
నేను ప్రతి నెలా రూ.5,000 మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. దీర్ఘకాలానికి మెరుగైన పథకాలను సూచించగలరు.
– అహ్మద్ వాని
దీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ మెరుగైనవే. మార్కెట్లలో ఉండే ఆటుపోట్ల దృష్ట్యా మీకు సౌకర్యమైన పథకాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటే, హైబ్రిడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. ఇవి మూడింత రెండొంతులు పెట్టుబడులను ఈక్విటీలకు, మిగిలినది డెట్‌కు కేటాయిస్తుంటాయి. మార్కెట్ పతనాల్లో పెట్టుబడుల విలువ క్షీణతకు డెట్ పెట్టుబడులు కుషన్‌గా పనిచేస్తాయి. ప్రతి నెలా రూ.5,000 చొప్పున గత 20 ఏళ్ల నుంచి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ మొత్తం రూ.51.25 లక్షలుగా మారి ఉండేది.
అంటే వార్షిక సిప్ రాబడి 12.18 శాతం. ఒకవేళ పెట్టుబడుల్లో అనుభవం ఉండి, మార్కెట్ ఆటుపోట్లను తట్టుకునేట్టు అయితే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు పూర్తిగా ఈక్విటీల్లో.. అది కూడా లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. అధిక రిస్క్ తీసుకున్నప్పటికీ 20 ఏళ్ల కాలంలో చూస్తే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో వార్షిక రాబడి 12.66 శాతమే ఉంది. కనుక ఇన్వెస్టర్లు తమ రిస్క్‌కు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి.
ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి పలు న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌వోలు/కొత్త పథకాలు) ప్రారంభం కావడం చూశాను. అవి ఎంతో ఆకర్షణీయంగా అనిపించాయి. కానీ, ఇప్పటికే పెట్టుబడులకు అందుబాటులో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల కంటే ఎన్‌ఎఫ్‌వోల్లో ఇన్వెస్ట్ చేయడం మెరుగైనదా? అన్న విషయంలో నాకు స్పష్టత లేదు. ఎన్‌ఎఫ్‌వోల్లో పెట్టుబడులు పెట్టే ముందు చూడాల్సిన అంశాలు ఏవి?
– కరుణాకర్
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తరచుగా కొత్త పథకాలను ప్రవేశపెడుతుంటాయి. ప్రస్తుత పథకాలతో పోల్చి చూస్తే వీటిల్లో ఉండే వ్యత్యాసం కొంతే. కొన్ని ఎన్‌ఎఫ్‌వోలు మాత్రం కొత్త పెట్టుబడుల అవకాశాలతో ముందుకు వస్తుంటాయి. ఇన్వెస్టర్లు ఇప్పటికే మంచి పనితీరు చూపిస్తున్న పథకాలకు పరిమితం కావడం మంచిది. ఎన్‌ఎఫ్‌వోల్లో ఇన్వెస్ట్ చేసే ముందుకు ప్రశ్నించుకోవాల్సిన అంశాలు చూద్దాం. ఎన్‌ఎఫ్‌వోలో కొత్తదనం ఏదైనా ఉందా? అన్నది చూడాలి.
చాలా ఎన్‌ఎఫ్‌వోలు ప్రస్తుత పథకాలకు మాస్క్ మాదిరిగా ఉంటాయి. ఇంటర్నేషనల్ ఈక్విటీ, గోల్డ్ ఫండ్స్ తదితర వినూత్నమైన ఆఫర్లు మినహా సాధారణమైన ఎన్‌ఎఫ్‌వోలతో పోర్ట్‌ఫోలియోకు అదనంగా ఒనగూడే ప్రయోజనం ఏదీ ఉండదు. థీమ్ లేదా సెక్టార్ ఫండ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత ఎన్‌ఎఫ్‌వో తమ పెట్టుబడుల అవసరాలను తీర్చే విధంగా ఉందా? అన్నది చూడాలి.
మీ ప్రస్తుత పెట్టుబడులు మీ ఆర్థిక లక్ష్యాలను తీర్చే విధంగా ఉంటే, ఎన్‌ఎఫ్‌వో మెరుగైన ఆప్షన్ కాకపోవచ్చు. ప్రతీ ఫండ్ మీ పోర్ట్‌ఫోలియోలో చేరాలనేమీ లేదు. కొత్తగా వచ్చిన ఎన్‌ఎఫ్‌వో మాదిరిగా పెట్టుబడుల విధానాన్ని ఆఫర్ చేస్తున్న పథకాలు ఇప్పటికే ఏవైనా ఉన్నాయేమో పరిశీలించాలి. ఒకవేళ ఉంటే, వాటిల్లో రాబడుల పనితీరు కొన్నేళ్ల నుంచి మెరుగ్గా ఉందా? లేదా అన్నది పరిశీలించాలి.
సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment