయపన్ను చట్టం ప్రకారం దానిపైనే పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు ఉద్యోగి అయి ఉండి, హెచ్ఆర్ఏ పొందుతూ... సొంత ఇంట్లోనే నివాసం ఉంటుంటే అప్పుడు మీరు పొందే హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు తీసుకోవడానికి చట్టం అనుమతించదు. అయితే, దీనికి బదులు మీరు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకున్న రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులకు పైన చెప్పుకున్న మేర పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇక సొంతిల్లు ఉన్నప్పటికీ దాన్ని అద్దెకు ఇచ్చి, మరో ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి విషయంలో... ఇంటి రుణంపై అసలు, వడ్డీ చెల్లింపులకూ, మరో వైపు హెచ్ఆర్ఐపైనా పన్ను మినహాయింపులకు అవకాశం ఉంది. ఉదాహరణకు నోయిడాలో ఇల్లు ఉండి, దాన్ని అద్దెకు ఇచ్చి ఆఫీసుకు దగ్గర్లో ఉంటుందని ఢిల్లీలో నివాసం ఉంటున్నట్టు అయితే అటు ఇంటి రుణంపై చెల్లింపులు, మరోవైపు హెచ్ఆర్ఏపైనా పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది. ఇంటిని విక్రయిస్తుంటే... ఐటీ చట్టం ప్రకారం నివాస భవనం క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తుంది. కనుక ఇంటిని విక్రయించినప్పుడు పొందిన లాభం, నష్టం క్యాపిటల్ గెయిన్ రూపంలో పన్ను పరిధిలోకి వస్తుంది. ఇంటిని కొనుగోలు చేసిన నాటి నుంచి 24 నెలలలోపు విక్రయించినట్టయితే అది స్వల్ప కాల మూలధన లాభం (ఎస్టీసీజీ), 24 నెలలు దాటిన తర్వాత విక్రయించినప్పుడు వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్టీసీజీ)గా చట్టం పరిగణిస్తోంది. ఇంటి విక్రయ సమయంలో అయ్యే వ్యయాలను మూలధన లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. బ్రోకరేజీ, స్టాంప్ పేపర్ చార్జీలను ఇందులో నుంచి తగ్గించుకోవచ్చు. అలాగే, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చు. వీటిని తీసివేయగా మిగిలిన దీర్ఘకాలిక మూలధన లాభంపై 20 శాతం పన్నుకు అదనంగా సర్‌చార్జ్, సెస్సు చెల్లించాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణ సూచీ ప్రభావ ప్రయోజనం, ఎస్టీసీజీకి ఉండదు. ఇంటి విక్రయం రూపంలో వచ్చే ఎస్టీసీజీని ఆ వ్యక్తి సంబంధిత ఆర్థిక సంవత్సరం తన ఆదాయానికి కలిపి తన శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి విక్రయ విలువపైనే మూలధన లాభార్జన ఆధారపడి ఉంటుంది. ఆదాయ పన్ను భారం తగ్గించుకునే ఉద్దేశ్యంతో విక్రయదారులు విక్రయ విలువను తక్కువ చేసి చూపడాన్ని నిరోధించేందుకు ఆదాయపన్ను శాఖ సెక్షన్ 50సీని ప్రవేశపెట్టింది. స్టాంప్ వ్యాల్యూ కంటే 5 శాతానికి మించి తక్కువ చేసి విలువ చూపించినప్పుడు ఈ చట్టం వర్తిస్తుంది. అటువంటి సందర్భాల్లో పన్ను అధికారులు స్టాంప్ వ్యాల్యూషన్ నే పరిగణనలోకి తీసుకుంటారు. మూలధన లాభాలపై పన్ను భారం పడకుండా... మూలధన లాభాల పన్ను చెల్లించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఇంటి విక్రయం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాన్ని పొందిన వారు.. నూతనంగా మరో ఇంటి కొనుగోలుకు వెచ్చించడం లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేదా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేదా పవర్ ఫైనాన్స కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. రూ.50 లక్షల వరకూ మూలధన లాభాన్ని ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంటిని విక్రయించిన తర్వాత ఆరు నెలల్లోపే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఐదేళ్ల తర్వాతే తిరిగి ఆ బాండ్లను రిడీమ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ మీ ఇంటిని వారసత్వంగా మరొకరికి బదలాయించినా లేదా గిఫ్ట్‌గా ఇచ్చినా, అటువంటి సందర్బాల్లో విక్రయం జరిగినట్టుగా చట్టం పరిగణించదు. కనుక దీనిపై మూలధన లాభాల పన్ను ఉండదు. అయితే వారసత్వంగా లేదా బహుమానం రూపంలో పొందిన ఇంటిని, విక్రయించడం ద్వారా మూలధన లాభాలు వస్తే మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వారసత్వంగా లేక బహుమతిగా వచ్చి సందర్భాల్లో పూర్వపు యజమాని సంబంధిత ఆస్తి సమకూర్చుకున్న మొత్తం కొనుగోలు వ్యయంగా చట్టం పరిగణిస్తుంది. స్వల్ప కాల మూలధన లాభం లేక దీర్ఘకాలిక మూలధన లాభమా అన్నది నిర్ధారించేందుకు పూర్వపు యజమాని స్వాధీనంలో ఉన్న కాలాన్ని కూడా ప్రస్తుతం విక్రయించిన యజమాని స్వాధీనంలోని వచ్చిన కాలానికి కలుపుకోవచ్చు. -
పెరగని హెచ్ఆర్ఏ
తెలంగాణలో నూతన జిల్లాల పునర్విభజన జరిగి 15నెలలు గడుస్తున్నా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రం హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె అలవెన్స్)లు పెరగలేదు. ప్రభుత్వం హెచ్ఆర్ఏ జీవో విడుదల చేసి ఏళ్లు గడుస్తున్నా.. పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదంటూ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నూతన జిల్లాల ప్రాతిపదికన హెచ్ఆర్ఏను పెంచి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఆయా జిల్లా కేంద్రాల్లో జనాభాతో నిమిత్తం లేకుండా 20 శాతం పెంచాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. – కరీంనగర్‌ఎడ్యుకేషన్ కరీంనగర్ ఎడ్యుకేషన్: ఆర్పీఎస్ (రివైస్డ్ పేస్కేల్స్) 2015 ప్రకారం హెచ్ఆర్ఏ రేట్లను నిర్ణయిస్తూ ప్రభుత్వం 2015 మార్చి 18న జీవో నెంబర్ 27ను విడుదల చేసింది. 50 లక్షలకు పైగా జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లోని ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 30 శాతంతో గరిష్టంగా రూ.20 వేలు నిర్ణయించారు. 2లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్‌లోని ఉద్యోగులకు 20 శాతంతో గరిష్టంగా రూ.15 వేలుగా నిర్ణయించారు. అదే విధంగా 50 వేల నుంచి 2 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాలైన ఆదిలాబాద్, కాగజ్‌నగర్, నిర్మల్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిద్దిపేట, జహీరాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, తాం డూర్, వనపర్తి, గద్వాల్, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యపేట , భువనగిరి, కోదాడ, జనగామ, పాల్వంచ, కొత్తగూడెం లోని ఉద్యోగులకు 14.5శాతం, గరిష్టంగా రూ.15 వేలు నిర్ణయించారు. రాష్ట్రంలోని జనాభా 50వేలకు తక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు 12 శాతం, గరిష్టం రూ.15 వేలు, నగరాలు, పట్టణాల శివారు ప్రాంతాలు అనగా 8 కిలోమీటర్ల పరిధి మేరకు ఆయా నగరాలు, పట్టణాల హెచ్ఆర్ఏ రేట్లు వర్తిస్తాయని, ఉద్యోగుల మూల వేతనం(బేసిక్‌పే)ను లెక్కిస్తూ హెచ్ఆర్ఏను ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో జనాభా తో నిమిత్తం లేకుండా హెచ్ఆర్ఏ 20 శాతం పెంచాలని ప్రభు త్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచాం: సీఎం
సాక్షి, అమరావతి: అన్నీ వదులుకుని హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్సు (హెచ్ఆర్ఏ) పెంచామని, కుటుంబానికి దూరంగా ఉండే వారికి ఉచిత వసతితో పాటు డిస్పెన్సరీ కూడా ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో మూడో బ్లాక్‌లో ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసులకు 50 శాతం రాయితీతో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించనంత వరకు ఉద్యోగులకు అండగా ఉంటానన్నారు. ఉద్యోగినుల సహా అందరు ఉద్యోగుల ఫిట్నెస్ కోసం జిమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాయితీ క్యాంటీన్లో నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి రూ.20 లక్షలైనా ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, పితాని సత్యనారాయణ, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, ఉద్యోగ సంఘాల నేతలు వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. -
హెచ్ఆర్ఏ ఆధ్వర్యంలో రియల్టర్లకు శిక్షణ శిబిరం
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో జ్ఞాన సముపార్జన, విస్తరణ, వ్యాపార వనరులు, నైపుణ్య శిక్షణాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ) ఇటీవల నగరంలో సర్టిఫైడ్ ప్రాపర్టీ స్పెషలిస్ట్ పేరిట ఒకరోజు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 270 మంది రియల్టీ కన్సల్టెంట్లు, ఏజెంట్లు ఈ శిబిరంలో పాల్గొన్నారని హెచ్ఆర్ఏ ప్రెసిడెంట్ ఏ సుమంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం హెచ్ఆర్ఏలో 130 మంది సభ్యులున్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా (ఎన్‌ఏఆర్–ఇండియా) అనుబంధ సంస్థే ఈ హెచ్ఆర్ఏ. సదాశివపేటలో 300 ఎకరాల్లో లే అవుట్.. తొలిసారిగా నగర శివారు ప్రాంతాల్లో పలు లేఅవుట్లను అభివృద్ధి చేయాలని నిర్ణయిం చాం. సదాశివపేటలో 300 ఎకరాలు, శ్రీశైలం హైవేలో 38 ఎకరాల్లో వెంచర్లను ప్రారంభించనున్నాం. తెలం గాణలో రెరా బిల్లు అమల్లోకి వచ్చాక అందులోని నియమ నిబంధనలను క్షుణ్నంగా అధ్యయనం చేశాకే.. లే అవుట్ అనుమతులు, అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం. గతంలో విశాఖపట్నంలోని మద్దెలపాలెం, తగరపువలసలో 28 ఎకరాల్లో రెండు వెంచర్లను విజయవంతంగా పూర్తి చేశాం. -
త్వరలో ఉద్యోగుల జీతాల పెంపు
భత్యాల పెంపుపై నెలాఖరులోగా కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ ఇతర భత్యాల పెంపును ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయనుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ అంశంపై ఇటీవల యూనియన్ నేతలు ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారని నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్(ఎన్‌జేఏసీ) కన్వీనర్ శివ్ గోపాల్ మిశ్రా చెప్పారు. ఏడో వేతన సంఘం నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ హెచ్ఆర్ఏ ప్రకటించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. భత్యాల పెంపుపై ఏడో వేతన సంఘం సిఫార్సుల్ని పరిశీలించిన అశోక్ లావాసా కమిటీ ఏప్రిల్ 27న నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించింది. అనంతరం ఆ నివేదికను ప్రభుత్వ కార్యదర్శులతో కూడిన సాధికారక కమిటీ పరిశీలించి కేబినెట్ భేటీలో చర్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జస్టిస్ ఏకే మాథుర్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన ఏడో వేతన సంఘం సిఫార్సుల్ని కేంద్రం గతేడాది ఆమోదించింది. -
హెచ్ఆర్ఏ – గృహ రుణం...ఏది బెటర్?
ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాలు కల్పించే సాధనాలు చాలా ఉన్నాయి. హెచ్ఆర్ఏ, హోమ్ లోన్ కూడా ఈ కోవకి చెందినవే. కాకపోతే వివిధ సందర్భాల్లో వీటి ద్వారా చేకూరే ప్రయోజనాల గురించి అవగాహన ఉంటే సరైన ప్రణాళిక వేసుకునేందుకు వీలవుతుంది. అందుకే.. హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ), గృహ రుణాల ద్వారా లభించే ప్రయోజనాల మధ్య తేడాలను ఒకసారి చూద్దాం... ఈ రెండూ ట్యాక్స్ డిడక్షన్ సాధనాలే అయినప్పటికీ.. రెండింటినీ ఏకకాలంలో క్లెయిమ్ చేయడానికి కుదరదు. సొంతిల్లు ఉన్నప్పుడు అద్దె కడుతున్నామంటూ హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేయలేం. అలాగే అద్దె కడుతున్నట్లుగా హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేసుకుంటూ.... గృహ రుణంతో తీసుకున్న సొంత ఇంటికి సంబంధించి కట్టే ఈఎంఐల్లో పన్ను ప్రయోజనాలు పొందడానికి కుదరదు. కాబట్టి , ఏయే సందర్భాల్లో గరిష్టంగా పన్ను ప్రయోజనాలు పొందేందుకు ఈ రెండింటిలో ఏవి అనువైనవో తెలుసుకుందామా... హౌస్ రెంట్ అలవెన్స్... అద్దె ఇంట్లో ఉంటున్న ఉద్యోగులు కట్టే రెంట్‌ని.. వేతనంలో కొంత భాగంగా హెచ్ఆర్ఏ కింద చూపించడం జరుగుతుంది. ఈ కింది వాటిల్లో కనిష్టంగా ఉన్నదాన్ని పన్నులపరమైన మినహాయింపు పొందేందుకు హెచ్ఆర్ఏ కింద చూపించేందుకు పరిగణనలోకి తీసుకుంటారు. బేసిక్ శాలరీలో 50 శాతం వాస్తవ హెచ్ఆర్ఏ వాస్తవంగా కట్టిన అద్దె – బేసిక్ శాలరీలో 10 శాతం ఒకవేళ ఏడాది పొడవునా ఈ అంకెల్లో ఎటువంటి మార్పూ లేకపోతే.. హెచ్ఆర్ఏని పూర్తి ఏడాదికి లెక్కించవచ్చు. అలా కాకుండా కొన్ని నెలల్లో మార్పులు చేర్పులు ఉన్న పక్షంలో నెలవారీగా .. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కలిపి లెక్క వేయాలి. ఉదాహరణకు సంతోష్ బేసిక్ శాలరీ నెలకు రూ. 40,000, హెచ్ఆర్ఏ రూ. 20,000 కాగా తను ఇంటి అద్దె కింద రూ. 25,000 కడుతున్నాడు అనుకుందాం. ఆర్థిక సంవత్సరం ఆసాంతం ఇందులో ఎటువంటి మార్పులు లేని పక్షంలో సంతోష్ హెచ్ఆర్ఏని ఈ కింది విధంగా లెక్కవేయడం జరుగుతుంది. బేసిక్ శాలరీలో 50 శాతం = రూ. 20,000 వాస్తవ హెచ్ఆర్ఏ = రూ. 20,000 వాస్తవంగా కట్టిన అద్దె – బేసిక్ శాలరీలో 10 శాతం= రూ. 21,000 ఈ సందర్భంలో ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించి కనిష్ట మొత్తం రూ. 20,000.. ఏడాదికి రూ. 2,40,000 హెచ్ఆర్ఏని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక, ఆదాయ పన్ను మినహాయింపు పొందడానికి ఇంటి అద్దె రసీదు, ఓనరు పాన్ నంబరు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులతో పాటు వారి పేరున ఉన్న ఇంట్లోనే నివసిస్తూ హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసిన పక్షంలో.. పిల్లలు కట్టిన అద్దె మొత్తాన్ని పేరెంట్స్ తమ ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ క్లెయిమ్‌ను పొందడానికి కరెంటు బిల్లు, రెంటల్ అగ్రిమెంట్ లాంటి ఆధారాలు కూడా చూపాల్సి ఉంటుంది. గృహ రుణాలు... తొలిసారి సొంత ఇంటి కొనుగోలుకు హోమ్ లోన్ తీసుకుంటే.. ప్రతి నెలా కట్టే వాయిదాల్లో (ఈఎంఐ) అసలు భాగానికి .. గరిష్టంగా రూ. 1,50,000 దాకా సెక్షన్ 80 సి కింద ఆదాయ పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇతరత్రా మరికొన్ని పెట్టుబడులు కూడా ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. ఇక గృహ రుణంపై కట్టే వడ్డీకి కూడా సెక్షన్ 24బి కింద ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి పరిమితి ఆర్థిక సంవత్సరంలో రూ. 2,00,000 దాకా ఉంటుంది. వేతన జీవులు సొంతింటి కల సాకారం చేసుకునే అవకాశం కల్పించేందుకే ఇలా గృహ రుణంపై ఆదాయ పన్ను మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. హెచ్ఆర్ఏ.. హోమ్ లోన్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవడం ఉత్తమం అనే విషయానికొస్తే.. ప్రయోజనాలు.. సెక్షన్ 80సి కింద వచ్చే ఇతరత్రా సాధనాలకు అదనంగా హెచ్ఆర్ఏ డిడక్షన్స్ పొందవచ్చు. అంటే.. హెచ్ఆర్ఏ క్లెయిమ్ గానీ ఉంటే.. మరింత ఎక్కువగా ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనం దక్కించుకోవచ్చు. వారసత్వంగా ప్రాపర్టీ ఏదైనా దక్కే అవకాశం ఉండి, కొత్తగా మరిన్ని ఇళ్లను కొనుగోలు చేయదల్చుకోని వారికి ఇది ఉపయోగకరం. ప్రతికూలతలు.. ఒకవేళ కట్టే అద్దె కన్నా హెచ్ఆర్ఏ తక్కువగా ఉంటే కిరాయిని పూర్తి స్థాయిలో క్లెయిమ్ చేయడానికి కుదరదని గమనించాలి. n సొంత ఇల్లు లేనివారు, వారసత్వంగా ఇల్లు దక్కే అవకాశం లేనివారు.. కేవలం హెచ్ఆర్ఏ క్లెయిమింగ్ మీదే ఆధారపడితే కొత్తగా ప్రాపర్టీని సమకూర్చుకోవడానికి ఇది తోడ్పడదు. హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేసుకునేందుకు సంబంధించిన నిబంధనలు కఠినతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవంగా అద్దె కట్టకుండా హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. గృహ రుణం ప్రయోజనాలు.. అసెట్‌ను సమకూర్చుకునేందుకు ఉపయోగపడుతుంది.ఇతరత్రా సెక్షన్ కింద రుణంలో వడ్డీ మొత్తానికి కూడా పన్ను మినహాయింపులు కల్పిస్తుండటం వల్ల ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి మరింత ఎక్కువగా లభించినట్లవుతుంది. -
ఉద్యోగుల అలవెన్స్‌లపై క్లారిటీ?
న్యూఢిల్లీ : ఉద్యోగులకు చెల్లించే భత్యాల విషయంలో ఈ వారంలో క్లారిటీ రానుంది. ఆర్థికకార్యదర్శి అశోక్ లావాసా నేతత్వంలో ఏర్పాటైన కమిటీ తన తుది నివేదికను ఆర్థికమంత్రిత్వ శాఖకు ఈ వారంలోనే సమర్పించేందుకు సిద్ధమైంది. భత్యాల విషయంలో లావాసా కమిటీ నివేదించే ప్రతిపాదనలతో మొత్తం 47 లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 196 భత్యాలలో 53 తీసివేయాలని, మరో 36 భత్యాలను కలపాలన్న 7వ వేతన సంఘం సిఫారసుపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేయడంతో ప్రభుత్వం గత ఏడాది లావాసా కమిటీని ఏర్పాటు చేసింది. క్లాస్ ఎక్స్, వై, జడ్ సిటీల బేసిక్ వేతనం ప్రకారం 24 శాతం, 16 శాతం, 8 శాతం, హెచ్ఆర్ఏ ఇవ్వాలని అంతకముందు 7వ వేతన సంఘం ప్రతిపాదించింది. అదేవిధంగా డీఏ 50 శాతాన్ని దాటితే హెచ్ఆర్ఏ 27 శాతం, 18 శాతం, 9 శాతం ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం హెచ్ఆర్ఏ రేటు బేసిక్ వేతనంపై 30 శాతం, 20 శాతం, 10 శాతంగా ఉంది. దాని మరింత తగ్గించి, 7వ వేతన సంఘం తమ సిపారసులను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీంతో ఈ రేట్లపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విషయాలపై నెలకొన్న ప్రతిష్టంభనపై ఏర్పాటైన లావాసా కమిటీ తమ తుది నివేదికను ఈ వారంలో ప్రభుత్వానికి సమర్పించనుంది. బేసిక వేతనం, పెన్షన్ పెంచాలంటూ సిపారసు చేసిన ఏడవ వేతన సంఘ ప్రతిపాదనలను ప్రభుత్వం గతేడాది ఆమోదించిన సంగతి తెలిసిందే. -
హెచ్ఆర్ఏ 30 శాతానికి పెంపు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ(ఇంటి అద్దె భత్యం) 30 శాతానికి పెరగనున్నట్లు సమాచారం. ఆ మేరకు అలవెన్సుల్లో మార్పులు చేర్పుల కోసం ఏర్పాౖటెన అలవెన్సుల కమిటీ తన నివేదికను త్వరలో ఆర్థికమంత్రికి సమర్పించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు మెట్రో నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మూలవేతనంపై 30 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని కమిటీ సూచించింది. జస్టిస్ ఏకే మాథూర్ నేతృత్వంలోని ఏడో వేతన సంఘం సిఫార్సుల్లోని మూల వేతనం, పెన్షన్ పెంపునకు కేంద్రం ఆమోదం తెలపగా... అలవెన్సులకు సంబంధించిన సూచనల్ని కమిటీకి అప్పగించింది. కేబినెట్ సూచన మేరకు జులై 2016న కేంద్ర ఆర్థిక కార్యదర్శి నేతృత్వంలో అలవెన్సుల కమిటీని ఏర్పాటుచేశారు. ఏడో వేతన సంఘం 196 అలవెన్సుల్ని పరిశీలించి అందులో 51 రద్దు చేయాలని, అలాగే 37 అలవెన్సుల్ని వేరే వాటిలో కలపాలని సూచించింది. ఉద్యోగులు నివసిస్తున్న ప్రాంతాల వారీగా మూలవేతనంపై 24, 16, 8 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలంటూ ఏడో వేతన సంఘం సూచించింది. ఒకవేళ డీఏ(కరవు భత్యం) 50 శాతం దాటితే హెచ్ఆర్ఏ 27 , 18, 9 శాతాలకు మార్చాలని, డీఏ 100 శాతం దాటిన పక్షంలో హెచ్ఆర్ఏ 30, 20, 10 శాతంగా ఇవ్వాలని సిఫార్సు చేసింది. తాజాగా అలవెన్సుల కమిటీ హెచ్ఆర్ఏ పెంపుతో పాటు మొత్తం 192 అలవెన్సుల్లో 52 రద్దు చేయాలని, 36 అలవెన్సుల్ని ప్రస్తుతమున్న వాటిలో లేదా కొత్త వాటిలో కలపాలంది. -
ఖజానా కొర్రీలు
అడిషనల్ హెచ్ఆర్ఏ ఇవ్వకుండా ఇబ్బందులు ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా పట్టించుకోని ట్రెజరీ అధికారులు రెండేళ్లుగా పెండింగ్‌లోనే.. హన్మకొండఅర్బన్ : వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ప్రతి నెలా వేతనంతో పాటు ఇవ్వాల్సిన అదనపు హెచ్ఆర్ఏను ట్రెజరీ అధికారులు కొత్త నిబంధనలు చెపుతూ నిలిపివేశారు. 2015 ఏప్రిల్ నుంచి ఒక్కో ఉద్యోగి వేతనంతో పొందాల్సి ఉన్న సుమారు రూ.2వేల వరకు నగదు అందడం లేదు. కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్న అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇటీవల టీఎన్జీఓస్ నేతలు అర్బన్ జిల్లా డీటీఓను కలిసి వినతిపత్రం కూడా అందజేశారు. ఎందుకు సమస్య.. ప్రస్తుతం అదనపు హెచ్ఆర్ఏ చెల్లింపులు చాలా జిల్లాలో డీటీఓలు విడుదల చేస్తున్నాయి. వరంగల్‌తోపాటు మరికొన్నిచోట్ల మాత్రమే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 2015 ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలైన సమయంలో అదనపు హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం వైద్యారోగ్యశాఖకు సంబందించి క్యాడర్ల వారీగా వివరాలు వెల్లడిచింది. అందులో ఎవరికి ఏహెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన వివరాల్లో ఏఎన్ఎంలను మెటర్నటీ అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. ఆ క్యాడర్ వారికి ఏహెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో మొదట 1960 నుంచి మెటర్నటీ అసిస్టెంట్లుగా ఉన్నవారిని తరువాత క్రమంలో వారి హోదాను1984లో ఏఎన్ఎంలుగా మార్చారు. ఆ తరువాత ఎన్ఎంల హోదాను మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్(ఎంపీహెచ్‌ఏఎఫ్) అని మార్చారు. దీనివల్ల ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎంపీహెచ్ఏ(ఎఫ్) అని లేనందున వారికి ఏహెచ్‌ఆర్‌ఏ ఇవ్వలేమని అందుకు రూల్స్ ఒప్పుకోవని డీటీఓలు బిల్లులు పాస్ చేయలేదు. దీంతో సమస్యను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంతో ఈ విషయంలో స్పష్టత కూడా వచ్చింది. దీంతో జిల్లాలోని ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్ తోపాటు ఇతర జిల్లాల్లో ఈ బిల్లులు పాస్ చేసి ఏహెచ్‌ఆర్‌ఏ చెల్లింపులు చేస్తున్నారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అర్బన్‌తో పాటు కొన్ని డీటీఓల్లో అధికారులు ససేమిరా అంటున్నారు. ఉద్దేశ పూర్వకంగా వేధిస్తున్నారు. టి.మాధవరెడ్డి టీఎన్జీఓస్(మెడికల్) అధ్యక్షుడు హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ వచ్చింది. మెటర్నటీ అసిస్టెంట్, ఎంపీహెచ్ఏ(ఎఫ్) ఒకటే అని చెప్పారు. ఈ విషయంలో కొన్ని డీటీఓల్లో అధికారులు బిల్స్ పాస్ చేశారు. కొన్ని చోట్ల మాత్రమే ఉద్దేశ పూర్వకంగా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అలవెన్సులు ఉద్యోగులు సకాలంలో పొందకుండా చేయడం మంచిదికాదు. ఈ విషయంలో కార్యాలయాల ఎదుట ఆందోళనకు సిద్ధమవుతాం. -
అమరావతి ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ పెంపు
విజయవాడ: హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లే ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30శాతం హెచ్ఆర్ఏ పెంచింది. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ 30 శాతం పెంపు ఏడాది పాటు అమల్లో ఉండనుంది. గరిష్టంగా రూ.20వేలు లేదా 30 శాతం హెచ్ఆర్ఏను వర్తింపు చేయనున్నారు. కాగా హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దెభత్యం(హెచ్ఆర్ఏ) ఇస్తున్నారు. విజయవాడలో 20 శాతం, అమరావతిలో 12 శాతం హెచ్ఆర్ఏ వస్తుంది. తరలివెళ్లే ఉద్యోగులకు హెచ్ఆర్ఏలో కోత పడకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. హెచ్ఆర్ఏను పెంపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ నెల 27లోపు ఉద్యోగులంతా అమరావతికి వెళ్లాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
అమరావతికి వెళ్లినా అదే హెచ్ఆర్ఏ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్‌కు వెళ్లినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఎ) 30 శాతం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు అంటి అద్దె అలవెన్స్ 30 శాతం ఉంది. అయితే దానిపై 20 వేల రూపాయలు సీలింగ్ విధించారు. వీలైనంత త్వరగా ప్రజలతో సంబంధం ఉన్న శాఖల ఉద్యోగులను అమరావతికి తరలించాలని ముఖ్యమంత్రి భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ తరహాలోనే ఏపీ కేపిటల్ రీజియన్‌లో ఉండే ఉద్యోగులకు అంటి అద్దె అలవెన్స్‌ను కూడా 30 శాతం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. అయితే ఉద్యోగులు మాత్రం 30 శాతం హెచ్ఆర్ఎను అంగీకరిస్తున్నప్పటికీ 20 వేల రూపాయల సీలింగ్‌ను ఎత్తి వేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఇలా ఉండగా నూతన రాజధాని ప్రాంతానికి ఉద్యోగులు తరలి వెళ్లడంపై సచివాలయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నూతన రాజధాని ప్రాంతానికి తరలివెళ్తామని అయితే ఎటువంటి వసతి సౌకర్యం కల్పించకుండా వెళితే ప్రభుత్వం తరువాత పట్టించుకోదనే అభిప్రాయాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు నివశించేందుకు పూర్తి స్థాయి వసతి సౌకర్యం, అలాగే ఉద్యోగుల పిల్లలకు స్థానికత హోదా ఇచ్చిన తరువాతనే నూతన రాజధానికి తరలివెళ్లాని సచివాలయం ఉద్యోగుల సంఘం సమావేశం తీర్మానం చేసింది. ఇవేమీ చేయకుండా వెళితే తరువాత ప్రభుత్వం పట్టించుకోదనే అభిప్రాయాన్ని మెజారిటీ సచివాలయ ఉద్యోగులు వ్యక్తం చేశారు. కొంతమంది ఉద్యోగులైతే సీడ్ కేపిటల్ నిర్మాణం పూర్తి అయిన తరువాత వెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఇలా ఉండగా రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరేసి కార్యదర్శులు, ఇద్దరేసి మంత్రులు, ఇద్దరేసి సలహాదారులు హైదరాబాద్‌లోనే ఉంటున్నందున వారికి నివాస వసతిలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోను, అలాగే అమరావతిలోను, లేదా ఏపీలో ఏ జిల్లాలోనైనా నివాసం ఉండే అఖిల భారత సర్వీసు అధికారులకు నెలకు ఇంటి అద్దె అలవెన్స్ కింద రూ.40 వేల వరకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం జీవో జారీ చేశారు. -
30శాతాం హెచ్ఆర్ఏ ఇవ్వలి : ఉద్యోగులు
-
ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్థిరీకరణలో కీలకమైన ఇంటి అద్దె భత్యానికి సంబంధించి మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆర్థిక శాఖ ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటివరకు మూల వేతనంలో 8 శాతం లేదా గరిష్టంగా నెలకు రూ.వెయ్యి చొప్పున ఇంటి అద్దె భత్యం చెల్లించేవారు. అయితే ఇకపై పదో పీఆర్సీ సిఫార్సు ప్రకారం మూలవేతనంలో 8 శాతం లేదా గరిష్టంగా రూ.2 వేలు చెల్లించాలని సర్కారు నిర్ణయించింది. టైపిస్టు, స్టెనోగ్రాఫర్లు, టైపిస్ట్ కం అసిస్టెంట్స్‌కు సంబంధించి ప్రత్యేక వేతనాల ఉత్తర్వును కూడా జారీ చేసింది. -
పన్ను భారం.. ఇలా దూరం
రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతోంది. ఉద్యోగులకు ఆదాయపు పన్ను కోతలు పెరిగేది ఈ రెండు నెలలే. ఇక స్వయం ఉపాధి పొందేవారితో సహా ప్రొఫెషనల్స్ తదితరులంతా పన్ను భారం తగ్గించుకోవటానికి ఏం చేయాలనుకున్నా... చేసినా చేయాల్సింది ఈ రెండు నెలల్లోనే. నిజం చెప్పాలంటే చేసే పొదుపుతో పాటు... పెట్టే పెట్టుబడులను... కొన్నింటిపై చేసే ఖర్చుల్ని కూడా పన్ను మినహాయింపునకు ఉపయోగించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలో వివిధ సెక్షన్లు ఇలాంటి వాటికి వీలు కల్పిస్తున్నాయి. ఈ వివరాలన్నిటితో పన్ను భారం తగ్గించుకోవటానికి ఎన్ని మార్గాలున్నాయనే అంశంపై ‘సాక్షి ప్రాఫిట్’ అందిస్తున్న ప్రధాన కథనమిది... * ఆదాయపు పన్ను మినహాయింపులకు ఎన్నో మార్గాలు * పొదుపు, పెట్టుబడులే కాదు... చేసే ఖర్చులపైనా ఆదా పొదుపు సెక్షన్ 80సీ పన్ను భారం తగ్గించుకోవటమంటే అందరికీముందు గుర్తొచ్చేది సెక్షన్ 80సీ. ఈ సెక్షన్ కింద చేసిన కొన్ని రకాలైన పొదుపులు, చెల్లింపుల ద్వారా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. గడిచిన ఆర్థిక సంవత్సరం దాకా ఈ మొత్తం కేవలం లక్షే ఉండేది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మేరకు పెంచింది. ప్రధానంగా ఈ కింది వాటికి చేసే చెల్లింపులన్నిటినీ పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ⇒ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ⇒ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ⇒ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్) ⇒ ఐదేళ్లకు చేసే బ్యాంక్ డిపాజిట్లు ⇒ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు ⇒ సీనియర్ సిటిజన్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ ⇒ ఇన్సూరెన్స్ పాలసీలు ⇒ యూనిట్ లింక్డ్ బీమా పథకాలు (యులిప్) ⇒ పెన్షన్ పథకాలు ఇన్వెస్ట్మెంట్స్ మూలధన లాభాలు (సెక్షన్ 54ఈసీ) ఈ మధ్య బంగారం, షేర్ల ధరలు బాగా పెరిగాయి. పెరిగినపుడు అమ్మితే వాటిపై లాభాలూ వస్తాయి. కానీ ఇలా వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూల ధన పన్ను (లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) చెల్లించాలి. కానీ దీన్ని తప్పించుకోవటానికి చట్టంలో ప్రత్యేకంగా 54ఈసీ పేరుతో ఒక సెక్షన్ ఉంది. 54ఈసీ పరిధిలోకి వచ్చే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో గనక ఈ లాభాలను ఇన్వెస్ట్ చేస్తే పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. దీని ప్రకారం బంగారం, షేర్లు, స్థలాలు, ఇల్లు వంటివి అమ్మినప్పుడు వచ్చే లాభాలను ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ బాండ్లలో పెట్టుబడి పెడితే మూడేళ్ల దాకా వెనక్కి తీయటం కుదరదు. అయితే ఈ బాండ్లపై వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు. సెక్షన్ 80సీసీజీ రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం పేరుతో కొత్తగా సెక్షన్ 80సీసీజీ అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మూడేళ్లపాటు ఈ పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు. ఖర్చులు ఇంటి కోసం (సెక్షన్ 80 సీ, 24బీ) బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మిస్తే రెండు సెక్షన్ల ద్వారా పన్ను ప్రయోజనాలుంటాయి. అవి ఎలా వర్తిస్తాయంటే... మనం రుణానికి చెల్లించే వాయిదాల్లో కొంత అసలు, కొంత వడ్డీ ఉంటుంది. పన్ను ప్రయోజనానికి సంబంధించి ఈ రెండింటినీ విడిగా లెక్కిస్తారు. అసలు కింద చెల్లించే మొత్తంపై సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ మినహాయింపు పొందొచ్చు. అయితే తొలినాళ్లలో చెల్లించే వాయిదాల్లో అసలు కన్నా వడ్డీయే ఎక్కువ ఉంటుంది. అందుకే వడ్డీపై సెక్షన్ 24(బి) కింద గరిష్టంగా రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇది 80సీకి అదనం. అంటే మిగతా పొదుపులు, బీమా ఏవీ లేకున్నా కేవలం గృహ రుణంతోనే గరిష్టంగా ఏడాదికి రూ.3.5 లక్షల మేర పన్ను ప్రయోజనం పొందవచ్చు. చదువు కోసం (సెక్షన్ 80సీ, 80ఈ) చదువుల ఖర్చును పన్ను మినహాయింపు కోసం చూపించుకోవచ్చు. దీనికోసం సెక్షన్ 80సీ, సెక్షన్ 80ఈ అందుబాటులో ఉన్నాయి. స్కూలు ఫీజులో ట్యూషన్ ఫీజుకు 80సీ కింద పన్ను లాభం పొందొచ్చు. అయితే ఇది కుటుంబంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే... అది కూడా 80సీ పరిధిలో రూ.లక్ష వరకే వర్తిస్తుంది. ఒకవేళ అసెస్సీ తన చదువు కోసమో, తన కుటుంబీకుల ఉన్నత విద్య కోసమో రుణం తీసుకుంటే దానికి చెల్లించే వాయిదాల్లో వడ్డీ మొత్తానికి సెక్షన్ 80ఈ ప్రకారం పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ వడ్డీ మినహాయింపులపై ఎలాంటి పరిమితీ లేదు. అయితే పన్ను మినహాయింపు లభించేది వడ్డీ చెల్లింపులపై మాత్రమే. అసలుపై ఏ మినహాయింపూ ఉండదు. అలాగే గరిష్టంగా 8 ఏళ్ల వరకు ఈ మినహాయింపులను పొందవచ్చు. రుణం తీసుకున్నాక ఎనిమిదేళ్ల తరవాత చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ మినహాయింపులు లభించవు. ఆరోగ్యం(సెక్షన్ 80డీ/80డీడీ/80డీడీబీ) ఇలాంటి అనుకోని ఖర్చుల్ని భరించడానికి బీమా పాలసీలుంటాయి. బీమా కోసమే కాక, చికిత్స కోసం, వైద్య పరీక్షల కోసం, మందుల కోసం... వీటన్నిటికీ చేసే ఖర్చుల్ని పన్ను నుంచి మినహాయించవచ్చు. ప్రధానంగా సెక్షన్ 80డీ, 80డీడీ, 80డీడీబీ ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి. అదెలాగంటే... ఆరోగ్య బీమా (80డీ): హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియంలను సెక్షన్ 80డీ కింద మినహాయిస్తారు. ఇది గరిష్టంగా రూ.15,000 వరకు... సీనియర్ సిటిజన్స్‌కు అయితే రూ.20,000 వరకు ఉంటుంది. అదే తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా తీసుకుంటే అదనంగా మరో రూ.15,000 (సీనియర్ సిటిజన్స్‌కి రూ.20,000) ప్రయోజనం లభిస్తుంది. ఇదికాక ఈ ఏడాది నుంచి ముందుజాగ్రత్త చర్యగా చేయించుకునే వైద్య పరీక్షలపై కూడా గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను మినహాయింపు కోసం పరిగణిస్తారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వైద్యపరీక్షలకూ ఇది వర్తిస్తుంది. చికిత్స ఖర్చు (80డీడీబీ): కొన్ని ప్రధానమైన వ్యాధులకు చికిత్స చేయించుకుంటే సెక్షన్ 80డీడీబీ కింద గరిష్టంగా 40,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు. ఏయే వ్యాధి చికిత్సలకు మినహాయింపులు లభిస్తాయన్నది ఈ సెక్షన్లో వివరంగా పేర్కొనడం జరిగింది. అదే సీనియర్ సిటిజన్ అయితే రూ.60,000 వరకు చూపించుకోవచ్చు. ఒక వేళ ఈ మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రీ-యింబర్స్‌మెంట్ పొందితే మాత్రం పన్ను ప్రయోజనం లభించదు. అంగ వైకల్యం ఉంటే... (80యూ): పన్ను చెల్లించే వ్యక్తికి వైకల్యం ఉంటే కనుక సెక్షన్ 80యూ ప్రకారం మినహాయింపులు పొందవచ్చు. అంగవైకల్యం తీవ్రతపై ఈ మినహాయింపు ఆధారపడి ఉంటుంది. వైకల్యం సాధారణ స్థాయిలో ఉంటే ఆదాయం నుంచి రూ.50,000 తగ్గించి చూపించుకోవచ్చు. అదే తీవ్రత ఎక్కువగా ఉంటే రూ.75,000 వరకు మినహాయించి చూపించవచ్చు. డిపెండెంట్ల కోసం... (80డీడీ): వైకల్యం ఉన్న వారు మీపై ఆధారపడి ఉంటే (తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు) సెక్షన్ 80డీడీ కింద మినహాయింపు కోరవచ్చు. ఒక మాదిరి వైకల్యం అయితే గరిష్టంగా రూ.50,000, అదే తీవ్ర వైకల్యమైతే గరిష్టంగా రూ.1,00,000 వరకు ఆదాయాన్ని తగ్గించి చూపించుకోవచ్చు. దీనికి డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎల్ఐసీ జీవన్ ఆథార్ పాలసీకి చెల్లించే ప్రీమియంలు కూడా ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి. విరాళాలు (సెక్షన్ 80జీ) ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80జీ ద్వారా కొన్నిటికి ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపులుంటాయి. మినహాయింపు వర్తించే విరాళాలకు సంబంధించి సెక్షన్ 80జీలో పలు నిబంధనలున్నాయి. కొన్ని విరాళాలపై పూర్తిగా 100 శాతం తగ్గింపు (డిడక్షన్) లభిస్తే మరికొన్నింటిపై 50 శాతం మాత్రమే లభిస్తుంది.జాతీయ రక్షణ నిధి, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యునల్ హార్మోని, జిల్లా సాక్షరతా మిషన్, నేషనల్ టెక్నాలజీ ఫండ్ వాటికి ఇచ్చే విరాళాలపై ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా 100 శాతం మినహాయింపులు లభిస్తాయి. కాగా, స్థూల జీతంలో 10 శాతం దాటని విరాళాలకు మాత్రమే ఈ డిడక్షన్స్ వర్తిస్తాయి. హెచ్ఆర్ఏ (సెక్షన్ 10(13ఏ)) ఉద్యోగులు అద్దె ఇంట్లో ఉంటే కంపెనీ ఇంటిఅద్దె భత్యాన్ని (హెచ్ఆర్ఏ) అందిస్తుంది. సొంతిల్లు లేకుండా అద్దింట్లో నివసించే వారు హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేసుకోవడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది ఉద్యోగులుంటే ఒకరు మాత్రమే దీనిని వినియోగించుకోగలరు. ఈ హెచ్ఆర్ఏను లెక్కించేటపుడు మూడు అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. అవి... 1- జీతంలో 40 శాతం 2- యజమాని ఇంటిఅద్దె అలవెన్స్‌గా ఇచ్చిన మొత్తం 3- చెల్లించిన అద్దెలోంచి జీతంలో పదవభాగాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం పైన పేర్కొన్న మూడింటినీ చూశాక వీటిలో అన్నిటికన్నా తక్కువ ఉన్నదానికే మినహాయింపు లభిస్తుంది. హెచ్ఆర్ఏ లేకపోతే సెక్షన్ 80జీజీ హెచ్ఆర్ఏలేకపోయినా చెల్లించే ఇంటిఅద్దెపై పన్ను ప్రయోజనాలు పొందడానికి ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. సెక్షన్ 80జీజీ ప్రకారం హెచ్ఆర్ఏ సౌలభ్యం లేని వృత్తి నిపుణులు, వ్యాపారస్తుల వంటి వారు ఈ ప్రయోజనం పొందచ్చు. ఈ సెక్షన్ ప్రకారం చెల్లించిన అద్దెలోంచి జీతంలో పదవభాగాన్ని తీసివేయగా మిగిలిన మొత్తంకానీ, మీ ఆదాయంలో గరిష్టంగా 25 శాతంకానీ లేదా నెలకు గరిష్టంగా రూ.2,000 గానీ మినహాయింపు కోరవచ్చు. ఈ మూడింట్లో ఏది తక్కువైతే దానికి మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది. ఈ ప్రయోజనం పొందాలంటే ఉంటున్న ఊళ్లో మీ పేరు మీద లేక భార్య, పిల్లల పేర సొంతిల్లు ఉండకూడదు. అలాగే ఇంటికి సంబంధించిన ఎటువంటి ఇతర పన్ను ప్రయోజనాలూ పొంది ఉండకూడదు.