ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడండి
మ్యూచువల్ ఫండ్స్‌కు ఆదేశం
న్యూఢిల్లీ: స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ విలువలు గణనీయంగా పెరిగిన సమయంలో మదుపరుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సెబీ కీలక సూచనలు చేసింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారి రక్షణ దృష్ట్యా తగిన కార్యాచరణను/విధానాలను అమల్లో పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది.
ఈ విభాగాల్లోకి వచ్చే తాజా పెట్టుబడులపై ఆంక్షలు, పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్ తదితర చర్యలను పరిశీలించాలని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) తన సభ్యులను కోరింది. సెబీ తరఫున యాంఫి ఈ సూచనలు చేసింది. నిజానికి గడిచిన ఏడాది కాలానికి పైగా స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో పెద్దగా దిద్దుబాటు రాలేదు.
2023లో మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.22,913 కోట్లు రాగా, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.41,305 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంత భారీగా పెట్టుబడులు వస్తుండడం, స్టాక్స్ విలువలను మరింత పైకి తీసుకెళుతోంది. ఈ తరుణంలో సెబీ ఫండ్స్ సంస్థలను అప్రమత్తం చేయడం గమనార్హం. 21 రోజుల్లోగా నూతన విధానాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాల్సి ఉంటుంది.
ముందు జాగ్రత్త..
ప్రతి నెలా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.వేలాది కోట్లు వస్తుంటే, వాటిని ఫండ్ మేనేజర్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల స్టాక్స్ విలువలు మరింత పెరిగిపోతాయి. ఈ ర్యాలీని చూసి ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ, దిద్దుబాటు మొదలైందంటే, దీనికి విరుద్ధంగా అమ్మకాల ఒత్తిడికి స్టాక్స్ విలువలు దారుణంగా పడిపోయే రిస్క్ ఉంటుంది.
దీన్ని నివారించేందుకు, పెట్టుబడుల రాకను క్రమబద్దీకరించేందుకు సెబీ ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కోటక్ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా, ఎస్‌బీఐ, టాటా మ్యూచువల్ ఫండ్ సంస్థలు స్మాల్‌క్యాప్ పథకాలకు సంబంధించి లంప్‌సమ్ (ఏక మొత్తం/ఒకే విడత) పెట్టుబడులను అనుమతించడం లేదు. సిప్ పెట్టుబడిపైనా కొన్ని సంస్థలు పరిమితులు అమలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment