అమెరికా స్టాక్స్‌లోనూ పెట్టుబడులకు అవకాశం
పోర్ట్‌ఫోలియోకి మరింత స్థిరత్వం
రూపాయి విలువ క్షీణతకు చెక్
పెట్టుబడులకు వైవిధ్యం ప్రాణం.
‘పెట్టుబడుల్లో ఉచితంగా వచ్చేది ఏదైనా ఉందంటే అది వైవిధ్యమే’ అన్నది ఆధునిక ఫైనాన్స్‌కు పితామహుడిగా చెప్పుకునే, నోబెల్ పురస్కార గ్రహీత హ్యారీ మర్కోవిజ్ అభిప్రాయం. వైవిధ్యం అంటే పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి ఏదో ఒక సాధనంలో ఉంచకపోవడం. మార్కెట్ అస్థిరతలు, ఊహించని నష్టాల నుంచి పెట్టుబడులకు ఈ వైవిధ్యమే రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈక్విటీలు, ఎఫ్‌డీలు, బాండ్లు, బంగారం, రియల్ ఎస్టేట్ ఇలా భిన్న సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవాలి. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లోనూ కొంత మేర అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ వైవిధ్యాన్ని మరింత విస్తృతం చేసుకున్నట్టు అవుతుంది.
భారత్ శరవేగంగా వృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు ఈక్విటీ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని వేరే దేశానికి ఎందుకు కేటాయించుకోవడం అన్న సందేహం రావచ్చు. కానీ, ఒక మార్కెట్‌కే పరిమితం కావడం వల్ల ఆ దేశానికి సంబంధించి ఆర్థికపరమైన రిస్క్‌ల ప్రభావం పెట్టుబడులపై అధికంగా ఉంటుంది. ఇది రాబడులపైనా ప్రభావం చూపిస్తుంది.
గడిచిన నాలుగైదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే.. నిఫ్టీ 50 సూచీ కంటే అమెరికా ఎస్‌అండ్‌పీ 500 (ప్రధాన సూచీ) అధిక రాబడులు అందించింది. ఇదే కాలంలో అమెరికా వృద్ధి రేటు కంటే భారత్ వృద్ధి రేటు మూడు రెట్లు అధికం. అయినా కానీ, రాబడుల్లో ఎస్‌అండ్‌పీ సూచీయే ముందుంది. దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు చిరునామా అమెరికా స్టాక్ మార్కెట్. అలాంటి గొప్ప కంపెనీల్లో పెట్టుబడులతో వైవిధ్యం మరింత బలపడుతుందన్నది నిపుణుల సూచన. ఈక్విటీ పెట్టుబడుల వైవిధ్యంతో వచ్చే ప్రయోజనాలపై అవగాహన కలి్పంచే కథనమే ఇది.
వైవిధ్యం ఎందుకు..?
భారత్‌కు వెలుపల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం ఆధారంగానే ఉంటుంది. గడిచిన రెండు మూడు దశాబ్దాల కాలంలో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లను పరిశీలిస్తే.. గొప్ప పనితీరు చూపించిన రెండు మార్కెట్లు భారత్, అమెరికా. అందుకే ఈ రెండు ఈక్విటీ మార్కెట్ల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. రిస్క్ సమతుల్యతతోపాటు గొప్ప రాబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
అమెరికా, భారత్ ఈక్విటీలు గత 20 ఏళ్ల కాలంలో గొప్ప రాబడులు ఇచి్చనప్పటికీ వీటి మధ్య సహ సంబంధం తక్కువ. అభివృద్ధి చెందిన ఈక్విటీ మార్కెట్లకు, భారత్‌కు మధ్య పనితీరు విషయంలో 60–80 శాతం వరకు పరస్పర సంబంధం ఉంటోంది. అదే అమెరికాకు వచ్చేటప్పటికి (2008 ఆరి్థక మాంద్యం, కరోనా మినహా) ఇది 50 శాతమే. కనుక రిస్క్, రాబడులను బ్యాలన్స్ చేసుకోవడమే కాదు.. రెండు ఆరి్థక వ్యవస్థల్లోని అనుకూలతల నుంచి ప్రయోజనాలు పొందొచ్చు.
రూపాయి క్షీణతకు హెడ్జింగ్
ప్రతి కొన్నేళ్లకోసారి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు బాటలో నడుస్తుంటుంది. ఆ సమయంలో భారత్ సహా వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలి్చతే యూఎస్ డాలర్ బలోపేతం కావడం గమనించొచ్చు. 2011లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 45 డాలర్ల వద్ద ఉంది. ఇప్పుడు 84 డాలర్లను దాటేసింది. ట్రంప్ 2.0 నాలుగేళ్ల పాలనలో రూపాయి మరో 6–8 శాతం క్షీణిస్తుందన్న అంచనాలున్నాయి.
అమెరికా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి రూపాయి విలువ క్షీణతతో రెండు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడుల వృద్ధికితోడు.. పెట్టుబడుల ఉపసంహరణతో మరిన్ని రూపాయిలు (విలువ క్షీణత వల్ల) చేతికి వస్తాయి. రూపాయి విలువ క్షీణత అన్నది యూఎస్ ఈక్విటీ రాబడులను ఇతోధికం చేస్తుంది. సాధారణంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు క్రమంలో విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటుంటారు. ఆ సమయంలో మన ఈక్విటీలు ప్రతికూలతలను చూస్తుంటాయి.
భవిష్యత్ అవసరాల కోసం..
మన దేశం నుంచి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు అమెరికాకు వెళుతున్నారు. అంతేకాదు విద్య అనంతరం ఉపాధి కోసం వెళుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ఇలాంటి వారికి యూఎస్ పెట్టుబడులు అనుకూలం. అధిక ఆదాయ వర్గాలు విదేశీ పర్యటనలకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకోసం డాలర్ల రూపంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
పిల్లలను విదేశాల్లో చదివించుకోవాలంటే యూఎస్ డాలర్ మారకంలోనే చెల్లింపులు చేయాల్సి వస్తుంది. విదేశీ కోర్సుల వ్యయం ఏటా నిరీ్ణత శాతం మేర పెరుగుతుంది. అదే సమయంలో ఏటా రూపాయి విలువ క్షీణతతో ఆ విద్యా వ్యయం ఇంకాస్త అధికమవుతోంది. అందుకే డాలర్ మారకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూపాయి విలువ క్షీణతతో ఏర్పడే భారాన్ని తొలగించుకోవచ్చు. రూపాయి అస్థిరతలను తగ్గించుకోవచ్చు.
ఎలా ఇన్వెస్ట్ చేయాలి..?
భారత స్టాక్స్ మాదిరే నేరుగా అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా మ్యూచువల్ ఫండ్స్/ఈటీఎఫ్‌ల ద్వారా ఎక్స్‌పోజర్ తీసుకోవచ్చు. యూఎస్ స్టాక్ బ్రోకర్లతో మన దేశ స్టాక్ బ్రోకర్లు కొందరికి ఒప్పందాలు ఉన్నాయి. అలాంటి దేశీ బ్రోకర్ ద్వారా అకౌంట్ ప్రారంభించి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తదితర సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి.
మ్యూచువల్ ఫండ్స్
→ యాక్సిస్ నాస్‌డాక్ 100 ఎఫ్‌వోఎఫ్
→ ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ నాస్‌డాక్ 100 ఎఫ్‌వోఎఫ్
→ బంధన్ యూఎస్ ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్
→ ఎడెల్‌వీజ్ యూఎస్ టెక్నాలజీ ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్
→ కోటక్ నాస్‌డాక్ 100 ఎఫ్‌వోఎఫ్,
→ ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫ్రాంక్లిన్ యూఎస్ అపార్చునిటీస్ ఫండ్
→ మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 ఎఫ్‌వోఎఫ్
→ ఇన్వెస్కో ఇండియా నాస్‌డాక్ 100 ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
రెట్టింపు కాంపౌండింగ్
వాటాదారులకు సంపదను సమకూర్చడంలో యూఎస్, భారత ఈక్విటీ మార్కెట్లు గత కొన్ని దశాబ్దలుగా ఎంతో మెరుగైన పనితీరు చూపిస్తున్నాయి. ఈ రెండు మార్కెట్లను భిన్నమైన వృద్ధి చోదకాలు నడిపిస్తుంటాయి. అయినా కొన్ని ఏకరూప అంశాలు కూడా ఉన్నాయి. రెండు దేశాల్లోనూ గణనీయ సంఖ్యలో వినియోగదారులున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు.
మార్కెట్ ఆధారిత ఆరి్థక వ్యవస్థలు. అందుకే మిగిలిన మార్కెట్లకు భిన్నంగా అమెరికా, భారత్ దీర్ఘకాలంగా ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు అందిస్తున్నాయి. ఈ రెండు దేశాల స్టాక్స్‌లోనూ పెట్టుబడులు సంపద సృష్టికి రెండు ఇంజన్ల మాదిరిగా పనిచేస్తాయి. వర్ధమాన మార్కెట్లలో అత్యధిక వృద్ధి అవకాశాలు భారత ఈక్విటీల ద్వారా.. టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ గూడ్స్ పరంగా దిగ్గజ కంపెనీల్లో ఎక్స్‌పోజర్ అమెరికన్ ఈక్విటీల ద్వారా సొంతం చేసుకోవచ్చు.
ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ
ఎన్‌ఎస్‌ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్‌ఎస్‌సీ)ని ప్రారంభించింది. ఇక్కడ ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా ప్రారంభించడం ద్వారా యూఎస్‌కు చెందిన 50 స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ ద్వారా ఖాతా తెరిచి, బ్యాంక్ ఖాతా నుంచి ఫండ్స్ బదిలీ చేసుకుని షేర్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఒక ఆరి్థక సంవత్సరంలో ఒకరు గరిష్టంగా 2,50,000 డాలర్లను విదేశాల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంది
స్థిరత్వం.. రాబడులు
ఆరి్థక మందగమన సమయాల్లో అమెరికా, భారత మార్కెట్లు ఒకే మాదిరి పనితీరు చూపించాలని లేదు. గడిచిన 20 ఏళ్లలో యూఎస్, భారత ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే భారీ మార్కెట్ పతనాల్లో నష్టాలు తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చాలా అరుదుగానే ఈ రెండు ఒకే మాదిరి ప్రవర్తిస్తాయి. అంతర్జాతీయ సంక్షోభాల్లో రూపాయితో డాలర్ బలపడుతుంటుంది. దీంతో ఆ సమయంలో యూఎస్ పెట్టుబడులు అదనపు విలువను సమకూరుస్తాయి. ఇదే నష్టాలను తగ్గించి, పెట్టుబడులకు స్థిరత్వాన్ని ఇస్తుంది.
అమెరికా స్టాక్స్, భారత స్టాక్స్‌కు 50:50 రేషియోలో పెట్టుబడులు కేటాయించుకోవడం వల్ల రిస్క్ ఆధారిత మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రిస్‌్కను పరిమితం చేసుకుని, వీలైనంత అధిక రాబడులు సమకూర్చుకోవడమే విజయవంతమైన పెట్టుబడి విధానం రహస్యం. భారత ఇన్వెస్టర్లకు విదేశీ స్టాక్స్ అన్నవి సమతూకాన్నిస్తాయి. ఒకటి అభివృద్ధి చెందిన దేశం అయితే, రెండేది 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో పనిచేస్తున్న దేశం. రెండింటిలోనూ వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోవడం ఇన్వెస్టర్ల ముందున్న మెరుగైన మార్గాల్లో ఒకటి.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment