నా వయసు 63 ఏళ్లు. మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సరైన ప్లాన్‌ను సూచించగలరు. – టీఆర్ లక్ష్మణన్
రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో నిధి చేతికి అందుతుంది. లేదా ఇతర పెట్టుబడుల నుంచి పెద్ద మొత్తంలో నిధులు రావచ్చు. వీటిని మెరుగైన సాధనంలో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైనదే. దీనికంటే ముందు దేని కోసం చూస్తున్నారు? పెట్టుబడుల నుంచి ఏమి ఆశిస్తున్నారు? అనే దానిపై స్పష్టత అవసరం. జీవన వ్యయాల కోసం క్రమం తప్పకుండా పెట్టుబడుల నుంచి ఆదాయం కోరు కుంటున్నారా? లేక సదరు పెట్టుబడిని దీర్ఘకాలం కోసం అట్టిపెట్టి, మంచి వృద్ధిని కోరుకుంటున్నారా? రెగ్యులర్ ఆదాయం కోరుకుంటున్నట్టయితే, మరే ఇతర ఆదాయం వనరు లేకపోతే అప్పుడు.. మీ వద్ద నిధిని రెండు భాగాలు చేయాలి. ఇందులో 30–40 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించాలి. మిగిలిన భాగాన్ని స్థిరాదాయ పథకాలకు (డెట్ ఫండ్స్) కేటాయించాలి. ఈక్విటీల్లో పెట్టుబడులు వృద్ధిని చూపిస్తాయి. జీవిత చరమాంకంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించే ఆదాయం కోసం ఇది ఉపయోగపడుతుంది. డెట్ ఫండ్స్ నుంచి క్రమం తప్పకుండా వచ్చే ఆదాయాన్ని నెలవారీ వ్యయాల కోసం ఉపయోగించుకోవచ్చు.
స్థిరాదాయం కోసం ప్రభుత్వ మద్దతు ఉండే సాధనాలైన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్) లేదా ప్రధానమంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై)కు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఈ రెండు పథకాల్లో వార్షిక వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. అత్యవసరాల కోసం కొంత నిధిని బ్యాంకు ఖాతాలో లేదంటే ఎఫ్‌డీలో లేదా అధిక నాణ్యతతో కూడిన డెట్ పథకంలో పెట్టుకోవచ్చు. ఈక్విటీకి కేటాయించిన మొత్తాన్ని కొంచెం రక్షణాత్మక ధోరణితో నిర్వహించే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక మొత్తాన్ని ఒకే విడత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయవద్దు. దీన్ని 18–24 నెలల సమాన వాయిదాలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి.
దీర్ఘకాలంలో మీ పెట్టుబడి మంచిగా పెరగాలని కోరుకుంటున్నట్టు అయితే, ఈక్విటీ కేటాయింపులను 50–70 శాతానికి కూడా పెంచు కోవచ్చు. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ పథకాలలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇందుకోసం హైబ్రిడ్ ఫథకాలను పరిశీలించొచ్చు. వీటిల్లో పెట్టుబడులు వాటంతట అవే రీబ్యాలన్స్ అవుతుంటాయి. మీకు ఇప్పటికే తగినంత ఆదాయ వనరులు ఉంటే, మీదగ్గర ఉన్న పెట్టుబడిని ఈక్విటీలకు దీర్ఘకాలం కోసం కేటాయించుకోవచ్చు. లేదంటే నెలవారీ అవసరాలకు కావాల్సినంత వచ్చేలా డెట్‌లోనూ, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి.
మ్యూచువల్ ఫండ్స్‌లో సక్సెసివ్ నామినేషన్ అనుమతిస్తారా? అంటే నామినీ ఏ చనిపోతే, నామినీ బీ అర్హులు అవుతారా?- ఆర్పీ సూద్
అకాల, ఊహించని మరణం చోటు చేసుకుంటే పెట్టుబడులు, ఆస్తులు కుటుంబ సభ్యులకు సులభంగా బదిలీ అయ్యేందుకు నామినేషనల్ వీలు కల్పిస్తుంది. నామినేషన్ ఉన్నట్టయితే మ్యచువల్ ఫండ్స్‌ను సులభంగా బదిలీ చేసుకోవచ్చు. లేదంటే పెట్టుబడుల బదిలీ ప్రక్రియ క్లిష్టంగా ఉంటుంది. సక్సెసివ్ నామినేషన్ అంటే.. ఓ పథకంలో ఏ అనే వ్యక్తి పెట్టుబడి దారుడు అయితే, బీ అనే వ్యక్తి నామినీగా, సీ అనే వ్యక్తి సక్సెసివ్ నామినీగా ఉన్నారని అనుకుందాం. అప్పుడు ఏ చనిపోతే.. యూనిట్లను నామినీ బీకి బదిలీ చేస్తారు. ఒకవేళ బీ కూడా అందుబాటులో లేకపోతే, సీకి అవి బదిలీ అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రస్తుతానికి ఈ ఆప్షన్ లేదు. కాకపోతే దీన్ని ఓ వీలునామా ద్వారా చేసుకోవచ్చు. యూనిట్ హోల్డర్ వీలునామా రాస్తూ, అందులో ఫండ్స్ పెట్టుబడులకు సక్సెసివ్ నామినీలను నమోదు చేసుకోవాలి. సక్సెసివ్ నామినీలుగా ఎంత మందిని అయిన పేర్కొనవచ్చు. లేదంటే జాయింట్ అకౌంట్ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం ఒక మార్గం. ఇక్కడ ఏ, బీ ఫండ్స్ పెట్టుబడులకు జాయింట్ ఖాతాదారులుగా ఉంటారు. సీ నామినీగా వ్యవహరిస్తారు. ఏ చనిపోతే జాయింట్ హోల్డర్ అయిన బీ ఆ యూనిట్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పుడు నామినీగా సీ యథావిధిగా అమలవుతుంది. బీ కూడా చనిపోయిన సందర్భంలో నామినీగా ఉన్న సీకి యూనిట్లు బదిలీ అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment