న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) పట్ల నమ్మకం పెరుగుతోంది. 2022లో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ ద్వారా రూ.1.5 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇది అంతకుముందు సంవత్సరంలో వచ్చిన రూ.1.14 లక్షల కోట్లతో పోలిస్తే 31 శాతం అధికం. 2020లో సిప్ ద్వారా రూ.97,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంటే ఏటేటా సిప్ సాధనం ద్వారా మరింత మంది పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తోంది.
2023లోనూ సిప్ రూపంలో పెట్టుబడులు రాక అధికంగా ఉంటుందని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కౌస్తభ్ బేలపుర్కార్ అంచనా వేశారు. సిప్ ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టాలన్న ప్రాముఖ్యతను ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నట్టు చెప్పారు. ‘‘కొత్త ఇన్వెస్టర్ల రాకతో సిప్ గణాంకాలు ఇంకా పెరుగుతాయి. మార్కెట్లలో అస్థిరతల ఆధారంగా లంప్‌సమ్ (ఏకమొత్తంలో) పెట్టుబడులు ఆధారపడి ఉంటాయి. మార్కెట్లు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించి ఇతర సాధనాలకు మళ్లించడం చూస్తూనే ఉన్నాం’’అని పుర్కార్ పేర్కొన్నారు.
నెలవారీగా రూ.13,573 కోట్లు..
సిప్ పుస్తకం 2021 డిసెంబర్ నాటికి నెలవారీగా రూ.11,305 కోట్లుగా ఉంటే, అది 2022 డిసెంబర్ నెలకు రూ.13,573 కోట్లకు వృద్ధి చెందింది. రూ.13వేల కోట్లకు పైగా నెలవారీ సిప్ పెట్టుబడులు నమోదు కావడం వరుసగా మూడు నెలల నుంచి నమోదవుతోంది. ఇక 2022లో నెలవారీ సగటు సిప్ పెట్టుబడులు రూ.12,400 కోట్ల చొప్పున ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద సిప్ రూపంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల విలువ (ఏయూఎం) 2022 డిసెంబర్ నాటికి రూ.6.75 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. 2021 డిసెంబర్ నాటికి ఈ మొత్తం రూ.5.65 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం సిప్ ఖాతాల సంఖ్య 6.12 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment