ప్రారంభ కార్యక్రమంలో కంపెనీ ఉన్నతాధికారులు
ముంబై: గోద్రెజ్ ఇండస్ట్రీస్ (జీఐఎల్) సోమవారం గ్రూప్ ఆర్థిక సేవల విభాగం గోద్రెజ్ క్యాపిటల్ లిమిటెడ్ (జీసీఎల్)ను ప్రారంభించింది. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్, గోద్రెజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు హోల్డింగ్ సంస్థగా గోద్రెజ్ క్యాపిటల్ ఉంటుంది. తన కొత్త విభాగంలో ఈ నెలాఖరుకు గోద్రెజ్ ఇండస్ట్రీస్ రూ.1,500 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టనుంది. 2026 నాటికి సంస్థ వ్యాపార అవసరాలకు రూ.5,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు అవసరం అవుతాయని భావిస్తున్నట్లు గోద్రెజ్ క్యాపిటల్ చైర్మన్ పిరోజ్‌షా గోద్రెజ్ తెలిపారు. ఆర్థిక సేవల విభాగంలో పటిష్టంగా నిలబడగలమన్న విశ్వాసం తమకు ఉందని ఆయన తెలిపారు. అందుకు తగిన పరిస్థితులు మార్కెట్‌లో ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ అంశమే తమ పెట్టుబడులకు ప్రధాన కారణమని వివరించారు.
అవకాశంగా భావిస్తున్నాం...
ఆర్థిక సేవల విభాగంలో వ్యాపార విస్తరణను తాము గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు పిరోజ్‌షా గోద్రెజ్ తెలిపారు. ‘‘పెట్టుబడులు అన్నీ గోద్రెజ్ ఇండస్ట్రీస్ బ్యాలెన్స్ షీట్ నుండి సమకూర్చాలన్నది మా ప్రణాళిక. ఈ నెలాఖరుకు రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. 2026 నాటికి అవసరమయ్యే మిగిలిన రూ. 3,500 కోట్ల కోసం మేము గోద్రెజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆమోదం పొందుతాము. ఈ మొత్తంలో అధికభాగం గ్రూప్ నుంచే సమకూర్చుకోవాలన్నది మా ఉద్దేశం’’అని పిరోజ్‌షా తెలిపారు. 2026 నాటికి కంపెనీ బ్యాలెన్స్ షీట్ రూ.30,000 కోట్లకు పెంచాలన్నది లక్ష్యమని కూడా వివరించారు.
సురక్షిత రుణాలపైనే దృష్టి...
కాగా, రాబోయే సంవత్సరాల్లో గోద్రేజ్ క్యాపిటల్ ఒక నూతన తరం, ప్రముఖ రిటైల్ ఆర్థిక సేవల సంస్థగా మారుతుందని తాము భావిస్తున్నట్లు జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మనీష్ షా తెలిపారు. గృహ రుణాలు, ఆస్తిపై రుణాలు (ఎల్‌ఏపీ– లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ)లతో కూడిన సురక్షిత రుణాల వృద్ధిపై కంపెనీ దృష్టి సారిస్తుందని తెలిపారు. సంబంధిత వర్గాల వివరాల ప్రకారం జీసీఎల్ ప్రస్తుతం ముంబై, బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్, అహ్మదాబాద్, పుణేలలో కార్యకలాపాలు ప్రారంభించింది. త్వరలో హైదరాబాద్‌సహా జైపూర్, చండీగఢ్, చెన్నై, ఇండోర్, సూరత్‌లకు విస్తరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment