పెట్టుబడుల రక్షణకు మూడు సూత్రాలు...రిస్క్‌లేకుండా! | Do you know these riskless and attractive invesements | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల రక్షణకు మూడు సూత్రాలు... రిస్క్‌లేకుండా!

Published Mon, Nov 14 2022 1:03 PM | Last Updated on Mon, Nov 14 2022 1:05 PM

Do you know these riskless and attractive invesements - Sakshi

గత ఏడాది కాలంగా అంతర్జాతీయంగా అనిశ్చితిపరమైన సవాళ్లు నెలకొన్నా ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే రాణిస్తోంది. దేశీ మార్కెట్లలో కరెక్షన్‌ కొంత స్థాయికే పరిమితమైంది. రిజర్వ్‌ బ్యాంక్, ప్రభుత్వం, కార్పొరేట్లు మొదలైన వర్గాలన్నీ పరిస్థితిని చక్కగానే ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాయి. అయితే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను ఆపేవరకూ మార్కెట్లలో కుదుపులు కొన సాగుతూనే ఉంటాయి. దేశీ మార్కెట్‌ వేల్యుయేషన్లు ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నందున మదుపరులు..  రిస్కులను గుర్తెరిగి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోను రిస్కుల నుండి కాపాడుకునేందుకు వ్యక్తిగత ఇన్వెస్టర్లు పాటించతగిన సూత్రాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..  

డెట్‌ ఫండ్స్‌లో మదుపు 
ఏడాదిన్నర, రెండేళ్లుగా పాపులారిటీని కోల్పోయిన డెట్‌ సాధనాలు మళ్లీ ఆకర్షణీయంగా మారుతున్నాయి. వివిధ కాలావధులకు సంబంధించి అధిక రాబడులు అందిస్తున్నాయి. అధిక ధరలు, అంతర్జాతీయ ఎకానమీకి పెను సవాళ్లు పొంచి ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ రెపో రేట్‌ పెంపు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ రిస్కులు ఉండే స్వల్ప, మధ్య కాలిక ఎక్రూవల్‌ ఫండ్స్, అలాగే డైనమిక్‌ వ్యవధుల స్కీములను ఎంచుకోవచ్చు. ఫ్లోటింగ్‌-రేట్‌ బాండ్లు (ఎఫ్‌ఆర్‌బీ) అన్నింటి కన్నా మెరుగ్గా రాణించగలవని అంచనాలు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవడంలో .. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోవాలి. 
లక్ష్యాల ఆధారిత ఫండ్స్‌ .. 
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌కి అందుబాటులో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించడం పూర్తయ్యే వరకూ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు .. ముఖ్యంగా భారతీయ మదుపుదారులు కొంత ఆచితూచి వ్యవహరించాలి. మూడు నుంచి అయిదేళ్ల కాల వ్యవధిని నిర్దేశించుకుని రాబోయే ఏడాది కాలంలో సిప్‌మార్గంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం. ఇక ఈక్విటీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్‌ చేయదల్చుకుంటే బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ లేదా మల్టీ–అసెట్‌ కేటగిరీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని పరిశీలించవచ్చు. అలాగే వివిధ ఆర్థిక లక్ష్యాలను ప్రణాళికబద్ధంగా సాధించేందుకు బూస్టర్‌ సిప్, బూస్టర్‌ ఎస్‌టీపీ లేదా ఫ్రీడమ్‌ ఎస్‌డబ్ల్యూపీ వంటి ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. 

గోల్డ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌లు .. 
వివిధ సాధనాల్లో పెట్టుబడులతో పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం పాటిస్తే.. ఒక సాధనం వల్ల నష్టాలేవైనా వచ్చినా మరొక దాని ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్న తరుణంలో బంగారం, వెండి వంటి కమోడిటీలు ఆసక్తికరమైన సాధనాలుగా ఉండగలవు. ద్రవ్యోల్బణానికి మాత్రమే కాకుండా కరెన్సీ క్షీణతకు కూడా ఇవి హెడ్జింగ్‌ సాధనంగా పని చేయగలవు. ఈటీఎఫ్‌ల మార్గంలో వీటిలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించవచ్చు. డీమ్యాట్‌ ఖాతా లేని వారికి గోల్డ్‌ లేదా సిల్వర్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఉపయోగకరంగా ఉండగలవు.

-ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌ ఎండీ, నిమేష్‌ షా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement