న్యూఢిల్లీ: సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (క్రమానుగత పెట్టుబడులు/సిప్)కు ఆదరణ పెరుగుతోంది. ఈ మార్గంలో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా సిప్ రూపంలో ప్రతి నెలా వచ్చే పెట్టుబడుల మొత్తం పెరుగుతోంది. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరానికి సిప్ రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇవి అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020–21)లో వచ్చిన రూ.96,080 కోట్లతో పోలిస్తే ఏడాదిలో 30 శాతం వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది.
ఈ మేరకు గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను మ్యూచువల్ ఫండ్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద సిప్ రూపంలో ఫండ్స్ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.43,921 కోట్లుగా ఉన్నాయి. అంటే గత ఐదేళ్లలో రెండు రెట్లు మేర పెరిగినట్టు తెలుస్తుంది. సిప్‌కు ఆదరణ ఎంతో వేగంగా పెరుగుతుందనడానికి ఇదే నిదర్శం. 2021 మార్చి నెలకు సిప్ రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.9,182 కోట్లుగా ఉంటే.. 2022 మార్చి నెలలో ఇవి రూ.12,328 కోట్లకు వృద్ధి చెందాయి. ఏడాదిలో 34 శాతం వృద్ధి కనిపిస్తోంది.
ఇన్వెస్టర్లలో విశ్వాసానికి నిదర్శనం..
సిప్ బుక్ పరిమాణం పెరగడం.. ఈక్విటీల్లో పెట్టుబడులకు మెరుగైన సాధనంగా ఇన్వెస్టర్లలో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శమని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద సిప్ రూపంలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 2022 మార్చి నాటికి రూ.5.76 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. గతేడాది మార్చి చివరికి నాటికి ఇవి రూ.4.28 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఐదేళ్లలో సిప్ ఏయూఎం ఏటా 30 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వస్తోంది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద 5.39 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి. వీటి ద్వారా ఇన్వెస్టర్లు ప్రతి నెలా ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.
మంచి పరిష్కారం..
సిప్, సిస్టమ్యాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎస్‌టీపీ) ద్వారా ఒక క్రమపద్ధతిలో పెట్టుబడుల విధానాన్ని అనుసరించడం మార్కెట్లలో దిద్దుబాట్లు, అనిశ్చిత పరిస్థితులను అధిగమించేందుకు చక్కని పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పెట్టుబడుల సగటు వ్యయం తగ్గుతుందని, బుల్ ర్యాలీ కొనసాగినా ఇన్వెస్టర్లు పెట్టుబడుల అవకాశాలు నష్టపోకుండా ఉండొచ్చని పేర్కొన్నారు. సిప్ రూపంలో ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకున్న పథకాల్లో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని నిర్ణయించుకున్న తేదీన వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
అదే ఎస్‌టీపీ అన్నది డెట్‌లో ఒకే విడత పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేసుకుని.. అక్కడి నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఈక్విటీ పథకాల్లోకి బదిలీ చేసుకునేందుకు ఉపకరిస్తుంది. మార్కెట్లలో ఆటుపోట్లు ఉన్నప్పుడు, లేదంటే అధిక వ్యాల్యూషన్లకు చేరినప్పుడు ఏకమొత్తంలో పెట్టడం రిస్క్ అవుతుంది. అందుకని ఎస్‌టీపీ మార్గాన్ని అనుసరించొచ్చు. మార్కెట్లలో అస్థిరతలు, కరెక్షన్ల గురించి ఆందోళన చెందకుండా పెట్టుబడులు పెట్టుకునే చక్కని మార్గమే సిప్ అని యాంఫి సైతం పేర్కొంది. ఇటీవలి కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో విక్రయాలు చేస్తున్నా.. మన మార్కెట్లు బలంగా ఉండడానికి సిప్ రూపంలో వస్తున్న పెట్టుబడులు కూడా దోహదపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment