పన్ను భారం.. ఇలా దూరం | BoB's profits hit due to one off charge for income tax from Dubai territory: Ranjan Dhawan | Sakshi
Sakshi News home page

పన్ను భారం.. ఇలా దూరం

Published Sun, Feb 1 2015 3:16 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

పన్ను భారం.. ఇలా దూరం - Sakshi

పన్ను భారం.. ఇలా దూరం

రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతోంది. ఉద్యోగులకు ఆదాయపు పన్ను కోతలు పెరిగేది ఈ రెండు నెలలే. ఇక స్వయం ఉపాధి పొందేవారితో సహా ప్రొఫెషనల్స్ తదితరులంతా పన్ను భారం తగ్గించుకోవటానికి ఏం చేయాలనుకున్నా... చేసినా చేయాల్సింది ఈ రెండు నెలల్లోనే. నిజం చెప్పాలంటే చేసే పొదుపుతో పాటు... పెట్టే పెట్టుబడులను... కొన్నింటిపై చేసే ఖర్చుల్ని కూడా పన్ను మినహాయింపునకు ఉపయోగించుకోవచ్చు.

ఆదాయపు పన్ను చట్టంలో వివిధ సెక్షన్లు ఇలాంటి వాటికి వీలు కల్పిస్తున్నాయి. ఈ వివరాలన్నిటితో పన్ను భారం తగ్గించుకోవటానికి ఎన్ని మార్గాలున్నాయనే అంశంపై ‘సాక్షి ప్రాఫిట్’ అందిస్తున్న ప్రధాన కథనమిది..
.

 
* ఆదాయపు పన్ను మినహాయింపులకు ఎన్నో మార్గాలు
* పొదుపు, పెట్టుబడులే కాదు... చేసే ఖర్చులపైనా ఆదా
 
పొదుపు

సెక్షన్ 80సీ
 పన్ను భారం తగ్గించుకోవటమంటే అందరికీముందు గుర్తొచ్చేది సెక్షన్ 80సీ. ఈ సెక్షన్ కింద చేసిన కొన్ని రకాలైన పొదుపులు, చెల్లింపుల ద్వారా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. గడిచిన ఆర్థిక సంవత్సరం దాకా ఈ మొత్తం కేవలం లక్షే ఉండేది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మేరకు పెంచింది. ప్రధానంగా ఈ కింది వాటికి చేసే చెల్లింపులన్నిటినీ పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.
 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్)
ఐదేళ్లకు చేసే బ్యాంక్ డిపాజిట్లు
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు
సీనియర్ సిటిజన్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్
ఇన్సూరెన్స్ పాలసీలు
యూనిట్ లింక్డ్ బీమా పథకాలు (యులిప్)
పెన్షన్ పథకాలు

 
ఇన్వెస్ట్‌మెంట్స్

మూలధన లాభాలు (సెక్షన్ 54ఈసీ)
ఈ మధ్య బంగారం, షేర్ల ధరలు బాగా పెరిగాయి. పెరిగినపుడు అమ్మితే వాటిపై లాభాలూ వస్తాయి. కానీ ఇలా వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూల ధన పన్ను (లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) చెల్లించాలి. కానీ దీన్ని తప్పించుకోవటానికి చట్టంలో ప్రత్యేకంగా 54ఈసీ పేరుతో ఒక సెక్షన్ ఉంది. 54ఈసీ పరిధిలోకి వచ్చే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో గనక ఈ లాభాలను ఇన్వెస్ట్ చేస్తే పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. దీని ప్రకారం బంగారం, షేర్లు, స్థలాలు, ఇల్లు వంటివి అమ్మినప్పుడు వచ్చే లాభాలను ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ బాండ్లలో పెట్టుబడి పెడితే మూడేళ్ల దాకా వెనక్కి తీయటం కుదరదు. అయితే ఈ బాండ్లపై వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు.
 
సెక్షన్ 80సీసీజీ
రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం పేరుతో కొత్తగా సెక్షన్ 80సీసీజీ అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద  గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మూడేళ్లపాటు ఈ పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు.
 
ఖర్చులు

ఇంటి కోసం (సెక్షన్ 80 సీ, 24బీ)
బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మిస్తే రెండు సెక్షన్ల ద్వారా పన్ను ప్రయోజనాలుంటాయి. అవి ఎలా వర్తిస్తాయంటే... మనం రుణానికి చెల్లించే వాయిదాల్లో కొంత అసలు, కొంత వడ్డీ ఉంటుంది. పన్ను ప్రయోజనానికి సంబంధించి ఈ రెండింటినీ విడిగా లెక్కిస్తారు. అసలు కింద చెల్లించే మొత్తంపై సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ మినహాయింపు పొందొచ్చు. అయితే తొలినాళ్లలో చెల్లించే వాయిదాల్లో అసలు కన్నా వడ్డీయే ఎక్కువ ఉంటుంది. అందుకే వడ్డీపై సెక్షన్ 24(బి) కింద గరిష్టంగా రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇది 80సీకి అదనం. అంటే మిగతా పొదుపులు, బీమా ఏవీ లేకున్నా కేవలం గృహ రుణంతోనే గరిష్టంగా ఏడాదికి రూ.3.5 లక్షల మేర పన్ను ప్రయోజనం పొందవచ్చు.
 
చదువు కోసం (సెక్షన్ 80సీ, 80ఈ)
చదువుల ఖర్చును పన్ను మినహాయింపు కోసం చూపించుకోవచ్చు. దీనికోసం సెక్షన్ 80సీ, సెక్షన్ 80ఈ అందుబాటులో ఉన్నాయి.  స్కూలు ఫీజులో ట్యూషన్ ఫీజుకు 80సీ కింద పన్ను లాభం పొందొచ్చు. అయితే ఇది కుటుంబంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే... అది కూడా 80సీ పరిధిలో రూ.లక్ష వరకే వర్తిస్తుంది. ఒకవేళ అసెస్సీ తన చదువు కోసమో, తన కుటుంబీకుల ఉన్నత విద్య కోసమో రుణం తీసుకుంటే దానికి చెల్లించే వాయిదాల్లో వడ్డీ మొత్తానికి సెక్షన్ 80ఈ  ప్రకారం పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ వడ్డీ మినహాయింపులపై ఎలాంటి పరిమితీ లేదు.  అయితే పన్ను మినహాయింపు లభించేది వడ్డీ చెల్లింపులపై మాత్రమే. అసలుపై ఏ మినహాయింపూ ఉండదు. అలాగే గరిష్టంగా 8 ఏళ్ల వరకు ఈ మినహాయింపులను పొందవచ్చు. రుణం తీసుకున్నాక ఎనిమిదేళ్ల తరవాత చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ మినహాయింపులు లభించవు.
 
ఆరోగ్యం(సెక్షన్ 80డీ/80డీడీ/80డీడీబీ)
ఇలాంటి అనుకోని ఖర్చుల్ని భరించడానికి బీమా పాలసీలుంటాయి.  బీమా కోసమే కాక, చికిత్స కోసం, వైద్య పరీక్షల కోసం, మందుల కోసం... వీటన్నిటికీ చేసే ఖర్చుల్ని పన్ను నుంచి మినహాయించవచ్చు. ప్రధానంగా సెక్షన్ 80డీ, 80డీడీ, 80డీడీబీ ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి. అదెలాగంటే...
 
ఆరోగ్య బీమా (80డీ): హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియంలను సెక్షన్ 80డీ కింద మినహాయిస్తారు. ఇది గరిష్టంగా రూ.15,000 వరకు... సీనియర్ సిటిజన్స్‌కు అయితే రూ.20,000 వరకు ఉంటుంది. అదే తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా తీసుకుంటే అదనంగా మరో రూ.15,000 (సీనియర్ సిటిజన్స్‌కి రూ.20,000) ప్రయోజనం లభిస్తుంది. ఇదికాక ఈ ఏడాది నుంచి ముందుజాగ్రత్త చర్యగా చేయించుకునే వైద్య పరీక్షలపై కూడా గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను మినహాయింపు కోసం పరిగణిస్తారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వైద్యపరీక్షలకూ ఇది వర్తిస్తుంది.

చికిత్స ఖర్చు (80డీడీబీ): కొన్ని ప్రధానమైన వ్యాధులకు చికిత్స చేయించుకుంటే సెక్షన్ 80డీడీబీ కింద గరిష్టంగా 40,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు. ఏయే వ్యాధి చికిత్సలకు మినహాయింపులు లభిస్తాయన్నది ఈ సెక్షన్లో వివరంగా పేర్కొనడం జరిగింది. అదే సీనియర్ సిటిజన్ అయితే రూ.60,000 వరకు చూపించుకోవచ్చు. ఒక వేళ ఈ మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రీ-యింబర్స్‌మెంట్ పొందితే మాత్రం పన్ను ప్రయోజనం లభించదు.

అంగ వైకల్యం ఉంటే... (80యూ): పన్ను చెల్లించే వ్యక్తికి వైకల్యం ఉంటే కనుక సెక్షన్ 80యూ ప్రకారం మినహాయింపులు పొందవచ్చు. అంగవైకల్యం తీవ్రతపై ఈ మినహాయింపు ఆధారపడి ఉంటుంది.  వైకల్యం సాధారణ స్థాయిలో ఉంటే ఆదాయం నుంచి రూ.50,000 తగ్గించి చూపించుకోవచ్చు. అదే తీవ్రత ఎక్కువగా ఉంటే రూ.75,000 వరకు మినహాయించి చూపించవచ్చు.
 
డిపెండెంట్ల కోసం... (80డీడీ): వైకల్యం ఉన్న వారు మీపై ఆధారపడి ఉంటే (తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు)  సెక్షన్ 80డీడీ కింద మినహాయింపు కోరవచ్చు. ఒక మాదిరి వైకల్యం అయితే గరిష్టంగా రూ.50,000, అదే తీవ్ర వైకల్యమైతే గరిష్టంగా రూ.1,00,000 వరకు ఆదాయాన్ని తగ్గించి చూపించుకోవచ్చు. దీనికి డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీ జీవన్ ఆథార్ పాలసీకి చెల్లించే ప్రీమియంలు కూడా ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి.
 
విరాళాలు (సెక్షన్ 80జీ)
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80జీ ద్వారా కొన్నిటికి ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపులుంటాయి. మినహాయింపు వర్తించే విరాళాలకు సంబంధించి సెక్షన్ 80జీలో పలు నిబంధనలున్నాయి. కొన్ని విరాళాలపై పూర్తిగా 100 శాతం తగ్గింపు (డిడక్షన్) లభిస్తే మరికొన్నింటిపై 50 శాతం మాత్రమే లభిస్తుంది.జాతీయ రక్షణ నిధి, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యునల్ హార్మోని, జిల్లా సాక్షరతా మిషన్, నేషనల్ టెక్నాలజీ ఫండ్ వాటికి ఇచ్చే విరాళాలపై ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా 100 శాతం మినహాయింపులు లభిస్తాయి. కాగా, స్థూల జీతంలో 10 శాతం దాటని విరాళాలకు మాత్రమే ఈ డిడక్షన్స్ వర్తిస్తాయి.
 
హెచ్‌ఆర్‌ఏ (సెక్షన్ 10(13ఏ))
ఉద్యోగులు అద్దె ఇంట్లో ఉంటే కంపెనీ ఇంటిఅద్దె భత్యాన్ని (హెచ్‌ఆర్‌ఏ) అందిస్తుంది. సొంతిల్లు లేకుండా అద్దింట్లో నివసించే వారు హెచ్‌ఆర్‌ఏని క్లెయిమ్ చేసుకోవడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది ఉద్యోగులుంటే ఒకరు మాత్రమే దీనిని వినియోగించుకోగలరు. ఈ హెచ్‌ఆర్‌ఏను లెక్కించేటపుడు మూడు అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. అవి...
 1- జీతంలో 40 శాతం
 2- యజమాని ఇంటిఅద్దె అలవెన్స్‌గా ఇచ్చిన మొత్తం
 3- చెల్లించిన అద్దెలోంచి జీతంలో పదవభాగాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం పైన పేర్కొన్న మూడింటినీ చూశాక వీటిలో అన్నిటికన్నా తక్కువ ఉన్నదానికే మినహాయింపు లభిస్తుంది.

హెచ్‌ఆర్‌ఏ లేకపోతే సెక్షన్ 80జీజీ
హెచ్‌ఆర్‌ఏలేకపోయినా చెల్లించే ఇంటిఅద్దెపై పన్ను ప్రయోజనాలు పొందడానికి ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. సెక్షన్ 80జీజీ ప్రకారం హెచ్‌ఆర్‌ఏ సౌలభ్యం లేని వృత్తి నిపుణులు, వ్యాపారస్తుల వంటి వారు ఈ ప్రయోజనం పొందచ్చు. ఈ సెక్షన్ ప్రకారం చెల్లించిన అద్దెలోంచి జీతంలో పదవభాగాన్ని తీసివేయగా మిగిలిన మొత్తంకానీ, మీ ఆదాయంలో గరిష్టంగా 25 శాతంకానీ లేదా నెలకు గరిష్టంగా రూ.2,000 గానీ మినహాయింపు కోరవచ్చు. ఈ మూడింట్లో ఏది తక్కువైతే దానికి మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది. ఈ ప్రయోజనం పొందాలంటే ఉంటున్న ఊళ్లో మీ పేరు మీద లేక భార్య, పిల్లల పేర సొంతిల్లు ఉండకూడదు. అలాగే ఇంటికి సంబంధించిన ఎటువంటి ఇతర పన్ను ప్రయోజనాలూ పొంది ఉండకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement