సాక్షి, ముంబై: భయపడ్డట్టుగానే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీర్ఘకాలిక పెట్టుబడులపై బాంబు వేశారు. ఈక్విటీలలో దీర్ఘకాలిక పెట్టుబడులపైనా పన్ను విధించేందుకు ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈక్విటీలలో దీర్ఘకాలిక పెట్టుబడులపై రూ. లక్షకు మించి ఆర్జించిన పక్షంలో 10 శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్‌లో జైట్లీ స్పష్టం చేశారు. ప్రస్తుతం సెక్యూరిటీల లావాదేవీల ద్వారా పన్ను(ఎల్‌టీసీజీ ) ఆదాయం రూ. 9,000 కోట్లుమాత్రమే లభిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఒక దశలో స్టాక్‌మార్కెట్లు 450 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. అయితే భారీగా కోలుకుని 200పాయింట్ల లాభాల్లోకి మళ్లినా...తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతున్నాయి.
10 శాతం పన్ను
లక్షకు పైగా పెట్టుబడులుపై 10 శాతం ఎల్‌టీసీజీ(దీర్ఘకాలిక మూలధన పన్ను)ను విధించనున్నట్టు ప్రకటించారు. ఈ పన్ను విధింపును 2013, జనవరి 31నుంచి లెక్కిస్తారు. అంటే ఈక్వీటీ మార్కెట్‌లో షేర్లను కొనుగోలు చేసిన సంవత్సరం తరువాత లక్ష రూపాయలకుపైన పెట్టుబడులపై 10శాతం పన్ను (రూ.వెయ్యి) చెల్లించాల్సిందే. ఇది హేతుబద్ధం కాదని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొన్నారు. జాబితాలో ఉన్న షేర్లు, యూనిట్ల నుంచి మినహాయించిన మూలధన లాభాలు 2017-2018 సంవత్సరానికి అంచనా వేసిన రిటర్న్స్ ప్రకారం రూ. 3,67,000 కోట్ల రూపాయలని తెలియజేశారు. ఎల్‌టీసీజీ విధింపుపై ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఇది ఈక్విటీ పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీర్ఘకాలంగా మంచి ప్రయోజనాన్ని అందిస్తుందని మరికొంతమంది చెబుతున్నారు. తాజా నిర్ణయంతో ఆదాయం మార్పిడికి సంబంధించి భారీ అక్రమాలు తగ్గుముఖం పడతాయని మార్కెట్ విశ్లేషకుడు సందీప్ సబర్వాల్ తెలిపారు. ఈ భయంతో తక్షణమే ప్రాఫిట్‌బుకింగ్‌కు ఇన్వెస్టర్లు దిగుతారని మరో విశ్లేషకుడు మనీష్ పాండా పేర్కొన్నారు. ఎస్‌టీటీ అలాగే ఉంచడం దారుణమన్నారు. దీన్ని రిమూవ్ చేసి వుండాల్సిందని ఐఐఎఫ్‌ఎల్ ఫౌండర్ నిర్మల్ జైన్ అభిప్రాయపడ్డారు. ఒకే పన్ను ఒకే దేశం అనే బీజేపీ విధానానికి ఈ చర్య వ్యతిరేకమని రిలయన్స్ సెక్యూరిటీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బి.గోపి కుమార్ విమర్శించారు. సెక్యూరిటీల లావాదేవీ పన్నును (ఎస్‌టీటీ) తొలగించకుండా ఎల్‌టీసీజీ విధించడం అంటే ఒకే సమయంలో రెండు రకాల పన్నులు విధించడమే అన్నారు.
మరోవైపు అమెరికా తరహాలో భారీ పరిశ్రమలకు లభిస్తుందనుకున్న ఊరట కాస్తా ఉసూరు మనిపించింది. కార్పొరేట్ పన్నులపై ఎలాంటి మినహాయింపులు ఇవ్వకపోవడం గమనార్హం. స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగానే కొనసాగనున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment