నా వయసు 53 సంవత్సరాలు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాను. ఒక సలహా సంస్థ సూచనల ఆదారంగా రూ.15 లక్షలను నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. మరో రూ.15 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. పీపీఎఫ్, ఈపీఎఫ్‌ల్లోనూ రూ.50లక్షల పెట్టుబడులు ఉన్నాయి. 2026లో నేను పదవీ విరమణ తీసుకుంటాను. ఆ తర్వాత కూడా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించొచ్చా?
-ఆర్‌కే గుప్తా, హైదరాబాద్
ఒక పెట్టుబడి సాధనంగా రిటైర్ అయిన తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించొచ్చు. మీరు ఈక్విటీల్లో రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. మీ మొత్తం నిధి రూ.80 లక్షల్లో ఈక్విటీ పెట్టుబడులు 35–37 శాతంగా ఉన్నాయి. రిటైర్ అయిన వారు స్థిరమైన ఆదాయం, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మించి దీర్ఘకాలిక రాబడుల కోసం ఈక్విటీలకు ఈ మాత్రం కేటాయింపులు చేసుకోవాలని మేము సాధారణంగా భావిస్తాము. ఆ విధంగా చూస్తే ఈక్విటీలకు మీరు చేసిన కేటాయింపులు చక్కగానే ఉన్నాయి. వాటిని కొనసాగించొచ్చు. కాకపోతే ఈక్విటీ కేటాయింపులు ఏ విధంగా చేశారన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఒకవేళ మీ ఈక్విటీ కేటాయింపులు ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్‌క్యాప్‌లో ఉంటే వెంటనే తగ్గించేసుకుని.. అధిక నాణ్యతతో కూడిన లార్జ్‌క్యాప్ కంపెనీలకే పరిమితం కావాలని నా సూచన. ఒకవేళ మీరు ఇప్పటికే ఆ విధంగా చేసి ఉంటే సరైన నిర్ణయమే అవుతుంది.
దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును (ఎల్‌టీసీజీ) లెక్కించే సమయంలో ఇండెక్సేషన్ ప్రయో జనం అన్నది కేవలం డెట్ ఫండ్స్‌కే వర్తిస్తుందా..? ఈక్విటీలకు ఉండదా? -శివనందన, బెంగళూరు
మీరు అడిగింది నిజమే. ప్రస్తుతం ఇండెక్సేషన్ ప్రయోజనం అన్నది డెట్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విషయంలోనే అందుబాటులో ఉంది. ఈక్విటీలకు లేదు. ఈక్విటీ పెట్టుబడులను ఏడాదికి మించి కొనసాగించినప్పుడు వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్ను పడుతుంది. డెట్ ఫండ్స్‌పై ఎల్‌టీసీజీ అంటే కనీసం మూడేళ్లు, అంతకుమించి పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో డెట్ ఫండ్స్‌పై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్) మినహాయించిన తర్వాత మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ అన్నది మీ కొనుగోలు వ్యయాన్ని ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు మీరొక సెక్యూరిటీని రూ.100కు కొనుగోలు చేసి కొన్నేళ్ల పాటు కొనసాగించారనుకుంటే.. ఆ పెట్టుబడి కొనసాగించిన అన్నేళ్లలో రూ.100 విలువ కాస్తా ద్రవ్యోల్బణ ప్రభావం కలసి రూ.125కు చేరిందనుకుంటే.. అప్పుడు ఇండెక్సేషన్ వల్ల మీ కొనుగోలు వ్యయం రూ.100 కాకుండా రూ.125 అవుతుంది. కనుక ఇది మూలధన లాభాల పన్ను భారాన్ని తగ్గిస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఈక్విటీలకు ఇండెక్సేషన్ ప్రయోజనం లేకపోయినప్పటికీ.. డెట్ ఫండ్స్‌తో పోలిస్తే పన్ను రేటు తక్కువ. ఇండెక్సేషన్ ప్రయోజనం మీకు అనుకూలిస్తుందా లేదా అన్నది ఎంత మేర మూలధన లాభాలు వచ్చాయి, ద్రవ్యోల్బణం రేటు, కొనసాగించిన కాలం వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది.
మూడేళ్ల క్రితం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్)లో సిప్ ప్రారంభించాను. మూడేళ్ల కాలం అన్నది 2021 మార్చితో ముగిసింది. ఇప్పుడు పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చా? అలాగే, నా వద్ద రూ.1.5లక్షలు ఉన్నాయి. వీటిని ఈఎల్‌ఎస్‌ఎస్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవాలా? లేక ఏక మొత్తంలో చేసుకోవాలా? -రత్నాకర్, మెదక్
సిప్ రూపంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే.. అప్పుడు ప్రతీ సిప్‌కు 36 నెలల కాలం (సిప్ పెట్టిన తేదీ నుంచి) లాకిన్ అమలవుతుంది. కనుక మీరు మీ పెట్టుబడిని వెనక్కి తీసుకోదలిస్తే అది మొదటి సిప్ వరకే అలా చేసుకోగలరు. ఆ తర్వాతి సిప్‌లకు 36 నెలల కాలం ఇంకా ముగిసిపోలేదు కనుక వాటిని ఉపసంహరించుకోలేరు. మీ వద్ద ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోతగిన మొ త్తం ఉన్నప్పటికీ.. సిప్ వల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. దీంతో మార్కె ట్లు ప్రతికూలంగా మారినా ఆందోళన ఉండదు. సిప్ ద్వారా కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment