ఫ్లెక్సీక్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఒకేసారి, ఒకటికి మించిన ఫండ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? – వెంటక రమణ
మీరు సంక్లిష్టతను ఇష్టపడే వారు అయితే అప్పుడు ఒకటికి మించిన విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్‌ఫోలియోని రీబ్యాలన్స్ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఎన్నో విభాగాల మధ్య వర్గీకరించినప్పుడు అది గజిబిజీగా, పన్ను పరంగా అనుకూలం కాకపోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకాలు వివిధ మార్కెట్ విలువ కలిగిన కంపెనీల్లో (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాకపోతే ఆయా విభాగాలకు కేటాయించే మొత్తం వేర్వేరుగా ఉండొచ్చు.
సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70-75 శాతాన్ని లార్జ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయిస్తుంటాయి. కనుక మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక మీరు విడిగా లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా, రిస్క్ తీసుకునే వారు, ఫ్లెక్సీక్యాప్‌నకు అదనంగా 10-15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవడం ద్వారా ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు.
మంచి మ్యూచువల్ ఫండ్‌ను గుర్తించడం ఎలా? అలాగే, ఏడాది కోసం ఒక మంచి పథకాన్ని సూచించగలరు. ఏడాదికి 12 శాతం కాంపౌండెడ్ రాబడి నా లక్ష్యం – ఇమ్రత్ సూతర్
చాలా విస్తృత శ్రేణిలో వేలాది పథకాలు ఉన్నప్పుడు సరైన పథకం ఎంపిక అన్నది కష్టమైన పనే. అయితే మంచి పథకం ఎంపికకు రాబడులు ఒక్కటే ప్రామాణికంగా తీసుకోకూడదు. పెట్టుబడి పెట్టడానికి ముందు మీ లక్ష్యాలను గుర్తించాలి. మీ పెట్టుబడుల లక్ష్యం ఆధారంగానే ఎలాంటి పథకం ఎంపిక చేసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలన్నది మీ లక్ష్యం అయితే అందుకు ఈక్విటీ పథకాలపై దృష్టి పెట్టాలి. అలా కాకుండా క్రమం తప్పకుండా ఆదాయం కోరుకుంటుంటే స్థిరాదాయ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రిస్క్ ఎంత తీసుకోగలరు? అన్నది కూడా ముఖ్యమైన అంశం అవుతుంది. మీ పెట్టుబడులు విలువ పడిపోతూ, పెరుగుతూ ఉన్నా ఫర్వాలేదని అనుకుంటే అప్పుడు ఈక్విటీలు అనుకూలం. లేదా రిస్క్ లేని రాబడులు కోరుకుంటే డెట్ విభాగం అనుకూలం. అధిక రాబడులు ఇచ్చే సాధనాలు ఏవైనా అందులో అధిక రిస్క్ ఉంటుందని మర్చిపోవద్దు.
రిస్క్, రాబడుల మధ్య సమతుల్యం అవసరం. పెట్టుబడులను ఎంత కాలం కొనసాగించాలని అనుకుంటున్నారు? లిక్విడిటీ సమస్యలు సమీప భవిష్యత్తులో ఉన్నాయా? తదితర అంశాలను చూడాలి. మ్యూచువల్ ఫండ్స్ అన్నవి మార్కెట్ రిస్క్‌పై ఆధారపడి నడుస్తుంటాయి. అందుకని కనీసం ఐదేళ్లకు తక్కువ కాకుండా ఈక్విటీ పెట్టుబడులు కొనసాగించుకోవాలి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, వీటికి సరితూగే పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇక ఏడాది కాలానికి 12 శాతం రాబడి కోరుకుంటే అది అసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కెట్లు కరెక్షన్‌లోకి వెళితే రాబడులు అటు ఉంచి, పెట్టుబడి విలువ తగ్గిపోతుంది. ఏడాది కోసం అయితే, ఎఫ్‌డీ తదితర సంప్రదాయ సాధనాలనే చూడాల్సి ఉంటుంది. వీటిల్లో మీరు కోరుకున్నంత రాబడి రాదు.
Comments
Please login to add a commentAdd a comment