వీడని రాజధాని చిక్కుముడి
- సీడ్ క్యాపిటల్ నిర్మాణాన్ని స్పష్టం చేయని సీఎం
- గ్రామాలు గల్లంతవుతాయని ప్రజల ఆందోళన
- మాస్టర్ ప్లాన్ స్పష్టత కోసం ఎదురుచూపులు
- ఇబ్రహీంపట్నం, నందిగామ, కంకిపాడుకు మహర్దశ
సాక్షి ప్రతినిధి, గుంటూరు : మాస్టర్ ప్లాన్ చేతికందినా ఏ గ్రామాల్లో సీడ్ క్యాపిటల్ నిర్మాణం చేపట్టనున్నారనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయలేదు. సీడ్ క్యాపిటల్ గురించి ఆయన చేసిన ప్రకటనలో రైతులకు ఇస్తామన్న 1,450 గజాల ఊసేలేదు. కూలీలు, కౌలు రైతులకు ఇచ్చే నష్టపరిహారం, నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వీటన్నిటికి తోడు సీడ్ క్యాపిటల్ పరిధి పెంచుకుంటూ పోతుండటం రాజధాని ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏయే గ్రామాలు గల్లంతవుతాయేనన్న భయం వారిని వెంటాడుతోంది.
రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన 29 గ్రామాల్లో కొన్ని పూర్తిగా గల్లంతవుతాయనే ఆందోళనలో ఉన్నారు. మొదట్లో తాళాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలు సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో గల్లంతవుతాయని భావించారు. అయితే, సింగపూర్ ప్రభుత్వం సోమవారం సీఎం చంద్రబాబు చేతికిచ్చిన సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ 16.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేలా ప్రణాళిక ఉంది. ఈ పరిధిలో మరో ఐదు గ్రామాలు కూడా గల్లంతవుతాయనే భయం ప్రజలకు కలుగుతోంది.
ముఖ్యంగా రాయపూడి, మౌదులింగాయపాలెం, వెలగపూడి, మం దడం, మల్కాపురం గ్రామాలు కూడా ఈ ప్రణాళిక పరిధిలోకి వస్తాయని, అదే జరిగితే ఇవి కూడా గల్లంతవుతాయనే భయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కనుకనే సీఎం సీడ్ క్యాపిటల్ నిర్మాణం ఏయే గ్రామాల్లో జరగనుందో సోమవారం స్పష్టం చేయలేదని చర్చ నడుస్తోంది.
ప్రజల ఆవేదన ఇలా..
రాజధాని నిర్మాణానికి మొదటి నుంచి తుళ్లూరు మండల రైతులు, ప్రజలు మద్దతు పలికారు. రాజధాని నిర్మాణం ఇక్కడ జరిగితే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని భావించారు. అయితే, అదే దిశగా రాజధాని నిర్మాణాన్ని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. మొదటి నుంచి ఉద్యమాలు చేశారు, న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే, నేడు ప్రకటించిన సీడ్ క్యాపిటల్లో నదీ పరివాహక ప్రాంతాల్లోనే రాజధాని నిర్మాణం ఎక్కువగా జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించారు. దీంతో తుళ్లూరు ప్రాంత ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో అన్న రీతిలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని, ప్యాకేజీ ఇచ్చే విషయంలో కూడా రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారికి ఎక్కువగా ఇచ్చి, తమకు తక్కువగా ఇచ్చారని, ఇప్పుడు ముఖ్యమైన నిర్మాణాలు మా ప్రాంతంలో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమరావతికి ప్రత్యేక ప్రాధాన్యం
అమరావతి నగరానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ సీడ్ క్యాపిటల్ ప్లాన్లో పలు అంశాలను పొందుపరిచారు. ప్రపంచ పర్యాటక ప్రాంతంగానూ, బుద్ధిస్ట్ సర్క్యూట్ కేంద్రంగానూ టూరిస్టులను ఆకట్టుకునేలా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సమీపంలోని మద్దూరు, నిడుముక్కల, కొండ ప్రాంతాలతో పాటు పెదపరిమి, అనంతవరం, తాడికొండ ప్రాంతాలకు కూడా ప్రత్యేక కారిడార్లను కేటాయించే వీలుంది. సీడ్ క్యాపిటల్ ప్లాన్ను సమగ్రంగా పరిశీలిస్తే గుంటూరు నగరం వరకూ ప్రధాన రాజధాని ప్రాంతం అభివృద్ధి చేసే వీలున్నట్లు తెలుస్తుంది. కృష్ణాజిల్లాలోని ఇబ్రహీంపట్నం, నందిగామ, కంకిపాడు ప్రాంతాలు కూడా ప్రతిపాదిత రాజధాని నగరంలో కీలకం కానున్నాయి. ఇబ్రహీంపట్నంలోనే ప్రభుత్వం కన్వెన్షన్ సెంటర్, మల్టీఫ్లెక్సు థియేటర్లకు ప్రణాళికలు సిద్ధం చేసింది.