Mutual funds
-
ఫండ్ ఇన్వెస్టర్లకు సెబీ ‘మిత్రా’ ప్లాట్‌ఫామ్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల కోసం ‘మిత్రా’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సెబీ తీసుకొచ్చింది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి, వాటి వివరాలు మర్చిపోయిన వారు, దీర్ఘకాలంగా ఎలాంటి లావాదేవీలు లేకుండా ఉండిపోయిన వాటిని సులభంగా గుర్తించేందుకు ఈ ప్లాట్‌ఫామ్ సాయపడనుంది. ఇలాంటి చురుగ్గాలేని (ఇనాక్టివ్), చాలా కాలంగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన (అన్క్లెయిమ్డ్) పెట్టుబడులను తిరిగి గుర్తించి, వెనక్కి తీసుకోవడానికి ఈ చర్య తీసుకుంది.గతంలో చేసిన పెట్టుబడుల వివరాలను మర్చిపోయి, తాజా కాంటాక్ట్ సమాచారం లేక, తమ పేరిట చేసిన పెట్టుబడులపై అవగాహన లేని వారి విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనలకు ఈ ప్లాట్‌ఫామ్ పరిష్కారం చూపుతుందని సెబీ తన తాజా సర్క్యులర్‌లో వెల్లడించింది. ఈ తరహా యాక్టివ్‌గా లేని ఫోలియోలు (పెట్టుబడులు) మోసపూరిత ఉపసంహరణలకు దారితీయవచ్చని పేర్కొంది.రిజిస్టార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్.. క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయిన పెట్టుబడులను తగ్గించేందుకు సాయపడుతుందని పేర్కొంది. పదేళ్లుగా పెట్టుబడులు, మరే ఇతర ఆర్థికేతర లావాదేవీలు లేకుండా ఉండిపోయిన పెట్టుబడులను ఇనాక్టివిగా పరిగణిస్తుంటారు. ఇన్వెస్టర్లకు సంబంధించి ఇనాక్టివ్ ఫోలియోలు, అన్క్లెయిమ్డ్ డివిడెండ్లను గుర్తించి.. వాటిని తగ్గించే బాధ్యతను ‘యూనిట్ హోల్డర్ ప్రొటెక్షన్ కమిటీ’పై పెట్టింది. తాజా చర్యల గురించి ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలంటూ ఏఎంసీలు, ఆర్టీఏలు, ఆర్ఐఏలు, యాంఫి, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులను సెబీ ఆదేశించింది. -
స్మాల్‌క్యాప్ ఫండ్ పరిమాణం పెరిగితే..?
ఒక స్మాల్‌క్యాప్ ఫండ్ పరిమాణం (నిర్వహణలోని ఆస్తులు/ఏయూఎం) పెరిగే కొద్దీ దాని పనితీరుపై ప్రభావం పడుతుందా? – ఊర్మిళా సానుస్మాల్క్యాప్ పథకాలు పెద్దగా మారే క్రమంలో.. బలమైన పనితీరు కారణంగా అవి మరింత పెట్టుబడులను ఆకర్షించడం సహజంగానే చూస్తుంటాం. ఈ పరిణామం వినూత్నమైన సవాళ్లను తెచ్చి పెడుతుంది. దీనిపై ఇన్వెస్టర్లలో అవగాహన ఉండాలి. స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.1,000–2,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. రూ.100–200 కోట్ల ఏయూఎం నిర్వహించే స్మాల్‌క్యాప్ ఫండ్స్ తమకు ఆకర్షణీయం అనిపించిన కంపెనీల్లో చెప్పుకోతగ్గ మేర ఎక్స్పోజర్ తీసుకుంటాయి. కానీ, వాటి ఏయూఎం సైజు పెరుగుతున్న కొద్దీ అదే మాదిరి పెట్టుబడులు సవాలుగా మారతాయి. ఉదాహరణకు రూ.200 కోట్ల ఏయూఎం నిర్వహించే ఒక స్మాల్‌క్యాప్ ఫండ్ రూ.1,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీలో ఏకంగా 5 శాతం పెట్టుబడులు పెట్టగలదు. లేదా రూ.10 కోట్లు ఇన్వెస్ట్ చేయగలదు. ఇలా రూ.10 కోట్ల పెట్టుబడితో తన పనితీరుపై, లిక్విడిటీపై పెద్దగా ప్రభావం లేకుండా చూసుకోగలదు. ఒకవేళ స్మాల్‌క్యాప్ ఫండ్ ఏయూఎం రూ.2,000 కోట్లకు పెరిగితే, అప్పుడు ఒక కంపెనీలో 5 శాతం ఎక్స్పోజర్ కోసం రూ.100 కోట్లు కేటాయించాల్సి వస్తుంది. రూ.1,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన చిన్న కంపెనీల్లో రూ.100 కోట్ల పెట్టుబడి అంటే 10 శాతానికి సమానం. అంత చిన్న కంపెనీలో 10 శాతం సమానమైన వాటాలను విక్రయించాల్సి వచ్చినప్పుడు కొనుగోలుదారులను గుర్తించడం కష్టం (లిక్విడిటీ సమస్య) కావచ్చు. ఎందుకంటే స్మాల్‌క్యాప్ కంపెనీలు తక్కువ వ్యాల్యూమ్‌తో ట్రేడ్ అవుతుంటాయి.మితిమీరిన వైవిధ్యం కాబట్టి లిక్విడిటీ సమస్య రాకుండా ఫండ్ మేనేజర్లు మరిన్ని స్టాక్స్‌లో పెట్టుబడులను వైవిధ్యం చేస్తుంటారు. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. కానీ, మొత్తం మీద రాబడులు ప్రభావితం అవుతాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్ అసాధారణ రాబడుల పనితీరుతో ఇన్వెస్టర్ల నుంచి మరింత భారీగా పెట్టుబడులు వచ్చి పడుతుంటాయి. దీంతో ఆయా పథకాల సైజు మరింత పెరిగే రిస్క్ ఉంటుంది. ఇది భవిష్యత్ పనితీరుపై ప్రభావం చూపించొచ్చు. అదే సమయంలో స్మాల్‌క్యాప్ ఫండ్ పెట్టుబడులు రాబట్టుకోవడంలో విఫలమైతే, కోల్పోయే రిస్క్ కూడా ఉంటుంది. స్మాల్‌క్యాప్ ఫండ్ ఏయూఎం పెరగడాన్ని ప్రతికూలంగా చూడక్కర్లేదు. పెరిగిపోతున్న ఏయూఎం విషయమైన వాటికంటూ ప్రత్యేకమైన పెట్టుబడుల వ్యూహం ఉండొచ్చు. కనుక ఇన్వెస్టర్లు ఫండ్స్ ఏయూఎం కాకుండా, వాటి పనితీరుపై దృష్టి సారించడమే నయం. సిప్ ద్వారా దీర్ఘకాల పెట్టుబడుల్లో 50% నుంచి 60% మేర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – ఉమేష్ ఈక్విటీల్లో దీర్ఘకాల పెట్టుబడులకు (సిప్) పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం అనుకూలం. అయితే, 50–60 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 25–30 శాతానికి పరిమితం అవుతాయి. లార్జ్‌క్యాప్ పెట్టుబడులు 70 శాతం మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వాన్ని ప్రదర్శించే స్టాక్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. అధిక అస్థిరతలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో అధిక రాబడులు కోరుకుంటే అప్పుడు ఫ్లెక్సీక్యాప్తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫండ్స్‌లో పెట్టుబడులకు క్యూ
న్యూఢిల్లీ: గత క్యాలండర్ ఏడాది(2024)లో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పట్ల ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తిని ప్రదర్శించారు. దీంతో 239 కొత్త ఫండ్ ఆఫరింగ్స్(ఎన్‌ఎఫ్‌వోలు) ద్వారా మొత్తం రూ. 1.18 లక్షల కోట్లను అందుకున్నాయి. వీటిలో సెక్టోరల్ లేదా థిమాటిక్ ఈక్విటీ ఫండ్స్ ఇన్వెస్టర్లను గరిష్టంగా ఆకట్టుకున్నట్లు జెర్మినేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. కాగా.. 2023లో 212 ఎన్‌ఎఫ్‌వోలు ఉమ్మడిగా రూ. 63,854 కోట్లు సమీకరించగా.. 2022లో 228 పథకాలకు రూ. 62,187 కోట్లు లభించాయి. అంతక్రితం అంటే 2020లో 81 కొత్త పథకాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. తద్వారా ఫండ్స్ రూ. 53,703 కోట్లు సమీకరించాయి. వీటితో పోలిస్తే గతేడాది రెట్టింపు పెట్టుబడులు అందుకోవడం గమనార్హం! ఇది ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసంతోపాటు.. పటిష్ట వృద్ధి పథాన్ని ప్రతిబింబిస్తోంది. మార్కెట్ల ఎఫెక్ట్ సాధారణంగా స్టాక్ మార్కెట్లు పురోగమిస్తున్నప్పుడు ఎన్‌ఎఫ్‌వోలు వెలువడుతుంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సానుకూల సెంటిమెంటు, ఇన్వెస్టర్ల ఆశావహ ధృక్పథం ప్రభావం చూపుతుంటాయి. ఇన్వెస్టర్ల ఆసక్తి ఆధారంగా కొత్త పథకాలకు ఫండ్స్ తెరతీస్తుంటాయి. దీంతో పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతాయి. వెరసి 2024లో అధిక ఎన్‌ఎఫ్‌వోల ద్వారా భారీగా పెట్టుబడులను సమీకరించాయి. గతేడాది స్టాక్ ఇండెక్స్‌లలో సెన్సెక్స్ 5,899 పాయింట్లు(8.2 శాతం) జంప్‌చేయగా.. నిఫ్టీ 1,913 పాయింట్లు(8.8 శాతం) ఎగసింది. ఈఎస్జీ సైతం గతేడాది పెట్టుబడుల్లో థిమాటిక్, సెక్టోరల్, ఇండెక్స్, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు) అధిక శాతం ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. నివేదిక ప్రకారం 53 ఎన్‌ఎఫ్‌వోల ద్వారా ఫండ్స్‌కు రూ. 79,109 కోట్లు లభించాయి. ఇన్వెస్టర్ల ఆసక్తికి అనుగుణంగా రూపొందించిన థీమ్స్ లేదా థిమాటిక్, సెక్టోరల్ ఫండ్స్ ఇందుకు సహకరించాయి. తయారీ, టెక్నాలజీ, పర్యావరణం, సామాజిక, సుపరిపాలన(ఈఎస్జీ) విభాగాలను ఇందుకు ప్రస్తావించవచ్చు. విడిగా చూస్తే హెచ్డీఎఫ్సీ మ్యాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఎన్ఎఫ్వో గత ఏప్రిల్‌లో రూ. 12,500 కోట్లు అందుకుంది. డిసెంబర్లో అత్యధిక ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లను తాకడం ప్రస్తావించదగ్గ అంశం! -
మనవడి భవిష్యత్తుకు ఉత్తమ ఫండ్స్
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారీ నాకు కేటాయించే యూనిట్ల విలువ కొంత తక్కువగా ఉంటుంది. కాకపోతే నా పెట్టుబడులు, నాకు కేటాయించే యూనిట్ల మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగానే ఉంటోంది. ఎందుకు ఇలా? - నంబూద్రి ప్రసాద్మీరు గుర్తించిన ఈ స్వల్ప వ్యత్యాసం అన్నది మీ ప్రతి పెట్టుబడికి సంబంధించి మినహాయించే స్టాంప్ డ్యూటీ. అన్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లకు దీన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పెట్టుబడి విలువపై 0.005 శాతాన్ని స్టాంప్ డ్యూటీ చార్జీ కింద వసూలు చేస్తారు.ప్రతి పెట్టుబడి మొత్తంలో ఈ మేరకు మినహాయించగా, మిగిలిన మొత్తానికి యూనిట్ల కేటాయింపు జరుగుతుంది. ఉదాహరణకు సిప్ రూపంలో రూ.5,000 ఇన్వెస్ట్ చేశారు. ఇందులో 0.005 శాతం అంటే రూ.0.25 అవుతుంది. అప్పుడు రూ.4,999.75 మొత్తం పెట్టుబడి కిందకు వెళుతుంది. సిప్‌లు, ఏక మొత్తంలో పెట్టుబడులు, డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ లావాదేవీలు అన్నింటికీ వర్తిస్తుంది.ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి బదిలీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల ఉపసంహరణకు స్టాంప్ డ్యూటీ వర్తించదు. చట్టపరమైన ఈ చార్జీల గురించి పెద్దగా ఆలోచించకుండా, పెట్టుబడుల ప్రణాళిక, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించండి. నా మూడేళ్ల మనవడి భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూలించే ఫండ్స్ ఏవి? వాటి విషయంలో ఎలా వ్యవహరించాలి? - రవిగుప్తాపిల్లల ఉన్నత విద్య కోసం ఈక్విటీ, అగ్రెస్సివ్ ఈక్విటీ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడుల పట్ల సౌకర్యంగా లేకపోతే అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఒకటి లేదా రెండు మిడ్‌క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. 15 ఏళ్ల కాలంలో మార్కెట్లు ఎన్నో ఎత్తు పల్లాలు చూసినప్పటికీ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో (వైవిధ్యమైన పెట్టుబడులతో కూడిన) మెరుగైన రాబడులు ఇస్తుంది. కాకపోతే పెట్టుబడులు అలాగే కొనసాగించి, మధ్య మధ్యలో వచ్చే మార్కెట్ పతనాలను పట్టించుకోకుండా ఉంటే చాలు.మార్కెట్ ఊగిసలాటల్లో పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే దీర్ఘకాలంలో విజయం సాధించగలరు. మనవడు, మనవరాలి భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు రెండు రకాల విధానాలను అనుసరించొచ్చు. చిన్నారి పేరు మీద బ్యాంక్ ఖాతా తెరవాలి. ఈ ఖాతాలోకి నగదు బదిలీ చేయాలి. తర్వాత ఎంపిక చేసిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?మనవడి పేరు మీదే ఖాతా ఉంటుంది కనుక 18 ఏళ్లు నిండిన తర్వాత సంబంధిత ఖాతా యాజమాన్య హక్కులు చిన్నారికి బదిలీ చేయవచ్చు. లేదంటే మీ మనవడికి బదులు మీ పేరు మీదే పెట్టుబడులు పెట్టుకోవడం మరొక ఆప్షన్. మనవడికి 18 ఏళ్లు నిండగానే, ఆ పెట్టుబడులను ఉపహరించుకుని ఆ మొత్తాన్ని మనవడికి గిఫ్ట్ కింద బదిలీ చేయవచ్చు. అప్పటి వరకు ఆ పెట్టుబడులకు నామినీగా మనవడి (మైనర్)ని ప్రతిపాదించొచ్చు. -
ఈక్విటీ ఫండ్స్లోకిపెట్టుబడుల ప్రవాహం
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు డిసెంబర్ నెలలో దుమ్మురేపాయి. అక్టోబర్ నెలలో నికరంగా 14 శాతం మేర పెట్టుబడులను కోల్పోయిన ఈక్విటీ ఫండ్స్.. తిరిగి డిసెంబర్ నెలలో రూ.41156 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అక్టోబర్ నెలలో నికర ఈక్విటీ పెట్టుబడులు రూ.35,943 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగాయి. వరుసగా 46వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లో సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. ఈక్విటీలోని అన్ని విభాగాల పథకాల్లోకి నికర పెట్టుబడులు వచ్చాయి. 2024 మొత్తం మీద ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్టర్లు రూ.3.94 లక్షల కోట్లను పెట్టుబడి పెట్టారు. 2023తో పోల్చితే 144 శాతం అధికం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. ఎప్పటి మాదిరే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు తమ జోరును కొనసాగించాయి. ఈ రెండు విభాగాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌కు సైతం డిమాండ్ కొనసాగింది. డిసెంబర్లో డెట్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.1.3 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోయాయి. దీంతో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి డిసెంబర్లో రూ.80,355 కోట్లను ఇన్వెస్టర్లను వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా పరిశ్రమ నిర్వహణలోని పెట్టుబడుల విలువ (ఏయూఎం) నెలవారీగా 1.7 శాతం తగ్గి డిసెంబర్ చివరికి రూ.66.9 లక్షల కోట్లకు పరిమితమైంది. విభాగాల వారీగా.. → స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,667 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,093 కోట్లు వచ్చాయి. నవంబర్ నెలతో పోల్చి చూస్తే స్మాల్క్యాప్లోకి 13 శాతం, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి 4 శాతం అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం వీటిని ఎంపిక చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. → లార్జ్‌క్యాప్ పథకాలు రూ.2,010 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. నవంబర్‌లో వచి్చన రూ.2,500 కోట్లతో పోల్చితే 20% తగ్గాయి. → సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.15,331 కోట్లను ఆకర్షించాయి. నవంబర్‌లో వచి్చన రూ.7,658 కోట్లతో పోల్చితే రెట్టింపయ్యాయి. → డిసెంబర్లో 33 కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు (ఎన్ఎఫ్వో) మార్కెట్లోకి వచ్చాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.13,643 కోట్లను రాబట్టాయి. నవంబర్‌లో మొత్తం 18 ఎన్ఎఫ్వో ఇష్యూలు రాగా, అవి సమీకరించిన మొత్తం రూ.4,000 కోట్లు కావడం గమనార్హం. ఏకంగా మూడింతలకుపైగా పెరిగినట్టు తెలుస్తోంది. → ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,770 కోట్లు వచ్చాయి. నవంబర్‌లో వచి్చన రూ.5,084 కోట్లతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. మల్టీక్యాప్ ఫండ్స్ 15 శాతం తక్కువగా రూ.3,075 కోట్లను ఆకర్షించాయి. → లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో రూ.3,811 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూ.640 కోట్లను ఆకర్షించాయి. 2024 సంవత్సరం మొత్తం మీద గోల్డ్ ఫండ్స్‌లోకి రూ.11,226 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.సిప్ పెట్టుబడుల్లో వృద్ధి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో డిసెంబర్లో ఈక్విటీ పథకాల్లోకి రూ.26,459 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. నవంబర్ నెల సిప్ పెట్టుబడులు రూ.25,320 కోట్లతో పోల్చి చూస్తే 5 శాతం పెరిగాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ పెట్టుబడుల విలువ రూ.13.63 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్లలో నమ్మకానికి నిదర్శనం ‘‘ఎన్‌ఎఫ్‌వోలు, సిప్ పెట్టుబడులు, ఏక మొత్తంలో కొనుగోళ్లు నికర పెట్టుబడుల ప్రవాహానికి తోడ్పడ్డాయి. పెట్టుబడులు బలంగా రావడం మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి నిదర్శనం’’అని కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా తెలిపారు. మార్కెట్ అస్థిరతల్లోనూ సిప్ పెట్టుబడులు బలంగా కొనసాగడం అన్నది దీర్ఘకాల పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నట్టు మిరే అస్సెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ డి్రస్టిబ్యూషన్ హెడ్ సురంజన బోర్తకుర్ పేర్కొన్నారు. -
కొత్త ఏడాది సరికొత్త మ్యూచువల్ ఫండ్: జనవరి 16 వరకు ఛాన్స్!
ముంబై: యూటీఐ మ్యూచువల్ ఫండ్ (UTI) తమ యూటీఐ క్వాంట్ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది ప్రెడిక్టివ్ మోడలింగ్‌ను పెట్టుబడుల పరిశోధనల్లో యూటీఐకి గల విస్తృత అనుభవం, పెట్టుబడి ప్రక్రియలో అది పాటించే విధానాలను మేళవించి నిర్వహించబడే ఒక యాక్టివ్ ఈక్విటీ ఫండ్. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మల్చుకుంటూ, ఒడిదుడుకులను అధిగమిస్తూ, విస్తృత సూచీలకు మించిన రాబడులను స్థిరంగా అందించడమనేది ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. ఈ ఎన్ఎఫ్వో 2025 జనవరి 2న ప్రారంభమై 2025 జనవరి 16న ముగుస్తుంది.యూటీఐ క్వాంట్ ఫండ్ అనేది అధునాతనమైన క్వాంటిటేటివ్ పెట్టుబడుల వ్యూహాన్ని పాటించే ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీము. బెంచ్‌మార్క్‌లను మించిన రాబడులు అందించే లక్ష్యంతో ఈ ఫండ్, ‘మూమెంటం, నాణ్యత, లో వోలటైలిటీ (Low Volatility), విలువ’ అనే నాలుగు అంశాలకు డైనమిక్‌గా వెయిటేజీని కేటాయించేలా ‘ఫ్యాక్టర్ అలొకేషన్’ విధానాన్ని పాటిస్తుంది.విస్తృత మార్కెట్లో సాధారణంగా కనిపించే హెచ్చుతగ్గులను అధిగమించేందుకు ఈ ఫ్యాక్టర్ మోడల్ సహాయకరంగా ఉంటుంది. మిగతా విధానాలతో పోలిస్తే మరింత మెరుగ్గా రిస్కుకు తగ్గ రాబడులను పొందేందుకు తోడ్పడుతుంది. వివిధ మార్కెట్ సైకిల్స్‌కి అనుగుణంగా మారగలిగే సామర్థ్యాల కారణంగా మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు వివిధ ఫ్యాక్టర్స్వ్యాప్తంగా కేటాయింపులను సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది.ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా ముందుకెళ్లేందుకు ఇది ఒక పటిష్టమైన సాధనంగా ఉపయోగపడగలదు. రిస్కుకు తగ్గట్లుగా రాబడులనిచ్చే విషయంలో నిర్వహించిన పరీక్షల్లో ఈ ఫండ్ పటిష్టమైన పనితీరు కనపర్చింది. కాబట్టి వివిధ మార్కెట్ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన రాబడులు పొందే అవకాశాలను కోరుకునేవారికి ఇది ఆకర్షణీయమైన ఆప్షన్ కాగలదు.“మార్కెట్ సంక్లిష్టతలను అధిగమించి, పెట్టుబడుల విషయంలో మరింత సమాచారంతో తగిన నిర్ణయాలు తీసుకునేలా ఇన్వెస్టర్లకు ఒక క్రమబద్ధమైన మరియు పరిశోధన ఆధారితమైన విధానాన్ని అందించాలనేది మా లక్ష్యం. మా పెట్టుబడి ప్రక్రియ స్కోర్ ఆల్ఫాను (Score Alpha) మా సొంత ఫ్యాక్టర్ అలొకేషన్ మోడల్‌తో (Factor Allocation Model) మేళవించి ఈ ఫండ్ ఒక ‘సమగ్ర పెట్టుబడుల’ విధానాన్ని అమలు చేస్తుంది.2022 ఏప్రిల్ నుంచి యూటీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తన ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నిర్వహణ కోసం ఈ ప్రక్రియను అమలు చేస్తోంది. ఈక్విటీ ఫండ్‌కి సంబంధించి ఈ అనుభవాన్ని & విధానాన్ని మరింతగా అందుబాటులోకి తేవడంపై మేము సంతోషిస్తున్నాం” అని యూటీఐ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శ్రీ వెట్రి సుబ్రమణియం (Vetri Subramaniam) తెలిపారు.“రుజువుల ఆధారిత వ్యూహాలతో ఇన్వెస్టర్లకు సాధికారత కల్పించేలా యూటీఐ క్వాంట్ ఫండ్ ఉంటుంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాలు అందించలేని సరళత్వాన్ని, పరిస్థితులకు తగ్గట్లుగా మారగలిగే సామర్థ్యాలను ఇది అందించగలదు. డైనమిక్‌గా ఉండే నిధుల కేటాయింపు మోడల్ దన్నుతో ఒకవైపు రిస్కులను జాగ్రత్తగా ఎదుర్కొంటూనే మరోవైపు అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఈ ఫండ్ పనిచేస్తుంది. ఇలా రిస్కులు మరియు రాబడుల మధ్య సమతౌల్యతను పాటించగలిగే సామర్థ్యాల కారణంగా, వివిధ మార్కెట్ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన రాబడులను కోరుకునే వారికి ఈ ఫండ్ ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉండగలదని ఆశిస్తున్నాం” అని యూటీఐ ఏఎంసీ హెడ్ (ప్యాసివ్, ఆర్బిట్రేజ్ & క్వాంట్ స్ట్రాటెజీస్) శర్వన్ కుమార్ గోయల్ (Sharwan Kumar Goyal) తెలిపారు.ప్రధాన అంశాలు•ఎన్ఎఫ్వో వ్యవధి: 2025 జనవరి 2 నుంచి 2025 జనవరి 16 వరకు•పెట్టుబడి లక్ష్యం: క్వాంటిటేటివ్ పెట్టుబడి థీమ్‌ను అనుసరించడం ద్వారా ఈక్విటీ మరియు సంబంధిత సాధనాలలో పెట్టుబడి పెట్టి, దీర్ఘకాలిక మూలధన వృద్ధి ప్రయోజనాలను అందించడం. అయితే, స్కీము యొక్క లక్ష్యాలు నెరవేరతాయనే కచ్చితమైన హామీ ఉండదు.•బెంచ్‌మార్క్: BSE 200 TRI•కనిష్ట పెట్టుబడి: కనిష్ట పెట్టుబడి రూ.1,000.•పథకాలు: రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి, రెండింటిలో కూడా గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది.•లోడ్ స్వరూపం: సెబీ నిబంధనల ప్రకారం ఎంట్రీ లోడ్ లేదు. అయితే, అలాట్మెంట్ తేదీ నుంచి 90 రోజుల్లోపుగా రిడీమ్/స్విచ్ అవుట్ చేస్తే 1% ఎగ్జిట్ లోడ్ వర్తిస్తుంది, ఆ తర్వాత ఉండదు. -
నెలకు రూ. 7వేలతో.. ₹32 లక్షలు: ఎలా అంటే?
తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు రావాలంటే.. 'మ్యూచువల్ ఫండ్స్' (Mutual Funds) ఉత్తమ ఎంపిక. ఇప్పటికే రోజుకు 50 రూపాయల పెట్టుబడితే.. కోటి రూపాయలు ఎలా సంపాదించాలి? నెలకు రూ. 10వేలు పెట్టుబడిగా పెడుతూ.. రూ.7 కోట్లు ఎలా పొందాలి? అనే విషయాలను తెలుసుకున్నాం. ఈ కథనంలో నెలకు రూ.7,000 పెట్టుబడి పెడితే.. రూ.32 లక్షలు ఎలా వస్తాయి? దీని కోసం ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలి అనే విషయాలు తెలుసుకుందాం.రూ.7వేలుతో.. 32 లక్షల రూపాయలునెలకు రూ.7000 చొప్పున 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. మీ ఇన్వెస్ట్మెంట్ (Investment) రూ. 12,60,000 అవుతుంది. దీనికి 11 శాతం రాబడిని ఆశిస్తే.. రిటర్న్స్ రూ. 19,52,003 వస్తాయి. పెట్టుబడి, రిటర్న్స్ కలిపితే 15 ఏళ్లలో మీకు వచ్చే మొత్తం రూ. 32,12,003.మీరు ఎక్కువ లాభాలను పొందాలంటే.. తప్పకుండా దీర్ఘకాలిక పెట్టుబడులు (Long Term Investment) పెట్టడానికి ప్లాన్స్ వేసుకోవాలి. అంతే కాకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎంత తొందరగా ప్రారంభిస్తే.. మీకు లాభాలు కూడా అంత వేగంగానే వస్తాయి. ఉదాహరణకు, మీరు 20 ఏళ్ల వయసులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే.. 35 సంవత్సరాలకు రూ.32 లక్షలు వస్తాయి.పెట్టుబడులు ఆలస్యం చేస్తే.. లాభాలను పొందటానికి కొంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించాలి.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటిగమనిక: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత డబ్బు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వచ్చే డబ్బు రాబడుల మీద ఆధారపడి ఉంటుంది. -
మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడం ఎలా?
దీర్ఘకాలంలో మంచి రాబడులిచ్చే మ్యూచువల్ పండ్ను ఎంచుకునే ముందు చాలామంది సాధారణంగా ఓ తప్పు చేస్తూంటారు. కేవలం గత పనితీరుపైనే ఆధారపడి ఫండ్‌ను సెలక్ట్ చేసుకుంటారు. అయితే అన్నివేళలా అలాంటి పనితీరు కనిపించకపోవచ్చు. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ 100 శాతం రాబడులు ఇచ్చిదంటే అంతకంటే ముందుగానే ఆ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అది విలువ సమకూర్చినట్టు అవుతుంది. కొత్తగా అదే పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి గత పనితీరు కేవలం ఒక సూచికే అవుతుంది. అంతేకానీ భవిష్యత్ రాబడులకు హామీ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గత పనితీరు అన్నది మార్కెట్ల ఎత్తు, పల్లాల్లో ఎలా పనిచేసిందో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది.కొన్ని ఫండ్స్ నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కొన్ని వేగంగా కోలుకుంటాయి. దీనికి అంతర్గతంగా అవి ఎంచుకున్న కంపెనీలే కారణం. కాబట్టి ఒక ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు.. పోటీ పథకాలతో పోల్చి చూస్తే పనితీరు ఎలా ఉందన్నది విశ్లేషించాలి. అదే విభాగం సగటు పనితీరు, ఆ విభాగంలోని పోటీ పథకాలతో పోల్చితే మధ్య, దీర్ఘకాలంలో రాబడులు ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలి.స్వల్పకాల రాబడులు అంత ఉపయోకరం కాదు. నిర్ణీత కాలంలో పథకంలో రాబడులు స్థిరంగా ఉన్నాయా? అని కూడా చూడాలి. బుల్ మార్కెట్లలో నిదానంగా ర్యాలీ అయి, మార్కెట్ కరెక్షన్లలో తక్కువ నష్టాలకు పరిమితం చేసే విధంగా పథకం సామర్థ్యాలు ఉండాలి. అలాంటప్పుడు ఆ పథకం రాబడుల పరంగా నిరాశ మిగల్చదు. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు (పనితీరు) కూడా పరిశీలించాలి.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..పథకం పనితీరు ఫండ్ మేనేజర్ ప్రతిభ వల్లే అయితే, సదరు ఫండ్ మేనేజర్ రాజీనామా చేసి వెళ్లిపోతే అది ప్రతికూలంగా మారొచ్చు. అంతేకాదు ఇన్వెస్టర్ వ్యవహార శైలి కూడా దీర్ఘకాల రాబడులను ప్రభావితం చేస్తుంది. మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా, పెట్టుబడుల విధానానికి కట్టుబడి ఉండాలి. మార్కెట్ పతనాల్లోనూ క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. -
పెట్టుబడులకు మరోమార్గం... మ్యూచువల్ ఫండ్స్
విత్తనాలు నాటితే మొక్కలు వస్తాయి. చెట్లుగా.. ఆపై వృక్షాలుగా ఎదుగుతాయి. పూలు, పళ్ళు ఇస్తాయి. ఇదంతా ఒక్క రోజులో జరిగిపోదు.డబ్బులకూ అదే సూత్రం వర్తిస్తుంది. డబ్బులు నాటితే డబ్బులు మొలకెత్తుతాయి. ఆపై అవి లక్షలు, కోట్లుగా రూపాంతరం చెందుతాయి. ఇది కూడా ఒక్ కరోజులో జరిగే పని కాదు. మన కష్టార్జితాన్ని ఇంతలింతలు చేసుకోవడానికి ఎలాంటి సాధనాలు ఎంచుకోవాలి అన్నదే ప్రధాన ప్రశ్న.మీరు అధ్యయనం చేసి... నిపుణుల సలహా తీసుకుని..తెలివి తేటలతో వ్యవహరించి పెట్టుబడులు పెట్టగలిగితే.. దీర్ఘకాలంలో మంచి రాబడి పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా మన సొమ్ములు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే సాధనాలు ఏవో తెలిసి ఉండాలి. దాని కంటే ముందే మీదగ్గరున్న డబ్బుల నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారో కూడా మీకు తెలిసి ఉండాలి. లేదంటే ఏళ్ళుగడిచినా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరి మీ జీవితం ఎదుగూ బొదుగూ ఉండదు.తాము చేసే పొదుపు బాగా పెరగాలని, రెట్టింపు అవ్వాలని ఎవరు అనుకోరు చెప్పండి. మీరూ ఇందుకు మినహాయింపు కాదంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... కాస్త రిస్క్ తీసుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉండటం. కొద్దిగా రిస్క్ తీసుకోగలిగి... దీర్ఘకాలంపాటు వేచిఉండేవాళ్ళకు అనువైన పెట్టుబడి సాధనంగా మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు.స్టాక్ మార్కెట్లో 100% రిస్క్ తీసుకోలేనివాళ్లకు ఉపయుక్తమైన పెట్టుబడి మార్గం మ్యూచువల్ ఫండ్స్. మనం ఈ ఫండ్స్‌లో సరైన వాటిని ఎంచుకుని పెట్టుబడి పెడితే కొన్నాళ్ళకు అవి మంచి రాబడి అందిస్తాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి.1. సిప్స్2. పెద్దమొత్తంలో ఒకేసారి పెట్టుబడిమీరు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీను ఎంచుకుని నెలకు కొంత మొత్తం చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. ఇదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). అధిక మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టలేని వాళ్లకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మీచేతిలో తగినంత మొత్తం ఉండి పెద్దమొత్తంలో పెట్టి దీర్ఘకాలం వేచి ఉంటే మంచి రాబడి పొందడం రెండో మార్గం.ఎలాంటి ఫండ్స్ ఎంచుకోవాలి?మ్యూచువల్ ఫండ్స్‌ను వివిధ టాటా, బిర్లా, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి ప్రముఖ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే మనపెట్టుబడికి తగ్గట్టు, స్థిరంగా రాబడి అందివ్వగల ఫండ్స్‌ను ఎంచుకోవాలి. యాంఫి (AMFI) వెబ్సైటులో ఫండ్స్ కు సంబంధించిన యావత సమాచారం దొరుకుతుంది.ప్రస్తుతం దేశంలో వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందిస్తున్న స్కీంల్లో ప్రధానమైనవాటిగా ఈకింది వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. » ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్» ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ & మిడ్ క్యాప్ ఫండ్» టాటా ఈక్విటీ పీఈ ఫండ్» హెచ్డీఎఫ్సీ మంత్లీ ఇన్కమ్ ప్లాన్» ఎల్&టీ టాక్స్ అడ్వాంటేజ్ ఫండ్» ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్» కోటక్ కార్పొరేట్ బాండ్ ఫండ్» కెనరా రోబెకో గిల్టీ పీజీఎస్» డీఎస్పీ బ్లాక్‌రాక్ బ్యాలెన్స్డ్ ఫండ్» యాక్సిస్ లిక్విడ్ ఫండ్వీటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలించి ఎంతెంత రాబడి అందిస్తున్నాయి, రిస్క్ ఏ స్థాయిలో ఉంటుంది, పెట్టుబడి ఎలా పెట్టాలి, కాలావధి, వివిధ రేటింగ్ సంస్థలు ఇచ్చిన రేటింగ్, గతకాలపు పనితీరు.... ఇత్యాది అంశాలు సంపూర్ణంగా విశ్లేషించుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.ఇక అధిక రిస్క్‌తోపాటు అధికరాబడి ఇస్తున్న ఫండ్స్ విషయానికొస్తే... » హెచ్ఎస్బీసీ మిడ్ క్యాప్ ఫండ్» కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్» ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్» యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్» ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్» మిరే అసెట్ మిడ్ క్యాప్ ఫండ్» టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్‌పై వాటిని ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు, ఇక మహీంద్రా మేన్యూ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్, సుందరం మిడ్ క్యాప్ ఫండ్ లు 30 శాతంపైగా వార్షిక రిటర్న్ లు అందిస్తున్నాయి. సిప్ పెట్టుబడుల విషయానికొస్తే... గత అయిదేళ్లుగా ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 30 శాతంపైగా రాబడి ఇస్తోంది.మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి?మ్యూచువల్ ఫండ్స్ మీ దగ్గర సమీకరించిన సొమ్ముల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాచేయడానికి ముందే మీ రిస్క్ కెపాసిటీ, మీ ఆలోచనలు, రాబడి అంచనాలు... వంటి సమాచారాన్ని మీ దగ్గర నుంచి సేకరిస్తాయి. తదనుగుణంగా మీ సొమ్ముల్ని వివిధ పెట్టుబడి మార్గాల్లోకి మళ్లిస్తాయి.» సెక్టోరియల్ ఫండ్స్» టాక్స్ సేవింగ్ ఫండ్స్» ఇండెక్స్ ఫండ్స్» డెట్ ఫండ్స్» స్మాల్ క్యాప్ ఫండ్స్» మిడ్ క్యాప్ ఫండ్స్» లార్జ్ క్యాప్ ఫండ్స్ఇలా భిన్నమైన మార్గాల్లో మీ సొమ్ములను ఇన్వెస్ట్ చేస్తాయి. తద్వారా వచ్చే రాబడిని మీకు బదిలీ చేస్తాయి (ట్యాక్స్‌లు, కమీషన్లు, చార్జీలు వసూలు చేసుకుని).స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ తక్కువే ఉంటుంది. కానీ రాబడి కూడా అదేస్థాయిలో ఉంటుంది. కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఫండ్ స్కీంలకు సంబంధించిన సమాచారాన్ని మదింపు చేసిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది. వివిధ ఫండ్లకు సంబంధించి విశ్లేషణాత్మక సమాచారాన్ని రాబోయే రోజుల్లో తెలుసుకుందాం.-బెహరా శ్రీనివాసరావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
ఈక్విటీ ఫండ్స్ సానుకూలమా..?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు నవంబర్ నెలలో రూ.35,943 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అక్టోబర్ నెల పెట్టుబడులతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గాయి. అయినప్పటికీ వరుసగా 45వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లో సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నవంబర్ నెల గణాంకాలను విడుదల చేసింది.స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఎన్నికలు తదితర పరిణామాలతో ఈక్విటీ మార్కెట్లు గత రెండు నెలల కాలంలో ఎన్నో అస్థిరతలు ఎదుర్కోవడం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించి ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ సీబీవో అఖిల్ చతుర్వేది తెలిపారు. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నవంబర్‌లో నికరంగా రూ.60,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో పెట్టుబడుల రాక రూ.2.4 లక్షల కోట్లతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గడం గమనార్హం. ప్రధానంగా డెట్ ఫండ్స్ అక్టోబర్‌లో రూ.1.57 లక్షల కోట్లను ఆకర్షించగా, నవంబర్‌లో ఇవి కేవలం రూ.12,915 కోట్లకు పరిమితమయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) అక్టోబర్ చివరికి ఉన్న రూ.67.25 లక్షల కోట్ల నుంచి నవంబర్ చివరికి రూ.68.08 లక్షల కోట్లకు పెరిగింది. లక్ష్యాలకు కట్టుబాటు..నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.25,000 కోట్లకు పైనే ఉండడం అన్నది దీర్ఘకాల లక్ష్యాలు, ప్రణాళిక పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న అంకిత భావానికి నిదర్శనమని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. సిప్ పెట్టుబడులను స్థిరంగా ఉండడం దీర్ఘకాలంలో ఫండ్స్ విలువను సమకూర్చుతాయన్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. విభాగాల వారీగా..లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,548 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో వచ్చిన రూ.3,452 కోట్లతో పోల్చితే 26 శాతం తగ్గాయి. సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.7,658 కోట్లను రాబట్టాయి. అక్టోబర్‌లో ఇవే పథకాల్లోకి రూ.12,279 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.13,255 కోట్ల చొప్పున రావడం గమనార్హం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,084 కోట్లు వచ్చాయి. ఇక స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల దూకుడు కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ నెలతో పోల్చితే నవంబర్‌లో స్మాల్ క్యాప్ ఫండ్స్ 9 శాతం అధికంగా రూ.4,112 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ 4.3 శాతం అధికంగా రూ.4,883 కోట్ల చొప్పున ఆకర్షించాయి. రిస్క్ ఉన్నా కానీ ఇన్వెస్టర్లు అధిక రాబడులు కోరుకుంటున్నారనే దానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తాయి.లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.4,680 కోట్లు, వ్యాల్యూ ఫండ్స్ రూ.2,088 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.430 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ రూ.619 కోట్ల చొప్పున ఆకర్షించాయి. 18 కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) నవంబర్ లో మార్కెట్లోకి వచ్చి రూ.4,052 కోట్లను సమీకరించాయి. అక్టోబర్‌లో 29ఎన్‌ఎఫ్‌వోలు రూ.6,078 కోట్లు సమీకరించడం గమనార్హం. డెట్ విభాగంలో 16 విభాగాలకు గాను 9 విభాగాల్లోకి పెట్టుబడులు రాగా, మిగిలినవి పెట్టుబడులు కోల్పోయాయి. ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి రూ.2,109 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.2,962 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ రూ.4,374 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.2,426 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.2,138 కోట్ల చొప్పున వచ్చాయి.డెట్‌లో లిక్విడ్ ఫండ్స్ రూ.1,779 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.454 కోట్లు, మీడియం డ్యురేషన్ ఫండ్స్ రూ.201 కోట్ల చొప్పున కోల్పోయాయి. ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలుసిప్ పెట్టుబడులు ఫ్లాట్సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నవంబర్‌లో ఈక్విటీ పథకాల్లోకి రూ.25,320 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్ సిప్ పెట్టుబడులు రూ.25,323 కోట్లతో పోల్చి చూస్తే ఫ్లాట్‌గా నమోదయ్యాయి. కొత్తగా 49.46 లక్షల సిప్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అక్టోబర్‌లో ఇవి 63.70 లక్షలుగా ఉన్నాయి. మొత్తం సిప్ ఖాతాలు 10.12 కోట్ల నుంచి 10.23 కోట్లకు పెరిగాయి. -
15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం!
డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులవ్వాలని అందరికీ ఉంటుంది. అయితే ఆలోచన ఒక్కటి ఉంటే సరిపోదు, ఆచరణ కూడా అవసరం. ఈ కథనంలో 15 సంవత్సరాల్లో కోటీశ్వరులు ఎలా అవ్వాలో అనే విషయాన్ని.. 15X15X15 ఫార్ములా ద్వారా తెలుసుకుందాం.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే.. దానికి అత్యుత్తమ మార్గం ఇన్వెస్టిమెంట్ అనే చెప్పాలి. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి.ఇక 15X15X15 ఫార్ములా విషయానికి వస్తే, 15 సంవత్సరాల్లో నెలకు రూ. 15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు అవుతుందనేదే.. ఈ ఫార్ములా సందేశం. అంటే మీరు 15 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు 15,000 ఇన్వెస్ట్ చేసి 15 శాతం వార్షిక రిటర్న్స్ ఆశించాలి. ● పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 15,000 ● వ్యవధి: 15 సంవత్సరాలు ● వడ్డీ రేటు: 15 శాతంపైన చెప్పిన దాని ప్రకారం నెలకు 15,000 రూపాయలు పెట్టుబడి పెడితే.. 15 సంవత్సరాలకు అసలు రూ. 27 లక్షలు అవుతాయి. వడ్డీ రేటు 15 శాతం (రూ. 73 లక్షలు), కాబట్టి ఇలా మీరు కోటి రూపాయలు సంపాదించవచ్చు.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!15X15X15 ఫార్ములా ద్వారా కోటీశ్వరులవ్వాలంటే.. త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. మీరు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. 40 ఏళ్లకే మీకు కోటి రూపాయలు వస్తాయి. 30 ఏళ్లకు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే 45 సంవత్సరాలకు మీ చేతికి డబ్బులు వస్తాయి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే.. మీరు ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, అంత త్వరగా కోటీశ్వరులు అవ్వొచ్చన్నమాట. -
కొత్త ఫండ్స్ గురూ.. రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, కొత్తగా యాక్సిస్ క్రిసిల్–ఐబీఎక్స్ ఎఎఎ బాండ్ ఎన్బీఎఫ్సీ–హెచ్ఎఫ్సీ–జూన్ 2027 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది క్రిసిల్– ఐబీఎక్స్ ఎఎఎ ఎన్బీఎఫ్సీ–హెచ్ఎఫ్సీ ఇండెక్స్–జూన్ 2027లోని సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే ఓపెన్–ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. ఈ స్కీములో ఒక మోస్తరు వడ్డీ రేటు రిస్కు, మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కు ఉంటాయి. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. డిసెంబర్ 10 వరకు ఇది అందుబాటులో ఉంటుంది.శామ్కో మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ శామ్కో అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. కొత్తగా శామ్కో మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ప్రారంభించింది. ఈ నెల 4న ప్రారంభమైన న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో), ఈ నెల 18 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈక్విటీలు, బంగారం, డెట్, ఆర్బిట్రేజ్ సాధనాల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఆయా విభాగాల్లో ఆకర్షణీయమైన అవకాశాలకు అనుగుణంగా కేటాయింపుల్లోనూ మార్పులు, చేర్పులు చేస్తుంటుంది.ఈక్విటీలు ర్యాలీ చేసే సమయంలో వాటికి కేటాయింపులు పెంచడం, ఈక్విటీలు అధిక వ్యాల్యూషన్లకు చేరి నిదానించిన సమయంలో బంగారంలోకి పెట్టుబడులు తరలించడం తదితర వ్యూహాలను అనుసరిస్తుంది. తద్వారా రిస్క్‌ను అధిగమించి, మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా పనిచేస్తుంది. ఈక్విటీలకు 20–80 శాతం మధ్య, డెట్‌కు 10–70 శాతం మధ్య, బంగారం, సిల్వర్ ఈటీఎఫ్‌లకు 10–70 శాతం మధ్య అవకాశాలకు అనుగుణంగా కేటాయింపులు చేస్తుంది. 30 శాతం వరకు కమోడిటీ డెరివేటివ్‌లు, 10 శాతం వరకు రీట్లు, ఇన్విట్లలోనూ పెట్టుబడులు పెడుతుంది. ఎన్ఎఫ్వోలో భాగంగా ఒకరు కనీసం రూ.5,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఇన్వెస్కో ఇండియా మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ ఈక్విటీ, డెట్, గోల్డ్ ఈటీఎఫ్‌లు/సిల్వర్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్కో ఇండియా మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ఇన్వెస్కో మ్యుచువల్ ఫండ్ ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ విధానంలో రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీలు, డెట్ సాధనాల్లో 10–80 శాతం వరకు, గోల్డ్ ఈటీఎఫ్‌లు/సిల్వర్ ఈటీఎఫ్‌లలో 10–50 శాతం వరకు ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. అలాగే అవకాశాన్ని బట్టి విదేశీ సెక్యూరిటీస్‌లో 35 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. -
మ్యూచువల్ ఫండ్ ఎంపిక ఎలా?
ఒక మ్యూచువల్ ఫండ్‌ను దీర్ఘకాలానికి ఎంపిక చేసుకునే సమయంలో గత పనితీరుపై ఆధారపకుండా.. చూడాల్సిన ఇతర అంశాలు ఏవి? – వినుత్ రాయ్ కేవలం గత పనితీరుపైనే ఆధారపడడం తప్పుదోవలో పయనించడమే అవుతుంది. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ 100 శాతం రాబడులు ఇచి్చందంటే, అంతకంటే ముందుగానే ఆ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అది విలువ సమకూర్చినట్టు అవుతుంది. కొత్తగా అదే పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి గత పనితీరు కేవలం ఒక సూచికే అవుతుంది. అంతేకానీ భవిష్యత్ రాబడులకు హామీ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గత పనితీరు అన్నది మార్కెట్ల ఎత్తు, పల్లాల్లో ఎలా పనిచేసిందో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది.కొన్ని ఫండ్స్ నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కొన్ని వేగంగా కోలుకుంటాయి. దీనికి కారణం అంతర్గతంగా అవి పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న కంపెనీలే. కనుక ఒక ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు.. పోటీ పథకాలతో పోల్చి చూస్తే పనితీరు ఎలా ఉందన్నది విశ్లేషించాలి. అదే విభాగం సగటు పనితీరు, ఆ విభాగంలోని పోటీ పథకాలతో పోల్చితే మధ్య, దీర్ఘకాలంలో రాబడులు ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలి.స్వల్పకాల రాబడులు అంత ఉపయోకరం కాదు. నిర్ణీత కాలంలో పథకంలో రాబడులు స్థిరంగా ఉన్నాయా? అని కూడా చూడాలి. బుల్ మార్కెట్లలో నిదానంగా ర్యాలీ చేసి, మార్కెట్ కరెక్షన్లలో తక్కువ నష్టాలకు పరిమితం చేసే విధంగా పథకం సామర్థ్యాలు ఉండాలి. అలాంటప్పుడు ఆ పథకం రాబడుల పరంగా నిరాశ మిగల్చదు. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు (పనితీరు) కూడా పరిశీలించాలి.పథకం పనితీరు ఫండ్ మేనేజర్ ప్రతిభ వల్లే అయితే, సదరు ఫండ్ మేనేజర్ రాజీనామా చేసి వెళ్లిపోతే అది ప్రతికూలంగా మారొచ్చు. అంతేకాదు ఇన్వెస్టర్ వ్యవహార శైలి కూడా దీర్ఘకాల రాబడులను ప్రభావితం చేస్తుంది. మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా, పెట్టుబడుల విధానానికి కట్టుబడి ఉండాలి. మార్కెట్ ఉత్థాన పతనాల్లోనూ క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. గృహ రుణం, కారు రుణం, క్రెడిట్ కార్డు రుణాలున్నాయి. వీటి కోసం ప్రతి నెలా రూ.40,000 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ రుణాలను తీర్చివేసే మార్గాన్ని చూపగలరు? – ప్రేమ్ నాయక్ రుణాలు భవిష్యత్ ఆదాయాన్ని హరించివేస్తాయి. కనుక వీలైనంత వెంటనే వాటిని వదిలించుకోవాలి. ముఖ్యంగా వీటిల్లో ఆర్థిక భారంగా మారిన రుణాన్ని మొదట తీర్చివేయాలి. ముందుగా క్రెడిట్ కార్డు రుణంతో మొదలు పెట్టండి. అధిక వడ్డీ రేటుతో ఖరీదైన రుణం ఇది. అవసరమైతే మీ పెట్టుబడుల్లో కొన్నింటిని ఉపసంహరించుకుని క్రెడిట్‌కార్డు రుణం తీర్చివేయాలి. లేదంటే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అయినా దీన్నుంచి బయటపడే మార్గాన్ని చూడండి. క్రెడిట్ కార్డ్ రుణం చెల్లించిన అనంతరం కారు రుణాన్ని తీర్చివేయడంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వాహనాల విలువ స్వల్పకాలంలోనే తగ్గిపోతుంది. కనుక వీలైనంత ముందుగా ఈ రుణాన్ని కూడా తీర్చివేయాలి. గృహ రుణాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో విలువ పెరిగే ఆస్తి ఇది. పైగా గృహ రుణాలపై అన్నింటికంటే తక్కువ వడ్డీ రేటుతోపాటు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. -
పిల్లల బీమా.. ఇవ్వదు ధీమా..!
తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల్లో పిల్లల విద్య ఒకటి. విద్యా వ్యయాలు ఏటేటా 10 శాతానికి మించి పెరుగుతున్నాయి. సాధారణ ద్రవ్యోల్బణం 5.5 శాతంతో పోల్చితే రెట్టింపు స్థాయి ద్రవ్యోల్బణం విద్యారంగంలో చూడొచ్చు. దీని కారణంగా నేడు ఒక కోర్స్‌కు రూ. 25 లక్షలు ఖర్చవుతుంటే.. 13 ఏళ్ల తర్వాత (ఉన్నత విద్యకు వచ్చే సరికి) రూ.1.09 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ముందస్తు ప్రణాళికతోనే ఈ వ్యయాలను అధిగమించడం సులభమవుతుంది.పాఠశాల ప్రవేశం నాటి నుంచే పిల్లల విద్య కోసం పెట్టుబడులు ప్రారంభించాలి. భవిష్యత్‌లో ఎంత అవసరమో, ఆ మేరకు సమకూర్చుకునే విధంగా ప్రతి నెలా పొదుపు, మదుపు చేస్తూ వెళ్లాలి. ఇందుకు ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలకంగా మారతాయి. ఇక్కడ తప్పటడుగులు వేస్తే పిల్లల ఉన్నత విద్య కోసం రేపు అప్పు చేయాల్సి రావచ్చు. కేవలం చైల్ట్ ఇన్సూరెన్స్ పాలసీలతో విద్యా వ్యయాలను తట్టుకోవడం కష్టమే. ఈ దిశగా అవగాహన కల్పించే కథనమిది... తల్లిదండ్రుల్లో ఎంత మంది తమ పిల్లల భవిష్యత్ విద్యకు సన్నద్ధంగా ఉన్నారు? ఇదే తెలుసుకుందామని హెచ్ఎస్బీసీ సంస్థ ఓ సర్వే చేసింది. ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్ రిపోర్ట్ 2024’ పేరుతో నివేదిక విడుదల చేసింది. 53 శాతం తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం పెట్టుబడులు చేస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే తమ పిల్లలే విద్యా రుణం తీసుకుంటారని 40 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. కొందరు ఆస్తులు అమ్మి చదివిస్తామని చెప్పగా, స్కాలర్íÙప్ మార్గాలు చూస్తామని కొంతమంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కానీ, పిల్లల పేరిట పెట్టుబడులు చేస్తున్న వారిలో ఎంత మంది మెరుగైన సాధనాలను ఎంపిక చేసుకున్నారన్నది ఈ సర్వే తేల్చలేదు. మొత్తానికి సగం మందికి ఆర్థిక ప్రణాళిక లేదని స్పష్టమవుతోంది. తల్లిదండ్రులకు ఏదైనా జరగరానిది జరిగితే... పిల్లల విద్యకు ఆరి్థక తోడ్పాటు అందించే చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు మార్కెట్లో క్రేజ్ ఉంది. బీమా ఏజెంట్లు వీటిని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. నిజానికి వీటిలో చార్జీలు ఎక్కువ. దాంతో రాబడులు కొంత తక్కువ. పిల్లల పేరిట మార్కెటింగ్ చేసే ఉత్పత్తుల వలలో పడకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా బీమా, పెట్టుబడులను కలపడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఈ రెండింటినీ వేర్వేరుగానే చూడాలి.చైల్డ్ ప్లాన్లలో ఏముంది?పిల్లల పేరిట రెండు రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. యూనిట్ లింక్డ్ చి్రల్డన్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్‌లు) ఇందులో ఒక రకం. చెల్లించిన ప్రీమియంలో బీమా రిస్క్, నిర్వహణ, ఇతరత్రా వ్యయాలు పోను మిగిలిన మొత్తాన్ని మార్కెట్ లింక్డ్ (ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత) సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పాలసీదారుల ఎంపిక మేరకు డెట్‌లోనూ పెట్టుబడులు పెడతాయి. వచ్చిన రాబడులను పాలసీదారులకు అందిస్తాయి. ఎండోమెంట్ చిల్డ్రన్ ఇన్సూరెన్స్ రెండో రకం. ఇందులోనూ బీమా రిస్క్, ఇతర వ్యయాలు పోను మిగిలిన ప్రీమియాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి.పాలసీదారులకు హామీ మేరకు రాబడులు అందిస్తాయి. కానీ, వీటిలో రాబడులు 5–6 శాతం మించవు. ఈక్విటీ ఆధారిత యులిప్ ప్లాన్లలో రాబడులు కాస్త అధికంగా ఉంటాయి. కాకపోతే గ్యారంటీడ్ కావు. మార్కెట్ పనితీరుపైనే రాబడులు ఆధారపడి ఉంటాయి. ఈ రెండు రకాల ప్లాన్లలోనూ, పాలసీ కాల వ్యవధి ముగియక ముందే పాలసీదారు (తల్లి లేదా తండ్రి) మరణించినా లేక కాల వ్యవధి ముగిసేవరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీ కాల వ్యవధి మధ్యలో పాలసీదారు మరణించినట్టయితే, అప్పుడు బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి పెట్టుబడులను కొనసాగించి, యథాప్రకారం పాలసీ ప్రయోజనాలను అందిస్తుంది. దాంతో పిల్లల ఉన్నత విద్యకు ఆ నిధిని ఉపయోగించుకోవచ్చు. ‘‘దురదృష్టవశాత్తూ తల్లి లేదా తండ్రి మరణించినట్టయితే పరిహారం చెల్లించే ఈ పథకాలు పిల్లలకు ఉపయోగపడతాయి. ప్రీమియం వేవర్ ముఖ్యమైన సదుపాయం. పాలసీదారు మరణించినట్టయితే ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు. పాలసీ యాక్టివ్‌గా కొనసాగుతుంది. పిల్లల విద్యా లక్ష్యాలకు కావాల్సినంత మేర సమకూరుతుంది’’ అని ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ యాక్చువరీ ఆదిత్య మాల్ వివరించారు. పాలసీదారు మరణించినప్పటికీ గడువు తీరిన తర్వాత సమ్ అష్యూర్డ్, ఇతర ప్రయోజనాలు యథావిధిగా అందుతాయని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మధుపం కృష్ట సైతం తెలిపారు. సమ్ అష్యూర్డ్ (బీమా) వెంటనే చెల్లించి, మిగిలిన ప్రయోజనాలను పాలసీ గడువు ముగిసిన తర్వాత చెల్లించేవి ఉన్నాయి.లాకిన్ పిరియడ్... ఎండోమెంట్, యులిప్ ప్లాన్లు లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. సాధారణంగా ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే మొదటి ఐదేళ్లు ఉపసంహరణకు అనుమతి ఉండదు. ఈ కాలంలో పాలసీని సరెండర్ చేసినా వచ్చేదేమీ ఉండదు. లాకిన్ పీరియడ్ తర్వాత పాక్షికంగా ఉపసహరించుకోవచ్చు. నిర్బంధంగా పెట్టుబడిని కొనసాగించే లక్ష్యంతోనే ఈ ప్లాన్లలో లాకిన్ ఉంటుంది. వీటిలో ఏజెంట్లకు కమీషన్ మెరుగ్గా ఉంటుంది. ఎంత అధిక ప్రీమియానికి పాలసీలో చేరి్పస్తే ఏజెంట్‌కు అంత అధికంగా కమిషన్ ముడుతుంది. ‘‘టర్మ్ ప్లాన్లు, మ్యూచువల్ ఫండ్స్ గురించి సరైన అవగాహన లేకపోవడమే పెద్ద సమస్య. టర్మ్ ప్లాన్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కనుక వీటిని ఏజెంట్లు విక్రయించేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు’’అని కృష్ణ వివరించారు.ఆరి్థక ప్రణాళికలో చేసే తప్పుల్లో బీమా, పెట్టుబడి కలపడం ఒకటని ఆనంద్‌రాఠి వెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిరాగ్ ముని తెలిపారు. ‘‘ఇన్సూరెన్స్, పెట్టుబడి పూర్తి భిన్నమైన ఆరి్థక ఉత్పత్తులు. ఇన్వెస్టర్లు వీటిని కలపకూడదు. ఊహించని నష్టం నుంచి రక్షణ కల్పించడమే బీమా ఉద్దేశం. పెట్టుబడి సాధనం ఉద్దేశం సంపద సమకూర్చుకోవడం’’ అని వివరించారు. ‘‘సంప్రదాయ ఎండోమెంట్ పాన్లలో రాబడులు 4–5 శాతం మేర ఉంటాయి. విద్యా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే సంప్రదాయ బీమా ప్లాన్లలో పెట్టుబడితో మిగిలేదేమీ ఉండదు.చైల్డ్ యులిప్ ప్లాన్లలో 9–11 శాతం మేర రాబడులు వస్తాయి. కాకపోతే ఆరి్థక సైకిల్, మార్కెట్ సైకిల్‌పైనే ఈ రాబడులు ఆధారపడి ఉంటాయి’’ అని కృష్ట తెలిపారు. కనుక సంప్రదాయ ఎండోమెంట్ ఆధారిత చైల్డ్ ప్లాన్లు పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇవ్వమని స్పష్టమవుతోంది. ఇక యులిప్ ప్లాన్ల కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఎంపిక అవుతుంది. వీటిల్లో లిక్విడిటీ మెరుగ్గా ఉంటుంది. చార్జీలు చాలా తక్కువ. యులిప్ ప్లాన్లలో చార్జీల విషయమై పారదర్శకత తక్కువ. ప్రీమియం అలోకేషన్ చార్జీ, అడ్మిని్రస్టేటివ్ చార్జీ, మోర్టాలిటీ చార్జీ, సరెండర్ చార్జీ, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీ ఇన్నేసి చార్జీలు యులిప్‌లలో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లోనూ పారదర్శకత ఎక్కువ.మెరుగైన ప్రత్యామ్నాయాలు..చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మెరుగైన ప్రయోజనాన్ని ఇవ్వనప్పుడు వీటికి ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ఊహించనది జరిగితే వారసుల విద్య ఆగిపోకూడదు. కుటుంబ జీవనం ఇబ్బందుల పాలు కాకూడదు. అందుకని జీవిత బీమాతోపాటు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఎంపిక చేసుకోవడం మంచి మార్గం అవుతుంది. ‘‘టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువ ప్రీమియానికే అధిక కవరేజీని ఇస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చైల్డ్ ప్లాన్ల కంటే మెరుగైన రాబడులు వస్తాయి.చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ తగినంత ఉండదు. అప్పుడే కుటుంబ జీవనంలోకి అడుగుపెట్టిన వారికి, తాజాగా రుణం తీసుకున్న వారికి మరింత కవరేజీ అవసరం ఏర్పడుతుంది’’ అని కృష్ట తెలిపారు. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోలే పథకాలను ఎంపిక చేసుకోవచ్చని ఫింజ్ స్కాలర్జ్ వెల్త్ మేనేజర్ ప్రిన్సిపల్ అడ్వైజర్ రేణు మహేశ్వరి సూచించారు. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రూ.కోటి టర్మ్ ఇన్సూరెన్స్ రూ.10–15 వేల ప్రీమియంకే వస్తుంది. కనుక చైల్డ్ ప్లాన్ల కోసం ఏటా భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించడానికి బదులు.. టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసు కోవాలి.విభిన్న ఫండ్స్...టర్మ్ప్లాన్లోనూ మరణం లేదా అంగవైకల్యం పాలైనప్పుడు చెల్లింపులు చేసే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సమ్ అష్యూర్డ్‌లో 50 శాతం మేర తక్షణమే చెల్లించి, మిగిలినది ప్రతి నెలా 10 ఏళ్ల పాటు చెల్లింపుల సదుపాయాలతో టర్మ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ఏటా 12 శాతం, అంతకంటే ఎక్కువే ఉన్నాయి. పదేళ్ల కాలంలో అయితే సగటు వార్షిక రాబడి 20 శాతంగా ఉంది. ఈక్విటీల్లోనూ ఇండెక్స్ ఫండ్స్ (సెన్సెక్స్, నిఫ్టీ, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్)ను ఎంపిక చేసుకోవాలి.ఇందులో చార్జీలు చాలా తక్కువ. సూచీల మాదిరే రాబడులు వీటిల్లో వస్తాయి. మరీ ముఖ్యంగా 7 ఏళ్లకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేస్తుంటే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్స్ పెట్టుబడులు పెట్టే ఫ్లెక్సీక్యాప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్, రిస్క్ తక్కువ కోరుకునే వారు మల్టీ అస్సెట్ ఫండ్స్, రిస్క్ ఇంకా తక్కువగా ఉండాలని కోరుకునే వారు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణుల సూచన. పన్ను ప్రయోజనంచైల్డ్ యులిప్ ప్లాన్లలో రాబడులపై పన్ను భారం లేకపోవడాన్ని సానుకూల అంశంగా చెప్పుకోవాలి. దీనికి బదులు టర్మ్‌ప్లాన్ విడిగా తీసుకుని, ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. ఈక్విటీ లాభాలపై స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను కదపకుండా, ఒక పథకం నుంచి మరో పథకానికి మార్చకుండా.. స్థిరంగా ఒకే పథకంలో కొనసాగించడం వల్ల అనవసర పన్ను భారాన్ని తప్పించుకోవచ్చు. అయినా సరే ఈక్విటీ పెట్టుబడిని ఉపసంహరించుకున్నప్పుడు అది ఏడాది మించిన కాలం అయితే మొదటి రూ.లక్షకు మించిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి.ఏడాదిలోపు పెట్టుబడులపై వచ్చే లాభం నుంచి 20 శాతం మేర పన్ను కింద చెల్లించాలి. నిపుణుల పెట్టుబడి ప్రణాళికను అనుసరించినట్టయితే అప్పుడు మెరుగైన జీవిత బీమా రక్షణ, ఈక్విటీలపై అద్భుత రాబడులు అందుకోవడానికి అవకాశాలుంటాయి. పన్ను చెల్లింపులు పోను నికర రాబడులు చైల్డ్ ప్లాన్లతో పోల్చితే.. అధికంగానే ఉంటాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ పన్ను ప్రయోజనం కోసమని యులిప్ పాలసీకే మొగ్గు చూపేట్టు అయితే విడిగా టర్మ్‌ప్లాన్ తీసుకోవడం మర్చిపోవద్దు. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
బిజినెస్ సైకిల్ ఫండ్స్ భేష్..
న్యూఢిల్లీ: పెట్టుబడుల ప్రపంచంలో బిజినెస్ సైకిల్ మ్యూచువల్ ఫండ్స్‌కి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. విస్తృత మార్కెట్‌తో పోలిస్తే ఇవి మెరుగ్గా రాబడులు అందిస్తుండటం ఇందుకు కారణం. గత ఏడాది వ్యవధిలో ఈ ఫండ్స్ 56 శాతం వరకు రాబడులు ఇచ్చినట్లు పరిశ్రమ గణాంకాల్లో వెల్లడైంది. వీటి ప్రకారం హెచ్ఎస్బీసీ, మహీంద్రా మాన్యులైఫ్, క్వాంట్ మొదలైన ఫండ్ హౌస్‌ల స్కీములు 50 శాతం పైగా రాబడులు అందించాయి. ఇదే వ్యవధిలో నిఫ్టీ 500 టీఆర్ఐ సూచీ 35.11 శాతం రాబడులు అందించింది. ఈ నేపథ్యంలో బిజినెస్ సైకిల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోందని ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలిపారు. నిర్దిష్ట ఆర్థిక, మార్కెట్ పరిస్థితుల్లో రాణించే రంగాలకు చెందిన స్టాక్స్‌ని గుర్తించి, ఇన్వెస్ట్ చేసేందుకు బిజినెస్ సైకిల్ ఫండ్స్ ప్రయతి్నస్తాయి. ఆర్థిక వ్యవస్థలో మాంద్యం, రికవరీ తొలినాళ్లు, వృద్ధి మధ్య దశ, చివరి దశ వంటి పరిస్థితులను బట్టి వివిధ రంగాల్లో పెట్టుబడులను మారుస్తుంటాయి. ఉదాహరణకు మాంద్యం దశలో యుటిలిటీస్, ఫార్మా వంటి డిఫెన్సివ్ రంగాలు మెరుగ్గా రాణించగలవు. అయితే వృద్ధి ప్రారంభమయ్యే తొలినాళ్లలో ఆటోమొబైల్స్, ఫైనాన్షియల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలకు చెందిన స్టాక్స్ లాభపడే అవకాశాలు ఉంటాయి. ఇలా వ్యూహాత్మకంగా వివిధ రంగాల్లో పెట్టుబడులను అటూ–ఇటూ మారుస్తుండటమనేది ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్వల్ప సమయంలో అధిక రాబడులు అందిస్తుండటంతో బిజినెస్ సైకిల్ ఫండ్స్‌పై ఆసక్తి పెరుగుతోందని ఎప్సిలాన్ గ్రూప్‌లో భాగమైన మల్టీ ఆర్క్ వెల్త్ ఏవీపీ సిద్ధార్థ్ ఆలోక్ తెలిపారు. పరిస్థితులను బట్టి వివిధ సెక్టోరల్ ఫండ్స్‌కి మారేందుకు, ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లను పట్టుకునేందుకు వ్యక్తిగతంగా పరిశోధిస్తూ, అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చునే భారాన్ని ఈ ఫండ్స్ తగ్గిస్తాయని విస్డమ్ ఎడ్జ్ ఇన్వెస్ట్మెంట్స్ వ్యవస్థాపకుడు భావేష్ దమానియా తెలిపారు. అయితే, సాధారణంగా థీమ్యాటిక్ ఫండ్స్ పనితీరును లెక్కగట్టేందుకు కనీసం అయిదేళ్ల పాటైనా కార్యకలాపాలు ఉండాలని, ఇవన్నీ ఈ మధ్యే వచ్చాయి కాబట్టి ఇటీవలి కాలంలో పనితీరుపైనే ఆధారపడటం సరికాకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.16 ఫండ్స్..ప్రస్తుతం దేశీయంగా 16 బిజినెస్ సైకిల్ ఫండ్స్ ఉండగా, 10 ఫండ్స్‌కి ఏడాది పైగా ట్రాక్ రికార్డు ఉంది. వీటిలో ఒక్కటి మినహా మిగతా అన్నీ కూడా గత 12 నెలల్లో నిఫ్టీ 500 టీఆర్ఐకి మించిన రాబడులు అందించాయి. పరిశ్రమ డేటా ప్రకారం 10 ఫండ్స్ సగటున 42 శాతం రాబడి అందించాయి. గత ఏడాది వ్యవధిలో అక్టోబర్ 17 వరకు.. హెచ్ఎస్బీసీ బిజినెస్ సైకిల్స్ ఫండ్ 56.3 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 56.17 శాతం, క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 50.8 శాతం రాబడులు అందించాయి.మరిన్ని విశేషాలు..అధిక రాబడులు అందించిన వాటిలో బరోడా బీఎన్పీ పారిబా బిజినెస్ సైకిల్ ఫండ్ (44.58 శాతం రాబడి), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ (42.27 శాతం), టాటా బిజినెస్ సైకిల్ ఫండ్ (41.26 శాతం), కోటక్ బిజినెస్ సైకిల్ ఫండ్ (40.03 శాతం), యాక్సిస్ బిజినెస్ సైకిల్ ఫండ్ (39.02 శాతం), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ (36.33 శాతం), హెచ్డీఎఫ్సీ బిజినెస్ సైకిల్ ఫండ్ (31.97 శాతం) ఉన్నాయి. →గత ఆరు నెలల వ్యవధిలో హెచ్ఎస్బీసీ బిజినెస్ సైకిల్స్ ఫండ్ 26.72 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 20.88 శాతం, క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 17.7 శాతం రిటర్న్‌లు ఇచ్చాయి. ఇదే వ్యవధిలో నిఫ్టీ 500 టీఆర్ఐ ఇండెక్స్ 15.2 శాతమే రాబడినిచి్చంది. మిగతా ఏడు ఫండ్స్ 13 శాతం నుంచి 23 శాతం వరకు రిటర్నులు ఇచ్చాయి. -
ఈక్విటీ రాబడులపై పన్ను సున్నా!
కొన్నేళ్ల క్రితం విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలు పెడితే మన ఈక్విటీలు బేల చూపు చూసేవి. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మిన మేర ఇనిస్టిట్యూషన్స్, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. మన దేశ ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం గతంతో పోలి్చతే గణనీయంగా పెరిగిందని చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. నేరుగా స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాతి నుంచి ఈక్విటీ మార్కెట్ మంచి బుల్ ర్యాలీ చేయడం.. ఎంతో మంది ఇన్వెస్టర్లు అటు వైపు అడుగులు వేసేలా చేసింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడుల (సిప్) ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. తమ భవిష్యత్ ఆరి్థక లక్ష్యాల్లో ఈక్విటీలకు చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈక్విటీ రాబడులపై పన్ను బాధ్యతను ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా అర్థం చేసుకోవాలి. 2024–25 బడ్జెట్లో ఈక్విటీ లాభాలపై స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును కేంద్ర సర్కారు పెంచేసింది. ఈ భారం సాధ్యమైన మేర తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్ల ముందు పలు మార్గాలున్నాయి. వాటి గురించి వివరించే కథనమే ఇది. ఆదాయపన్ను చట్టంలో ఇటీవలి మార్పుల అనంతరం స్వల్పకాల లాభాలపై 20 శాతం, దీర్ఘకాల లాభాలపై 12.5 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండకుండా విక్రయించిన స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్టీసీజీ) అవుతుంది. దీనిపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది పూర్తయిన అనంతరం విక్రయించినప్పుడు వచి్చన లాభం దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) కిందకు వస్తుంది. ఎల్టీసీజీ ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించకపోతే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం ఎల్టీసీజీ చెల్లించాల్సి ఉంటుంది. పన్ను తగ్గించుకునే మార్గాలు..ఈక్విటీల్లో స్వల్పకాల మూలధన లాభాలపై (ఎస్టీసీజీ) 20 శాతం పన్ను చెల్లించాల్సిందే. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి వెసులుబాట్లు లేవు. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే మూలధన లాభాలపై పన్ను భారం లేకుండా చూసుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మార్గాలున్నాయి. ముఖ్యంగా ఈక్విటీలు మూడేళ్లు అంతకుమించిన కాలానికే అనుకూలం. మూడేళ్లలోపు పెట్టుబడులకు ఈక్విటీలు సూచనీయం కాదు. ఎందుకంటే స్వల్పకాలంలో ఈక్విటీలు స్థూల ఆరి్థక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధాన నిర్ణయాలు తదితర ఎన్నో అంశాల ఆధారంగా అస్థిరతలకు లోనవుతూ ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలంలో ఈ అస్థిరతలను అధిగమించి స్టాక్స్ ర్యాలీ చేస్తుంటాయి. కనుక స్వల్పకాలంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు భరోసా ఉంటుంది. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు తమ మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసమే ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా అధిక రాబడులకు తోడు, ఆ మొత్తంపై పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి అవకాశాలుంటాయి.ట్యాక్స్ హార్వెస్టింగ్ఒక ఆరి్థక సంవత్సరంలో ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు కనుక, ఏటా తమ పెట్టుబడులపై ఈ మేరకు లాభాలను స్వీకరించడం ట్యాక్స్ హార్వెస్టింగ్ అవుతుంది. తిరిగి అంతే మొత్తాన్ని మళ్లీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు 2023 సెపె్టంబర్ 1న స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. 2024 సెపె్టంబర్ 1 నాటికి ఈ విలువ 12 శాతం రాబడి అంచనా ప్రకారం రూ.6,75,305 అవుతుంది. ఇందులో లాభం రూ.75,305. రూ.1.25లక్షల వరకు లాభం ఉన్నా పన్ను లేదు కనుక, ఈ మొత్తాన్ని విక్రయించి తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి పన్ను భారం పడదు. ఇలా ఏటా రూ.1.25లక్షల మేరకు దీర్ఘకాలిక మూలధన లాభాన్ని స్వీకరిస్తూ.. తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ఒక మార్గం. ఇల్లు కొనడం.. ఈక్విటీ దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేకుండా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ మార్గం చూపిస్తోంది. ఈ సెక్షన్ కింద గరిష్ట ప్రయోజనం రూ.10 కోట్లు. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన మొత్తం రూ.10 కోట్ల వరకు ఉంటే, దీనిపై భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు ఆ మొత్తంతో ఒక నివాస గృహం కొనుగోలు చేస్తే సరి. ఇలా చేయడం వల్ల ఎలాంటి పన్ను లేకుండా సెక్షన్ 54ఎఫ్ కింద పూర్తి ప్రయోజనం పొందొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలే (హెచ్‌యూఎఫ్) ఈ ప్రయోజనానికి అర్హులు. దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడులే అని కాదు, ప్లాట్, వాణిజ్య భవనం, బంగారం, ట్రేడ్ మార్క్‌లు, పేటెంట్లు, మెషినరీ సైతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తాయి. వీటిపైనా ఇదే ప్రయోజనం పొందొచ్చు. బాండ్లు సెక్షన్ 80ఈసీ కింద ఈక్విటీ దీర్ఘకాల మూలధన లాభాలను క్యాపిటల్ గెయిన్స్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఆర్ఈసీ, ఎన్హెచ్ఏఐ తదితర ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో పెట్టుబడులపై రాబడి 6 శాతం వరకు ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించిన తేదీ నుంచి ఆరు నెలలు దాటకుండా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తేనే ప్రయోజనం లభిస్తుంది. గరిష్టంగా రూ.50 లక్షల పెట్టుబడులకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన మొత్తం రూ.50 లక్షలకు మించి ఉంటే, అదనపు మొత్తంపై నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఐదేళ్లలోపు వాటిని విక్రయిస్తే.. గతంలో పొందిన పన్ను ప్రయోజనం కోల్పోతారు. అంటే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ బాండ్లపై ఐదేళ్లలోపు రుణం పొందినా ఈ ప్రయోజనం కోల్పోతారు.షరతులు ఉన్నాయ్... దీర్ఘకాల ఈక్విటీ మూలధన లాభాలపై సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించే తేదీకి ఏడాది ముందు కాలంలో లేదా విక్రయించిన తేదీ నుంచి తర్వాతి రెండేళ్లలోపు నివాస అవసరాలకు వినియోగించే ఇల్లు (పాతది లేదా కొత్తది) కొనుగోలు చేయాలి. ఇల్లు నిరి్మంచుకునేట్టు అయితే దీర్ఘకాల క్యాపిటల్ అసెట్స్ విక్రయించిన నాటి నుంచి మూడేళ్ల వరకు వ్యవధి ఉంటుంది. మూలధన లాభాలే కాకుండా, విక్రయించినప్పుడు వచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంత మొత్తంతోనే ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణంపై వెచి్చస్తే, అప్పుడు మిగిలిన మూలధన లాభాలపై నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఇంటి కొనుగోలుకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ ధీర్ఘకాల పెట్టుబడులు విక్రయించగా వచ్చిన మొత్తం రెండిళ్ల కొనుగోలుపై వెచ్చిస్తే.. ఒక ఇంటిపై చేసిన వ్యయాన్నే సెక్షన్54ఎఫ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే, ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించే నాటికి ఒక ఇంటిని మించి కలిగి ఉండకూడదు. రెండో ఇంటిని జాయింట్లో కలిగి ఉన్నా అర్హత కోల్పోయినట్టే. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులను విక్రయించినప్పుడు పన్ను మినహాయింపు కోసం ఇంటిపై వెచ్చించాలని చెప్పుకున్నాం. అయితే, విక్రయించిన ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేసే నాటికి ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచడం సాధ్యపడలేదు అనుకుందాం. అలాంటప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ కింద ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత దీని నుంచి ఉపసంహరించుకుని నిబంధనలకు అనుగుణంగా నిరీ్ణత కాలం లోపు ఇంటి కోసం వెచి్చంచి, పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిరీ్ణత కాలంలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచలేకపోయారని అనుకుందాం. అటువంటప్పుడు ఆ మొత్తాన్ని క్రితం ఆరి్థక సంవత్సరానికి సంబంధించి ఎల్‌టీసీజీగా చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.సరైన నిర్ణయమేనా?మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లాభాలపై పన్ను తప్పించుకునేందుకు సెక్షన్ 54ఎఫ్‌ను వినియోగించుకుని ఇంటిపై ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా..? అంటే, అందరికీ కాకపోవచ్చన్నదే సమాధానం. పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం, రిటైర్మెంట్ తదితర లక్ష్యాల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, పన్ను మినహాయింపు కోసం తీసుకెళ్లి ఇంటిపై వెచి్చంచడం సరైనది అనిపించుకోదు. కనుక ఈ విషయంలో ఇన్వెస్టర్లు అందరికీ ఒక్కటే సలహా నప్పదు. సొంతిల్లు సమకూర్చుకోవాలని కోరుకునే వారికి సెక్షన్ 54ఎఫ్ మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే, పన్ను మినహాయింపు కోసం ఇంటిపై ఇన్వెస్ట్ చేసి వృద్ధాప్యంలో ఆ ఇంటిని రివర్స్ మార్ట్గేజ్ కోసం వినియోగించుకునే ఆలోచన ఉన్న వారికి కూడా 54ఎఫ్ ప్రయోజనం అనుకూలమే.నష్టాలతో భర్తీ..ఈక్విటీల్లో మూలధన లాభాలపై పన్ను తగ్గించుకునేందుకు.. మూలధన నష్టాలతో భర్తీ చేసుకోవడం మరో ఆప్షన్. ఏడాదికి మించని ఈక్విటీ పెట్టుబడులు విక్రయించగా వచ్చిన స్వల్పకాల మూలధన నష్టాన్ని.. తిరిగి స్వల్పకాల మూలధన లాభం లేదా దీర్ఘకాల మూలధన లాభంలో సర్దుబాటు చేసుకోవచ్చు. ఇలా సర్దుబాటు చేయగా మిగిలిన మొత్తంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా సర్దుబాటు చేసుకున్న తర్వాత కూడా నష్టం మిగిలి ఉంటే దాన్ని అప్పటి నుంచి తదుపరి ఎనిమిదేళ్లపాటు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. పన్ను రిటర్నులు దాఖలు చేయడం ద్వారానే ఇందుకు అవకాశం ఉంటుంది. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాన్ని.. కేవలం దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
సెబీ కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచే..
న్యూఢిల్లీ: వచ్చే నెల (నవంబర్) 1 నుంచి మ్యూచువల్ ఫండ్స్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన నూతన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ఒక పాన్ ద్వారా యూనిట్లలో రూ. 15 లక్షలకు మించి చేపట్టే అన్ని లావాదేవీలు రెండు రోజుల్లోగా కంప్లయెన్స్ అధికారికి వెల్లడించవలసి ఉంటుంది.సంబంధిత అధికారులు, ట్రస్టీలు లేదా సంబంధిత వ్యక్తులు ఆయా లావాదేవీల వివరాలను రెండు పనిదినాల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. ఒక త్రైమాసికంలో సింగిల్ లేదా అనేక లావాదేవీల ద్వారా రూ. 15 లక్షల విలువ ట్రాన్సాక్షన్ జరిగితే.. మినహాయింపులో ఉన్నవికాకుండా అన్ని పథకాలకూ తాజా నిబంధనలు వర్తించనున్నట్లు సెబీ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది.వచ్చే నెల నుంచి ఏఎంసీలు త్రైమాసికవారీగా సంబంధిత అధికారులు, ట్రస్టీలు, సమీప బంధువుల హోల్డింగ్స్ వివరాలను వెల్లడించవలసి ఉంటుంది. అక్టోబర్ 31కల్లా కలిగి ఉన్న హోల్డింగ్స్‌ను నవంబర్ 15కల్లా వెల్లడించవలసి ఉంటుంది. ఆపై ప్రతీ త్రైమాసికం తదుపరి 10 రోజుల్లోగా వీటి వివరాలు దాఖలు పరచాలని సెబీ తెలియజేసింది. -
రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు కొత్త సాధనం
న్యూఢిల్లీ: పెట్టుబడులపై అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ ‘న్యూ అస్సెట్ క్లాస్’ (కొత్త సాధనం)ను ప్రవేశపెట్టింది. అలాగే, ప్యాసివ్ ఫండ్స్‌కు ప్రోత్సాహకంగా ‘ఎంఎఫ్ లైట్–టచ్’ కార్యాచరణను అనుమతించింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి నిబంధనల సవరణలకూ ఆమోదం తెలిపింది. ఇలా 17 ప్రతిపాదనలకు సెబీ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది.అందరూ అనుకున్నట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో)లో రిటైల్ ట్రేడర్ల స్పెక్యులేషన్ కట్టడిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణల తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశం ఇది కావడంతో అందరిలోనూ దీనిపై ఆసక్తి నెలకొంది. న్యూ అస్సెట్ క్లాస్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవలు (పీఎంఎస్) పొందాలంటే కనీసం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. రాబడుల కోసం రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, రూ.50 లక్షల పెట్టుబడి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ తరహా ఇన్వెస్టర్ల కోసం మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త ఉత్పత్తిని సెబీ ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సైతం స్వీకరించింది. ఈ సాధనంలో డెరివేటివ్స్‌లో పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. రుణాలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. అన్‌లిస్టెడ్, అన్‌రేటెడ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుమతి లేదు. టీప్లస్0 ప్రస్తుతం టీప్లస్1 సెటిల్మెంట్ విధానం అమల్లో ఉంది. అంటే స్టాక్స్ కొనుగోలు చేసిన మరుసటి పనిదినంలో దాన్ని సెటిల్ చేస్తారు. తదుపరి దశలో టీప్లస్0కు మళ్లాలన్నది సెబీ ప్రణాళిక. ఇందులో భాగంగా 25 స్క్రిప్‌లకు ఆప్షనల్ (ఐచి్ఛకం) టీప్లస్0 విధానం (ట్రేడింగ్ రోజే సెటిల్మెంట్) అమల్లో ఉంది. ఇప్పుడు టాప్–500 (మార్కెట్ విలువ పరంగా) స్టాక్స్‌కు టీప్లస్0 విధానాన్ని ఐచి్ఛకంగా చేస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్లు అందరూ తమ ఇన్వెస్టర్లకు టీప్లస్0 సెటిల్మెంట్ను ఆఫర్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన బ్రోకరేజీ చార్జీలను వసూలు చేసుకునే స్వేచ్ఛను సెబీ కల్పించింది. మ్యూచువల్ ఫండ్స్ సైతం టీప్లస్0 విధానాన్ని పొందొచ్చు. ఎంఎఫ్ లైట్ ప్యాసివ్ పండ్స్‌కు సంబంధించి సరళించిన కార్యాచరణను సెబీ ప్రకటించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలకు నిబంధనల భారాన్ని తగ్గించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్ రూపంలో ప్రవేశించే కొత్త సంస్థలకు మార్గం తేలిక చేసింది. నికర విలువ, ట్రాక్ రికార్డు, లాభదాయకత పరిమితులను తగ్గించింది. రైట్స్ ఇష్యూ వేగవంతం రైట్స్ ఇష్యూలు వేగంగా పూర్తి చేసేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. దీని కింద బోర్డు ఆమోదించిన నాటి నుంచి 23 పనిదినాల్లో రైట్స్ ఇష్యూ ముగుస్తుంది. ప్రస్తుతం 317 రోజుల సమయం తీసుకుంటోంది. ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్‌కు పట్టే 40 రోజుల కంటే కూడా తక్కువ కానుంది. ఇతర నిర్ణయాలు.. » సెకండరీ మార్కెట్లో (నగదు విభాగం) యూపీఐ బ్లాక్ విధానం (ఏఎస్బీఏ) లేదా 3ఇన్1 ట్రేడింగ్ సదుపాయం ద్వారా ఇన్వెస్టర్లు ట్రేడ్ చేసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం మాదిరే తమ బ్యాంక్ ఖాతా నుంచి నిధులను ట్రేడింగ్ అకౌంట్‌కు బదిలీ చేసి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐపీవో దరఖాస్తుకు ఏఎస్బీఏ విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. » ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్లను (ఎడీఐలు) జారీ చేసే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) సంబంధించి పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు కానుంది. ఎఫ్‌పీఐలు తమ నుంచి ఓడీఐలను పొందిన వారి వివరాలను సరిగ్గా అందిస్తున్నాయా? అన్నది ఈ యంత్రాంగం పర్యవేక్షించనుంది. -
వెంటాడుతున్న ఆర్థిక అనిశ్చితి భయాలు..
సాక్షి, హైదరాబాద్: భారతీయులను ‘ఆర్థిక అనిశ్చితి’భయాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులతోనే కాకుండా రాబోయే ఐదేళ్లలో చోటుచేసుకోబోయే అనూహ్య పరిస్థితులపై కూడా వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే ఐదేళ్లలో భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత వాతావరణం కొనసాగొచ్చన్న అభిప్రాయంతో మెజారిటీ భారతీయులు ఉన్నారు. ఇదే సమయంలో భారత్‌తో సహా దాదాపుగా అన్ని ప్రపంచ దేశాల్లోని ప్రజలను ఆర్థిక అనిశ్చితి భయపెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికరంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా...రాబోయే ఐదేళ్లలోనూ ఇదే స్థితి కొనసాగుతుందా? పరిస్థితులు మరింత దిగజారుతాయా అన్న ఆందోళన వివిధ వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. కుటుంబ ఖర్చులు, పిల్లల చదువుల వ్యయం, వైద్యఖర్చులు, తదితరాల పెరుగుదలతో వచ్చే ఐదేళ్లలో మనదేశంతో పాటు వివిధ దేశాల్లో ఆర్థిక అస్థిరత, నిలకడలేని వాతావరణం కొనసాగుతుందని 88 శాతం భారతీయులు భావిస్తున్నారు. ఈ అనిశ్చితితో పాటు ఉద్యోగాలు, అప్పులు, రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలు కూడా తమ జీవితాలతో ముడిపడిన ఆర్థిక అంశాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని వారు అంచనా వేస్తున్నారు. ఆర్థిక అనిశ్చితితో తమకు వచ్చే ఆదాయంలో హెచ్చుతగ్గులు, అప్పులు, ఊహించని ఖర్చుల పెరుగుదలతో మానసిక ఒత్తిళ్లు, ఆందోళన వంటి వాటికి దారితీస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆర్థిక అనిశ్చితి, దానిని ప్రభావితం చేసే అంశాలు తదితరాలపై తాజాగా ‘అనిశి్చత్ ఇండెక్స్’నివేదికను ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7,978 మంది వ్యక్తుల (5,320 మంది వేతన జీవులు, 2,658 మంది బిజినెస్ ప్రొఫెషనల్స్) నుంచి సేకరించిన సమాచారం, వివరాల మేరకు ఈ నివేదికను సిద్ధం చేశారు. ఈ సర్వే ముఖ్యాంశాలు ఇవీ... » భారతీయులకు పెరుగుతున్న ఖర్చులే అతి పెద్ద అనిశ్చితి.. » కుటుంబ ఖర్చుల పెరుగుదలతో ఇబ్బంది పడొచ్చని భావిస్తున్నవారు 77 శాతం మంది » ఆరోగ్యం, జీవితంలో అనిశ్చితి, అప్పుడు, ఊహించని ఖర్చులు రావొచ్చునని అంచనా వేస్తున్నవారు 71 శాతం మంది » ఆర్థిక అనిశ్చితి ఎదురుకావొచ్చుననే భావనలో 67 శాతం » రాజకీయ అనిశి్చతితో ఇబ్బందులు ఎదురుకావొచ్చుననే అభిప్రాయంతో ఉన్న వారు 65 శాతం » చేస్తున్న ఉద్యోగాల్లో మార్పుచేర్పుల అనిశ్చితి ఏర్పడొచ్చునంటున్న వారు 64 శాతం » వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావంతో అనిశ్చితి ఉండొచ్చుననే భావనతో 62 శాతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడొచ్చా అన్న దానిపై ఏమన్నారంటే... » 88 శాతం మంది వచ్చే 5 ఏళ్లలో భారత్‌తో సహా ప్రపంచదేశాల్లో ఆర్థిక అనిశ్చితి నెలకొనవచ్చుననే భావనతో ఉన్నారు. » 10 శాతం మంది ఈ అనిశ్చితి తక్కువస్ధాయిలో ఉండొచ్చునని నమ్ముతున్నారు. » 2 శాతం మందికి ఇది అతి స్వల్పంగా లేదా అసలు ఉండకపోవచ్చుననే అభిప్రాయం ఈ అనిశ్చితిని అధిగమించేందుకు ‘ఫైనాన్షి యల్ ప్లానింగ్’ఏ మేరకు తోడ్పడుతుంది ? » ఆర్థిక ప్రణాళికల సాయంతో ఈ అనిశ్చితిని తగ్గించవచ్చునని నమ్ముతున్నవారు 46 శాతం మంది » ఈ విషయంలో ‘ఫైనాన్షియల్ ప్లానింగ్’ను గట్టిగా సమరి్థస్తున్నవారు 37 శాతం » ఈ ప్లానింగ్ పట్ల పెద్దగా మేలు జరగదని భావిస్తున్నవారు 13 శాతం » దీనిని పూర్తిస్థాయిలో నిరాకరిస్తున్న వారు 4 శాతం మంది అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆర్థిక సురక్షితలు ఉపయోగపడతాయి? » 77 శాతం మంది ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ పాలసీ అతిపెద్ద ఆర్థిక సురక్షితగా భావిస్తున్నారు. » 49 శాతం రాబోయే రోజుల్లో ఏవైనా ఆర్థికపరమైన సవాళ్లు వస్తే ఎదుర్కునేందుకు ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వాటిలో కొంత మొత్తం జమచేశామని చెబుతున్నారు. » 46 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్/ స్టాక్స్‌లలో పెట్టుబడి పెట్టినట్టుగా వెల్లడించారు. » 42 శాతం మంది పెన్షన్ వచ్చే ఉద్యోగం ఉందని, తాము ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపారం లాభదాయకంగా ఉన్నట్టుగా తెలిపారు. » 6 శాతం మంది మాత్రం తాము ఎలాంటి ఆర్థిక సురక్షితలను సిద్ధం చేసుకోలేదని పేర్కొన్నారు. ‘ఫైనాన్షియల్ ప్లానింగ్’ను సమీక్షిస్తుంటారా ? » 37 శాతం మంది తమకు తాముగా ఇలాంటి సమీక్షలు చేయడం లేదు. తమ తరఫున సీఏలు, ఫైనాన్షియల్ అడ్వయిజర్లు తమ బాధ్యతను తీసుకుంటున్నట్టు తెలిపారు. » 22 శాతం మంది ఏడాదికి ఒకసారి లేదా అంతకంటే తక్కువ కాలంలో సమీక్షిస్తామన్నారు. » 15 శాతం మంది 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తామని చెప్పారు. » 14 శాతం మంది 6 నెలలకు, 14 శాతం నెలకు ఒకసారి ఈ పనిచేస్తామన్నారు. భవిష్యత్‌లో చోటుచేసుకునే పరిణామాల్లో ఏ అంశం అధిక ఆందోళనకు కారణమవుతోంది? » 64 శాతం మంది ఉద్యోగ, వృత్తిపరంగా ఎదురయ్యే ఒడిదుడుకులు, పురోగతిపైనే అని వెల్లడి. » 61 శాతం దీర్ఘకాలిక ఆర్థిక పరమైన లక్ష్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయంటున్నారు.» 58 శాతం మంది తమ/కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపైనే ఎక్కువ ఆందోళన ఉన్నట్టుగా తెలిపారు. » 39 శాతం మంది కుటుంబసభ్యులు/ స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు ఏ రకంగా ఉంటాయనే దానిపై సందిగ్ధతతో ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఇదీ అధ్యయనం... ఆర్థిక అనిశి్చతితో తలెత్తే పరిస్థితులు, ఇబ్బందులను ఎదుర్కునేందుకు వివిధవర్గాల ప్రజలు తమ తమ ప్రాధాన్యతలను ఎప్పటికప్పుడు మార్చుకోవడంతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను పునర్ నిర్దేశించుకోవడానికి కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తున్నట్టుగా ఈ నివేదికలో వెల్లడైంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సురక్షిత స్థితికి చేరేందుకు అవసరమైన మార్గాల అన్వేషణ, అప్పులను తెలివిగా నిర్వహించడం, పెట్టే ఖర్చులను జాగ్రత్తగా వ్యయం చేయడం, డబ్బు పొదుపు వంటి వాటికి ప్రజలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టుగా పేర్కొంది. రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఆర్థిక అనిశ్చితిని అధిగమించేందుకు వివిధ రంగాలకు చెందినవారు అనుసరించే ప్రణాళికలు, ముందస్తు ఆలోచనలను బట్టి చూస్తే... ఇన్సూరెన్స్ పాలసీలు 77 శాతం మంది, ఫిక్స్డ్ డిపాజిట్లు 49 శాతం, మ్యూచువల్ ఫండ్స్/స్టాక్స్‌లో 46 శాతం, పెన్షన్‌పై ధీమా/సజావుగా సాగుతున్న వ్యాపారాలున్న వారు 42 శాతం, ఎలాంటి ఆర్థిక రక్షణ ప్రణాళికలున్చేయనివారు 6 శాతం ఉన్నట్టు ఆదిత్య బిర్లా స¯న్లైఫ్ నివేదిక తెలిపింది. -
డిపాజిట్లు రూట్ మారడానికి కారణం ఇదే..
ముంబై: బ్యాంకుల నుంచి డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, ఇతర సాధనాల వైపు మళ్లడానికి సులభతర నిబంధనలే కారణమని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చైర్మన్ ఎంవీ రావు వ్యాఖ్యానించారు. గడిచిన ఏడాది కాలంగా బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి నిదానించిన నేపథ్యంలో.. ఎఫ్‌ఐబీఏసీ వార్షిక సదస్సులో భాగంగా దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది.సెంట్రల్ బ్యాంక్ ఇండియా ఎండీ, సీఈవోగానూ వ్యవహరిస్తున్న ఎంవీ రావు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సులభతర నిబంధనల కారణంగా ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ అధిక రాబడులు అందిస్తున్నాయని చెప్పారు. నిధుల నిర్వహణ విషయంలో బ్యాంకులపై ఎన్నో నియంత్రణలు ఉండగా.. మ్యూచువల్ ఫండ్స్‌కు అలాంటి నిబంధనలేవీ లేవన్నారు. ‘‘నిధులను అంతిమంగా ఎందుకు వినియోగిస్తున్నారో తనిఖీ చేయాల్సిన అవసరం మ్యూచువల్ ఫండ్స్‌కు లేదు.మా వద్దే డిపాజిట్ చేయాలని కస్టమర్లను బ్యాకింగ్ రంగం నిర్దేశించలేదు. ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసే విషయంలో ఫండ్స్‌కు ఎలాంటి ప్రొవిజనింగ్ లేదు. కానీ ప్రామాణిక రుణ ఆస్తులకు సంబంధించి కూడా నిర్దేశిత మొత్తాన్ని బ్యాంక్‌లు పక్కన పెట్టాల్సి ఉంటుంది. 99 శాతం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి పరిశోధన చేయడం లేదు.ఆరేడేళ్ల తర్వాత ఈ సైకిల్ తిరగబడితే అది వ్యవస్థాగత ముప్పుకు దారితీయవచ్చు. రానున్న రోజుల్లో డిపాజిటర్లు అధిక రాబడులు సొంతం చేసుకునేందుకు, దేశ వృద్ధికి కావాల్సిన ముడి సరుకు (నిధులు)ను బ్యాంక్‌లు పొందేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థల మధ్య చురుకైన భాగస్వామ్యం, చర్చ అవసరం’’అని రావు ఈ సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించారు.డిపాజిట్ల మందగమనం కారణాలు వేరే..కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యుడు కూడా అయిన నీలేష్ షా ఈ అభిప్రాయాలతో విభేదించారు. బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి నిదానించడానికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమను ఎలా తప్పుబడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.ప్రభుత్వ నిధులు సైతం బ్యాంకింగ్ నుంచి బయటకు వెళుతున్నాయని, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, నగదు పంపిణీ తదితర అంశాలను ఇందుకు కారణాలుగా ప్రస్తావించారు. ప్రభుత్వ బ్యాలన్స్‌లను (మిగులు నిధులు) బ్యాంకుల్లో ఉంచాలని ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ను తాను కోరినట్టు చెప్పారు. ఇలా చేసిన ప్రభుత్వం ఏటా రూ.12,000 కోట్ల ఆదాయం పొందొచ్చన్నారు. కాగా, రావు అభిప్రాయాలతో ఇదే సమావేశంలో పాల్గొన్న హెచ్ఎస్బీసీ హితేంద్ర దవే సేతం విభేదించడం గమనార్హం. -
ప్యాసివ్ ఫండ్స్ బూమ్
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్) పథకాల పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతోంది. పనిలో పనిగా ఈ డిమాండ్‌ను సొంతం చేసుకునేందుకు ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) కొత్త పథకాలతో (ఎన్ఎఫ్వో) మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. యాక్టివ్‌గా నిర్వహించే ఈక్విటీ పథకాలు రాబడుల విషయంలో సూచీలతో వెనుకబడుతున్న తరుణంలో ప్యాసివ్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనం.. గడిచిన ఏడు నెలల్లో (జనవరి–జూలై) 63 ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి రావడమే. గతేడాది మొత్తం మీద 51 ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోల రికార్డును ఈ ఏడాది ఇప్పటికే అధిగమించడం గమనార్హం. ముఖ్యంగా ఈ నెలలో మార్కెట్లోకి 12 ఎన్‌ఎఫ్‌వోలు రాగా, అందులో సగం మేర ప్యాసివ్ ఫండ్స్ నుంచే ఉన్నాయి. జూలై చివరి నాటికి అత్యధికంగా టాటా మ్యూచువల్ ఫండ్ 10 ప్యాసివ్ ఫండ్ ఎన్‌ఎఫ్‌వోలను చేపట్టింది. హెచ్డీఎఫ్సీ ఏఎంసీ 5, మిరే అస్సెట్ మేనేజ్మెంట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చెరో నాలుగు చొప్పున ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలను తీసుకొచ్చాయి. ప్యాసివ్ ఫండ్స్ పరిధిలోని ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 22 శాతం పెరిగి జూలై చివరికి 3.22 కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో యాక్టివ్ ఫండ్స్ విభాగంలో ఫోలియోలు 19 శాతం పెరిగి 13.84 కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 24 శాతం వృద్ధితో రూ.10.95 లక్షల కోట్లకు చేరాయి. నెలవారీ ఈ పథకాల్లోకి వచ్చే పెట్టుబడులు ఈ ఏడాది జనవరిలో రూ.3,983 కోట్లుగా ఉండగా.. జూలైలో రూ.14,778 కోట్లకు వృద్ధి చెందడం, వీటి పట్ల ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది.ప్రత్యామ్నాయాలపై దృష్టికొత్త పెట్టుబడులు ఆకర్షించేందుకు మ్యూచువల్ ఫండ్స్ వినూత్న మార్గాలపై దృష్టి సారించాయి. సంప్రదాయ పథకాల పరంగా ఇప్పటికే తగినంత మార్కెట్ ఏర్పడడంతో.. కొత్త పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఇన్వెస్టర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫండ్స్ సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. యాక్టివ్ పథకాలు ఇప్పటికే తగినంతగా మార్కెట్లో ఉండడంతో, ప్రముఖ ఏఎంసీలు ప్యాసివ్, థీమ్యాటిక్ ఎన్‌ఎఫ్‌వోల బాట పట్టినట్టు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా డైరెక్టర్ కౌస్తభ్ బేల్‌పుర్కార్ తెలిపారు. ప్యాసివ్, యాక్టివ్ ఫండ్స్ మధ్య అంతరాన్ని భర్తీ చేసే విధంగా స్మార్ట్ బీటా తదితర వినూత్నమైన విధానాలను కొత్త ప్యాసివ్ ఫండ్స్ విషయంలో ఏఎంసీలు అమలు చేస్తున్నాయి. స్మార్ట్ బీటా అంటే.. ఆయా ప్యాసివ్ ఫండ్ ఒక సూచీని అనుసరించి పెట్టుబడులు పెట్టినప్పటికీ.. రాబడుల్లో మార్కెట్‌ను అధిగమించేలా ఉంటుంది. ఈ తరహా ప్యాసివ్ ఫండ్ వ్యూహాల్లో ‘ఈక్వల్ వెయిట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండెక్స్’ ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది. నిఫ్టీ సూచీలో టాప్–10లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, తక్కువ రిస్క్‌తో కూడిన రాబడులు ఆఫర్ చేసే విధానానికీ ప్రాచుర్యం పెరుగుతోంది. మొత్తానికి ప్యాసివ్ ఫండ్స్ రూపంలో మెరుగైన రాబడులు ఆఫర్ చేయడం ద్వారా ఇన్వెస్టర్ల ఆదరణ సొంతం చేసుకునే దిశగా ఏఎంసీలు ప్రయతి్నస్తుండడం గమనార్హం. -
ముందస్తుగా స్ట్రెస్ టెస్ట్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్‌ను ముందస్తుగా నిర్వహించాలని పరిశ్రమను కోరినట్టు సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత్ నారాయణ్ గోపాలకృష్ణన్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌పై నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. స్ట్రెస్ టెస్ట్ కేవలం పథకాల కోసమో లేదా ఫండ్స్ సంస్థల కోసమే కాదని.. మొత్తం మ్యూచువల్ ఫండ్ వ్యవస్థకు సంబంధించినదిగా పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక అనిశి్చతులు, ఆటుపోట్ల పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉపసంహరణ ఒత్తిళ్లు (లిక్విడిటీ రిస్క్) ఎదురైతే.. వాటిని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, పరిశ్రమ ఎలా అధిగమించగలవో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు తెలియజేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థల (ఏఎంసీల) సన్నద్ధతను ఇది పెంచుతుంది. ముఖ్యంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో లిక్విడిటీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీనిపై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సెబీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాల పరిధిలో ఉండే రిస్క్‌పై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించేందుకు మెరుగైన మార్గాలను గుర్తించేందుకు ఇది సాయపడుతుందని గోపాలకృష్ణన్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న రిస్క్ నిర్వహణ విధానం.. వివిధ పథకాల్లో ఉండే వేర్వేరు రిస్క్ స్థాయిలను ప్రతిబింబించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వేర్వేరు రిస్క్ స్థాయిలు ఉన్నప్పటికీ.. చాలా పథకాలకు కేవలం అధిక రిస్క్ ట్యాగ్ వేస్తున్నట్టు చెప్పారు. కనుక ఈ వ్యత్యాసాలను మరింత పారదర్శకంగా తెలియజేయడమే కొత్త వ్యవస్థ లక్ష్యమన్నారు. సులభంగా ఉండాలి.. ‘‘పోర్ట్‌ఫోలియోలో అంతర్లీనంగా ఉండే ఆటుపోట్లను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇందుకు గాను రిస్‌్కలను సులభంగా అర్థం చేసుకునే విధంగా సమాచారం ఉండాలి. పోర్ట్‌ఫోలియో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు ఈ దిశగా మరింత స్పష్టతనిస్తాయి’’అని గోపాలకృష్ణన్ తెలిపారు. కార్యకలాపాలు క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు మరింత కచ్చితత్వంతో సేవలు అందించడంపై దృష్టి పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు సూచించారు. అప్పటికప్పుడే నిధుల బదిలీకి మన వ్యవస్థలు వీలు కలి్పస్తున్న తరుణంలో.. సెటిల్మెంట్ రోజే ఇన్వెస్టర్లకు నిధుల బదిలీ చేయాలా చూడాలన్నారు. విక్రయించిన మరుసటి రోజు లేదా రెండు రోజుల తర్వాత ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఫండ్స్ సంస్థలు నిధులు బదిలీ చేస్తుండడంతో గోపాలకృష్ణన్ సూచనకు ప్రాధాన్యం సంతరించుకుంది. -
పెన్షన్ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు
పెన్షన్ సదుపాయంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, డెట్ ఫండ్స్ విషయంలో పన్ను ప్రయోజనాలు కలి్పంచాలంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. బడ్జెట్‌కు ముందు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి దృష్టికి తీసుకెళ్లింది. జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)లో పెట్టుబడులకు సెక్షన్ 80సీసీడీ కింద కలి్పస్తున్న పన్ను మినహాయింపును పెన్షన్ ప్రయోజనంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ (మ్యూచువల్ ఫండ్స్ లింక్డ్ రిటైర్మెంట్ స్కీమ్స్)కు సైతం అమలు చేయాలని కోరింది. అలాగే, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్లు, అంతకుమించిన పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడు.. వచి్చన లాభంపై డిబెంచర్లకు మాదిరే ఫ్లాట్ 10% పన్నును, ద్రవ్యోల్బణం మినహాయింపు ప్రయోజనం లేకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీల్లో 35% వరకు పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌కు గతేడాది విధించిన స్వల్పకాల మూలధన లాభాల పన్నును తిరిగి పరిశీలించాలని కోరింది. బాండ్లలో పెట్టుబడులకు ప్రోత్సాహం డెట్ ఫండ్స్ ద్వారా బాండ్లలో పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని కూడా ఆర్థిక మంత్రిని యాంఫి కోరింది. డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలకు మాదిరే పన్ను రేట్లు అమలు చేయాలని, ఇందుకు ఫైనాన్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 50ఏఏను సవరించాలని వినతిపత్రంలో పేర్కొంది. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తేయాలి.. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తివేయాలంటూ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ కాని స్టార్టప్‌లు జారీ చేసే షేర్ల విలువ మదింపునకు గాను డీపీఐఐటీ గతేడాది సెప్టెంబర్‌లో కొత్త నిబంధనలు తీసుకొచి్చంది. పారదర్శక మార్కెట్ విలువ కంటే అధిక ధరపై షేర్లు జారీ చేసే స్టార్టప్‌లు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని తొలగిస్తే స్టార్టప్‌లను ప్రోత్సహించినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆకర్షణీయంగా ఫ్లెక్సీ, మల్టీ క్యాప్ ఫండ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ల ఆదాయాలు బాగుంటున్న నేపథ్యంలో వాటితో ముడిపడి ఉన్న మార్కెట్ల పనితీరు కూడా మెరుగ్గానే ఉండగలదని ఎడెలీ్వజ్ మ్యుచువల్ ఫండ్ ఎండీ రాధికా గుప్తా చెప్పారు. కొన్ని విభాగాలు కాస్త అధిక వేల్యుయేషన్లలో ట్రేడవుతున్నప్పటికీ స్థూలంగా మార్కెట్‌ని చూస్తే బబుల్లాంటి (బుడగలాగా పేలిపోయే) పరిస్థితేమీ లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రెసివ్ ఇన్వెస్టర్లు .. ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, బిజినెస్ సైకిల్ ఫండ్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చని సూచించారు. కాస్త కన్జర్వేటివ్గా ఉండే వారు బ్యాలెన్స్డ్ ఫండ్స్ లాంటి హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం తమ ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) రూ. 1.40 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా, 25–30 శాతం వృద్ధి సాధించేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని రాధిక చెప్పారు. గత ఆరేళ్లలో ఆరు నగరాల నుంచి ప్రస్తుతం 35 పైచిలుకు నగరాలకు కార్యకలాపాలు విస్తరించామని. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను 60కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నామని తెలిపారు. సుమారు 15 లక్షలుగా ఉన్న ఫోలియోలను 30–40 లక్షలకు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. సిప్‌లు పెరగడమనేది దేశీ మార్కెట్లకు మేలు చేస్తోందని, విదేశీ నిధులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని ఆమె చెప్పారు. ఇన్వెస్టర్లు అసాధారణ రాబడులకు హామీలనిచ్చే సాధనాల విషయంలో సదా అప్రమత్తంగా ఉండాలని, పనితీరు మాత్రమే కాకుండా సంస్థ పటిష్టతను కూడా చూసుకోవాలని రాధిక సూచించారు. భారత ఎకానమీ వృద్ధి చెందడమనేది కేవలం ఏదో ఒక రంగంపై ఆధారితమైనది కాకుండా వివిధ రంగాలవ్యాప్తంగా ఉంటుందనే విషయాన్ని రిటైల్ ఇన్వెస్టర్లు గుర్తించి, తదనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు. -
ప్యాసివ్ ఫండ్స్‌కు సెబీ బూస్ట్
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రోత్సాహకంగా సరళతర నిబంధనలను సెబీ ప్రతిపాదించింది. ప్యాసివ్‌గా నడిచే మ్యూచువల్ ఫండ్స్‌లో అంతర్గతంగా రిస్క్ చాలా తక్కువగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకున్న మార్కెట్ల నియంత్రణ సంస్థ.. నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీకి మద్దతునివ్వడం, కేవలం ప్యాసివ్ పథకాలనే ఆవిష్కరించే మ్యూచువల్ ఫండ్స్ సంస్థలను (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) ప్రోత్సహించడం కోసం ‘ఎంఎఫ్ (మ్యూచువల్ ఫండ్) లైట్’ పేరుతో సులభతర నిబంధనలు ప్రతిపాదించింది. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేస్తూ భాగస్వాముల నుంచి అభిప్రాయాలు కోరింది. ప్యాసివ్ పథకాలు అంటే?మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్టివ్, ప్యాసివ్ అని రెండు రకాల పథకాలు ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ల పాత్ర కీలకం. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించేది వీరే. అదే ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ పనితీరు వీటికి భిన్నం. ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ ప్యాసివ్ ఫండ్స్ కిందకే వస్తుంటాయి. ఇవి ఒక సూచీని అనుసరిస్తూ ఆ సూచీలోని కంపెనీల్లో, వాటి వెయిటేజీకి అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. కనుక వీటి రాబడులు ఆయా సూచీల పనితీరును పోలి ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో సరైన కంపెనీలను, సరైన వ్యాల్యూషన్ల వద్ద ఎంపిక చేసుకోవాలి. సరైన సమయంలో ఆయా కంపెనీల్లోని పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా చేయాల్సి వస్తుంది. అందుకే వీటికి ఫండ్ మేనేజర్లు, పరిశోధక బృందం నైపుణ్యాలు కీలకం అవుతాయి. కానీ, ప్యాసివ్ ఫండ్స్‌లో అంత నైపుణ్యాలు అవసరం ఉండవు. సూచీల ఆధారంగా పెట్టుబడులను కేటాయిస్తే సరిపోతుంది. అందుకే వీటిల్లో రిస్క్ చాలా తక్కువ. కానీ, ప్రస్తుతం ప్యాసివ్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఒకే విధమైన కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. నికర విలువ, పనితీరు, లాభదాయకత తదితర అంశాల విషయంలో నిబంధనలు కేవలం ప్యాసివ్ ఫండ్స్‌నే ప్రారంభించాలనుకునే సంస్థలకు ప్రతిబంధకంగా ఉన్నాయి. ఇది గుర్తించిన సెబీ, ఎంఎఫ్ లైట్ పేరుతో ప్యాసివ్ ఫండ్స్‌కు సులభతర నిబంధనలు ప్రతిపాదించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలే ఎంఎఫ్ లైట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తూ, యాక్టివ్తోపాటు, ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలు ప్రస్తుత రిజి్రస్టేషన్ కిందే కొనసాగొచ్చు. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించాలనుకునే సంస్థలకు రిజిస్ట్రేషన్, సమాచార వెల్లడి, నింధనల అమలులో వెసులుబాటును సెబీ ప్రతిపాదించింది. సభ్యులందరికీ ఒకే చార్జీలుస్టాక్ ఎక్సే్ఛంజ్‌లు తమ సభ్యులందరికీ ఒకే విధమైన చార్జీలు వసూలు చేయాలని సెబీ తాజాగా ఆదేశించింది. సభ్యుల లావాదేవీల పరిమాణంతో సంబంధం లేకుండా అందరికీ చార్జీలు ఒకే రకంగా ఉండాలని సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్లతోపాటు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఐఐలు) అయిన క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ‘‘ఎంఐఐలు నూతన చార్జీల విధానం రూపొందించే ముందు, ప్రస్తుతం ఒక యూనిట్ వారీ అవుతున్న చార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల చార్జీల తగ్గింపుతో తుది క్లయింట్ (ఇన్వెస్టర్) లబ్ధి పొందుతారు’’అని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. -
ఫండ్స్‌లో కొత్త ఇన్వెస్టర్ల జోరు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ రంగంలో కొత్త ఇన్వెస్టర్ల జోరు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి రెండు నెలల్లోనే (ఏప్రిల్, మే) మ్యూచువల్ ఫండ్స్‌లో 81 లక్షల కొత్త ఖాతాలు (ఫోలియోలు) నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) డేటాను పరిశీలించగా.. మే చివరికి నాటికి ఫోలియోలు 18.6 కోట్లకు చేరాయి. ఈ ఏడాది మార్చి చివరికి ఉన్న 17.78 కోట్ల ఫోలియోలతో పోలిస్తే 4.6 శాతం పెరిగాయి. ఏప్రిల్‌లో 36.11 లక్షల ఫోలియోలు ప్రారంభం కాగా, మే నెలలో 45 లక్షలుగా ఉన్నాయి. 2023లో నెలవారీ సగటు నూతన ఖాతాల ప్రారంభం 22.3 లక్షలుగా ఉంది. దీంతో పోల్చి చూసినప్పుడు ఏప్రిల్, మే నెలల్లో రెట్టింపు స్థాయిలో కొత్త ఖాతాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఒక ఇన్వెస్టర్‌కు ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిని సూచించేదే ఫోలియో. ఇలా ఒక ఇన్వెస్టర్ పలు రకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకటికి మించిన ఫోలియోలు కలిగి ఉండడం సహజం. పెరుగుతున్న అవగాహన... ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ అనుసరిస్తున్న పలు ప్రచార కార్యక్రమాలకు తోడు, ఈక్విటీల బలమైన ప్రదర్శన ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చి చూసినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లలో రాబడులు అంత ఆకర్షణీయంగా లేకపోవడం కూడా ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పునకు కారణంగా పేర్కొంటున్నారు. అలాగే పెరుగుతున్న ఆదాయం, డిజిటల్ సాధనాల ద్వారా ఆరి్థక సాధనాల్లో పెట్టుబడులకు ఉన్న సౌలభ్యం వృద్ధికి అనుకూలిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది డిజిటల్ ఛానళ్లను ఎంపిక చేసుకుంటున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్, మే నెలలో వచి్చన 81 లక్షల కొత్త ఫోలియోలలో 61.25 లక్షలు ఈక్విటీలకు సంబంధించినవి కావడం గమనార్హం. దీంతో పరిశ్రమ వ్యాప్తంగా మొత్తం ఈక్విటీ ఫోలియోలు 12.89 కోట్లకు పెరిగాయి. మొత్తం ఫోలియోలలో ఈక్విటీల వాటా 69 శాతంగా ఉంది. ఈ ఆరి్థక సంవత్సరం మొదటి రెండు నెలల్లో థీమ్యాటిక్/సెక్టోరల్ విభాగంలోనే 23.19 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత స్మాల్‌క్యాప్ (8.04 లక్షలు), మిడ్‌క్యాప్ ఫండ్ (7.74 లక్షలు) విభాగాల్లో కొత్త ఖాతాల ప్రారంభం ఎక్కువగా ఉంది. -
‘మీ జీవితం ఎలా ఉందో చూసుకోండి’.. సీఈఓ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు
మీ జీవితం ఎలా ఉందో మీరే చూసుకోవాలి. పక్కవారి జీవితాల్లో తొంగి చూడడం ఎందుకు? అంటూ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా నేటి తరం యువత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా భారత్‌తో పాటు, ఇతర దేశాల్లో నివసించే వారిలో మానసిక ఆరోగ్యం ఓ కీలక సమస్యగా మారింది. అనేక కారణాల వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్స్ వంటి విభిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా యువతీ యువకులు పక్క వారి జీవితంపై దృష్టిపెట్టడమే అందుకు కారణం. ఎందుకంటే వారి జీవితం ఎలా ఉందో పట్టించుకోవడలేదు. కానీ ఇన్ స్ట్రాగ్రామ్లో ఇతరుల జీవితాలు వారికి మెరుగ్గా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మీకు మీరు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా భావించడం లేదు. పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరుల జీవితాలు తమకన్నా బాగున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ ఎక్స్ వేదికా ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. -
ఫండ్స్ పెట్టుబడుల జోరు..
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పెట్టుబడులు చరిత్రాత్మక గరిష్టానికి చేరాయి. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) చివరి త్రైమాసికంలో లిస్టెడ్ కంపెనీలలో ఎంఎఫ్‌ల వాటా 9 శాతానికి ఎగసింది. ఇందుకు ఈ కాలంలో తరలివచి్చన రూ. 81,539 కోట్ల నికర పెట్టుబడులు దోహదపడ్డాయి. ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ వివరాల ప్రకారం 2023 డిసెంబర్ చివరికల్లా ఈ వాటా 8.8 శాతంగా నమోదైంది. ఈ కాలంలో దేశీయంగా అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ వాటా 3.64 శాతం నుంచి 3.75 శాతానికి బలపడింది. ఎల్ఐసీకి 280 లిస్టెడ్ కంపెనీలలో 1 శాతానికిపైగా వాటా ఉంది. వెరసి ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, పెన్షన్ ఫండ్స్‌తోకూడిన దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు) వాటా మొత్తంగా 15.96 శాతం నుంచి 16.05 శాతానికి మెరుగుపడింది. ఇందుకు భారీగా తరలివచి్చన రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడులు తోడ్పాటునిచ్చాయి.విదేశీ ఇన్వెస్ట్మెంట్.. 11ఏళ్ల కనిష్టం 2024 మార్చికల్లా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల వాటా 17.68 శాతానికి నీరసించింది. ఇది గత 11ఏళ్లలోనే కనిష్టంకాగా.. 2023 డిసెంబర్‌కల్లా 18.19 శాతంగా నమోదైంది. ఫలితంగా ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐలు, ఎఫ్‌పీఐల హోల్డింగ్(వాటాలు) మధ్య అంతరం చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఎఫ్‌పీఐలు డీఐఐల మధ్య వాటాల అంతరం 9.23 శాతానికి తగ్గింది. గతంలో 2015 మార్చిలో ఎఫ్‌పీఐలు, డీఐఐల మధ్య వాటాల అంతరం అత్యధికంగా 49.82 శాతంగా నమోదైంది. ఇది ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,989 కంపెనీలలో 1,956 కంపెనీలను లెక్కలోకి తీసుకుని చేసిన మదింపు. -
కేవైసీతోనే.. ఫండ్స్‌లో పెట్టుబడులు
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? గతంలో ఎప్పుడో కేవైసీ (నో యువర్ కస్టమర్) చేసి ఉన్నారా..? అయితే ఒక్కసారి మీరు మీ కేవైసీ స్థితిని తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు మరో విడత కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిన తరుణం వచి్చంది. ఇందుకు విధించిన ఏప్రిల్ 1 గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేస్తున్న పథకాలు కాకుండా.. కొత్త వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం కేవైసీని అప్డేట్ చేసుకోవడమే. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సంబంధించి తిరిగి కేవైసీ చేసే విషయంలో గందరగోళం నెలకొంది. కొంత మంది ఇన్వెస్టర్లు మినహా చాలా మందిలో దీనిపై స్పష్టత లేదు. కేవైసీ చేసేందుకు ప్రయత్నించకపోవడం, ఏ డాక్యుమెంట్లు కావాలో అవగాహన లేకపోవడమే ఈ అయోమయానికి కారణమని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్, ఇన్వెస్టర్ సర్వీసెస్ హెడ్ అబ్దుల్లా చౌదరి అంటున్నారు. మ్యూచు వల్ ఫండ్స్ సంస్థల వెబ్సైట్ నుంచే ఆన్లైన్లో సులభంగా కేవైసీని మరోసారి చేసుకోవచ్చని తెలిపారు. చెక్ చేసుకోవాల్సిందే.. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తిరిగి కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందా..? అంటే లేదన్నదే సమాధానం. అసలు ఎవరు కేవైసీ ప్రక్రియను తిరిగి నిర్వహించుకోవాలో తెలుసుకోవాలంటే.. ఆన్లైన్లో తమ కేవైసీ స్థితిని ఒకసారి పరిశీలించుకుంటే కానీ తెలియదు. సాధారణంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు సీవీఎల్ను కేవైసీ కోసం ఉపయోగిస్తుంటారు. కనుక సీవీఎల్కేఆర్ఏ డాట్ కామ్ సైట్‌కు వెళ్లాలి. లేదంటే ఎన్డీఎంఎల్ కేఆర్ఏ, క్యామ్స్ (సీఏఎంఎస్) కేఆర్ఏ లేదా కార్వీ కేఆర్ఏ ద్వారా తమ కేవైసీ స్థితిని తెలుసుకోవచ్చు. సీవీఎల్కేఆర్ఏ పోర్టల్‌కు వెళ్లి పైన కనిపించే మెనూ ఆప్షన్లలో కేవైసీ ఇంక్వైరీ సెలక్ట్ చేసుకోవాలి.తర్వాత వచ్చే విండోలో పాన్ నంబర్ నమోదు చేయాలి. ఐ యామ్ హ్యూమన్ పక్కన ఉన్న బాక్స్‌లో టిక్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ కేవైసీ స్థితి అక్కడ కనిపిస్తుంది. కేవైసీ వ్యాలిడేటెడ్.. అని ఉంటే తిరిగి కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. దీనర్థం మీరు అప్పటికే సమర్పించిన కేవైసీ ఆధార్ ఆధారితమైనది. మొబైల్, ఈమెయిల్ కూడా వ్యాలిడేట్ అయి ఉన్నట్టు. కనుక అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. మళ్లీ కేవైసీ అవసరం లేదు. కేవైసీ రిజిస్టర్డ్.. అని ఉంటే మీరు గతంలో అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ (ఓవీడీ) ఆధారంగా కేవైసీ చేసినట్టు. అంటే ఆ సమయంలో ఆధార్ ధ్రువీకరణ చేయలేదు. మొబైల్, ఈ మెయిల్ ధ్రువీరణ చేసినట్టు. అప్పటికే పెట్టుబడులు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాటిని వెనక్కి తీసుకోవచ్చు. కానీ, ఇప్పటి వరకు పెట్టుబడులు లేని కొత్త సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉండదు. ఆన్ హోల్డ్.. మొదట సమర్పించిన కేవైసీ ఓవీడీ ఆధారితం కాదని దీనర్థం. లేదంటే ఈ మెయిల్, మొబైల్ నంబర్ మనుగడలో లేవని అర్థం. ఈ స్థితి చూపిస్తుంటే, అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణకు అనుమతి లేదని తెలుసుకోవాలి. వీరు తాజాగా కేవైసీ సమర్పించాలి. రిజెక్టెడ్ ఆన్ హోల్డ్ 10–15 రోజుల పాటు ఉన్న తర్వాత రిజెక్టెడ్గా మారుతుంది. వీరు కూడా అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు నిర్వహించలేరు. అంటే తాజాగా ఇన్వెస్ట్ చేయలేరు. అప్పటికే ఉన్న పెట్టుబడులు వెనక్కి తీసుకోలేరు. తాజాగా కేవైసీ సమర్పించి, వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇక్కడ కేవైసీ వ్యాలిడేటెడ్ అనే స్థితి ఉన్న వారు మినహా మిగిలిన ప్రతి ఒక్కరూ ఆధార్ ఆధారితంగా తాజా కేవైసీ సమర్పించడం మంచిది. ఎన్డీఎంఎల్ కేఆర్ఏ అయితే.. పాన్ నంబర్ నమోదు చేసి, క్యాపెచా కోడ్ తర్వాత సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో మీరు చేయాల్సినది ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎన్డీఎంఎల్ కేఆర్ఏ వద్ద కేవైసీ నమోదు చేయని వారు ఇక్కడ కేవైసీ చేయడానికి వీలు పడదు. అదే సీవీఎల్–కేఆర్ఏలో అయితే మీ వివరాలు సమర్పించిన అనంతరం.. కేవైసీ ఎక్కడ నమోదై ఉన్నది కూడా చూపిస్తుంది.అంటే సీవీఎల్ కేఆర్ఏ/ఎన్డీఎంఎల్ కేఆర్ఏ/డాటెక్స్ కేఆర్ఏ/క్యామ్స్ కేఆర్ఏ/ కార్వీ కేఆర్ఏ వీటిల్లో ఎక్కడ నమోదైతే కేవైసీ స్టేటస్ కాలమ్‌లో అక్కడ వివరాలు కనిపిస్తాయి. మీ కేవైసీ ఎక్కడ నమోదై ఉందన్న విషయం ఇక్కడ తెలుస్తుంది. లేదంటే మీ పెట్టుబడులు కలిగిన ఫండ్ హౌస్ (ఏఎంసీ) పోర్టల్‌కు వెళ్లి కూడా తెలుసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థ లేదా సెబీ నమోదిత ఆర్టీఏ (రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్) హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చు. కేవైసీ అప్డేట్కేవైసీ స్థితి తెలుసుకున్న తర్వాత ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్‌సైట్‌కు అయినా వెళ్లి కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ సంస్థ కార్యాలయానికి నేరుగా వెళ్లి ఫిజికల్ కేవైసీని సమర్పించొచ్చు. ఇలా ఒకసారి కేవైసీ అప్డేట్ అయితే అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల పెట్టుబడుల్లోనూ అదే ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే, సంస్థ పోర్టల్‌కు వెళ్లి తమ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి.ప్రొఫైల్ సెక్షన్లో కేవైసీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ‘రిజిస్టర్డ్’ లేదా ‘ఆన్హోల్డ్’ చూపిస్తుంటే ఎం–ఆధార్ లేదా డిజిలాకర్ ఖాతా నుంచి ఈ–ఆధార్ సమర్పించొచ్చు. దీంతో యూఐడీఏఐ ద్వారా వచ్చే ఓటీపీని సమర్పించిన అనంతరం కేవైసీ వ్యాలిడేట్ అవుతుంది. కేవైసీ రిజిస్టర్డ్ అనే స్థితితో ఉన్న వారు మరో సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే, తాజాగా కేవైసీ సమర్పించేంత వరకు సాధ్యపడదు. అప్పటి వరకు పెట్టుబడులు లేని మరో సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే.. అప్పుడు ఆయా సంస్థ కేవైసీని పరిశీలిస్తుంది. వ్యాలిడేటెడ్ అని ఉంటేనే వారు ఆమోదిస్తారు. రిజిస్టర్డ్ అని ఉంటే మాత్రం కేవైసీ సమర్పించాలి. నేరుగా వెళ్లి ఫిజికల్ కేవైసీ సమర్పించే వారు ఆధార్ కాపీపై క్యూఆర్ కోడ్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. లేకపోతే దాన్ని సిస్టమ్ రీడ్ చేయలేదు. అలాంటప్పుడు అది వ్యాలిడేట్ కాదు. ఎప్పుడో ఆధార్ తీసుకున్న వారి డాక్యుమెంట్‌పై క్యూఆర్ కోడ్ మసకగా మారుతుండడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మరి ఎన్ఆర్ఐల పరిస్థితి?భారతీయులతో పోలిస్తే ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) కేవైసీ అంత సులభం కాదు. ఇతర దేశాల్లో నివసిస్తూ, భారత మొబైల్ నంబర్ కలిగి లేని వారు.. ఆధార్ ఆధారిత ఓటీపీ స్వీకరణ, నమోదు చేయలేరు. దీంతో ఎన్ఆర్ఐల కేవైసీ స్థితి ‘రిజిస్టర్డ్’గానే కొనసాగొచ్చు. దీంతో అప్పటికే పెట్టుబడులు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇకమీదటా పెట్టుబడులను ఎన్ఆర్ఐలు కొనసాగించుకోవచ్చు. ఎన్ఆర్ఐలు భారత్‌లో జారీ అయిన మొబైల్ నంబర్ కలిగి ఉంటే, ఆన్లైన్లో ఆధార్ ఆధారితంగా కేవైసీని సమర్పించి, వ్యాలిడేట్ చేసుకోవచ్చు. లేదంటే వీరు కొత్త సంస్థలో పెట్టుబడులు పెట్టాల్సిన ప్రతి సందర్భంలోనూ అధికారికంగా చెల్లుబాటయ్యే ఇతర డాక్యుమెంట్ల సాయంతో కేవైసీ సమర్పించడమే మార్గం. తిరిగి కేవైసీ.. ఏ డాక్యుమెంట్?అధికారికంగా చెల్లుబాటయ్యే ఏ డాక్యుమెంట్ (ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, ఎంఎన్ఆర్ఈజీఏ కార్డ్) సాయంతో తిరిగి కేవైసీ చేసుకోవచ్చు. కానీ, భవిష్యత్తులో మరోసారి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆధార్ సాయంతో కేవైసీ వ్యాలిడేట్ చేసుకోవడమే అత్యుత్తమం. ఇతర డాక్యుమెంట్‌తో కేవైసీ చేస్తే కనుక, కొత్త మ్యూచువల్ ఫండ్ సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి మళ్లీ కేవైసీ సమర్పించాల్సి వస్తుంది. అదే ఆధార్‌తో చేస్తే ఈ ఇబ్బంది ఉండదు. -
ఎంఎఫ్ ఆస్తులు రూ. 53.4 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) ఆస్తులు గత ఆర్థిక సంవత్సరం(2023–24) లో 35% జంప్ చేశాయి. రూ. 53.4 లక్షల కోట్లను తాకాయి. వార్షికంగా రూ. 14 లక్షల కోట్లమేర ఎగశాయి. ఇందుకు ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, లాభాల పరుగు తీస్తున్న ఈక్విటీ మార్కెట్లు ప్రభావం చూపాయి. వెరసి 2020–21 ఏడాది(41 శాతం వృద్ధి) తదుపరి గరిష్టస్థాయిలో ఎంఎఫ్ ఆస్తులు బలపడినట్లు వార్షిక నివేదికలో ఫండ్స్ దేశీ అసోసియేషన్(యాంఫి) వెల్లడించింది. ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) పురోగతి.. ఫండ్స్ పరిశ్రమలో పెరుగుతున్న ఇన్వెస్టర్లను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా మార్చి చివరికల్లా ఫోలియోల సంఖ్య 17.78 కోట్లను తాకింది. ఇది సరికొత్త రికార్డు కాగా.. ఇన్వెస్టర్ల బేస్ 4.46 కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంఖ్యలో మహిళల వాటా 23 శాతంకావడం గమనార్హం! సిప్ దన్ను క్రమబద్ధ పెట్టుబడుల(సిప్) పథకాలను ఇన్వెస్టర్లు ఆదరిస్తుండటంతో వీటి సంఖ్య బలపడుతోంది. దీంతో నెలవారీ నికర పెట్టుబడులు మార్చిలో రూ. 19,300 కోట్లకు చేరాయి. పూర్తి ఏడాదిలో సిప్ పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్ల నికర పెట్టుబడులు లభించాయి. ఇది ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తిని పట్టిచూపుతోంది. అంతేకాకుండా క్రమశిక్షణతోకూడిన పెట్టుబడులను ప్రతిబింబిస్తోంది. దేశీ ఎంఎఫ్ పరిశ్రమకు గతేడాది మైలురాయివంటిదని యాంఫి నివేదిక పేర్కొంది. ఏయూఎం చెప్పుకోదగ్గవిధంగా రూ. 14 లక్షల కోట్లమేర పెరిగి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 53.4 లక్షల కోట్లకు చేరినట్లు వివరించింది. 2022–23లో ఫండ్స్ ఏయూఎం విలువ రూ. 39.42 లక్షల కోట్లుమాత్రమేనని ప్రస్తావించింది. ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఆధారిత పథకాలు తదితరాలలో ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. పరిశ్రమ ఆస్తుల్లో వీటి వాటా 58 శాతంకాగా.. ఫోలియో సంఖ్యలో 80 శాతాన్ని ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ ఎంఎఫ్‌ల ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో పెరుగుతున్న కుటుంబ మదుపును ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేసింది. ఈక్విటీకే ఓటు గతేడాది పెట్టుబడుల్లో ఈక్విటీ ఆధారిత పథకాలు 55 శాతం వృద్ధిని అందుకుని ఆస్తులలో రూ. 23.5 లక్షల కోట్లకు చేరాయి. ఇందుకు పెట్టుబడులతోపాటు.. మార్క్‌టు మార్కెట్(ఎంటుఎం) లాభాలు సహకరించాయి. అయితే మరోవైపు రుణ పథకాల ఫండ్స్ 7 శాతమే బలపడ్డాయి. ఏయూఎంలో రూ. 12.62 లక్షల కోట్లకు చేరాయి. అయినప్పటికీ అంతక్రితం రెండేళ్లలో ఆస్తులు తగ్గుతూ వచ్చిన అంశంతో పోలిస్తే మెరుగేనని నివేదిక తెలియజేసింది. -
పెట్టుబడులు సిప్ చేస్తున్నారు
న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులపై సానుకూల అంచనాల నేపథ్యంలో క్రమాణుగత పెట్టు బడులు (సిప్) 2023–2024లో రూ. 2 లక్షల కోట్ల రికార్డ్ స్థాయికి చేరాయి. 2022–2023తో పోలిస్తే ఇది 28% అధికం. ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2016–17లో రూ. 43,921 కోట్లుగా ఉన్న సిప్ పెట్టుబడులు 2022–23 నాటికి రూ. 1.56 లక్షల కోట్లకు చేరాయి. ఇవి 2020–21లో రూ. 96,080 కోట్లుగా, 2021–22లో రూ. 1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. మరోవైపు, గతేడాది మార్చి నెలలో సిప్ల రూపంలో రూ. 14,276 కోట్లు రాగా ఈ ఏడాది మార్చిలో 35 శాతం వృద్ధి చెంది ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 19,270 కోట్లు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చిలో వరుసగా రెండు నెలల పాటు సిప్ పెట్టుబడులు రూ. 19,000 కోట్ల మార్కును దాటాయి. -
స్మాల్, మిడ్‌క్యాప్‌పై సెబీ అలర్ట్
న్యూఢిల్లీ: స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ విలువలు గణనీయంగా పెరిగిన సమయంలో మదుపరుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సెబీ కీలక సూచనలు చేసింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారి రక్షణ దృష్ట్యా తగిన కార్యాచరణను/విధానాలను అమల్లో పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది. ఈ విభాగాల్లోకి వచ్చే తాజా పెట్టుబడులపై ఆంక్షలు, పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్ తదితర చర్యలను పరిశీలించాలని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) తన సభ్యులను కోరింది. సెబీ తరఫున యాంఫి ఈ సూచనలు చేసింది. నిజానికి గడిచిన ఏడాది కాలానికి పైగా స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో పెద్దగా దిద్దుబాటు రాలేదు. 2023లో మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.22,913 కోట్లు రాగా, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.41,305 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంత భారీగా పెట్టుబడులు వస్తుండడం, స్టాక్స్ విలువలను మరింత పైకి తీసుకెళుతోంది. ఈ తరుణంలో సెబీ ఫండ్స్ సంస్థలను అప్రమత్తం చేయడం గమనార్హం. 21 రోజుల్లోగా నూతన విధానాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ వెబ్సైట్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్త.. ప్రతి నెలా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.వేలాది కోట్లు వస్తుంటే, వాటిని ఫండ్ మేనేజర్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల స్టాక్స్ విలువలు మరింత పెరిగిపోతాయి. ఈ ర్యాలీని చూసి ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ, దిద్దుబాటు మొదలైందంటే, దీనికి విరుద్ధంగా అమ్మకాల ఒత్తిడికి స్టాక్స్ విలువలు దారుణంగా పడిపోయే రిస్క్ ఉంటుంది. దీన్ని నివారించేందుకు, పెట్టుబడుల రాకను క్రమబద్దీకరించేందుకు సెబీ ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కోటక్ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా, ఎస్బీఐ, టాటా మ్యూచువల్ ఫండ్ సంస్థలు స్మాల్‌క్యాప్ పథకాలకు సంబంధించి లంప్సమ్ (ఏక మొత్తం/ఒకే విడత) పెట్టుబడులను అనుమతించడం లేదు. సిప్ పెట్టుబడిపైనా కొన్ని సంస్థలు పరిమితులు అమలు చేస్తున్నాయి. -
ఎస్బీఐ కొత్త ఫండ్‌కు కోట్లలో నిధులు
ముంబై: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఓ నూతన పథకం ద్వారా భారీగా నిధులు సమీకరించింది. ఎస్బీఐ ఎనర్జీ అపార్చునిటీస్ ఫండ్ పట్ల ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహం చూపించారు. రూ.5,000 కోట్ల సమీకరణను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అంచనా వేయగా, దీన్ని అధిగమించి రూ.6,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అన్ని రకాల పంపిణీ ఛానళ్ల ద్వారా విస్తృతమైన స్పందన వచ్చిందని, దరఖాస్తులు 5 లక్షలు దాటాయని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. పెద్ద సంఖ్యలో కొత్త ఇన్వెస్టర్లు ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)లో పాల్గొనడం చూస్తుంటే అది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని పేర్కొంది. ఎనర్జీ ధీమ్ (ఇంధన రంగం) పట్ల ఇన్వెస్టర్లు నమ్మకానికి నిదర్శనమని తెలిపింది. ఇంధనం, దాని అనుబంధ రంగాల్లో పనిచేసే కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ, డెరివేటివ్స్, డెట్ సెక్యూరిటీలలోనూ పెట్టుబడులు పెడుతుంది. రాజ్ గాం«దీ, ప్రదీప్ కేశవాన్ ఫండ్ మేనేజర్లుగా పనిచేయనున్నారు. -
డైరెక్ట్ ప్లాన్లలో ఎస్‌డబ్ల్యూపీ, ఎస్టీపీ ఎలా..?
డైరెక్ట్ ప్లాన్లలో నేను ఇన్వెస్ట్ చేస్తే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)లను ఏర్పాటు చేసుకునే సేవలను ఫండ్ సంస్థ అందిస్తుందా? – విజయ్ కుమామ్ డైరెక్ట్ ప్లాన్లు అనేవి ఇన్వెస్టర్లు స్వయంగా నిర్వహించుకునేవి. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి పెట్టుబడులు, ఇతర లావాదేవీలను ఇన్వెస్టర్ రెండు మూడు మార్గాల్లో నిర్వహించుకోవచ్చు. సిప్ లేదా ఎస్‌డబ్ల్యూపీ లేదా మరే ఇతర లావాదేవీ అయినా బ్రిక్స్ అండ్ మోర్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి చేసుకోవాలి. అంటే ఫండ్ హౌస్ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు అయిన కేఫిన్‌టెక్, క్యామ్స్ ద్వారా ఈ లావాదేవీలు చేసుకోవచ్చు. సమీపంలోని ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్‌కు స్వయంగా వెళ్లి సిప్ లేదా ఎస్‌డబ్ల్యూపీ లేదా ఎస్టీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫండ్ హౌస్ వెబ్సైట్ నుంచి కూడా చేసుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌లు సైతం డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ సదుపాయాల ద్వారా ఇన్వెస్టర్లు సొంతంగా ఈ లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది. ఫండ్ హౌస్ సంస్థ నేరుగా సాయం అందించదు. నేను కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ యుటిలిటీస్ అనే ప్లాట్‌ఫామ్‌ను ఇందుకోసం వినియోగిస్తున్నాను. ఇది ఎంతో సౌకర్యంగా ఉండడమే కాకుండా, మ్యూచువల్ ఫండ్స్‌లో లావాదేవీలను ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ తెలిసిన అందరికీ ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణ సౌకర్యంగానే ఉంటుంది. కాకపోతే మొదట కేవైసీ, ఇతర అవసరాలను ఇచ్చే సమయంలో కొంచెం ఇబ్బంది అనిపించొచ్చు. వీటిని సైతం ఇంటి నుంచే చేసుకునే సౌలభ్యం ఉంది. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి సేవలను ఇన్వెస్టర్లు సులభంగా ఆన్లైన్ ద్వారా పొందొచ్చు. నేను ఎన్పీఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా వయసు 54 ఏళ్లు. ఈక్విటీలకు 50 శాతం, ప్రభుత్వం బాండ్లకు 25 శాతం, కార్పొరేట్ బాండ్లకు 25 శాతం చొప్పున నా పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నా ప్రభుత్వ బాండ్ల పెట్టుబడులను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుని.. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులను 40 శాతానికి పెంచుకోవడం సరైనదేనా..? – మనోరంజన్ గిల్ట్ ఫండ్స్ లేదా ప్రభుత్వ బాండ్లలో అస్థిరతలు.. షార్ట్ డ్యూరేషన్ లేదా కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌తో పోలిస్తే సహజంగా ఎక్కువే. ఎందుకంటే గిల్ట్ ఫండ్స్ అన్నవి ప్రధానంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి వడ్డీ రేట్ల మార్పులకు ఎక్కువ ప్రభావితమవుతూ ఉంటాయి. అదే సమయంలో కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో క్రెడిట్ రిస్క్ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. స్వల్పకాలంలో ప్రభుత్వ బాండ్లు మరింత అస్థిరతలను ఎదుర్కొంటాయి. దీర్ఘకాలంలో ఇవి కనుమరుగు అవుతాయి. మూడు, ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మాదిరే గిల్ట్ ఫండ్స్ కూడా రాబడులు ఇచ్చాయి. ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో మీ పెట్టుబడులు 60 ఏళ్ల వరకు లాకిన్ అయి ఉంటాయి. అంటే మరో ఆరేళ్ల సమయం మీకు మిగిలి ఉంది. మీరు డెట్‌కు కేటాయించిన మొత్తంలో సగాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టినా.. అవి మొత్తం పెట్టుబడుల్లో 25 శాతమే. వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకోవాలని అనుకుంటే.. తర్వాత ఏదో ఒక సమయంలో మళ్లీ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల పెట్టుబడుల విషయంలో యాక్టివ్‌గా పనిచేయాల్సి రావచ్చు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నారు. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవడం అంటే రిస్క్ కొంచెం తీసుకున్నట్టే అవుతుంది. కనుక మీ పెట్టుబడులను యథాతథంగా కొనసాగించుకోవచ్చు. -
డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: కీలక వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ హోల్డింగ్స్‌ను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జరిమానా, వడ్డీ, రికవరీ వ్యయాలతో కలిపి మొత్తం రూ. 22 లక్షలు రాబట్టేందుకు ఈ మేరకు ఆదేశాలిచి్చంది. వివరాల్లోకి వెడితే..డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌లో డీహెచ్ఎఫ్ఎల్కి గల వాటాలను అనుబంధ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ ఇన్వెస్ట్మెంట్స్కి గతంలో బదలాయించారు. అప్పట్లో డీహెచ్ఎఫ్ఎల్కి (ప్రస్తుతం పిరమల్ ఫైనాన్స్) సీఎండీగా కపిల్ వాధ్వాన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ ఉన్నారు. షేర్ల బదలాయింపునకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ నోటీసులో పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి వారిద్దరూ బాధ్యులని సెబీ తన విచారణలో తేలి్చంది. 2023 జూలైలో చెరి రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు ఇచ్చింది. కానీ దాన్ని చెల్లించడంలో వారు విఫలం కావడంతో తాజాగా రెండు వేర్వేరు అటాచ్మెంట్ నోటీసులు ఇచి్చంది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలకు అనుమతించరాదని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యుచువల్ ఫండ్స్‌కి సూచించింది. వాధ్వాన్లు తమ బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల్లోని నిదులను మళ్లించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నామని, అలా జరిగితే జరిమానాను రాబట్టడం కుదరదనే ఉద్దేశంతో ఈ నోటీసులు ఇస్తున్నట్లు సెబీ తెలిపింది. -
హైబ్రిడ్ ఫండ్స్‌కు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు గత నెలలో భారీ డిమాండ్ నెలకొంది. దీంతో 2024 జనవరిలో పెట్టుబడులు 37 శాతం జంప్ చేశాయి. రూ. 20,634 కోట్లను తాకాయి. డెట్ ఫండ్స్‌పై పన్ను చట్టాలలో మార్పులరీత్యా ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశంగా నిలుస్తుండటంతో ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24) తొలి 10 నెలల్లో(ఏప్రిల్–జనవరి) హైబ్రిడ్ ఫండ్స్‌లో మొత్తం పెట్టుబడులు రూ. 1.21 లక్షల కోట్లకు చేరాయి. అయితే గతేడాది(2022–23) హైబ్రిడ్ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు వెనక్కి మళ్లిన సంగతి తెలిసిందే. హైబ్రిడ్ ఫండ్స్ అంటే హైబ్రిడ్ ఫండ్స్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్ పథకాలు సాధారణంగా ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్ని సందర్భాలలో బంగారం తదితర ఆస్తులలోనూ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తుంటాయి. కాగా.. 2023 ఏప్రిల్ నుంచి హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడిదారులను తమవైపు తిప్పుకున్నాయి. ఇందుకు ప్రధానంగా ఏప్రిల్ నుంచి డెట్ ఫండ్స్ పన్ను చట్టాలలో నెలకొన్న సవరణలు ప్రభావం చూపుతున్నాయి. అంతక్రితం మార్చితో ముగిసిన ఏడాదిలో రూ. 12,372 కోట్ల పెట్టుబడులు తరలిపోవడం గమనార్హం! మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) తాజా గణాంకాల ప్రకారం జనవరిలో హైబ్రిడ్ పథకాలు రూ. 20,637 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు డిసెంబర్లో లభించిన రూ. 15,009 కోట్లతో పోలిస్తే భారీగా ఎగశాయి. ప్రధానంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌కు అత్యధిక పెట్టుబడులు ప్రవహించాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు రూ. 10,608 కోట్లు లభించగా.. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌కు రూ. 7,080 కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. గత ఆరు నెలల్లోనూ ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు 50–70 శాతాన్ని కేటాయించారు. ఇందుకు పన్ను మార్గదర్శకాలలో మార్పులు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆర్బిట్రేజ్ ఫండ్స్ స్ప్రెడ్ సుమారు 8 శాతానికి చేరడం పెట్టుబడి అవకాశాలకు దారి చూపుతున్నట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ వెల్లడించారు. ఫోలియోలు ప్లస్ జనవరిలో హైబ్రిడ్ ఫోలియోలు 3.36 లక్షలు కొత్త గా జత కలిశాయి. దీంతో మొత్తం హైబ్రిడ్ ఫోలియోల సంఖ్య 1.31 కోట్లకు చేరింది. వెరసి మొత్తం 16.95 కోట్ల ఫోలియోలలో వీటి వాటా 7.7 శాతా న్ని తాకింది. తక్కువ రిస్క్ భరించే ఇన్వెస్టర్లకు హై బ్రిడ్ ఫండ్స్ ఉపయుక్తంగా ఉంటాయి. ఈక్విటీ మా ర్కెట్లలో పెట్టుబడులు ఆటుపోట్లకు లోనయ్యే సంగతి తెలిసిందే. అయితే ఫిక్స్డ్ ఆదాయంలో లభించే స్థిరత్వాన్ని ఇవి కల్పిస్తుండటంతో పెట్టుబడు లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ ఆదా యం మార్గాలలో ఇన్వెస్ట్ చేయదలచినవారు హైబ్రి డ్ ఫండ్స్వైపు చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
దీర్ఘకాలంలో నమ్మకమైన లాభాలనిచ్చే ఫండ్.. ఓ లుక్కేయండి..
లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ వేల్యుయేషన్లను అర్థం చేసుకోవడం సాధారణ ఇన్వెస్టర్లకు కష్టమైన విషయమే. భవిష్యత్తులో వీటిల్లో ఏ విభాగం, మిగిలిన విభాగాలతో పోలిస్తే మంచి పనితీరు చూపిస్తుందని ముందుగా గుర్తించడం కూడా కష్టమే. గత 15 ఏళ్ల కాలంలో లార్జ్‌క్యాప్ ఇండెక్స్ నాలుగేళ్ల కాలంలో మంచి పనితీరు చూపించగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా నాలుగు సంవత్సరాలలో మంచి పనితీరు ప్రదర్శించింది. కానీ, స్మాల్‌క్యాప్ మాత్రం ఏడేళ్లలో మంచి పనితీరు చూపించింది. కనుక ప్రతీ విభాగంలోనూ ఇన్వెస్టర్ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రాబడులు ఆర్జించడానికి మంచి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇలా లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టి మంచి రాబడులు ఇచ్చేవే ఫ్లెక్సీక్యాప్, మలీ్టక్యాప్ ఫండ్స్. ఈ విభాగంలో ఎంతో కాలంగా పనిచేస్తూ, మంచి పనితీరు చూపుతున్న పథకాల్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. రాబడులు ఈ పథకం ఏ కాలంలో చూసినా కానీ, బెంచ్ మార్క్ అయిన బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. గడిచిన ఏడాది కాలంలో 37.58 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. మూడేళ్లలో కాలంలో వార్షిక రాబడి 24.27 శాతంగా ఉంది. ఇక ఐదేళ్ల కాలంలో 19.40 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 17.13 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో భాగంగా ఉంది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చి చూస్తే, ఈ పథకమే 3 శాతం నుంచి 8 శాతం మేర అధిక రాబడిని వివిధ కాలాల్లో అందించినట్టు తెలుస్తోంది. ఇక బీఎస్ఈ 500 టీఆర్ఐతో చూసినా కానీ, ఈ పథకంలోనే 1–6 శాతం మేర వివిధ కాలాల్లో అధిక రాబడి కనిపిస్తుంది. ఈ పథకం 1995 జనవరి 1న ప్రారంభమైంది. గతంలో హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్ కాగా, అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది. ఆరంభం నుంచి వార్షిక రాబడి 19 శాతం మేర ఉండడం గమనించొచ్చు. పెట్టుబడుల విధానం/ఫోర్ట్‌ఫోలియో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌కు దేశ ఈక్విటీ మార్కెట్లో సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉండడం గమనార్హం. తొలుత రూ.52 కోట్లతో ఆరంభమైన ఈ పథకంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది జనవరి చివరికి రూ.47,642 కోట్లుగా ఉన్నాయి. ప్రతి మార్కెట్ సైకిల్లో మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న రంగాలు, కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ప్రస్తుతం ఈ పథకం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 87.5 శాతమే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. డెట్ సాధనాల్లో 0.42 శాతం పెట్టుబడులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 3.79 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. నగదు, నగదు సమానాల రూపంలో 8.29 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీల్లో 91 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 7.61 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.52 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో 41 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 32 శాతం పెట్టుబడులు పెట్టింది. హెల్త్‌కేర్ కంపెనీలకు 12.59 శాతం, టెక్నాల జీ కంపెనీలకు 9.5 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 7.39 శాతం చొప్పున కేటాయించింది. -
కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇవి తెలుసుకుంటే తిరుగుండదు!
Index funds: సులువుగా అర్థమయ్యేలా ఉంటూ, పెట్టుబడులను సులభతరం చేసే చక్కని వ్యూహంగా ఇండెక్స్ ఫండ్స్ ఉపయోగపడతాయి. వాటిపై అవగాహన కల్పించేదే ఈ కథనం. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటి? నిర్దిష్ట ప్రామాణిక సూచీని ట్రాక్ చేసే ఒక తరహా మ్యుచువల్ ఫండ్స్‌ను ( mutual fund ) ఇండెక్స్ ఫండ్స్ అంటారు. నిఫ్టీ 50, సెన్సెక్స్ వంటి విస్తృత సూచీలను లేదా నిర్దిష్ట రంగానికి చెందిన నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ వంటి సూచీలను ట్రాక్ చేసేలా ఇవి ఉండొచ్చు. సదరు సూచీలోని కంపెనీల షేర్లను, అదే వెయిటేజీతో ఈ ఫండ్స్ ద్వారా కొనుగోలు చేస్తారు. స్టాక్ మార్కెట్లో వివిధ విభాగాలకు చెందిన కొన్ని కీలక స్టాక్స్ సమూహాన్ని ఇండెక్స్‌గా వ్యవహరిస్తారు. మొత్తంగా స్టాక్ మార్కెట్ పనితీరును ఇది ప్రతిబింబిస్తుంది. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఏమిటి? ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వీటిలో ఉంటాయి. ఇవి రెండూ కూడా నిర్దిష్ట సూచీని ట్రాక్ చేసేవే అయినా వీటి పని తీరులో మార్పులు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే పని చేస్తాయి. రోజు ముగిసే నాటి ఎన్ఏవీ ప్రకారం వీటి యూనిట్లను ఏఎంసీల్లో కొనుగోలు చేయొచ్చు, విక్రయించవచ్చు. ఇక ఈటీఎఫ్‌లు పేరుకు తగ్గట్లే స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి, షేర్ల తరహాలోనే ట్రేడ్ అవుతుంటాయి. ఏఎంసీ ప్రస్తావన లేకుండా ఇన్వెస్టర్లు వీటిని నేరుగా ఎక్సే్చంజ్ నుంచే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ప్రయోజనాలు ఏమిటి? సులభంగా అర్థం చేసుకోగలిగే వ్యూహం. వ్యక్తిగతంగా ఏ ఒక్క స్టాక్ పైనో పక్షపాతం చూపించే పరిస్థితి లేకుండా ముందుగానే నిర్దేశిత నిబంధనల ప్రకారం స్టాక్స్ ఎంపిక ఉంటుంది. మార్కెట్‌ను బట్టి పని చేస్తుంది. పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఫండ్ మేనేజర్ క్రియాశీలకంగా ఉండరు కాబట్టి సాధారణంగా యాక్టివ్ మ్యుచువల్ ఫండ్‌తో పోలిస్తే వ్యయాల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. వ్యయాలు తక్కువ ఎందుకంటే? ముందే చెప్పుకున్నట్లు ఇండెక్స్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజరు ప్రత్యేకంగా స్టాక్స్ ఎంపిక చేయడం లేదా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన పని ఉండదు. కాబట్టి పరిశోధనలపరమైన వ్యయాలూ ఉండవు. పైగా యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే పోర్ట్‌ఫోలియోలో మార్పులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చులు తగ్గుతాయి. అందుకే వీటి వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఎవరికి అనువైనవి? సులభతరమైన, సమర్ధమంతమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఫండ్స్ ఎవరికైనా అనువైనవే. సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి కొత్త ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించవచ్చు. ఇక అనుభవమున్న ఇన్వెస్టర్లు వివిధ మార్కెట్ క్యాప్వ్వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసేందుకు, నిర్దిష్ట ఇండెక్స్ వ్యూహాలను అమలు చేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ట్రాకింగ్ వ్యత్యాసాలు అంటే? బెంచ్ మార్క్, ఫండ్‌కి సంబంధించి పనితీరు అలాగే రాబడుల్లో వ్యత్యాసాలను ట్రాకింగ్ ఎర్రర్‌గా వ్యవహరిస్తారు. ఇది ఫండ్ పనితీరు సమర్ధతను సూచిస్తుంది. ఇక, ఫీజులు, ఖర్చులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల బెంచ్‌మార్క్‌తో పోలిస్తే ఫండ్ అందించే రాబడులు కొంత భిన్నంగా ఉంటాయి. ఇండెక్స్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏఎంసీకి (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ) ఆన్లైన్లో లేదా ఫిజికల్‌గా దరఖాస్తు చేసుకోవడం ద్వారా సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. తమ డిస్ట్రిబ్యూటర్ లేదా రిలేషన్షిప్ మేనేజర్‌ను సంప్రదించడం ద్వారా కూడా చేయొచ్చు. అలాగే లేటెస్ట్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా చేసేందుకు వీలుంది. ఏమేమి రిస్కులు ఉంటాయి? సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహా రిస్కులన్నీ ఇండెక్స్ ఫండ్స్‌కి కూడా ఉంటాయి. వాటికి అదనంగా ట్రాకింగ్ ఎర్రర్, ట్రాకింగ్ డిఫరెన్స్, సూచీ ఆధారిత రిస్కులు, నిర్వహణపరమైన రిస్కులు మొదలైనవి ఉంటాయి. పథకానికి సంబంధించిన రిస్కులను గురించి తెలుసుకునేందుకు స్కీమ్ సమాచారపత్రాన్ని ముందుగానే క్షుణ్నంగా చదువుకోవాలి. ఇండెక్స్ ఫండ్స్‌పై పన్ను విధానం ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాస్‌ని బట్టి ఇండెక్స్ ఫండ్స్‌పై పన్నులు వర్తిస్తాయి. ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్‌కి ఈక్విటీ ట్యాక్సేషన్, అలాగే డెట్ ఇండెక్స్ ఫండ్స్‌కి డెట్ ట్యాక్సేషన్ విధానం ఆధారంగా పన్నులు ఉంటాయి. ఏదైనా సరే, ఇన్వెస్ట్ చేసే ముందుగానే స్కీమ్ వివరాలతో కూడిన డాక్యుమెంటును క్షుణ్నంగా చదువుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. - సమాధానాలు - నీరజ్ సక్సేనా ఫండ్ మేనేజర్, బరోడా బీఎన్పీ పారిబాస్ -
గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు ఇన్వెస్టర్ల నుంచి చక్కని ఆదరణ లభించింది. 2023లో ఇన్వెస్టర్లు రూ.2,920 కోట్లను ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేశారు. 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే గతేడాది ఆరు రెట్లు పెరుగుదల కనిపిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల పెరుగుదల, అనిశి్చతుల నేపథ్యంలో సురక్షిత సాధనమైన బంగారం వైపు ఎక్కువ మంది మొగ్గు చూపించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రూ.459 కోట్లు రాగా, 2023లో రూ.2,920 కోట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా గతేడాది ఆగస్ట్ నెలలోనే రూ.1,028 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. 16 నెలల్లోనే ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ‘‘భౌతిక బంగారం పట్ల భారతీయుల్లో మక్కువ వందల సంవత్సరాల నుంచి ఉంది. దాంతో గోల్డ్ ఈటీఎఫ్‌లు మాదిరి పెట్టుబడి సాధనాలకు ఆమోదం తక్కువగా ఉండేది. కానీ, గడిచిన కొన్నేళ్లలో బంగారం డిజిటైజేషన్ పట్ల ఇన్వెస్టర్లు మళ్లుతున్నారు. సులభంగా ఇన్వెస్ట్ చేయడం, సౌకర్యంగా వెనక్కి తీసుకునే వెసులుబాటు గోల్డ్ ఈటీఎఫ్‌ను ఆమోదించడానికి కారణం. ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో బంగారం తప్పకుండా ఉండాలి’’అని జెరోదా ఫండ్ హౌస్ సీఈవో విషాల్ జైన్ పేర్కొన్నారు. నిర్వహణ ఆస్తులు పైపైకి బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది 27 శాతం పెరిగి రూ.27,336 కోట్లకు చేరింది. 2022 డిసెంబర్ నాటికి ఈ మొత్తం రూ.21,445 కోట్లుగానే ఉండడం గమనించాలి. గత కొన్నేళ్లలో బంగారం అద్భుతమైన పనితీరు చూపించడాన్ని కూడా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాలి. ఇదే ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రేరణగా నిలిచింది. గతేడాది గోల్డ్ ఈటీఎఫ్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 2.73 లక్షలు అధికంగా ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం ఫోలియోలు 49.11 లక్షలకు చేరాయి. 2023 మాత్రమే కాకుండా, 2020, 2021లోనూ బంగారం ఈటీఎఫ్‌లు మంచి రాబడులను ఇచ్చాయి. 2021లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.4,814 కోట్లు, 2020లో రూ.6,657 కోట్ల చొప్పున పెట్టుబడులు వచి్చనట్టు యాంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో బంగారం వ్యూహాత్మక సాధనంగా నిలుస్తుంది. చక్కని వైవిధ్యాన్ని ఇవ్వడంతోపాటు, ఆర్థిక పతనాలు, కఠిన మార్కెట్ పరిస్థితుల్లో నష్టాలను తగ్గిస్తుంది. అందుకే దీనికి సురక్షిత సాధనంగా గుర్తింపు ఉంది’’అని మారి్నంగ్‌స్టార్ ఇండియా రిసెర్చ్ విభాగం చీఫ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. గతేడాది ఈక్విటీ మార్కెట్ల దిద్దుబాటు, ఆకర్షణీయమైన అవకాశాల నేపథ్యంలో ఏకంగా రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులు స్టాక్స్‌ను వెతుక్కుంటూ వెళ్లాయి. అయినా కానీ, బంగారం ఈటీఎఫ్‌లు చెప్పుకోతగ్గ పెట్టుబడులను ఆకర్షించాయి. ఒక ఈటీఎఫ్ ఒక గ్రాము బంగారానికి సమానంగా స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవుతుంటుంది. షేర్ల మాదిరే సులభంగా కొనుగోలు చేసి విక్రయించుకోవచ్చు. -
రూ. 50 లక్షల కోట్లకు ఫండ్స్ ఆస్తులు
న్యూఢిల్లీ: దేశ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సరికొత్త మైలురాయికి చేరుకుంది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు 2023 డిసెంబర్ ముగింపునకు రూ.50 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించాయి. గతేడాది మొత్తం మీద ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 27 శాతం (రూ.10.9 లక్షల కోట్లు) వృద్ధి చెంది రూ.50.77 లక్షల కోట్లకు చేరాయి. 2022లో కేవలం 5.7 శాతం మేర (రూ.2.65 లక్షల కోట్లు) ఫండ్స్ ఏయూఎం పెరిగింది. 2021 చివరికి ఫండ్స్ ఏయూఎం రూ.37.72 లక్షల కోట్లుగా ఉంటే, 2022 చివరికి రూ.39.88 లక్షల కోట్లకు చేరింది. గతేడాది మెరుగైన పనితీరుకు.. ఈక్విటీ మార్కెట్లలో ఆశావహ ధోరణి, మ్యూచువల్ ఫండ్స్ పట్ల పెరుగుతున్న అవగాహన, బలమైన ఆర్థిక మూలాలు, ఫండ్స్ పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ, ఇవన్నీ అనుకూలించాయి. గత డిసెంబర్లో ఫండ్స్ ఏయూఎం (అన్ని విభాగాలు కలిపి) 3.53 శాతం పెరిగింది. వరుసగా 11వ ఏడాదీ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు పెరిగాయి. గతేడాది రూ.1.61 లక్షల కోట్లు ఈక్విటీ పథకాల్లోకి రాగా, హైబ్రిడ్ పథకాలు రూ.87,000 కోట్లను ఆకర్షించాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొదటి రూ.10 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు సమకూర్చుకోవడానికి 50 ఏళ్లు పట్టింది. రూ.40 లక్షల కోట్ల నుంచి రూ.50 లక్షల కోట్లకు చేరుకోవడం ఏడాదిలోనే సాధ్యపడింది’’అని యాంఫీ సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. ఈక్విటీ పథకాలకు దన్ను.. 2023 డిసెంబర్లో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.16,997 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్ నెలలో వచ్చిన రూ.15,536 కోట్లతో పోల్చి చూస్తే 9.40 శాతం వృద్ధి కనిపించింది. ► సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా నెలవారీగా వచ్చే పెట్టుబడులు నూతన గరిష్టాలకు చేరాయి. డిసెంబర్లో రూ.17,610 కోట్లు సిప్ ద్వారా వచ్చాయి. ► డిసెంబర్లో థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్ వెలుగులో నిలిచాయి. ఈ విభాగమే అత్యధికంగా రూ.6,005 కోట్లను ఆకర్షించింది. నవంబర్‌లో ఇదే విభాగంలోకి వచి్చన పెట్టుబడులు రూ.1,965 కోట్లుగానే ఉన్నాయి. ► వీటి తర్వాత స్మాల్‌క్యాప్ పథకాలు అత్యధికంగా రూ.3,865 కోట్లను రాబట్టాయి. ► లార్జ్, మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.2,339 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.1,852 కోట్లు ఆకర్షించాయి. -
ట్రెండ్ మార్చిన వర్కింగ్ ఉమెన్స్.. బంగారంపై తగ్గిన ఇంట్రెస్ట్
బంగారమంటే ఇష్టపడని స్త్రీలు దాదాపు ఉండరనేది వాస్తవం.. అయితే టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో వర్కింగ్ ఉమెన్స్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో చాలామంది తమ సంపాదనను గోల్డ్ కొనడం కంటే కూడా మంచి లాభాలను అందించే రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 23 నుంచి 45 సంవత్సరాల మహిళలలో 40 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి, మరో 40% మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి సుముఖత చూపుతున్నారని బ్యాంక్ బజార్ ఆస్పిరేషన్ ఇండెక్స్ అధ్యయనంలో వెల్లడించింది. కొందరు మహిళలు బంగారం కొనడం వంటివి పక్కన పెట్టి రియల్ ఎస్టేట్‌లో కూడా ఇన్వెస్ట్ చేసి తమ పోర్ట్‌ఫోలియోలను విస్తరించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. వర్కింగ్ ఉమెన్స్ ఆర్థిక రంగంలో మంచి అవగాహన పొందుతున్నారని, ఎప్పటికప్పుడు కొత్త పెట్టుబడులను గురించి ఆరా తీస్తూనే ఉన్నారని స్పష్టమవుతోంది. నిజానికి బంగారంలో పెట్టె పెట్టుబడి కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మరింత లాభాలను అందిస్తాయని, అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఆర్థిక అవసరాలకు అండగా నిలుస్తాయి. ఇదీ చదవండి: ఇంకా తగ్గిపోయిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే? మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో 5 నుంచి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టినప్పుడు 12 నుంచి 15 శాతం పొటెన్షియల్ రిటర్న్స్ లభిస్తాయి. అయితే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, తప్పకుండా వాటిని గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. -
కొత్త బిజినెస్‌లోకి అంబానీ.. రూ.1200 కోట్ల పెట్టుబడి!
భారతదేశంలోని సంపన్నుల జాబితాలో అగ్రగణ్యుడుగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మ్యూచువల్ ఫండ్ రంగంలోకి ప్రవేశిస్తారంటూ కొన్ని వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్లాక్‌రాక్ భాగస్వామ్యంతో మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అప్లికేషన్ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాయింట్ వెంచర్ మార్కెట్ కలిగి ఉంది. తాజాగా ఈ రెండు సంస్థలు కలిసి మ్యూచువల్ ఫండ్ విభాగంలో ప్రవేశించడానికి 50:50 ప్రాతిపదికన ఒక్కొక్కరు 150 మిలియన్ డాలర్లు (రూ. 12,48,63,52,500) పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుపై కొత్త సబ్సిడీ.. మహిళలకు అదనపు రాయితీ! జియో, బ్లాక్‌రాక్ రెండూ కలిసి భారతదేశంలో పెట్టుబడిదారులకు సరసమైన, వినూత్న పెట్టుబడి పరిష్కారాలను అందించే దిశగా అడుగేస్తున్నట్లు రిలయన్స్ గ్రూప్ వెల్లడించింది. మ్యూచువల్ ఫండ్స్ విభాగం జోరుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో జియో ఫైనాన్షియల్ దీనిపై ద్రుష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. -
కోటీశ్వరులు కావాలనుందా..?
దేశీయ స్టాక్‌మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. దాంతో చాలా మంది మదుపరుల సంపద ఎన్నోరెట్లు పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లో నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేసేవారి కంటే కొంత సేఫ్‌గా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే చిన్న మొత్తాల పొదుపుతో కోటీశ్వరులుగా మారే అసలైన ఫార్ములాను ఈ కథనంలో తెలుసుకుందాం. భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా సంపద రెట్టింపు కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీ(క్రమానుగత పెట్టుబడులు)లను ఎంచుకుంటారు. పైగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారు దీని నుంచి మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహించటం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మంచి వెల్త్ సృష్టించవచ్చు. మ్యూచువల్‌ఫండ్‌లో చాలా మంది పెట్టుబడులు పెడుతూంటారు. తోచినంత మదుపుచేస్తూ దీర్ఘకాల కోరికల కోసం కష్టపడుతుంటారు. అందులో ఒకొక్కరి ఆసక్తులు ఒక్కోలా ఉంటాయి. అయితే కోటి రూపాయల టార్గెట్ అందుకోవటానికి మాత్రం ఒక నియమాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే 15*15*15 స్ట్రాటజీ. దీనికి అర్థం..నెలకు రూ.15,000 చొప్పున.. 15 ఏళ్ల పాటు.. 15 శాతం రాబడి అందించే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులుగా మారవచ్చు. ఇందులో దాగిఉన్న కాంపౌండింగ్ ఫార్మాలాతో కార్పస్ జనరేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారేందుకు రోజుకు రూ.500 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడితే సరిపోతుందన్న మాట. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా 15 ఏళ్లపాటు కొనసాగించే పెట్టుబడిపై 15 శాతం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే రూ.75 లక్షలు అవుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ పెట్టుబడి రూపంలో మెుత్తంగా రూ.27 లక్షలు పెడతారు. దాంతో మొత్తం 15 ఏళ్ల తర్వాత రాబడి రూ.1.02 కోట్లకు చేరుకుంటుంది. -
రూ.1000ల పెట్టుబడితో రూ.34.9 లక్షలు లాభం!
డబ్బును డబ్బే సంపాదిస్తుంది. అందుకే మన జేబులో డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు రకరకాలుగా పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతుంటాం. పెట్టుబడులు పెట్టేందుకు ఇళ్లు, బాండ్స్, బంగారం, స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడి సాధానాలు ఉన్నాయి. అయితే ఈ పద్దతుల్లో డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టాలంటే మన వద్ద భారీ మొత్తంలో డబ్బులు ఉండాలి. అలా కాకుండా రోజు వారి దిన సరి కూలీల్ని సైతం లక్షాది కారుల్ని చేసే పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మీరు ఎంచుకున్న పద్దతిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ తరహాలో ఇది బ్యాంక్‌లో రికరింగ్ డిపాజిట్ మాదిరిగానే పనిచేస్తుంది. అంటే 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు ఎంపిక చేసుకుని అందులో నెలకు కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. దానిపై అసలు, ప్లస్ వడ్డీని టెన్యూర్ ముగిసే సమయానికి పొందవచ్చు. నెలకు రూ.1000 చొప్పున అలాంటిదే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లోని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో ఉదాహరణకు రాము అనే దినసరి కూలి నెలకు రూ.1000 చొప్పున 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టినట్లైతే ఏడాదికి 12 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. ఫలితంగా అసలు పెట్టుబడి రూ.3.6 లక్షలైతే.. నిర్ణీత గడువు ముగిసే సమాయానికి వచ్చేది రూ.34.9లక్షలు. రూ.1000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది ఒకవేళ అదే రాము 20 సంవత్సరాలు పాటు నెలకు రూ.1000 పెట్టుబడిగా పెడితే ఆ మొత్తం రూ. 2,40,000 అవుతుంది. గడువు ముగిసే సమయానికి వచ్చే మొత్తం రూ. 9.89 లక్షలు. అదే 10ఏళ్ల పాటు నెలకు రూ. 1,000 చొప్పున పెట్టుబడి పెడితే మొత్తం రూ.1,20,000 అవుతుంది. ఆ మొత్తం కాస్త గడువు ముగిసే సమయానికి రూ. 2,30,038 అవుతుంది. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం పిల్లల చదువుకోసం, పెళ్లిళ్ల కోసం ఇతర అవసరాల కోసం చిన్న మొత్తంలో పెట్టుబడిలు పెట్టి భారీ మొత్తంలో డబ్బుల్ని ఆదా చేయండి. -
పెట్టుబడులను ఎప్పుడు మార్చుకోవాలి?
మ్యూచువల్ ఫండ్స్ పథకాల మధ్య పెట్టుబడులను ఎటువంటి సందర్భాల్లో మార్చుకోవాలి? – సుఖ్‌దేవ్ భాటియా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలను రెండు రకాల కారణాల వల్ల మార్చాల్సి రావచ్చు. మొదట మీ లక్ష్యాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు పెట్టుబడులను వాటికి అనుగుణంగా సవరించుకోవాల్సి ఉంటుంది. లక్ష్యాలను చేరుకున్నప్పుడు కూడా ఈ అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకు మీరు రిటైర్మెంట్ లేదా పిల్లల ఉన్నతవిద్య కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుంటే.. నిర్ణీత కాలవ్యవధికి ముందే మీకు కావాల్సిన మొత్తం సమకూరితే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఏదైనా ఒక పథకంలో కొన్ని కారణాలను చూసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. అవన్నీ మారిపోయినట్టయితే పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఫండ్ మేనేజర్ మారిపోవడం పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి సరైన కారణం కాబోదు. గతంలో మంచి రాబడులను ఇచ్చిన పథకం కొత్త ఫండ్ మేనేజర్ నిర్వహణలో అంత మంచి పనితీరు చూపించకపోతే అప్పుడు వేరే పథకానికి మారిపోయే ఆలోచన చేయవచ్చు. అలాగే, నిలకడగా మంచి రాబడులను ఇస్తుందన్న కారణంతో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. మీరు ఆశించిన విధంగా పనితీరు లేకపోయినా దాని నుంచి తప్పుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ ఈక్విటీలు అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోవడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కలి్పంచుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకూడదు. ఇందుకోసం అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు మంచి పెట్టుబడుల అవకాశాలు అవుతాయి. తక్కువ రేట్లకే కొనుగోళ్లు చేసుకోవచ్చు. ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లలో దిద్దుబాట్లకు భయయపడి, మరింత పడిపోతాయేమోనన్న ఆందోళనతో పెట్టుబడి పెట్టకుండా ఉంటే, మంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
1.66 లక్షల కోట్లు ‘సిప్’ చేశారు!
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడులకు (సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్/సిప్) ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు నిదర్శంగా ఈ ఏడాది 11 నెలల్లో (జనవరి–నవంబర్) సిప్ రూపంలో ఫండ్స్‌లోకి రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్ కనిష్ట పెట్టుబడిని రూ.250కు తగ్గించే దిశగా పనిచేస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధురి పురి బుచ్ ఇటీవలే ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఇది అమల్లోకి వస్తే సిప్ పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2022 సంవత్సరం మొత్తం మీద సిప్ రూపంలో ఫండ్స్‌లోకి వచి్చన పెట్టుబడులు రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటే, ఈ ఏడాది మరో నెల మిగిలి ఉండగానే దీన్ని అధిగమించడం గమనార్హం. ఇక 2021లో సిప్ రూపంలో ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.1.14 లక్షల కోట్లుగా, 2020లో రూ.97,000 కోట్లుగా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక మీదట ఏటా సిప్ పెట్టుబడులు స్థిరంగా పెరుగుతూ వెళతాయని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆశావహ అంచనాలు, మార్కెట్లో ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం పెరగిన నేపథ్యంలో.. ఫండ్స్‌లో సిప్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. మార్కెట్లు బలంగా ఉండడం, చక్కని రాబడులకు ఉన్న అవకాశాల నేపథ్యంలో 2024లో సిప్ రూపంలో వచ్చే పెట్టుబడులు పెరుగుతాయనే నమ్మకం బలపడుతున్నట్టు తెలిపారు. మద్దతిస్తున్న అంశాలు 2022 డిసెంబర్ నెలలో సిప్ రూపంలో ఈక్విటీ పథకాల్లోకి వచి్చన పెట్టుబడులు రూ.11,305 కోట్లు కాగా, 2023 నవంబర్ నెలకు ఈ మొత్తం రూ.17,073 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది అక్టోబర్, సెపె్టంబర్ నెలల్లోనూ రూ.16వేల కోట్లకు పైనే సిప్ పెట్టుబడులు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ ఆస్తులు నవంబర్ చివరికి రూ.9.31 లక్షల కోట్లకు పెరిగాయి. 2022 డిసెంబర్ చివరికి ఇవి రూ.6.75 లక్షల కోట్లుగా ఉన్నాయి. యాంఫి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, అధిక జనాభా, ఈక్విఈలపై అధిక రాబడులు, పెట్టుబడుల సౌలభ్యం తదితర అంశాలు మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక పెరగడానికి అనుకూలించే అంశాలుగా మార్కెట్ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ‘‘సిప్, ఈక్విటీ పెట్టుబడుల వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన కల్పించడంలో యాంఫి ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈక్విటీలకు ఒక పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి పెరగడం కూడా సిప్ పెట్టుబడులు పెరగానికి అనుకూలిస్తోంది’’అని అఖిల్ చతుర్వేది వివరించారు. సిప్ ద్వారా ఇన్వెస్టర్ తాను ఎంపిక చేసుకున్న పథకంలో నిరీ్ణత రోజులకు ఒకసారి పెట్టుబడి పెట్టుకోవచ్చు. మార్కెట్ ర్యాలీలు, పతనాల్లోనూ సిప్ పెట్టుబడి కొనసాగడం వల్ల కొనుగోలు ధర సగటుగా మారి, రాబడులు మెరుగ్గా ఉంటాయి. ప్రస్తుతం సిప్ కనీన పెట్టుబడి రూ.500గా ఉంది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంలో భాగంగా సిప్ కనీస పెట్టుబడిని రూ.250కి తగ్గించాలని సెబీ భావిస్తోంది. -
స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
న్యూఢిల్లీ: స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు నిరంతరాయంగా, బలంగా వస్తూనే ఉన్నాయి. దీంతో అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పరిధిలోని స్మాల్‌క్యాప్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) నవంబర్ చివరికి రూ.2.2 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎంలో 69 శాతం వృద్ధి కనిపిస్తోంది. అక్టోబర్ నెల స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎంతో పోల్చి చూసినా కానీ, 10 శాతం వృద్ధి నమోదైంది. 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎం అనూహ్యమైన వృద్ధిని చూసినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో అనుకూల వాతావరణం, బారీ పెట్టుబడుల రాక ఇందుకు దోహదం చేసింది. ఈ ఏడాది ఆరంభం నుంచి నవంబర్ వరకు స్మాల్‌క్యాప్ ఫండ్స్ నికరంగా రూ.37,178 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇందులో అత్యధికంగా అక్టోబర్‌లో రూ.4,495 కోట్లు వచ్చాయి. మరోవైపు ఈ ఏడాది 11 నెలల్లో లార్జ్‌క్యాప్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.2,688 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంటే స్మాల్‌క్యాప్ కంపెనీల విషయంలో దేశీ ఇన్వెస్టర్లు ఎంతో బుల్లిష్ గా ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడులపై పరిమితులు చిన్న కంపెనీల్లోకి గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు రావడంతో షేర్ల ధరలను గణనీయంగా పెరిగేందుకు దారితీస్తోంది. ‘‘పలు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు గడిచిన త్రైమాసికంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాకపై పరిమితులు విధించాయి. పెట్టుబడులు గణనీయంగా రావడం, కంపెనీల వ్యాల్యూషన్లు ఖరీదుగా మారడం ఫండ్ మేనేజర్లను ఆందోళనకు గురి చేస్తోంది’’అని మారి్నంగ్ స్టార్ ఇండియా తన త్రైమాసికం వారీ నివేదికలో పేర్కొంది. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు సంబంధించిన ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) సైతం 62 లక్షలు పెరిగి నవంబర్ చివరికి 1.6 కోట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇవి 97.52 లక్షలుగా ఉన్నాయి. సెబీ నిబంధనల ప్రకారం స్మాల్‌క్యాప్ ఫండ్స్ కనీసం 65 శాతం పెట్టుబడులను స్మాల్‌క్యాప్ కంపెనీలకే కేటాయించాల్సి ఉంటుంది. స్వల్పకాలంలో ఉండే అనిశి్చతుల దృష్ట్యా ఇన్వెస్టర్లు స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టుకోవాలని యూనియన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సీఈవో జి.ప్రదీప్ కుమార్ సూచించారు. -
కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా.. రెండు టాపప్ ప్లాన్లు తీసుకోవచ్చా?
నేను స్వయం ఉపాధిపై ఆధారపడి ఉన్నాను. రూ.4 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. అదే బీమా సంస్థ నుంచి రూ.6 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ కూడా ఉంది. అంటే నా ముగ్గురు సభ్యుల కుటుంబానికి మొత్తం రూ.10 లక్షల కవరేజీ ప్రస్తుతానికి ఉంది. రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.40 లక్షల సూపర్ టాపప్ ప్లాన్‌ను మరో బీమా సంస్థ ఆఫర్ చేస్తోంది. దాని ప్రీమియం చాలా తక్కువ. ఇప్పుడు రూ.40 లక్షలకు సూపర్ టాపప్ తీసుకుంటే మొత్తం కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా? నేను రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండొచ్చా? – తన్మోయ్ పంజా టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది డిడక్టబుల్కు పైన ఉన్న మొత్తానికి బీమా కవరేజీని ఇస్తుంది. డిడక్టబుల్ అంటే, అంత మొత్తాన్ని పాలసీదారు భరించాల్సి ఉంటుంది. అంతకు మించిన మొత్తానికి సూపర్ టాపప్ కవరేజీ అమల్లోకి వస్తుంది. సూపర్ టాపప్ ప్లాన్ తీసుకునేందుకు బేసిక్ కవరేజీ ఉండాలనేమీ లేదు. బేసిక్ టాపప్ ప్లాన్‌లో డిడక్టబుల్ అనేది హాస్పిటల్లో చేరిన ప్రతి సందర్భంలోనూ అమలవుతుంది. కానీ, సూపర్ టాపప్ ప్లాన్‌లో ఒక ఏడాది మొత్తం మీద అయిన హాస్పిటల్ ఖర్చులకు డిడక్టబుల్ అమలవుతుంది. కనుక టాపప్ ప్లాన్లతో పోలిస్తే సూపర్ టాపప్ ప్లాన్ మరింత ప్రయోజనకరం అని చెప్పుకోవాలి. ఒకే సమయంలో రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండే విషయంలో ఎలాంటి నియంత్రణలు లేవు. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లో లేని మెరుగైన సదుపాయాలను కొత్త సూపర్ టాపప్ ప్లాన్ ఆఫర్ చేస్తుంటే నిస్సందేహంగా తీసుకోవచ్చు. బేసిక్ పాలసీలో లేని రక్షణను సూపర్ టాపప్ ప్లాన్ ఇస్తుంటే తీసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ రూ.2 లక్షల కవరేజీని ఇస్తుంటే, రూ.2 లక్షల డిడక్టబుల్‌తో రూ.5 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ ఉంటే.. ఇప్పుడు రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.10 లక్షలకు మరో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలని అనుకుంటే తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఆస్పత్రి బిల్లు రూ.18 లక్షలు అయిందనుకోండి. అప్పుడు బేసిక్ పాలసీ నుంచి రూ.2 లక్షలు, మొదటి సూపర్ టాపప్ నుంచి రూ.5 లక్షలు చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మరో రూ.11 లక్షలు మిగిలి ఉంటుంది. రెండో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి రూ.10 లక్షలు చెల్లింపులు వస్తాయి. మిగిలిన రూ.లక్షను పాలసీదారుడు భరించాల్సి ఉంటుంది. అయితే, ఎక్కువ సూపర్ టాపప్ ప్లాన్లు ఉంటే బీమా ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది. బేసిక్ పాలసీకి అదనంగా ఒక సూపర్ టాపప్ ప్లాన్‌ను కలిగి ఉండడం సూచనీయం. మూడు బీ మా సంస్థల వద్ద క్లెయిమ్ కోసం చేయాల్సిన పేపర్ పని ప్రతిబంధకంగా మారుతుంది. కనుక కవరేజీని సాధ్యమైనంత సులభంగా ఉంచుకోవాలి. నేను 1994లో మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. అందుకు సంబంధించి భౌతిక సర్టిఫికెట్ నా వద్ద ఉంది. ఈ మొత్తాన్ని ఎలా ఉపసంహరించుకోవాలి? వీటి విలువ ఎంత? – వచన్ 2014లో మోర్గాన్ స్టాన్లీ భారత్ మార్కెట్ నుంచి వెళ్లిపోయింది. మోర్గాన్ స్టాన్లీ నిర్వహణలోని ఎనిమిది మ్యూచువల్ ఫండ్ పథకాలను హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్ హెచ్డీఎఫ్సీ లార్జ్‌క్యాప్ ఫండ్‌లో విలీనం అయింది. హెచ్డీఎఫ్సీ లార్జ్ క్యాప్ ఫండ్ 2009 వరకు హెచ్డీఎఫ్సీ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌గా కొనసాగింది. 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన అనంతరం ఇది ఓపెన్ ఎండెడ్ పథకంగా మార్పు చెందింది. ఇప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే, హెచ్డీఎఫ్సీ అస్సె ట్ మేనేజ్మెంట్ కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్‌లో మీ పెట్టుబడులకు సంబంధించి ఆధారాలను సమరి్పంచాలి. అ ప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకునే విషయమైన వారి నుంచి తగిన సహకారం లభిస్తుంది. సమాధానాలు ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మీ పెట్టుబడికి మీరే డ్రైవర్!
భవిష్యత్ లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నియమబద్ధంగా పెట్టుబడులు పెట్టే ధోరణి మన దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. ఇందుకు నెలవారీ వస్తున్న సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులే నిదర్శనం. 16,928 కోట్లు సిప్ రూపంలో అక్టోబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఒక నెలలో సిప్ ద్వారా వచి్చన గరిష్ట పెట్టుబడులు ఇవి. అంతేకాదు, ప్రతి నెలా ఈ మొత్తం పెరుగుతూ పోతుండడం, మరింత మంది ఇన్వెస్టర్లు ఈక్విటీ ఫండ్స్ వైపు అడుగులు వేస్తుండడాన్ని తెలియజేస్తోంది. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల కనీసం ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లు, రెగ్యులర్ ప్లాన్లలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది తెలిసి ఉండాలి. దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్స్ ద్వారా సంపద సమకూర్చుకోవాలని ఆశించే వారు ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకుంటే ఎక్కువ ప్రయోజనమో తెలిసి ఉంటే, తమ లక్ష్యం సులువు అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లు దీర్ఘకాలంలో అధిక రాబడులు అందిస్తాయి. రెగ్యులర్ ప్లాన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ డి్రస్టిబ్యూటర్ ద్వారా లేదా బ్రోకర్ ద్వారా విక్రయించే ప్లాన్. దీనిపై వారికి అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) నుంచి కమీషన్లు అందుతాయి. కనుక ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ పెట్టుబడి నుంచి ఏటా వసూలు చేసే మొత్తం) రెగ్యులర్ ప్లాన్లలో అధికంగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. మూడో పక్షం (బ్రోకర్లు, ఫిన్‌టెక్ సంస్థలు) కూడా రెగ్యులర్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. అయినప్పటికీ వీటిపై కమీషన్ చెల్లింపులు ఉండవు. కనుక డైరెక్టర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో, రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లను ప్రవేశపెట్టి పదేళ్లు అవుతోంది. అయినా, ఇప్పటికీ ఎక్కువ మంది పెట్టుబడులు రెగ్యులర్ ప్లాన్లలోకే వెళుతున్నాయి. డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో ఫోలియోలు ఎంతో తక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతీ ఇన్వెస్టర్ వీటి మధ్య వైరుధ్యాన్ని తప్పక తెలిసి ఉండాలి. అనుకూలతలు... మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ (సలహాదారు) లేదా పంపిణీదారు (డి్రస్టిబ్యూటర్) సేవలు అవసరం లేకుండా నేరుగా పెట్టుబడులు పెట్టే వారికి వ్యయాలు ఆదా చేసుకునేందుకు తీసుకొచి్చందే డైరెక్ట్ ప్లాన్లు. సులభంగా చెప్పాలంటే డ్రైవర్ సాయం లేకుండా ఎవరి కారును వారు డ్రైవ్ చేసుకున్నట్టు. ఇన్వెస్టర్ తన పెట్టుబడుల నిర్వహణను తానే చూసుకోవడం. మ్యూచువల్ ఫండ్స్‌లో టీఈఆర్ అని ఉంటుంది. అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్). ఇందులో ఫండ్ నిర్వహణ చార్జీలు, మార్కెటింగ్ వ్యయాలు, రిజిస్ట్రార్ ఫీజు, కస్టోడియన్ ఫీజు, ఇతర వ్యయాలు కలిపి ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్లలో పంపిణీదారులకు కమీషన్ చెల్లించాల్సి వస్తుంది. కనుక ఇక్కడ చెప్పుకున్న వివిధ రకాల వ్యయాలకు కమీషన్ కూడా తోడు కావడంతో రెగ్యులర్ ప్లాన్లలో టీఈఆర్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్ పెట్టుబడి విలువపై వార్షికంగా టీఈఆర్‌ను అమలు చేస్తారు. కానీ చార్జీ మినహాయింపు ఏరోజుకారోజు కొనసాగుతుంది. పెట్టుబడి నుంచి అధిక వ్యయాలను మినహాయించినప్పుడు ఆ మేర రాబడి తగ్గుతుంది. ఒక ఇన్వెస్టర్ రెండు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రూ.10,000 చొప్పున లమ్సమ్‌గా ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ‘ఏ’ అనే పథకంలో టీఈఆర్ ఒక శాతంగా ఉంది. ‘బీ’ అనే పథకంలో టీఈఆర్ 2.5 శాతంగా ఉంది. కానీ, పదేళ్ల తర్వాత రూ.10,000 పెట్టుబడి ‘ఏ’ పథకంలో రూ.36,587గా మారితే, ‘బీ’ పథకంలో రూ.31,407 సమకూరింది. అంటే వ్యత్యాసం ఎంతుందో స్పష్టంగా అర్థమవుతోంది. రాబడులు పేరొందిన ఈక్విటీ ఫండ్స్ డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే వారి రాబడులు పరిశీలించినా.. డైరెక్ట్ ప్లాన్లలోనే ఎక్కువ ఉంటున్నాయి. ఉదాహరణకు మిరే అస్సెట్ లార్జ్‌క్యాప్ ఫండ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఎక్స్ఐఆర్ఆర్) డైరెక్ట్ ప్లాన్‌లో 16.73 శాతం రాగా, రెగ్యులర్ ప్లాన్‌లో ఇది 15.60 శాతంగానే ఉంది. అంటే గడిచిన పదేళ్లలో ఈ పథకంలో చేసిన రూ.6 లక్షల సిప్ కాస్తా డైరెక్ట్ ప్లాన్‌లో రూ.14.26 లక్షలుగా మారితే, రెగ్యులర్ ప్లాన్‌లో రూ.13.42 లక్షలు అయి ఉండేది. అంటే ఈ రెండింటి మధ్య రూ.82,945 వ్యత్యాసం కనిపిస్తోంది. రెగ్యులర్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల ఇన్వెస్టర్ పదేళ్ల కాలంలో కమీషన్ల రూపేణా ఇంత మొత్తం నష్టపోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్‌లోనూ రెగ్యులర్ ప్లాన్‌తో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో రూ.67,540, రూ.60,788 చొప్పున అధిక రాబడి వచ్చింది. నేపథ్యం.. 2007 వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్‌ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసినా ఈ చార్జ్ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి)ను సెబీ కోరింది. అప్పట్లో సెబీ చైర్మన్‌గా దామోదరన్ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్‌లో ఎంట్రీలోడ్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్ సంస్థలు కమీషన్ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి. నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది. ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..? 2007 వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్‌ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసినా ఈ చార్జ్ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి)ను సెబీ కోరింది. అప్పట్లో సెబీ చైర్మన్‌గా దామోదరన్ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్‌లో ఎంట్రీలోడ్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్ సంస్థలు కమీషన్ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి. నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది. ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..? డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య రాబడుల్లో ఇంత స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నా, ఈ ప్రయోజనాన్ని పొందుతున్న ఇన్వెస్టర్లు 25 శాతానికి మించి లేరు. యాంఫీ గణాంకాల ప్రకారం మొత్తం 13.89 కోట్ల వ్యక్తిగత ఫండ్స్ ఫోలియోల్లో డైరెక్టర్ ప్లాన్లలో పెట్టుబడులకు సంబంధించినవి కేవలం 3.45 కోట్ల ఫోలియోలే ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో డైరెక్ట్ ప్లాన్ల నుంచి వస్తున్నది 12 శాతం మించి లేదు. ఇందుకు గల కారణాలపై మహీంద్రా మనులైఫ్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో ఆంటోనీ హెరెడియా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్లు సైతం దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి సంపదను సమకూర్చి పెట్టాయి. దీనికి తోడు డైరెక్ట్ ప్లాన్లపై ఎక్కువ మందిలో అవగాహన లేదు’’అని వివరించారు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డైరెక్ట్ ప్లాన్ల వైపే మొగ్గు చూపుతుంటే, నాన్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లలోనూ 50 శాతం మంది డైరెక్టర్ ప్లాన్లనే ఎంచుకుంటున్నారు. కేవలం రిటైల్ విభాగంలోనే డైరెక్ట్ ప్లాన్లను ఎంపిక చేసుకుంటున్న వారు తక్కువగా ఉంటున్నారు. ఏమిటి మార్గం..? ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల అవగాహన ఉంటే మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్లను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు, సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్ పథకం ఎంపిక కీలకం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో వేలాది పథకాలు ఉన్నాయి. ఇందులోనూ ఎన్నో విభాగాలు ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, రిస్‌్కకు అనుగుణంగా అనుకూలమైన వాటిని ఎంపిక చేసుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. ఈక్విటీ మార్కెట్ల పట్ల అవగాహన కలిగి ఉండి, రోజులో కొంత సమయం కేటాయించే వీలున్న వారు నేరుగా డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల సేవలను ఆశ్రయించినట్టయితే, వారు మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్లను సూచిస్తారు. కాకపోతే సెబీ వద్ద నమోదైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు కేవలం 1,328 మందే ఉన్నారు. కనుక ఇన్వెస్టర్లు డిస్కౌంట్ బ్రోకర్లు, ఫిన్‌టెక్ సంస్థల సేవలను సైతం పొందొచ్చు. కాకపోతే చాలా మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల సూచనల మేరకే నడుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యత్యాసాలు ► మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పంపిణీదారులు, బ్రోకర్లు తదితర మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. కనుక రెగ్యులర్ ప్లాన్‌లో యూనిట్ ఎన్ఏవీతో పోలిస్తే, డైరెక్ట్ ప్లాన్ యూనిట్ ఎన్ఏవీ ఎక్కువగా ఉంటుంది. ►డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువ. దీంతో దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి వీటిల్లో ఎక్కువ. ►డైరెక్ట్ ప్లాన్లను ఏ సంస్థా సూచించదు. ఇన్వెస్టర్ నేరుగా ఎంపిక చేసుకోవాలి. ►ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డైరెక్ట్ ప్లాన్లలో సులభంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జెరోదా, గ్రోవ్ వంటి సంస్థలు సైతం డైరెక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. -
ఐదు నెలల్లో రూ.14,000 కోట్లు - ఇన్వెస్టర్లలో పెరిగిన రిస్క్ ధోరణి
న్యూఢిల్లీ: అధిక రాబడుల కోసం థీమ్యాటిక్ (సెక్టోరల్ తదితర) మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారు. గడిచిన ఐదు నెలల కాలంలో ఈ పథకాలు నికరంగా రూ.14,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం దీన్నే సూచిస్తోంది. ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే ధోరణి పెరిగినట్టు కూడా అర్థమవుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి ప్రతి నెలా ఈ విభాగం నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉంది. అంతకుముందు చూస్తే, ఈ ఏడాది మే నెలలో థీమ్యాటిక్ ఫండ్స్ నుంచి రూ.169 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడులు మొత్తాన్ని ఇవి ఒకే రంగంలో, లేదా ఒకే తరహా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. వైవిధ్యానికి అవకాశం ఉండదు. రిస్క్ తీసుకునే ధోరణి పెరగడంతో ఇన్వస్టర్లు అధిక రిస్క్‌తో కూడిన థీమ్యాటిక్ లేదా సెక్టోరల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్టు ఫైయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి అభిప్రాయపడ్డారు. స్మాల్‌క్యాప్ తర్వాత వీటికే ఆదరణ యాంఫి గణాంకాల ప్రకారం.. అక్టోబర్‌లో థీమ్యాటిక్ ఫండ్స్‌లోకి రూ.3,896 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో అత్యధికంగా స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.4,495 కోట్లను ఆకర్షించగా, ఆ తర్వాత అధిక పెట్టుబడులు థీమ్యాటిక్ పథకాల్లోకే వెళ్లాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.3,417 కోట్లు, ఆగస్ట్‌లో రూ.4,806 కోట్లు, జూలైలో రూ.1,429 కోట్లు, జూన్‌లో రూ.459 కోట్ల చొప్పున థీమ్యాటిక్ పథకాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. బ్యాంకింగ్ ఫండ్స్‌కు మొగ్గు ఇక థీమ్యాటిక్ ఫండ్స్‌లో బ్యాంకింగ్ ఫండ్స్ ఎక్కువ మంది ఇన్వెస్టర్ల ఎంపికగా ఉంటున్నాయి. ఇవి బ్యాంక్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక దేశ వృద్ధిలో పాలు పంచుకున్నట్టు అవుతుంది. గడిచిన పదేళ్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 203 శాతం పెరిగితే, బీఎస్ఈ బ్యాంకెక్స్ (బ్యాంక్ స్టాక్స్‌తో కూడిన సూచీ) 282 శాతం పెరిగింది. ఇతర రంగాలతో పోలిస్తే గడిచిన కొన్ని త్రైమాసికాల్లో బ్యాంకులు లాభాల్లో ఎక్కువ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. థీమ్యాటిక్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే వారికి ఎప్పుడు పెట్టుబడులు పెట్టాలి, ఎప్పుడు వైదొలగాలనే విషయం తప్పక తెలిసి ఉండాలని టాటా అస్సెట్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూషనల్ క్లయింట్స్ హెడ్ ఆనంద్ వరదరాజన్ సూచించారు. 11 ఈక్విటీ ఫండ్ విభాగాల్లో థీమ్యాటిక్ కూడా ఒకటి. ఈ విభాగంలోని పథకాల నిర్వహణలో రూ.2.18 లక్షల కోట్ల ఆస్తులు అక్టోబర్ చివరికి ఉన్నాయి. -
కళ్లు చెదిరేలా లాభాల్ని తెచ్చి పెట్టే ఈ 'ఈక్విటీ ఫండ్' గురించి మీకు తెలుసా?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న ఎన్నో విభాగాల్లో ఫోకస్డ్ ఫండ్స్ కూడా ఒకటి. మెరుగైన రాబడులు కోరుకునే వారు ఫోకస్డ్ ఫండ్స్‌ను తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చు. ఈ పథకాలు తమ పోర్ట్‌ఫోలియోలో పరిమిత స్టాక్స్‌నే కలిగి ఉంటాయి. అంటే సత్తా ఉన్న కొన్ని కంపెనీల్లోనే తమ పెట్టుబడులను పరిమితం చేస్తాయి. కనుక వీటిల్లో పెట్టుబడులపై అధిక రిస్క్ ఉంటుంది. అదే మాదిరిగా అధిక రాబడులకూ అవకాశాలు మెండుగా ఉంటాయి. కనుక ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు ఇదొక మంచి పెట్టుబడి ఆప్షన్ అవుతుంది. రాబడులు దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉంది. గడిచిన ఏడాది కాలంలో పెట్టుబడులపై 15.53 శాతం రాబడినిచ్చింది. కానీ, ఇదే కాలంలో బీఎస్ఈ 500 టీఆర్ఐ రాబడి 13.49 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో ఈ పథకం 19 శాతం, ఐదేళ్లలో 16 శాతం, ఏడేళ్లలో 15.41 శాతం, పదేళ్లలో 18 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు వార్షిక ప్రతిఫలాన్ని అందించింది. దీర్ఘకాలంలో ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే 2 శాతం అదనపు రాబడి ఉంది. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం సిప్ రూపంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం ఫోకస్డ్ విభాగం అంటే ఎంపిక చేసిన కొన్ని స్టాక్స్‌పైనే ప్రత్యేక దృష్టి పెట్టడం. ఈ విభాగంలో ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ నమ్మకమైన పనితీరు ప్రదర్శిస్తోంది. అన్ని రకాల మార్కెట్లలోనూ లాభాలు ఇవ్వగల స్టాక్స్‌ను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ఫోకస్డ్ ఈక్విటీ పథకాల్లో సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఈ పథకం సొంతం. పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్ వరకు నిర్వహిస్తుంటుంది. మిగిలిన ఈక్విటీ పథకాల మాదిరిగా కాకుండా... ఫోకస్డ్ ఈక్విటీ విభాగంలోని పథకాలు తక్కువ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటాయి. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 22 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్‌లోనే 60 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 38 శాతం పెట్టుబడులను వీటికే కేటాయించింది. ఆ తర్వాత సేవల రంగ కంపెనీల్లో 11 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. కన్జ్యూమర్ స్టాపుల్స్ 10 శాతం, కమ్యూనికేషన్ కంపెనీల్లో 9 శాతం, హెల్త్‌కేర్ రంగ కంపెనీల్లో 7 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.29,317 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో రూ.95.61 శాతం మేర ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టింది. మిగిలిన మొత్తం నగదు రూపంలో కలిగి ఉంది. పెట్టుబడుల్లో 81 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 17 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 2 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడుల్లో కొంత మేర విదేశీ స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ఐఎన్‌సీ క్లాస్ఏ షేర్లలో 7 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈ తరహా స్టాక్స్ ఎంపిక వల్లే ఈ పథకానికి దీర్ఘకాలంలో మంచి రాబడుల చరిత్ర ఉంది. -
ఫండ్స్ కొత్త పథకాల జోరు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో నూతన పథకాలు (ఎన్ఎఫ్వో) సెపె్టంబర్ త్రైమాసికంలో పెద్ద మొత్తంలో నిధుల సమీకరించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 48 ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి వచ్చాయి. ఇవన్నీ కలసి ఇన్వెస్టర్ల నుంచి రూ.22,049 కోట్ల నిధులను సమీకరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 25 కొత్త పథకాలు రాగా, అవి వసూలు చేసిన మొత్తం రూ.5,539 కోట్లుగానే ఉంది. దీంతో పోలిస్తే సెపె్టంబర్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. సాధారణంగా మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు, బుల్లిష్ సెంటిమెంట్‌ను అనుకూలంగా భావించి ఎన్‌ఎఫ్‌వోలు ఎక్కువగా వస్తుంటాయి. -
క్యూ2లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ. 34,765 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో మొత్తం మీద రూ.34,765 కోట్ల పెట్టుబడులను నికరంగా ఆకర్షించింది. అంతకుముందు జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులు రూ.1.85 లక్షల కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ పెట్టుబడుల రాక సానుకూలంగానే ఉంది. ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ ఫండ్స్) విభాగంపై ఎక్కువ ప్రభావం పడింది. వీటి నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఫండ్స్ నుంచి జూలైలో రూ.82,467 కోట్ల పెట్టుబడులు రాగా, ఆగస్ట్‌లో రూ.16,180 కోట్లకు పరిమితమయ్యాయి. సెప్టెంబర్ నెలలో రూ.63,882 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. దీంతో నికరంగా రూ.34,765 కోట్ల పెట్టుబడులు నమోదైనట్టు మార్నింగ్ స్టార్ ఇండియా నివేదిక తెలిపింది. జూన్ త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులు నాలుగేళ్లలోనే గరిష్ట స్థాయి అని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ జూన్ చివరి నుంచి సెప్టెంబర్ చివరికి 5 శాతం పెరిగి రూ.46.22 లక్షల కోట్లుగా ఉంది. గత పది త్రైమాసికాల్లోనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. ఈక్విటీ పథకాల్లోకి నికరంగా రూ.41,962 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన రూ.18,358 కోట్లతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగాయి. ఇక డెట్ ఫండ్స్ నుంచి రూ.65,944 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఈ విభాగం రూ.1.38 లక్షల కోట్లు ఆకర్షించడంతో పోలిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి భారీ పెట్టుబడులు - సిప్ రూపంలో రూ.17 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అక్టోబర్‌లోనూ ఇన్వెస్టర్ల ఆదరణ చూరగొన్నాయి. నికరంగా రూ.20,000 కోట్లను ఆకర్షించాయి. సెప్టెంబర్‌లో వచ్చిన రూ.14,091 కోట్లతో పోలిస్తే 40 శాతానికి పైగా పెరిగాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నెలవారీగా వచ్చే పెట్టుబడులు రూ.16,928 కోట్ల మైలురాయిని చేరాయి. సిప్ రూపంలో ఒక నెలలో వచ్చిన గరిష్ట స్థాయి పెట్టుబడులు ఇవే కావడం గమనించొచ్చు. అక్టోబర్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గురువారం విడుదల చేసింది. అక్టోబర్ నెలలో నాలుగు కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు నిధుల సమీకరణ కోసం మార్కెట్లోకి రాగా, ఇవి రూ.2,996 కోట్లను సమీకరించాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.4,495 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. గత కొన్ని నెలలుగా స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తుండడం గమనించొచ్చు. థీమ్యాటిక్ ఫండ్స్ రూ. 3,896 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వరుసగా ఐదు నెలల పాటు పెట్టుబడులను కోల్పోయిన లార్జ్‌క్యాప్ పథకాల దశ మారింది. ఇవి నికరంగా రూ.724 కోట్లను రాబట్టాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి నికరంగా రూ.42,634 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో డెట్ విభాగం నుంచి నికరంగా రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లడం గమనార్హం. డెట్‌లో లిక్విడ్ ఫండ్స్ రూ.32,694 కోట్లను ఆకర్షించాయి. గిల్ట్ ఫండ్స్‌లోకి రూ.2,000 కోట్లు వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లోకి రూ.841 కోట్లు వచ్చాయి. అన్ని విభాగాల్లోకి కలిపి అక్టోబర్‌లో రూ.80,528 కోట్లు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్ చివరికి ఉన్న రూ. 46.58 లక్షల కోట్ల నుంచి రూ. 46.71 లక్షల కోట్లకు పెరిగాయి. -
యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్ చలసాని
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్ చలసాని నియమితులయ్యారు. వరుసగా రెండు సార్లు సీఈవోగా వ్యవహరించిన ఎన్ఎస్ వెంకటేష్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. బ్యాంకింగ్, ట్రెజరీ విభాగంలో చలసానికి దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐలో డిçప్యూటీ ఎండీగా వ్యవహరించడంతో పాటు ఆర్బీఐ, ఆర్థిక శాఖలు ఏర్పాటు చేసిన కమిటీల్లోనూ సభ్యుడిగా సేవలు అందించారు. దేశీ మ్యూచువల్ ఫండ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ఇటు పరిశ్రమ, అటు నియంత్రణ సంస్థతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. -
స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ : భారీగా తగ్గిన ఈక్విటీ ఎంఎఫ్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)లో పెట్టుబడులు గత నెల నీరసించాయి. అంతక్రితం నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో 30 శాతం తక్కువగా రూ. 14,091 కోట్లకు పరిమితమయ్యాయి. స్టాక్ మార్కెట్లో బలహీన సెంటిమెంటు కారణంగా ఇన్వెస్టర్లు రిస్క్ పెట్టుబడుల నుంచి దృష్టి మరల్చడం ప్రభావం చూపింది. దేశీ ఎంఎఫ్ అసోసియేషన్(యాంఫి) గణాంకాల ప్రకారం ఈ ఏడాది(2023) ఆగస్ట్‌లో ఈక్విటీ ఎంఎఫ్లకు రూ. 20,245 కోట్ల పెట్టుబడులు లభించాయి. కాగా.. గత నెలలో క్రమానుగత పెట్టుబడి పథకాల(సిప్)కు మాత్రం రూ. 16,042 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఇవి ఈక్విటీ ఫండ్స్ చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి ఆరు నెలల్లో(ఏప్రిల్–సెప్టెంబర్) సిప్ ద్వారా రూ. 90,304 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. కొత్త రికార్డ్స్‌తో.. గత నెలలో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడంతో రిస్క్ అసెట్స్ నుంచి ఇన్వెస్టర్ల దృష్టి మరలినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయినప్పటికీ ఈక్విటీ ఎంఎఫ్లకు రూ. 14,091 కోట్ల పెట్టుబడులు లభించినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది వివరించారు. వెరసి వరుసగా 31వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు ప్రవహించినట్లు తెలియజేశారు. సెప్టెంబర్‌లో ఆరు కొత్త ఫండ్స్ ప్రారంభంకాగా.. రూ. 2,503 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకున్నాయి. అంతర్గతంగా సానుకూల సెంటిమెంటు నెలకొనడంతో సిప్ పెట్టుబడులు కొనసాగుతున్నట్లు యూనియన్ ఏఎంసీ సీఈవో జి.ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు. ఎఫ్‌పీఐలు నికరంగా అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపడుతున్నట్లు తెలియజేశారు. థీమాటిక్(సెక్టోరల్) ఫండ్స్ సెప్టెంబర్‌లో రూ. 3,147 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకోగా.. 4 కొత్త ఫండ్స్ విడుదలయ్యాయి. ఆగస్ట్‌లోనూ 5 కొత్త ఫండ్స్ ప్రవేశించగా.. రూ. 4,805 కోట్ల పెట్టుబడులు లభించాయి. లార్జ్ క్యాప్స్ డీలా సెప్టెంబర్‌లో లార్జ్ క్యాప్ ఫండ్స్ వరుసగా ఐదో నెలలోనూ డీలా పడ్డాయి. నికరంగా రూ. 110 కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. అయితే మిడ్ క్యాప్ విభాగంలో పెట్టుబడులు తగ్గినప్పటికీ రూ. 2,000 కోట్లకు చేరాయి. ఆగస్ట్‌లో ఇవి రూ. 2,512 కోట్లుగా నమోదయ్యాయి. మే నుంచి ఆగస్ట్ మధ్యలో సగటున రూ. 4,298 కోట్ల పెట్టుబడులు లభించిన స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోనూ గత నెలలో ఇన్వెస్ట్మెంట్స్ రూ. 2,678 కోట్లకు పరిమితమైనట్లు ఫైయర్స్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి తెలియజేశారు. స్మాల్ క్యాప్ విభాగంలో విలువలు భారీగా పెరగడంతో కొంతవరకూ లాభాల స్వీకరణ నెలకొనడం ప్రభావం చూపుతున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారిటా వివరించారు. రుణ పథకాల నేలచూపు రుణ సెక్యూరిటీ ఆధారిత పథకాలు వరుసగా రెండో నెలలోనూ నేలచూపులకే పరిమితమయ్యాయి. ఆగస్ట్‌లో నికరంగా రూ. 25,873 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోగా.. సెప్టెంబర్‌లో మరింత అధికంగా రూ. 1.01 లక్షల కోట్లు వెనక్కి మళ్లాయి. అంచనాలకు అనుగుణంగా లిక్విడ్ ఫండ్స్‌లో భారీగా రూ. 74,000 కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. కార్పొరేట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు అవసరాలు ఇందుకు కారణమైనట్లు శాంటారియా అభిప్రాయపడ్డారు. ఎంఎఫ్ పరిశ్రమ మొత్తం నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) సెప్టెంబర్ చివరికల్లా 46.58 లక్షల కోట్లకు చేరింది. -
ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. అధిక ప్రయోజనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటికే మార్కెట్లు కొంత మేర ర్యాలీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధి వరకూ మార్కెట్లలో ఇన్వెస్టర్లు విడతలవారీగా, కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చని ఎడెల్వీజ్ మ్యుచువల్ ఫండ్ సీఐవో (ఈక్విటీస్) త్రిదీప్ భట్టాచార్య సూచించారు. పడినప్పుడల్లా కొనుగోలు చేసే విధానాన్ని పాటించవచ్చన్నారు. గత కొద్ది నెలలుగా ర్యాలీ చేసిన కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌పై అసంబద్ధ మైన స్థాయిలో ఆసక్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ స్థాయుల క్యాపిటలైజేషన్ గల స్టాక్స్‌లో మదుపు చేసే మల్టీక్యాప్ ఫండ్స్‌లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక ప్రయోజనాలు పొందేందుకు ఆస్కారం ఉంటుందని భట్టాచార్య చెప్పారు. కొత్తగా ఎడెల్వీజ్ మల్టీక్యాప్ ఫండ్ ఎన్ఎఫ్వో బుధవారం (సెప్టెంబర్ 4) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. అక్టోబర్ 18 వరకు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వచ్చే 3-4 ఏళ్లు ప్రధానంగా అయిదు థీమ్స్ మార్కెట్లకు దన్నుగా నిల్చే అవకాశం ఉందని భట్టాచార్య తెలిపారు. తయారీ రంగం, ఆర్థిక సేవలకు సంబంధించి రుణాల విభాగం, డిఫెన్స్, రియల్ ఎస్టేట్ మొదలైనవి వీటిలో ఉంటాయని భట్టాచార్య పేర్కొన్నారు. ఆదాయాల్లో విదేశీ మార్కెట్ల వాటా ఎక్కువగా ఉన్న రంగాల సంస్థలపై అండర్‌వెయిట్‌గా ఉన్నామని ఆయన చెప్పారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్‌లో మంచి పథకం కోసం ముఖ్య అంశాలు
నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్‌లో మంచి పథకం ఎంపిక చేసుకోవడం ఎలా? – స్వామినాథన్ ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక యాక్టివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటే ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సిన అవసరం ఉండదు. రెండోది ట్రాకింగ్ ఎర్రర్. ఒక ఇండెక్స్ ఫండ్.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందో చెబుతుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూస్తే ఎస్బీఐ, యూటీఐ, హెచ్డీఎఫ్సీ సంస్థల పథకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. నేను పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ వరుసగా రెండేళ్లపాటు చెత్త పనితీరు చూపించినట్టయితే, నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనదేనా? – మునావర్ ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి వైదొలగేందుకు, ఆ పథకం తక్కువ రాబడులను ఇస్తుండడం అన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. తక్కువ పనితీరు అంటే ఇతర పథకాలతో పోలిస్తే తక్కువ రాబడులు ఇవ్వడం. వైదొలిగే నిర్ణయానికి ముందు.. మీరు పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్ పథకం విభాగంలోని ఇతర పథకాల పనితీరు కూడా విశ్లేషించాలి. వాటి పనితీరు కూడా తగ్గిందా..? లేక మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం పనితీరు మాత్రమే తగ్గిందా? చూడాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎన్ఏవీ క్షీణించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ పడిపోయినా రాబడులు తగ్గుతాయి. అన్ని పథకాలు ఏదో ఒక సమయంలో కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటూ ఉంటాయి. అది చూసి ఒక పథకం నుంచి మరో పథకంలోకి మారిపోవడం సరైన నిర్ణయం కాబోదు. ఈ ప్రతికూల, తక్కువ పనితీరు అనేది ఒక పథకంలో కనీసం నిరంతరాయంగా రెండేళ్లపాటు కొనసాగాలి. అప్పుడు ఆ పథకంలో పెట్టుబడులను సమీక్షించుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం తక్కువ పనితీరు చూపించడం వెనుక కారణాన్ని గుర్తించాలి. ఫండ్ మేనేజర్లో మార్పు జరిగిందా? అందుకే పనితీరు మందగించిందా? అని చూడాలి. అదే నిజమైతే ఆ పథకం నుంచి మీ పెట్టుబడులను తీసుకుని బయటకు రావచ్చు. ఒకవేళ ఫండ్ మేనేజర్లో మార్పు లేకపోతే.. రాబడులు మందగించడానికి గల కారణాన్ని సాధారణంగా వారు మీడియాకు వెల్లడించే ప్రయత్నం చేస్తుంటారు. లేదంటే ఆయా ఫండ్ సంస్థ నెలవారీ న్యూస్లెటర్లోనూ సమాచారాన్ని వెల్లడిస్తుంటారు. పథకం పెట్టుబడుల విధానం వల్ల కూడా తాత్కాలికంగా రాబడులు మెరుగ్గా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పథకం పనితీరును తప్పుబట్టడం సరైనది కాకపోవచ్చు. ఉదాహణకు గ్రోత్ ఆధారిత విధానంతో పోలిస్తే వ్యాల్యూ ఆధారిత పెట్టుబడుల విధానం కాస్త ఆలస్యంగా ఫలితాలను ఇస్తుంది. అటువంటప్పుడు మీరు పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తాను ఎంపిక చేసుకున్న పథకం అన్ని కాలాల్లోనూ అద్భుత పనితీరు చూపించాలని ఆశిస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది సాధ్యం కాదు. అన్ని పథకాలు సానుకూల, ప్రతికూల సందర్భాలను ఎదుర్కొంటూ వెళుతుంటాయి. కనుక పెట్టుబడులను వెనక్కి తీసుకునే ముందు ఈ అంశాలన్నింటినీ చూడాలి. -ధీరజ్ కుమార్, సీఈవో వాల్యూ రీసెర్చ్ -
మ్యూచుఫల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎలా ఉండాలి?
ఈ వారం ఆరంభంలో నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిసాయి. నిఫ్టీ 19600 స్థాయికి చేరింది. ఈనేపథ్యంలో హెక్సాగాన్ కాపిటల్కు చెందిన శ్రీకాంత్ భగవత్ తో కారుణ్యరావు సంభాషణ విందాం. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టినవారి పరిస్థితి ఎలా ఉండబోతోంది. నిఫ్టీతో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లు బాగా పెరిగాయి. క్విక్ రాలీతోపాటు వాల్యూయేషన్లను పరిశీలించాలి. కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచింది. అలాగే బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తూ డెట్ ఫండ్స్, బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చా? రిటర్న్న్ ఎలా ఉంటాయి అంటే మిగతా అన్ని పరిస్థితులు బావుంటే.. మీడియం టర్మ్ డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులకు మంచి ఫలితాలుండే అవకాశాలన్నాయి. క్రెడిట్ గ్రోత్ రికవరీ అవుతున్న తరుణంలో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ప్రాఫిట్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల వైవర్సిఫికేషన్ ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువ. హైబ్రిడ్ ఫండ్స్‌లో టాక్స్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది. ఈక్విటీ పండ్స్తో పోలిస్తే డెట్స్ ఫండ్స్‌తో రిస్క్ ఎలా ఉంటుంది? అనేది పరిశీలిస్తే మ్యూచుఫల్ డెట్ ఫండ్స్ ఈల్డ్స్ బావున్నాయి. ఇంట్రరెస్ట్, క్రెడిట్, లిక్విడిటీ అనే మూడు రిస్క్‌లు ఉంటాయి. వడ్డీరేట్లు పెరిగితే పాత బాండ్ల ధరలు పడతాయి. లిక్విడిటీ రిస్క్ ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ తీసుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది. కరెంట్ మార్కెట్లో లార్జ్ క్యాప్‌లో మీడియం టెర్మ ఫండ్ బావుంటుంది. పీఎస్‌యూ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ కంపెనీల బాండ్స్ మంచి ఈల్డ్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈక్విటీ మార్కెట్లో దీర్ఘకాల పెట్టుబడులు మంచిది. (Disclaimer: సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలువారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
రిస్క్ లపై ఇన్వెస్టర్లలో అవగాహన అంతంతే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కష్టపడి సంపాదించే ధనాన్ని భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఇదే క్రమంలో పెట్టుబడి సాధనంగా మ్యుచువల్ ఫండ్స్‌కి కూడా ఆదరణ పెరుగుతోంది. కానీ, ఇన్వెస్టర్లలో రిస్కులు, తమ రిస్కు సామర్థ్యాలపై అవగాహన అంతంతమాత్రంగాన ఉంటోంది. సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడంలో తమ రిస్కు సామర్థ్యాలను అర్థం చేసుకుని, వ్యవహరించడం కీలకాంశమని 89 శాతం మంది ఇన్వెస్టర్లు భావిస్తున్నప్పటికీ .. వాస్తవంగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకుంటున్న వారు 27 శాతమే. 53 శాతం మంది ఇన్వెస్టర్లు తమ వ్యక్తిగత రిస్కుల మదింపు విషయంలో ధీమాగా వ్యవహరించలేకపోతున్నారు. యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ (ఏఎంసీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మ్యుచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో ఉండే రిస్కుల విషయంలో ఇన్వెస్టర్ల ధోరణిని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 1,700 మంది పైచిలుకు యాక్సిస్ ఎంఎఫ్ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. సర్వే నివేదిక ప్రకారం ఫండ్ రిస్కులను మదింపు చేసేందుకు రిస్్క–ఓ–మీటర్ అనే సాధనాన్ని ఉపయోగించుకోవచ్చని 55 శాతం మందికి, అలాగే వ్యక్తిగత రిస్కులను మదింపు చేసుకునేందుకు రిస్క్ ప్రొఫైలర్‌ను ఉపయోగించుకోవచ్చని 69 శాతం మందికి అవగాహన లేదు. దేశీయంగా మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ కీలక దశలో ఉందని, ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోగలిగేలా వారికి మరింత తోడ్పాటు అందించేందుకు పరిశ్రమ కృషి చేస్తోందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ బి. గోపకుమార్ తెలిపారు. సర్వేలో మరిన్ని అంశాలు.. ► ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రామాణికంగా తీసుకోతగిన అంశాల్లో, దాని గత పనితీరు కూడా ఒకటని 59% మంది ఇంకా విశ్వసిస్తున్నారు. పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించాల్సిన అవసరం, కాంపౌండింగ్ ప్రయో జనాల గురించి తెలిసినప్పటికీ చాలా మంది ఇ న్వెస్టర్లు పలు సందర్భాల్లో తమ పెట్టుబడులను ముందుగానే ఉపసంహరించుకుంటున్నారు. ► పరిశ్రమ సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 22.2% మంది ఈక్విటీ ఇన్వెస్టర్లు 12–24 నెలల పాటే తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. 48.7% మంది తమ పోర్ట్‌ఫోలియోను రెండేళ్లు, అంతకన్నా తక్కువ వ్యవధిలోనే రిడీమ్ చేసుకుంటున్నారు. ► పెట్టుబడులు పెట్టేటప్పుడు తమ రిస్కు సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పిన 27% మందిలో దాదాపు 64% మందికి రిస్కు సామర్థ్యాలను మదింపు చేసుకోవడానికి రిస్క్ ప్రొఫైలర్ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చని తెలియదు. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 30% మందికి మాత్రమే రిస్క్ ప్రొఫైలర్ గురించి అవగాహన ఉంది. ► 61% మందికి రిస్్క–ఓ–మీటర్ దేన్ని సూచిస్తుందనేది తెలియదు. ఇది ‘ఫండ్’ రిసు్కను సూచిస్తుందని 16% మందికి మాత్రమే తెలుసు. తాము పెట్టుబడులు పెట్టే ముందు రిస్కోమీటర్ను చూసుకునే ఇన్వెస్ట్ చేస్తామని సదరు ఇన్వెస్టర్లు తెలిపారు. -
బ్యాంక్ షేర్లలో తాజా కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో భాగంగా ఫెడరల్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌సహా పలు బ్యాంకులలో అదనపు వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకు ఆర్బీఐ నుంచి తాజాగా అనుమతులు లభించినట్లు హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వెల్లడించింది. వెరసి అనుమతి పొందిన బ్యాంకులలో వాటాను 9.5 శాతంవరకూ పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు తెలియజేసింది. బ్యాంకులలో అదనపు పెట్టుబడులను చేపట్టేందుకు పెట్టుకున్న దరఖాస్తుకు ఆర్బీఐ క్లియరెన్స్ ఇచి్చనట్లు వివరించింది. హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి పొందిన జాబితాలో డీసీబీ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ సైతం ఉన్నాయి. మరోవైపు చెల్లించిన మూలధనం లేదా వోటింగ్ హక్కులలో 9.5 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు హెచ్డీఎఫ్సీ ఏఎంసీకి ఆర్బీఐ నుంచి అనుమతి లభించినట్లు విడిగా ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా.. 2023 జూన్30కల్లా ఫెడరల్ బ్యాంక్‌లో 4.49 శాతం, ఈక్విటాస్ ఎస్ఎఫ్బీలో 4.68 శాతం చొప్పున హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వాటాలు కలిగి ఉంది. అయితే తాజా కొనుగోళ్ల తదుపరి ఒక్కో బ్యాంకులో 9.5 శాతం వాటాను మించేందుకు అనుమతించరు. -
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు..కానీ వాటిని నమ్మొద్దు!
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. అలాగే తప్పుడు సమాచారంపై కీలక హెచ్చరిక చేశారు. ‘వాట్సాప్ యూనివర్శిటీ’ విస్తరణ, మార్కెట్లలో డబ్బు సంపాదించడంపై వస్తున్న తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండలన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ప్రజలు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టేలా చూసుకోవాలని , HDFC AMC . HDFC లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌తో ప్రారంభించి, ఆ తరువాత కొన్ని చిట్కాలతో నేరుగా మార్కెట్లలో పెట్టుబడులతో భారీ లాభాలు పొందవచ్చని భావించి నష్టపోయిన పెట్టుబడిదారులు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. ముందు మార్కెట్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. (నువ్వు క్లాస్..బాసూ! ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ ట్వీట్ వైరల్) ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు. -
మనీ మార్కెట్ ఫండ్ అంటే ఏమిటి? ఎవరు ఈ ఫండ్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చు?
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు ఎగ్జిట్ లోడ్ విధిస్తారు. దీన్ని ఎలా అమలు చేస్తారు? – ఎస్ అశోక్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికీ ఎగ్జిట్ లోడ్ గురించి తెలియాలి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత నిర్దేశిత కాలంలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు అమలు చేసే చార్జీయే ఎగ్జిట్ లోడ్. ఫండ్ నిబంధనల్లో ఇది స్పష్టంగా ఉంటుంది. ఫండ్ రకాన్ని బట్టి ఎగ్జిట్ లోడ్ వేర్వేరుగా ఉంటుంది. ఏకమొత్తంలో (లంప్సమ్) పెట్టుబడి లేదా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడి వాయిదా నుంచి ఈ తేదీ పరిగణనలోకి వస్తుంది. ఒకవేళ ఎగ్జిట్ లోడ్ చార్జీలను మ్యూచువల్ ఫండ్ సంస్థ మార్చినట్టయితే.. పెట్టుబడి పెట్టిన తేదీ నాటికి ఉన్న ఎగ్జిట్ లోడ్ విధానమే, ఉపసంహరణ సమయంలో అమలవుతుంది. ఉదాహరణకు రూ.లక్షను 2022 నవంబర్ 1న ఒక పథకంలో ఇన్వెస్ట్ చేసినట్టు అనుకుందాం. ఆ సమయంలో ఎగ్జిట్ లోడ్ 365 రోజులకు 1 శాతంగా ఉంది. పెట్టుబడి తేదీ నాటికి పథకం ఎన్ఏవీ 20గా ఉంది. దీంతో రూ.లక్ష పెట్టుబడికి 5,000 యూనిట్లు వచ్చాయి. 2023 సెప్టెంబర్ 15న రూ.50వేలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎన్ఏవీ 25 ఉందని అనుకుందాం. రూ.50వేల కోసం 2,000 యూనిట్లను విక్రయించాలి. దీంతో ఏడాదిలోపు (365 రోజుల్లోపు) విక్రయించినట్టు అవుతుంది. కనుక ఎగ్జిట్ లోడ్ పడుతుంది. రూ.50,000 ఉపసంహరణ విలువపై ఒక శాతం ఎగ్జిట్ అంటే రూ.500 చెల్లించాలి. కనుక చేతికి రూ.49,500 వస్తాయి. ఒకవేళ ఈ ఉపంసంహరణను 2023 నవంబర్ 1 తర్వాత తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ పడదు. సిప్ రూపంలో ఒక్కో పెట్టుబడికి విడిగా ఇది అమలవుతుంది. ఉదాహరణకు 2022 నవంబర్ 1న సిప్ రూపంలో ఒక పథకంలో రూ.10,000 ఇన్వెస్ట్ చేశారు. ఎన్ఏవీ రూ.20గా ఉంది. దీంతో 500 యూనిట్లు వచ్చాయి. అప్పటికి 1 శాతం ఎగ్జిట్ లోడ్ ఉంది. 2022 డిసెంబర్ 1 నుంచి ఎగ్జిట్ లోడ్ 1.5 శాతానికి పెరిగింది. డిసెంబర్ 1న సిప్ రూపంలో రూ.10,000 ఇన్వెస్ట్ చేశారు. ఆ సమయంలోనూ ఎన్ఏవీ రూ.20 దగ్గరే ఉండడంతో మరో 500 యూనిట్లు వచ్చాయి. దీంతో ఉపసంహరణ సమయంలో యూనిట్ల విక్రయంపై ఎగ్జిట్ లోడ్ వేర్వేరుగా అమలవుతుందని గ్రహించాలి. మనీ మార్కెట్ ఫండ్ అంటే ఏమిటి? ఎవరు ఈ ఫండ్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చు? – నాగరాజు మనీ మార్కెట్ ఫండ్ అన్నది డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఏడాది కాలంలో గడువు ముగిసే స్వల్ప కాల డెట్ ఇన్స్ట్రుమెంట్లు, ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇవి రిస్క్‌లేని అంచనా వేయతగిన రాబడులను ఇవ్వగలవు. ఎందుకంటే అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి కనుక రాబడులు స్థిరంగా ఉంటాయి. కనుక మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలు దాదాపు రిస్క్‌లేని, ఎంతో రక్షణతో కూడినవి. స్వల్పకాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. ఏడాది కాలానికి ఇన్వెస్ట్ చేసుకునే వారు వీటిని పరిశీలించొచ్చు. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లపై రాబడి కంటే అధిక రాబడిని ఇవ్వగలవు. బ్యాంక్ ఖాతాల్లో ఎక్కువ బ్యాలన్స్ ఉంటే ఈ సాధనాల్లోకి మళ్లించుకోవచ్చు. మొత్తం 16 రకాల డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉండగా, లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటాయి. మీ పెట్టుబడుల కాల వ్యవధి ఏడాది అయితే లిక్విడ్ ఫండ్స్ మంచివి. ఇవి తక్కువ రిస్క్ పథకాలు. అత్యవసర నిధికి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఏడాదికి మించిన దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఏడాది నుంచి మూడేళ్ల కాల సాధనాల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడంలో ఉన్న ప్రాథమిక లక్ష్యం పెట్టుబడి పరిరక్షణతోపాటు, కొంత రాబడి కోరుకోవడం. ఈ దృష్ట్యా లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ సరిపోతాయి. -
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు. -
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెటర్ ఆప్షన్ ఏదంటే?
దీర్ఘకాలం కోసం లార్జ్‌క్యాప్ లేదా ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఏది బెటర్? – సుశాంక్ దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలని అనుకుంటే పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు చెప్పుకోతగ్గ స్థాయిలో ఉండాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో కొన్ని ఉప విభాగాలు కూడా ఉన్నాయి. అందులో లార్జ్‌క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ భాగం. లార్జ్‌క్యాప్ పథకాలు లార్జ్‌క్యాప్ (పెద్ద మార్కెట్ విలువ) కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. చిన్న ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న పరిమిత పెట్టుబడులతో విడిగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ను ఎక్కువగా (ఒకటికి మించి కంపెనీలు) కొనుగోలు చేయలేరు. అటువంటి వారు ఒక లార్జ్‌క్యాప్ పథకం ద్వారా ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుంటుంది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అలా కాదు. వివిధ మార్కెట్ విలువ కలిగిన (లార్జ్, మిడ్, స్మాల్) కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. లార్జ్‌క్యాప్ మాదిరిగా ఏదో ఒక మార్కెట్ విలువకే పరిమితం కావు. వివిధ రంగాల్లోని, వివిధ స్థాయి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పన్ను పరంగా చూస్తే ఈ రెండు ఈక్విటీ పథకాలే కనుక ఒకే మాదిరి ఉంటుంది. ఏడాది లోపు లాభాలపై 15 శాతం, ఏడాది మించిన లాభాలపై (రూ.ఒక లక్ష తర్వాత) 10 శాతం పన్ను పడుతుంది. 2013 నుంచి లార్జ్‌క్యాప్, ఫ్లెక్సీక్యాప్ విభాగాల్లో చెరో రూ.10,000 చొప్పున సిప్ ద్వారా ఇన్వెస్టి చేసి ఉంటే, 2022 జూన్ నాటికి రూ.11.60 లక్షల మొత్తం పెట్టుబడి పెట్టి ఉంటారు. కానీ, రాబడుతో కలిపి మొత్తం నిధి ఫ్లెక్సీక్యాప్‌లో రూ.24.63 లక్షలు అయి ఉండేది. అదే లార్జ్‌క్యాప్‌లో రూ.22.78 లక్షలు సమకూరేది. అంటే ఫ్లెక్సీక్యాప్ విభాగం రూ.1.84 లక్షల అధిక రాబడి ఇచ్చింది. లార్జ్‌క్యాప్, ఫ్లెక్సీక్యాప్ రెండూ పూర్తిగా ఈక్విటీల్లోనే పెట్టుబడులు పెడతాయి. కనుక అస్థిరతలు ఉంటాయని మర్చిపోవద్దు. మార్కెట్లలో ఆటుపోట్లను, స్టాక్ మార్కెట్ పనిచేసే తీరును అర్థం చేసుకున్న వారికి ఇవి అనుకూలం. కేవలం లార్జ్‌క్యాప్ కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యం కోరుకునే వారు లార్జ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాదాపు ఇన్వెస్టర్లు అందరికీ లార్జ్‌క్యాప్ అనుకూలం. మార్కెట్లో ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే సౌలభ్యంతో ఉండేవి ఫ్లెక్సీక్యాప్ పథకాలు. కొంచెం అదనపు రిస్క్ తీసుకునే వారికి అనుకూలం. పేరులో ఉన్నట్టు.. మార్కెట్లో ఎక్కడ అనుకూల అవకాశాలు ఉంటే అక్కడికి పెట్టుబడులు మళ్లించే వెసులుబాటు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు ఉంటుంది. కానీ, లార్జ్‌క్యాప్ పథకాలకు ఈ స్వేచ్ఛ ఉండదు. కనుక వైవిధ్యం కోరుకునే వారికి ఫ్లెక్సీక్యాప్ అనుకూలం. కనీసం ఐదేళ్లు, అంతకుమించి కాలానికి వీటిల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడే అసలైన రాబడులు కనిపిస్తాయి. అందుకని పెట్టుబడుల లక్ష్యాలు, రిస్క్ ఎంత మేరకు తీసుకోగలరు, ఎంత కాలం పెట్టుబడి పెట్టగలరనే అంశాల ఆధారంగా వీటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాలి. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన మార్గం అవుతుంది. షార్ట్ డ్యురేషన్ ఫండ్, బంగారం వీటిల్లో ఏది మెరుగైనది? – రాజేంద్రన్ వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో బంగారం స్థిరంగా ఉండడమే కాకుండా, రాబడినిస్తుంది. అనిశ్చిత పరిస్థితుల్లో ఇది సురక్షిత సాధనం. అయితే, ఇది సిద్ధాంతం మాత్రమే. నిజానికి బంగారంలోనూ ఎన్నో అస్థిరతలు ఉంటాయని నిరూపితమైంది. ఎన్నో కారణాలు ఈ అస్థిరతలకు దోహదం చేస్తుంటాయి. ఇందులో ఒకటి డిమాండ్-సరఫరా. పైగా బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ ఒకటి. మన దేశం పెద్ద ఎత్తున ఏటా బంగారం దిగుమతి చేసుకుంటోంది. అనుత్పాదక సాధనం కనుక బంగారం దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం సుంకాలను విధిస్తుంటుంది. ఇవి ధరలపై ప్రభావం చూపిస్తాయి. కనుక స్వల్ప కాలం కోసం అల్ట్రా షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పెరుగుతున్న వడ్డీ రేట్ల సైకిల్‌ను అధిమించడానికి ఇదే మెరుగైన మార్గం అవుతుంది. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్.. దీర్ఘకాలంలో తిరుగులేని పనితీరు!
పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ సత్వరమే నిర్ణయాలు తీసుకోగల సౌలభ్యత, సవాళ్లకు అనుగుణంగా వేగంగా మారిపోగల ప్రత్యేకత, కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడం ఇవన్నీ ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఉండే అనుకూలతలు. అన్ని రకాల మార్కెట్ విభాగాల్లో (స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్) ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, వ్యాల్యూషన్ల ఆధారంగా ఫండ్ మేనేజర్లు తమ నిర్వహణలోని పథకాల పెట్టుబడుల్లో మార్పులు చేసుకోగలరు. దీనివల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇవ్వగల సామర్థ్యం ఫ్లెక్సీక్యాప్ పథకాలకు ఉంటుంది. ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వైవిధ్యానికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే చెప్పుకోతగ్గ మేర పెట్టుబడులను అంతర్జాతీయ కంపెనీలకు కూడా కేటాయిస్తుంటుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగాన్ని సెబీ 2020 నవంబర్ 6 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. పెట్టుబడుల పరంగా సౌలభ్యం కోరుకునే పథకాలు ఈ విభాగం కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అప్పటి వరకు పరాగ్ పారిఖ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్‌గా కొనసాగిన ఈ పథకం, ఆ తర్వాత పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌గా మారిపోయింది. మల్టీక్యాప్ విభాగం నుంచి ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి చేరింది. ఈ పథకం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో కనీసం 65 శాతం మేర దేశీ స్టాక్స్‌కు కేటాయిస్తుంటుంది. విదేశీ స్టాక్స్‌కు గరిష్టంగా 35 శాతం వరకు కేటాయింపులు చేసే ఆప్షన్ కలిగి ఉంది. వ్యాల్యూ స్టాక్స్‌కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంది. పోటీ సంస్థలు ప్రవేశించలేని, ధరల నిర్ణయంలో బలాలు కలిగిన కంపెనీలను ఎంపిక చేసి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పెట్టుబడులపై అధిక రాబడులు, బలమైన బ్యాలన్స్ షీట్, యాజమాన్య దక్షతను చూస్తుంది. ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేసి దీర్ఘకాలం పాటు వేచి చూడగలదు. స్వల్పకాలంలో అధిక రాబడుల కోసం తరచుగా పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేయదు. రాబడులు ఈ పథకం అన్ని కాలాల్లోనూ మంచి రాబడులను ఇస్తూ వస్తోంది. గడిచిన ఏడాది కాలంలో 21 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. కానీ, ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి 16 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో 24 శాతం, ఐదేళ్లలో 18.47 శాతం, ఏడేళ్లలో 18.60 శాతం, పదేళ్లలో 20 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోలిస్తే పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్‌లో 3–5 శాతం మేర అధిక రాబడులు ఉన్నాయి. ఇదీ చదవండి: పిల్లల ఉన్నత విద్య కోసం.. ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి తెలుసా? పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.40వేల కోట్లు ఉన్నాయి. ఇందులో 85 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. డెట్ సాధనాల్లో 13 శాతం పెట్టుబడులు ఉండగా, 1.62 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 39 స్టాక్స్ ఉన్నాయి. ఈక్విటీల్లోనూ 89 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్‌లో 8 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులు పెట్టింది. అత్యధికంగా 30 శాతం పెట్టుబడులను బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు కేటాయించింది. సేవల రంగ కంపెనీల్లో 16 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 12 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీల్లో 7 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ స్టాక్స్‌కు 17.59 శాతం కేటాయింపులు చేసింది. -
నూతన పథకాల ఆవిష్కరణలో అప్రమత్తత
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో (జనవరి–జూలై) 59 న్యూ ఫండ్ ఆఫర్లకు (ఎన్‌ఎఫ్‌వోలు) సంబంధించి సెబీ వద్ద దరఖాస్తు దాఖలు చేశాయి. అధిక పోటీతో కూడిన వాతావరణం నేపథ్యంలో ఎన్‌ఎఫ్‌వోల రాక తగ్గినట్టు తెలుస్తోంది. గతేడాది మొదటి ఏడు నెలల్లో 70 ఎన్‌ఎఫ్‌వోలు రావడం గమనార్హం. ఇక గతేడాది మొత్తం మీద వచ్చిన కొత్త పథకాలు 228గా ఉన్నాయి. 140 ఎన్‌ఎఫ్‌వోలు 2021లో వచ్చాయి. ఇక ఈ ఏడాది మొత్తం మీద ఎన్‌ఎఫ్‌వోలు.. గత రెండు సంవత్సరాల కంటే తక్కువే ఉండొచ్చన్న అభిప్రాయాన్ని ఎస్ఏఎస్ ఆన్లైన్ సీఈవో శ్రేయజైన్ వ్యక్తం చేశారు. దీనికి పలు అంతర్గత, వెలుపలి అంశాలు కారణమై ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) కొత్త పథకాల కంటే కూడా ప్రస్తుత పథకాల నిర్వహణ, వాటికి ప్రచారం కలి్పంచుకోవడంపై దృష్టి సారించి ఉండొచ్చు. ఈ విధానంతో ప్రస్తుత ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు ఇవ్వడంతోపాటు, తమ నిర్వహణలోని ఆస్తులు స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి వీలు లభిస్తుంది’’అని జైన్ పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ గరిష్ట స్థాయిలకు చేరుకోవడం కూడా ఎన్‌ఎఫ్‌వోలు తగ్గడానికి కారణమై ఉంటుందని.. ఇక్కడి నుంచి మార్కెట్ దిద్దుబాటుకు గురికావచ్చని ఫండ్స్ భావిస్తుండొచ్చన్నారు. ‘‘మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు ప్యాసివ్ ఫండ్స్ ఎన్ని అయినా ప్రారంభించుకునే అవకాశం ఉంది. కానీ, విభాగాల వారీగా యాక్టివ్ ఫండ్స్ విషయంలో పరిమితి ఉంది’’అనే విషయాన్ని ట్రస్ట్ ఎంఎఫ్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ గుప్తా తెలిపారు. రూ.20,000 కోట్లు ఈ ఏడాది నూతన ఫండ్ ఆఫర్ల ద్వారా జూలై వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం రూ.20,000 కోట్లుగా ఉంది. 2022లో రూ.62,187 కోట్లు, 2021లో రూ.99,704 కోట్లు, 2020లో రూ.53,703 కోట్ల చొప్పున ఫండ్స్ నిధులు సమీకరించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది కొత్త పథకాల్లో ప్యాసివ్, యాక్టివ్ రెండు విభాగాల నుంచి ఉన్నాయి. -
ఇన్వెస్టర్లకు లాభాల్ని తెచ్చిపెట్టే ఈ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు తెలుసా?
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ ఇటీవలి కాలంలో మంచి ర్యాలీ చేయడాన్ని చూశాం. దీర్ఘకాలంలో లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఎక్కువ రాబడులు ఇస్తాయని చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాకపోతే అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకే స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ అనుకూలంగా ఉంటాయి. ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే.. మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతం వరకు మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాలకు కేటాయించుకోవచ్చన్నది నిపుణుల సూచన. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ విభాగంలో దీర్ఘకాలంగా మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకం కూడా ఒకటి. కనుక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఇది స్మాల్‌క్యాప్ పథకమే అయినా మిడ్, స్మాల్‌క్యాప్‌నకు సమ ప్రాధాన్యం ఇస్తోంది. పనితీరు ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకం పనితీరుకు బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ టీఆర్ఐ రాబడి ప్రామాణికం. బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ సూచీతో పోలిస్తే ఎస్బీఐ స్మాల్‌క్యాప్ కొన్ని కాలాల్లో మెరుగైన పనితీరు చూపించింది. ముఖ్యంగా ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలాల్లో బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ కంటే ఈ పథకమే అధిక రాబడులు అందించింది. ఐదేళ్లలోపు చూస్తే ప్రామాణిక సూచీ కంటే వెనుకబడింది. ఈ పథకంలో అధిక శాతం పెట్టుబడులు మిడ్‌క్యాప్‌లో ఉన్నందున ప్రామాణిక సూచితో పోల్చుకోవడం అంత అర్థవంతంగా ఉండదు. కనీసం ఏడేళ్లు అంతకుమించిన దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. గడిచిన ఏడాది కాలంలో ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకంలో నికరంగా 20 రాబడిని ఇచ్చింది. కానీ, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఇదే కాలంలో 29 శాతం పెరిగింది. ఇక మూడేళ్ల కాలంలో ఎస్బీఐ స్మాల్ క్యాప్ పథకం వార్షికంగా 36 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 18.87 శాతం చొప్పున రిటర్నులు ఇచ్చింది. ఏడేళ్లలో ఈ పథకంలో రాబడి 21 శాతం, పదేళ్లలో 27 శాతం చొప్పున ఉంది. కానీ బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 250 సూచీ రాబడి ఐదేళ్లలో 14.59 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలో 19 శాతం చొప్పునే ఉంది. ఇక ఈ పథకం ఆరంభమైన 2009 సెప్టెంబర్ నుంచి చూస్తే ఏటా 20 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. పెట్టుబడుల విధానం 2011, 2013, 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకం నష్టాలను తగ్గించే విధంగా పనిచేసింది. అంతేకాదు 2014, 2017, 2020–21 బుల్ ర్యాలీల్లోనూ మంచి పనితీరు చూపించింది. మొత్తం పెట్టుబడుల్లో స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.18,625 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోని గమనించినట్టయితే 94 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఇది పేరుకు స్మాల్‌క్యాప్ ఫండ్ అయినప్పటికీ స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 38.57 శాతంగానే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో 60 శాతం ఇన్వెస్ట్ చేసింది. లార్జ్‌క్యాప్ పెట్టుబడులు ఒక శాతం కంటే తక్కువే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 54 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా సేవల రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 16.38 శాతం కేటాయింపులు చేసింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డిస్క్రీషనరీ రంగానికి 13.59 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 13.30 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు 7.88 శాతం, మెటల్స్, మైనింగ్ కంపెనీలకు 7.86 శాతం, కెమికల్స్ కంపెనీలకు 6.97 శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి. -
హైబ్రిడ్ పథకాల పట్ల ఆకర్షణ
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ క్వార్టర్లో రూ.14,021 కోట్లను ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వం ఇటీవల తీసుకొచి్చన నూతన పన్ను నిబంధన కారణమని తెలుస్తోంది. క్రితం ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచి్చన పెట్టుబడులు రూ.10,084 కోట్లుగా ఉన్నాయి. అంటే సమారు 40 శాతం మేర పెట్టుబడులు పెరిగాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో బంగారం తదితర సాధనాల్లోనూ కొంత మేర పెట్టుబడులు పెడతాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) కూడా పెరిగాయి. మధ్యస్థం నుంచి తక్కువ రిస్క్ తీసుకునే వారికి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ కాస్త తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఇవే హైబ్రిడ్ ఫథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.7,420 కోట్లను నికరంగా ఉపసంహరించుకోవడం గమనార్హం. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ రూ.7,041 కోట్లు, సెపె్టంబర్ త్రైమాసికంలో రూ.14,436 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికం తర్వాత హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం మళ్లీ జూన్ త్రైమాసికంలోనే నమోదైంది. పన్ను పరమైన అనుకూలత హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు రావడం వెనుక పన్ను పరమైన ప్రయోజనాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగిస్తే వచి్చన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి చూపించుకునే అవకాశం ఉండేది. దీంతో పన్ను భారం తక్కువగా ఉండేది. కానీ, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచి్చన నిబంధనల ప్రకారం డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధితో సంబంధం లేకుండా లాభం వార్షిక ఆదాయంలో భాగంగా చూపించి పన్ను చెల్లించడం తప్పనిసరి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించుకునే వెసులుబాటు రద్ధు చేశారు. దీంతో ఆవి ఆకర్షణను కోల్పోయాయి. డెట్ పథకాలకు సంబంధించి పన్ను నిబంధనలో మార్పు హైబ్రిడ్ పథకాల్లోకి పెట్టుబడులు పెరిగేందుకు కారణమైనట్టు క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లి తెలిపారు. ‘‘ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో వార్షిక రాబడి 7 శాతంగా ఉంటుంది. డెట్ ఫండ్స్‌తో పోలిస్తే పన్ను పరంగా అనుకూలమైనది. అందుకే ఈ విభాగంలో మరింత ఆదరణ కనిపిస్తోంది’’ అని వివరించారు. డెట్ ఫండ్స్‌పై పన్ను నిబంధన మారిపోవడంతో ఇన్వెస్టర్లు హైబ్రిడ్ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు మారి్నంగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ కౌస్తభ్ బేల పుర్కార్ తెలిపారు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ తక్కువ అస్థిరతలతో, ఈక్విటీ పన్ను ప్రయోజనం కలిగి ఉండడం ఆకర్షణీయమైనదిగా పేర్కొన్నారు. హైబ్రిడ్ పథకాల్లో లాభాలకు ఈక్విటీ మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది కనుక తక్కువ పన్ను అంశం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని తెలుస్తోంది. -
CDMDF: కార్పొరేట్ డెట్ మార్కెట్ అభివృద్ధి నిధి
న్యూఢిల్లీ: కార్పొరేట్ డెట్ మార్కెట్ అభివృద్ధి నిధి (సీడీఎండీఎఫ్)కి సంబంధించి సెబీ కార్యాచరణను ప్రకటించింది. ఈ తరహా ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే విషయమై మ్యూచువల్ ఫండ్స్‌కు మార్గదర్శకాలను సెబీ విడుదల చేసింది. సీడీఎండీఎఫ్ ఏర్పాటుకు సంబంధించి సెబీ ఈ ఏడాది జూన్‌లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఇది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్) విభాగం కిందకు వస్తుంది. ఆర్థిక మాంద్యం, సంక్షోభాల సమయంలో కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన సన్నద్ధత సదుపాయం ఇది. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో విశ్వాసాన్ని పెంచడం, లిక్విడిటీని పెంచడమే దీని ఏర్పాటు ఉద్దేశ్యం. సీడీఎండీఎఫ్ యూనిట్లకు సంబంధించి సెబీ రెండు వేర్వేరు సర్క్యులర్లను జారీ చేసింది. సీడీఎండీఎఫ్ యూనిట్లను డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్, ఓవర్‌నైట్, గిల్ట్ ఫండ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ తరహా డెట్ ఫండ్స్ తమ నిర్వహణలోని ఆస్తుల్లో 0.25 శాతాన్ని సీడీఎండీఎఫ్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ స్పష్టం చేసింది. నిర్వహణ ఆస్తులు పెరిగే కొద్దీ, ప్రతీ ఆరు నెలలకోసారి 0.25 శాతం గరిష్ట పరిమితి మేరకు పెట్టుబడులు పెంచుకోవచ్చని పేర్కొంది. సంక్షోభాల్లో ఆపత్కాల నిధి మార్కెట్లు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో డెట్ సెక్యూరిటీల పరంగా లిక్విడిటీ సమస్య ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగా సెబీ సీడీఎండీఎఫ్ను తీసుకొచి్చంది. ఆ సమయంలో కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలను సీడీఎండీఎఫ్ ముందుకు వచ్చి కొనుగోలు చేస్తుంది. సాధారణ సమయంలో లో డ్యురేషన్ జీ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల్లో ఇన్వెస్ట్ చేస్తుందని సెబీ తెలిపింది. -
ఫండ్స్‌కు కూడా త్వరలోనే టీప్లస్1
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో యూనిట్ల కేటాయింపు, ఉపసంహరణ సమయాన్ని ఒక్కరోజుకు తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఇప్పటికే నగదు విభాగంలో అన్ని రకాల స్క్రిప్‌లకు టీప్లస్1 వధానం అమలవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై దీని ప్రభావం ఉంటుందన్నారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో యూనిట్ల కేటాయింపు, ఉపసంహరణకు టీప్లస్2 విధానం అమలవుతోంది. ట్రేడ్ చేసిన తర్వాత నుంచి రెండో రోజు ముగింపునే యూనిట్ల కేటాయింపు, లేదా నగదు జమ ప్రస్తుతం సాధ్యపడుతోంది. టీప్లస్ 1 అమల్లోకి వస్తే ట్రేడ్ చేసిన మరుసటి రోజే లావాదేవీ సెటిల్మెంట్ పూర్తవుతుంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి ముందు వరకు టీప్లస్3 అమల్లో ఉండేది. ఈక్విటీలకు టీప్లస్1 అమల్లోకి వచి్చన వెంటనే, ఫండ్స్ టీప్లస్2కు మారాయి. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఉపసంహరణ కాలాన్ని తగ్గించడం వల్ల తమ అంచనా ప్రకారం ఇన్వెస్టర్లకు రూ.230 కోట్ల మేర ప్రయోజనం సమకూరిందని మాధురి తెలిపారు ప్రస్తుతానికి సెబీ ముందు ఆరు మ్యూచువల్ ఫండ్ దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నట్టు వెల్లడించారు. నిబంధనలు వేగంగా అమలు.. పరిశ్రమ నిబంధనలను వేగంగా అమలు చేయడానికి పూర్తిగా కొత్త ఆర్కిటెక్చర్‌ను ప్రవేశపెట్డడాన్ని పరిశీలిస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. సెబీ ప్రకటించిన నిబంధన అమలు చాలా కష్టంగా ఉంటుందనే అభిప్రాయం భాగస్వాముల నుంచి వ్యక్తమవుతుండడంతో నూతన ఆర్కిటెక్చర్ఫై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఇదొక రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌గా పేర్కొన్నారు. నిబంధనల అమలులో పరిశ్రమకు సహకారం అందించే మాదిరిగా ఉంటుందన్నారు. నిబంధనలను పాటించేందుకు కంపెనీలు రూ.వేల కోట్లు ఖర్చు చేయాలని సెబీ కోరుకోవడం లేదన్నారు. డీలిస్టింగ్ సులభతరం.. డీలిస్టింగ్ విధానాన్ని సమీక్షిస్తామని సెబీ చైర్పర్సన్ హామీ ఇచ్చారు. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని డిసెంబర్ నాటికి విడుదల చేస్తామని ప్రకటించారు.డీలిస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడమే దీని ఉద్దేశ్యమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రివర్స్ బుక్ బిల్డింగ్ విధానంపై ఆందోళనలు ఉన్నట్టు చెప్పారు. కంపెనీలో 10 శాతానికి పైగా వాటా కొనుగోలు చేయడం ద్వారా ఆపరేటర్లు రేట్లను పెంచి, కంపెనీలకు భారంగా మారుతున్నట్టు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ ఆధ్వర్యంలోని కమిటీ ఈ అంశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. డీలిస్టింగ్‌కు ఫిక్స్డ్ ధర విధానాన్ని తీసుకురావచ్చని సంకేతం ఇచ్చారు. రివర్స్బుక్ బిల్డింగ్ విధానంలో వాటాదారులు తమకు నచి్చన ధరను కోట్ చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఫిన్‌ఫ్లూయెన్సర్స్ (ఆర్థికంగా ప్రభావితం చేసే వ్యక్తులు) పై సంప్రదింపుల పత్రాన్ని తీసుకువస్తామని సెబీ చైర్పర్సన్ తెలిపారు. ఫిన్ఫ్లూయెన్సర్ను సెబీ నియంత్రించలేదని స్పష్టం చేశారు. వారు తమ వ్యక్తిగత హోదాలో చేసే సిఫారసులను భారతీయ చట్టాల కింద నిషేధించలేమని స్పష్టం చేశారు. కాకపోతే వీరితో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా స్టాక్ బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్స్‌ను నియంత్రించగలమన్నారు. తక్షణమే సెటిల్మెంట్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లావాదేవీ నమోదైన వెంటనే పరిష్కరించే సెటిల్మెంట్ విధానాన్ని (ఇన్స్టానియస్) తీసుకురావడమే తమ లక్ష్యమని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. ప్రస్తుతం దీనిపైనే దృష్టి పెట్టామని చెబుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావచ్చని సంకేతం ఇచ్చారు. నిజానికి సెబీ ఇటీవలే స్టాక్స్‌కు టీప్లస్1 సెటిల్మెంట్ను తీసుకొచి్చంది. నూతన విధానంలో దీన్ని మరింత తగ్గించనున్నట్టు తెలుస్తోంది. నూతన సెటిల్మెంట్ను అమలు చేసే విషయమై భాగస్వాములతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని సెబీ చైర్పర్సన్ తెలిపారు. క్యాపిటల్ మార్కెట్లలో సమయం ఎంతో ముఖ్యమని చెబుతూ.. ఆలస్యం అనేది ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఈఎస్జీ కింద 6 కొత్త విభాగాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈఎస్జీ విభాగం కింద (పర్యావరణం, సామాజికం, పరిపాలనా అనుకూలమైన) 6 కొత్త విభాగాలను ప్రవేశపెట్టేందుకు సెబీ అనుమతించింది. ఎక్స్‌క్లూజన్స్, ఇంటెగ్రేషన్, బెస్ట్ ఇన్ క్లాస్, పాజిటివ్ స్క్రీనింగ్, ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్, సస్టెయినబుల్ అబ్జెక్టివ్స్ ఈ విభాగాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు థీమ్యాటిక్ విభాగం కింద ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ ఒక్క ఈఎస్జీ పథకం ఆవిష్కరణకే అనుమతి ఉండడం గమనార్హం. ఈఎస్జీ కింద నూతన విభాగానికి కేటాయింపులు అనేవి తక్షణం అమల్లోకి వస్తాయని సెబీ స్పష్టం చేసింది. పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్టులకు ఈ రూపంలో కావాల్సిన నిధుల మద్దతు లభిస్తుందని సెబీ తన ఆదేశాల వెను క లక్ష్యాన్ని వివరించింది. ఈఎస్జీ పథకాల పే రుతో సమీకరించిన ని« దులను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈ విభాగంలో పనిచేసే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈఎస్జీ పథకాల కింద సమీకరించిన మొత్తం నిధుల్లో 65 శాతాన్ని లిస్టెడ్ కంపెనీల్లోనే పెట్టాలని సెబీ నిబంధన విధించింది. మిగిలిన 35 శాతాన్ని వ్యాపార బాధ్యత, సస్టెయినబులిటీ రిపోరి్టంగ్ వివరాలను (బీఆర్ఎస్ఆర్) వెల్లడించే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చని పేర్కొంది. -
వేల్యుయేషన్స్ మరీ అధికంగా లేవు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ మార్కెట్లు కొత్త గరిష్ట స్థాయులను తాకుతున్నా, వేల్యుయేషన్స్ మరీ అధిక స్థాయికి చేరలేదని మ్యుచువల్ ఫండ్ సంస్థ యూటీఐ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐవో) వెట్రి సుబ్రమణ్యం చెప్పారు. వాస్తవానికి 2021 నాటితో పోలిస్తే ఇంకా కాస్త తక్కువలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ నిబ్బరంగా ఉన్న అమెరికాలో పరిస్థితులేమైనా మారి, మాంద్యంలాంటిదేమైనా వస్తే మార్కెట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అయితే, ప్రస్తుతం మాత్రం అటువంటిదేమీ కనిపించడం లేదని పేర్కొన్నారు. స్మాల్‌క్యాప్ వేల్యుయేషన్స్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో లార్జ్ క్యాప్స్ మెరుగ్గా ఉన్నాయని సోమవారమిక్కడ విలేకరులకు సుబ్రమణ్యం చెప్పారు. పెట్టుబడులకు సంబంధించి ఫైనాన్షియల్స్, ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ తదితర రంగాలు కొంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని వివరించారు. తాజాగా యూటీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజీ ఫండ్ పేరిట కొత్త ఫండ్ (ఎన్ఎఫ్వో)ను ప్రారంభిస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. ఇది జూలై 21న ప్రారంభమవుతుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్ ద్వారా సేకరించే నిధులను వేల్యుయేషన్స్ ప్రాతిపదికన ఈక్విటీ, ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తామని, తద్వారా అధిక రాబడులు అందించేందుకు ప్రయతి్నస్తామని సుబ్రమణ్యం చెప్పారు. -
50 శాతం ఏయూఎం వృద్ధిపై యూనియన్ ఎంఎఫ్ గురి
ముంబై: యూనియన్ మ్యూచువల్ ఫండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన నిర్వహణ ఆస్తులను (ఏయూఎం) 50 శాతం మేర పెంచుకోనున్నట్టు ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఈ సంస్థ ఏయూఎం రూ.9,853 కోట్లుగా ఉంటే, 2024 మార్చి నాటికి రూ.15,000 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఎప్పుడో 2012లోనే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ సేవలు ప్రారంభించినప్పటికీ ఇంతకాలం ఆస్తుల్లో వృద్ధి చెప్పుకోతగినంత లేదు. ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన యూనియన్ మ్యూచువల్ ఫండ్‌లో, 39.64 శాతం వాటాను జపాన్‌కు చెందిన దైచీలైఫ్ 2018లో కొనుగోలు చేయడం గమనార్హం. ఈ సంస్థ ఏయూఎంలో టాప్–30 పట్టణాల వాటా 68 శాతంగా ఉంటే, బీ30 (బియాండ్ 30) పట్టణాల నుంచి 32 శాతం ఆస్తులను కలిగి ఉంది. ‘‘మార్చి చివరికి ఉన్న ఏయూఎం రూ.9,853 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం చివరికి రూ.10,700 కోట్లకు చేరుకుంది. వచ్చే మార్చి నాటికి ఇది రూ.15,000 కోట్లకు చేరుతుందని భావిస్తున్నాం. పెద్ద థీమ్యాటిక్ ఫండ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నాం. దీని ద్వారా రూ.500 కోట్లు సమీకరించగలమని అంచనా వేస్తున్నాం. మార్కెట్‌పైనే ఇది ఆధారపడి ఉంటుంది’’అని యూనియన్ మ్యూచువల్ ఫండ్ సీఈవో జి.ప్రదీప్‌కుమార్ తెలిపారు. కొత్త భాగస్వామి మద్దతుతో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ఏయూఎంలో వృద్ధి పెద్దగా లేకపోవడానికి బెల్జియంకు చెందిన కేబీసీ తొలుత భాగస్వామిగా ఉండడమేనని ప్రదీప్‌కుమార్ వెల్లడించారు. థర్డ్ పార్టీ విక్రయాలకు ఆ సంస్థ సమ్మతించకపోవడంతో, కేవలం యూనియన్ బ్యాంక్ శాఖల ద్వారానే విక్రయాలు చేయాల్సి వచి్చందన్నారు. 2018లో దైచీ రాకతో అప్పటికీ కేవలం రూ.4,500 కోట్లుగానే ఉన్న ఏయూఎం, ఐదేళ్లలో రెట్టింపైనట్టు చెప్పారు. ఇక ముందూ ఇదే విధంగా వృద్ధిని సాధిస్తామన్నారు. -
భద్రతే లక్ష్యంగా.. మ్యూచువల్ ఫండ్స్‌లో సెబీ కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణకు, పారదర్శకత పెంచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలపై మరింత బాధ్యతలు మోపింది. ప్రతి అసెట్ మేనేజ్మెంట్ కమిటీ (ఏఎంసీ/మ్యూచువల్ ఫండ్ నిర్వహణ సంస్థ) కొత్తగా యూనిట్ హోల్డర్ (ఇన్వెస్టర్) ప్రొటెక్షన్ కమిటీ (యూహెచ్‌పీసీ)ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఏఎంసీ నిర్ణయాలు యూనిట్ హోల్డర్ల ప్రయోజనాల కోణంలోనే ఉన్నాయా అన్నది యూహెచ్‌పీసీ పర్యవేక్షించనుంది. కొత్త నిబంధనలు జనవరి 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వ స్తాయని సెబీ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. ఇవీ కొత్త మార్గదర్శకాలు ►మ్యూచువల్ ఫండ్స్ తమ నిర్వహణ ఆస్తులను పెంచుకునేందుకు తప్పుడు మార్గాల్లో పెట్టుబడులను ఆకర్షించకుండా తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా సంబంధిత మ్యూచువల్ ఫండ్ ట్రస్టీ చూడాలి. ►తమ ఉద్యోగులు, అనుబంధ సంస్థలు దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలి. మోసపూరిత లావాదేవీలు చోటు చేసుకోకుండా, ఉద్యోగులు ఫ్రంట్ రన్నింగ్‌కు పాల్పడకుండా (సంస్థ నిర్ణయాలు ముందే తెలుసుకుని ప్రయోజనం పొందడం), డిస్ట్రిబ్యూటర్లు ఆకర్షించే అంచనాలతో ఉత్పత్తులను విక్రయించకుండా తగిన చెకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి. ► ఏంఎసీలు వసూలు చేసే ఫీజులు, వ్యయాలు పారదర్శకంగా ఉండేలా ట్రస్టీలు చూడాలి. ► ఏఎంసీల పథకాల వారీగా పనితీరు, పోటీ పథకాలతో, సూచీలతో పోల్చినప్పుడు ఎలా ఉందన్నది సమీక్షించాలి. ► కేవైసీ వివరాలు సరిగ్గా లేని ఫోలియోల విషయంలో ఏఎంసీలు తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ► ఈ బాధ్యతల నిర్వహణకు ఫండ్ ట్రస్టీలు ఆడి ట్, న్యాయ సేవల సంస్థలు, మర్చంట్ బ్యాంకర్లు, తదితర నిపుణుల సేవలు పొందొచ్చు. ► ఓ కంపెనీ ఫండ్ ట్రస్టీగా నియమితమైతే, చైర్‌పర్సన్‌గా ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండాలి. ►మ్యూచువల్ ఫండ్స్ అందించే ఉత్పత్తులు, సేవలకు సంబంధించి యూనిట్ హోల్డర్ల ప్రయోజనాలకు యూహెచ్‌పీసీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫండ్ స్పాన్సర్లకు కొత్త నియమావళి ►మ్యూచువల్ ఫండ్‌ను స్పాన్సర్ చేసే ప్రైవేటు ఈక్విటీ సంస్థలకు కొత్త కార్యాచరణను సెబీ ప్రతిపాదించింది. ప్రైవేటు ఈక్విటీ సంస్థలకు ఫండ్ మేనేజర్‌గా కనీసం ఐదేళ్ల అనుభవం, కనీసం రూ.5,000 కోట్ల ఆస్తులను నిర్వహించి ఉండాలి. -
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఆస్తులు జూమ్
ముంబై: దేశంలోనే మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) పరంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త రికార్డు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ. 90 వేల కోట్ల మేర ఆస్తులను పెంచుకుంది. దీంతో సంస్థ నిర్వహణలోని మొత్తం ఏయూఎం మార్చి నాటికి ఉన్న రూ.7.10 లక్షల కోట్ల నుంచి, జూన్ చివరికి రూ.8 లక్షల కోట్లకు చేరుకుంది. వచ్చే 12 నుంచి 18 నెలల్లో మొత్తం నిర్వహణ ఆస్తులు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్టు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ ఎండీ, చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ డీపీ సింగ్ తెలిపారు. రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరుకోవాలనే లక్ష్యాన్ని అంతర్గతంగా విధించుకున్నట్టు చెప్పారు. మార్కెట్లో ఏదైనా తీవ్ర పతనాన్ని చూస్తే తప్పితే, తాము దీన్ని చేరుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఏయూఎం జూన్ చివరికి రూ.43.2 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 8 శాతం మార్కెట్ వాటా: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణ ఆస్తులు రూ.43.2 లక్షల కోట్ల ప్రకారం చూస్తే, ఎస్బీఐ ఫండ్ ఏయూఎం వాటా 18%. ఇందులో రూ.5.5 లక్షల కోట్ల ఆస్తులు ఈక్విటీలకు సంబంధించినవిగా సింగ్ వెల్లడించారు. ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో తమ పథకాల్లోకి రూ.2,200 కోట్లు వస్తున్నట్టు తెలిపారు. ఎక్కువ పెట్టుబడులు టాప్–30 పట్టణాల నుంచి ఉన్నాయన్నారు. ఎస్బీఐ నిర్వహణలోని ఫోలియోల్లో (పెట్టుబడి ఖాతా) 35% చిన్న పట్టణాలవేనని తెలిపారు. -
ఇన్వెస్టర్లకు లాభాల్ని తెచ్చిపెడుతున్న మ్యూచువల్ ఫండ్ ఇదే
దీర్ఘకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, అందులోనూ లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ పట్ల సానుకూలంగా ఉన్న వారు.. ఈ విభాగంలో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆరంభం నుంచి ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సంవత్సరాలు మినహాయిస్తే చక్కని పనితీరుతో దూసుకుపోతోంది. సెబీ 2017లో మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వర్గీకరణకు ముందు ఈ పథకం మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌తో ఉండేది. అనంతరం ఎక్కువ పెట్టుబడులను లార్జ్ క్యాప్ విభాగానికి కేటాయించే విధంగా మార్పులు చేసింది. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం కిందకు ఇది వస్తుంది. 5 స్టార్ రేటెడ్ పథకం కావడం గమనార్హం. రాబడులు ఈ పథకంలో ఏడాది రాబడులు 19 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షికంగా 26 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. అలాగే, ఐదేళ్లలో వార్షికంగా 17 శాతం, ఏడేళ్లలో వార్షికంగా 18 శాతం, పదేళ్లలో 23 శాతం చొప్పున రాబడులను అందించింది. కానీ, ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా భావించే బీఎస్ఈ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ సూచీ పెరుగుదల ఏడాదిలో 21 శాతం, మూడేళ్లలో 24 శాతం, ఐదేళ్లలో 14 శాతం, ఏడేళ్లలో 14 శాతం, పదేళ్లలో 14.58 శాతం చొప్పునే ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. ఏడాది కాలం మినహాయిస్తే మిగిలిన అన్ని కాలాల్లోనూ ప్రామాణిక సూచీ కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. ఇక ఈ పథకం 2010 జూలై 9న ప్రారంభం కాగా, నాటి నుంచి చూస్తే ఏటా 19.74 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చి పెట్టింది. పెట్టుబడుల విధానం లార్జ్‌క్యాప్‌లో కనీసం 35 శాతం, గరిష్టంగా 65 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే, మిడ్‌క్యాప్‌లో కనీసం 35 శాతం పెట్టుబడులు పెడుతుంటుంది. ఈ పథకం గత పనితీరును పరిశీలించినట్టయితే కొన్ని సందర్భాల్లో వెనుకబడినప్పటికీ.. తర్వాతి సంవత్సరాల్లో అద్భుత రాబడులతో సగటున మెరుగైన పనితీరును చూపించినట్టు అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ముఖ్యంగా భవిష్యత్తులో బ్లూచిప్ కంపెనీలుగా అవతరించే సామర్థ్యాలున్న మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలను గుర్తించి వాటిల్లో ఎక్స్పోజర్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.25,332 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం తనవద్దనున్న పెట్టుబడుల్లో 98.66 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ముఖ్యంగా మెగాక్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 55 శాతానికి పైనే పెట్టుబడులు కలిగి ఉండగా, మిడ్‌క్యాప్‌లో 40 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 4 శాతం వరకు పెట్టుబడులు కలిగి ఉంది. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ కొంచెం అదనపు రాబడులను దీర్ఘకాలంలో ఇస్తాయి. కనుక మూడు విభాగాల్లోనూ ఎక్స్పోజర్ ఉండడం రాబడుల పరంగా అనుకూలమైనది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 79 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగాల స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 28 శాతం వరకు పెట్టుబడులను ఈ రంగంలోని కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 9 శాతం పెట్టుబడులు పెట్టింది. ఆటోమొబైల్ కంపెనీలకు 8.32 శాతం పెట్టుబడులు కేటాయించింది. టెక్నాలజీ రంగ కంపెనీల్లో 8.23 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 7.85 శాతం, సేవల రంగ కంపెనీల్లో 7.66 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. -
నిలిచిపోతున్న ‘సిప్’ ఖాతాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (సిప్)లు కొన్ని నిలిచిపోతున్నాయి. మార్కెట్లు స్థిరంగా ర్యాలీ చేస్తున్నప్పటికీ మే నెలలో సిప్ ద్వారా పెట్టుబడులను నిలిపివేసిన ఖాతాల సంఖ్య 14.19 లక్షలకు చేరింది. ఏప్రిల్ చివరికి ఉన్న 13.21 లక్షల ఖాతాలతో పోలిస్తే 7.4 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు సిప్ రూపంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి మే నెలలో రికార్డు స్థాయిలో రూ.14,749 కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కొత్త ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఈ సాధనాన్ని ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మే నెలలో నూతన సిప్ ఖాతాల నమోదు 24.7 లక్షలుగా ఉంది. ఏప్రిల్ నెలలో ఇది 19.56 లక్షలుగా ఉండడం గమనార్హం. నిలిచిపోయిన సిప్ ఖాతాలతో పోలిస్తే కొత్తగా నమోదైన సిప్ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉండడం, ఈ మార్గం పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తిని తెలియజేస్తోందని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ ఎండీ డీపీ సింగ్ పేర్కొన్నారు. సిప్‌లను సులభంగా ఆన్లైన్లో రద్దు చేసుకునే సదుపాయం ఉండడం కూడా ఒక కారణమన్నారు. సిప్ ఆస్తులు రూ.7.53 లక్షల కోట్లు మరోవైపు మే నెలలో ఇన్వెస్టర్లు సిప్ ద్వారా రికార్డు స్థాయిలో పెట్టుబడుల పెట్టడంతో మొత్తం సిప్ ఆస్తుల విలువ ఏప్రిల్ చివరికి ఉన్న రూ.7.17 లక్షల కోట్ల నుంచి మే చివరికి రూ.7.53 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 1.43 కోట్ల సిప్ ఖాతాలు నిలిచిపోవడం లేదా గడువు తీరిపోవడం జరిగింది. 2021–22లో ఇలాంటి ఖాతాలు 1.11 కోట్లుగా ఉన్నాయి. ఇక మే చివరికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల నిర్వహణలోని ఆస్తుల విలువ 4.5 శాతం వృద్ధితో రూ.16.56 లక్షల కోట్లకు చేరింది. -
డైరెక్ట్ ప్లాన్ల విషయంలో ఇన్వెస్టర్లకు రక్షణ
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడులకు వీలు కల్పించే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు నూతన నియంత్రణపరమైన కార్యాచరణను ప్రకటించింది. ఇది సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని సెబీ ప్రకటించింది. మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్, డైరెక్ట్ ప్లాన్ అని రెండు రకాలు ఉంటాయి. డైరెక్ట్ ప్లాన్లలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. దీంతో రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. దీనివల్ల రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే, డైరెక్ట్ ప్లాన్లలో దీర్ఘకాలంలో అధిక రాబడులు పొందొచ్చు. ఫలితంగా డైరెక్ట్ ప్లాన్ల పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జెరోదా తదితర స్టాక్ బ్రోకర్లతోపాటు, పేటీఎం మనీ తదితర ఎన్నో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వీటిని ఇన్వెస్టర్లకు ఆఫర్ చేస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎవరైనా డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆయా సంస్థలకు క్లయింట్లు కానక్కర్లేదు. ఇలా తమ క్లయింట్లు కాని వారికి కూడా మ్యూచువల్ ఫండ్స్ పథకాల డైరెక్ట్ ప్లాన్లలో కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలకు వీలు కల్పించే సంస్థలకు జవాబుదారీ ఉండాలని సెబీ భావించి ఈ దిశగా నిబంధనలను ప్రకటించింది. ఇప్పటి వరకు క్లయింట్లు కాని వారికి సేవల విషయంలో నియంత్రణ లేదు. -
బంగారం ఈటీఎఫ్‌ల జోరు
న్యూఢిల్లీ: అనిశ్చిత సమయాల్లో సురక్షిత పెట్టుబడి సాధనమైన గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్) మే నెలలో నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఇన్వెస్టర్లు ఏప్రిల్ నెలలో రూ.124 కోట్లను బంగారం ఈటీఎఫ్‌లలో నికరంగా పెట్టుబడి పెట్టగా, మే నెలలో 20 శాతం తక్కువగా, రూ.103 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దీనితో బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలో మొత్తం ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ మే చివరికి రూ.23,128 కోట్లుగా ఉంది. ఏప్రిల్ చివరికి ఇది రూ.22,950 కోట్లు కావడం గమనార్హం. కాగా,అంతకుముందు నెల మార్చిలో (2023)లో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు రూ.266 కోట్లను ఉపసంహరించుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలు విడుదల చేసింది. మే నెలలో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గడం అన్నది లాభాల స్వీకరణ వల్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెంట్రల్ బ్యాంకులు తదుపరి వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించి ఉండవచ్చని భావిస్తున్నారు.