న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) సిప్ ద్వారా రూ.1.56 లక్షల కోట్ల పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చినట్టు ‘యాంఫి’ గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సిప్ పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి కనిపించింది.
మార్కెట్లలో అస్థిరతలను అధిగమించేందుకు సిప్ మెరుగైన సాధనమని తెలిసిందే. దీనివల్ల మార్కెట్లు పడినప్పుడు, పెరుగుతున్నప్పుడు కూడా పెట్టుబడులు కొనసాగుతాయి కనుక కొనుగోలు సగటుగా మారుతుంది. 2020–21లో సిప్ పెట్టుబడులు రూ.96,080 కోట్లుగా ఉన్నాయి. అంటే ఏటేటా సిప్ పెట్టుబడులు వృద్ధి చెందుతున్నట్టు స్పష్టమవుతోంది. 2016–17లో ఉన్న రూ.43,921 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి.
ప్రతి నెలా సిప్ రూపంలో వచ్చే పెట్టుబడులు సైతం మార్చి నెలకు రూ.14,276 కోట్లుగా నమోదయ్యాయి. నెలవారీ గరిష్ట సిప్ పెట్టుబడులు ఇవే. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద సగటున ప్రతి నెలా రూ.13,000 కోట్ల చొప్పున వచ్చాయి. ఇన్వెస్టర్లు దీర్ఘకాల వృద్ధి పట్ల నమ్మకంగా ఉన్నారని, అందుకే ఏకమొత్తంలో కంటే సిప్ రూపంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని కోటక్ మహీంద్రా ఏఎంసీ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ మనీష్ మెహతా తెలిపారు.
‘‘గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద మార్కెట్లు అస్థిరంగానే ఉన్నాయి. అయినా కానీ, దేశీయ మార్కెట్ పట్ల ఇన్వెస్టర్లు నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు. పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రాధాన్య మార్గంగా చూస్తున్నారు’’అని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 18 శాతం పెరిగి రూ.6.83 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం సిప్ ఖాతాల సంఖ్య 6.36 కోట్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment