సిప్‌ పెట్టుబడుల్లో కొత్త రికార్డ్‌ | Equity mutual fund inflows dip by 22percent in November | Sakshi
Sakshi News home page

సిప్‌ పెట్టుబడుల్లో కొత్త రికార్డ్‌

Published Tue, Dec 12 2023 5:54 AM | Last Updated on Tue, Dec 12 2023 5:54 AM

Equity mutual fund inflows dip by 22percent in November - Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు గత నెల(నవంబర్‌)లో 22 శాతం నీరసించాయి. నెలవారీగా చూస్తే రూ. 15,536 కోట్లకు చేరాయి. అయితే స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్‌లో రూ. 19,957 కోట్ల పెట్టుబడులు లభించగా.. సెప్టెంబర్‌లో ఇవి రూ. 14,091 కోట్లుగా నమోదయ్యాయి. దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌(యాంఫీ) వెల్లడించిన గణాంకాలివి.

దీపావళి తదితర పండుగలు, బ్యాంక్‌ సెలవులు నికర పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కొటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సేల్స్‌ హెడ్‌ మనీష్‌ మెహతా పేర్కొన్నారు. అయితే వరుసగా 33వ నెలలోనూ పెట్టుబడులు లభించడం గమనించదగ్గ అంశంకాగా.. ఈక్విటీకి సంబంధించిన అన్ని  విభాగాలలోకీ పెట్టుబడులు ప్రవహించాయి. ఇందుకు కొత్తగా ఆరు ఫండ్స్‌ రంగ ప్రవేశం చేయడం సహకరించింది.

వెరసి నవంబర్‌లో ఇవి రూ. 1,907 కోట్లు అందుకున్నాయి. అయితే నవంబర్‌లో పెట్టుబడులు క్షీణించినప్పటికీ కొత్త రికార్డు నెలకొల్పుతూ క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్‌లు) ద్వారా రూ. 17,073 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. సిప్‌ ద్వారా చేకూరనున్న లబ్దిపై అవగాహన పెరగుతుండటంతో కొత్త ఇన్వెస్టర్లను ఇవి ఆకట్టుకుంటున్నాయి. వెరసి సిప్‌ పెట్టుబడులు జోరు చూపుతున్నాయి.  

కారణాలున్నాయ్‌
గరిష్టస్థాయిలోని ఆర్థిక లావాదేవీలు, నిలకడైన జీఎస్‌టీ వసూళ్లు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలపై విశ్వాసం నేపథ్యంలో ఇన్వెస్టర్లు వివిధ రంగాలలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయని ఫైయర్స్‌ రీసెర్చ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ గోపాల్‌ కావలిరెడ్డి పేర్కొన్నారు. ఫలితంగా అక్టోబర్‌లో నమోదైన రూ. 16,928 కోట్లను నవంబర్‌(రూ. 17,073 కోట్లు) అధిగమించినట్లు తెలియజేశారు.

ఈక్విటీ ఫండ్స్‌లో మధ్య, చిన్నతరహా ఈక్విటీ ఫండ్స్‌ అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు వివరించారు. మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో ఇవి 41 శాతాన్ని ఆక్రమిస్తున్నట్లు వెల్లడించారు. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ గరిష్టంగా రూ. 3,699 కోట్లు, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ. 2,666 కోట్లు, కొన్ని రంగాలు లేదా థీమాటిక్‌ ఫండ్స్‌ రూ. 1,965 కోట్లు చొప్పున పెట్టుబడులను అందుకున్నాయి. అయితే లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు మందగించగా.. ఇండెక్స్‌ ఫండ్స్‌లోకి రూ. 1,353 కోట్లు ప్రవహించాయి.

ఆస్తుల వృద్ధి
నవంబర్‌లో మార్కెట్‌ ప్రామాణిక ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాలకు చేరడంతో 42 సంస్థల మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తులు(ఏయూఎం) రూ. 49.04 లక్షల కోట్లను తాకాయి. అక్టోబర్‌లో చివర్లో ఇది రూ. 46.71 లక్షల కోట్లుగా నమోదైంది. మరోపక్క రుణ ఆధారిత సెక్యూరిటీల విభాగంలో గత నెల రూ. 4,707 కోట్లు వెనక్కి మళ్లాయి. అక్టోబర్‌లో మాత్రం డెట్‌ ఫండ్స్‌కు రూ. 42,634 కోట్ల పెట్టుబడులు లభించాయి.

మనీ మార్కెట్, దీర్ఘకాలిక, బ్యాంకింగ్, పీఎస్‌యూ, గిల్ట్, ఫ్లోటర్‌ విభాగాలను మినహాయిస్తే.. ఇతర కేటగిరీలలో నికరంగా పెట్టుబడులు తరలివెళ్లాయి. పన్ను చట్టాల సవరణ తదుపరి ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు మందగించినట్లు మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. వడ్డీ రేట్ల అనిశ్చిత పరిస్థితులు ఇన్వెస్టర్ల పెట్టుబడి నిర్ణయాలను మరింత సంక్లిష్టం చేసినట్లు అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement