డెట్ ఫండ్స్ ఈల్డ్ టు మెచ్యూరిటీ (వైటీఎం), యావరేజ్ మెచ్యూరిటీ అంటే ఏంటి?
– చంద్ర గుణ శేఖర్
డెట్ ఫండ్స్ విశ్లేషణకు వైటీఎం, యావరేజ్ మెచ్యూరిటీ రెండూ కీలక కొలమానాలు. ఫండ్ పనితీరు సామర్థ్యాలు, రిస్క్‌ను వీటి సాయంతో తెలుసుకోవచ్చు.
వైటీఎం: మ్యూచువల్ ఫండ్ పథకం పోర్ట్‌ఫోలియోలో బాండ్లను గడువు తీరే వరకు కొనసాగిస్తే వచ్చే రాబడిని తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక డెట్ ఫండ్ వైటీఎం 8గా ఉంటే.. రాబడులు సుమారుగా ఆ స్థాయిలో ఉంటాయని అర్థం. కానీ, ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో మేనేజర్ చేసే మార్పులతో వాస్తవ రాబడులు వేరుగా ఉండొచ్చు. రోజువారీ ఎక్స్‌పెన్స్ రేషియో మినహాయింపులు, పెట్టుబడుల రాక, పోక ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చేస్తాయి. ఒక డెట్ ఫండ్‌లో ప్రస్తుత పోర్ట్‌ఫోలియో ప్రకారం ఎంత రాబడులు వస్తాయన్నది వైటీఎం తెలియజేస్తుంది.
యావరేజ్ మెచ్యూరిటీ: ఫండ్ పోర్ట్‌ఫోలియోలో వివిధ బాండ్లు వివిధ కాలాలకు మెచ్యూరిటీ అవుతాయి. అన్ని బాండ్ల మెచ్యూరిటీల సగటు మెచ్యూరిటీని ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక పోర్ట్‌ఫోలియోలో రెండు బాండ్లు ఉండి, ఒకటి 10 ఏళ్లు, మరొకటి 5 ఏళ్లకు మెచ్యూరిటీ తీరుతుందని అనుకుందాం. అప్పుడు వీటి సగటు మెచ్యూరిటీ 7.5 ఏళ్లు అవుతుంది. ఫండ్ పోర్ట్‌ఫోలియో వడ్డీ రేట్ల సున్నితత్వాన్ని ఇది తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ ఎంత దీర్ఘకాలానికి ఉంటే అంతగా వడ్డీ రేట్ల మార్పుల ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. యావరేజ్ మెచ్యూరిటీ తక్కువగా ఉంటే ఈ ప్రభావం తక్కువ. వైటీఎం ద్వారా ఫండ్ సగటు రాబడిని, యావరేజ్ మెచ్యూరిటీ ద్వారా ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోపై వడ్డీ రేట్ల మార్పు ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకోవచ్చు.
నా వయసు 35 ఏళ్లు. వచ్చే మూడేళ్లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా రూ.10 లక్షలు సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. లార్జ్‌క్యాప్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు ఎక్కువ పెట్టుబడిని కేటాయించాలని అనుకుంటున్నాను. ఇవి ఎక్కువ రాబడులు ఇస్తాయని విన్నాను. నా లక్ష్యానికి ఇది మెరుగైన పెట్టుబడుల వ్యూహమేనా?
– జిగ్నేష్
మీ లక్ష్యం రాజీపడకూడనిది అయితే, కచ్చితంగా మూడేళ్లలో రూ.10లక్షలు రావాలని కోరుకుంటుంటే.. అందుకు ఈక్విటీ పెట్టుబడుల ఎంపిక సరైనది కాదు. 2000 సంవత్సరం నుంచి చారిత్రక రాబడుల గణాంకాలను పరిశీలిస్తే.. సెన్సెక్స్‌లో మూడేళ్ల సిప్ రాబడి మైనస్ 15 శాతంగా ఉంది. అందుకే స్వల్పకాలానికి ఈక్విటీ పెట్టుబడులు ఎంతో రిస్క్‌తో ఉంటాయి. స్వల్పకాలానికి సంబంధించి ముఖ్యమైన లక్ష్యాల విషయంలో భద్రతతో పాటు, స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. కనుక ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను మీరు పరిశీలించొచ్చు.
వీటిల్లో ఎంతో స్థిరత్వం, ఊహించతగిన రాబడులు ఉంటాయి. దీంతో మీ పెట్టుబడులు మార్కెట్ అస్థిరతలకు గురికావు. ఒకవేళ మీ లక్ష్యంలో కొంత వెసులుబాటు ఉండి, రిస్క్ తీసుకునేట్టు అయితే అప్పుడు ఈక్విటీ పెట్టుబడులు పరిశీలించొచ్చు. అది కూడా కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఈక్విటీలు సూచనీయం. దీర్ఘకాలంలో సిప్ రాబడులు ప్రతికూలం నుంచి సానుకూలంలోకి మారి, సంపద సృష్టికి వీలు కల్పిస్తాయి. మార్కెట్ అస్థిరతలను అధిగమించి వృద్ధిని చూపించగలవు.
Comments
Please login to add a commentAdd a comment