నేను పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ వరుసగా రెండేళ్లపాటు చెత్త పనితీరు చూపించినట్టయితే, నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనదేనా? – ఖలీద్ మునావర్
ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి వైదొలగేందుకు, ఆ పథకం తక్కువ పనితీరు చూపించడం అన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. తక్కువ పనితీరు అంటే ఇతర పథకాలతో పోలిస్తే తక్కువ రాబడులు ఇవ్వడం. వైదొలిగే నిర్ణయానికి ముందు.. మీరు పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ పథకం విభాగంలోని ఇతర పథకాల పనితీరు కూడా విశ్లేషించాలి. వాటి పనితీరు కూడా తగ్గిందా..? లేక మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం పనితీరు మాత్రమే తగ్గిందా? చూడాలి.
మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎన్‌ఏవీ క్షీణించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ పడిపోయినా రాబడులు తగ్గుతాయి. అన్ని పథకాలు కొన్ని ప్రతికూల సమయాలను ఎదుర్కొంటూ ఉంటాయి. అది చూసి ఒక పథకం నుంచి మరో పథకంలోకి మారిపోవడం సరైన నిర్ణయం కాబోదు. ఈ ప్రతికూల, తక్కువ పనితీరు అనేది ఒక పథకంలో కనీసం నిరంతరాయంగా రెండేళ్లపాటు కొనసాగాలి. అప్పుడు ఆ పథకం పనితీరు గురించి మీరు ఆలోచన చేయవచ్చు. (దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు)
మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం తక్కువ పనితీరు చూపించడం వెనుక కారణాన్ని గుర్తించాలి. ఫండ్ మేనేజర్‌లో మార్పు జరిగిందా? అందుకే పనితీరు మందగించిందా? అని చూడాలి. అదే నిజమైతే ఆ పథకం నుంచి మీ పెట్టుబడులను తీసుకుని బయటకు రావచ్చు. ఒకవేళ ఫండ్ మేనేజర్‌లో మార్పు లేకపోతే.. రాబడులు మందగించడానికి గల కారణాన్ని సాధారణంగా వారు మీడియాకు వెల్లడించే ప్రయత్నం చేస్తుంటారు. లేదంటే ఆయా ఫండ్ సంస్థ నెలవారీ న్యూస్ లెటర్‌లోనూ సమాచారాన్ని వెల్లడిస్తుంటారు. పథకం పెట్టుబడుల విధానం వల్ల కూడా తాత్కాలికంగా రాబడులు మెరుగ్గా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పథకం పనితీరును తప్పుబట్టడం సరైనది కాకపోవచ్చు.
ఉదాహరణకు గ్రోత్ ఆధారిత విధానంతో పోలిస్తే వ్యాల్యూ ఆధారిత పెట్టుబడుల విధానం కాస్త ఆలస్యంగా ఫలితాలను ఇస్తుంది. అటువంటప్పుడు మీరు పెట్టుబడులను కొనసాగించొచ్చు. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తాను ఎంపిక చేసుకున్న పథకం అన్ని కాలాల్లోనూ అద్భుత పనితీరు చూపించాలని ఆశిస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది సాధ్యం కాదు. అన్ని పథకాలు సానుకూల, ప్రతికూల సందర్భాలను ఎదుర్కొంటూ వెళుతుంటాయి. కనుక పెట్టుబడులను వెనక్కి తీసుకునే ముందు ఈ అంశాలన్నింటినీ చూడాలి.
నా వయసు 32 సంవత్సరాలు. నేను ఐదేళ్ల నుంచి మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇలా పెట్టుబడులు పెట్టే కాలంలో అస్సెట్ అలోకేషన్‌ను ఎలా నిర్వహించాలి? -వినయ్ శేఖర్
చిన్న వయసు నుంచే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో అస్సెట్ అలోకేషన్ ఎంతో కీలకమైనది. మీ పెట్టుబడులను ఈక్విటీ, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలకు (డెట్) కేటాయించడం, అలాగే, మీ పెట్టుబడుల కాల వ్యవధి, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడుల లక్ష్యాల ఆధారంగా కేటాయింపులు చేసుకోవడమే అస్సెట్ అలోకేషన్. ఈక్విటీలు ఇతర సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మంచి రాబడులను ఇవ్వగలవు. మీ పెట్టుబడుల కాల వ్యవధి ముగింపునకు వస్తున్నప్పుడు, పెట్టుబడులతో అవసరం ఏర్పడడానికి కొంత ముందు నుంచే క్రమంగా ఈక్విటీ పెట్టుబడులను డెట్‌లోకి మళ్లించు కోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలు మూడేళ్ల లోపు ఉంటే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సూచనీయం. మూడేళ్లకు మించి ఉన్నప్పుడు మొత్తం పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మూడు నుంచి ఐదేళ్ల కోసం అయితే 25-30 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు.
ఐదు, ఏడేళ్ల కోసం అయితే ఈక్విటీ కేటాయింపులు 50 శాతం వరకు, లేదా మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఏడేళ్లకు మించిన లక్ష్యాల కోసం ఈక్విటీలకు 70-80 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయడంతోపాటు, సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ముఖ్యమైనది. దీనివల్ల అస్థిరతలను అధిగమించొచ్చు.
-ధీరజ్ కుమార్, సీఈవో వాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment