Equity investments
-
విదేశీ ‘స్టాక్స్’ షాపింగ్ చేద్దామా!
‘పెట్టుబడుల్లో ఉచితంగా వచ్చేది ఏదైనా ఉందంటే అది వైవిధ్యమే’ అన్నది ఆధునిక ఫైనాన్స్‌కు పితామహుడిగా చెప్పుకునే, నోబెల్ పురస్కార గ్రహీత హ్యారీ మర్కోవిజ్ అభిప్రాయం. వైవిధ్యం అంటే పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి ఏదో ఒక సాధనంలో ఉంచకపోవడం. మార్కెట్ అస్థిరతలు, ఊహించని నష్టాల నుంచి పెట్టుబడులకు ఈ వైవిధ్యమే రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈక్విటీలు, ఎఫ్డీలు, బాండ్లు, బంగారం, రియల్ ఎస్టేట్ ఇలా భిన్న సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవాలి. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లోనూ కొంత మేర అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ వైవిధ్యాన్ని మరింత విస్తృతం చేసుకున్నట్టు అవుతుంది.భారత్ శరవేగంగా వృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు ఈక్విటీ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని వేరే దేశానికి ఎందుకు కేటాయించుకోవడం అన్న సందేహం రావచ్చు. కానీ, ఒక మార్కెట్‌కే పరిమితం కావడం వల్ల ఆ దేశానికి సంబంధించి ఆర్థికపరమైన రిస్క్‌ల ప్రభావం పెట్టుబడులపై అధికంగా ఉంటుంది. ఇది రాబడులపైనా ప్రభావం చూపిస్తుంది. గడిచిన నాలుగైదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే.. నిఫ్టీ 50 సూచీ కంటే అమెరికా ఎస్అండ్పీ 500 (ప్రధాన సూచీ) అధిక రాబడులు అందించింది. ఇదే కాలంలో అమెరికా వృద్ధి రేటు కంటే భారత్ వృద్ధి రేటు మూడు రెట్లు అధికం. అయినా కానీ, రాబడుల్లో ఎస్అండ్పీ సూచీయే ముందుంది. దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు చిరునామా అమెరికా స్టాక్ మార్కెట్. అలాంటి గొప్ప కంపెనీల్లో పెట్టుబడులతో వైవిధ్యం మరింత బలపడుతుందన్నది నిపుణుల సూచన. ఈక్విటీ పెట్టుబడుల వైవిధ్యంతో వచ్చే ప్రయోజనాలపై అవగాహన కలి్పంచే కథనమే ఇది. వైవిధ్యం ఎందుకు..? భారత్‌కు వెలుపల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం ఆధారంగానే ఉంటుంది. గడిచిన రెండు మూడు దశాబ్దాల కాలంలో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లను పరిశీలిస్తే.. గొప్ప పనితీరు చూపించిన రెండు మార్కెట్లు భారత్, అమెరికా. అందుకే ఈ రెండు ఈక్విటీ మార్కెట్ల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. రిస్క్ సమతుల్యతతోపాటు గొప్ప రాబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. అమెరికా, భారత్ ఈక్విటీలు గత 20 ఏళ్ల కాలంలో గొప్ప రాబడులు ఇచి్చనప్పటికీ వీటి మధ్య సహ సంబంధం తక్కువ. అభివృద్ధి చెందిన ఈక్విటీ మార్కెట్లకు, భారత్‌కు మధ్య పనితీరు విషయంలో 60–80 శాతం వరకు పరస్పర సంబంధం ఉంటోంది. అదే అమెరికాకు వచ్చేటప్పటికి (2008 ఆరి్థక మాంద్యం, కరోనా మినహా) ఇది 50 శాతమే. కనుక రిస్క్, రాబడులను బ్యాలన్స్ చేసుకోవడమే కాదు.. రెండు ఆరి్థక వ్యవస్థల్లోని అనుకూలతల నుంచి ప్రయోజనాలు పొందొచ్చు.రూపాయి క్షీణతకు హెడ్జింగ్ ప్రతి కొన్నేళ్లకోసారి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు బాటలో నడుస్తుంటుంది. ఆ సమయంలో భారత్ సహా వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలి్చతే యూఎస్ డాలర్ బలోపేతం కావడం గమనించొచ్చు. 2011లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 45 డాలర్ల వద్ద ఉంది. ఇప్పుడు 84 డాలర్లను దాటేసింది. ట్రంప్ 2.0 నాలుగేళ్ల పాలనలో రూపాయి మరో 6–8 శాతం క్షీణిస్తుందన్న అంచనాలున్నాయి. అమెరికా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి రూపాయి విలువ క్షీణతతో రెండు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడుల వృద్ధికితోడు.. పెట్టుబడుల ఉపసంహరణతో మరిన్ని రూపాయిలు (విలువ క్షీణత వల్ల) చేతికి వస్తాయి. రూపాయి విలువ క్షీణత అన్నది యూఎస్ ఈక్విటీ రాబడులను ఇతోధికం చేస్తుంది. సాధారణంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు క్రమంలో విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటుంటారు. ఆ సమయంలో మన ఈక్విటీలు ప్రతికూలతలను చూస్తుంటాయి.భవిష్యత్ అవసరాల కోసం.. మన దేశం నుంచి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు అమెరికాకు వెళుతున్నారు. అంతేకాదు విద్య అనంతరం ఉపాధి కోసం వెళుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ఇలాంటి వారికి యూఎస్ పెట్టుబడులు అనుకూలం. అధిక ఆదాయ వర్గాలు విదేశీ పర్యటనలకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకోసం డాలర్ల రూపంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పిల్లలను విదేశాల్లో చదివించుకోవాలంటే యూఎస్ డాలర్ మారకంలోనే చెల్లింపులు చేయాల్సి వస్తుంది. విదేశీ కోర్సుల వ్యయం ఏటా నిరీ్ణత శాతం మేర పెరుగుతుంది. అదే సమయంలో ఏటా రూపాయి విలువ క్షీణతతో ఆ విద్యా వ్యయం ఇంకాస్త అధికమవుతోంది. అందుకే డాలర్ మారకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూపాయి విలువ క్షీణతతో ఏర్పడే భారాన్ని తొలగించుకోవచ్చు. రూపాయి అస్థిరతలను తగ్గించుకోవచ్చు. ఎలా ఇన్వెస్ట్ చేయాలి..? భారత స్టాక్స్ మాదిరే నేరుగా అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా మ్యూచువల్ ఫండ్స్/ఈటీఎఫ్‌ల ద్వారా ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. యూఎస్ స్టాక్ బ్రోకర్లతో మన దేశ స్టాక్ బ్రోకర్లు కొందరికి ఒప్పందాలు ఉన్నాయి. అలాంటి దేశీ బ్రోకర్ ద్వారా అకౌంట్ ప్రారంభించి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తదితర సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ → యాక్సిస్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్ → ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్ → బంధన్ యూఎస్ ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్ → ఎడెల్వీజ్ యూఎస్ టెక్నాలజీ ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్ → కోటక్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్, → ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫ్రాంక్లిన్ యూఎస్ అపార్చునిటీస్ ఫండ్ → మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్ → ఇన్వెస్కో ఇండియా నాస్డాక్ 100 ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.రెట్టింపు కాంపౌండింగ్ వాటాదారులకు సంపదను సమకూర్చడంలో యూఎస్, భారత ఈక్విటీ మార్కెట్లు గత కొన్ని దశాబ్దలుగా ఎంతో మెరుగైన పనితీరు చూపిస్తున్నాయి. ఈ రెండు మార్కెట్లను భిన్నమైన వృద్ధి చోదకాలు నడిపిస్తుంటాయి. అయినా కొన్ని ఏకరూప అంశాలు కూడా ఉన్నాయి. రెండు దేశాల్లోనూ గణనీయ సంఖ్యలో వినియోగదారులున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు. మార్కెట్ ఆధారిత ఆరి్థక వ్యవస్థలు. అందుకే మిగిలిన మార్కెట్లకు భిన్నంగా అమెరికా, భారత్ దీర్ఘకాలంగా ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు అందిస్తున్నాయి. ఈ రెండు దేశాల స్టాక్స్‌లోనూ పెట్టుబడులు సంపద సృష్టికి రెండు ఇంజన్ల మాదిరిగా పనిచేస్తాయి. వర్ధమాన మార్కెట్లలో అత్యధిక వృద్ధి అవకాశాలు భారత ఈక్విటీల ద్వారా.. టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ గూడ్స్ పరంగా దిగ్గజ కంపెనీల్లో ఎక్స్పోజర్ అమెరికన్ ఈక్విటీల ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)ని ప్రారంభించింది. ఇక్కడ ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా ప్రారంభించడం ద్వారా యూఎస్‌కు చెందిన 50 స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ ద్వారా ఖాతా తెరిచి, బ్యాంక్ ఖాతా నుంచి ఫండ్స్ బదిలీ చేసుకుని షేర్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక ఆరి్థక సంవత్సరంలో ఒకరు గరిష్టంగా 2,50,000 డాలర్లను విదేశాల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంది స్థిరత్వం.. రాబడులు ఆరి్థక మందగమన సమయాల్లో అమెరికా, భారత మార్కెట్లు ఒకే మాదిరి పనితీరు చూపించాలని లేదు. గడిచిన 20 ఏళ్లలో యూఎస్, భారత ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే భారీ మార్కెట్ పతనాల్లో నష్టాలు తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చాలా అరుదుగానే ఈ రెండు ఒకే మాదిరి ప్రవర్తిస్తాయి. అంతర్జాతీయ సంక్షోభాల్లో రూపాయితో డాలర్ బలపడుతుంటుంది. దీంతో ఆ సమయంలో యూఎస్ పెట్టుబడులు అదనపు విలువను సమకూరుస్తాయి. ఇదే నష్టాలను తగ్గించి, పెట్టుబడులకు స్థిరత్వాన్ని ఇస్తుంది. అమెరికా స్టాక్స్, భారత స్టాక్స్‌కు 50:50 రేషియోలో పెట్టుబడులు కేటాయించుకోవడం వల్ల రిస్క్ ఆధారిత మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రిస్‌్కను పరిమితం చేసుకుని, వీలైనంత అధిక రాబడులు సమకూర్చుకోవడమే విజయవంతమైన పెట్టుబడి విధానం రహస్యం. భారత ఇన్వెస్టర్లకు విదేశీ స్టాక్స్ అన్నవి సమతూకాన్నిస్తాయి. ఒకటి అభివృద్ధి చెందిన దేశం అయితే, రెండేది 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో పనిచేస్తున్న దేశం. రెండింటిలోనూ వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోవడం ఇన్వెస్టర్ల ముందున్న మెరుగైన మార్గాల్లో ఒకటి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రియల్ ఎస్టేట్‌లో ఈక్విటీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలో ప్రస్తుత సంవత్సరం ఈక్విటీ పెట్టుబడులు 49 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. ఆస్తులకు బలమైన డిమాండ్ ఈ స్థాయి జోరుకు కారణమని వివరించింది.‘2023లో ఈక్విటీ పెట్టుబడులు ఈ రంగంలో 7.4 బిలియన్ డాలర్లు. ఈక్విటీ మూలధన ప్రవాహం 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య 8.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో 2024లో మొత్తం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మొదటిసారిగా 10 బిలియన్ డాలర్లను అధిగమించి కొత్త రికార్డును నమోదు చేయబోతున్నాయి. నిర్మాణం పూర్తి అయిన ఆఫీస్ అసెట్స్‌లో పెట్టుబడుల పునరుద్ధరణ, రెసిడెన్షియల్ విభాగంలో స్థలాల కోసం బలమైన డిమాండ్‌తో ప్రస్తుత సంవత్సరం మొత్తం ఈక్విటీ పెట్టుబడులు 10–11 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉంటాయి.2024 జనవరి–సెప్టెంబర్ మధ్య పరిశ్రమ అందుకున్న నిధుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 3.1 బిలియన్ డాలర్లు ఉంది. ఇందులో ఉత్తర అమెరికా, సింగపూర్ ఇన్వెస్టర్లు 85 శాతం సమకూర్చారు. సెబీ యొక్క ఎస్ఎం–ఆర్ఈఐటీ ఫ్రేమ్‌వర్క్‌తో ద్వితీయ శ్రేణి నగరాల్లో అధిక నాణ్యత గల చిన్న స్థాయి ఆస్తులు కూడా వ్యూహా త్మక మూలధన విస్తరణకు కొత్త మార్గాలను అందజేస్తాయి’ అని నివేదిక వివరించింది. -
క్యూ3లో 25 రియల్ ఎస్టేట్ డీల్స్..
దేశీ రియల్టీ రంగంలో ఈ కేలండర్ సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో 25 డీల్స్ జరిగినట్లు కన్సల్టింగ్ సంస్థ గ్రాంట్ థార్న్టన్ భారత్ నివేదిక పేర్కొంది. వీటి విలువ 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,760 కోట్లు)గా తెలియజేసింది. ప్రధానంగా డెవలపర్స్ చేపట్టిన అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)దే వీటిలో ప్రధాన వాటాగా వెల్లడించింది. ‘రియల్టీ, రీట్స్ డీల్ ట్రాకర్– ఎంఅండ్ఏ, పీఈ డీల్ ఇన్సైట్స్’ పేరుతో విడుదల చేసిన నివేదిక వివరాలు చూద్దాం..కొత్త రికార్డ్ రియల్టీ రంగ జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది జులై–సెపె్టంబర్(క్యూ3)లో ఏకంగా 25 డీల్స్ నమోదయ్యాయి. పరిమాణంరీత్యా ఇది సరికొత్త రికార్డుకాగా.. విలువ(రూ. 11,760 కోట్లు)రీత్యా 2023 ఏడాది క్యూ2 తదుపరి గరిష్ట విలువగా నమోదైంది. ప్రధానంగా క్విప్ జారీ పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వీటికి రెసిడెన్షియల్, వాణిజ్య విభాగాలలో పీఈ నిధులు జత కలిశాయి. అంతేకాకుండా రియల్టీ టెక్నాలజీ కంపెనీలలోనూ ఒప్పందాలు కలిసొచ్చాయి. డీల్స్ తీరిలా క్యూ2లో నమోదైన మొత్తం డీల్స్‌లో 5.1 కోట్ల డాలర్ల విలువైన 8 ఒప్పందాలు కొనుగోళ్లు, విలీనం(ఎంఅండ్ఏ) విభాగంలో జరిగాయి. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) విభాగంలో 40.1 కోట్ల విలువైన 12 డీల్స్ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్–జూన్(క్యూ2)లో లభించిన 1.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే భారీగా క్షీణించాయి. కాగా.. క్యూ3లో 4.9 కోట్ల డాలర్ల విలువైన ఒక ఐపీవోసహా 94 కోట్ల డాలర్ల విలువైన క్విప్‌లు జారీ అయ్యాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్లు బలపడటం సహకరించింది. క్విప్‌లో 94 కోట్ల డాలర్ల విలువైన 4 డీల్స్ జరిగాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 60.2 కోట్ల డాలర్ల డీల్ దీనిలో కలసి ఉంది. ఇవి క్యూ2తో పోలిస్తే ఆరు రెట్లు అధికం. -
పెట్టుబడి మొత్తం ఈక్విటీలకేనా?
సంపాదనను సంపదగా మార్చుకోవాలంటే అనుకూలమైన వేదికల్లో ఈక్విటీ ముందుంటుంది. రియల్ ఎస్టేట్ సైతం దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టికి మార్గమవుతుంది. కానీ, ఈక్విటీ మాదిరి సులభమైన లిక్విడిటీ సాధనం రియల్ ఎస్టేట్ కాబోదు. మొత్తం పెట్టుబడిని ఒకటి రెండు రోజుల్లోనే వెనక్కి తీసుకోవడానికి స్టాక్ మార్కెట్ వీలు కలి్పస్తుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఈ విభాగం వైపు అడుగులు వేయడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి. అయితే, ఒకరి పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులు ఎంత మేర ఉండాలి..? రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మంది దీనికి సూటిగా బదులు ఇవ్వలేరు. ఈక్విటీల జిగేల్ రాబడులు చూసి చాలా మంది తమ పెట్టుబడులు మొత్తాన్ని స్టాక్స్‌లోనే పెట్టేస్తుంటారు. ఇలా చేయడం ఎంత వరకు సబబు? అసలు ఈ విధంగా చేయవచ్చా? ఒకరి పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉండాలి? ఈ విషయాలపై స్పష్టత కోసం కొన్ని కీలక అంశాలను ఒకసారి మననం చేసుకోవాల్సిందే. మీరు ఎలాంటి వారు? బుల్ మార్కెట్లో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడకపోవడం.. బేర్ మార్కెట్లో రిస్‌్కకు దూరంగా ఉండడం రిటైల్ ఇన్వెస్టర్లలో కనిపించే సాధారణ లక్షణం. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం. ‘‘ఇతరులు అత్యాశ చూపుతున్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయపడుతున్నప్పడు అత్యాశ చూపాలి’’ అన్నది బఫెట్ స్వీయ అనుభవ సారం. మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పైగా తమ రిస్క్ స్థాయి ఎంతన్నది కూడా పరిశీలించుకోరు. పెట్టుబడిపై భారీ రాబడుల అంచనాలే వారి నిర్ణయాలను నడిపిస్తుంటాయి. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లో రాణించాలంటే ఇలాంటి ప్రతికూల ధోరణలు అస్సలు పనికిరావు. అత్యవసర నిధి ఉన్నట్టుండి ఉపాధి కోల్పోయి ఏడాది, రెండేళ్ల పాటు ఎలాంటి ఆదాయం రాకపోయినా జీవించగలరా? ప్రతి ఒక్కరూ ఒకసారి ఇలా ప్రశ్నించుకోవాలి. లేదంటే ఏడాది, రెండేళ్ల జీవన అవసరాలు తీర్చే దిశగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాల్సిందే. దీర్ఘకాలం కోసమేనా?దీర్ఘకాలం అంటే ఎంత? అనే దానిపై ఇన్వెస్టర్లలో భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు 2–3 ఏళ్లు, కొందరు 5–10 ఏళ్లను దీర్ఘకాలంగా భావిస్తుంటారు. కానీ, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాలాన్ని మరిచి.. అవసరమైతే దశాబ్దాల పాటు ఆ పెట్టుబడులు కొనసాగించే మైండ్‌సెట్‌తో ఉండాలి. బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. నూరు శాతం కాదు..? ఎన్ని చెప్పుకున్నా.. మధ్యమధ్యలో అనుకోని ఆర్థిక అవసరాలు ఎదురవుతుంటాయి. కనుక సామాన్య మధ్యతరగతి ఇన్వెస్టర్లు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకుకోవడం సమంజసం కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇలాంటి వారు ఒకటి కంటే ఎక్కువ సాధనాల మధ్య పెట్టుబడులు వర్గీకరించుకోవాలి (అస్సెట్ అలోకేషన్). ఏ సాధనంలో ఎంతమేర అన్నది నిర్ణయించుకోవాలంటే.. విడిగా ఒక్కొక్కరి ఆరి్ధక అవసరాలు, లక్ష్యాలు, ఆశించే రాబడులు, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న కాల వ్యవధి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ అంటే? ఒకరు రూ.100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఇందులో ఈక్విటీకి ఎంత, డెట్‌కు ఎంత అన్నది నిర్ణయించుకోవడం. ఈ రెండు సాధనాలే కాదు, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరికైనా ఈ నాలుగు సాధనాలు సరిపోతాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డెట్‌లో రిస్క్ డెట్‌లో రిస్క్ లేదా? అంటే లేదని చెప్పలేం. ఇందులో వడ్డీ రేట్లు, క్రెడిట్ రిస్క్ ఉంటాయి. అందుకే ఏఏఏ రేటెడ్ సాధనాల ద్వారా క్రెడిట్ రిస్‌్కను దాదాపు తగ్గించుకోవచ్చు. డెట్‌కు సింహ భాగం, కొంత శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ‘ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్’ను సైతం అరుణ్ కుమార్ సూచించారు.బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. రాబడులు దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే కచి్చతంగా రాబడులే వస్తాయా? నిఫ్టీ 50 టీఆర్ఐ (రోలింగ్ రాబడులు) ఐదేళ్ల కాల పనితీరును గమనిస్తే ఒక్కో ఏడాది 47 శాతం పెరగ్గా, ఒక ఏడాది మైనస్ 1 శాతం క్షీణించింది. 2007 నుంచి 2023 మధ్య ఒక ఏడాది 52 శాతం, మరొక ఏడాది 25 శాతం వరకు నిఫ్టీ సూచీ నష్టపోయింది. కానీ, 55 శాతం, 76 శాతం రాబడులు ఇచి్చన సంవత్సరాలూ ఉన్నాయి.ఏ సాధనానికి ఎంత? సాధారణంగా ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాం. కనుక 20–30 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 70–80 శాతం వరకు కేటాయించుకున్నా పెద్ద రిస్క్ ఉండబోదు. ఎందుకంటే వారు తమ పెట్టుబడులను దీర్ఘకాలంపాటు అంటే 20 ఏళ్ల పాటు కొనసాగించే వెసులుబాటుతో ఉంటారు. అదే 30–40 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 50–70 శాతం మధ్య కేటాయించుకోవచ్చు. అంతకుపైన వయసున్న వారు 50 శాతం మించకుండా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. 70 శాతం ఈక్విటీ కేటాయింపులు చేసుకునే వారు 20 శాతం డెట్‌కు, 10 శాతం బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. 50 శాతం ఈక్విటీలకు కేటాయించే వారు 30–40 శాతం డేట్‌కు, బంగారానికి 10 శాతం వరకు కేటాయించొచ్చు. ఈ గణాంకాలన్నీ సాధారణీకరించి చెప్పినవి. విడిగా చూస్తే, 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి 5 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని అనుకుందాం. అటువంటప్పుడు పిల్లల ఉన్నత విద్యకు 10–15 ఏళ్ల కాలంలో నిరీ్ణత మొత్తం కావాల్సి వస్తుంది. అటువంటప్పుడు పెట్టుబడులకు 10–15 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక ఈక్విటీలకు 70 శాతం వరకు, మిగిలినది డెట్, గోల్డ్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు. పిల్లల వివాహం కోసం అయితే 20 ఏళ్లు, రిటైర్మెంట్ కోసం అయితే 30 ఏళ్ల కాలం ఉంటుంది. వీటి కోసం కూడా ఈక్విటీలకు గణనీయమైన కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ ఐదేళ్లలోపు లక్ష్యాలు అయితే 80 శాతం డెట్‌కు, 20 శాతం ఈక్విటీలకు (ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్) కేటాయించుకోవచ్చు. మూడేళ్ల లక్ష్యాల కోసం అయితే పూర్తిగా డెట్‌కే పరిమితం కావడం శ్రేయస్కరం.3టీ కార్యాచరణ అస్సెట్ అలోకేషన్ విషయంలో మూడు ‘టీ’ల కార్యాచరణను ఫండ్స్ ఇండియా రీసెర్చ్ హెడ్ అరుణ్ కుమార్ తెలియజేశారు. మొదటిది కాలం (టైమ్). ‘‘చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో డెట్ (ఫిక్స్డ్ ఇన్కమ్)తో పోలి్చనప్పుడు ఈక్విటీలే మెరుగైన పనితీరు చూపించాయి. కానీ స్వల్పకాలంలో 10–20 శాతం వరకు పతనాలు కనిపిస్తుంటాయి. అలాగే ఏడు–పదేళ్లకోసారి 30–60 శాతం వరకు పతనాలు కూడా సంభవిస్తుంటాయి. గత 40 ఏళ్ల చరిత్ర చూస్తే ఇదే తెలుస్తుంది. కానీ, ఈ 10–20 శాతం దిద్దుబాట్లు 30–60 శాతం పతనాలుగా ఎప్పుడు మారతాయన్నది ఎవరూ అంచనా వేయలేరు. ఇలాంటి పతనాలను ఎక్కువ మంది తట్టుకోలేరు. అందుకే పోర్ట్‌ఫోలియోలో డెట్‌ను చేర్చుకోవాలి. ఇది నిలకడైనది. దీర్ఘకాలంలో రాబడి 5–7 శాతం మధ్యే ఉంటుంది. కనుక ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్న విషయంలో కాలాన్ని చూడాలి. ఎంత ఎక్కువ కాలం ఉంటే, ఈక్విటీలకు ఎక్కువ పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. రెండోది టోలరెన్స్(టీ). అంటే నష్టాలను భరించే సామర్థ్యం. స్వల్పకాలంలో 10–20 శాతం పతనాలను తట్టుకునే సామర్థ్యం లేని వారు డెట్ కేటాయింపులు మరికాస్త పెంచుకోవచ్చు. ఈక్విటీలకు 50 శాతమే కేటాయించుకుంటే తరచూ వచ్చే పతనాల ప్రభావం తమ పోర్ట్‌ఫోలియోపై 10 శాతం, ఏడు–పదేళ్లకోసారి వచ్చే భారీ పతన ప్రభావాన్ని 25 శాతానికి తగ్గించుకోవచ్చు. మూడోది. ట్రేడాఫ్ (టీ). పెట్టుబడికి దీర్ఘకాలం ఉన్నప్పటికీ నష్టాల భయంతో రాబడుల్లో రాజీపడడం. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీల్లో దీర్ఘకాలం సగటు వార్షిక రాబడి) సంపాదిస్తే 20 ఏళ్లలో పెట్టుబడి 10 రెట్లు అవుతుంది. రాబడి ఏటా 10 శాతమే ఉంటే 20 ఏళ్లలో పెట్టుబడి ఏడు రెట్లే పెరుగుతుంది. 8 శాతం వార్షిక రాబడే వస్తే 20 ఏళ్లలో పెట్టుబడి ఐదు రేట్లే వృద్ధి చెందుతుంది. డెట్‌కు కేటాయింపులు పెంచుకున్నకొద్దీ అంతిమంగా నికర రాబడులు తగ్గుతుంటాయి’’ అని అరుణ్ కుమార్ వివరించారు. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారు 70–80 శాతం లార్జ్‌క్యాప్‌నకు, మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు 10–15 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు 5–10 శాతం మధ్య కేటాయించుకోవచ్చని సూచించారు. ఫండ్స్ ద్వారా అయినా సరే ఇంతే మేర ఆయా విభాగాల ఫండ్స్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు. -
బ్రోకింగ్ స్టాక్స్ మారథాన్
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలోఈక్విటీల వైపు వస్తుండడంతో బ్రోకింగ్ స్టాక్స్ గడిచిన కొన్నేళ్లలో మంచి రాబడులు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా కరోనా సమయంలో వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్లో కొత్త ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపు అడుగులు వేసేలా చేశాయని చెప్పుకోవాలి. దీంతో ట్రేడింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. కరోనా వైరస్ సమసిపోయి, ఇంటి నుంచే పని విధానం కూడా కనుమరుగు అవుతున్నప్పటికీ, మరోవైపు ఈక్విటీ మార్కెట్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ట్రేడింగ్ పరిమాణం గణనీయంగా నమోదవుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఏంజెల్ వన్, 5పైసా క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, చాయిస్ ఇంటర్నేషనల్ స్టాక్స్ ర్యాలీ రిటైల్ ఇన్వెస్టర్ల జోరుకు నిదర్శంగా చెప్పుకోవచ్చు. ఏంజెల్ వన్ స్టాక్ ఏడాది కాలంలో 90 శాతం రాబడులను ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ 77 శాతం పెరిగింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సైతం 21 శాతం రాబడిని ఇచి్చంది. లిస్టెడ్ బ్రోకరేజీ సంస్థల విలువ వృద్ధి వెనుక రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని ప్రధానంగా చెప్పుకోవాలని ట్రేడ్‌బుల్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ భవీక్ పాటిల్ తెలిపారు. డీమ్యాట్ ఖాతాల్లో భారీ వృద్ధి కరోనా తర్వాత డీమ్యాట్ ఖాతాల్లో గణనీయ వృద్ధి కనిపించింది. అంతేకాదు భవిష్యత్తులోనూ వీటి పెరుగుదల కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది బ్రోకరేజీ పరిశ్రమకు అనుకూలమని, టెక్నాలజీలో వచి్చన పురోగతి నేపథ్యంలో బ్రోకరేజీ సంస్థలు మరింత మంది క్లయింట్లకు సేవలు అందించగలవని స్టాక్స్‌బాక్స్ సీఈవో వంశీ కృష్ట పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లో కనిపించిన నిరంతరాయ ర్యాలీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించినట్టు చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి డీమ్యాట్ ఖాతాల సంఖ్య 13.22 కోట్లకు చేరింది. వీటిల్లో అధిక శాతం గడిచిన 11 నెలల కాలంలో ప్రారంభమైనవే కావడం గమనించొచ్చు. ఒకవైపు స్టాక్ మార్కెట్ ర్యాలీకితోడు, మరోవైపు ఐపీవోల బంపర్ లిస్టింగ్ మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితాలూ అనుకూలమే సెపె్టంబర్ త్రైమాసికంలో బ్రోకరేజీ కంపెనీలు మంచి సానుకూలతలను చూసినట్టు ఎం.స్టాక్ (మిరే అస్సెట్) రిటైల్ స్ట్రాటజీ హెడ్ ధర్మేంద్ర లోహర్ చెప్పారు. సూచీలు సెప్టెంబర్‌లో ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరుకోవడం, ఐపీవో ఇష్యూలు పెరగడాన్ని ప్రస్తావించారు. ‘‘సంప్రదాయ, బ్యాంక్ బ్రోకర్లు ఎక్కువగా లబ్ధి పొందారు. ఎందుకంటే వీరి ఆదాయం ప్రధానంగా ఈక్విటీల నుంచే ఉంటుంది. ఇది ఆయా సంస్థల లాభాలు, ఆదాయం వృద్ధికి దారితీశాయి’’అని ధర్మేంద్ర లోహర్ తెలిపారు. ‘‘కరోనా తర్వాత డీమ్యాట్ ఖాతాలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం కూడా పెరిగింది. దీంతో గడిచిన కొన్నేళ్లలో బ్రోకరేజీ సంస్థల ఆదాయం గణనీయంగా పెరిగేందుకు దోహదపడింది’’అని స్టాక్స్‌బాక్స్ కృష్ణ చెప్పారు. ఏంజెల్ వన్ సెపె్టంబర్ త్రైమాసికంలో 42 శాతం అధికంగా రూ.305 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుంది. ఒకే త్రైమాసికంలో అత్యధికంగా 21 లక్షల మంది క్లయింట్లకు పెంచుకుంది. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ లాభం సైతం 52 శాతం పెరిగింది. -
చిన్న పెట్టుబడి.. పెద్ద నిధిగా మారాలంటే?
వివేక్, బలరామ్ ఇద్దరూ మంచి స్నేహితులు. కానీ, ఈక్విటీ పెట్టుబడుల విషయానికొచ్చే సరికి ఇద్దరిదీ చెరోదారి. 2002లో ఇద్దరూ ఓ చెరో నాలుగైదు స్మాల్‌క్యాప్ కంపెనీల్లో రూ. 50 వేల చొప్పున ఇన్వెస్ట్ చేశారు. 2023 జనవరి నాటికి వివేక్ ఇన్వెస్ట్ చేసిన ఐదు కంపెనీల్లో రెండు మలీ్టబ్యాగర్లు అయ్యాయి. రెండు నష్టాలను ఇవ్వగా, ఒక్కటి మంచి రాబడులను ఇచి్చంది. మొత్తంగా అతడి రూ. 50వేల పెట్టుబడి 20 ఏళ్లలో రూ.18 లక్షలు అయింది. బలరామ్ నాలుగు కంపెనీల్లో మొత్తంగా రూ. 50 వేలు పెట్టుబడి పెట్టాడు. కానీ, 2023 జనవరిలో అతడి మొత్తం పెట్టుబడి రాబడితో కలసి రూ.6 లక్షలుగా మారింది. ఇద్దరి రాబడుల్లో అంత వ్యత్యాసం ఎందుకు ఉందంటే? వారు ఎంపిక చేసుకున్న కంపెనీల వల్లే. ఇక్కడ బలరామ్‌తో పోలిస్తే వివేక్ అంత భారీ రాబడులు పోగేసుకోవడం వెనుక అతడు నేర్చుకుని, తెలుసుకుని, తగినంత అధ్యయనం తర్వాత పెట్టుబడి పెట్టడం వల్లేనని చెప్పుకోవాలి. అందుకే స్మాల్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి ఓ కళగా నిపుణులు చెబుతారు. అన్నీ తెలుసుకుని, అవగాహనతోనే ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తుంటారు. స్మాల్‌క్యాప్ కంపెనీలు అంటే చాలా చౌకగా లభిస్తున్నాయనే అపోహ మనలో చాలా మందికి ఉంటుంది. కానీ, ఇది సరికాదు. రూ.16,472 కోట్ల మార్కెట్ విలువ వరకు ఇప్పుడు స్మాల్‌క్యాప్ కంపెనీలుగానే పరిగణిస్తున్నారు. లోగడ రూ.8,579 కోట్ల మార్కెట్ విలువ వరకు ఇలా పరిగణించేవారు. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో చాలా వరకు దశాబ్దాలుగా అదే స్థాయిలో ఉండిపోతాయి. కేవలం కొన్ని మాత్రం ఆయా రంగాల్లో లీడర్లుగా, పెద్ద స్థాయి కంపెనీలుగా అవతరిస్తాయి. వ్యాపారంలో వృద్ధి లేక అక్కడే ఉండిపోయే కంపెనీలు కూడా బోలెడు. కంపెనీ యాజమాన్యంలో సత్తా లేకపోవచ్చు. లేదా ఆ కంపెనీ చేస్తున్న వ్యాపారానికి పరిమిత అవకాశాలు ఉండొచ్చు. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, మూలధన నిధుల నిర్వహణ మెరుగ్గా లేకపోవచ్చు. సాధారణంగా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువ ఇలాంటివే కనిపిస్తుంటాయి. కానీ, కొన్ని మార్కెట్ గుర్తింపు లేకపోవడం వల్ల కూడా తక్కువ వేల్యూషన్ల వద్ద లభిస్తుంటాయి. లేదంటే అప్పటి వ్యాపార స్థాయి ఆధారంగా చిన్న కంపెనీలుగా ఉండి ఉండొచ్చు. ఇలాంటి నాణ్యమైన కొన్ని ఆణిముత్యాలను ఎంపిక చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మల్టీబ్యాగర్ రాబడులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్లలో ఒక ధోరణి కనిపిస్తుంది. స్టాక్ ధర రూ.100 లోపు లేదా రూ.10–50 లోపు ఉంటే చౌక అని భావిస్తుంటారు. రేటు తక్కువలో ఉంటే ఎక్కువ స్టాక్స్ వస్తాయని, వేగంగా రెండు మూడు రెట్లు పెరుగుతాయనే అపోహ ఉంటుంది. స్మాల్‌క్యాప్ కంపెనీయే అయినా ఒక్కో షేరు రూ.5,000 ఉండొచ్చు. మరో కంపెనీ షేరు ధర రూ.10 ఉండొచ్చు. షేరు ధర కంపెనీ ఆర్థిక మూలాలనే ప్రతిఫలిస్తుందన్నది మర్చిపోవద్దు. షేరు ధర తక్కువ, ఎక్కువలో ఉండడం అన్నది చౌక, ఖరీదైన దానికి నిదర్శనం కాదు. ఉదాహరణకు.. ‘ఏ’ అనే కంపెనీ మూలధనం రూ.10కోట్లు. షేరు ముఖ విలువ రూ.10 అప్పుడు కోటి షేర్లు ఉంటాయి. ‘బీ’ అనే కంపెనీ మూలధనం కూడా రూ.10 కోట్లు. కానీ షేరు ముఖ విలువ ఒక్కరూపాయే. కనుక 10 కోట్ల షేర్లు ఉంటాయని తెలుసుకోవాలి. కేవలం పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్ రేషియో/ఆర్జనకు షేరు ఎన్ని రెట్లు ఉంది) చూసి, తక్కువలో ఉందని కొనుగోలు చేయడం కూడా అన్ని సందర్భాల్లో సరైన ఫలితం ఇవ్వదని నిపుణులు చెబుతున్నారు. స్మాల్‌క్యాప్ అనేది పెద్ద ప్రపంచం. టాప్ 250 కాకుండా మార్కెట్లో ఉన్న మిగిలినవన్నీ కూడా స్మాల్‌క్యాప్ విభాగంలోకే వస్తాయి. అన్ని వందలు, వేల కంపెనీల నుంచి మాణిక్యాలను (చెత్త నుంచి మణి) వెలికితీయాలంటే లోతైన పరిశోధ న అవసరం. మెరుగైన అవకాశాలు రూ.16,472 కోట్ల వరకు స్మాల్‌క్యాప్ కంపెనీల కిందకే వస్తున్నాయి కనుక ఈ విభాగంలో ఇప్పుడు పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. నిర్వచనం మార్చడం వల్ల స్మాల్‌క్యాప్ పప్రంచం ఇప్పుడు మరింత విస్తృతం అయింది. మన మార్కెట్ విస్తృతి పెరిగింది. వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా, మరి కొన్ని దశాబ్దాల్లో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించొచ్చు. కనుక దీర్ఘదృష్టితో ఆలోచించి, ఇప్పుడు స్మాల్‌క్యాప్ ప్రపంచంలో కొంచెం పెద్ద కంపెనీలను ఎంపిక చేసుకున్నా.. అవి జెయింట్ క్యాప్ కంపెనీలుగా మారే అవకాశాలు లేకపోలేదు. 2012 జనవరి 10 నుంచి 2022 జనవరి 10 వరకు గణాంకాలను పరిశీలించి చూస్తే.. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ నుంచి మూడు కంపెనీలు లార్జ్‌క్యాప్ కంపెనీలుగా అవతరించాయి. అవి చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, ఎస్ఆర్ఎఫ్, పీఐ ఇండస్ట్రీస్. ఇక స్మాల్‌క్యాప్ నుంచి మరో 21 కంపెనీలు మిడ్‌క్యాప్ కంపెనీలుగా అవతరించాయి. 72 కంపెనీలు అదే స్థాయిలో ఉంటే, 64 కంపెనీలు మైక్రోక్యాప్ (మరీ చిన్నవి)గా కరిగిపోయాయి. ఎంపిక ఎలా..? ‘‘చిన్న కంపెనీలు అధిక వృద్ధి సామర్థ్యాలతో ఉంటాయి. దాదాపు ఇవి అనలిస్టుల సెల్ కాల్ పరిధిలో ఉండవు. కనుక స్మాల్ క్యాప్ కంపెనీలను అధ్యయనం చేసేందుకు ప్రాథమిక పరిశోధన అవసరం. అన్ని మార్కెట్ సైకిల్స్‌లోనూ ఇవి అధిక రాబడులను ఇవ్వగలవు’’ అని ఓపీసీ అస్సెట్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అజయ్ బగ్గా పేర్కొన్నారు. ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ అంబరీశ్ బలిగ అభిప్రాయంలో.. ‘‘స్మాల్‌క్యాప్ స్టాక్ ఎంపికకు ఏ ఒక్క విధానం అంటూ లేదు. కాకపోతే నేను అనుసరించే మార్గదర్శకాలు ఏమిటంటే.. ఎంపిక చేసుకోబోయే స్టాక్ మంచి పనితీరు చూపిస్తున్న రంగానికి చెందినదై ఉండాలి. లేదా మంచి పనితీరు చూపించేందుకు అవకాశం ఉన్న రంగంలో పనిచేస్తూ ఉండాలి. ఆయా కంపెనీ ఏదైనా ఉప విభాగంలో లీడర్‌గా ఉందా అని చూస్తాను. లేదంటే లీడర్‌గా ఎదిగే అవకాశాలున్నాయా అని పరిశీలిస్తాను. ఆయా రంగం వృద్ధికి మించి పనితీరు చూపిస్తూ ఉండాలి’’అని వివరించారు. ఇక స్మాల్‌క్యాప్ కంపెనీల విషయంలో లిక్విడిటీ (షేర్ల లభ్యత) కూడా కీలకమేనని అంబరీశ్ తెలిపారు. ‘‘బ్యాలన్స్ షీటులో రుణ భారం ఎక్కువగా ఉండకూడదు. రుణ భారం ఉంటే, భవిష్యత్తులో పెరిగే నగదు ప్రవాహాల పట్ల స్పష్టత ఉండాలి. అప్పుడే ఈక్విటీ–రుణభారం నిష్పత్తి దిగొస్తుంది’’అని వివరించారు. లిక్విడిటీ తక్కువగా ఉన్నప్పుడు ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడితే అది షేరు ధర పతనానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాణ్యతపై దృష్టి కీలకం ‘‘స్మాల్‌క్యాప్ కంపెనీలు ఎప్పుడూ కూడా లిక్విడిటీ పరంగా సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాయి. లిక్విడిటీ తక్కువగా ఉంటే ర్యాలీ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే, షేరు ధర వేగంగా పడిపోయే అవకాశాలు సైతం ఉంటాయి. స్మాల్‌క్యాప్ పరంగా ఉండే కీలకమైన అంశం ఇదే. అందుకే మార్కెట్లో వాటి ధరలు మానిప్యులేషన్‌కు లోనవుతుంటాయి’’అని కేఆర్ చోక్సే ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ దేవేన్ చోక్సే వివరించారు. ఇక యాజమాన్యం సమర్థత, నిజాయితీ తదితర అంశాలు కూడా ఈ విభాగంలో కీలకంగా పనిచేస్తాయని అంబరీష్ బలిగ వివరించారు. యాజమాన్యం విషయంలో కనిపించని విషయాలను వెలికితీసే ప్రయత్నం చేయాలని సూచించారు. షేరు ధర చౌకగా ఉందా లేక స్మాల్‌క్యాప్ అని కాకుండా, నాణ్యతకు సంబంధించిన అంశాలు చూడాలని నిపుణుల సూచన. యాజమాన్యానికి తగిన సామర్థ్యాలు ఉన్నాయా? కంపెనీ భిన్నంగా ఏదైనా చేయగలదా? పోటీ తత్వం లేదా టైఅప్‌ల ద్వారా భిన్నంగా ప్రయతి్నంచగలదా? పరిమిత మూలధన నిధులతోనే వృద్ధి చెందగలదా? భారీ వృద్దికి అవకాశం ఉన్న రంగంలోనే పనిచేస్తుందా? అన్న అంశాలను చూడాలి. ఎంపిక చేసుకునే కంపెనీకి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు మధ్యలో తాత్కాలికంగా ఏవైనా ఆటుపోట్లతో దారి తప్పినా.. తిరిగి మళ్లీ గాడిలో పడి దూసుకుపోయే అవకాశాలుంటాయి. యాజమాన్యం సామార్థ్యాలు, బలాలకు తోడు ఆ వ్యాపారం విస్తరణకు అవకాశం ఉందా? అప్పటికే ఆ కంపెనీలో ఇనిస్టిట్యూషన్స్ లేదా హెచ్ఎన్ఐలకు (బడా ఇన్వెస్టర్లు) వాటాలున్నాయా అనే అంశాలను కూడా పరిశీలించాలి. ఆయా కంపెనీ కస్టమర్లు, వెండర్లు, పోటీ కంపెనీలను కలసి మాట్లాడడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని అంబరీష్ బలిగ సూచించారు. పైగా అన్ని సానుకూలతలు ఉండి, కంపెనీని ఎంపిక చేసుకున్న తర్వాత ఫలితం వచ్చే వరకు వేచి చూసే ఓపిక కూడా దండిగా ఉండాలన్నది మార్కెట్ పండితుల స్వీయ అనుభవం. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే అన్న చందంగా ప్రతీ నాణ్యమైన కంపెనీకి అనుకూల తరుణం వచ్చే వరకు ఆగాల్సిందే. పైగా ఒక్కసారి పెట్టుబడి పెట్టి రిలాక్స్ అయ్యే ధోరణి స్మాల్‌క్యాప్ కంపెనీలకు అస్సలే పనికిరాదు. ఎలాంటి సానుకూలతలు చూసి, సంబంధిత కంపెనీలో పెట్టుబడి పెట్టారో.. వాటిల్లో మార్పు లేనంత వరకు పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. తేడా వస్తే బయటకు వచ్చేందుకు సిద్ధంగానూ ఉండాలి. కంపెనీ వృద్ధి పథంలో సాగుతున్నంత కాలం ర్యాలీ చేస్తున్నప్పటికీ ఆ పెట్టుబడితో కొనసాగొచ్చు. అలాంటప్పుడే అవి మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌గా అవతరించగలవు. అలా మంచి పనితీరును క్రమం తప్పకుండా కొనసాగిస్తున్న సమయంలో మరింత మంది ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల్లో పెట్టుబడులకు ముందుకు వస్తారు. దీంతో విస్తృతి పెరుగుతుంది. -
దేశీ రియల్టీలో భారీ పెట్టుబడులు: ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చు!
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో(2023-24) దేశీ రియల్టీ రంగంలో 13 బిలియన్ డాలర్ల(రూ. 1,07,081 కోట్లు) వరకూ ఈక్విటీ పెట్టుబడులు లభించవచ్చని తాజాగా అంచనాలు వెలువడ్డాయి. గత ఐదేళ్లలో 32 బిలియన్ డాలర్ల(రూ. 2,63,584 కోట్లు) ఈక్విటీ పెట్టుబడులు రియల్టీలోకి ప్రవహించినట్లు సీబీఆర్ఈ పేర్కొంది. రానున్న రెండేళ్లలో పెట్టుబడులు గరిష్టంగా కార్యాలయ ఆస్తులకు మళ్లవచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్ఈ అభిప్రాయపడింది. ఏడాదికి 6-7 బిలియన్ డాలర్ల చొప్పున రెండేళ్లలో దేశీ రియల్టీ రంగం 12-13 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు అందుకునే వీలున్నట్లు తెలియజేసింది. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), పెన్షన్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, కార్పొరేట్ గ్రూప్‌లతోపాటు రీట్స్ తదితరాలు చేపట్టే ఈక్విటీ పెట్టుబడులపై సీబీఆర్ఈ నివేదిక రూపొందించింది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) ఇతర విభాగాలకూ రియల్టీ రంగ ఈక్విటీ పెట్టుబడుల్లో అధిక శాతం ఆఫీస్ ఆస్తుల విభాగంలోకి ప్రవహించనుండగా.. ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్, స్థలాలు, ల్యాండ్ పార్శిల్స్ తదుపరి స్థానాల్లో నిలవనున్నాయి. ఇక వీటికి అదనంగా డేటా సెంటర్లకు ప్రధానంగా ప్రత్యామ్నాయ పెట్టుబడులు(ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్) లభించనున్నాయి. దేశీయంగా పటిష్ట ఆర్థిక వ్యవస్థ, ప్రజల కొనుగోలు శక్తి వంటి మూలాలు బలంగా ఉన్నట్లు సీబీఆర్ఈ చైర్మన్(ఆసియా, ఆఫ్రికా) అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు. వీటికితోడు వివిధ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వాణిజ్యం రానున్న ఏడాదిలో రియల్టీ రంగ పెట్టుబడులకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. సరఫరా చైన్ అవసరాల రిస్కులను తగ్గించుకునేందుకు పలు ప్రపంచ కార్పొరేట్లు చైనా+1 వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా ఉత్పాదక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సైతం దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇండియాకు లబ్ది చేకూరనున్నట్లు తెలియజేశారు. వెరసి రానున్న ఐదారేళ్లలో గ్లోబల్ సప్లై చైన్ రంగంలో ఇండియా మార్కెట్ వాటా బలపడనున్నట్లు అంచనా వేశారు. ఈ సానుకూల అంశాలతో ఆర్థిక వ్యవస్థ వార్షికంగా వేగవంత వృద్ధిని అందుకోనున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ప్రపంచ సగటును మించుతూ దేశీ రియల్ ఎస్టేట్ రంగం భారీ పెట్టుబడులను ఆకట్టుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. (ఇండియన్ టెకీలకు గిట్‌హబ్ షాక్: టీం మొత్తానికి ఉద్వాసన ) నగరాల ముందంజ సీబీఆర్ఈ నివేదిక ప్రకారం రానున్న రెండేళ్లలో ప్రధానంగా మెట్రో నగరాలు, టైర్–1 పట్టణాలు రియల్టీ రంగంలో ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించనున్నాయి. 2018లో దేశీ రియల్టీ రంగంలో 5.9 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు లభించగా, 2019లో 6.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ బాటలో 2020లో 6 బిలియన్ డాలర్లు, 2021లో 5.9 బిలియన్ డాలర్లు, 2022లో 7.8 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు దేశీ రియల్టీలో నమోదైనట్లు సీబీఆర్ఈ గణాంకాలు తెలియజేశాయి. (స్వర్గంలో ఉన్ననానాజీ, నానీ..నాన్న జాగ్రత్త: అష్నీర్ గ్రోవర్ భావోద్వేగం) 2018-22 కాలంలో ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. 2018 నుంచి పెట్టుబడుల్లో ఈ నగరాలు 63 శాతం వాటాను ఆక్రమించాయి. అంటే గత ఐదేళ్లలో నమోదైన 32 బిలియన్ డాలర్లలో 20 బిలియన్ డాలర్లు ఇక్కడికే ప్రవహించాయి. కాగా.. కార్యాలయ ఆస్తులు 13 బిలియన్ డాలర్లతో 40 శాతం వాటాను ఆక్రమించాయి. ఇదేవిధంగా స్థలాలు, ల్యాండ్ పార్శిల్స్ 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకున్నాయి. ఇది ఐదేళ్ల మొత్తం పెట్టుబడుల్లో 39 శాతం వాటాకు సమానం! ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చు 2023-24పై ఇండియా రేటింగ్స్ 2022–23లో 8-10 శాతం మేర పెరగొచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చని ఇళ్ల ధరలు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం మేర ధరలు పెరిగాయని తెలిపింది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి తటస్థ అంచనాలతో ఉన్నట్టు తెలిపింది. ‘‘నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ 2022–23లో క్రమబద్ధమైన అప్డ్రెంట్లో ఉంది. టాప్ 8 రియల్ ఎస్టేట్ క్లస్టర్లలో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. నిర్మాణ వ్యయాలు పెరిగినా, మార్ట్గేజ్ రేట్లు పెరిగినా, దేశీయంగా, అంతర్జాతీయ ఆర్ధిక వృద్ధి తగ్గినా అమ్మకాలు పెరగడం ఆశాజనకనం’’అని ఇండియా రేటింగ్స్ తన నివేదికలో తెలిపింది. మాంద్యం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు స్వల్పకాలానికి డిమాండ్‌పై కొంత ప్రభావం చూపించొచ్చని, మొత్తం మీద నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ ఒత్తిళ్లను సర్దుబాటు చేసుకోగలదనే అంచనాలను వ్యక్తం చేసింది. డిమాండ్ పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని తెలిపింది. అమ్మకాల ఊపు కొనసాగుతుందని, మొత్తం మీద వార్షికంగా చూస్తే విక్రయాలు 9 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేసింది. 2022-23లో నిర్మాణ వ్యయాలు 8–10 శాతం మేర పెరిగాయని, దీంతో డెవలపర్లకు నిర్మాణ బడ్జెట్ 5–6 శాతం మేర అధికం కావొచ్చని పేర్కొంది. అయినప్పటికీ డెవలపర్లు వచ్చే ఆరేడు నెలలపాటు ధరలు పెంచకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. స్థూల ఆర్థిక సమస్యల నేపథ్యంలో డిమాండ్ బలపడే వరకు వేచి చూడొచ్చని పేర్కొంది. అందుబాటు ధరలు.. అందుబాటు ధరలు 2021-22లో ఇళ్ల అమ్మకాలను నడిపించినట్టు ఇండియా రేటింగ్స్ తెలిపింది. ‘‘అయితే ద్రవ్యోల్బణం అమ్మకాల ధరలను పెంచేలా చేశాయి. 2022 మే నుంచి ఆర్బీఐ వరుసగా రెపో రేటు పెంపు 2022- 23లో అందుబాటు ధరల ఇళ్ల విభాగం డిమాండ్‌కు సవాలుగా నిలిచాయి. అంతేకాదు, మధ్య, ప్రీమియం విభాగంలోనూ కొనుగోళ్లను వాయి దా వేయడానికి దారితీశాయి. ప్రథమ శ్రేణి పట్టణాల్లోని పెద్ద సంస్థలు, మంచి బ్రాండ్ విలువ కలిగినవి, 2023-24లో బలమైన నిర్వహణ పనితీరు చూపిస్తాయి. తద్వారా వాటి మార్కెట్ షేరు పెరగొచ్చు’’అని పేర్కొంది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని డెవలపర్లు బలహీన అమ్మకాలు, వసూళ్లు, నిధుల లభ్యత పరంగా సమస్యలను ఎదుర్కోవచ్చని అభిప్రాయపడింది. -
ఇక గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఆర్థిక సేవలు
ముంబై: గోద్రెజ్ ఇండస్ట్రీస్ (జీఐఎల్) సోమవారం గ్రూప్ ఆర్థిక సేవల విభాగం గోద్రెజ్ క్యాపిటల్ లిమిటెడ్ (జీసీఎల్)ను ప్రారంభించింది. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్, గోద్రెజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు హోల్డింగ్ సంస్థగా గోద్రెజ్ క్యాపిటల్ ఉంటుంది. తన కొత్త విభాగంలో ఈ నెలాఖరుకు గోద్రెజ్ ఇండస్ట్రీస్ రూ.1,500 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టనుంది. 2026 నాటికి సంస్థ వ్యాపార అవసరాలకు రూ.5,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు అవసరం అవుతాయని భావిస్తున్నట్లు గోద్రెజ్ క్యాపిటల్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్ తెలిపారు. ఆర్థిక సేవల విభాగంలో పటిష్టంగా నిలబడగలమన్న విశ్వాసం తమకు ఉందని ఆయన తెలిపారు. అందుకు తగిన పరిస్థితులు మార్కెట్లో ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ అంశమే తమ పెట్టుబడులకు ప్రధాన కారణమని వివరించారు. అవకాశంగా భావిస్తున్నాం... ఆర్థిక సేవల విభాగంలో వ్యాపార విస్తరణను తాము గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు పిరోజ్షా గోద్రెజ్ తెలిపారు. ‘‘పెట్టుబడులు అన్నీ గోద్రెజ్ ఇండస్ట్రీస్ బ్యాలెన్స్ షీట్ నుండి సమకూర్చాలన్నది మా ప్రణాళిక. ఈ నెలాఖరుకు రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. 2026 నాటికి అవసరమయ్యే మిగిలిన రూ. 3,500 కోట్ల కోసం మేము గోద్రెజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆమోదం పొందుతాము. ఈ మొత్తంలో అధికభాగం గ్రూప్ నుంచే సమకూర్చుకోవాలన్నది మా ఉద్దేశం’’అని పిరోజ్షా తెలిపారు. 2026 నాటికి కంపెనీ బ్యాలెన్స్ షీట్ రూ.30,000 కోట్లకు పెంచాలన్నది లక్ష్యమని కూడా వివరించారు. సురక్షిత రుణాలపైనే దృష్టి... కాగా, రాబోయే సంవత్సరాల్లో గోద్రేజ్ క్యాపిటల్ ఒక నూతన తరం, ప్రముఖ రిటైల్ ఆర్థిక సేవల సంస్థగా మారుతుందని తాము భావిస్తున్నట్లు జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మనీష్ షా తెలిపారు. గృహ రుణాలు, ఆస్తిపై రుణాలు (ఎల్ఏపీ– లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ)లతో కూడిన సురక్షిత రుణాల వృద్ధిపై కంపెనీ దృష్టి సారిస్తుందని తెలిపారు. సంబంధిత వర్గాల వివరాల ప్రకారం జీసీఎల్ ప్రస్తుతం ముంబై, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, అహ్మదాబాద్, పుణేలలో కార్యకలాపాలు ప్రారంభించింది. త్వరలో హైదరాబాద్‌సహా జైపూర్, చండీగఢ్, చెన్నై, ఇండోర్, సూరత్‌లకు విస్తరిస్తుంది. -
చెన్నై ‘రామ్‌చరణ్’ కంపెనీలోకి భారీ పెట్టుబడులు
ముంబై: దేశ కెమికల్స్ రంగంలోనే అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల ఒప్పందం చోటుచేసుకుంది. చెన్నైకు చెందిన కెమికల్స్ డిస్ట్రిబ్యూటర్, స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ‘రామ్‌చరణ్ కో’లో న్యూయార్క్‌కు చెందిన టీఎఫ్‌సీసీ ఇంటర్నేషనల్ 46% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకోసం 4.14 బిలియన్ డాలర్లను (రూ.31,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయ నుంది. దీంతో రామచరణ్ కో 9 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సొంతం చేసుకున్నట్టు అయింది. వ్యర్థాల నుంచి ఇంధన తయారీ, నూనతతరం ఇంధన స్టోరేజ్ పరికరాలను రామచరణ్ కంపెనీ తయారు చేస్తోంది. భారత్‌లో పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు, పునరుత్పాదక ఇంధనాలు, తక్కువ వ్యయాలతో కూడిన ఇళ్ల నిర్మాణాల్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు టీఎఫ్‌సీసీ ప్రకటించింది. -
రియాల్టీలో ఈక్విటీ జోష్ : వేల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా సమయంలోనూ దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) జోరు తగ్గట్లేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్) రియలీ్టలోకి 2.7 బిలియన్ డాలర్లు (రూ.14,300 కోట్ల) పీఈ పెట్టుబడులు వచ్చాయి. వాణిజ్య ఆస్తులకు డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని ప్రాపర్టీ కన్సల్టెంట్ సావిల్స్ ఇండియా తెలిపింది. గతేడాది జనవరి–జూన్‌లో 870 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్.. ఏడాది మొత్తంలో 6.6 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. కోవిడ్ నేపథ్యంలో మందగమనం ఉన్నప్పటికీ పెట్టుబడిదారులలో విశ్వాసం చెక్కుచెదరలేదని పీఈ పెట్టుబడుల వెల్లువకు ఇదే నిదర్శనమని తెలిపింది. త్రైమాసికం వారీగా చూస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ (క్యూ2) క్వాటర్లో పీఈ పెట్టుబడులు 54 శాతం క్షీణించి 865 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వర్క్ ఫ్రం హోమ్, రిమోట్ వర్కింగ్ విధానాలు అమలులో ఉన్నప్పటికీ ఈ ఏడాది క్యూ2లో వాణిజ్య కార్యాలయ లావాదేవీలు జోరుగానే సాగాయని.. పెట్టుబడులలో వీటి 40 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఈ తర్వాత 33 శాతం పెట్టుబడుల వాటాతో రిటైల్ విభాగం ఉంది. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (సీపీపీఐబీ), జీఐసీ వంటి విదేశీ పెట్టుబడిదారులు కోల్‌కతా, ముంబై, పుణే నగరాలలో రిటైల్ విభాగంలో 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు రిపోర్ట్ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలోనూ వాణిజ్య ఆఫీస్ విభాగంలో విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగుతున్నాయని.. ఈ రంగంలో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఇది సూచిస్తుందని సావిల్స్ ఇండియా ఎండీ దివాకర్ రానా తెలిపారు. సమీప భవిష్యత్తులోను ఇలాంటి లావాదేవీలే జరుగుతాయని అంచనా వేశారు. -
రిటైరైన వారు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించొచ్చా?
నా వయసు 53 సంవత్సరాలు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాను. ఒక సలహా సంస్థ సూచనల ఆదారంగా రూ.15 లక్షలను నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. మరో రూ.15 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. పీపీఎఫ్, ఈపీఎఫ్ల్లోనూ రూ.50లక్షల పెట్టుబడులు ఉన్నాయి. 2026లో నేను పదవీ విరమణ తీసుకుంటాను. ఆ తర్వాత కూడా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించొచ్చా? -ఆర్కే గుప్తా, హైదరాబాద్ ఒక పెట్టుబడి సాధనంగా రిటైర్ అయిన తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించొచ్చు. మీరు ఈక్విటీల్లో రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. మీ మొత్తం నిధి రూ.80 లక్షల్లో ఈక్విటీ పెట్టుబడులు 35–37 శాతంగా ఉన్నాయి. రిటైర్ అయిన వారు స్థిరమైన ఆదాయం, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మించి దీర్ఘకాలిక రాబడుల కోసం ఈక్విటీలకు ఈ మాత్రం కేటాయింపులు చేసుకోవాలని మేము సాధారణంగా భావిస్తాము. ఆ విధంగా చూస్తే ఈక్విటీలకు మీరు చేసిన కేటాయింపులు చక్కగానే ఉన్నాయి. వాటిని కొనసాగించొచ్చు. కాకపోతే ఈక్విటీ కేటాయింపులు ఏ విధంగా చేశారన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఒకవేళ మీ ఈక్విటీ కేటాయింపులు ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్‌క్యాప్‌లో ఉంటే వెంటనే తగ్గించేసుకుని.. అధిక నాణ్యతతో కూడిన లార్జ్‌క్యాప్ కంపెనీలకే పరిమితం కావాలని నా సూచన. ఒకవేళ మీరు ఇప్పటికే ఆ విధంగా చేసి ఉంటే సరైన నిర్ణయమే అవుతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును (ఎల్టీసీజీ) లెక్కించే సమయంలో ఇండెక్సేషన్ ప్రయో జనం అన్నది కేవలం డెట్ ఫండ్స్‌కే వర్తిస్తుందా..? ఈక్విటీలకు ఉండదా? -శివనందన, బెంగళూరు మీరు అడిగింది నిజమే. ప్రస్తుతం ఇండెక్సేషన్ ప్రయోజనం అన్నది డెట్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విషయంలోనే అందుబాటులో ఉంది. ఈక్విటీలకు లేదు. ఈక్విటీ పెట్టుబడులను ఏడాదికి మించి కొనసాగించినప్పుడు వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్ను పడుతుంది. డెట్ ఫండ్స్‌పై ఎల్టీసీజీ అంటే కనీసం మూడేళ్లు, అంతకుమించి పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో డెట్ ఫండ్స్‌పై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్) మినహాయించిన తర్వాత మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ అన్నది మీ కొనుగోలు వ్యయాన్ని ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు మీరొక సెక్యూరిటీని రూ.100కు కొనుగోలు చేసి కొన్నేళ్ల పాటు కొనసాగించారనుకుంటే.. ఆ పెట్టుబడి కొనసాగించిన అన్నేళ్లలో రూ.100 విలువ కాస్తా ద్రవ్యోల్బణ ప్రభావం కలసి రూ.125కు చేరిందనుకుంటే.. అప్పుడు ఇండెక్సేషన్ వల్ల మీ కొనుగోలు వ్యయం రూ.100 కాకుండా రూ.125 అవుతుంది. కనుక ఇది మూలధన లాభాల పన్ను భారాన్ని తగ్గిస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఈక్విటీలకు ఇండెక్సేషన్ ప్రయోజనం లేకపోయినప్పటికీ.. డెట్ ఫండ్స్‌తో పోలిస్తే పన్ను రేటు తక్కువ. ఇండెక్సేషన్ ప్రయోజనం మీకు అనుకూలిస్తుందా లేదా అన్నది ఎంత మేర మూలధన లాభాలు వచ్చాయి, ద్రవ్యోల్బణం రేటు, కొనసాగించిన కాలం వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. మూడేళ్ల క్రితం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్ఎస్ఎస్)లో సిప్ ప్రారంభించాను. మూడేళ్ల కాలం అన్నది 2021 మార్చితో ముగిసింది. ఇప్పుడు పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చా? అలాగే, నా వద్ద రూ.1.5లక్షలు ఉన్నాయి. వీటిని ఈఎల్ఎస్ఎస్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవాలా? లేక ఏక మొత్తంలో చేసుకోవాలా? -రత్నాకర్, మెదక్ సిప్ రూపంలో ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే.. అప్పుడు ప్రతీ సిప్‌కు 36 నెలల కాలం (సిప్ పెట్టిన తేదీ నుంచి) లాకిన్ అమలవుతుంది. కనుక మీరు మీ పెట్టుబడిని వెనక్కి తీసుకోదలిస్తే అది మొదటి సిప్ వరకే అలా చేసుకోగలరు. ఆ తర్వాతి సిప్‌లకు 36 నెలల కాలం ఇంకా ముగిసిపోలేదు కనుక వాటిని ఉపసంహరించుకోలేరు. మీ వద్ద ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోతగిన మొ త్తం ఉన్నప్పటికీ.. సిప్ వల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. దీంతో మార్కె ట్లు ప్రతికూలంగా మారినా ఆందోళన ఉండదు. సిప్ ద్వారా కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. -
శ్రీమంతులు పెరిగారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) సంఖ్య వేగంగా పెరుగుతోంది. భౌగోళిక రాజకీయ అస్థిరతలు, మందగించిన ఆర్థికాభివృద్ధి వంటివి శ్రీమంతుల సంపద వృద్ధికి విఘాతాన్ని కలిగించడం లేదు. ప్రస్తుతం మన దేశంలో 5,986లుగా ఉన్న యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంఖ్య.. 2024 నాటికి 73 శాతం వృద్ధితో 10,354లకు చేరుతుందని నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది. రూ.220 కోట్లకు పైగా నికర సంపద ఉన్న వాళ్లని యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐగా పరిగణించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అల్ట్రా శ్రీమంతులున్న దేశం అమెరికా. ఇక్కడ 2,40,575 మంది యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలుంటే.. చైనాలో 61,587 మంది, జర్మనీలో 23,078 మంది ఉన్నారు. నైట్‌ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్–2020లోని పలు ఆసక్తికర అంశాలివే.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపద కలిగిన నగరం న్యూయార్క్. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లండన్, పారిస్ నగరాలు నిలిచాయి. మన దేశం నుంచి ముంబై 44వ స్థానంలో, ఢిల్లీ 58, బెంగళూరు 89వ స్థానంలో నిలిచాయి. 2024 నాటికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సంపద కలిగిన కేంద్రంగా ఆసియా నిలుస్తుందని, ఐదేళ్ల వృద్ధి అంచనా 44 శాతం ఉంటుందని నివేదిక తెలిపింది. ఆసియాలో చూస్తే.. 73 శాతం వృద్ధితో ఇండియా మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో 64 శాతంతో వియత్నాం, 58 శాతంతో చైనా, 57 శాతం వృద్ధితో ఇండోనేషియా దేశాలుంటాయని రిపోర్ట్ పేర్కొంది. ‘‘ఇండియా ఆర్థికాభివృద్ధికి పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యేనని.. ఇదే సంపద సృష్టికి సహాయపడుతుందని నైట్‌ఫ్రాంక్ చైర్మన్ అండ్ ఎండీ శిషీర్ బైజాల్ తెలిపారు. ప్రపంచ ఉత్పత్తులు, సేవలకు ఇండియా ప్రధాన మార్కెట్‌గా మారిందని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలకు ఉత్పాదక కేంద్రంగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. ఈక్విటీలే ప్రధాన పెట్టుబడులు.. మన దేశంలోని మొత్తం యూహెచ్ఎన్డబ్ల్యూఐలలో 83% మంది ఈక్విటీల్లో, 77 శాతం మంది బాండ్లలో, 51% మంది ప్రాపర్టీల్లో పెట్టుబడులు ఆసక్తిగా ఉన్నారు. 2019లో యూహెచ్ఎన్డబ్ల్యూఐలు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ విభాగాల వారీగా చూస్తే.. 29% ఈక్విటీల్లో, 21% బాండ్లలో, 20% రియల్ ఎస్టేట్‌లో, 7% బంగారం, ఇతర ఆభరణాల్లో పెట్టుబడులు పెట్టారు. -
అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడుల కోసం
మన మార్కెట్లతో పోలిస్తే అమెరికా స్టాక్ మార్కెట్లలో పరిపక్వత ఎక్కువ. అలాగే అస్థిరతలు కొంచెం తక్కువ. ప్రపంచంలో ఆర్థికంగా బలీయమైన స్థానంలో ఉన్న అమెరికాలోని స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయమే అవుతుంది. పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. ఆ విధంగా చూసినా అమెరికా ఈక్విటీలకు కొంత పెట్టుబడులు కేటాయించుకోవడం మంచిది. ఇలా అమెరికా స్టాక్ ఎక్సేంజ్ల్లోని లిస్టెడ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్న ఫండ్స్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం సూచనీయం కాదు. ఈక్విటీ, డెట్ రెండు రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు వర్గీకరించుకోవడం వైవిధ్యం అవుతుంది. ఇది రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇక ఈక్విటీల్లోనూ వైవిధ్యం కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ వీలు కల్పిస్తుంది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి మన ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవడానికి బదులు, కొంత మేర అమెరికా స్టాక్స్కూ కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే గత రెండేళ్లుగా మన స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు బాగా పెరిగాయి. ఈ సమయంలో కేవలం ఎంపిక చేసిన బ్లూచిప్ స్టాక్స్ మాత్రమే ర్యాలీ చేశాయి. కానీ, ఇదే కాలంలో అమెరికా స్టాక్స్ మంచి పనితీరు ప్రదర్శించాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పెట్టుబడుల విధానం.. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇవ్వడమనే విధానంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పథకం తన పెట్టుబడులను అమెరికా స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టెడ్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే, భారత్, ఇతర విదేశీ కంపెనీలు జారీ చేసే ఏడీఆర్, జీడీఆర్లలోనూ పెట్టుబడులు పెడుతుంది. అందులోనూ లార్జ్ క్యాప్ కంపెనీలకే పెట్టుబడులను పరిమితం చేస్తుంది. ప్రస్తుతం ఈ పథకం తన దగ్గరున్న నిధుల్లో 95.1 శాతం మేర స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉంది. ఇక ఈక్విటీ మొత్తం పెట్టుబడుల్లో 94 శాతం మెగాక్యాప్, 6 శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. మనదేశంలో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అధిక శాతం (సెక్టార్ ఫండ్స్ కాకుండా) బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కే అగ్ర ప్రాధాన్యం ఇస్తాయి. కానీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ అమెరికా స్టాక్స్‌లో హెల్త్‌కేర్ రంగానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగానికి చెందిన కంపెనీల్లో 25% ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత 18% పెట్టుబడులను టెక్నాలజీ కంపెనీల్లో, 12% ఎఫ్ఎంసీజీలకు కేటాయించగా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 7 శాతం కేటాయింపులు చేసింది. రాబడులు ఆరంభం నుంచి ఆకర్షణీయంగానే ఉంది. ఏడాది కాలంలో 9.71% రాబడులను ఇచ్చింది. గడిచిన మూడేళ్లలో చూసుకుంటే వార్షిక రాబడులు 12.52 శాతం. ఐదేళ్లలో 11.54%, ఏడేళ్లలో 15.35% చొప్పున వార్షిక రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఇన్వెస్టర్లు కనీసం ఐదేళ్లు, అంతకంటే దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు, ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. అప్పుడే ఆశించిన రాబడులకు అవకాశం ఉంటుంది. లార్జ్‌క్యాప్ ఫండ్ కనుక సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంకాస్త మెరుగైన రాబడులకు వీలుంటుంది. -
ఇన్వెస్టర్లపై ఎల్టీసీజీ బాంబు
సాక్షి, ముంబై: భయపడ్డట్టుగానే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీర్ఘకాలిక పెట్టుబడులపై బాంబు వేశారు. ఈక్విటీలలో దీర్ఘకాలిక పెట్టుబడులపైనా పన్ను విధించేందుకు ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈక్విటీలలో దీర్ఘకాలిక పెట్టుబడులపై రూ. లక్షకు మించి ఆర్జించిన పక్షంలో 10 శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్లో జైట్లీ స్పష్టం చేశారు. ప్రస్తుతం సెక్యూరిటీల లావాదేవీల ద్వారా పన్ను(ఎల్టీసీజీ ) ఆదాయం రూ. 9,000 కోట్లుమాత్రమే లభిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఒక దశలో స్టాక్‌మార్కెట్లు 450 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. అయితే భారీగా కోలుకుని 200పాయింట్ల లాభాల్లోకి మళ్లినా...తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతున్నాయి. 10 శాతం పన్ను లక్షకు పైగా పెట్టుబడులుపై 10 శాతం ఎల్టీసీజీ(దీర్ఘకాలిక మూలధన పన్ను)ను విధించనున్నట్టు ప్రకటించారు. ఈ పన్ను విధింపును 2013, జనవరి 31నుంచి లెక్కిస్తారు. అంటే ఈక్వీటీ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేసిన సంవత్సరం తరువాత లక్ష రూపాయలకుపైన పెట్టుబడులపై 10శాతం పన్ను (రూ.వెయ్యి) చెల్లించాల్సిందే. ఇది హేతుబద్ధం కాదని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొన్నారు. జాబితాలో ఉన్న షేర్లు, యూనిట్ల నుంచి మినహాయించిన మూలధన లాభాలు 2017-2018 సంవత్సరానికి అంచనా వేసిన రిటర్న్స్ ప్రకారం రూ. 3,67,000 కోట్ల రూపాయలని తెలియజేశారు. ఎల్టీసీజీ విధింపుపై ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఇది ఈక్విటీ పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీర్ఘకాలంగా మంచి ప్రయోజనాన్ని అందిస్తుందని మరికొంతమంది చెబుతున్నారు. తాజా నిర్ణయంతో ఆదాయం మార్పిడికి సంబంధించి భారీ అక్రమాలు తగ్గుముఖం పడతాయని మార్కెట్ విశ్లేషకుడు సందీప్ సబర్వాల్ తెలిపారు. ఈ భయంతో తక్షణమే ప్రాఫిట్బుకింగ్కు ఇన్వెస్టర్లు దిగుతారని మరో విశ్లేషకుడు మనీష్ పాండా పేర్కొన్నారు. ఎస్టీటీ అలాగే ఉంచడం దారుణమన్నారు. దీన్ని రిమూవ్ చేసి వుండాల్సిందని ఐఐఎఫ్ఎల్ ఫౌండర్ నిర్మల్ జైన్ అభిప్రాయపడ్డారు. ఒకే పన్ను ఒకే దేశం అనే బీజేపీ విధానానికి ఈ చర్య వ్యతిరేకమని రిలయన్స్ సెక్యూరిటీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బి.గోపి కుమార్ విమర్శించారు. సెక్యూరిటీల లావాదేవీ పన్నును (ఎస్టీటీ) తొలగించకుండా ఎల్టీసీజీ విధించడం అంటే ఒకే సమయంలో రెండు రకాల పన్నులు విధించడమే అన్నారు. మరోవైపు అమెరికా తరహాలో భారీ పరిశ్రమలకు లభిస్తుందనుకున్న ఊరట కాస్తా ఉసూరు మనిపించింది. కార్పొరేట్ పన్నులపై ఎలాంటి మినహాయింపులు ఇవ్వకపోవడం గమనార్హం. స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగానే కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. -
అపోలో గ్రూప్‌లో‘ప్రపంచ బ్యాంక్’ పెట్టుబడులు
• రూ.450 కోట్ల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ • ఇందుకుగాను 28.03 శాతం వాటా దక్కించుకున్న ఐఎఫ్‌సీ • సంస్థ విస్తరణ, నాయకత్వ స్థానానికే ఈ నిధుల వినియోగం • ఏహెచ్‌ఎల్‌ఎల్ జారుుంట్ ఎండీ సంగీతా రెడ్డి వెల్లడి • 2016-17లో రూ.7,480 కోట్ల పెట్టుబడులు: ఐఎఫ్‌సీ సీఐఓ క్రిస్ మెక్హాన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ హెల్త్ కేర్ రంగంలో అగ్రగామిగా ఉన్న అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టరుుల్ లిమిటెడ్ (ఏహెచ్‌ఎల్‌ఎల్)లో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. ఇంటర్నేషనల్ ఫైనాన్స కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ), ఐఎఫ్‌సీ అసెట్ మేనేజ్మెంట్ నుంచి ఈక్విటీ రూపంలో రూ.450 కోట్ల నిధులను సమీకరించినట్లు ఏహెచ్‌ఎల్‌ఎల్ జారుుంట్ మేనేజింగ్ డెరైక్డర్ సంగీతా రెడ్డి తెలిపారు. ఈ పెట్టుబడులతో ఐహెచ్ఎల్ఎల్లో 28.03 శాతం వాటాను ఐఎఫ్‌సీ దక్కించుకుందని గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు. ఈ నిధులను ఐహెచ్ఎల్ఎల్ విస్తరణతో పాటు రిటైల్ హెల్త్‌కేర్ రంగంలో నాయకత్వ స్థానం కైవసానికి వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ విస్తరణతో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కలిపి కొత్తగా 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలొస్తాయని తెలియజేశారు. అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ అరుున ఏహెచ్‌ఎల్‌ఎల్ దేశంలోని 17 రాష్ట్రాల్లో 400 సెంటర్లలో 7 విభాగాల్లో సేవలందిస్తుంది. అపోలో క్లినిక్స్, షుగర్, డయాగ్నోస్టిక్స్, వైట్, క్రెడిల్, ఫెర్టిలిటీ, స్పెక్ట్రా విభాగాల్లో కలిపి రోజుకు 10 వేల మంది చికిత్స పొందుతున్నారు. 2020 నాటికి ఈ సంఖ్యను 2 కోట్లకు చేర్చాలన్నది లక్ష్యమని చెప్పారు. తాజా నిధులతో అపోలో క్లినిక్స్, క్రెడిల్, డయాగ్నోస్టిక్ సెంటర్లను విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏహెచ్‌ఎల్‌ఎల్ సీఈఓ నీరజ్ గార్గ్, ఐఎఫ్‌సీ (కన్సూమర్, సోషల్ సర్వీసెస్) ఆసియా సీనియర్ మేనేజర్ హెన్రిక్ ఎస్చనీర్ పెడెర్సన్ పాల్గొన్నారు. 32 బిలియన్లకు చేరిన ఐఎఫ్‌సీ పెట్టుబడులు.. ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్స కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) మన దేశంలో 2005 నుంచి హెల్త్ కేర్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ, డెబిట్ రూపంలో పెట్టుబడులు పెడుతుంది. ప్రైవేట్ హెల్త్ కేర్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి సంస్థ ఈ ఐఎఫ్‌సీ.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.11,700 కోట్ల (117 బిలియన్‌స) పెట్టుబడులు పెట్టింది. ఇందులో మన దేశం 28 శాతం వాటాతో రూ.3,200 కోట్ల (32 బిలియన్‌స) మేర పెట్టుబడులు పెట్టినట్లు ఐఎఫ్‌సీ సీఐఓ క్రిస్ మెక్హాన్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.7,480 కోట్ల (1.1 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెట్టాలని లక్ష్యించామని.. అరుుతే ఇప్పటివరకు రూ.3,243 కోట్లు (477 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఐఎఫ్‌సీ గతంలో మ్యాక్స్ హెల్త్‌కేర్, నెప్రో ప్లస్, ఐ-క్యూ విజన్, పోర్షియా వంటి హెల్త్‌కేర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. -
స్టార్టప్స్ ఫండ్‌కి రూ. 2,000 కోట్లు..
సిడ్బి సీఎండీ ఛత్రపతి శివాజీ ముంబై : స్టార్టప్ సంస్థల్లో ఈక్విటీ పెట్టుబడులు పెట్టే ఫండ్ ఆఫ్ ఫండ్స్ కోసం రూ.2,000 కోట్లు కేటాయించినట్లు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) సీఎండీ ఛత్రపతి శివాజీ తెలిపారు. అయితే, లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉం టుంది, ఎంత మొత్తం రుణాలు ఇస్తారు తదితర అంశాలను ఆయన వెల్లడించలేదు. స్టార్టప్స్‌కి తోడ్పాటునిచ్చేందుకు బడ్జెట్లో కేటాయించిన రూ. 10,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లు ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కి ఇవ్వనున్నట్లు శివాజీ తెలిపారు. మిగతా రూ. 8,000 కోట్లను తక్కువ వడ్డీ రుణాల కింద ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే సంస్థలకు నిధులు అందించడంలో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని శివాజీ పేర్కొన్నారు. స్కీము కింద 10-12 శాతం వడ్డీ రేటుకే స్టార్టప్స్, చిన్న ..మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) రుణాలు పొందవచ్చన్నారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కి సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఆరుగురు సభ్యులతో కూడిన వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ కూడా ఏర్పాటైందని శివాజీ పేర్కొన్నారు. అటు చిన్న సంస్థల రుణాల రీఫైనాన్సింగ్ కోసం ఉద్దేశించిన ముద్రా బ్యాంకు.. సిడ్బీకి పోటీ కాదన్నారు. ముద్రా బ్యాంకుకీ శివాజీనే సారథ్యం వహిస్తున్నారు.