![అమరావతికి వెళ్లినా అదే హెచ్‌ఆర్‌ఏ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71439410635_625x300.jpg.webp?itok=VIsqqyZR)
అమరావతికి వెళ్లినా అదే హెచ్‌ఆర్‌ఏ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్‌కు వెళ్లినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఎ) 30 శాతం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు అంటి అద్దె అలవెన్స్ 30 శాతం ఉంది. అయితే దానిపై 20 వేల రూపాయలు సీలింగ్ విధించారు. వీలైనంత త్వరగా ప్రజలతో సంబంధం ఉన్న శాఖల ఉద్యోగులను అమరావతికి తరలించాలని ముఖ్యమంత్రి భావిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ తరహాలోనే ఏపీ కేపిటల్ రీజియన్‌లో ఉండే ఉద్యోగులకు అంటి అద్దె అలవెన్స్‌ను కూడా 30 శాతం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. అయితే ఉద్యోగులు మాత్రం 30 శాతం హెచ్‌ఆర్‌ఎను అంగీకరిస్తున్నప్పటికీ 20 వేల రూపాయల సీలింగ్‌ను ఎత్తి వేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఇలా ఉండగా నూతన రాజధాని ప్రాంతానికి ఉద్యోగులు తరలి వెళ్లడంపై సచివాలయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
నూతన రాజధాని ప్రాంతానికి తరలివెళ్తామని అయితే ఎటువంటి వసతి సౌకర్యం కల్పించకుండా వెళితే ప్రభుత్వం తరువాత పట్టించుకోదనే అభిప్రాయాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు నివశించేందుకు పూర్తి స్థాయి వసతి సౌకర్యం, అలాగే ఉద్యోగుల పిల్లలకు స్థానికత హోదా ఇచ్చిన తరువాతనే నూతన రాజధానికి తరలివెళ్లాని సచివాలయం ఉద్యోగుల సంఘం సమావేశం తీర్మానం చేసింది. ఇవేమీ చేయకుండా వెళితే తరువాత ప్రభుత్వం పట్టించుకోదనే అభిప్రాయాన్ని మెజారిటీ సచివాలయ ఉద్యోగులు వ్యక్తం చేశారు.
కొంతమంది ఉద్యోగులైతే సీడ్ కేపిటల్ నిర్మాణం పూర్తి అయిన తరువాత వెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఇలా ఉండగా రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరేసి కార్యదర్శులు, ఇద్దరేసి మంత్రులు, ఇద్దరేసి సలహాదారులు హైదరాబాద్‌లోనే ఉంటున్నందున వారికి నివాస వసతిలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోను, అలాగే అమరావతిలోను, లేదా ఏపీలో ఏ జిల్లాలోనైనా నివాసం ఉండే అఖిల భారత సర్వీసు అధికారులకు నెలకు ఇంటి అద్దె అలవెన్స్ కింద రూ.40 వేల వరకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం జీవో జారీ చేశారు.