స్టాక్స్‌లో లాభాలపై పన్ను ఆదా..! | Tax deduction on investments in stocks markets | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌లో లాభాలపై పన్ను ఆదా..!

Published Mon, Jul 26 2021 12:45 AM | Last Updated on Mon, Jul 26 2021 12:45 AM

Tax deduction on investments in stocks markets - Sakshi

రూపాయిని ఆదా చేశామంటే.. రూపాయిని సంపాదించినట్టే. ఇది ఎప్పటి నుంచో మనం వినే సామెతే. అన్ని తరాలకూ ఇది వర్తిస్తుంది. కరోనా కల్లోలం వచ్చిన తర్వాత ఇంటికే పరిమితమైన వాతావరణంలో చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోకి అడుగుపెట్టారు. ఇంటి నుంచే అదనపు ఆదాయం కోసం స్టాక్స్‌ పెట్టుబడులను ఎంపిక చేసుకున్నారు. దీనికి నిదర్శనం సీడీఎస్‌ఎల్‌ వద్ద ఆరు నెలల్లోనే కోటి డీమ్యాట్‌ ఖాతాలు కొత్తగా తెరుచుకున్నాయి. కాకపోతే ఇన్వెస్టర్లు పెట్టుబడులు, విక్రయాలపైనే దృష్టి పెడుతుంటారు కానీ, పన్ను అంశాన్ని అంతగా పట్టించుకోరు. స్టాక్‌ మార్కెట్లో ఆర్జించే లాభాలపై పన్ను చెల్లించాలన్న అంశాన్ని ఇన్వెస్టర్లు తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ‘స్మార్ట్‌’గా అడుగులు వేయడం ద్వారా ఈ పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా కొంత ఆదా చేసుకోవచ్చు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్‌ ప్లస్‌ కథనంలో..

ఇవి గమనించండి...
► ఏడాది, అంతకుమించిన పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు లాభంపై పన్ను ఉండదు.
► రూ.2 లక్షల దీర్ఘకాల మూలధన లాభం కనిపిస్తుంటే.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రెండు భాగాలుగా తీసుకోవచ్చు.
► లాభాలు ఎక్కువగా కనిపిస్తుంటే.. నష్టాలతో సర్దుబాటు చేసుకోవడం ద్వారా పన్ను తగ్గించుకోవచ్చు.  
► నివాస గృహంపై ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఎల్‌టీసీజీ భారాన్ని దింపుకోవచ్చు.


నష్టాలతో సర్దుబాటు..
2018 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఎల్‌టీసీజీ పన్నును ప్రతిపాదించారు కనుక ఆ ముందు రోజు వరకు చేసిన పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తించదు. ‘‘నూతన నిబంధనను ప్రవేశపెట్టినప్పుడు అప్పటి వరకు ఉన్న పెట్టుబడులకు సాధారణంగా మినహాయింపునిస్తుంటారు. దీన్నే గ్రాండ్‌ఫాదరింగ్‌ అంటారు. కనుక 2018 జనవరి 31 నాటి వరకు చేసిన పెట్టుబడులు గ్రాండ్‌ ఫాదరింగ్‌కు అర్హత కలిగినవి’’ అని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ సీఈవో గౌరవ్‌ మోహన్‌ తెలిపారు. అంటే 2018 జనవరి 31 వరకు చేసిన పెట్టుబడులకు.. కొనుగోలు తేదీగా  2018 జనవరి 31ని పరిగణిస్తుంది చట్టం.

ఆ తర్వాత తేదీ నుంచి ఆర్జించిన దీర్ఘకాల మూలధన లాభాలపైనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాల మూలధన నష్టాలను.. స్వల్పకాల మూలధన లాభాలు, దీర్ఘకాల మూలధన లాభాలు రెండింటితోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. అదే ఎల్‌టీసీఎల్‌ అయితే ఎల్‌టీసీజీతోనే సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వరుసగా ఎనిమిదేళ్లపాటు దీర్ఘకాల, స్వల్పకాల మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవాలంటే.. అందుకోసం గడువులోపు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసుకోవడం తప్పనిసరి. లేదంటే వాటిని భవిష్యత్తు లాభాల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కోల్పోయినట్టే.

పన్ను బాధ్యత
ఈక్విటీల్లో (స్టాక్స్‌) నేరుగా చేసిన పెట్టుబడులు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో స్టాక్స్‌లో పెట్టుబడులైనా సరే.. ఏడాది, అంతకు మించి కొనసాగించిన తర్వాత విక్రయించినట్టయితే వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా (ఎల్‌టీసీజీ) ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. ఒకవేళ నష్టం వస్తే దాన్ని దీర్ఘకాలిక మూలధన నష్టం(ఎల్‌టీసీఎల్‌)గా చూస్తారు. అదే ఏడాది లోపు విక్రయించగా వచ్చిన లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్‌టీసీజీ)గాను.. నష్టం వస్తే స్వల్పకాల మూలధన నష్టం(ఎస్‌టీసీఎల్‌)గాను పరిగణిస్తారు.

ఎల్‌టీసీజీపై 10 శాతం పన్ను చెల్లించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మొదటి రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను లేదు. రూ.లక్షకు మించి ఉన్న లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్‌టీసీజీపై 15 శాతం పన్ను చెల్లించాలి. ఇందులో బేసిక్‌ పరిమితి అంటూ ఏదీ లేదు. అంటే ఏడాదిలోపు పెట్టుబడులపై లాభం రూ.1,000 వచ్చినా ఆ మొత్తంపై 15 శాతం పన్ను చెల్లించాల్సిందే. ఎల్‌టీసీజీ 2018 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.  

కొద్ది కొద్దిగా...
పన్ను ఆదా చేసుకునేందుకు మరో మార్గం.. ఒకే విడత వెనక్కి తీసేసుకోకుండా పరిమితి పాటించడం. ‘‘ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపంలో షేర్లపై ఎల్‌టీసీజీ రూ.2లక్షలు ఉందనుకుంటే ఒకే పర్యాయం మొత్తాన్ని విక్రయించకుండా రెండు భాగాలు చేసుకుని.. ఒక భాగాన్ని నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలోనూ, మరో భాగాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభంలో వెనక్కి తీసుకోవాలి’’ అని ట్యాక్‌మన్‌కు చెందిన వాధ్వాన్‌ సూచించారు. అప్పుడు పన్ను భారం సున్నా అవుతుంది.

ఒకవేళ మూలధన లాభాల పన్ను గణనీయంగా ఉన్నట్టయితే.. అప్పుడు రెండు భాగాలు చేసినా కానీ చెల్లించాల్సిన పన్ను గణనీయంగా ఏమీ తగ్గదు. పన్ను ఆదా కోసం పెట్టుబడుల ఉపసంహరణను మరింత దీర్ఘకాలం పాటు వాయిదా వేయడం కూడా సరికాదు. దీనివల్ల మార్కెట్‌లో పరిస్థితులు మారిపోతే రిస్క్‌లో చిక్కుకున్నట్టు అవుతుంది. దీనికి మోహన్‌ మరో పరిష్కారాన్ని సూచించారు. ‘‘పెద్ద పోర్ట్‌ఫోలియో నిర్వహించే వారు.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభం మినహాయింపు తర్వాత కూడా పన్ను చెల్లించాల్సిన లాభం ఉన్నట్టయితే పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్లడమే’’ అని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ సీఈవో గౌరవ్‌ మోహన్‌ పేర్కొన్నారు. అంటే మూలధన లాభాల పన్ను రూ.లక్షకు సమీపించగానే విక్రయించడం.. తిరిగి మరుసటి రోజు కొనుగోలు చేయడం.

దీనివల్ల లావాదేవీల వ్యయాలే తప్పించి మూలధన లాభాల పన్ను భారం ఉండదు. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌కూ ఇదే అమలవుతుంది. ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేసిన (సిప్‌ అయితే విడిగా ప్రతీ సిప్‌ కొనుగోలు చేసిన తేదీ నుంచి) నాటి నుంచి ఏడాది, ఆ తర్వాత విక్రయించగా వచ్చిన లాభంపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను, ఏడాదిలోపు అయితే 15 శాతం పన్ను చెల్లించాలి. కనుక షేర్లు, ఈక్విటీ ఫండ్స్‌ విషయంలో పెట్టుబడి ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న వెంటనే అందులోని మూలధన లాభాన్ని రూ.లక్ష వరకు తీసేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. కాకపోతే ఏడాది రాకుండా విక్రయిస్తే పన్ను భారం 15 శాతం అవుతుందని మర్చిపోవద్దు. అలాగే, మీ పోర్ట్‌ఫోలి యోలోని షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు అన్నింటికీ పన్ను లేని మూలధన లాభం గరిష్టంగా రూ.లక్షే అవుతుంది. ఒక్కో దానికి విడిగా రూ.లక్ష అనుకోవద్దు.

ఇల్లు కొనుక్కోవడం
ఈక్విటీ షేర్ల విక్రయాలపై ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు కోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 54ఎఫ్‌ కింద.. నూతన ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి ఆ మొత్తాన్ని వినియోగించాలి. కేవలం లాభాలే కాకుండా విక్రయం ద్వారా సమకూరిన మొత్తాన్ని నూతన ఇంటిపై వినియోగించాలి. మొదటి ఇంటికే ఇది పరిమితం. నూతన ఇల్లు కొనుగోలు అయితే ఈక్విటీ షేర్లను విక్రయించిన నాటి నుంచి రెండేళ్లలోగా చేయాలి. నూతన ఇంటి నిర్మాణం కోసం వినియోగించేట్టు అయితే మూడేళ్లలోగా చేయాలి. అంతేకాదు ఇలా చేసిన తర్వాత ఏడాది లోపు రెండో ఇల్లు  కొనుగోలు చేయకూడదు లేదా మూడేళ్లలోపు రెండో ఇంటిని నిర్మించకూడదు.

అలాగే మూలధన లాభాల పన్ను మినహాయింపునకు కొనుగోలు చేసిన మొదటి ఇంటిని లేదా నిర్మించుకున్న ఇంటిని మూడేళ్ల వరకు విక్రయించకూడదు. ఈ నిబంధనలను పాటించకపోతే కల్పించిన మినహాయింపులను త్యజించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  షేర్లను విక్రయించిన సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు సమయం సమీపిస్తున్నట్టయితే క్యాపిటల్‌ గెయిన్స్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకుని రిటర్నుల్లో పేర్కొనాలి. ఆ తర్వాత చట్టం అనుమతించిన సమయంలోపు మొదటి ఇంటిని సమకూర్చుకోవడంపై వ్యయం చేయాల్సి ఉంటుంది. షేర్లను విక్రయించడానికి ముందు ఏడాదిలోపు నూతన ఇంటిని కొనుగోలు చేసినా పన్ను మినహాయింపు కోరవచ్చు. ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను భారం వద్దనుకుంటే అందుకోసం 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ఒక ఆప్షన్‌.

ఎక్కువ ఆదా అయితేనే ప్రయోజనం
చిన్న ఇన్వెస్టర్లకు ఇంతకు ముందు పేర్కొన్న విధాలనాలతో పన్ను ఆదా చేసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. మరి రూ.కోట్లలో పెట్టుబడులను నిర్వహించే వారు ఏటా రూ.లక్ష వరకే మూలధ లాభాలను పరిమితం చేసుకోవడం ఆచరణలో అసాధ్యం. కనుక వారు మొత్తం పోర్ట్‌ఫోలియోని సమీక్షించుకుని.. స్వల్పకాల నష్టాల్లో ఉన్న స్టాక్స్‌ను విక్రయించడం ద్వారా.. అటు స్వల్పకాల మూలధన లాభాలు, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను భారాన్ని కొంత వరకు అయినా తగ్గించుకోవచ్చు. ‘‘ఎల్‌టీసీజీని సరిగ్గా మదింపు వేసుకోవడమే కాకుండా లాభ, నష్టాల సర్దుబాటులో భాగంగా విక్రయించిన స్టాక్స్‌ను మరుసటి రోజు మళ్లీ కొనుగోలు చేసుకోవాలి. విక్రయించిన పెట్టుబడులను మళ్లీ ఇన్వెస్ట్‌ చేసేందుకు సమయం తీసుకుంటే ఈ లోపు ఆ నిధులు వేరే అవసరాలకు కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా చేయడం వల్ల దీర్ఘకాల లక్ష్యాల విషయంలో రాజీపడాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా ఒక రిస్క్‌ ఉంటుంది.

విక్రయించిన ధరకే తిరిగి కొనుగోలు చేసకునే అవకాశం అన్ని సందర్భాల్లోనూ ఉంటుందని చెప్పడానికి లేదు. ధరల్లో గణనీయమైన వ్యత్యాసం కూడా రావచ్చు. విక్రయించిన తర్వాత స్టాక్‌ ధర పడిపోతే లాభమే కానీ, పెరిగిపోతేనే సమస్య. మ్యూచువల్‌ ఫండ్స్‌ అయితే విక్రయించిన మేర ఇన్వెస్టర్‌ బ్యాంకు ఖాతాకు చేరుకునేందుకు మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి తీసుకోవచ్చు. కనుక తిరిగి ఇన్వెస్ట్‌ చేసే సమయానికి ధరల్లో వ్యత్యాసం వస్తే ఈ విధమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకనే ఇలా చేయడం వల్ల ఎంత మేర మూలధన లాభాల పన్ను ఆదా అవుతుందన్న అంచనాకు ముందుగానే రావాలి. కనీసం 10–20 శాతం మేర ఆదా అవుతుందనుకుంటే ధరల పరంగా రిస్క్‌ను అధిగమించే వెసులుబాటు ఉంటుంది. అంతేకానీ, కొద్ది మేర పన్ను ఆదా కోసం హోల్డింగ్స్‌ను విక్రయించడం అంతగా కలసిరాకపోవచ్చు. ఎందుకంటే స్టాక్స్‌ అయితే స్టాంప్‌ డ్యూటీ, బ్రోకరేజీ, ఎక్సే్ఛంజ్‌ చార్జీలు చెల్లించుకోవాలి. దీనికి ధరల్లో వ్యత్యాసం అదనం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement