yamphi
-
ఈక్విటీ ఫండ్స్లోకిపెట్టుబడుల ప్రవాహం
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు డిసెంబర్ నెలలో దుమ్మురేపాయి. అక్టోబర్ నెలలో నికరంగా 14 శాతం మేర పెట్టుబడులను కోల్పోయిన ఈక్విటీ ఫండ్స్.. తిరిగి డిసెంబర్ నెలలో రూ.41156 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అక్టోబర్ నెలలో నికర ఈక్విటీ పెట్టుబడులు రూ.35,943 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగాయి. వరుసగా 46వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లో సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. ఈక్విటీలోని అన్ని విభాగాల పథకాల్లోకి నికర పెట్టుబడులు వచ్చాయి. 2024 మొత్తం మీద ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్టర్లు రూ.3.94 లక్షల కోట్లను పెట్టుబడి పెట్టారు. 2023తో పోల్చితే 144 శాతం అధికం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. ఎప్పటి మాదిరే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు తమ జోరును కొనసాగించాయి. ఈ రెండు విభాగాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌కు సైతం డిమాండ్ కొనసాగింది. డిసెంబర్లో డెట్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.1.3 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోయాయి. దీంతో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి డిసెంబర్లో రూ.80,355 కోట్లను ఇన్వెస్టర్లను వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా పరిశ్రమ నిర్వహణలోని పెట్టుబడుల విలువ (ఏయూఎం) నెలవారీగా 1.7 శాతం తగ్గి డిసెంబర్ చివరికి రూ.66.9 లక్షల కోట్లకు పరిమితమైంది. విభాగాల వారీగా.. → స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,667 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,093 కోట్లు వచ్చాయి. నవంబర్ నెలతో పోల్చి చూస్తే స్మాల్క్యాప్లోకి 13 శాతం, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి 4 శాతం అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం వీటిని ఎంపిక చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. → లార్జ్‌క్యాప్ పథకాలు రూ.2,010 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. నవంబర్‌లో వచి్చన రూ.2,500 కోట్లతో పోల్చితే 20% తగ్గాయి. → సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.15,331 కోట్లను ఆకర్షించాయి. నవంబర్‌లో వచి్చన రూ.7,658 కోట్లతో పోల్చితే రెట్టింపయ్యాయి. → డిసెంబర్లో 33 కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు (ఎన్ఎఫ్వో) మార్కెట్లోకి వచ్చాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.13,643 కోట్లను రాబట్టాయి. నవంబర్‌లో మొత్తం 18 ఎన్ఎఫ్వో ఇష్యూలు రాగా, అవి సమీకరించిన మొత్తం రూ.4,000 కోట్లు కావడం గమనార్హం. ఏకంగా మూడింతలకుపైగా పెరిగినట్టు తెలుస్తోంది. → ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,770 కోట్లు వచ్చాయి. నవంబర్‌లో వచి్చన రూ.5,084 కోట్లతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. మల్టీక్యాప్ ఫండ్స్ 15 శాతం తక్కువగా రూ.3,075 కోట్లను ఆకర్షించాయి. → లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో రూ.3,811 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూ.640 కోట్లను ఆకర్షించాయి. 2024 సంవత్సరం మొత్తం మీద గోల్డ్ ఫండ్స్‌లోకి రూ.11,226 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.సిప్ పెట్టుబడుల్లో వృద్ధి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో డిసెంబర్లో ఈక్విటీ పథకాల్లోకి రూ.26,459 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. నవంబర్ నెల సిప్ పెట్టుబడులు రూ.25,320 కోట్లతో పోల్చి చూస్తే 5 శాతం పెరిగాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ పెట్టుబడుల విలువ రూ.13.63 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్లలో నమ్మకానికి నిదర్శనం ‘‘ఎన్‌ఎఫ్‌వోలు, సిప్ పెట్టుబడులు, ఏక మొత్తంలో కొనుగోళ్లు నికర పెట్టుబడుల ప్రవాహానికి తోడ్పడ్డాయి. పెట్టుబడులు బలంగా రావడం మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి నిదర్శనం’’అని కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా తెలిపారు. మార్కెట్ అస్థిరతల్లోనూ సిప్ పెట్టుబడులు బలంగా కొనసాగడం అన్నది దీర్ఘకాల పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నట్టు మిరే అస్సెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ డి్రస్టిబ్యూషన్ హెడ్ సురంజన బోర్తకుర్ పేర్కొన్నారు. -
పెన్షన్ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు
పెన్షన్ సదుపాయంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, డెట్ ఫండ్స్ విషయంలో పన్ను ప్రయోజనాలు కలి్పంచాలంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. బడ్జెట్‌కు ముందు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి దృష్టికి తీసుకెళ్లింది. జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)లో పెట్టుబడులకు సెక్షన్ 80సీసీడీ కింద కలి్పస్తున్న పన్ను మినహాయింపును పెన్షన్ ప్రయోజనంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ (మ్యూచువల్ ఫండ్స్ లింక్డ్ రిటైర్మెంట్ స్కీమ్స్)కు సైతం అమలు చేయాలని కోరింది. అలాగే, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్లు, అంతకుమించిన పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడు.. వచి్చన లాభంపై డిబెంచర్లకు మాదిరే ఫ్లాట్ 10% పన్నును, ద్రవ్యోల్బణం మినహాయింపు ప్రయోజనం లేకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీల్లో 35% వరకు పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌కు గతేడాది విధించిన స్వల్పకాల మూలధన లాభాల పన్నును తిరిగి పరిశీలించాలని కోరింది. బాండ్లలో పెట్టుబడులకు ప్రోత్సాహం డెట్ ఫండ్స్ ద్వారా బాండ్లలో పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని కూడా ఆర్థిక మంత్రిని యాంఫి కోరింది. డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలకు మాదిరే పన్ను రేట్లు అమలు చేయాలని, ఇందుకు ఫైనాన్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 50ఏఏను సవరించాలని వినతిపత్రంలో పేర్కొంది. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తేయాలి.. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తివేయాలంటూ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ కాని స్టార్టప్‌లు జారీ చేసే షేర్ల విలువ మదింపునకు గాను డీపీఐఐటీ గతేడాది సెప్టెంబర్‌లో కొత్త నిబంధనలు తీసుకొచి్చంది. పారదర్శక మార్కెట్ విలువ కంటే అధిక ధరపై షేర్లు జారీ చేసే స్టార్టప్‌లు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని తొలగిస్తే స్టార్టప్‌లను ప్రోత్సహించినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడం, లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గడం తదితర అంశాల కారణంగా ఏప్రిల్‌లో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు క్షీణించాయి. మార్చితో పోలిస్తే 16 శాతం తగ్గి రూ. 18,917 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రవాహం కొంత తగ్గినప్పటికీ 2021 మార్చి నుంచి చూస్తే వరుసగా 38వ నెల కూడా ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడుల రాక కొనసాగినట్లు మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల్లో వెల్లడైంది. మరోవైపు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) రూపంలో పెట్టుబడులు ఏప్రిల్‌లో కీలకమైన రూ. 20,000 కోట్ల మార్కును దాటి ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 20,371 కోట్లకు చేరాయి. అంతక్రితం నెలలో ఇవి రూ. 19,271 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మీద మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి మార్చిలో రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగ్గా, ఏప్రిల్‌లో రూ. 2.4 లక్షల కోట్లు వచ్చాయి. డెట్ స్కీముల్లోకి అత్యధికంగా రూ. 1.9 లక్షల కోట్లు వచ్చాయి. యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. → ఈక్విటీ, డెట్ కేటగిరీల్లోకి పెట్టుబడులు ప్రవా హం పటిష్టంగా ఉండటంతో నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 57.26 లక్షల కోట్లకు పెరిగింది. మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 53.54 లక్షల కోట్లుగా ఉంది. → ఈక్విటీ ఆధారిత స్కీముల్లోకి ఏప్రిల్‌లో రూ. 18,917 కోట్లు వచ్చాయి. మార్చిలో ఇది రూ. 22,633 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ. 26,866 కోట్లుగా నమోదైంది. → గత నెల ఓపెన్ ఎండెడ్ స్కీముల విభాగంలో తొమ్మిది స్కీముల ద్వారా ఫండ్ సంస్థలు రూ. 1,532 కోట్లు సమీకరించాయి. → లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు మార్చిలో రూ. 2,128 కోట్లు రాగా ఏప్రిల్‌లో ఏకంగా రూ. 357 కోట్లకు పడిపోయాయి. స్మాల్ క్యాప్ కేటగిరీలోకి రూ. 2,208 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ. 94 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను మదుపరులు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్స్‌లోకి రూ. 5,166 కోట్లు, మలీ్ట–క్యాప్ కేటగిరీలోకి రూ. 2,724 కోట్లు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల నుంచి రూ. 144 కోట్ల ఉపసంహరణ జరిగింది. → హైబ్రిడ్ ఫండ్స్‌లోకి చెప్పకోతగ్గ స్థాయిలోకి రూ. 19,863 కోట్లు రాగా, డెట్ ఆధారిత స్కీముల విషయానికొస్తే లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ. 1.02 లక్షల కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ. 34,000 కోట్లు, ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి రూ. 21,000 కోట్లు వచ్చాయి. → మ్యుచువల్ ఫండ్స్ ఫోలియోల సంఖ్య ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 18.14 కోట్లకు చేరింది. -
పెట్టుబడులు సిప్ చేస్తున్నారు
న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులపై సానుకూల అంచనాల నేపథ్యంలో క్రమాణుగత పెట్టు బడులు (సిప్) 2023–2024లో రూ. 2 లక్షల కోట్ల రికార్డ్ స్థాయికి చేరాయి. 2022–2023తో పోలిస్తే ఇది 28% అధికం. ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2016–17లో రూ. 43,921 కోట్లుగా ఉన్న సిప్ పెట్టుబడులు 2022–23 నాటికి రూ. 1.56 లక్షల కోట్లకు చేరాయి. ఇవి 2020–21లో రూ. 96,080 కోట్లుగా, 2021–22లో రూ. 1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. మరోవైపు, గతేడాది మార్చి నెలలో సిప్ల రూపంలో రూ. 14,276 కోట్లు రాగా ఈ ఏడాది మార్చిలో 35 శాతం వృద్ధి చెంది ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 19,270 కోట్లు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చిలో వరుసగా రెండు నెలల పాటు సిప్ పెట్టుబడులు రూ. 19,000 కోట్ల మార్కును దాటాయి. -
ఈక్విటీ ఎంఎఫ్లకు ఫిబ్రవరిలో రూ.26,866 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.26,866 కోట్ల పెట్టుబడులు వచ్చాయని భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) గణాంకాలు వెల్లడించాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం గడిచిన 23 ఏళ్లలో గరిష్టం. ఈ జనవరిలో వెల్లువెత్తిన రూ.21,721 కోట్లతో పోలిస్తే కూడా 23% అధికం. కొత్త ఫండ్ల ఆవిష్కరణ, థీమాటిక్/సెక్టోరియల్ ఫండ్లపై ఆసక్తి ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) పథకాల్లోకి కూడా ఫిబ్రవరి జీవితకాల గరిష్టం రూ.19,186 కోట్లకు చేరాయి. జనవరి ఇవి రూ.18,838 కోట్లుగా ఉన్నాయి. -
స్మాల్, మిడ్‌క్యాప్‌పై సెబీ అలర్ట్
న్యూఢిల్లీ: స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ విలువలు గణనీయంగా పెరిగిన సమయంలో మదుపరుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సెబీ కీలక సూచనలు చేసింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారి రక్షణ దృష్ట్యా తగిన కార్యాచరణను/విధానాలను అమల్లో పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది. ఈ విభాగాల్లోకి వచ్చే తాజా పెట్టుబడులపై ఆంక్షలు, పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్ తదితర చర్యలను పరిశీలించాలని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) తన సభ్యులను కోరింది. సెబీ తరఫున యాంఫి ఈ సూచనలు చేసింది. నిజానికి గడిచిన ఏడాది కాలానికి పైగా స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో పెద్దగా దిద్దుబాటు రాలేదు. 2023లో మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.22,913 కోట్లు రాగా, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.41,305 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంత భారీగా పెట్టుబడులు వస్తుండడం, స్టాక్స్ విలువలను మరింత పైకి తీసుకెళుతోంది. ఈ తరుణంలో సెబీ ఫండ్స్ సంస్థలను అప్రమత్తం చేయడం గమనార్హం. 21 రోజుల్లోగా నూతన విధానాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ వెబ్సైట్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్త.. ప్రతి నెలా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.వేలాది కోట్లు వస్తుంటే, వాటిని ఫండ్ మేనేజర్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల స్టాక్స్ విలువలు మరింత పెరిగిపోతాయి. ఈ ర్యాలీని చూసి ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ, దిద్దుబాటు మొదలైందంటే, దీనికి విరుద్ధంగా అమ్మకాల ఒత్తిడికి స్టాక్స్ విలువలు దారుణంగా పడిపోయే రిస్క్ ఉంటుంది. దీన్ని నివారించేందుకు, పెట్టుబడుల రాకను క్రమబద్దీకరించేందుకు సెబీ ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కోటక్ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా, ఎస్బీఐ, టాటా మ్యూచువల్ ఫండ్ సంస్థలు స్మాల్‌క్యాప్ పథకాలకు సంబంధించి లంప్సమ్ (ఏక మొత్తం/ఒకే విడత) పెట్టుబడులను అనుమతించడం లేదు. సిప్ పెట్టుబడిపైనా కొన్ని సంస్థలు పరిమితులు అమలు చేస్తున్నాయి. -
గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు ఇన్వెస్టర్ల నుంచి చక్కని ఆదరణ లభించింది. 2023లో ఇన్వెస్టర్లు రూ.2,920 కోట్లను ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేశారు. 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే గతేడాది ఆరు రెట్లు పెరుగుదల కనిపిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల పెరుగుదల, అనిశి్చతుల నేపథ్యంలో సురక్షిత సాధనమైన బంగారం వైపు ఎక్కువ మంది మొగ్గు చూపించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రూ.459 కోట్లు రాగా, 2023లో రూ.2,920 కోట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా గతేడాది ఆగస్ట్ నెలలోనే రూ.1,028 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. 16 నెలల్లోనే ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ‘‘భౌతిక బంగారం పట్ల భారతీయుల్లో మక్కువ వందల సంవత్సరాల నుంచి ఉంది. దాంతో గోల్డ్ ఈటీఎఫ్‌లు మాదిరి పెట్టుబడి సాధనాలకు ఆమోదం తక్కువగా ఉండేది. కానీ, గడిచిన కొన్నేళ్లలో బంగారం డిజిటైజేషన్ పట్ల ఇన్వెస్టర్లు మళ్లుతున్నారు. సులభంగా ఇన్వెస్ట్ చేయడం, సౌకర్యంగా వెనక్కి తీసుకునే వెసులుబాటు గోల్డ్ ఈటీఎఫ్‌ను ఆమోదించడానికి కారణం. ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో బంగారం తప్పకుండా ఉండాలి’’అని జెరోదా ఫండ్ హౌస్ సీఈవో విషాల్ జైన్ పేర్కొన్నారు. నిర్వహణ ఆస్తులు పైపైకి బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది 27 శాతం పెరిగి రూ.27,336 కోట్లకు చేరింది. 2022 డిసెంబర్ నాటికి ఈ మొత్తం రూ.21,445 కోట్లుగానే ఉండడం గమనించాలి. గత కొన్నేళ్లలో బంగారం అద్భుతమైన పనితీరు చూపించడాన్ని కూడా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాలి. ఇదే ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రేరణగా నిలిచింది. గతేడాది గోల్డ్ ఈటీఎఫ్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 2.73 లక్షలు అధికంగా ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం ఫోలియోలు 49.11 లక్షలకు చేరాయి. 2023 మాత్రమే కాకుండా, 2020, 2021లోనూ బంగారం ఈటీఎఫ్‌లు మంచి రాబడులను ఇచ్చాయి. 2021లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.4,814 కోట్లు, 2020లో రూ.6,657 కోట్ల చొప్పున పెట్టుబడులు వచి్చనట్టు యాంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో బంగారం వ్యూహాత్మక సాధనంగా నిలుస్తుంది. చక్కని వైవిధ్యాన్ని ఇవ్వడంతోపాటు, ఆర్థిక పతనాలు, కఠిన మార్కెట్ పరిస్థితుల్లో నష్టాలను తగ్గిస్తుంది. అందుకే దీనికి సురక్షిత సాధనంగా గుర్తింపు ఉంది’’అని మారి్నంగ్‌స్టార్ ఇండియా రిసెర్చ్ విభాగం చీఫ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. గతేడాది ఈక్విటీ మార్కెట్ల దిద్దుబాటు, ఆకర్షణీయమైన అవకాశాల నేపథ్యంలో ఏకంగా రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులు స్టాక్స్‌ను వెతుక్కుంటూ వెళ్లాయి. అయినా కానీ, బంగారం ఈటీఎఫ్‌లు చెప్పుకోతగ్గ పెట్టుబడులను ఆకర్షించాయి. ఒక ఈటీఎఫ్ ఒక గ్రాము బంగారానికి సమానంగా స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవుతుంటుంది. షేర్ల మాదిరే సులభంగా కొనుగోలు చేసి విక్రయించుకోవచ్చు. -
సిప్ పెట్టుబడుల్లో కొత్త రికార్డ్
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు గత నెల(నవంబర్)లో 22 శాతం నీరసించాయి. నెలవారీగా చూస్తే రూ. 15,536 కోట్లకు చేరాయి. అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్‌లో రూ. 19,957 కోట్ల పెట్టుబడులు లభించగా.. సెప్టెంబర్‌లో ఇవి రూ. 14,091 కోట్లుగా నమోదయ్యాయి. దేశీ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వెల్లడించిన గణాంకాలివి. దీపావళి తదితర పండుగలు, బ్యాంక్ సెలవులు నికర పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కొటక్ మ్యూచువల్ ఫండ్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా పేర్కొన్నారు. అయితే వరుసగా 33వ నెలలోనూ పెట్టుబడులు లభించడం గమనించదగ్గ అంశంకాగా.. ఈక్విటీకి సంబంధించిన అన్ని విభాగాలలోకీ పెట్టుబడులు ప్రవహించాయి. ఇందుకు కొత్తగా ఆరు ఫండ్స్ రంగ ప్రవేశం చేయడం సహకరించింది. వెరసి నవంబర్‌లో ఇవి రూ. 1,907 కోట్లు అందుకున్నాయి. అయితే నవంబర్‌లో పెట్టుబడులు క్షీణించినప్పటికీ కొత్త రికార్డు నెలకొల్పుతూ క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్‌లు) ద్వారా రూ. 17,073 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. సిప్ ద్వారా చేకూరనున్న లబ్దిపై అవగాహన పెరగుతుండటంతో కొత్త ఇన్వెస్టర్లను ఇవి ఆకట్టుకుంటున్నాయి. వెరసి సిప్ పెట్టుబడులు జోరు చూపుతున్నాయి. కారణాలున్నాయ్ గరిష్టస్థాయిలోని ఆర్థిక లావాదేవీలు, నిలకడైన జీఎస్టీ వసూళ్లు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలపై విశ్వాసం నేపథ్యంలో ఇన్వెస్టర్లు వివిధ రంగాలలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్ ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయని ఫైయర్స్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. ఫలితంగా అక్టోబర్‌లో నమోదైన రూ. 16,928 కోట్లను నవంబర్(రూ. 17,073 కోట్లు) అధిగమించినట్లు తెలియజేశారు. ఈక్విటీ ఫండ్స్‌లో మధ్య, చిన్నతరహా ఈక్విటీ ఫండ్స్ అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు వివరించారు. మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో ఇవి 41 శాతాన్ని ఆక్రమిస్తున్నట్లు వెల్లడించారు. స్మాల్ క్యాప్ ఫండ్స్ గరిష్టంగా రూ. 3,699 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ. 2,666 కోట్లు, కొన్ని రంగాలు లేదా థీమాటిక్ ఫండ్స్ రూ. 1,965 కోట్లు చొప్పున పెట్టుబడులను అందుకున్నాయి. అయితే లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు మందగించగా.. ఇండెక్స్ ఫండ్స్‌లోకి రూ. 1,353 కోట్లు ప్రవహించాయి. ఆస్తుల వృద్ధి నవంబర్‌లో మార్కెట్ ప్రామాణిక ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాలకు చేరడంతో 42 సంస్థల మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తులు(ఏయూఎం) రూ. 49.04 లక్షల కోట్లను తాకాయి. అక్టోబర్‌లో చివర్లో ఇది రూ. 46.71 లక్షల కోట్లుగా నమోదైంది. మరోపక్క రుణ ఆధారిత సెక్యూరిటీల విభాగంలో గత నెల రూ. 4,707 కోట్లు వెనక్కి మళ్లాయి. అక్టోబర్‌లో మాత్రం డెట్ ఫండ్స్‌కు రూ. 42,634 కోట్ల పెట్టుబడులు లభించాయి. మనీ మార్కెట్, దీర్ఘకాలిక, బ్యాంకింగ్, పీఎస్‌యూ, గిల్ట్, ఫ్లోటర్ విభాగాలను మినహాయిస్తే.. ఇతర కేటగిరీలలో నికరంగా పెట్టుబడులు తరలివెళ్లాయి. పన్ను చట్టాల సవరణ తదుపరి ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్‌లో పెట్టుబడులు మందగించినట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. వడ్డీ రేట్ల అనిశ్చిత పరిస్థితులు ఇన్వెస్టర్ల పెట్టుబడి నిర్ణయాలను మరింత సంక్లిష్టం చేసినట్లు అభిప్రాయపడ్డారు. -
స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
న్యూఢిల్లీ: స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు నిరంతరాయంగా, బలంగా వస్తూనే ఉన్నాయి. దీంతో అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పరిధిలోని స్మాల్‌క్యాప్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) నవంబర్ చివరికి రూ.2.2 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎంలో 69 శాతం వృద్ధి కనిపిస్తోంది. అక్టోబర్ నెల స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎంతో పోల్చి చూసినా కానీ, 10 శాతం వృద్ధి నమోదైంది. 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎం అనూహ్యమైన వృద్ధిని చూసినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో అనుకూల వాతావరణం, బారీ పెట్టుబడుల రాక ఇందుకు దోహదం చేసింది. ఈ ఏడాది ఆరంభం నుంచి నవంబర్ వరకు స్మాల్‌క్యాప్ ఫండ్స్ నికరంగా రూ.37,178 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇందులో అత్యధికంగా అక్టోబర్‌లో రూ.4,495 కోట్లు వచ్చాయి. మరోవైపు ఈ ఏడాది 11 నెలల్లో లార్జ్‌క్యాప్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.2,688 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంటే స్మాల్‌క్యాప్ కంపెనీల విషయంలో దేశీ ఇన్వెస్టర్లు ఎంతో బుల్లిష్ గా ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడులపై పరిమితులు చిన్న కంపెనీల్లోకి గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు రావడంతో షేర్ల ధరలను గణనీయంగా పెరిగేందుకు దారితీస్తోంది. ‘‘పలు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు గడిచిన త్రైమాసికంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాకపై పరిమితులు విధించాయి. పెట్టుబడులు గణనీయంగా రావడం, కంపెనీల వ్యాల్యూషన్లు ఖరీదుగా మారడం ఫండ్ మేనేజర్లను ఆందోళనకు గురి చేస్తోంది’’అని మారి్నంగ్ స్టార్ ఇండియా తన త్రైమాసికం వారీ నివేదికలో పేర్కొంది. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు సంబంధించిన ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) సైతం 62 లక్షలు పెరిగి నవంబర్ చివరికి 1.6 కోట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇవి 97.52 లక్షలుగా ఉన్నాయి. సెబీ నిబంధనల ప్రకారం స్మాల్‌క్యాప్ ఫండ్స్ కనీసం 65 శాతం పెట్టుబడులను స్మాల్‌క్యాప్ కంపెనీలకే కేటాయించాల్సి ఉంటుంది. స్వల్పకాలంలో ఉండే అనిశి్చతుల దృష్ట్యా ఇన్వెస్టర్లు స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టుకోవాలని యూనియన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సీఈవో జి.ప్రదీప్ కుమార్ సూచించారు. -
హైబ్రిడ్ పథకాల పట్ల ఆకర్షణ
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ క్వార్టర్లో రూ.14,021 కోట్లను ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వం ఇటీవల తీసుకొచి్చన నూతన పన్ను నిబంధన కారణమని తెలుస్తోంది. క్రితం ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచి్చన పెట్టుబడులు రూ.10,084 కోట్లుగా ఉన్నాయి. అంటే సమారు 40 శాతం మేర పెట్టుబడులు పెరిగాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో బంగారం తదితర సాధనాల్లోనూ కొంత మేర పెట్టుబడులు పెడతాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) కూడా పెరిగాయి. మధ్యస్థం నుంచి తక్కువ రిస్క్ తీసుకునే వారికి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ కాస్త తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఇవే హైబ్రిడ్ ఫథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.7,420 కోట్లను నికరంగా ఉపసంహరించుకోవడం గమనార్హం. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ రూ.7,041 కోట్లు, సెపె్టంబర్ త్రైమాసికంలో రూ.14,436 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికం తర్వాత హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం మళ్లీ జూన్ త్రైమాసికంలోనే నమోదైంది. పన్ను పరమైన అనుకూలత హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు రావడం వెనుక పన్ను పరమైన ప్రయోజనాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగిస్తే వచి్చన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి చూపించుకునే అవకాశం ఉండేది. దీంతో పన్ను భారం తక్కువగా ఉండేది. కానీ, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచి్చన నిబంధనల ప్రకారం డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధితో సంబంధం లేకుండా లాభం వార్షిక ఆదాయంలో భాగంగా చూపించి పన్ను చెల్లించడం తప్పనిసరి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించుకునే వెసులుబాటు రద్ధు చేశారు. దీంతో ఆవి ఆకర్షణను కోల్పోయాయి. డెట్ పథకాలకు సంబంధించి పన్ను నిబంధనలో మార్పు హైబ్రిడ్ పథకాల్లోకి పెట్టుబడులు పెరిగేందుకు కారణమైనట్టు క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లి తెలిపారు. ‘‘ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో వార్షిక రాబడి 7 శాతంగా ఉంటుంది. డెట్ ఫండ్స్‌తో పోలిస్తే పన్ను పరంగా అనుకూలమైనది. అందుకే ఈ విభాగంలో మరింత ఆదరణ కనిపిస్తోంది’’ అని వివరించారు. డెట్ ఫండ్స్‌పై పన్ను నిబంధన మారిపోవడంతో ఇన్వెస్టర్లు హైబ్రిడ్ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు మారి్నంగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ కౌస్తభ్ బేల పుర్కార్ తెలిపారు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ తక్కువ అస్థిరతలతో, ఈక్విటీ పన్ను ప్రయోజనం కలిగి ఉండడం ఆకర్షణీయమైనదిగా పేర్కొన్నారు. హైబ్రిడ్ పథకాల్లో లాభాలకు ఈక్విటీ మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది కనుక తక్కువ పన్ను అంశం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని తెలుస్తోంది. -
గోల్డ్ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు
న్యూఢిల్లీ: పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు) నుంచి గత నెలలో నికరంగా రూ. 195 కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. అయితే అంతకుముందు రెండు నెలల్లో నికరంగా కొనుగోళ్లే పైచేయి సాధించాయి. వెరసి అక్టోబర్‌లో రూ. 147 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 330 కోట్ల చొప్పున నికరంగా పెట్టుబడులు లభించాయి. ఇక ఆగస్ట్‌లో మాత్రం నికరంగా రూ. 38 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ గణాంకాలివి. గత నెలలో మార్కెట్ల ర్యాలీ నడుమ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చినట్లు ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకులు ప్రీతి రథి గుప్తా పేర్కొన్నారు. అంతేకాకుండా పెళ్లిళ్ల సీజన్ కారణంగా కుటుంబాల నుంచి పసిడికి డిమాండ్ పెరగడం ప్రభావం చూపినట్లు తెలియజేశారు. అయితే పండుగల సీజన్ కారణంగా అక్టోబర్‌లో ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారని, దీంతో పెట్టుబడులు సైతం లభించాయని వివరించారు. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ గోల్డ్ ఈటీఎఫ్‌లలో నికరంగా రూ. 1,121 కోట్ల పెట్టుబడులు లభించినట్లు గణాంకాలు వెల్లడించాయి. నవంబర్ చివరికల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 20,833 కోట్లను తాకాయి. ఫోలియోల సంఖ్య 11,800 పెరిగి 46.8 లక్షలకు చేరింది. గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లు డీమ్యాట్ రూపంలో పసిడిలో పెట్టుబడులకు వీలు కల్పించే సంగతి తెలిసిందే. -
ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల ఖాతాలు ఓకే
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి క్వార్టర్లో ఆస్తుల నిర్వహణా కంపెనీ(ఏఎంసీ)లు ఇన్వెస్టర్లను ఓమాదిరిగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కొత్తగా 51 లక్షల ఇన్వెస్టర్ ఖాతాలు జత కలిశాయి. దీంతో 43 ఫండ్ హౌస్‌ల ద్వారా మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు 13.46 కోట్లకు చేరాయి. ఇటీవల మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)పట్ల అవగాహన పెరగడం, లావాదేవీలలో డిజిటైజేషన్ వంటి అంశాలు ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు. గత 12 నెలల్లో స్పీడ్ ఎంఎఫ్ అసోసియేషన్(యాంఫీ) గణాంకాల ప్రకారం గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో 93 లక్షల ఖాతాలు ప్రారంభంకాగా.. గత 12 నెలల్లో 3.2 కోట్ల ఇన్వెస్టర్ ఖాతాలు జత కలిశాయి. అయితే భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణ పరిస్థితులు, బలపడుతున్న బాండ్ల ఈల్డ్స్, యూఎస్ ఫెడ్ కఠిన విధానాలు వంటి అంశాలు క్యూ1లో పెట్టుబడులను ప్రభావితం చేసినట్లు ఎల్‌ఎక్స్‌ఎంఈ నిపుణులు ప్రియా అగర్వాల్ వివరించారు. ఈ నేపథ్యంలో ఇకపై పెట్టుబడులు ఊపందుకునే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈక్విటీలకే ప్రాధాన్యం ఎంఎఫ్‌లలో రిటైల్ ఇన్వెస్టర్లు అత్యధికంగా ఈక్విటీ ఫండ్స్‌కే ఆసక్తి చూపుతారని మైవెల్త్‌గ్రోత్.కామ్ సహవ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా పేర్కొన్నారు. దీంతో మార్కెట్ పరిస్థితులు ఫోలియోలపై ప్రభావం చూపుతాయని తెలియజేశారు. రానున్న కాలంలో మార్కెట్లు స్థిరపడితే ఫండ్స్‌లో పెట్టుబడులు పుంజుకుంటాయని అంచనా వేశారు. ఎంఎఫ్ పరిశ్రమలో 10 కోట్ల ఫోలియోలు 2021 మే నెలకల్లా నమోదయ్యాయి. 2020–21లో 81 లక్షలు, 2021–22లో 3.17 ఇన్వెస్టర్ ఖాతాలు జత కలిశాయి. క్యూ1లో జత కలిసిన 51 లక్షల ఖాతాలలో 35 లక్షల ఫోలియోలు ఈక్విటీ ఆధారిత పథకాలేకావడం గమనార్హం! -
‘ఫండ్స్’లోకి రూ.1.4 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఇన్వెస్టర్లు 1.4 లక్షల కోట్ల మేర మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) తెలిపింది. లిక్విడ్, ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు బాగా వచ్చాయని వివరించింది. ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరుతో ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.23.25 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది మార్చి ఫండ్స్ నిర్వహణ ఆస్తులతో పోల్చితే ఇది 9 శాతం అధికమని వివరించింది. కాగా ఈ ఏడాది మార్చిలో మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.50,752 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని, కొత్తగా ప్రవేశపెట్టిన దీర్ఘకాల మూలధన లాభాల పన్ను దీనికి కారణమని యాంఫీ పేర్కొంది. -
ఫండ్స్ కూ ‘తార’ల తళుకు!
♦ సెలబ్రిటీలతో ప్రచారానికి సెబీ యోచన.. ♦ ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యం ♦ దీంతో ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయని అంచనా ♦ ఇన్వెస్టర్ల ఫండ్ ఏర్పాటు చేయనున్న యాంఫీ ♦ కొత్త స్కీమ్స్‌కు హిందీ పేర్లు పెడుతోన్న సంస్థలు మ్యూచువల్ ఫండ్స్.. ఈ పేరు పట్టణాల్లో ఉన్న వారికి పరిచయమై ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి మాత్రం అంతగా తెలిసి ఉండదు. అందుకే వీటిని అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో సెబీ పలు మార్గాలను అన్వేషిస్తోంది. అందులో ఒకటి... సెలబ్రిటీలను వీటికి ప్రచారకులుగా తీసుకురావాలనే యోచన. అంటే ఇకపై సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, ఎం.ఎస్ ధోని, విరాట్ కోహ్లి వంటి సెలబ్రిటీలు.. పలు కంపెనీల ఉత్పత్తులకు మాత్రమే కాకుండా మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)కి ప్రచారకులుగా వ్యవహరిస్తారమన్న మాట. అంతా సక్రమంగా జరిగితే వీరు ఎంఎఫ్ గురించి ప్రజల్లో అవగాహన పెంచి, వాటిల్లోకి ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడానికి దోహదపడతారు. ఎంఎఫ్ సంస్థలు కూడా ప్రజలకు చేరువ కావడం కోసం వినూత్న మార్గాలను అవలంబిస్తున్నాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మాత్రం సెలబ్రిటీలు మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు ప్రచార కర్తలుగా వ్యవహరించడానికి ఇప్పటివరకూ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో దేశంలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచడమనే అంశంపై సెబీ అధికారులు, మ్యూచువల్ ఫండ్ సంస్థల ఎగ్జిక్యూటివ్స్ మధ్య ఇటీవల ఒక సమావేశం జరిగింది. ఇందులోనే సెలబ్రిటీల అంశం తెరపైకి వచ్చింది. అధికారులందరూ సెలబ్రిటీలను ప్రచార కర్తలుగా ఉపయోగించుకుంటే బాగుం టుందనే అంశాన్ని సెబీ చైర్మన్‌కు వ్యక్తీకరించారు. సెబీ ఒకవేళ ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే.. యాంఫీ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అదనంగా రూ.120-రూ.130 కోట్లను ఇన్వెస్టర్ల ఎడ్యుకేషన్ కోసం, సెలబ్రిటీల కోసం జమ చేసుకోవాల్సి వస్తుందని సెబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక నుంచి యాంఫీకీ కొంత మొత్తం ఎంఎఫ్ ఇన్వెస్టర్లు పెట్టుబడిపెట్టే మొత్తంలో ప్రతి రూ.100లో ఆర్థిక అక్షరాస్యత, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ నిమిత్తం 2 పైసల్ని చార్జ్ చేసుకోవడానికి ఫండ్ కంపెనీలకు సెబీ అనుమతినిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం వరకు ఫండ్ కంపెనీలకే ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టుకునే అధికారం ఉండేది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఫండ్ సంస్థలు చార్జ్ చేసే 2 పైసల్లో 1 పైసాను యాంఫీకి బదిలీ చేయాల్సి ఉంది. ఈ మొత్తంలో యాంఫీ మొత్తం పరిశ్రమకు సంబంధించి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఫండ్ ను ఏర్పాటు చేస్తుంది. అడ్వరై ్టజింగ్, మార్కెటింగ్‌లో అపార అనుభవం ఉన్న ఒక టాప్ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల పెంపునకు సంబంధించి సెలబ్రిటీలను ప్రచార కర్తలుగా ఉపయోగించుకోవాలనే ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపితే.. సెలబ్రిటీల వల్ల ఇన్వెస్టర్లలో వారి ఇన్వెస్ట్మెంట్లపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు. అలాగే సెలబ్రిటీలు దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదనే విశ్వాసాన్ని ఇన్వెస్టర్లలో కలిగించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి సెలబ్రెటీని ఎంపిక చేసుకోవడం కష్టసాధ్యమని తెలిపారు. ప్రాంతీయ భాషలపై ఎంఎఫ్‌ల కన్ను ఎఫ్ఎంసీజీ సంస్థలు, టూవీలర్ సహా చిన్న కారు కంపెనీల తర్వాత ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా గ్రామీణులకు చేరువ కావడం కోసం వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఇవి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్‌కు ఆంగ్లంలో పేర్లు పెట్టడానికి బదులు ఇప్పుడు హిందీలో పేర్లు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎంఎఫ్ పరిశ్రమలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మహీంద్రా మ్యూచువల్ ఫండ్ సహా అసెట్స్ ప్రకారం చూస్తే మూడో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థ రిలయన్స్ ఎంఎఫ్ వాటి కొత్త పథకాలకు హిందీలో పేర్లు పెట్టడానికి సిద్ధమయ్యాయి. ఇవి ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌కు కర్ బచత్ యోజనా అని, చిల్డ్రన్ ఫండ్‌కు బాల్ వికాస్ యోజనా అని, ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీములను బచత్ యోజనా, నివేశ్ లక్ష్య అనే పేర్లతో తీసుకురావడానికి సెబీ అనుమతిని కోరాయి. ‘గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు స్టాక్స్, బాండ్స్, ఎంఎఫ్‌ల గురించి అంతగా తెలియదు. అందుకే భాష ద్వారా వారికి చేరువ కావాలని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రయత్నించాలి’ అని మహీంద్రా ఎంఎఫ్ ఎండీ అశుతోష్ తెలిపారు. గ్రామీణులు అర్థం చేసుకునే భాషలో ప్రొడక్ట్‌లను తీసుకువస్తే మంచి ఫలితాలు వస్తాయని రిలయన్స్ ఎంఎఫ్ ప్రెసిడెంట్ సుదీప్ సిక్కా పేర్కొన్నారు.