down fall
-
తగ్గిన చికెన్ ధర.. పెరిగిన గుడ్డు ధర
జ్యోతినగర్(రామగుండం): బహిరంగ మార్కెట్లో కోడిగుడ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఒకకోడిగుడ్డు రిటెయిల్ ధర రూ.7గా పలుకుతోంది. హోల్‌సేల్‌గా రూ.6.50గా ధర ఉంది. చలికాలంలో కోడిగుడ్ల ధరలు పెరగడం సాధారణమేనని, కానీ, ఈస్థాయిలో ధర పెరగడం అరుదని కొందరు వ్యాపారులు వివరిస్తున్నారు.క్రిస్మస్, న్యూ ఇయర్ కేక్‌ల కోసం..ఈనెలలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల్లో ప్రధానంగా కేక్‌లు కట్‌చేసి మిఠాయిలు పంచుకుంటారు. ఇప్పటికే జిల్లాలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇదేసమయంలో కేక్‌ల వినియోగం, విక్రయాలూ పెరిగాయి. కేక్‌ల తయారీలో కోడిగుడ్ల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో సహజంగానే వాటికి డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు.. న్యూ ఇయర్ వేడుకల కోసం కొందరు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. వివిధ డిజైన్లలో కేక్‌లు తయారు చేసుకునేందుకు ఆర్డర్లు ఇస్తున్నారు. దీంతో బేకరీలు, మిఠాయి దుకాణదారులు కోడిగుడ్లు కొనుగోలు చేయడం అధికమైంది. ఫలితంగా మార్కెట్లో కోడిగుడ్లకు ధర పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు.కార్తీకం నేపథ్యంలో దిగివచ్చిన చికెన్కార్తీక మాసం నేపథ్యంలో చికెన్ ధరలు తగ్గాయి. కార్తీక మాసానికి ముందు కేజీ చికెన్ ధర రూ.230వరకు పలికింది. ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉండడంతో డిమాండ్ పడిపోయిందని, ఫలితంగా చికెన్ ధరలు దిగొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ.180గా పలుకుతోది. మరోవైపు.. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వరకు చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.చలికాలమే కారణం..30 గుడ్లు గల ట్రే ధర రూ.195గా ఉంది. హోల్‌సేల్‌గా గుడ్డు ధర రూ.6.50గా ఉంది. చలికాలంలో గుడ్ల ధరలు పెరుగుతుంటాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా వీటి వినియోగం అధికమైంది.– గుండ చంద్రమౌళి, హోల్‌సేల్ వ్యాపారి, ఎన్టీపీసీ -
ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేల చూపులు
-
సిప్ పెట్టుబడుల్లో కొత్త రికార్డ్
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు గత నెల(నవంబర్)లో 22 శాతం నీరసించాయి. నెలవారీగా చూస్తే రూ. 15,536 కోట్లకు చేరాయి. అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్‌లో రూ. 19,957 కోట్ల పెట్టుబడులు లభించగా.. సెప్టెంబర్‌లో ఇవి రూ. 14,091 కోట్లుగా నమోదయ్యాయి. దేశీ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వెల్లడించిన గణాంకాలివి. దీపావళి తదితర పండుగలు, బ్యాంక్ సెలవులు నికర పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కొటక్ మ్యూచువల్ ఫండ్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా పేర్కొన్నారు. అయితే వరుసగా 33వ నెలలోనూ పెట్టుబడులు లభించడం గమనించదగ్గ అంశంకాగా.. ఈక్విటీకి సంబంధించిన అన్ని విభాగాలలోకీ పెట్టుబడులు ప్రవహించాయి. ఇందుకు కొత్తగా ఆరు ఫండ్స్ రంగ ప్రవేశం చేయడం సహకరించింది. వెరసి నవంబర్‌లో ఇవి రూ. 1,907 కోట్లు అందుకున్నాయి. అయితే నవంబర్‌లో పెట్టుబడులు క్షీణించినప్పటికీ కొత్త రికార్డు నెలకొల్పుతూ క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్‌లు) ద్వారా రూ. 17,073 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. సిప్ ద్వారా చేకూరనున్న లబ్దిపై అవగాహన పెరగుతుండటంతో కొత్త ఇన్వెస్టర్లను ఇవి ఆకట్టుకుంటున్నాయి. వెరసి సిప్ పెట్టుబడులు జోరు చూపుతున్నాయి. కారణాలున్నాయ్ గరిష్టస్థాయిలోని ఆర్థిక లావాదేవీలు, నిలకడైన జీఎస్టీ వసూళ్లు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలపై విశ్వాసం నేపథ్యంలో ఇన్వెస్టర్లు వివిధ రంగాలలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్ ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయని ఫైయర్స్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. ఫలితంగా అక్టోబర్‌లో నమోదైన రూ. 16,928 కోట్లను నవంబర్(రూ. 17,073 కోట్లు) అధిగమించినట్లు తెలియజేశారు. ఈక్విటీ ఫండ్స్‌లో మధ్య, చిన్నతరహా ఈక్విటీ ఫండ్స్ అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు వివరించారు. మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో ఇవి 41 శాతాన్ని ఆక్రమిస్తున్నట్లు వెల్లడించారు. స్మాల్ క్యాప్ ఫండ్స్ గరిష్టంగా రూ. 3,699 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ. 2,666 కోట్లు, కొన్ని రంగాలు లేదా థీమాటిక్ ఫండ్స్ రూ. 1,965 కోట్లు చొప్పున పెట్టుబడులను అందుకున్నాయి. అయితే లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు మందగించగా.. ఇండెక్స్ ఫండ్స్‌లోకి రూ. 1,353 కోట్లు ప్రవహించాయి. ఆస్తుల వృద్ధి నవంబర్‌లో మార్కెట్ ప్రామాణిక ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాలకు చేరడంతో 42 సంస్థల మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తులు(ఏయూఎం) రూ. 49.04 లక్షల కోట్లను తాకాయి. అక్టోబర్‌లో చివర్లో ఇది రూ. 46.71 లక్షల కోట్లుగా నమోదైంది. మరోపక్క రుణ ఆధారిత సెక్యూరిటీల విభాగంలో గత నెల రూ. 4,707 కోట్లు వెనక్కి మళ్లాయి. అక్టోబర్‌లో మాత్రం డెట్ ఫండ్స్‌కు రూ. 42,634 కోట్ల పెట్టుబడులు లభించాయి. మనీ మార్కెట్, దీర్ఘకాలిక, బ్యాంకింగ్, పీఎస్‌యూ, గిల్ట్, ఫ్లోటర్ విభాగాలను మినహాయిస్తే.. ఇతర కేటగిరీలలో నికరంగా పెట్టుబడులు తరలివెళ్లాయి. పన్ను చట్టాల సవరణ తదుపరి ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్‌లో పెట్టుబడులు మందగించినట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. వడ్డీ రేట్ల అనిశ్చిత పరిస్థితులు ఇన్వెస్టర్ల పెట్టుబడి నిర్ణయాలను మరింత సంక్లిష్టం చేసినట్లు అభిప్రాయపడ్డారు. -
రష్యా నుంచి చమురు దిగుమతులు డౌన్
న్యూఢిల్లీ: వర్షాకాలంలో డిమాండ్ తగ్గిన నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. ఆగస్టులో 7 నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇంధనాల కార్గో ట్రాకింగ్ సంస్థ వర్టెక్సా గణాంకాల ప్రకారం రష్యా నుంచి భారత్ గత నెలలో రోజుకు 1.46 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది. ఇది అంతక్రితం నెలలో రోజుకు 1.91 బీపీడీగా నమోదైంది. రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు తగ్గడం ఇది వరుసగా మూడో నెల. ఇతర దేశాల నుంచి కూడా భారత్ చమురు దిగుమతులను తగ్గించుకుంది. ఇరాక్ క్రూడ్‌ను 8,91,000 బీపీడీ నుంచి 8,66,000 బీపీడీకి, యూఏఈ ఆయిల్‌ను 2,90,000 బీపీడీ నుంచి 2,73,000 బీపీడీకి, అమెరికా క్రూడ్‌ను 2,19,000 బీపీడీ నుంచి 1,60,000 బీపీడీకి తగ్గించుకుంది. అయితే, సౌదీ అరేబియా నుంచి మాత్రం పెంచుకుంది. జులైలో సౌదీ అరేబియా నుంచి క్రూడాయిల్ దిగుమతులు జులైలో 4,84,000 బీపీడీగా ఉండగా ఆగస్టులో 8,20,000 బీపీడీకి పెరిగాయి. ‘పలు రిఫైనింగ్ సంస్థలు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్లాంట్ల మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నాయి. దీంతో క్రూడాయిల్ దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. అయితే క్యూ4లో పండుగ సీజన్ వల్ల దేశీయంగా డిమాండ్ పెరిగితే ముడి చమురు దిగుమతులు పుంజుకోగలవు‘ అని వర్టెక్సా అనాలిసిస్ హెడ్ (ఆసియా పసిఫిక్) సెరెనా హువాంగ్ తెలిపారు. గతేడాది ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, భారత్‌కు మార్కెట్ రేటు కన్నా చౌకగా క్రూడాయిల్‌ను రష్యా ఆఫర్ చేసింది. అప్పటివరకు భారత్ దిగుమతి చేసుకునే మొత్తం క్రూడాయిల్ వాటా 2 శాతం లోపే ఉండేది. ఆ తర్వాత పరిణామాలతో ఇది ఏకంగా 33 శాతానికి ఎగిసింది. -
మళ్లీ జియో ఫైనాన్స్ డీలా
ముంబై: వరుసగా రెండో రోజు జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో మరోసారి 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్ఈలో రూ. 12.5 కోల్పోయి రూ. 239 వద్ద నిలవగా.. ఎన్ఎస్ఈలోనూ ఇదే స్థాయి నష్టంతో రూ. 237 దిగువన స్థిరపడింది. సోమవారం సైతం ఈ షేరు 5 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకిన సంగతి తెలిసిందే. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ గత నెలలో జరిగిన ధర నిర్ధారణ ట్రేడింగ్‌లో రూ. 262 ధర వద్ద స్థిరపడింది. తదుపరి ఈ కౌంటర్లో స్టాక్ ఎక్సే్ఛంజీలు సోమవారం(21) నుంచి 10 రోజులపాటు ట్రేడ్ ఫర్ ట్రేడ్ విభాగంలో సాధారణ ట్రేడింగ్‌కు తెరతీశాయి. ఫలితంగా రోజుకి 5 శాతం సర్క్యూట్ బ్రేకర్ అమలుకానుంది. తొలి రోజు 5 శాతం పతనమై రూ. 250 సమీపంలో నిలిచింది. ఇండెక్సులలో.. ధరలో నిలకడను తీసుకురావడం, హెచ్చుతగ్గులను పరిమితం చేయడం వంటి లక్ష్యాలతో స్టాక్ ఎక్సే్ఛంజీలు జియో ఫైనాన్షియల్‌ను ప్రధాన ఇండెక్సులలో తాత్కాలికంగా భాగం చేశాయి. విలీనాలపై సవరించిన తాజా నిబంధనల అమలులో భాగంగా సెన్సెక్స్‌లో 31వ, నిఫ్టీలో 51వ షేరుగా ప్రస్తుతం కొనసాగుతోంది. నిజానికి ఈ షేరుని లిస్టింగ్ తదుపరి మూడు రోజులకు సెన్సెక్స్, నిఫ్టీల నుంచి తొలగించవలసి ఉంది. అయితే వరుసగా సర్క్యూట్ బ్రేకర్లను తాకడంతో ఈ షేరుని ఆగస్ట్ 29వరకూ సెన్సెక్స్, నిఫ్టీలలో కొనసాగించనున్నట్లు ఇండెక్సుల కమిటీ పేర్కొంది. అప్పటికి కూడా సర్క్యూట్ బ్రేకర్లను తాకడం కొనసాగితే.. మరోమారు ఇండెక్సుల నుంచి తొలగింపు వాయి దా పడవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఎల్ఐసీకి షేర్లు ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్‌లను జియో ఫైనాన్షియల్ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత నెలలో ప్రత్యేక కంపెనీగా విడదీసింది. దీనిలో భాగంగా వాటాదారులకు ప్రతీ 1 ఆర్ఐఎల్ షేరుకిగాను 1 జియో ఫైనాన్షియల్‌ను కేటాయించింది. ఫలితంగా ఆర్ఐఎల్లోగల వాటాలకుగాను ఎన్బీఎఫ్సీ జియో ఫైనాన్షియల్‌లో 6.66 శాతం వాటాను పొందినట్లు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ తాజాగా వెల్లడించింది. ఆటుపోట్ల మధ్య మార్కెట్ అక్కడక్కడే ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 4 పాయింట్లు బలపడి 65,220 వద్ద నిలిచింది. 3 పాయింట్ల స్వల్ప లాభంతో నిఫ్టీ 19,346 వద్ద స్థిరపడింది. అంతకుముందు ఇంట్రాడేలో సెన్సెక్స్ 147 పాయింట్ల వరకూ పుంజుకుని 65,396కు చేరింది. నిఫ్టీ సైతం 19,443–19,381 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. యూఎస్‌లో వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,165 లాభపడితే 1503 డీలాపడ్డాయి. పిరమిడ్ టెక్నో ఐపీవో సక్సెస్ ఇండ్రస్టియల్ ప్యాకేజింగ్ కంపెనీ పిరమిడ్ టెక్నోప్లాస్ట్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు మంగళవారాని(22)కల్లా 18 రెట్లుపైగా సబ్‌్రస్కిప్షన్ లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 75.6 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 13.83 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఈ ఆఫర్‌తో కంపెనీ రూ. 153 కోట్లు సమకూర్చుకుంది. రూపాయి రికవరీ 14 పైసలు అప్; 82.99 వద్ద ముగింపు న్యూఢిల్లీ: డాలరు మారకం విలువ తగ్గిన నేపథ్యంలో దేశీ కరెన్సీ రూపాయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే 14 పైసలు బలపడి, 82.99 వద్ద ముగిసింది. అమెరికా డాలరు బలహీనత దీనికి కారణం. -
ఏప్రిల్‌లో ఆన్లైన్ హైరింగ్ తగ్గింది
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ నియామకాలు ఏప్రిల్‌లో తగ్గాయని ఫౌండిట్ నివేదిక వెల్లడించింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ఇది 6 శాతం క్షీణత నమోదైందని వివరించింది. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ స్టార్టప్స్‌లో హైరింగ్ పెరిగిందని తెలిపింది. ‘ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు వ్యాపారాలకు సవాలుతో కూడిన వాతావరణాన్ని సృష్టించాయి. నియామకా లు తగ్గినప్పటికీ ఉద్యోగార్థులకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు పుష్క లంగా ఉన్నాయి. భారత స్టార్టప్ వ్యవస్థ ఒక మలుపు తీసుకుంది. జాబ్ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ నియామకాల విషయంలో మళ్లీ జోరు ప్రదర్శిస్తోంది’ అని తెలిపింది. టాప్–5లో ఎడ్టెక్.. ఉద్యోగావకాశాల పట్ల జాగ్రత్తతో కూడిన సెంటిమెంట్లు కొనసాగుతాయని ఆశిస్తున్నప్పటికీ, అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలపై ఆశాజనకంగా ఉంది. ప్రత్యేకించి స్టార్టప్‌లు ప్రతిభ, ఆవిష్కరణల కోసం డిమాండ్‌ను పెంచుతూనే ఉన్నాయి. స్టార్టప్ నియామకాల్లో టాప్–5 రంగాల్లో ఎడ్టెక్ ఉంది. బీఎఫ్ఎస్ఐ/ఫిన్‌టెక్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి ఇతర విభాగాలు కూడా స్టార్టప్ హైరింగ్‌లో గణనీయ డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. ఆరోగ్య సేవలు, బీపీవో విభాగాలు తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. స్టార్టప్స్ హైరింగ్‌లో 33 శాతం వాటాతో బెంగళూరు టాప్‌లో నిలిచింది. ఢిల్లీ, ముంబై, పుణే సైతం మెరుగైన ప్రతిభ కనబరిచాయి. జోరుగా రిటైల్ రంగం.. రిటైల్ రంగం 22% వృద్ధి నమోదు చేసింది. ఈ రంగం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ వృద్ధికి ఈ–కామర్స్ గణనీయంగా దోహదపడింది. భారత్ ఇప్పుడు అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్లకు వేదికైంది. ఈ విస్తరణ రిటైల్ ఔట్లెట్లలో నిపుణులకు డిమాండ్‌ను పెంచింది. ఉద్యోగార్థులకు పుష్కలమైన అవకాశాలను రిటైల్ రంగం కల్పిస్తోంది. ఇతర విభాగాల్లో ఇలా.. ట్రావెల్, టూరిజం విభాగం 19 శాతం, టెలికం 14, ఎన్జీవో, సోషల్ సర్వీస్ 11, ప్రకటనలు, మార్కెట్ పరిశోధన, పబ్లిక్ రిలేషన్స్ 7, చమురు, వాయువు 3, షిప్పింగ్, మెరైన్‌లో హైరింగ్ 2 శాతం ఎగసింది. సాంకేతికత, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై ఆధారపడటం పెరుగుతున్న కారణంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అధిక డిమాండ్ ఉంది. బీఎఫ్ఎస్ఐ 4 శాతం, బీపీవో, ఐటీఈఎస్ విభాగంలో నియామకాలు 13 శాతం క్షీణించాయి. ఆరోగ్య సేవలు, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ 16, ఐటీ–హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ విభాగాలలో 22 శాతం తిరోగమన వృద్ధి నమోదైందని నివేదిక వివరించింది. -
గాడిన పడని ఎఫ్ఎంసీజీ రంగం
న్యూఢిల్లీ: వినియోగంపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ (ఎఫ్ఎంసీజీ) డిసెంబర్ త్రైమాసికంలో ప్రతికూల వృద్ధిని చూసింది. విశ్లేషణ సంస్థ నీల్సన్ఐక్యూ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2022 అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ అమ్మకాల విలువ 7.6 శాతం పెరిగింది. కానీ, విక్రయించిన ఉత్పత్తుల సంఖ్య పరంగా చూస్తే 0.3 శాతం తగ్గింది. విక్రయాల సంఖ్య పరంగా ప్రతికూల వృద్ధి పరిశ్రమలో నమోదైంది. కరోనా ముందు నాటితో పోలిస్తే విలువ, సంఖ్యా పరంగా అమ్మకాలు ఎగువనే ఉన్నాయి. వరుసగా ఆరో త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లో విలువ పరంగా 2.8 శాతం క్షీణత నమోదైంది. కానీ, గత డిసెంబర్ క్వార్టర్లో పట్టణ మార్కెట్లో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ 1.6 శాతం వృద్ధిని చూసింది. రిటైల్ విభాగంలో ఆధునిక విక్రయ చానళ్లలో విలువ పరంగా 23.3 శాతం, సంఖ్యా పరంగా 12.6 శాతం చొప్పున వృద్ధి, అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చినప్పుడు నమోదైంది. సంప్రదాయ చానళ్లు అయిన కిరాణా దుకాణాలు తదితర నమూనాల్లో అమ్మకాలు 1.5 శాతం తగ్గాయి. ‘‘వినియోగదారులు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుండగా, తయారీదారులు కూడా ప్రోత్సాహకాలను తొలగించి మార్జిన్లను కాపాడుకునే విధానాన్ని అనుసరించారు’’అని నీల్సన్ ఐక్యూ కస్టమర్ సక్సెస్ లీడ్ సోనికా గుప్తా తెలిపారు. చిన్న ప్యాకెట్లకే మొగ్గు ‘‘సంప్రదాయ, ఆధునిక విక్రయ చానళ్లలో వినియోగదారులు ఇప్పటికీ చిన్న పరిమాణంలోని ప్యాకెట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. తయారీ సంస్థలు సైతం విక్రయాల కోసం చిన్న ప్యాక్‌లను తమ పోర్ట్‌ఫోలియోలో నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. చిన్న సంస్థల నుంచి పోటీ ఉండడం కూడా పోర్ట్‌ఫోలియో పరంగా వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం పెద్ద సంస్థలకు ఏర్పడింది. ఆహారోత్పత్తులకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తూ, నాన్ ఫుడ్ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని నీల్సన్ఐక్యూ నివేదిక తెలియజేసింది. నాన్ ఎఫ్ఎంసీజీ అమ్మకాలు అన్ని విభాగాల్లోనూ కరోనా ముందు నాటితో పోలిస్తే తక్కువగా నమోదువుతున్నట్టు చెప్పింది. -
అయ్యో.. ఎలన్ మస్క్! సంచలన పతనం
ఎలన్ మస్క్.. వ్యాపార రంగంలోనే కాదు సోషల్ మీడియాలోనూ ఓ ట్రెండ్ సెట్టర్. గత రెండేళ్లుగా ప్రపంచ మీడియా సంస్థల్లో ఆయన పేరు నానని రోజంటూ లేదు. అంతలా సంచలనాలకు తెర లేపాడు ఆయన. పైపెచ్చు 2021 జనవరిలో వ్యక్తిగత సంపదను 200 బిలియన్ల మార్క్ దాటించుకుని.. మానవ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తద్వారా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను దాటేసి.. అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతూ వస్తున్నాడు. అయితే.. ట్విటర్ కొనుగోలు నేపథ్యంలో ఎలన్ మస్క్‌కు బ్యాడ్ టైం నడుస్తున్నట్లు ఉంది. 2022 ఎలన్ మస్క్‌కు ఏరకంగానూ కలిసి రాలేదు. ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ పరిణామాలేవీ ఆయన ఖాతాలో పడకపోవడం గమనార్హం. పైగా ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం.. ప్రపంచ అపర కుబేరుల జాబితా నుంచి రెండో స్థానానికి పడిపోయారు ఆయన. ఏడాది చివరకల్లా.. 150 బిలియన్ డాలర్లకు దిగువకు పడిపోయింది ఆయన సంపద. ఒకానొక టైంకి 137 బిలియన్ డాలర్లకు చేరుకుంది కూడా. చరిత్రలో తొలి ట్రిలియన్ బిలియనీర్‌గా నిలిచిన ఘనత ఎలన్ మస్క్‌దే. నవంబర్ 4, 2021 నాటికి ఆయన సంపద అక్షరాల 340 బిలియన్ డాలర్లు. కానీ, ఆ మార్క్‌ను ఆయన ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు!. ఎలన్ మస్క్ సంపద తరుగుతూ వస్తోంది. మరోవైపు ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినా.. ఆయన సంపదపై ఆ ప్రభావం పడదని ఆర్థిక విశ్లేషకులు భావించారు. కానీ, అ అంచనా తప్పింది. టెస్లా షేర్లు గణనీయంగా, క్రమం తప్పకుండా పతనం అవుతుండడం(2022లో ఏకంగా 65 శాతం దాకా పతనం అయ్యింది) ఆయన సంపద కరిగిపోవడానికి ప్రధాన కారణంగా మారింది. అయితే ఎలన్ మస్క్ మాత్రం టెస్లా అద్భుతంగా పని చేస్తోందని, అది అంతకు ముందు కంటే అద్భుతంగా ఉందంటూ డిసెంబర్ 16వ తేదీన ఒక ట్వీట్ చేశాడు. గణాంకాలు మాత్రం విశ్లేషకుల అంచనాలకు తగ్గట్లే ఉన్నాయి. మిగతా సొంత కంపెనీలతో(న్యూరాలింక్, ఓపెన్ ఏఐ, స్పేస్ఎక్స్.. దీని అనుబంధ సంస్థ స్టార్‌లింక్, ది బోరింగ్ కంపెనీలతో ఎలన్ మస్క్‌కు పెద్దగా ఒరిగింది కూడా ఏం లేకపోవడం గమనార్హం!. ఈ కథనం రాసే సమయానికి ఫోర్బ్స్ లిస్ట్‌లో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ అర్నాల్ట్ & ఫ్యామిలీ 179 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో ఎలన్ మస్క్ 146 బిలియన్ డాలర్లత సంపదతో నిలిచారు. అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 200 బిలియన్ డాలర్ల సంపదను ఆయన కోల్పోయారన్నమాట. మానవ చరిత్రలో ఇప్పటిదాకా ఇంతలా ఓ వ్యక్తి సంపదను కోల్పోయిందే లేదు. ఇక.. భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ 127 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: రిలయన్స్‌ను ముకేశ్ ఎలా ఉరుకులు పెట్టించారో తెలుసా? -
‘సైకిల్’ కకావికలం.. కుప్పంలో పడిపోయిన టీడీపీ గ్రాఫ్
సాక్షి, చిత్తూరు: ప్రజలను పట్టించుకోకుంటే ఏం జరుగుతుందో ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఇప్పుడు అర్థమవుతోంది. కార్యకర్తలను కేవలం మెట్లుగానే ఉపయోగించుకుంటే పరిస్థితి ఎలా తారుమారవుతుందో అవగతమవుతోంది. అభివృద్ధి ఫలాలను అందించకుండా మాయమాటలకే పరిమితమైతే జరిగే నష్టం ఎలా ఉంటుందో తెలిసివస్తోంది. కుప్పం కోట చేజారిపోయిందనే బెంగ రోజురోజుకూ పెరిగిపోతోంది. దశాబ్దాలుగా మోసిన తమ్ముళ్లు సైతం జారిపోతుంటే ఆందోళన అధికమవుతోంది. కుదేలైన సైకిల్‌కు ఎన్ని మరమ్మతులు చేసినా పార్టీ గ్రాఫ్ దిగజారిపోతుండడంతో దిక్కుతోచనిస్థితి ఎదురవుతోంది. ఈ మేరకు గురువారం విజయవాడలో కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై బుజ్జగింపులకు దిగినట్లు తెలిసింది. చదవండి: పత్రాలు మార్చి అసైన్డ్ అరాచకం.. బాబు హయాంలో భారీ భూ కుంభకోణం! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల కుప్పంలో బహిరంగ సభ నిర్వహించిన తర్వాత టీడీపీ పరిస్థితి మరింత పడిపోయింది. ఒకప్పుడు ఏడాదికి ఒకసారి కూడా నియోజకవర్గం వైపు చూడని చంద్రబాబుకు ఇప్పుడు కలలో కూడా కుప్పమే కనిపిస్తోంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోటలా మార్చుకున్న నియోజకర్గం చేజారిపోతుందేమో అనే దిగులు చందబ్రాబును వెంటాడుతోంది. డీలా పడిన టీడీపీ అభివృద్ధి చూడాలంటే కుప్పం రండి అంటూ ఒకప్పుడు చంద్రబాబు జబ్బలు చరుచుకునేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో కుప్పం ప్రజలకు తెలిసిపోయింది. ఇంతకాలం మాటలతో తాము మోసపోయామని గ్రహించారు. దీంతో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గంపగుత్తగా గెలిపించారు. ప్రతిపక్షనేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమాత్రం వివక్ష చూపకుండా అభివృద్ధిని పరుగులు తీయిస్తుండడంతో ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,149 కోట్లు మంజూరు చేయడంతో అభిమానం రెండింతలైంది. ఈ క్రమంలోనే సెపె్టంబర్ 23వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ సభకు ప్రజానీకం తండోపతండాలుగా తరలివచ్చింది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంత సేపూ హర్షధ్వానాలతో మద్దతు పలికింది. దీంతో అటు చంద్రబాబుకు, ఇటు స్థానిక టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలు విషయం అర్థమయ్యేసరికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పరువు కోసం పాట్లు! గత సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ తగ్గడంతో చంద్రబాబుకు తత్వం బోధపడింది. కుప్పంలో తన ప్రభ మసకబారుతోందని అర్థమైంది. దీనికితోడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లు గెలవడమే లక్ష్యమని ప్రకటించగానే బాబులో మరింత గుబులు మొదలైంది. సొంత నియోజకవర్గంలోనే ఓడిపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారని టీడీపీ నేతలే చెబుతున్నారు. అందులో భాగంగానే 25 మంది కుప్పం నేతలను గురువారం విజయవాడకు పిలిపించుని మాట్లాడినట్లు వెల్లడించారు. కార్యకర్త నుంచి నేతల వరకు అందరూ సమష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కుప్పం టీడీపీ ఇన్చార్జి పీఎస్ మునిరత్నంపై పలువురు ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. ఆయన వల్ల పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోందని, వెంటనే ఇన్చార్జిని మార్చాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీనిపై చంద్రబాబు దృష్టి సారించారని, త్వరలోనే కొత్త ఇన్చార్జిని నియమించనున్నట్లు తమ్ముళ్లు చెబుతున్నారు. సీఎం వరాలపై జనంలో చర్చ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.66 కోట్లు కేటాయించారు. నియోజకవర్గంలో డీబీటీ పథకాల ద్వారా రూ.866 కోట్లు, నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.283 కోట్లు మొత్తంగా రూ.1,149 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కుప్పం వాసులు సైతం ముఖ్యమంత్రి కురిపించిన వరాలపై చర్చించుకుంటున్నారు. ఏళ్ల తరబడి గెలిపిస్తే చంద్రబాబు చేసింది శూన్యమని, మూడున్నరేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరుగులు తీయిస్తోందని ప్రశంసిస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
తిరోగమన బాటలో ఫారెక్స్ నిల్వలు.. భారీగా తగ్గుదల
ముంబై: భారత్ ఫారెక్స్ నిల్వలు తిరోగమన బాటన కొనసాగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చిచూస్తే, 897 మిలియన్ డాలర్లు తగ్గి, 572.978 బిలియన్ డాలర్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలను వెల్లడించింది. ఫారెక్స్ మార్కెట్లో అవసరాలకు సంబంధించి డాలర్ల లభ్యత తగిన విధంగా ఉండేలా చూడ్డం, ఎగుమతులకన్నా, దిగుమతులు పెరుగుదల, రూపాయి విలువ స్థిరీకరణకు చర్యలు వంటి అంశాలు ఫారెక్స్ నిల్వల తగ్గుదలకు కారణం అవుతోంది. 2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. గణాంకాల ప్రకారం.. వేర్వేరు విభాగాల్లో... ► డాలర్ రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) సమీక్షా వారంలో 1.611 బిలియన్ డాలర్లు తగ్గి 509.646 బిలియన్ డాలర్లకు చేరాయి. ► సిడి నిల్వల విలువ 671 మిలియన్ డాలర్లు పెరిగి 40.313 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► ఐఎంఎఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 46 మిలియన్ డాలర్లు పెరిగి 18.031 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఐఎంఎఫ్ వద్ద నిల్వల స్థాయి 3 మిలియన్ డాలర్లు తగ్గి 4.987 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్బీఐ గవర్నర్ భరోసా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, దిగుమతులు, రుణ సేవల అవసరాలు, పోర్ట్‌ఫోలియో అవుట్‌ఫ్లోల కారణంగా డిమాండ్‌కు సంబంధించి ఫారెక్స్ మార్కెట్లో విదేశీ మారకపు సరఫరాలకు సంబంధించి వాస్తవంగా కొరత ఉందని అన్నారు. తగినంత విదేశీ మారక ద్రవ్య లభ్యత ఉండేలా సెంట్రల్ బ్యాంకు మార్కెట్‌కు అమెరికా డాలర్లను సరఫరా చేస్తోందని చెప్పారు. ‘‘మూలధన ప్రవాహం బలంగా ఉన్నప్పుడు మనం ఫారెక్స్ నిల్వలను భారీగా కూడబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాం. వర్షం పడుతున్నప్పుడు ఉపయోగించేందుకు మీరు గొడుగును కొనుగోలు చేస్తారు’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
ఆరు వారాల్లో అతిపెద్ద నష్టం
ముంబై: స్టాక్ మార్కెట్ సోమవారం ఆరు వారాల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ షేర్ల భారీ పతనం సూచీల నష్టాలను శాసించాయి. దేశీయంగా వినిమయ, టోకు ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరడంతో ఆర్బీఐ వడ్డీరేట్లు పెంపు ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం భయాలతో పాటు తాజాగా పెరుగుతున్న కోవిడ్ కేసులు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండు శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1,172 పాయింట్లు పతనమై 57,167 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ 20 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ 302 పాయింట్లను కోల్పోయి 17,174 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. మరోవైపు ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,387 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.3,342 కోట్ల షేర్లను కొన్నారు. ఆరంభ నష్టాలను పూడ్చుకున్న రూపాయి డాలర్ మారకంలో ఆరు పైసలు బలహీనపడి 76.25 స్థాయి వద్ద ముగిసింది. 1,000 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభం నాలుగు సెలవు రోజుల అనంతరం ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూలతలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 1,000 పాయింట్లను కోల్పోయి 57,339 వద్ద, నిఫ్టీ 293 పాయింట్ల పతనంతో 17,183 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో కాస్త కోలుకునే ప్రయత్నం చేసినా.., రికవరీకి తోడ్పాటును అందించే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,497 పాయింట్లు క్షీణించి 56,842 వద్ద, నిఫ్టీ 408 పాయింట్లను కోల్పోయి 17,068 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ► మ్యూచువల్ ఫండ్ పంపిణీ ప్లాట్‌ఫామ్ ‘బీఎస్ఈ స్టార్ ఎంఎఫ్’పై సోమవారం 30.11 లక్షల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 11 తర్వాత ఒకరోజులో ఇదే గరిష్టస్థాయి అని బీఎస్ఈ తెలిపింది. ► సూచీలు రెండు శాతం పతనంతో స్టాక్ మార్కెట్లో రూ. 2.58 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. తద్వారా బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.269 లక్షల కోట్లకు దిగివచ్చింది. బలహీనంగా అంతర్జాతీయ మార్కెట్లు చైనా ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ 4.8 శాతం వృద్ధికి పరిమితం కావడంతో పాటు కోవిడ్ కేసులు శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. జపాన్, సింగపూర్, చైనా, తైవాన్, దక్షిణ కొరియా, స్టాక్ సూచీలు ఒకశాతం వరకు పతనమైంది ఇండో నేసియా మార్కెట్ మాత్రం నష్టాల నుంచి తేరుకొని అరశాతం లాభపడింది. హాంగ్‌కాంగ్ మార్కెట్ సెలవు. ఈస్టర్ హాలిడేస్ సందర్భంగా యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్‌కు రూ.53,509 కోట్ల నష్టం మార్చి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఇన్ఫోసిస్ షేరు సోమవారం ఏడుశాతానికి పైగా క్షీణించి రూ.1,621 వద్ద స్థిరపడింది. గత బుధవారం (ఏప్రిల్ 13)మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ క్యూ4 ఫలితాలను వెల్లడించింది. బలహీనమైన నిర్వహణ మార్జిన్ నమోదు నేపథ్యంలో షేరు ఉదయం 8% నష్టంతో రూ.1592 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో తొమ్మిది శాతం క్షీణించి రూ.1,592 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మార్చి 16, 2020 తర్వాత షేరు ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి. షేరు భారీ పతనంతో కంపెనీకి ఒక్కరోజులోనే రూ.53,509 కోట్ల నష్టం వాటిల్లింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 5 శాతం పతనం ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ఐదు శాతం నష్టపోయి రూ. 1,395 వద్ద స్థిరపడింది. క్యూ4లో నికర లాభం అంచనాలను అందుకోలేకపోవడం షేరు పతనానికి కారణమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఐదు శాతం నష్టపోయి రూ.1,390 స్థాయిని తాకింది. బీఎస్ఈలో 4.94 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.38,542 కోట్లు కుచించుకుపోయి రూ.7.73 లక్షల కోట్లు వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► తన అనుబంధ సంస్థలో యూఎస్ కంపెనీ బ్లాక్‌రాక్ రియల్ అసెట్స్ రూ. 4,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు టాటా పవర్ ప్రకటనతో ఈ షేరులో లాభాల స్వీకరణ జరిగింది. బీఎస్ఈలో ఆరు శాతం నష్టంతో రూ.258 వద్ద స్థిరపడింది. ► ఈ వేసవి సీజన్లో విద్యుత్ డిమాండ్ ఉంటుందన్న అంచనాతో ఎన్టీపీసీ షేరు ఆరుశాతం లాభపడి రూ.163 వద్ద స్థిరపడింది. ‘‘ఐటీ, బ్యాంకింగ్ రంగ దిగ్గజాలు నిరాశాజనకమైన గణాంకాలతో ఆర్థిక ఫలితాల సీజన్‌ను ప్రారంభించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. భారత్‌లో కోవిడ్ కేసుల నమోదు, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ ఆందోళనలు రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్‌కు దిశానిర్ధేశాన్ని చూపుతాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. -
మార్కెట్‌పై చమురు పిడుగు!
ముంబై: అనూహ్యంగా ఎగబాకిన ముడి చమురు ధరలకు ద్రవ్యోల్బణ భయాలు ఆజ్యం పోయడంతో సోమవారం ఈక్విటీ మార్కెట్లు మండిపోయాయి. రష్యా క్రూడ్ ఎగుమతులపై ఆంక్షలు విధించాలని పాశ్చత్య దేశాలు యోచిస్తున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో బలగాలు పోరులోకి దిగుతాయనే వార్తలు వెలుగులోకి రావడంతో ఇకపై యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో అనే భయాలూ వెంటాడాయి. ఇక దేశీయంగా ఫిబ్రవరిలో సేవల రంగం తీరు నిరాశపరిచింది. ఎన్ఎస్ఈ కుంభకోణంలో చిత్రా రామకృష్ణన్‌ను సీబీఐ ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేయడం మార్కెట్ వర్గాలు కలవరపడ్డాయి. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి జీవితకాల కనిష్టానికి చేరుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ పరిణామాలన్నీ సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లో మరో బ్లాక్ మండే నమోదైంది. ఒక్క మెటల్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనవడంతో స్టాక్ సూచీలు 7 నెలల కనిష్టస్థాయిల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 1,491 పాయింట్లు నష్టపోయి 52,843 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 382 పాయింట్లను కోల్పోయి 16వేల దిగువున 15,863 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 1967 పాయింట్లు పతనమై 52,367 వద్ద, నిఫ్టీ 534 పాయింట్లు నష్టపోయి 15,711 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,482 కోట్ల షేర్లను అమ్మేయగా.. దేశీ ఇన్వెస్టర్లు రూ.5,331 కోట్ల షేర్లను కొన్నారు. ప్రపంచ మార్కెట్లూ పతనమే... పదోరోజూ ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పతనాన్ని చవిచూశాయి. ఆసియాలో అన్ని దేశాల స్టాక్ సూచీలు నష్టంతో ముగిశాయి. హాంగ్‌కాంగ్ మార్కెట్ అత్యధికంగా నాలుగుశాతం క్షీణించింది. జపాన్, తైవాన్, కొరియా సూచీలు మూడు శాతం, చైనా, సింగపూర్, ఇండోనేషియా సూచీలు రెండు శాతం నష్టపోయాయి. యూరప్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు మూడు శాతం నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్ల మద్దతుతో అరశాతం నష్టాన్ని చవిచూశాయి. కాగా అమెరికా స్టాక్ మార్కెట్లు రెండు శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ సూచీ 3,404 పాయింట్లు(ఆరుశాతం) క్షీణించడంతో ఇన్వెస్టర్లు రూ.11.28 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. -
Reliance : రూ.68,404 కోట్ల మార్కెట్ క్యాప్ హాంఫట్!
గత 5 రోజుల్లో సెన్సెక్స్ 3,817 పాయింట్లు, నిఫ్టీ 1,159 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సూచీలు 6% కుదేలవడంతో రూ.19.50 లక్షల కోట్లు ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.9.31 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. దీనితో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు చేరింది. ముంబై: స్టాక్ మార్కెట్‌పై సోమవారం బేర్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూలతలను ఆసరా చేసుకొని వరుసగా ఐదో పంజా విసిరింది. బేర్ ఉగ్రరూపం దాల్చడంతో స్టాక్ సూచీలు రెండు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీతో సెన్సెక్స్ 1,546 పాయింట్లు నష్టపోయి 58 వేల దిగువన 57,492 వద్ద స్థిరపడింది. నిప్టీ 468 పాయింట్లు క్షీణించి 17,149 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల ఇండెక్సులు ఆరుశాతం వరకు క్షీణించాయి. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు ఏకంగా నాలుగు శాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లూ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో సిప్లా, ఓఎన్జీసీ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,751 కోట్ల షేర్లను అమ్మేయగా.., డీఐఐలు రూ. 75 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడేలో 9 నెలల కనిష్టానికి... సెన్సెక్స్ ఉదయం 13 పాయింట్ల స్వల్ప నష్టంతో 59,023 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 17,575 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి గంటగంటకూ అమ్మకాల ఉధృతి పెరగడంతో సూచీలు అంతకంతా నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2053 పాయింట్లు నష్టపోయి 56,984 వద్ద, నిఫ్టీ 620 పాయింట్లు కోల్పోయి 16,997 వద్ద తొమ్మిది నెలల కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ ఎక్సేంజీలో 872 షేర్లు షార్ట్ సర్క్యూట్‌ను తాకాయి. మూడువేలకు పైగా స్టాకులు నష్టాలపాలయ్యాయి. అయితే చివరి గంటలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడంతో సూచీలు 57 వేలు, నిఫ్టీ 17 వేలు స్థాయిలని నిలుపుకోలిగాయి. పతనానికి కారణాలు ► అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మన మార్కెట్ ప్రతికూల సంకేతాలను అందుకుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం ప్రారంభానికి(నేటి నుంచి) ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. రష్యా–ఉక్రెయిన్ దేశాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం, క్రూడ్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడం, కోవిడ్ తాజా విజృంభణ ప్రపంచ మార్కెట్లలోని సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ► జొమాటో, పేటీఎం పేలవం.. గతేడాది చివర్లో ఎక్సే్చంజీల్లో లిస్టయిన స్టార్టప్, టెక్ తరహా కంపెనీల భారీ పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బుల్ మార్కెట్ జోరులో లిస్టింగ్‌లో అదరగొట్టడంతో పాటు కొత్త తరం ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు చేయడంతో ఈ షేర్ల వ్యాల్యుయేషన్లు భారీగా పెరిగాయి. అయితే సంబంధిత కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో లాభాల స్వీకరణ కొనసాగుతోంది. ఆల్‌టైమ్‌హై నుంచి కొంతకాలంగా పేటీఎం 60 శాతం, జొమాటో 50 శాతం, నైకా 30 శాతం, పాలసీ బజార్ 40 శాతం చొప్పున క్షీణించాయి. ► దేశీయ పరిణామాలు దేశవ్యాప్తంగా రోజుకు సగటున మూడు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని రా ష్ట్రాల ఆంక్షల కొనసాగింపు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. భారీగా నష్టపోయిన రిలయన్స్ డిసెంబర్ క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించినప్పటికీ.., దేశీయ అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4% నష్టపోయి రూ. 2,377 వద్ద స్థిరపడింది. మార్కెట్ నష్టాల ట్రెండ్ అనుగుణంగా షేరులో లాభాల స్వీకరణ జరిగినట్లు నిపుణులు తెలిపారు. షేరు 4% పతనంతో ఆర్ఐఎల్ ఒక్కరోజే రూ.68,404 కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. ► మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో వొడాఫోన్ ఐడియా ఎనిమిది శాతం నష్టపోయి రూ.11 వద్ద స్థిరపడింది. ఒక దశలో పది శాతం పతనమై రూ.10.75 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ► న్యూ ఏజ్(కొత్త తరం) జొమాటో, నైనా షేర్లు 20 శాతం చొప్పున క్షీణించాయి. ► మార్కెట్లో అనిశ్చితిని సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏకంగా 20.84 శాతం ఎగసి 22.83 స్థాయికి చేరుకుంది. ఐపీవోకు మాన్యవర్ రెడీ సంప్రదాయ దుస్తుల బ్రాండ్ మాన్యవర్ మాతృ సంస్థ వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. ఐపీవోలో భాగంగా కంపెనీ దాదాపు 3.64 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. కంపెనీ ఐపీవోకు అనుమతించమంటూ గతేడాది సెప్టెంబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. ప్రధానంగా ప్రమోటర్ సంస్థ రవీ మోడీ ఫ్యామిలీ ట్రస్ట్ 1.81 కోట్ల షేర్లు. అదే బాటలో డ్రీమ్‌ఫోక్స్ ఎయిర్పోర్ట్ సర్వీసుల ప్లాట్‌ఫామ్ డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 2.18 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ దేశీయంగా గ్లోబల్ నెట్‌వర్క్‌ల క్రెడిట్, డెబిట్ కార్డులుగల వినియోగదారులకు విమానాశ్రయ సంబంధ లాంజ్‌లు, ఆహారం, పానీయాలు, హోటళ్లు, బదిలీ తదితర పలు సేవలను అందిస్తోంది. రూపాయి 3 వారాల కనిష్టం డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు వారాల కనిష్టానికి పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గత శుక్రవారం ముగింపుతో పోల్చితే 17పైసలు బలహీనపడి 74.60 వద్ద ముగిసింది. అధిక క్రూడ్ ధరలు, ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి, ఫారిన్స్ ఫండ్స్ వెనక్కు మళ్లడం, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల వంటి అంశాలు దీనికి నేపథ్యం. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటివరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). నేటి బోర్డు మీటింగ్స్ మారుతీ సుజుకీ, సిప్లా, ఫెడరల్ బ్యాంక్, ఇక్రా, యూనిటెడ్ స్పిరిట్స్, మాక్స్ ఇండియా, పిడిలైడ్ ఇండస్ట్రీస్, రేమాండ్, సింఫనీ, స్టార్ సిమెంట్ -
సెన్సెక్స్ 889 పాయింట్లు క్రాష్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వారాంతపు రోజున కుప్పకూలింది. దీంతో సూచీల లాభాలు ఒక రోజుకే పరిమితమయ్యాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్ 889 పాయింట్లు నష్టపోయి 57,011 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 263 పాయింట్లు పతనమైన 17,000 దిగువున 16,985 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. విస్తృత స్థాయి మార్కెట్లో అమ్మకాతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండున్నర శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో కేవలం ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,070 కోట్ల ఈక్వటీ షేర్లు విక్రయించగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,479 కోట్ల షేర్లను కొన్నారు. రూపాయి ఇంట్రాడే నష్టాలను పూడ్చుకొని మూడుపైసల స్వల్ప లాభంతో 76.06 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,775 పాయింట్లు, నిఫ్టీ 526 కోట్లు నష్టపోయాయి. ఆసియాలో చైనా, జపాన్, సింగపూర్, హాంకాంగ్ మార్కెట్లు రెండున్నర శాతం నష్టపోయాయి. యూరప్‌లోని ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ దేశాల స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం పతనమయ్యాయి. ఏ దశలోనూ కోలుకోలేక... మునుపటి లాభాల ముగింపునకు కొనసాగింపుగా ఉదయం స్టాక్ మార్కెట్ లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 121 పాయింట్లు పెరిగి 58,022 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 17,276 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆరంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు లాభాలను నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ట్రేడింగ్ గడుస్తున్న కొద్దీ అమ్మకాల తీవ్రత పెరుగుతుండటంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్ ఓ దశలో 950 పాయింట్లకు పైగా పతనమై.. 56951 వద్ద, నిఫ్టీ 282 పాయింట్లను కోల్పోయి 16,966 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. నష్టాలు ఎందుకంటే... ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు కఠినతర ద్రవ్య పాలసీ విధానాల అమలుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను పెంచగా.., వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కీలకరేట్ల పెంపును ప్రారంభిస్తామని యూఎస్ ఫెడ్ ప్రకటించింది. అధిక వడ్డీ రేట్ల భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. ఈ ప్రభావం మన స్టాక్ సూచీలపై పడింది. కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అంతకంతా పెరిగిపోతుండటంతో లాక్డౌన్లు, కర్ఫ్యూ విధింపు ఆందోళనలు తెరపైకి వచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు ఒత్తిడిని పెంచాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు 3% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. రూ.4.65 లక్షల కోట్లు సంపద ఆవిరి స్టాక్ సూచీల ఒకటిన్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం.4.65 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో మొత్తం కంపెనీల విలువ రూ.260 లక్షల కోట్లకు దిగివచ్చింది. టెక్ షేర్లకు యాక్సెంచర్ జోష్..! ఐటీ దిగ్గజం యాక్సెంచర్ వచ్చే ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలను పెంచడంతో దేశీయంగా లిస్టెడ్ దిగ్గజ కంపెనీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ఈ ఇండెక్స్ ఒకటిన్నర శాతం లాభపడింది. అంతే కాకుండా నిఫ్టీ–50 సూచీలో లాభంతో ముగిసిన మొత్తం ఐదు షేర్లలో ఈ రంగ షేర్లే మూడు కావడం విశేషం. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► సమీర్ గెహ్లాట్ పారీస్ సంస్థ తన మొత్తం వాటాలో 12% వాటాను విక్రయించడంతో ఇండియాబుల్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో ఎనిమిదిన్నర శాతం నష్టపోయి రూ.233 వద్ద ముగిసింది. ► వ్యాపార పునర్నిర్మాణ ప్రణాళికతో బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు రెండు నెలల గరిష్టానికి చేరుకుంది. బీఎస్ఈలో మూడుశాతం లాభపడి రూ.1,300 వద్ద నిలిచింది. లిస్టింగ్‌లో చతికిలబడిన రేట్‌గెయిన్ ట్రావెల్ ట్రావెల్ టెక్నాలజీస్ రేట్‌గెయిన్ షేర్లు లిస్టింగ్‌లో చతికిలపడ్డాయి. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.425తో పోలిస్తే రూ.364 వద్ద లిస్టయ్యాయి. ఒక దశలో 21 శాతం మేర క్షీణించి రూ.334 వద్ద స్థాయికి దిగివచ్చింది. చివరికి 20% నష్టంతో రూ.340 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.3,635 కోట్ల వద్ద స్థిరపడింది. హెచ్‌పీ అడెసివ్స్ ఐపీవోకు సానుకూల స్పందన హెచ్‌పీ అడెసివ్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు ఇన్వెస్టర్ల నుంచి సానుకూల స్పందన లభించింది. ఐపీవోలో భాగంగా 25,28,500 షేర్లను ఆఫర్ చేయగా, 5,29,89,650 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 81 రెట్లు అధిక స్పందన లభించించగా, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటాలో 19 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్ల (క్యూఐపీ) విభాగం 1.82 రెట్ల స్పందన అందుకుంది. ఒక్కో షేరుకు రూ.262–274 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించగా, గరిష్ట ధరకే షేర్లను ఇష్యూ చేయనుంది. -
బ్యాన్ ఎఫెక్ట్! బిట్‌కాయిన్‌కి భారీ దెబ్బ.. కుదేలవుతున్న క్రిప్టోకరెన్సీ
శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ద్వారా క్రిప్టోకరెన్సీ జోరుకు భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏకంగా బ్యాన్ చేస్తున్న కథనాల నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ భారీగా కుదేలు అయ్యింది. బిట్‌కాయిన్, ఎథెరియమ్, టెథర్‌లు భారీ పతనాన్ని చవిచూశాయి. The Cryptocurrency and Regulation of Official Digital Currency Bill, 2021.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI పర్యవేక్షణలో డిజిటల్ కరెన్సీ నియంత్రణకు ఒక ప్రణాళిక రూపొందించాలని, బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టోకరెన్సీలను నిషేధించడమో లేదంటే కఠిన నిబంధనలతో మినహాయింపులు ఇవ్వడమో లాంటివి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకోసం క్రిప్టోకరెన్సీ బిల్లు 2021ను ప్రవేశపెట్టనుందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని డిజిటల్ కరెన్సీలు, డిజిటల్ మార్కెట్లో పతనం చవిచూశాయి. ప్రపంచంలో అతిపెద్ద, విలువైన క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్‌కాయిన్18.53 శాతం, ఎథెరియమ్ 15.58 శాతం, టెథెర్ 18.29 శాతం పడిపోయాయి. ఇక భారత్ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. తాజా పతనంతో వీళ్లకు పెద్ద దెబ్బే పడింది. నియంత్రణ సరిపోతుందా? గత పదేళ్లుగా ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ బాగా పాపులారిటీ పెంచుకుంటోంది. ఇక క్రిప్టోకరెన్సీ అడ్వర్టైజ్మెంట్లు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నాయి. ఈజీగా, ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చంటూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయవి. ఈ క్రమంలో భారీ మోసాలు సైతం వెలుగుచూస్తున్నాయి. అందుకే ఆర్బీఐ మాత్రం క్రిప్టోకరెన్సీ విషయంలో మొదటి నుంచి వ్యతిరేకతనే వ్యక్తం చేస్తోంది. క్రిప్టోకరెన్సీ వల్ల దేశ ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ, కేంద్రం మాత్రం క్రిప్టోకరెన్సీ ప్రయోజనాలను సైతం పరిగనణలోకి తీసుకుంటోంది. కిందటి వారం బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలో ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో క్రిప్టో ఎక్సేంచెజ్, బ్లాక్ చెయిన్, క్రిప్టో ఎస్సెట్స్ కౌన్సిల్ BACC, ఇతరులు సమావేశం అయ్యారు. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని, వాటి మీద నియంత్రణ ఉంటే సరిపోతుందని ఈ భేటీలో ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించబోతోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ►ఇక వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులు మరియు దానిచే నియంత్రించబడే సంస్థలను నిషేధిస్తూ గతంలో(ఏప్రిల్ 6, 2018) RBI ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే మార్చి 4, 2021న సుప్రీంకోర్టు ఆ సర్క్యులర్‌ను పక్కన పెట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ►ప్రస్తుతం ఎల్ సాల్వడర్ దేశం ఒక్కటే బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇచ్చుకుంది. మరికొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే సిడ్నీ డైలాగ్ సందర్భంగా నవంబర్ 18న భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘‘క్రిప్టోకరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి, జాగ్రత్త పడాల’’ని ప్రపంచ దేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి అడుగు వేయబోతుందన్న ఆసక్తి నెలకొంది. Cryptocurrency: భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్.. చెల్లనే చెల్లదంటూ స్టేట్మెంట్ -
భారీగా తగ్గిన బంగారం ధర! ఎంతంటే?
న్యూఢిల్లీ: పసిడి వెలుగులు తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా బలహీన ధోరణి కొనసాగుతున్న పసిడి, సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో మరింత పతనమైంది. ఔన్స్ (31.1గ్రా) 1,726 డాలర్ల స్థాయికి క్షీణించింది. క్రితం శుక్రవారం ముగింపుతో పోలి్చతే ఇది 36 డాలర్ల పతనంకాగా, ట్రేడింగ్ ఒక దశలో 1,677 డాలర్లకూ పడిపోయింది. ఇది పసిడికి దాదాపు పటిష్ట మద్దతుస్థాయి. ఈ స్థాయి కిందకు పడిపోతే, మరింత దిగువ అంకెలను యల్లో మెటల్ చూసే అవకాశం ఉందని నిపుణుల అంచనా. అమెరికాలో ఉపాధి గణాంకాలు మెరుగ్గా ఉండడం, దీనితో వృద్ధి ఊపందుకుంటుందన్న అంచనాలు, ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0–0.25 శాతం మధ్య) పెరుగుతుందన్న ఊహాగానాలు, దీనికి అనుగుణంగా డాలర్ బలోపేతం (ప్రస్తుతం 93) బంగారంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా... అంతర్జాతీయ మార్కెట్, రూపాయి బలహీన ధోరణి నేపథ్యంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–ఎంసీఎక్స్‌లో పసిడి ధర సోమవారం ఒకానొక దశలో 10 గ్రాములకు రూ.778 పతనమై, రూ.45,862 వద్ద ట్రేడవుతోంది. -
వారంలో తొలిసారి నష్టాలు
ముంబై: ఆర్బీఐ ద్రవ్య విధాన ప్రకటన తర్వాత సూచీల జీవితకాల గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ జరిగింది. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రెండుశాతం పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ మిశ్రమ సంకేతాలు అందాయి. ఫలితంగా సూచీలు ఈ వారంలో తొలిసారి నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సరికి శుక్రవారం సెన్సెక్స్ 215 పాయింట్లను కోల్పోయి 54,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్లు క్షీణించి 16,238 వద్ద ముగిశాయి. ఫార్మా, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ షేర్లలో విక్రయాలు జరిగాయి. మెటల్, ఆటో, ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు ఆర్థికవేత్తల అంచనాలకు తగ్గట్లే ఉన్నప్పటికీ.., భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పెరగవచ్చనే ఆందోళనలను వ్యక్తం చేసింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన చర్యలను క్రమంగా ఉపసంహరించుకోవచ్చనే అంచనాలతో బుల్స్ వెనకడుగేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 423 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 113 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. పలు దేశాల్లో డెల్టా వేరియంట్ కోవిడ్ కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రెండు పైసలు బలపడి రూ.74.15 వద్ద స్థిరపడింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలు కలిసిరావడంతో ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 1,691 పాయింట్లు, నిఫ్టీ 475 పాయింట్లను ఆర్జించాయి. రిలయన్స్–ఫ్యూచర్ షేర్లకు ‘సుప్రీం’ షాక్... ఫ్యూచర్ రిటైల్‌ను కొనగోలు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కుదుర్చుకున్న డీల్‌ను తప్పుబడుతూ సుప్రీం కోర్టు అమెజాన్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీంతో రిలయన్స్ షేర్లు 2% నష్టంతో రూ.2089 వద్ద ముగిశాయి. అలాగే ఫ్యూచర్ రిటైల్ షేరు 10% పతనమై రూ.52.55 లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యింది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రెజెస్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ కంపెనీల షేర్లు కూడా 10% లోయర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యాయి. ఫ్యూచర్ కన్జూమర్ షేరు తొమ్మిది శాతం నష్టంతో రూ.7 వద్ద ముగిసింది. -
3% దిగువకు పాజిటివిటీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గత 24 గంటల్లో 60,753 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 7,60,019గా ఉంది. మరో 1,647 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,85,137కు పెరిగింది. రికవరీ రేటు 96.16 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 1.29 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 2.98 శాతంగా నమోదైంది. గత 24 గంటలలో 97,743 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య దాదాపు 39 కోట్లకు చేరువైంది. రికవరీల సంఖ్య 2,86,78,390కి పెరిగింది. ఇప్పటి వరకూ 27,23,88,783 డోసుల టీకాలిచ్చారు. -
Corona Down Fall : 7 రాష్ట్రాల్లో వెయ్యిలోపు కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. గడిచిన 24 గంటలలో మన దేశంలోని మధ్యప్రదేశ్, రాజస్థాన్, న్యూఢిల్లీ, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, జార్ఖండ్ ఏడు రాష్ట్రాలలో 1,000 లోపు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అదే విధంగా జమ్ముకశ్మీర్, పంజాబ్, బీహర్, ఛత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్ అయిదు రాష్ట్రాలలో 2,000 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. కరోనా కట్టడికి వైద్యం, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి హర్షవర్దన్ ఈ వివరాలు వెల్లడించారు. తాజా, లెక్కల ప్రకారం, ఇప్పటి వరకు దేశంలో 2,89,09,975 మంది కరోనా వైరస్‌కు గురికాగా .. 3,49,186 మంది ఈ మహమ్మారి బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 1,74,399 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,01,609 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించారు. చదవండి: జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ -
అరబిందో లాభం డౌన్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ అరబిందో ఫార్మా గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 801 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 863 కోట్ల లాభం సాధించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 6,158 కోట్ల నుంచి రూ. 6,001 కోట్లకు నీరసించింది. నాట్రోల్ విక్రయం నేపథ్యంలో ఫలితాలు పోల్చి చూడతగదని అరబిందో పేర్కొంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అరబిందో నికర లాభం రూ. 5,334 కోట్లకు చేరింది. 2019–20లో రూ. 2,844 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 23,098 కోట్ల నుంచి రూ. 24,775 కోట్లకు ఎగసింది. బోర్డు ఓకే..: పూర్తి అనుబంధ సంస్థ ఔరా క్యూర్ ప్రైవేట్లోగల మొత్తం ఈక్విటీ షేర్లను మరో సొంత అనుబంధ సంస్థ యూజియా ఫార్మా స్పెషాలిటీస్‌కు బదిలీ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు అరబిందో వెల్లడించింది. ఈ బాటలో యూనిట్–16తో కూడిన బిజినెస్‌ను స్టెప్‌డౌన్ అనుబంధ సంస్థ వైటెల్స్ ఫార్మాకు బదిలీ చేసేందుకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. కీలక విభాగాలు భేష్ కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలోనూ గతేడాది కీలక విభాగాలలో నిలకడైన వృద్ధిని చూపినట్లు అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ పేర్కొన్నారు. విభిన్నమైన, సంక్షిష్టమైన జనరిక్ అవకాశాలపై మరింత దృష్టిపెట్టడం ద్వారా కంపెనీ చెప్పుకోదగ్గ పురోగతిని సాధించగలిగినట్లు తెలియజేశారు. తద్వారా గతేడాది ప్రధాన మైలురాళ్లను చేరుకున్నట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 3% క్షీణించి రూ. 993 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 2,962 కోట్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో రూ. 2,962 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 6 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 3,154 కోట్లు ఆర్జించింది. యూఎస్ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం ఆదాయం దాదాపు 6 శాతం పుంజుకుని 19,642 కోట్లను తాకింది. ఇక డాలర్ల రూపేణా నికర లాభం 5 శాతం క్షీణించి 41 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. ఆదాయం 6 శాతం పెరిగి 270 కోట్ల డాలర్లకు చేరింది. రికార్డ్: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం 17.6% పుంజుకుని రూ. 13,011 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6.7 శాతం బలపడి రూ. 75,379 కోట్లకు చేరింది. డాలర్ల రూపేణా నికర లాభం 13% పెరిగి 176 కోట్ల డాలర్లను తాకగా.. ఆదాయం 1,017.5 కోట్ల డాలర్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 6 డివిడెండును ప్రకటించింది. దీనికి జతగా.. ఆదాయం తొలిసారి 10 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడంతో మరో రూ. 10ను ప్రత్యేక మధ్యంతర డివిడెండుగా ప్రకటించింది. వెరసి వాటాదారులకు షేరుకి రూ. 16 చొప్పున చెల్లించనుంది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 26 డివిడెండ్ చెల్లించినట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. షేరు ఫ్లాట్: మార్కెట్లు ముగిశాక హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు విడుదల చేసింది. ఎన్ఎస్ఈలో షేరు 0.6% నీరసించి రూ. 957 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.975–950 మధ్య ఊగిసలాడింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ4లో ఆదాయం 2.5 శాతం పుంజుకుంది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ లభించాయి. విభిన్న విభాగాల నుంచి మొత్తం 19 భారీ డీల్స్‌ను కుదుర్చుకున్నాం. తద్వారా కొత్త ఏడాదిలోకి ఉత్సాహంగా అడుగుపెట్టాం. – సి.విజయ్‌కుమార్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ప్రెసిడెంట్, సీఈవో -
మార్కెట్లో మళ్లీ కరోనా భయాలు
ముంబై: స్టాక్ మార్కెట్‌ను కరోనా భయాలు మరోసారి వెంటాడాయి. ఒక్క రోజులోనే లక్షకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనలు రెకెత్తాయి. ఆర్థిక రాజధాని ముంబైలో లాక్డౌన్ విధింపు మార్కెట్ వర్గాలను కలవరపెట్టింది. కేసుల కట్టడికి మరిన్ని రాష్ట్రాలు లాక్డౌన్ వైపు చూస్తున్నాయనే వార్తలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. మరోవైపు మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ సూచీ మార్చిలో 55.4కు పడిపోయి ఏడు నెలల కనిష్టస్థాయికి దిగివచ్చింది. డాలర్ మారకంలో రూపాయి 18 పైసలు పతనమైంది. సూచీల గరిష్ట స్టాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశం ప్రారంభమైన నేపథ్యంలో అప్రమత్తత కొనసాగింది. ఈ ప్రతికూలాంశాలన్ని సోమవారం స్టాక్ మార్కెట్‌ను కుదిపేశాయి. ఫలితంగా సెన్సెక్స్ 871 పాయింట్లు నష్టపోయి 50 వేల దిగువన 49,159 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 230 పాయింట్లు పతనమైన 14,638 వద్ద నిలిచింది. మెటల్, ఐటీ రంగాల షేర్లు మినహా... తక్కిన రంగాల షేర్లన్ని నష్టాలను చవిచూశాయి. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో కేవలం ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.931.66 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.75 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ రంగాలకు చెందిన సూచీలు ఒకశాతానికి పైగా నష్టాన్ని చవిచూశాయి. ఇంట్రాడేలో 1449 పాయింట్లు క్రాష్... మూడురోజుల విరామం తర్వాత మార్కెట్ ప్రతికూలంగా మొదలైంది. సెన్సెక్స్ 50,020 వద్ద, నిఫ్టీ 14,837 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా భయాలు ఇన్వెస్టర్లను వెంటాడంతో మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాల సునామీ మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మేవాళ్లు తప్ప కొనేవాళ్లు లేకపోవడంతో ఒక దశలో సెన్సెక్స్ 1449 పాయింట్లు నష్టపోయి 48,581 స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ 408 పాయింట్లను కోల్పోయి 14,459 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మిడ్‌సెషన్‌లో ఈ కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించిన నేపథ్యంలో సూచీలు నష్టాలను కొంత పూడ్చుకోగలిగాయి. అయితే భారీ నష్టాల ముగింపు మాత్రం తప్పలేదు. ‘‘కోవిడ్ మహమ్మారి విజృంభణతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. భారత కంపెనీల షేర్ల వ్యాల్యుయేషన్లు అధిక స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నానే భావనతో విదేశీ ఇన్వెస్టర్లు కొంతకాలంగా దేశీయ ఈక్విటీ మార్కెట్ పట్ల బేరిష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. వేగంగా పెరుగుతున్న కోవిడ్–19 కేసులు ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. ద్రవ్య పాలసీపై ఆర్బీఐ నిర్ణయ ప్రభావం, కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలే రానున్న రోజుల్లో సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయి’’ అని బీఎన్బీ పారీబా రీసెర్చ్ హెడ్ లలితాబ్ శ్రీవాస్తవ తెలిపారు. ఎదురీదిన ఐటీ, మెటల్ షేర్లు... నష్టాల మార్కెట్లోనూ ఐటీ, మెటల్ రంగాల షేర్లు ఎదురీదాయి. డాలర్ మారకంలో రూపాయి 18 పైసలు బలహీనపడటం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఎన్ఎస్ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ రెండుశాతం లాభపడింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్‌లో సోమవారం లాభపడిన మొత్తం 5 షేర్లలో నాలుగు షేర్లు ఐటీ రంగానికి కావడం విశేషం. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటంతో మెటల్ షేర్లు లాభపడ్డాయి. రూ. 2.16 లక్షల కోట్లు ఆవిరి... మార్కెట్ ఒకటిన్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.2.16 లక్షల కోట్లను కోల్పోయాయి. ఇన్వెస్టర్లు సంపదగా పరిగణించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.205 లక్షల కోట్లకు పరిమితమైంది. ఉదయం సూచీల భారీ పతనం నేపథ్యంలో ఒక దశలో రూ.4 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. అయితే మిడ్‌సెషన్‌లో కొనుగోళ్ల మద్దతు లభించిన నేపథ్యంలో నష్టం పరిమితమైంది. మరిన్ని సంగతులు... ► మార్చి క్వార్టర్లో రికార్డు విక్రయాలు, ఉత్పత్తి జరగడంతో సెయిల్ కంపెనీ షేరు రూ.90 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. 7% లాభంతో రూ.89.65 వద్ద స్థిరపడింది. ► కృష్ణపట్నం పోర్టులో మిగిలిన 25% వాటాను దక్కించుకోవడంతో అదానీ పోర్ట్స్ షేరు 1% లాభంతో రూ.744 వద్ద ముగిసింది. ► మహారాష్ట్రలో లాక్డౌన్ విధింపులో భాగంగా సినిమా హాళ్లను మూసివేయడంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు 4–5% నష్టపోయాయి. ► డివిడెండ్‌కు ఆమోదంతో బ్రిటానియా 2% లాభంతో రూ.3,700 వద్ద నిలిచింది. -
అయిదోరోజూ ఆగని నష్టాలు
ముంబై: దేశవ్యాప్తంగా మలిదశ కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటం స్టాక్ మార్కెట్‌ను కలవరపరిచింది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నియంత్రణకు స్థానిక ప్రభుత్వాలు విధిస్తున్న లాక్డౌన్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. మరోవైపు కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ఈక్విటీ మార్కెట్లకు ఎలాంటి భరోసానివ్వలేకపోయింది. పైపెచ్చు ద్రవ్యపాలసీ ప్రకటన తర్వాత కూడా అక్కడి ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 1.72 శాతం పెరగడం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. ఈ ప్రతికూలాంశాలతో దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు అయిదో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 585 పాయింట్ల నష్టంతో 49,216 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 163 పాయింట్లను కోల్పోయి 14,558 వద్ద నిలిచింది. ఒక్క ఎఫ్ఎంసీజీ, మెటల్ షేర్లకు మాత్రమే స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. తక్కిన అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా ఐటీ, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్ రంగాల షేర్లలో అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,258 కోట్ల విలువైన షేర్లను కొనగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1117 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డాలర్ మారకంలో రూపాయి రెండు పైసలు స్వల్పంగా బలపడి 72.53 వద్ద స్థిరపడింది. 5 రోజుల్లో రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి... స్టాక్ మార్కెట్ వరుస పతనంతో భారీ సంపద హరించుకుపోయింది. సూచీల అయిదు రోజుల పతనంలో భాగంగా ఇన్వెస్టర్లు రూ.8 లక్షల కోట్లను కోల్పోయారు. గురువారం ఒక్కరోజే రూ.2.5 లక్షల కోట్లు సంపద ఆవిరిరైంది. ఫలితంగా బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల విలువ రూ.201 లక్షల కోట్లకు దిగివచ్చింది. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► ఎన్పీసీఐఎల్ ప్రాజెక్ట్‌కు చెందిన 10,800 కోట్ల విలువైన టెండర్‌ను దక్కించుకోవడంతో భెల్ షేరు 5 శాతం లాభంతో రూ.52 వద్ద ముగిసింది. ► ఐటీసీ వరుసగా నాలుగో రోజూ లాభపడింది. 4% లాభంతో రూ.219 వద్ద స్థిరపడింది. ► సుప్రీం కోర్టు రాజస్థాన్ డిస్కమ్ రివ్యూ పిటీషన్‌ను కొట్టివేయడంతో ఆదానీ పవర్ షేరు ఏడాది గరిష్టాన్ని తాకి రూ.89 వద్ద ముగిసింది. -
వెంటాడిన కరోనా భయం
ముంబై: భారత్‌లో రెండోదశ కరోనా కేసుల విజృంభణ స్టాక్ మార్కెట్‌ను కలవరపరిచింది. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.., కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేయడం ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ ఏడాదిలోనే అత్యధికంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 29 వేల మందికి వ్యాధి సోకడంతో లాక్డౌన్ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అంతర్జాతీయంగా మండుతున్న ముడిచమురు ధరల సెగలు కూడా మార్కెట్‌ను తాకాయి. అన్ని రంగాల షేర్లలో విస్తృత స్థాయి విక్రయాలు తలెత్తడంతో బుధవారం సెన్సెక్స్ 562 పాయింట్లను కోల్పోయి 50 వేల దిగువున 49,801 వద్ద ముగిసింది. నిఫ్టీ 189 పాయింట్లను నష్టపోయి 14,721 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ నష్టాల ముగింపు. ఈ నాలుగు ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 1,478 పాయింట్లు, నిఫ్టీ 454 పాయింట్లను కోల్పోయాయి. ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లలో తలెత్తిన అమ్మకాలు సూచీల భారీ పతనాన్ని శాసించాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో కేవలం నాలుగు షేర్లు, నిఫ్టీ–50 ఇండెక్స్‌లో కేవలం రెండు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మార్కెట్ పతనంతో బుధవారం ఒక్కరోజే రూ.3.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.203.67 లక్షల కోట్లకు దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2626 కోట్ల విలువైన షేర్లను కొనగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.562 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ నియంత్రణకు ఫెడ్ ఎలాంటి చర్యలు చేపట్టనుందోనని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ట్రేడ్ కదలాడాయి. ‘‘దేశవ్యాప్తంగా పడగ విప్పుతున్న కరోనా కేసులు మార్కెట్ వర్గాలను భయపెట్టాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ విధాన నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. సెన్సెక్స్ 73 పాయింట్లు పెరిగి 50,436 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 14,947 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. లక్ష్మీ ఆర్గానిక్ ఐపీవో భల్లేభల్లే స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ చేపట్టిన పబ్లిక్ ఇష్యూ సూపర్ సక్సెస్‌ను సాధించింది. ఇష్యూ చివరి రోజు బుధవారానికి ఏకంగా 106 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ దాదాపు 3.26 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 347 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. షేరుకి రూ. 129–130 ధరలో చేపట్టిన ఐపీవో ద్వారా లక్ష్మీ ఆర్గానిక్ రూ. 600 కోట్లు సమకూర్చుకుంది. క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్ ఓకే క్రాఫ్ట్స్ మ్యాన్ ఆటోమేషన్ చేపట్టిన పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు బుధవారానికి 3.81 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీ దాదాపు 38.7 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. 1.47 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. షేరుకి రూ. 1488–1490 ధరలో చేపట్టిన ఐపీవో ద్వారా రూ. 824 కోట్లు సమకూర్చుకుంది. ఐపీవోకు ఆదిత్య బిర్లా ఏఎంసీ... ఆదిత్య బిర్లా క్యాపిటల్.. తన అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఫండ్స్ సేవల సంస్థ) ఐపీవోకు వెళ్లేందుకు ఆమోదం తెలియజేసింది. -
లాభాల్లోంచి భారీ నష్టాల్లోకి..
ముంబై: స్టాక్ మార్కెట్ వారాంతపు రోజైన శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. భారీ లాభాలతో మొదలైనప్పటికీ.., మిడ్‌సెషన్ నుంచి మొదలైన అమ్మకాలు మార్కెట్‌ను ముంచేశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోవడంతో పాటు భారీ నష్టాల్ని చవిచూశాయి. ఇంట్రాడేలో 1284 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 487 పాయింట్లు పతనమై 50,792 వద్ద ముగిసింది. 382 పాయింట్ల రేంజ్లో ట్రేడైన నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 15,031 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక రంగాల షేర్లలో అత్యధికంగా నష్టాలను చవిచూశాయి. మార్కెట్ పతనంతో సూచీల మూడురోజుల ర్యాలీకి విరామం పడింది. ఇన్వెస్టర్లు రూ.1.37 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.943 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.164 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీశారు. ఈ వారంలో నాలుగురోజుల ట్రేడింగ్ జరగ్గా.., సెన్సెక్స్ 387 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్లను ఆర్జించాయి. ‘‘ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పొజిషన్లను తగ్గించుకోవడంతో పాటు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. బాండ్ ఈల్డ్స్ తిరిగి పుంజుకోవడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ముడిచమురు ధరల పెరుగుదలతో ఆయిల్, గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సాంకేతికంగా నిఫ్టీ 15300 స్థాయిని నిలుపుకోవడంలో విఫలం కావడంతో అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మన మార్కెట్లో స్వల్పకాలం పాటు అస్థిరత కొనసాగే అవకాశం ఉంది.’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ విభాగపు అధిపతి బినోద్ మోదీ తెలిపారు. 1284 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ ట్రేడింగ్..! అమెరికాలో 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి బైడెన్ ఆమోదం తెలపడంతో పాటు అక్కడి నిరుద్యోగిత తగ్గిందని గణాంకాలు వెలువడటంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. ఈ అంశం కలిసిరావడంతో ఒకరోజు సెలవు తర్వాత మన మార్కెట్ భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 382 పాయింట్ల లాభంతో 51,661 వద్ద, నిఫ్టీ 146 పాయింట్ల పెరిగి 15,321 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బ్యాంకింగ్, మెటల్ షేర్లు రాణించాయి. ఉదయం సెషన్లో సెన్సెక్స్ 541 పాయింట్లు పెరిగి 51,821 వద్ద, ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది. -
దశాబ్ద కనిష్టానికి గృహ రుణ రేట్లు
ముంబై: వ్యవస్థలో నిధుల లభ్యత (లిక్విడిటీ) పెరగడంతో గృహ రుణ రేట్లు దశాబ్ద కనిష్టానికి దిగొచ్చాయి. ఇలా రేట్లను తగ్గించిన వాటిల్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు సైతం ఉన్నాయి. గత వారం చివరికి బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.6.5 లక్షల కోట్ల నిధుల మిగులు ఉన్నట్టు కేర్ రేటింగ్స్ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఈ డిపాజిట్లు అన్నీ సేవిం గ్స్ ఖాతాల్లోనివే అనుకున్నా.. వాటిపై కనీసం 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ రేటును బ్యాంకులు చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో గృహ రుణాలపై రేట్లను స్వల్ప మార్జిన్‌తోనే ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2020–21లో గృహ రుణాల జారీలో వేగం తగ్గింది. 2020 జనవరిలో గృహ రుణాల మంజూరులో 17.5 శాతం ఉండగా.. 2021 జనవరిలో ఇది 7.7 శాతానికే పరిమితమైం ది. కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిన విషయం తెలిసిందే. రిస్క్‌కు దూరం..: నిధుల లభ్యత అధికంగా ఉన్నప్పటికీ బ్యాంకులు రిస్క్ తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోతున్నాయి. దీంతో కొంత వరకు భద్రత ఉండే గృహ రుణాల వైపు మొగ్గు చూపుతున్నాయి. వ్యక్తిగత రుణాలన్నవి అన్సెక్యూర్డ్వి. అదే గృహ రుణాల్లో ప్రాపర్టీ బ్యాంకు తనఖాలో ఉంటుంది. అందుకే ఎన్పీఏలు ఈ విభాగంలో 1% కంటే తక్కువే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతుండడంతో ఇళ్ల కొనుగోలు డిమాండ్ పెరుగుతుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. వినియోగదారులకూ గృ హ రుణాల విషయంలో ప్రస్తుతం పలు ప్రయోజనాలు ఉన్నాయి. గృహ రుణాలపై పన్ను రాయితీలు, అందుబాటులో ప్రాపర్టీ ధరలు, పలు చోట్ల స్టాంప్‌డ్యూటీ చార్జీల తగ్గింపు వంటివి ఆకర్షణీయమైనవే. క్రెడిట్ స్కోరే ప్రామాణికం.. ఇక అందరికీ ఒకటే రేటు అని కాకుండా.. మెరుగైన రుణ చరిత్ర ఉన్నవారికి బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీకే గృహ రుణాలను ఇస్తున్నాయి. ఎస్బీఐ 6.7 శాతం, కోటక్ బ్యాంకు 6.65 శాతం చొప్పున తాజా ఆఫర్లను తీసుకొచ్చాయి. కానీ, 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికే ఈ రేట్లు వర్తిస్తాయి. వాస్తవానికి గృహ రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో బ్యాంకుల మధ్య పోటీకి తెరతీసింది ఎస్బీఐనే. గృహ రుణ మార్కెట్లో 34 శాతం వాటా కలిగిన ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తూ 6.7%> మార్చి 1న ప్రకటించింది. దీంతో ఇతర అగ్రగామి బ్యాంకులూ ఇదే బాటలో నడవక తప్పలేదు. -
లాభాల జోరుకు బ్రేక్
ముంబై: స్టాక్ మార్కెట్ మూడురోజుల వరుస ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. ఆర్థిక, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్ 599 పాయింట్లను కోల్పోయి 51 వేల దిగువన 50,486 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 165 పాయింట్లను నష్టపోయి 15,081 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, డాలర్ మారకంలో రూపాయి పతనం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. మూడురోజుల పాటు సూచీలు భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో కొంత లాభాల స్వీకరణ కూడా చోటుచేసుకుంది. మీడియా, రియల్టీ షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు జరిగాయి. అత్యధికంగా మెటల్ షేర్లు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో 25 షేర్లు నష్టపోవడం గమనార్హం. సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ గురువారం నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్ఐఐలు రూ. 223 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. డీఐఐలు రూ.788 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ‘‘అగ్రరాజ్యం అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్స్ అనూహ్యంగా ఆరు బేసిస్ పాయింట్లు పుంజుకోవడంతో అక్కడి మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొనడంతో మన మార్కెట్ ఇదే తీరు ప్రతిబింబించింది. పెద్ద కంపెనీలకు చెందిన షేర్లలో అధికంగా అమ్మకాలు జరిగాయి. అయితే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో కొనుగోళ్లు జరగడం ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చే అంశంగా ఉంది’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. ఇంట్రాడేలో ట్రేడింగ్ సాగిందిలా... ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలతో అమెరికా బాండ్ ఈల్డ్స్ తిరిగి పెరగడం ప్రారంభించింది. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ అమ్మకాలు మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న మన మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 633 పాయింట్ల నష్టంతో 50,812 వద్ద, నిఫ్టీ 220 పాయింట్లను కోల్పోయి 15,027 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలతో మొగ్గుచూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 905 పాయింట్లను కోల్పోయి 50,540 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయి 14,980 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మరిన్ని విశేషాలు... ► అదానీ పోర్ట్స్ గంగవరం పోర్టులో 31.5 శాతం వాటాను దక్కించుకోవడంతో కంపెనీ షేరు మూడుశాతం లాభంతో రూ.752 వద్ద ముగిసింది. ► మూడో త్రైమాసికంలో ఎఫ్ఐఐలతో పాటు డీఐఐలూ ఐఆర్సీటీసీ చెందిన షేర్లను అధిక మొత్తంలో కొనుగోలు చేశారు. ఫలితంగా కంపెనీ షేరు నాలుగు శాతం ర్యాలీచేసి రూ.1,957 వద్ద స్థిరపడింది. ► అశోక హైవేస్‌లో సింహభాగం వాటాను దక్కించుకోవడంతో ఆశోకా బిల్డ్‌కాన్ షేరు నాలుగు శాతం పెరిగి రూ.115 వద్ద ముగిసింది. ► జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు మూడు శాతం పతనం కావడంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ రెండుశాతం నష్టపోయింది. -
‘క్రాష్’ మార్కెట్..!
ముంబై: స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు భారీ అమ్మకాలకు దారితీశాయి. ఫలితంగా సూచీలు సోమవారం రెండునెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్లను కోల్పోయి 50,000 దిగువన 49,744 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు సూచీకి మూడువారాల కనిష్టస్థాయి. నిఫ్టీ 306 పాయింట్లు నష్టపోయి 14,676 వద్ద నిలిచింది. అలాగే ఇరు సూచీలకిది వరుసగా ఐదోరోజు నష్టాల ముగింపు. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, దేశవ్యాప్తంగా తిరిగి పెరుగుతున్న కోవిడ్–19 కేసులు, బాండ్ ఈల్డ్స్ అనూహ్య ర్యాలీ తదితర అంశాలు మన మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులను సృష్టించాయి. అలాగే మండుతున్న ముడిచమురు ధరలు, ఇటీవల మార్కెట్ ర్యాలీ నేపథ్యంలో పెరిగిన ఈక్విటీల వ్యాల్యుయేషన్ల ఆందోళనలు కూడా ఇన్వెస్టర్లను కలవరపరిచాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒక్క మెటల్ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లలో విస్తృతంగా అమ్మకాలు జరిగాయి. ఎన్ఎస్ఈలో ప్రభుత్వ బ్యాంకులు, ఫార్మా, ఐటీ, మీడియా రంగాల సూచీలు మూడుశాతం పతనమయ్యాయి. ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌లు రెండుశాతం క్షీణించాయి. రూపాయి 16 పైసల ర్యాలీతో ఐటీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యతనివ్వడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ఒకదశలో సెన్సెక్స్ 1,273 పాయింట్లు నష్టపోయి 49,617 వద్ద దిగివచ్చింది. నిఫ్టీ 346 పాయింట్లను కోల్పోయి 14,635 స్థాయిని తాకింది. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఈ జనవరి 29 తర్వాత తొలిసారి దేశీయ మార్కెట్లో్ల విక్రయాలు జరిపారు. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) సోమవారం రూ.893 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. అలాగే దేశీ ఇన్వెస్టర్లు రూ.919 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు ఎక్సే్చంజ్ గణాంకాలు తెలిపాయి. ‘‘దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ విధింపుతో ఆర్థిక రికవరీపై ప్రభావం పడొచ్చన్న భయాలు మార్కెట్‌ను వెంటాడాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్బణ కారణాలతో ఇటీవల మార్కెట్ ర్యాలీకి దన్నుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఇప్పుడు నెమ్మదించాయి.’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. పడినప్పుడల్లా... కొనండి..! ఐదు రోజుల వరుస పతనంతో సెన్సెక్స్ 2410 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 639 పాయింట్లను నష్టపోయింది. మార్కెట్ భారీగా క్షీణిస్తున్న ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చని స్టాక్ నిపుణులు సలహానిస్తున్నారు. ప్రస్తుత పతనం స్వల్పకాలికమేనని, పడిపోయిన ప్రతిసారి కొనుగోలు చేయమని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు మెరుగుపడ్డాయని.. ఇండస్ట్రీయల్, సైక్లికల్స్ రంగాల షేర్లపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. నిమిషానికి రూ.1000 కోట్ల నష్టం..! మార్కెట్ భారీ పతనంతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ సమయంలో ప్రతి నిమిషానికి రూ. 1000 కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.3.08 లక్షల కోట్లు ఆవిరయ్యింది. వెరసి బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.200.18 లక్షల కోట్లకు దిగివచ్చింది. ట్రేడింగ్‌లో మరిన్ని విశేషాలు... ► సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి ► నష్టాల మార్కెట్లోనూ మెటల్ షేర్లు మెరిశాయి. ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలతో మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా మెటల్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ చేసింది. ► మార్కెట్లో అస్థిరతను సూచించే ఎన్ఎస్ఈ వీఐఎక్స్ ఇండెక్స్ 14 శాతం పెరిగి 25.47 వద్ద ముగిసింది. ► ఎన్సీఎల్టీ నుంచి తుది అనుమతులు వచ్చిన ఆరునెలల్లో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని కంపెనీ బిడ్డింగ్‌లో దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం సభ్యుడు మురారి లాలా జలాన్ తెలిపారు. ఫలితంగా ఈ కంపెనీ షేరు ఐదు శాతం లాభపడి రూ. 114.90 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ► ఫైడీస్ ఫుడ్ సిస్టమ్స్ విలీన ప్రక్రియను పూర్తి చేయడంతో జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేరు ఏడాది గరిష్టాన్ని తాకింది. ఆరు శాతం లాభంతో రూ.3128 వద్ద స్థిరపడింది. -
నాలుగోరోజూ బేర్ పంజా!
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలతో భారత స్టాక్ మార్కెట్‌పై బేర్ ట్రేడర్లు నెమ్మదిగా పట్టు సాధిస్తున్నారు. ముడిచమురు ధరల సెగలు, అధిక వ్యాల్యుయేషన్ ఆందోళనలను ఆసరా చేసుకొని ట్రేడర్లు నాలుగో రోజూ అమ్మకాలు జరిపారు. దీంతో నాలుగు రోజుల్లోనే సెన్సెక్స్ 1265 పాయింట్లు, నిఫ్టీ 333 పాయింట్లను కోల్పోయాయి. ఈ క్రమంలో నిఫ్టీ 15 వేల స్థాయిని, సెన్సెక్స్ 51 వేల స్థాయిని పోగొట్టుకున్నాయి. ఇక శుక్రవారం విషయానికొస్తే.., మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కోవిడ్–19 కేసులు మళ్లీ అధికమవుతుండటం వల్ల, ఆర్థిక రికవరీపై ప్రభావం పడొచ్చన్న భయాలను మార్కెట్‌ను వెంటాడాయి. దీనికి తోడు బలహీన అంతర్జాతీయ సంకేతాలు జతకలవడంతో అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 435 పాయింట్ల నష్టంతో 50,889 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 137 పాయింట్లు పతనమై 14,981 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఫలితంగా ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్ల కోల్పోయి 50,624 వద్ద, నిఫ్టీ 221 పాయింట్ల మేర నష్టపోయి 14,898 స్థాయిని ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకాయి. మార్కెట్ భారీ పతనంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.1.88 లక్షల కోట్లు తగ్గి రూ.204 లక్షల కోట్లకు చేరింది. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 182 పాయింట్లును కోల్పోయింది. ‘‘ దేశీయ మార్కెట్లో అనిశ్చితి పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాల కారణంగా కన్సాలిడేషన్ కొనసాగింది. ఆర్థిక రికవరీ వేగంగా జరుగుతున్న తరుణంలో భారత పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 5.76 శాతం నుంచి 6.13 శాతానికి ఎగసింది. ఒక శాతం కన్నా తక్కువగా ఉండే అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 1.29 శాతానికి పెరగింది. మరోవైపు కమోడిటీ ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ఆర్థిక గణంకాలు నిరుత్సాహపరిచాయి. ఈ ప్రతికూలాంశాలన్నీ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంట్ విశ్లేషకుడు రస్మిక్ ఓజా అభిప్రాయపడ్డారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రెండు శాతం నుంచి నాలు గు శాతం పతనం కావడంతో ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2% నష్టపోయింది. ► మునుపటి సెషన్లో ఎనిమిది శాతం లాభంతో టాప్ గెయినర్‌గా నిలిచిన ఓఎన్జీసీ షేరులో లా భాల స్వీకరణ చోటుచేసుకుంది. చివరికి ఐదు శాతం నష్టపోయి రూ.105 వద్ద స్థిరపడింది. ► పెట్రో కెమికల్ వ్యాపారాన్ని వేరు చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోందనే వార్తలతో రిలయన్స్ కంపెనీ షేరు ఒకశాతం లాభంతో రూ.2,080 వద్ద ముగిసింది. ► నష్టాల మార్కెట్లోనూ బీఎస్ఈలో అదానీ పోర్ట్స్, గెయిల్, హిందాల్కో, హెచ్‌పీసీఎల్, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, టాటా పవర్‌తో సహా 249 షేర్లు ఏడాది గరిష్టాన్ని అందుకున్నాయి. ► మార్కెట్లో అనిశ్చితి సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ 3.30 శాతం నుంచి 22.25 స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ... ప్రైవేటీకరణ ఆశలతో ఈ వారం ఆరంభం నుంచి బేరిష్ ట్రెండ్‌కి ఎదురీదుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు సైతం నష్టాలను చవిచూశాయి. ఈ రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మహారాష్ట్ర బ్యాంక్, ఐఓబీ, యూకో బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్లు 10 శాతం నుంచి ఐదు శాతం నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, పీఎన్బీ బ్యాంక్ షేర్లు ఐదుశాతం నుంచి మూడున్నర శాతం పతనమయ్యాయి. ఫలితంగా గడిచిన రెండు రోజుల్లో 12 శాతం ర్యాలీ చేసిన పీఎస్‌యూ ఇండెక్స్ శుక్రవారం ఒక్కరోజే ఐదు శాతం క్షీణించింది. -
బంగారం కొండ దిగుతోంది..!
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మరోసారి డీలా పడ్డాయి. అటు స్పాట్, ఇటు ఫ్యూచర్స్ మార్కెట్లో వరుసగా ఆరో రోజు క్షీణించాయి. ఈ బాటలో విదేశీ మార్కెట్లోనూ వెనకడుగులో కదులుతున్నాయి. న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో బంగారం(24 క్యారట్స్) 10 గ్రాములు తాజాగా రూ. 239 నష్టపోయి రూ. 45,568కు చేరింది. ఎంసీఎక్స్‌లోనూ రాత్రి 8 గంటల ప్రాంతంలో రూ. 98 నీరసించి రూ. 46,028 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 45,861 వరకూ క్షీణించింది. ఇది 8 నెలల కనిష్టంకావడం గమనార్హం! ఇక న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 0.2 శాతం తక్కువగా 1,772 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి ఏప్రిల్ ఫ్యూచర్స్కాగా.. స్పాట్ మార్కెట్లో 1,773 డాలర్ల వద్ద కదులుతోంది. ఇవి మూడు నెలల కనిష్టం! దశాబ్ద కాలంలోనే అత్యధిక రాబడి... కొత్త ఏడాది(2021)లో బంగారం ధరలు వెనకడుగు వేస్తున్నప్పటికీ గత కేలండర్ ఏడాది(2020)లో 25 శాతంపైగా జంప్‌చేశాయి. ప్రపంచదేశాలను వణికించిన కోవిడ్–19 నేపథ్యంలో గతేడాది పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడంతో లిక్విడిటీ పెరిగి పసిడిలోకి పెట్టుబడులు మళ్లినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో ఆర్థిక వ్యవస్థలు మాంద్యం బారినపడటం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెప్పారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితుల్లో బంగారాన్ని రక్షణాత్మక పెట్టుబడిగా భావించే సంగతి తెలిసిందే. దీంతో పసిడిలో పెట్టుబడులకు వివిధ దేశాల కేంద్ర బ్యాం కులతోపాటు.. ఈటీఎఫ్ సంస్థలు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం జోరుకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా 2020లో దశాబ్ద కాలంలోనే అత్యధికంగా రాబడి ఇచ్చినట్లు తెలిపారు. గరిష్టం నుంచి రూ. 10,000 పతనం గత ఆగస్ట్‌లో 10 గ్రాముల పసిడి ఎంసీఎక్స్‌లో రూ. 56,200ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. తదుపరి ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగింది. అయితే ఇటీవల అమ్మకాలు పెరగడంతో డీలా పడుతూ వచ్చింది. దీంతో 2021లో ఇప్పటివరకూ 8 శాతం లేదా రూ. 4,000 క్షీణించింది. వెరసి రికార్డ్ గరిష్టం నుంచి చూస్తే ఆరు నెలల్లో 18 శాతం(రూ. 10,000) కోల్పోయింది. ఇక విదేశీ మార్కెట్లోనూ ఆగస్ట్ 7న ఔన్స్ 2072 డాలర్లను అధిగమించింది. ఆర్థిక వ్యవస్థకు దన్నునిచ్చే బాటలో యూఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లకుపైగా ప్యాకేజీకి సన్నాహాలు చేస్తుండటం పసిడి ధరలపై ఒత్తిడిని పెంచుతున్నట్లు మిల్‌వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక సీఈవో నిష్ భట్ అభిప్రాయపడ్డారు. ఈల్డ్స్ పుంజుకుంటే పసిడిని హోల్డ్ చేసే వ్యయాలు పెరుగుతాయని, దీంతో ట్రేడర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. ఆర్థిక రికవరీ సంకేతాలు... ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం అంటే యూఎస్ ఆర్థిక రికవరీకి సంకేతంగా భావిస్తామని భట్ పేర్కొన్నారు. సాంకేతికంగా చూస్తే రూ. 46,000 ధర.. ఫిబోనకీ రీట్రేస్మెంట్ ప్రకారం 50 శాతానికి దగ్గరగా ఉన్నట్లు క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ నిపుణులు క్షితిజి పురోహిత్ పేర్కొన్నారు. రోజువారీ చార్టుల ప్రకారం చూస్తే 200 రోజుల చలన సగటు(డీఎంఏ) కంటే దిగువన కదులుతున్నట్లు వివరించారు. రూ. 46,000 స్థాయిలో పసిడిలో కొనుగోళ్లకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే వీలున్నట్లు అంచనా వేశారు. స్వల్పకాలిక ట్రెండ్ బలహీనంగా ఉన్నప్పటికీ రూ. 44,500 వద్ద పటిష్ట మద్దతు లభించగలదని అంచనా వేశారు. సహాయక ప్యాకేజీ కారణంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టవచ్చన్న అంచనాలు పెరిగినట్లు కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. అయితే ఇటీవల పసిడి క్షీణత నేపథ్యంలో మరింత పతనంకావచ్చన్న అంచనాలు సరికాదని అభిప్రాయపడింది. వెరసి ఫ్రెష్ షార్ట్‌సెల్లింగ్‌ను చేపట్టకపోవడం మేలని ట్రేడర్లకు సూచించింది. ఇవీ కారణాలు.. ► పసిడి వెనకడుగుకు పలు కారణాలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ధరలు బలహీనపడటంతో ఈల్డ్స్ పుంజుకుంటున్నాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతుండటం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలియజేశారు. ► యూఎస్ కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ భారీ ఉపశమన ప్యాకేజీకి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్న అంచనాలు పెరుగుతున్నాయి. జీడీపీ రికవరీ సాధిస్తే అధిక రిస్క్– అధిక రిటర్నుల సాధనాలకు పెట్టుబడులు మళ్లుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో బంగారంకంటే ఈక్విటీలు తదితరాలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలియజేశారు. ► ఇటీవల కోవిడ్–19 కట్టడికి గ్లోబల్ ఫార్మా కంపెనీలు పలు దేశాలలో వ్యాక్సిన్లను విడుదల చేయడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో పసిడిలో సెంటిమెంటు బలహీనపడిందని విశ్లేషకులు తెలియజేశారు. ► దేశీయంగా చూస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పసిడిపై కస్టమ్స్ డ్యూటీని 2.5% తగ్గించడం కూడా దీనికి జత కలసింది. వెరసి తాజాగా పసిడి ధరలు సాంకేతికంగా కీలకమైన రూ. 46,000 మార్క్ దిగువకు చేరినట్లు పేర్కొన్నారు. -
రెండోరోజూ తడబాటే..!
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ అస్థిరత కొనసాగింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు బుధవారం చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో 667 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ 20 పాయింట్లు పతనమై 51,309 వద్ద స్థిరపడింది. అలాగే ట్రేడింగ్ సమయంలో 15,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ సూచీ చివరికి మూడు పాయింట్ల స్వల్ప నష్టంతో 15,106 వద్ద నిలిచింది. బ్యాంకింగ్ షేర్లతో పాటు ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకు, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి. ‘‘సూచీలు గరిష్ట స్థాయిలకు చేరుకోవడాన్ని ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు అవకాశంగా మలుచుకున్నారు. అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ షేర్లలో విపరీతమైన అమ్మకాలు జరిగాయి. మరోవైపు ఆటో, రియల్టీ, కన్జూమర్ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లలో చెప్పుకొదగిన స్థాయిలో కొనుగోళ్లు నెలకొన్నాయి. ఫలితంగా సూచీలు ఇంట్రాడేలో భారీ ఒడిదుడుకులతో ట్రేడయ్యాయి. అమెరికా కంపెనీల క్వార్టర్ ఫలితాలు మెరుగ్గా ఉండటంతో అక్కడి మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మన మార్కెట్‌కు ఊరటనిచ్చే అంశంగా మారొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుడు వినోద్ నాయర్ తెలిపారు. కొనసాగిన ఒడిదుడుకులు... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 51,356 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 15,119 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించిన కంపెనీ షేర్లు రాణించడంతో ఉదయం సెషన్లో సెన్సెక్స్ 184 పాయింట్లు పెరిగి 51,513 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 15,168 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో సూచీల గరిష్టస్థాయిల వద్ద ఒక్కసారిగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, నెస్లే ఇండియా, ఎస్బీఐ షేర్లలో విక్రయాలు జరగడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫలితంగా సూచీలు ఉదయం ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి 667 పాయింట్లను నష్టపోయి 50,846 వద్దకు, నిఫ్టీ ఇండెక్స్ ఇంట్రాడే హై నుంచి 191 పాయింట్లు నష్టపోయి 14,977 స్థాయికి దిగివచ్చాయి. అయితే చివరి అరగంటలో ఆటో, రియల్టీ, కన్జూమర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
మెప్పించని ఆర్థిక సర్వే.. నష్టాల్లో మార్కెట్
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020–21 ఆర్థిక సర్వే ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 589 పాయింట్లు పతనమై 46,286 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 183 పాయింట్లను కోల్పోయి 13,635 వద్ద నిలిచింది. సూచీలకిది ఆరోరోజూ నష్టాల ముగింపు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం, బలహీన అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బ్యాంకింగ్, రియల్టీ రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా ఐటీ షేర్లు నష్టపోయాయి. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 1263 పాయింట్ల రేంజ్లో కదలాడింది. నిఫ్టీ సైతం 150 పాయింట్లు పరిధిలో ట్రేడైంది. దేశీయ ఫండ్లు(డీఐఐ)లు రెండోరోజూ రూ.2,443 కోట్ల షేర్లను కొని నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐలు రూ. 5933 కోట్ల భారీ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ‘‘ప్రభుత్వం ప్రకటించిన అంచనాల ప్రకారం భారత ఆర్థికవ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం క్షీణించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ కో?లుకునేందుకు దీర్ఘకాలం పడుతుందనే సంకేతాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. మరోవైపు ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ ఉధృతంగా ఉంది. ఈ పరిణామాలతో బడ్జెట్‌కు ముందు మార్కెట్లో భారీ ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది.’’ అని జియోజిత్ ఫైనాన్స్ ఫైనాన్సియల్ సర్వీస్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఆరు రోజుల్లో రూ.11.57 లక్షల కోట్లు ఆవిరి..! మార్కెట్ ఆరురోజుల పతనంతో ఇన్వెసర్లు రూ.11.57 లక్షల కోట్లను నష్టపోయారు. ఫలితంగా ఇన్వెసర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ గరిష్టస్థాయి రూ.197.46 లక్షల కోట్ల నుంచి రూ. 186.12 లక్షల కోట్లకు దిగివచ్చింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 2.01 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇదే ఆరురోజుల్లో సెన్సెక్స్ 3,506 పాయింట్లు, నిఫ్టీ 1,010 పాయింట్లను కోల్పోయాయి. నిరాశపరిచిన ఐఆర్ఎఫ్సీ ఐపీఓ లిస్టింగ్..! గడిచిన వారంలో ఐపీఓను పూర్తిచేసుకున్న ఐఆర్ఎఫ్సీ షేర్లు లిస్టింగ్‌లో నిరాశపరిచాయి. ఇష్యూ ధర రూ.26 తో పోలిస్తే బీఎస్ఈలో 3.84 శాతం(రూపాయి)నష్టంతో రూ.25 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనై 6.53 శాతం క్షీణించి రూ.24.30 కు చేరుకుంది. చివరికి 4.42 శాతం పతనమైన రూ.24.85 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.32,475 కోట్లుగా నమోదైంది. దాదాపు రూ.4,633 పరిమాణం కలిగిన ఈ ఐపీఓకు 3.49 రెట్ల అధిక సబ్స్క్రిప్షన్ లభించిన సంగతి తెలిసిందే. -
జీడీపీ 7.7% క్షీణత!
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) మైనస్ 7.7 శాతానికి క్షీణించొచ్చని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) అంచనా వేసింది. కీలకమైన తయారీ, సేవల రంగాలను కరోనా గట్టిగా దెబ్బతీసిన నేపథ్యంలో కేంద్రం ఈ అంచనాలకు రావడం గమనార్హం. సాగు, విద్యుత్తు, గ్యాస్ తదితర యుటిలిటీ రంగాల పనితీరును కాస్త ఊరటగా కేంద్రం భావిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2019–20)లో జీడీపీ 4.2 శాతం వృద్ధికి పరిమితమైన విషయం తెలిసిందే. ‘‘వాస్తవ జీడీపీ లేదా స్థిరమైన ధరల వద్ద (2011–12 నాటి) జీడీపీ అన్నది 2020–21లో రూ.134.40 లక్షల కోట్ల స్థాయిని చేరుకునే అవకాశం ఉంది. 2019–20 సంవత్సరానికి వేసిన తాత్కాలిక జీడీపీ అంచనా రూ.145.66 లక్షల కోట్లు. 2019–20లో వృద్ధి రేటు 4.2 శాతంగా ఉండగా, 2020–21లో వాస్తవ జీడీపీ మైనస్ 7.7 శాతంగా ఉంటుంది’’ అని ఎన్ఎస్వో తెలిపింది. స్థూల జోడించిన విలువ (జీవీఏ) అన్నది కనీస ధరల ప్రకారం 2019–20లో రూ.133 లక్షల కోట్లుగా ఉంటే, 2020–21లో రూ.123.39 లక్షల కోట్లకు క్షీణిస్తుందని (7.2 శాతం క్షీణత).. ఎన్ఎస్వో తెలిపింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థలు భారత జీడీపీ విషయంలో వేసిన అంచనాలతో పోలిస్తే ఎన్ఎస్వో అంచనాలు కాస్త మెరుగ్గానే ఉండడం గమనార్హం. ఎన్ఎస్వో అంచనాలు ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం జీవీఏ 9.4 శాతం మేర క్షీణించొచ్చు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఫ్లాట్‌గా (0.03 శాతమే వృద్ధి) ఉంది. ► మైనింగ్, క్వారీయింగ్, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవల్లో ఎక్కువ క్షీణత ఉంటుంది. మైనింగ్, క్వారీయింగ్ జీవీఏ మైనస్ 12.4 శాతం, ఇతర రంగాల జీవీఏ మైనస్ 21.4 శాతం వరకు క్షీణించొచ్చు. ► అదే విధంగా నిర్మాణ రంగం కూడా మైనస్ 12.6 శాతానికి, ప్రజా పరిపాలన, రక్షణ, ఇతర సేవలు మైనస్ 3.7 శాతానికి, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నైపుణ్య సేవల్లో క్షీణత 0.8 శాతంగా ఉంటుంది. ► వ్యవసాయరంగం, ఫారెస్ట్రీ, మత్స్య రంగాల్లో వృద్ధి 3.4 శాతం నమోదు చేయవచ్చు. 2019–20లో ఇవే రంగాల్లో వృద్ధి 4 శాతంగా ఉంది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల్లో 2.7 శాతం మేర వృద్ధి నమోదవుతుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 4.1 శాతంగా ఉంది. ► ప్రస్తుత ధరల ప్రకారం జాతీయ తలసరి నికర ఆదాయం రూ.1,26,968గా ఉంది. 2019–20లో ఉన్న రూ.1,34,226తో పోలిస్తే 5.4 శాతం తక్కువ. స్థిరమైన వీ–షేప్ రికవరీని సూచిస్తున్నాయి ఎన్ఎస్వో విడుదల చేసిన ఆర్థిక వృద్ధి అంచనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పునరుజ్జీవాన్ని సంతరించుకుంటున్నట్టు, లాక్డౌన్ల తర్వాత స్థిరమైన వీ–షేప్ రికవరీ (ఏ తీరులో పడిపోయిందో.. అదే తీరులో తిరిగి కోలుకోవడం)ని సూచిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. -
కొత్త ఏడాదిలో తొలి నష్టం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో భారత స్టాక్ మార్కెట్ కొత్త ఏడాదిలో తొలిసారి నష్టాలతో ముగిసింది. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరుతో పాటు ఐటీ, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీల పదిరోజుల రికార్డు ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ డిసెంబర్లో 52.3గా నమోదై మూడునెలల కనిష్టానికి చేరుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ట్రేడింగ్ ఆద్యంతం స్థిరంగా అమ్మకాలు జరగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఫలితంగా సెన్సెక్స్ 264 పాయింట్లను కోల్పోయి 48,174 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 14,164 వద్ద నిలిచింది. మార్కెట్ పతనంలోనూ మెటల్, ప్రైవేట్ రంగ బ్యాంక్, రియల్టీ, మీడియా షేర్లు రాణించాయి. మెరుగైన ఆర్థిక గణాంకాల నమోదుతో వ్యవస్థలో చురుగ్గా కార్యకలాపాలు జరగవచ్చనే అంచనాలతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. క్యూ3లో కొన్ని ప్రైవేట్ బ్యాంకుల రుణ వృద్ధి గణనీయంగా పెరిగిందని గణాంకాలు వెలువడంతో ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్ మారకంలో రూపాయి 6 పైసలు బలపడటం కాస్త కలిసొచ్చే అంశంగా ఉంది. మరోవైపు పలు దేశాల ఈక్విటీ సూచీలు గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం జరిగింది. ఫలితంగా ఆసియాలో జపాన్‌తో సహా ప్రధాన దేశాల మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా పతనంలో ప్రారంభమై క్రమంగా నష్టాలను పూడ్చుకున్నాయి. టీసీఎస్ షేర్ల బైబ్యాక్.. టాటా దరఖాస్తు రూ. 9,997 కోట్లు టీసీఎస్ షేర్ల బైబ్యాక్ ప్రక్రియలో ఆ కంపెనీ ప్రమోటర్ టాటా సన్స్ భారీ స్థాయిలో దరఖాస్తు చేసింది. టీసీఎస్ కంపెనీ రూ.16,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ (తిరిగి కొనుగోలు) చేయనున్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా మొత్తం 5.33 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.3,000 ధరకు టీసీఎస్ కొనుగోలు చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా టీసీఎస్‌లో ఏకైక అత్యధిక వాటా గల టాటా సన్స్ కంపెనీ 3.33 కోట్ల షేర్లకు టెండర్ వేసింది. వీటి విలువ రూ.9,997 కోట్లని అంచనా. గత నెల 18న మొదలైన ఈ షేర్ల బైబ్యాక్ ఈ నెల 1న ముగసింది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి టీసీఎస్ నగదు నిల్వలు రూ.58,500 కోట్లు. టీసీఎస్ 2017, 2018ల్లో రూ.16,000 కోట్ల మేర షేర్లను బైబ్యాక్ చేసింది. -
రికార్డుల ర్యాలీకి బ్రేక్..!
ముంబై: మార్కెట్లో వరుస రికార్డుల ర్యాలీకి గురువారం విరామం పడింది. బ్యాంకింగ్, ఐటీ, ఆర్థిక, ఆటో రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీల ఏడురోజుల సుదీర్ఘ ర్యాలీ ఆగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, డాలర్ మారకంలో నీరసించి రూపాయి విలువ వంటి అంశాలు ట్రేడింగ్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 144 పాయింట్లు నష్టపోయి 45,960 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 51 పాయింట్లను కోల్పోయి 13,478 వద్ద నిలిచింది. మార్కెట్ పతనంలోనూ ఎఫ్ఎంసీజీ షేర్లు ఎదురీదాయి. మెటల్, రియల్టీ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 418 పాయింట్ల వరకు నష్టపోయి 45,686 స్థాయి వద్ద, నిఫ్టీ 130 పాయింట్లను కోల్పోయి 13,399 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ఇటీవల జరిగిన బుల్ ర్యాలీలో భారీగా లాభపడిన బ్యాంకింగ్, చిన్న, మధ్య తరహా షేర్లలో స్వల్ప లాభాల స్వీకరణ జరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ గరిష్టస్థాయిల వద్దే సూచీలు ట్రేడ్ అవుతున్న తరుణంలో జాతీయంగా లేదా అంతర్జాతీయంగా ఏదైనా ప్రతికూల సంఘటన జరిగితే లాభాల స్వీకరణ కొనసాగే అవకాశం ఉందని వారంటున్నారు. వరుసగా రెండురోజులు లాభపడిన రూపాయి గురువారం 9 పైసలు నష్టపోయి 73.66 వద్ద స్థిరపడింది. సిమెంట్ షేర్లకు సీఐఐ షాక్... కాంపిటీటివ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పలు సిమెంట్ కంపెనీలపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో గురువారం ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంబుజా సిమెంట్స్ 2 శాతం నష్టంతో రూ.248 వద్ద, ఏసీసీ 1.50 శాతంతో 1,632 వద్ద ముగిశాయి. ఆగని ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం... దేశీ ఈక్విటీల్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. నగదు విభాగంలో గురువారం రూ.2260 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఈ నెల 15 నుంచి మిసెస్ బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ బ్రెడ్డు, బిస్కెట్లు తయారు చేసే మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాల్టీస్ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 15 నుంచి ప్రారంభం కానున్నది. రూ. 10 ముఖ విలువ గల ఈక్విటీ షేర్‌కు ధరల శ్రేణి (ప్రైస్‌బాండ్)ని రూ.286–288గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 17న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450–500 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. కనీసం 50 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 28న ఈ షేర్లు లిస్టవుతాయి. ఐపీఓలో రూ. 40.54 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. -
రెండో రోజూ అమ్మకాలే..!
ముంబై: ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెరుగుతున్న కరోనా కేసుల భయం భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఫలితంగా బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్ఫ్రా రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 173 పాయింట్లు నష్టపోయి 39,750 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 11,700 దిగువున 11,671 వద్ద నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి క్షీణత కొనసాగడం, బ్లూచిప్ కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్ మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ గడువు ముగియడంతో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడంతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. రూపాయి పతనంతో ఒక్క ఐటీ షేర్లు స్వల్పంగా లాభాలను ఆర్జించగలిగాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,524 – 40,011 రేంజ్ కదలాడింది. నిఫ్టీ 11,606 – 11,744.15 పరిధిలో ఊగిసలాడింది. దేశీయ స్టాక్ మార్కెట్ దృష్టి ఇప్పుడు కంపెనీల క్యూ2 ఫలితాల నుంచి అంతర్జాతీయ పరిణామాల వైపు మళ్లింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తిరిగి పెరగడం, అమెరికా ఎన్నికలపై, ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనపై సందిగ్ధత కొనసాగడం లాంటి ప్రతికూలాంశాలు ఇప్పుడిప్పుడే రికవరి అవుతున్న ఆర్థిక వ్యవస్థలో ఆందోళనలను రేకెత్తించాయి. ఈక్విటీల్లో నెలకొన్న బలహీనత స్వల్పకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీల ప్రకటనలతో పాటు వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో మార్కెట్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. బలహీనంగా ప్రపంచమార్కెట్లు... అమెరికా అనిశ్చితులతో పాటు రోజు వారీగా కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రపంచమార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. కోవిడ్–19 కేసుల కట్టడికి యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో పాటు పలు దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలు విధించారు. లాక్డౌన్ విధింపుతో ఆర్థిక వృద్ధి ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లను కలవరపెట్టాయి. ఫలితంగా గురువారం ఆసియాలో ఒక్క చైనా తప్ప మిగిలిన అన్ని దేశాల ఇండెక్స్‌లు 0.5% నుంచి 1% నష్టంతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు అరశాతం క్షీణించాయి. 5% నష్టపోయిన ఎల్ అండ్ టీ షేరు ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) షేరు గురువారం 5 శాతం పతనమైంది. క్యూ2 ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకదశలో 6 శాతం క్షీణించి రూ.927 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 5% పతనంతో రూ.935 వద్ద స్థిరపడింది. -
మార్కెట్ జోరుకు రిలయన్స్ అడ్డుకట్ట
ముంబై: అధిక వెయిటేజీ గల రిలయన్స్ షేరు పతనంతో పాటు మెటల్, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీ నష్టాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 540 పాయింట్లను కోల్పోయి 40,146 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 162 పాయింట్లను నష్టపోయి 11,768 వద్ద ముగిసింది. అమెరికా, ఐరోపాల్లో భారీగా నమోదైన కరోనా కేసులు ఇన్వెస్టర్లను భయపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల పతనం ఆందోళనలను కలిగించాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసల క్షీణత ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ట్రేడింగ్ ఆద్యంతం మార్కెట్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ఏ ఒక్క రంగానికి కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఇంట్రాడేలో సెనెక్స్ 734 పాయింట్లను నష్టపోయి 39,948 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 218 పాయింట్లను కోల్పోయి 11,712 స్థాయికి దిగివచ్చింది. ఎఫ్ఐఐలు రూ.119.40 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.976.16 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4 శాతం నష్టంతో రూ.2029 వద్ద స్థిరపడింది. సోమవారం సెన్సెక్స్ 540 పాయింట్ల పతనంలోని ఒక్క రిలయన్స్ షేరువి ఏకంగా 111 పాయింట్లు కావడం విశేషం. నిఫ్టీ మెటల్, ఆటో ఇండెక్స్ 3.50శాతం నష్టపోయాయి. ఆసియాలో హాంగ్‌కాంగ్, తైవాన్ మినహా మిగిలిన అన్ని మార్కెట్లు అరశాతం నుంచి 1శాతం నష్టంతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు 3 నుంచి 1 శాతం పతనమయ్యాయి. అమెరికా సూచీలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి... మార్కెట్ భారీ నష్టంతో రూ.1.92 లక్షల కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.160.57 లక్షల కోట్ల నుంచి రూ.158.66 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘పాజిటివ్ క్యూ2 ఫలితాలతో మార్కెట్ ర్యాలీ చేసింది. ఇప్పుడు దిద్దుబాటుకు లోనైంది. స్వల్పకాలంలో మార్కెట్లో బలహీనత కొనసాగవచ్చు. కంపెనీల ద్వితియా క్వార్టర్ ఫలితాలు, అమెరికా పరిణామాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయి’ జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. -
‘బేర్’ బాజా !
ఆర్థిక రికవరీపై అనుమా నాలు, ఆందోళనతో ప్రపంచమార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం భారీగా పతనమైంది. సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,850 పాయింట్ల దిగువకు పడిపోయాయి. రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ భయాలతో కలవరపడుతున్న ఇన్వెస్టర్లు ఎడాపెడా అమ్మకాలకు దిగారు. మరోవైపు వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వకపోవడంతో సెంటిమెంట్ దెబ్బతిన్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు క్షీణించి దాదాపు నెల కనిష్ట స్థాయి, 73.89కు పడిపోవడం, సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ చివరి రోజు కావడంతో అమ్మకాలు జోరుగా సాగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,115 పాయింట్లు పతనమై 36,554 పాయింట్ల వద్ద, నిఫ్టీ 326 పాయింట్లు నష్టపోయి 10,806 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 3 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్‌కు ఇది ఈ ఏడాది మూడో అతి పెద్ద పతనం. 7 నెలల్లో తొలిసారి... స్టాక్ సూచీలు వరుసగా ఆరో రోజూ క్షీణబాటలోనే సాగాయి. ఈ ఆరు రోజుల్లో సెన్సెక్స్ 2,749 పాయింట్లు, నిఫ్టీ 799 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఈ రెండు సూచీల నష్టాలు ఇన్నేసి రోజులు కొనసాగడం గత 7 నెలల్లో ఇదే తొలిసారి. ఆరంభం నుంచి నష్టాలే... బుధవారం అమెరికా స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ ప్రభావంతో గురువారం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే మొదలయ్యాయి. మన మార్కెట్ కూడా క్షీణబాటలోనే మొదలైంది. సెన్సెక్స్ 386 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్ల నష్టాలతో ఆరంభమయ్యాయి. రోజు గడుస్తున్న కొద్దీ ఈ నష్టాలు పెరిగాయే కానీ, తగ్గలేదు. చివర్లో అమ్మకాల సునామీ కారణంగా నష్టాలు మరింతగా ఎగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,172 పాయింట్లు, నిఫ్టీ 342 పాయింట్ల మేర నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్లో, యూరప్ మార్కెట్లు 1 శాతం రేంజ్లో క్షీణించాయి. ► సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హిందుస్తాన్ యూనిలివర్ షేర్ మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టపోయాయి. ► గత ఐదు నెలలుగా పుంజుకుంటూ వస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు బాగా నష్టపోయాయి. ► మార్కెట్ భారీ పతనంలోనూ 100కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. రూట్ మొబైల్, మాజెస్కో, అపోలో హాస్పిటల్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 380కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. పతనానికి ప్రధాన కారణాలు ► అగాధంలోకి అమెరికా ఎకానమీ: డిమాండ్ బలహీనంగా ఉండటం, ఉద్యోగ కల్పన కొరవడడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ అగాధంలోకి కూరుకుపోయిందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైస్ చైర్మన్ రిచర్డ్ క్లారిడ తాజాగా వ్యాఖ్యానించారు. ఆర్థికవ్యవస్థ రికవరీని అతిగా అంచనా వేశారని, మార్కెట్లు ఊహించిన స్థాయిలో రికవరీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► పెరుగుతున్న కరోనా కేసులు: దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ప్రబలి దాదాపు పది నెలలు కావస్తున్నా, కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయే కానీ, తగ్గడం లేదు. ► మళ్లీ లాక్డౌన్ భయాలు: యూరప్ దేశాల్లో రెండో దఫా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల కట్టడికి మళ్లీ లాక్డౌన్ విధించాలని పలు దేశాలు యోచిస్తున్నాయి. లాక్డౌన్ విధిస్తే, ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ కుంటుపడి రికవరీ మరింత ఆలస్యమవుతుందనే భయాలు నెలకొన్నాయి. ► ప్రపంచ మార్కెట్ల పతనం: కరోనా కేసులు పెరుగుతుండటం, మళ్లీ లాక్డౌన్ భయాలు మొదలవ్వడం, రికవరీకి ఊతమిచ్చేలా వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించకపోవడంతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయి. ► హెవీ వెయిట్స్‌లో అమ్మకాలు: సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► 32 పైసలు పతనమైన రూపాయి: రూపాయి మళ్లీ పతనబాట పట్టింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు క్షీణించి 73.89కు చేరింది. ఇది దాదాపు నెల కనిష్ట స్థాయి. ► ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ: సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు చివరి రోజు కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. 6 రోజులు... రూ.11 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రూ. 3.95 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.95 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.148.76 లక్షల కోట్లకు పడిపోయింది. గత 6 రోజుల నష్టాల కారణంగా మొత్తం రూ.11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. మరింత తీవ్రంగా ఒడిదుడుకులు.! ప్రస్తుతం నిఫ్టీ 200 రోజులు సింపుల్ మూవింగ్ యావరేజ్(ఎస్ఎమ్ఏ–10,839 పాయింట్లు), దిగువకు పతనమైంది. 200 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్(ఈఎమ్ఏ–10,761 పాయింట్లు)కు చేరువయింది. దీంతో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు మరింత తీవ్రంగా ఉంటాయని, ట్రేడర్లు, ఇన్వెస్టర్లు జాగరూకతతో వ్యవహరించాలనేది విశ్లేషకుల సూచన. ఆర్థిక రికవరీపై అధిక అంచనాలు నెలకొన్నాయని, షేర్ల విలువలు అధికంగా ఉన్నాయని, దీంతో మార్కెట్లో కరెక్షన్ తప్పనిసరి అని వారంటున్నారు. ప్రపంచ మార్కెట్ల గమనాన్ని బట్టే మన మార్కెట్ కదలికలు ఉంటాయని నిపుణులంటున్నారు. సెన్సెక్స్ టాప్10 పతనాలు తేదీ నష్టం(పాయింట్లు) మార్చి9, 2020 1,942 ఆగస్టు 24,2015 1,625 ఫిబ్రవరి 28, 2020 1,448 జనవరి 21, 2008 1,408 సెప్టెంబర్ 24,2020 1,115 అక్టోబర్ 24,2008 1,071 ఫిబ్రవరి1, 2020 988 మార్చి 17,2008 951 మర్చి 3, 2008 901 మార్చి6,2020 894 -
బంగారం.. క్రూడ్ బేర్..!
ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి ఈక్విటీ మార్కెట్లపైనే కాకుండా కమోడిటీలపైనా ప్రభావం చూపింది. గత కొద్ది నెలలుగా లాభాల బాటన పయనిస్తున్న పసిడి ధర, న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్‌కు (31.1గ్రా) సోమవారం భారీగా పతనమైంది. ఈ వార్త రాసే 10.30 గంటల సమయంలో 50 డాలర్లకుపైగా (3 శాతం) నష్టంతో 1908 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతక్రితం ఒక దశలో కీలక మద్దతుస్థాయి 1900 డాలర్ల దిగువకుసైతం పడిపోయి, 1,886 డాలర్లను కూడా తాకింది. కరోనా తీవ్రత నేపథ్యంలో పసిడి ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత ఏ రోజుకారోజు పసిడి పురోగతి బాటనే పయనిస్తూ, వారంరోజుల్లోనే ఆల్‌టైమ్ గరిష్టం 2,089 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు తర్వాత లాభాల స్వీకరణతో క్రమంగా రెండు వందల డాలర్ల వరకూ తగ్గింది. అయితే దీర్ఘకాలంలో పసిడిది బులిష్ ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. మరోవైపు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పసిడి 10 గ్రాముల ధర సోమవారం ఈ వార్త రాసే సమయానికి రూ.1,400 నష్టంలో రూ. 50,324 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, మంగళవారం భారత్ స్పాట్ మార్కెట్లలో ధర భారీగా తగ్గే వీలుంది. క్రూడ్ కూడా...: మరోవైపు నైమెక్స్‌లో లైట్ స్వీట్ ధర కూడా బేరల్‌కు 2 శాతం నష్టంతో 39 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ ధర కూడా దాదాపు ఇదే స్థాయి నష్టంతో 41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
కెవ్వు క్రాష్!
యూరప్‌లో రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్డౌన్లు విధిస్తారనే భయాలు చెలరేగాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు బ్యాంకుల్లో 2 లక్షల కోట్ల డాలర్ల మేర అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయన్న వార్తలతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా భారీగానే నష్టపోయింది. సెన్సెక్స్ 38 వేల పాయింట్ల ఎగువన నిలదొక్కుకోగలిగినా, నిఫ్టీ 11,300 పాయింట్ల దిగువకు పడిపోయింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 812 పాయింట్ల నష్టంతో 38,034 పాయింట్ల వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు పతనమై 11,251 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 2 శాతం మేర క్షీణించాయి. 1,052 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ బలహీనంగానే మొదలైంది. మధ్య మధ్యలో లాభాల్లోకి వచ్చినా, ఎక్కువ భాగం నష్టాల్లోనే ట్రేడైంది. యూరప్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఆరంభం కావడంతో మధ్యాహ్నం తర్వాత అమ్మకాల జోరు పెరిగింది. చివరి గంటలో నష్టాలు బాగా పెరిగాయి. ఒక దశలో 145 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, మరోదశలో 907 పాయింట్ల మేర పతనమైంది. మొత్తం మీద రోజంతా 1,052 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు– కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 9 శాతం నష్టంతో రూ.560 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే కావడం గమనార్హం. ► మార్కెట్ భారీగా నష్టపోయినా దాదాపు 140 షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, వీఎస్టీ టిల్లర్స్, మైండ్ ట్రీ, లారస్ ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఎందుకీ పతనం.. బ్యాంకుల్లో భారీగా అక్రమ లావాదేవీలు...! ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంక్‌లు 2 లక్షల కోట్ల డాలర్ల మేర అక్రమ లావాదేవీలకు పాల్పడ్డాయని ఇంటర్నేషనల్ కన్సార్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్(ఐసీఐజే) వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు పుట్టాయి. ఇక భారత్ విషయానికొస్తే, 2010–17 మధ్య ఇలాంటి అక్రమ లావాదేవీలు 400కు పైగా జరిగాయని వీటి విలువ వంద కోట్ల డాలర్ల మేర ఉంటుందని అమెరికాకు చెందిన ఫిన్సెన్(ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్) పేర్కొంది. మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదం, డ్రగ్స్, ఆర్థిక అవకతవకలు తదితర అక్రమ లావాదేవీలు జరిగాయని పేర్కొంది. ఈ లావాదేవీల కారణంగా దేశంలోకి 48 కోట్ల డాలర్లు అక్రమంగా వచ్చాయని, 40 కోట్ల డాలర్లు వెళ్లాయని ఫిన్సెన్ పేర్కొంది. దాదాపు భారత్‌లోని అన్ని బ్యాంకులకు ఈ లావాదేవీల్లో ప్రమేయం ఉందన్న వార్తల కారణంగా బ్యాంక్ షేర్లు బాగా నష్టపోయాయి. యూరప్‌లో మళ్లీ లాక్డౌన్! రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో డెన్మార్క్, గ్రీస్, స్పెయిన్ దేశాల్లో తాజాగా ఆంక్షలు విధించారు. మరోవైపు రోజుకు 6,000 మేర కరోనా కేసులు నమోదవుతుండటంతో (మన దేశంలో రోజుకు లక్ష కరోనా కేసులు వస్తున్నాయి) దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వచ్చాయి. దీంతో బెంబేలెత్తిన యూరప్ ఇన్వెస్టర్లు బ్యాంక్, టూరిజమ్, వినియోగ రంగ షేర్లను తెగనమ్మారు. ఆసియా మార్కెట్లు 1 శాతం రేంజ్లో నష్టపోయాయి. ఆరంభంలోనే 3 శాతం మేర క్షీణించిన యూరప్ మార్కెట్లు చివరకు 4 శాతం నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల పతనం... అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు ఆవిరి కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. అమెరికా తదుపరి సుప్రీంకోర్ట్ జడ్జి ఎవరనే విషయంలో డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్య పోరు తప్పదనే భయాలతో ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నివురుగప్పిన నిప్పులా సరిహద్దు ఉద్రిక్తతలు... సరిహద్దు ఉద్రిక్తతల నివారణ నిమిత్తం తాజాగా భారత్–చైనాల మధ్య చర్చలు ప్రారంభమైనా, సరిహద్దుల్లో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయని, ఈ పరిస్థితి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోందని నిపుణులు అంటున్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ ఈ గురువారమే ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటం, నిఫ్టీ కీలకమైన 11,500 పాయింట్ల రేంజ్లో ఉండటంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. రూ. 4.23 లక్షల కోట్ల సంపద ఆవిరి... స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.4.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,23,140 కోట్లు దిగజారి రూ.154.76 లక్షల కోట్లకు పడిపోయింది. విలువలు అధికంగా ఉన్నాయ్.. షేర్ల విలువలు అసమంజసమైన స్థాయిల్లో ఉన్నాయని, ఈ విలువలను షేర్లు నిలుపుకోలేవన్న ఆందోళన నెలకొన్నదని జియోజిత్ ఫైనాన్షి యల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. కొంత కాలం పాటు మార్కెట్ అనిశ్చితిగానే ఉంటుందని, ఒడిదుడుకులు కొనసాగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ముందస్తు పన్ను వసూళ్లు 25.5 శాతం డౌన్!
ముంబై: ముందస్తు పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 25.5 శాతం క్షీణించాయి. కార్పొరేట్ పన్ను వసూళ్లు భారీగా పడిపోవడం దీనికి కారణమని ఆదాయపు పన్ను శాఖ అధికారి ఒకరు గురువారం తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం– 2020–21 రెండవ త్రైమాసికకాలంలో రూ.1,59,057 కోట్ల ముందస్తు పన్ను వసూళ్లు జరిగాయి. 2019–20 ఇదే కాలంలో వసూళ్ల మొత్తం రూ. 2,12,889 కోట్లు. ఇక్కడ కొంతలో కొంత ఊరట కలిగించే అంశం ఏమిటంటే, 2020–21 తొలి త్రైమాసికం కన్నా రెండవ త్రైమాసికంలో క్షీణ రేటు కొంత తగ్గడమే. తొలి త్రైమాసికంలో ముందస్తు పన్ను వసూళ్లు భారీగా 76 శాతం పడిపోయి కేవలం రూ.11,714 కోట్లుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రేరిత పరిస్థితులతో దేశం మొత్తం లాక్డౌన్లో ఉండడం ఈ పేలవ వసూళ్ల నేపథ్యం.ముందస్తు పన్ను చెల్లింపులకు సెప్టెంబర్ 15 చివరితేదీ. తాజా సమాచారంలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ♦ కార్పొరేట్ చెల్లింపులు 27.3 శాతం తగ్గి రూ.1,29,620 కోట్లగా నమోదయ్యాయి. జూన్ త్రైమాసికంలో ఈ విభాగంలో వసూళ్లు 79 శాతం పడిపోయి, రూ.8,286 కోట్లుగా నమోదయ్యాయి. ♦ వ్యక్తిగత ఆదాయపు పన్ను విభాగం విషయంలో 15 శాతం తగ్గి రూ.29,438 కోట్లుగా నమోదయ్యాయి. క్యూ1లో ఈ వసూళ్లు 64 శాతం తగ్గి, రూ. 3,428 కోట్లకు పడిపోయాయి. ముందస్తు పన్నులంటే... ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమకు వచ్చే ఆదాయాలను మదింపుచేసుకుని, నాలుగు దఫాలుగా ముందస్తు పన్ను చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. మొత్తం చెల్లించాల్సిన పన్ను అంచనాల్లో 15 శాతం మొదటి త్రైమాసికంలో చెల్లించాల్సి ఉంటుంది. 25 శాతం చొప్పున తదుపరి రెండు త్రైమాసికాల్లో చెల్లింపులు జరపాలి. నాల్గవ త్రైమాసికంలో ఈ చెల్లింపులు 35 శాతంగా ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొత్తం స్థూల పన్ను వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.24.23 లక్షల కోట్లు. 2019–20 వసూళ్ల కన్నా (రూ.21.63 లక్షల కోట్లు) ఇది 12 శాతం ఎక్కువ. ఇందులో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని 28 శాతం పెంపుతో రూ.10.28 లక్షల కోట్ల నుంచి రూ.13.19 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. పన్ను వివాద పరిష్కార పథకం ‘వివాద్ సే విశ్వాస్’కు మంచి స్పందన వస్తుందని ప్రభుత్వం భావించడమే దీనికి కారణం. ఈ పథకం కింద సెప్టెంబర్ 8 నాటికి 35,074 ప్రత్యక్ష పన్ను సంబంధ వివాదాలు పరిష్కారం అయినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కమిషనర్ ఆఫ్ అప్పీల్స్, ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీకోర్టుసహా దేశ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల అపరిష్కృత ప్రత్యక్ష పన్ను వివాదాలు ఉండడం గమనార్హం. కార్ల మీద జీఎస్టీ తక్కువే ♦ కంపెనీలే రాయల్టీలు తగ్గించుకోవాలి ♦ ఆర్థిక శాఖ వర్గాలు వాహనాలపై జీఎస్టీ రేటు భారీగా ఉంటోందన్న విమర్శలపై ఆర్థిక శాఖ వర్గాలు స్పందించాయి. జీఎస్టీ అమలుకు ముందు రోజులతో పోలిస్తే ప్రస్తుతం రేటు తక్కువగానే ఉందని వ్యాఖ్యానించాయి. జీఎస్టీ రేటు తగ్గించాలంటూ ప్రభుత్వాన్ని అడగడం కాకుండా వాహనాల కంపెనీలు విదేశాల్లోని తమ మాతృ సంస్థలకు రాయల్టీ చెల్లింపులను తగ్గించుకోవాలని సూచించాయి. అప్పట్లో వ్యాట్, ఎక్సైజ్ సుంకం రేటు మొదలైనవి అనేకం ఉండేవని ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ రేట్లు తక్కువేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్స్‌పై అధిక స్థాయిలోనే పన్నులు ఉంటున్నాయని తెలిపాయి. యూరోపియన్ యూనియన్‌లో వాహనాలపై వ్యాట్/జీఎస్టీ 20 శాతం – 25 శాతం మధ్యలో ఉంటోందని వివరించాయి. -
పడేసిన ఫెడ్ !
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అదనపు తాయిలాలను ప్రకటించకపోవడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించి 73.66కు చేరడం, రిలయన్స్, టీసీఎస్ వంటి ఇండెక్స్ షేర్లలో అమ్మకాలు జరగడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పడి 38,980 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 11,516 పాయింట్ల వద్ద ముగిశాయి. మరో మూడేళ్లు సున్నా స్థాయిలోనే.... కీలకమైన వడ్డీరేట్లు మరో మూడేళ్లపాటు సున్నా స్థాయిలోనే కొనసాగుతాయని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చింది. అదనపు ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వకపోవడం, పైగా భవిష్యత్తు ఆర్థిక స్థితిగతుల అంచనాలపై తీవ్రమైన అనిశ్చితి నెలకొందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. ఈ ప్రతికూల వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. ఆసియా మార్కెట్లు 1 శాతం మేర నష్టపోగా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. రోజంతా నష్టాలే.... ఆసియా మార్కెట్ల పతన ప్రభావంతో మన మార్కెట్ కూడా నష్టాల్లోనే మొదలైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. చివరి గంటలో అమ్మకాలు మరింత జోరుగా పెరిగాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, మార్కెట్ అనిశ్చితిగానే ఉంటుందని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ► బజాజ్ ఫిన్సర్వ్ షేర్ 2 శాతం నష్టంతో రూ.6,006 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్ఆర్ఎఫ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మార్కెట్ నష్టపోయినా, 288 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రామ్‌కో సిస్టమ్స్, గంధిమతి అప్లయెన్సెస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.817ను తాకిన ఈ షేర్ చివరకు 2.3 శాతం లాభంతో రూ.808 వద్ద ముగిసింది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 13 శాతం లాభపడింది. ► డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.4,845ను తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.4,826 వద్ద ముగిసింది. ఒక్క రోజులో రూ.లక్ష కోట్లు ఆవిరి నష్టాల కారణంగా ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.1,03,248 కోట్ల మేర తగ్గిపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ గురువారం ముగింపు నాటికి రూ.159,04,785 కోట్లుగా ఉంది. ‘‘మార్కెట్లు బుధవారం గడించిన లాభాలన్నింటినీ కోల్పోయాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా రోజులో కనిష్టాల వద్ద ముగిశాయి. ఆర్థిక రికవరీ విషయమై యూఎస్ ఫెడ్ ఆందోళన వ్యక్తం చేయడం మన మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యేందుకు దారి చూపింది. బెంచ్ మార్క్ సూచీలు రోజులో పలు విడతలు రికవరీకి ప్రయత్నించినప్పటికీ ఎగువ స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా కనిష్టానికి చేరాయి’’ అని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఆర్థిక రికవరీపై అనిశ్చితిని యూఎస్ ఫెడ్ వ్యక్తీకరించడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపించినట్టు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా సైతం తెలిపారు. -
మార్కెట్‌పై బేర్ ఎటాక్!
ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావంతో మన మార్కెట్ కూడా శుక్రవారం భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు బాగా క్షీణించడం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింత ముదురుతుండటం, కరోనా కేసులు పెరుగుతుండటం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు పుంజుకొని 73.14కు చేరినా మన మార్కెట్ పతనం ఆగలేదు. సెన్సెక్స్ 634 పాయింట్లు పతనమై 38,357 పాయింట్ల వద్ద, నిఫ్టీ 194 పాయింట్లు క్షీణించి 11,334 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే సెన్సెక్స్ 1.63 శాతం, నిఫ్టీ 1.68 శాతం చొప్పున నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. ఇక వారం పరంగా చూస్తే సెన్సెక్స్ 1,110 పాయింట్లు, నిఫ్టీ 314 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలు.. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. సెన్సెక్స్ 666 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రోజంతా ఈ నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 741 పాయింట్లు, నిఫ్టీ 224 పాయింట్లమేర నష్టపోయాయి. లోహ, విద్యుత్తు, టెలికం, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. మరిన్ని విశేషాలు.. ► సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఒక్క మారతీ సుజుకీ షేర్ మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టపోయాయి. ► యాక్సిస్ బ్యాంక్ 4 శాతం నష్టంతో రూ.455 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనా, దాదాపు వందకు పైగాషేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. వొడాఫోన్ ఐడియా,అదానీ గ్యాస్, గ్రాన్యూల్స్ ఇండియా, వీఎస్టి టిల్లర్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఆస్ట్రాజెనెకా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► అమెరికాలో టెక్నాలజీ షేర్ల పతనం కారణంగా మన దగ్గర కూడా ఐటీ షేర్లు నష్టపోయాయి. ► త్వరలో వాహన తుక్కు విధానాన్ని (స్క్రాపేజ్ పాలసీ) ప్రభుత్వం ప్రకటించనున్నదన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి. ► ఫ్యూచర్ గ్రూప్ షేర్లు వరుసగా నాలుగో రోజూ లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఈ షేర్లతో పాటు మరో 200కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ గ్రీన్, మ్యాక్స్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.2.23 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.2.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.23 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.154.63 లక్షల కోట్లకు తగ్గింది. అప్రమత్తంగా ఉండండి..: నిపుణులు కరోనా కేసుల జోరు, ప్రపంచ మార్కెట్ల పతనం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, మన మార్కెట్ వేల్యూయేషన్లు అధికంగా ఉండటం.. ఇవన్నీ కీలకమైన రిస్క్ అంశాలని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పతనానికి ప్రధాన కారణాలు అమెరికా స్టాక్ సూచీల పతనం: గత రెండు నెలల్లో భారీగా ఎగసిన టెక్నాలజీ షేర్లలో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో అమెరికా స్టాక్ సూచీలు 3–5 శాతం రేంజ్లో నష్టపోయాయి. ఈ ప్రభావంతో శుక్రవారం ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా నష్టపోవడం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. బ్యాంక్ షేర్ల పతనం..: మారటోరియం రుణాలపై వడ్డీ వసూలు విషయమై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. హెవీ వెయిట్స్‌కు నష్టాలు..: సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లలో జోరుగా అమ్మకాలు జరిగాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు..: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. -
మళ్లీ ‘డ్రాగన్’ షాక్!
స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. దీంతో ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి చైనా బలగాలు మళ్లీ తూర్పు లద్దాఖ్‌లో చొరబడటంతో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింతగా ముదురుతాయనే భయాలు దీనికి ప్రధాన కారణం. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,400 పాయింట్లు దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ట్రేడింగ్ ఆరంభంలోనే కీలకమైన స్థాయిలకు ఎగియడంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, క్యూ1 జీడీపీ గణాంకాలు ఎలా ఉండనున్నాయో అనే అనిశ్చితి, నేటి(మంగళవారం) నుంచి కొత్త ‘మార్జిన్’ నిబంధనలు అమల్లోకి రానుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు పతనం కావడం....ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 839 పాయింట్ల నష్టంతో 38,628 పాయింట్ల వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు క్షీణించి 11,388 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.13 శాతం, నిఫ్టీ 2.23 శాతం చొప్పున నష్టపోయాయి. గత మూడు నెలల కాలంలో ఈ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 1,614 పాయింట్లు పతనమైంది. ఇక జపాన్ సూచీ లాభపడగా, మిగిలిన ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెబీ కొత్త ‘మార్జిన్’ నిబంధనలు... స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రూపొందించిన మార్జిన్ నిబంధనలు నేటి(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు కఠినంగా ఉన్నాయని, మార్పులు, చేర్పులు చేస్తే మంచిదని, ఈ నిబంధనల అమలుకు సాంకేతికంగా సిద్ధంగా లేమని, ఒకవేళ మార్పులు చేయకపోయినా, వీటి అమలును ఈ నెల 30కు వాయిదా వేయాలని పలు బ్రోకరేజ్ సంస్థలు విన్నవించాయి. ఈ విన్నపాన్ని సెబీ మన్నించలేదు. ఈ నేపథ్యంలో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో జోరుగా లాభాల స్వీకరణ జరిగింది. మరిన్ని మార్కెట్ విశేషాలు... ► సన్‌ఫార్మా షేర్ 7 శాతం నష్టంతో రూ.518 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ► ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ డీల్ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ షేర్లన్నీ అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్ 20 శాతం లాభంతో రూ.163కు చేరింది. ► స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనా, వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ► రూ.4.55 లక్షల కోట్ల సంపద ఆవిరి ► స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రూ.4.55 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,55,915 కోట్లు హరించుకుపోయి రూ.153.76 లక్షల కోట్లకు పడిపోయింది. -
ఇది యాంత్రిక రికవరీయే..!
న్యూఢిల్లీ: ఆర్థిక రంగం కోలుకోవడం అన్నది యాంత్రికంగా చోటు చేసుకుంటున్నదే కానీ.. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ఆగిపోయిన ఆర్థిక కార్యకలాపాలు పూర్వపు స్థితికి చేరుకుంటున్నాయని ప్రభుత్వం భావించడం సరికాదంటున్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి భారత్ వృద్ధి అవకాశాలు చూడ్డానికి బలహీనంగానే ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆర్థిక వ్యవస్థపై తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. కరోనా వైరస్ రావడానికి పూర్వమే మన దేశ వృద్ధి రేటు 2017–18లో ఉన్న 7 శాతం నుంచి 2019–20లో 4.2 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. ‘‘మీరు పేర్కొంటున్న ఆర్థిక రికవరీ సంకేతాలను లాక్ డౌన్ నాటి క్షీణించిన పరిస్థితుల నుంచి యాంత్రికంగా జరిగే రికవరీగానే మేము చూస్తున్నాము. దీన్ని మన్నికైన రికవరీగా చూడడం పొరపాటే అవుతుంది. కరోనా మహమ్మారి ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య పెరగడమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కనుక స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి వృద్ధి అవకాశాలు బలహీనంగానే ఉండనున్నాయి. మహమ్మారి సమసిపోయిన తర్వాత (దీన్ని త్వరలోనే చూస్తామన్నది నా ఆశాభావం) ఈ సమస్యలు మరింత పెద్దవి కానున్నాయి. ద్రవ్యలోటు భారీగా పెరిగిపోనుంది. రుణ భారం కూడా భారీగానే ఉంటుంది. ఆర్థిక రంగం దారుణ పరిస్థితులను చూస్తుంది. ఈ సవాళ్లను ఏ విధంగా పరిష్కరించుకుంటామన్న దానిపైనే మధ్యకాల వృద్ధి అవకాశాలు ఆధారపడి ఉంటాయి’’ అంటూ సుబ్బారావు వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆశావహం.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నడుమ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా కోలుకోవడాన్ని సానుకూల సంకేతంగా దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించడం మంచి చర్యగా పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు కనీస భద్రతా రక్షణలు ఉండడాన్ని తక్కువ మంది గుర్తించిన మరో సానుకూల అంశంగా చెప్పారు. 4 కోట్ల మంది పట్టణ కార్మికులు కరోనా లాక్ డౌన్ల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారని, అయినప్పటికీ అక్కడ భారీ కేసులు ఏమీ లేకపోవడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఖర్చే వృద్ధి చోదకం ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తగినంత నిధులను ఖర్చు చేయడం లేదన్న విమర్శలకు సుబ్బారావు స్పందిస్తూ.. రుణాలు తీసుకుని ఖర్చు చేయడం ప్రభుత్వానికి పెద్ద కష్టమైన విషయం కాదన్నారు. ‘‘ప్రభుత్వం చేసే వ్యయమే స్వల్పకాలంలో వృద్ధిని నడిపించగలదు. వద్ధికి ఆధారమైన ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు అన్నీ కూడా మందగించి ఉన్నాయి. ఆర్థిక వృద్ధి క్షీణతను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు మరింత ఖర్చు చేయకపోతే మొండి బకాయిలు సహా పలు సమస్యలు ఆర్థిక వ్యవస్థను చుట్టుముడతాయి’’ అని సుబ్బారావు చెప్పారు. అయితే, కేంద్రం రుణాలకు పరిమితి మాత్రం ఉండాలన్నారు. -
బంగారం కొండ దిగుతోంది..!
న్యూఢిల్లీ: నిన్నమొన్నటిదాకా సరికొత్త శిఖరాలతో వెలుగులు విరజిమ్మిన బంగారం... ఇప్పుడు కొండ దిగుతోంది!! ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు తొలిసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్న వార్తలతో పుత్తడి ఒక్కసారిగా నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశంలో పసిడి ధర పతనం అవుతోంది. దేశీయ స్పాట్ ప్రధాన మార్కెట్– న్యూఢిల్లీలో శుక్రవారం (ఆగస్టు 7వ తేదీ) 10 గ్రాములు స్వచ్చత ధర రికార్డు స్థాయిలో రూ.57,008 చూస్తే, బుధవారం నాటికి రూ.52,946కు దిగివచ్చింది. అంటే కేవలం మూడు రోజుల్లో రూ.4,062 తగ్గిందన్నమాట. మూడు రోజులుగా పసిడి ప్రతిరోజూ ఇక్కడ రూ.1,200కుపైగా తగ్గుతూ వచ్చింది. ఇక వెండి ధర కూడా భారీగా పతనం అవుతుండడం గమనార్హం. 7వ తేదీన ఇక్కడి స్పాట్ మార్కెట్లో రికార్డు స్థాయిలో రూ.77,840కి చేరిన కేజీ వెండి ధర బుధవారానికి రూ.67,584కు చేరింది. మూడు రోజుల్లో వెండి రూ.10,256కు తగ్గింది. దేశ వ్యాప్తంగా పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలో కూడా పసిడి, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. 7వ తేదీ వరకూ వరుసగా 16 రోజులు ఏరోజుకారోజు దేశీయంగా పసిడి ధరలు పెరుగుతూ వచ్చిన విషయం గమనార్హం. ఇక ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 9.30 గంటలు) దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి 10 గ్రాముల ధర రూ.52,292 వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ శుక్రవారం రికార్డు స్థాయిలో ధర రూ.55,850 చేరిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఈక్విటీ మార్కెట్ పెరుగుదల ధోరణి నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ (ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో) దాదాపు స్థిరంగా ఉంది. బుధవారం ధర 74.83 వద్ద ఉంది. రూపాయికి ఇప్పటివరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). పరుగుకు రష్యా ‘వ్యాక్సిన్’ బ్రేకులు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభణ, కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో బంగారం అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) గత శుక్రవారం (7వ తేదీ) ఒక దశలో చరిత్రాత్మక రికార్డుస్థాయి 2,078 డాలర్లకు చేరింది. తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత కేవలం 10 రోజుల్లోనే పసిడి ఈ స్థాయికి చేరడం గమనార్హం. అయితే ఈ స్థాయి వద్ద భారీ లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు దిగారు. దీనితో శుక్రవారం (7వ తేదీ) ట్రేడింగ్ చివర గంటల నుంచీ పసిడి పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది. దీనికితోడు కరోనా వ్యాక్సిన్ విడుదల చేసినట్లు స్వయంగా దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం పసిడి ధరకు మరింత ప్రతికూలం అయ్యాయి. బుధవారం ఈ వార్త రాసే 9.30 గంటల సమయానికి చరిత్రాత్మక గరిష్ట స్థాయిల నుంచి (2,078 డాలర్ల) చూస్తే, ధర 128 డాలర్లు పతనమై, 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 202 డాలర్లు పడిపోయి ఏకంగా 1,876 డాలర్లు చూడ్డం గమనార్హం. అయితే ఈ స్థాయిని చూసిన కేవలం కొద్ది గంటల్లోనే ధర కీలక నిరోధ స్థాయి (1,911 డాలర్లు)ని మళ్లీ దాటి, మంగళవారం ముగింపుకన్నా 12 డాలర్ల లాభంతో 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బంగారం డిమాండ్ 70% డౌన్
ముంబై: భారత్ పసిడి డిమాండ్ ఏప్రిల్–జూన్ మధ్య 70 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక పేర్కొంది. కోవిడ్–19 నేపథ్యంలో మార్చి 25 నుంచి విధించిన లాక్డౌన్ ప్రభావం, అధిక ధరల వంటి అంశాలు డిమాండ్ భారీ పతనానికి కారణమని వివరించింది. ‘క్యూ2 పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో విడుదలైన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2019 రెండవ త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో పసిడి డిమాండ్ 213.2 టన్నులు. ఈ పరిమాణం 2020 ఇదే నెలల మధ్య 63.7 టన్నులకు పరిమితమైంది. ► ఇక డిమాండ్ విలువ విషయానికి వస్తే, 57 శాతం పతనమై రూ.62,420 కోట్ల నుంచి రూ.26,600 కోట్లకు క్షీణించింది. ► ఆభరణాల డిమాండ్ పరిమాణంలో 74 శాతం తగ్గి 168.6 టన్నుల నుంచి 44 టన్నులకు పడింది. విలువలో చూస్తే, 63 శాతం పడిపోయి, రూ.49,380 కోట్ల నుంచి రూ. 18,350 కోట్లకు చేరింది. పెళ్లిళ్లు జరక్కపోవడం, భవిష్యత్తుపై అనిశ్చితి వాతావరణం వంటి అంశాలు దీనికి కారణం. ► ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, పరిమాణం డిమాండ్ 56 శాతం క్షీణించి 44.5 టన్నుల నుంచి 19.8 టన్నులకు జారింది. విలువల్లో 37 శాతం క్షీణించి 13,040 కోట్ల నుంచి రూ.8,250 కోట్లకు చేరింది. ► పసిడి రీసైకిల్డ్ పరిమాణం కూడా 64 శాతం క్షీణతతో 37.9 టన్నుల నుంచి 13.8 టన్నులకు దిగివచ్చింది. నేషనల్ లాక్‌డౌన్‌తో రిఫైనరీలు మూతపడ్డం దీనికి ప్రధాన కారణం. ► పసిడి దిగుమతులు భారీగా 95 శాతం క్షీణించి 247.4 టన్నుల నుంచి కేవలం 11.6 టన్నులకు పరిమితం. ► కాగా 2020 మొదటి ఆరునెలల్లో భారత్ పసిడి డిమాండ్ 56 శాతం పతనమై 165.6 టన్నులకు క్షీణించింది. పెట్టుబడులు అదుర్స్... పసిడి అంతర్జాతీయంగా డిమాండ్ సైతం ఏప్రిల్–జూన్ మధ్య 11 శాతం పడిపోయింది. 2019 ఇదే కాలంలో పోల్చి చూస్తే డిమాండ్ 1,136.9 టన్నుల నుంచి 1,015.7 టన్నులకు క్షీణించినట్లు డబ్ల్యూజీసీ తాజా నివేదిక పేర్కొంది. అయితే పెట్టుబడులకు సంబంధించి డిమాండ్ మాత్రం భారీగా పెరగడం గమనార్హం. జీవితకాల గరిష్ట స్థాయిల్లో ధర... మరోవైపు పసిడి ధరలు అంతర్జాతీయంగా జీవితకాల గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వారం మొదట్లో సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ఔన్స్ (31.1 గ్రా) ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన తర్వాత తిరిగి అంతకన్న కిందకు దిగిరాలేదు. అటు తర్వాత రెండు రోజుల్లో 1,974.7 డాలర్లకు చేరి సరికొత్త రికార్డును సృష్టించిన ధర గురువారం 1,936–1,965 డాలర్ల శ్రేణిలో ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే, అంతర్జాతీయ దూకుడు ధోరణికితోడు రూపాయి బలహీన ధోరణి (ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గురువారం డాలర్ మారకంలో ముగింపు 74.84) పసిడికి వరంగా మారుతోంది. స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.53,000– రూ.54,000 మధ్య తిరుగుతుండగా, ఆభర ణాల బంగారం రూ.50,000పైనే ట్రేడవుతోంది. -
ఐటీ జోష్..!
కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, మన మార్కెట్ గురువారం ముందుకే దూసుకుపోయింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాలు అంచనాలను మించడం సానుకూల ప్రభావం చూపించింది. దీంతో ఐటీ షేర్లు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. కొన్ని ఆర్థిక రంగ, ఫార్మా షేర్లు పుంజుకోవడం కలసివచ్చింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. సెన్సెక్స్ 420 పాయింట్ల లాభంతో 36,472 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 10,740 పాయింట్ల వద్ద ముగిశాయి. ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు పుంజుకొని 75.18 వద్దకు చేరింది. చివరి గంటలో కొనుగోళ్లు: ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్న మన మార్కెట్ మాత్రం మంచి లాభాలతోనే మొదలైంది. అయితే అరగంటలోనే ఈ లాభాలన్నింటినీ కోల్పోయింది. చివరి గంట వరకూ హెచ్చుతగ్గుల్లో కదలాడింది. చివరి గంటలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. స్టాక్ సూచీలు మంచి లాభాలతో ముగిశాయి. ఒక దశలో 14 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 473 పాయింట్ల మేర లాభపడింది. వరుసగా నాలుగు రోజుల నుంచి పతనమవుతూ వస్తున్న ఆర్థిక రంగ షేర్లు ఒకింత కోలుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం.. ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళనతో చైనా షాంఘై సూచీ 4.5 శాతం మేర పతనమైంది. హాంగ్‌కాంగ్, జపాన్, దక్షిణ కొరియా సూచీలు 2 శాతం మేర నష్టపోయాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, హాంగ్‌కాంగ్ విషయమై అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు ముదరడం, ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో చైనా జీడీపీ అంచనాల కంటే తక్కువగానే నమోదు కావడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. నష్టాల్లో ఆరంభమైన యూరప్ సూచీలు చివరకు 1 శాతం మేర నష్టపోయాయి. ► ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో ఇన్ఫోసిస్ షేర్ 10 శాతం లాభంతో రూ.911 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 14 శాతం లాభంతో ఆల్‌టైమ్ హై, రూ.952 ను తాకింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.33,853 కోట్లు ఎగసి రూ.3,87,966 కోట్లకు పెరిగింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 420 పాయింట్ల లాభంలో ఈ షేర్ వాటా సగానికి పైగా (277 పాయింట్లు) ఉండడం విశేషం. ► జూన్ క్వార్టర్లో నికర లాభం 17 శాతం పెరగడంతో లార్సెన్ అండ్ టుబ్రో ఇన్ఫోటెక్ కంపెనీ షేర్ 4 శాతం లాభంతో రూ.2,291 వద్ద ముగిసింది. ► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ పెరిగినా 350 షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. టాటా కన్సూమర్, అర్వింద్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కన్సూమర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
మార్కెట్లకు ‘ఔషధం’!
కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగపడే ఔషధాలకు ఆమోదం లభించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి ఆర్థిక రంగ షేర్ల జోరు జత కావడంతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన సూచీలు ముందుకే దూసుకుపోయాయి. సరిహద్దు ఉద్రిక్తతల నివారణ నిమిత్తం భారత్, చైనాల మధ్య సంప్రదింపులు ప్రారంభం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు పుంజుకొని 76.03కు చేరడం.. సానుకూల ప్రభావం చూపించాయి. 3 రోజుల లాభాలతో సెన్సెక్స్, నిఫ్టీలు 3 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. అయితే చివర్లో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో ఆరంభ లాభాలు తగ్గాయి. ఇంట్రాడేలో 482 పాయింట్ల మేర ఎగసిన సెన్సెక్స్ చివరకు 180 పాయింట్ల లాభంతో 34,911 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 67 పాయింట్లు ఎగసి 10,311 పాయింట్లకు చేరింది. ఐటీ సూచీకే నష్టాలు...: ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 35,000 పాయింట్లపైకి ఎగబాకగా, నిఫ్టీ 10,400 పాయింట్ల సమీపంలోకి వచ్చింది. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. హెచ్ 1–బీ వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికా నిషేధం విధించే అవకాశాలున్నాయన్న ఆందోళనతో ఐటీ షేర్లు నష్టపోయాయి. ► బజాజ్ ఆటో 7 శాతం లాభంతో రూ.2,860 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి ఇతర బజాజ్ గ్రూప్ షేర్లు 5 శాతం మేర పెరిగాయి. ► కరోనా వైరస్ చికిత్స కోసం యాంటీ వైరల్ డ్రగ్, ఫావిపిరవిర్‌ను ఫాబిఫ్లూ పేరుతో అందుబాటులోకి తేవడంతో గ్లెన్‌మార్క్ ఫార్మా షేర్ 27 శాతం లాభంతో రూ.520 వద్ద ముగిసింది. ఈ షేర్ ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో ఈ షేర్ 40 శాతం లాభంతో రూ.573ను తాకింది. ► కరోనా చికిత్సలో ఉపయోగపడే రెమిడెసివిర్ తయారీకి ఆమోదం లభించడంతో సిప్లా షేర్ 3% లాభంతో రూ.656 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.696ని తాకింది. ► దాదాపు 140 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. బేయర్ క్రాప్ సైన్స్, డిక్సన్ టెక్నాలజీస్, రుచి సోయా, ఆర్తి డ్రగ్స్, అలెంబిక్ ఫార్మా, అదానీ గ్రీన్ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మోర్గాన్ స్టాన్లీ వాటా కొనుగోళ్ల వార్తలతో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 20 శాతం లాభంతో రూ.242 వద్ద ముగిసింది. ► స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావాలన్న ప్రతిపాదనకు అదానీ పవర్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. షేరు కనీస కొనుగోలు ధర రూ.33.82 కాగా, ఈ ప్రతిపాదన విలువ రూ.3,264 కోట్లు. రిలయన్స్ మార్కెట్ క్యాప్ @ 15,000 కోట్ల డాలర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు కొనసాగుతోంది. ఆరంభంలోనే 3 శాతం మేర ఎగసి జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,804ను తాకింది. చివరకు 0.7 శాతం నష్టంతో రూ.1,747 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.11,81,429 కోట్లకు(15,000 కోట్ల డాలర్లకు మించి) పెరిగింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్‌ను సాధించిన తొలి భారత కంపెనీ ఇదే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీల జాబితాలో రిలయన్స్ 57వ స్థానంలో నిలిచింది. వచ్చే నెల 15న వర్చువల్ ఏజీఎమ్(వార్షిక సాధారణ సమావేశం)ను నిర్వహిస్తామని రిలయన్స్ వెల్లడించింది. -
ఎగుమతులు.. మూడోనెలా రివర్స్
న్యూఢిల్లీ: ఎగుమతులు క్షీణబాట వీడలేదు. వరుసగా మూడవనెల మేలో మైనస్ 36.47 శాతం క్షీణించాయి (2019 మే నెల ఎగుమతుల విలువతో పోల్చి). 19.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే ఇక్కడ ఏప్రిల్‌తో (–60.28 శాతం) పోల్చితే క్షీణ రేటు మెరుగుపడ్డమే ఊరటనిచ్చే అంశం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను ఆవిష్కరించింది. కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► పెట్రోలియం ఉత్పత్తులు (–68.46 శాతం) జౌళి (–66.19 శాతం), ఇంజనీరింగ్ (–24.25 శాతం), రత్నాలు–ఆభరణాల (–68.83 శాతం), తోలు (–75 శాతం) ఎగుమతులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. ► మేలో దిగుమతులు మైనస్ 51% క్షీణతను నమోదుచేసుకుని, 22.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► దీనితో ఎగుమతి–దిగుమతిల మధ్య నికర వ్యత్యాసం... వాణిజ్యలోటు 3.15 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019 ఇదే నెల్లో 15.36 బిలియన్ డాలర్లు. ► మేలో ఒక్క చమురు దిగుమతుల విలువ మైనస్ 71.98 శాతం పతనమై, 3.49 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019 మే నెలలో 12.44 బిలియన్ డాలర్లు. కాగా చమురుయేతర దిగుమతుల విలువ మైనస్ 43.13 శాతం క్షీణించి 18.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► పసిడి దిగుమతులు 98.4% క్షీణించి 76.31 మిలియన్ డాలర్లకు దిగజారాయి. ఏప్రిల్–మే చూస్తే...: 2020 ఏప్రిల్, మే నెలల్లో ఎగుమతులు మైనస్ 47.54% క్షీణించి, 29.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు మైనస్ 5.67% క్షీణించి 39.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 9.91 బిలియన్ డాలర్లుగా ఉంది. శుభ సంకేతం... మేలో దేశం మొత్తం దాదాపు లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలోనూ ఎగుమతులు తక్కువగా క్షీణించడం (ఏప్రిల్‌తో పోల్చితే) శుభసంకేతం. జూన్ మొదటివారంలో ఎగుమతుల డేటా మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. 2019 ఇదే కాలంతో పోల్చితే జూన్ మొదటివారం ఎగుమతులు కేవలం మైనస్ 0.76 శాతం క్షీణతతో 4.94 బిలియన్ డాలర్లకు తగ్గాయి. – పియూష్ గోయెల్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి -
పడగొట్టిన ‘ఫెడ్’!
అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందని ఆ దేశ కేంద్ర బ్యాంక్ సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం పతనమైంది. టెలికం కంపెనీలు ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించడం, ఇటీవల బాగా పెరిగిన బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వదంతులు, కరోనా కేసులు పెరుగుతుండటం... ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 34,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 709 పాయింట్లు క్షీణించి 33,538 పాయింట్ల వద్ద, నిఫ్టీ 214 పాయింట్లు పతనమై 9,902 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు వారాల్లో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం. ఇంట్రాడేలో సెన్సెక్స్ 767 పాయింట్లు, నిఫ్టీ 231 పాయింట్ల మేర నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. కాగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు... ► ఎస్బీఐ షేర్ 6% నష్టంతో రూ.177 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పడిన షేర్ ఇదే. ► 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు–ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, పవర్ గ్రిడ్, మహీం ద్రా అండ్ మహీంద్రా, నెస్లే ఇండియా మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి. ► మార్కెట్ భారీగా నష్టపోయినా, 80కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. అరబిందో ఫార్మా, ముత్తూట్ ఫైనాన్స్, క్యాడిలా హెల్త్‌కేర్, గ్రాన్యూల్స్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత చోటు చేసుకున్నా దాదాపు 350కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. పీఎన్బీ హౌసింగ్, ఫ్యూచర్ రిటైల్, లెమన్ ట్రీ హోటల్స్, ఫ్యూచర్ కన్సూమర్, డిష్ టీవీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ప్రముఖ ట్రేడర్ విజయ్ ఖేడియా 1.1 శాతం వాటా షేర్లను కొనుగోలు చేయడంతో రామ్‌కో సిస్టమ్స్ షేర్ 20 శాతం లాభంతో రూ.110 వద్ద ముగిసింది. ఇక ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో శంకర బిల్డింగ్ షేర్ 16 శాతం ఎగసి రూ.352 వద్ద ముగిసింది. ► ఏజీఆర్ బకాయిల విషయమై ఊరట లభించకపోవడంతో టెలికం షేర్లు నష్టపోయాయి. వొడాఫోన్ ఐడియా, భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్ఎఫ్సీఎల్, తేజాస్ నెట్వర్క్స్, ఐటీఐ, భారతీ ఎయిర్టెల్ షేర్లు 13 శాతం వరకూ నష్టపోయాయి. ► వరుసగా ఐదో రోజూ ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ పెరిగింది. ఒక్క వారంలో ఈ షేర్ 30 శాతం లాభపడింది. నష్టాలు ఎందుకంటే... ► ఫెడ్ కఠిన వ్యాఖ్యలు... వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, అమెరికాలో ఆర్థిక రికవరీకి దీర్ఘకాలమే పడుతుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యానించడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను పడగొట్టింది. వడ్డీరేట్లను మరో రెండేళ్ల పాటు సున్నా స్థాయిల్లోనే కొనసాగిస్తామని, తక్కువ రేట్లను కొనసాగించడానికి బాండ్ల కొనుగోళ్లు కొనసాగిస్తామని ఫెడ్ వెల్లడించింది. కరోనా కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందని ఈ వ్యాఖ్యల ద్వారా ఫెడ్ అంగీకరించినట్లయింది. ఫెడ్ వ్యాఖ్యల కారణంగా ఆసియా, యూరప్ మార్కెట్లు 1–4 శాతం మేర నష్టపోయాయి. ► ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందే... టెలికం కంపెనీలు ఏజీఆర్(సవరించిన స్థూల రాబడి)బకాయిలు చెల్లించాలాంటూ సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పడంతో బ్యాంక్ షేర్లు పడ్డాయి. ► బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ... లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటి నుంచి ఆర్థిక రికవరీపై సానుకూల అంచనాలతో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ షేర్లన్నీ బాగా పెరిగిన నేపథ్యంలో ఫెడ్ తాజా నిర్ణయం కారణంగా పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► రూపాయి పతనం డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పతనమై 75.79 వద్దకు చేరింది. ► మళ్లీ లాక్డౌన్...? కరోనా కేసులు బాగా పెరుగుతుండటంతో ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధిస్తారన్న వదంతులు చెలరేగాయి. ఈ వార్తలను కేంద్రం ఖండించినప్పటికీ, లాక్డౌన్ వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ► పెరుగుతున్న కరోనా కేసులు... ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్త కరోనా కేసులు 74 లక్షలకు, మరణాలు 4.2 లక్షలకు చేరువయ్యాయి. ఇక భారత్‌లో కరోనా కేసులు 2.9 లక్షలకు పైగా చేరగా, మరణాలు 8 వేలు దాటిపోవడం కూడా మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. ► ఎస్ అండ్ పీ రేటింగ్స్ ఆందోళన గత వారం మన రేటింగ్‌ను మూడీస్ సంస్థ డౌన్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే స్డాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) గ్లోబల్ రేటింగ్స్ సంస్థ మన సావరిన్ రేటింగ్‌ను కొనసాగించడం ఒకింత ఊరటనిచ్చింది. అయితే ద్రవ్యలోటు, ఆర్థిక రంగ బలహీనతలపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపించింది. రూ.2.4 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.2.4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.2.4 లక్షల కోట్లు తగ్గి రూ.133 లక్షల కోట్లకు పడిపోయింది. భారీ నష్టాల్లో అమెరికా మార్కెట్ కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటం, అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిరాశాపూర్వక వ్యాఖ్యలు చేయడంతో గురువారం అమెరికా స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాలో కరోనా కేసులు 20 లక్షలకు పైగా పెరిగిపోగా, మరణాలు 1.1 లక్షలకు చేరాయి. కరోనా కేసులు మళ్లీ తిరగబెడుతున్నాయని నిపుణులంటున్నారు. రాత్రి గం.11.30ని. సమయానికి డోజోన్స్ సూచీ 1,300 పాయింట్లు, (5 శాతం), నాస్డాక్ సూచీ 328 పాయింట్లు (3 శాతం), ఎస్ అండ్ పీ 500 సూచీ 128 పాయింట్లు(4 శాతం) మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక మన ఎన్ఎస్ఈ నిఫ్టీకి ప్రతీక అయిన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ సూచీ 278 పాయింట్ల(2%) నష్టంతో 9,575 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో శుక్రవారం మన స్టాక్ సూచీలు భారీ గ్యాపప్‌తో మొదలవుతాయని అంచనా. -
పాతాళానికి టిక్ టాక్ రేటింగ్స్
బెంగళూరు: సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ రేటింగ్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో భారీగా పడిపోయాయి. టిక్‌టాక్ రేటింగ్ 4.6 నుంచి రెండుకు దిగిరాగా, టిక్ టాక్ లైట్ రేటింగ్ 1.1కి పడింది. యూట్యూబ్ లో ఫాలోయింగ్ ఉన్న కారీ మినాటి యూట్యూబ్ వర్సస్ టిక్ టాక్ ది ఎండ్ పేరుతో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనితోపాటు టిక్ టాక్ స్టార్ ఫైజల్ సిద్ధిఖి మహిళలను కించపర్చేలా ఉన్న ఓ వీడియో పోస్ట్ చేశారు. టిక్ టాక్ ను నిషేధించాలంటూ భారత యూజర్లు ట్విట్టర్లో ట్వీట్లుచేయడం టిక్‌టాక్‌కు నష్టం చేకూర్చాయి. టిక్ టాక్‌ను నిషేధించాలంటూ ప్రధానికి లేఖలు రాస్తామని జాతీయ మహిళా కమిషన్ ప్రకటించడమూ రేటింగ్స్ పడటానికి మరో కారణం. -
సెన్సెక్స్ 32,170 మద్దతుకు ఇటూ...అటూ
అమెరికాతో పాటు పలుదేశాల్లో ఆర్థిక వ్యవస్థల్ని పాక్షికంగా తెరిచినందున ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ గతవారం ప్రథమార్ధంలో జోరుగా ర్యాలీ జరిపినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...తిరిగి చైనాతో ట్రేడ్‌వార్‌ను తెరపైకి తేవడంతో ఆ మార్కెట్లన్నీ వారాంతంలో హఠాత్ పతనాన్ని చవిచూసాయి. భారత్ మార్కెట్‌కు శుక్రవారం సెలవుకావడంతో ప్రపంచ మార్కెట్ల ప్రభావం ఇక్కడ పడలేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇచ్చినప్పటికీ, దేశంలో పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక రంగ కార్యకలాపాలకు ప్రధానమైన పెద్ద నగరాలన్నీ రెడ్జోన్లు అయినందున, మరో రెండు వారాలు ఆర్థిక వ్యవస్థ నిస్తేజంగా వుండిపోతుంది. అటు అంతర్జాతీయ అంశాలు, ఇటు దేశీయ వార్తల ప్రతికూలతను భారత్ మార్కెట్ తట్టుకోవాలంటే..కేంద్రం కొద్దిరోజులుగా తాత్సారం చేస్తున్న ఆర్థిక ప్యాకేజీని తక్షణమే ప్రకటించాల్సివుంటుంది. అది ఇన్వెస్టర్లను మెప్పించాల్సివుంటుంది. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి..... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఏప్రిల్ 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ అనూహ్యంగా 33,887 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత, అంతక్రితంవారంతో పోలిస్తే 2391 పాయింట్ల భారీలాభంతో 33,718 పాయింట్ల వద్ద ముగిసింది. గత గురు, శుక్రవారాల్లో యూరప్, అమెరికా మార్కెట్లు పతనమైన నేపథ్యంలో ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 32,170 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున 31,660–31,275 పాయింట్ల శ్రేణి మధ్య గట్టి మద్దతు లభ్యమవుతున్నది. ఈ శ్రేణిని కోల్పోతే ఏప్రిల్ నెలలో జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 30,750 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ సోమవారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే క్రమేపీ 33,880 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. అటుపైన ముగిస్తే 34,100 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన కొద్దిరోజుల్లో 34,900 పాయింట్ల వరకూ పెరిగే చాన్స్ వుంటుంది. నిఫ్టీ 9,390 మద్దతు కోల్పోతే... క్రితం వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ...గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రైజింగ్ వెడ్జ్ ప్యాట్రన్ అప్పర్‌బ్యాండ్ అయిన 9,500 పాయింట్ల స్థాయిని ఛేదించినంతనే 9,889 పాయింట్ల గరిష్టస్థాయికి శరవేగంగా ర్యాలీ జరిపింది. ఈ స్థాయి 12,430 పాయింట్ల గరిష్టం నుంచి 7,511 పాయింట్ల కనిష్టంవరకూ జరిగిన పతనానికి 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి. వచ్చేవారం సైతం ఈ స్థాయిని పరిరక్షించుకుంటేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ సోమవారం మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 9,390 పాయింట్ల సమీపంలో నిఫ్టీకి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 9,260–9,140 పాయింట్ల శ్రేణి వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 8,980 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. 7,511 పాయింట్ల నుంచి 9,889 పాయింట్ల వరకూ జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 8,980 పాయింట్ల స్థాయిని కోల్పోతే నిఫ్టీ ప్రస్తుత రిలీఫ్ర్యాలీకి తెరపడినట్లే. అయితే ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే మరోదఫా 9,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 9,960 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన కొద్దిరోజుల్లో 10,200 వరకూ కూడా పెరిగే చాన్స్ వుంటుంది. – పి. సత్యప్రసాద్ -
ఫార్మా ఎగుమతులకు వైరస్ దెబ్బ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫార్మా ఎగుమతుల మీద కరోనా గట్టి దెబ్బే వేసింది. కేంద్రం కొన్ని రకాల ఔషధాల ఎగుమతుల మీద నియంత్రణ పెట్టడం, దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో దేశీయ ఫార్మా పరిశ్రమ 22 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోలేదని ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఫార్మెక్సిల్) తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 19.14 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని.. 2020 ఆర్ధిక సంవత్సరంలో 22 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశామని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. గతేడాది మార్చి ఒక్క నెలలోనే 2.1 బిలియన్ డాలర్ల ఫార్మా ఎగుమతులు జరిగాయన్నారు. 2017–18లో ఫార్మా ఎగుమతులు 17.28 బిలియన్ డాలర్లు. పారాసిటమల్, హైడ్రాక్సిక్లోరోక్విన్ వంటి కరోనా నియంత్రణలో వినియోగించే ఔషదాల ఎగమతుల మీద కేంద్రం నియంత్రణ విధించిన సంగతి తెలిసిందే. ఫార్మా ఎగుమతుల్లో వీటి వాటా 600 మిలియన్ డాలర్లుంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 18.74 బిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించామని తెలిపారు. -
ఇన్వెస్ట్ చేయాలా..? విక్రయించాలా..?
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. దేశాలన్నీ ఇప్పుడు ఈ వైరస్ నియంత్రణ కోసమే తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలకు ‘లాక్’ వేసి పోరాటం సాగిస్తున్నాయి!. మన దేశంలో ఏప్రిల్ 14 వరకు లౌక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, సేవలు మినహా మిగిలిన పరిశ్రమలు, వ్యాపారాలన్నీ మూతబడ్డాయి. దీంతో ఎంతోమంది జీవనోపాధి అనిశ్చితిలో పడింది. ఈ పరిణామాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లలో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రధాన సూచీలు వాటి గరిష్టాల నుంచి 35 శాతం పడిపోయాయి. విడిగా స్టాక్స్‌ను పరిశీలిస్తే 60 శాతానికి పైగా క్షీణించినవీ ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇన్వెస్టర్లను ఆత్మరక్షణలోకి నెట్టేవే. అదనంగా ఇన్వెస్ట్ చేయాలా..? లేక ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసేసుకోవాలా..? ఇలా ఎన్నో ప్రశ్నలు రావచ్చు. వాటికి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.. భయపడక్కర్లేదు... తమ పెట్టుబడులను సమీక్షించుకునేందుకు ఇది మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 50 సూచీ గరిష్టం నుంచి 40 శాతం వరకు పడిపోయి గత వారం కొంత రికవరీ చూపించింది. నిజానికి ఈ తరహా భారీ కరెక్షన్ను 2008లోనూ చూశాం. అయినా ఇన్వెస్టర్లలో చాలా మంది ఈ తరహా సంక్షోభాలకు సన్నద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో మార్కెట్ల పతనం చూసి భయపడిపోయి ఉన్న ఈక్విటీ పెట్టుబడులను అమ్మేసుకుని వెళ్లిపోవడం ఈ తరుణంలో చేయాల్సిన పని కాదంటున్నారు విశ్లేషకులు. ‘‘నగదుకు అత్యవసరం లేకపోతే ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో తమ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను, సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) కొనసాగించుకోవాలి’’ అని సృజన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకురాలు దీపాలిసేన్ పేర్కొన్నారు. ఈ రెండూ కొనుగోలు ఖర్చును సగటుగా మారుస్తాయని, మార్కెట్ కరెక్షన్లో మరిన్ని యూనిట్లను సమకూర్చుకోవచ్చని ఆమె సూచించారు. ఒకవేళ ఉద్యోగం కోల్పోవడం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే అప్పడు ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడాన్ని పరిశీలించొచ్చన్నారు. అది కూడా బ్యాంకు సేవింగ్స్ ఖాతా మొత్తం ఖాళీ అయ్యి, డెట్ ఫండ్స్, ఇతర నిల్వలన్నీ అడుగంటిన తర్వాతే ఈక్విటీ పెట్టుబడుల ఉపసంహరణను పరిశీలించాలని సూచించారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏక మొత్తంలో పెట్టుబడులను కూడా ఈ తరుణంలో చేసుకోవచ్చని, కాకపోతే ఒకే విడత కాకుండా పలు విడతలుగా చేసుకోవాలని ప్లాన్‌రూపీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్‌జోషి సూచించారు. అత్యవసరాలు చూసుకోవాలి... ఈ సమయంలో జీవన అవసరాల కోసం నిధులు కావాల్సిన వారు ఈక్విటీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి బదులు ఈపీఎఫ్ బ్యాలన్స్‌ను కొంత వెనక్కి తీసుకోవడాన్ని తాను సూచిస్తానని మ్యాక్స్ సెక్యూర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ ప్రహరాజ్ తెలిపారు. ఈపీఎఫ్ సభ్యులు తమ భవిష్య నిధి నుంచి 75 శాతాన్ని లేదా మూడు నెలల బేసిక్ వేతనం, డీఏ ఈ రెండింటిలో ఏది తక్కువ మొత్తం అయితే ఆ మేరకు ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్, లౌక్‌డౌన్ సమీప కాలంలో వృద్ధి అవకాశాలను దెబ్బతీయగా.. దీర్ఘకాలంలో మాత్రం ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు, వైరస్ నివారణ చర్యలతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. ఆర్థిక వృద్ధి పట్ల ఉన్న భయాలు ఈక్విటీ మార్కెట్లను ప్రస్తుతం చౌకగా మార్చేశాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ పేర్కొంది. పీఈ, పీబీవీ, జీడీపీలో మార్కెట్ క్యాప్ కొలమానాల ఆధారంగా ఈ సంస్థ రూపొందించిన వ్యాల్యూషన్ ట్రాకర్ మార్చి 23న 72.6 స్థాయికి చేరింది. అంటే దూకుడుగా పెట్టుబడులు పెట్టుకోవచ్చన్నది దీని సంకేతం. చివరిగా ఈ స్థాయిలో వ్యాల్యూషన్ ట్రాకర్ కనిపించింది 2008–09లోనే కావడం గమనార్హం. మిగులు నిధులు కలిగిన వారు, రోజువారీ ఖర్చులకు సరిపడా పక్కన పెట్టేసి, అలాగే అత్యవసర పరిస్థితులకు కొంత కేటాయించుకున్న తర్వాత.. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల కోసం కేటాయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు పెట్టుబడుల కేటాయింపు దోహదపడుతుందా? లేదా అని ఓ సారి సమీక్షించుకుని, అవసరమైతే మార్పులు కూడా చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ మార్గం.. మార్కెట్ నిపుణులు, విశ్లేషకులను ప్రశ్నిస్తే ఎక్కువ మంది నుంచి వచ్చే స్పందన ఈక్విటీల్లో పెట్టుబడులకు ఇది మంచి అనుకూల సమయమనే. ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాల కోసం వేచి చూసేవారు, దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారు సిప్ మార్గాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్స్ ధరల్లో దిద్దుబాటుతో అవి చాలా ఆకర్షణీయంగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెల్త్‌కేర్, టెలికం రంగాలు ప్రస్తుత పరిస్థితుల్లో రాణించగలవన్న అంచనాతో ఉన్నారు. ఇన్వెస్టర్లు ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని, వీటిల్లో లిక్విడిటీ మెరుగ్గా ఉంటుందని నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఈడీ, సీఈవో సందీప్‌సిక్కా తెలిపారు. మొదటి సారి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి, సీజన్ వారీగా ఇన్వెస్ట్ చేసే వారికి ఇండెక్స్ ఫండ్స్ అనుకూలమైనవిగా సిక్కా పేర్కొన్నారు. యాక్టివ్‌గా నిర్వహణతో కూడిన ఫండ్స్‌తోపాటు, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్‌ను వ్యూహాత్మకంగా ఎంచుకోవాలన్నారు. ‘‘మార్కెట్లు రికవరీ అయినప్పుడు ముందుగా సూచీల్లోనే అది ప్రతిఫలిస్తుంది. ప్రతీ పతనం తర్వాత బలమైన రికవరీ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈటీఎఫ్‌లు చక్కని ఆప్షన్’’ అని సిక్కా వివరించారు. ఈక్విటీల్లో పెట్టుబడులు.. ప్రస్తుత తరుణంలో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించుకోవాలని, మిగులు నిధులు ఉంటే దీర్ఘకాలం కోసం క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవాలని యస్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో కన్వర్ వివేక్ సూచించారు. ‘‘స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు బేర్ మార్కెట్లు ఎంతో అనుకూలమైనవి. మార్కెట్ల పనితీరు దారుణంగా ఉందంటే మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి మంచి రాబడులకు అవకాశం ఉన్నట్టే’’ అని ఆశికా వెల్త్ అడ్వైజర్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్‌జైన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న నిధుల్లో 40 శాతాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు కేటాయించుకోవాలి. ఇవి 7–8 శాతం వరకు రాబడులను ఇస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను మిడ్‌క్యాప్, మల్టీక్యాప్ ఫండ్స్‌లో వచ్చే ఆరు నెలల కాలంలో క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి’’ అని అమిత్‌జైన్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హెల్త్‌కేర్ రంగంలోని కంపెనీలు, ముఖ్యంగా డయాగ్నస్టిక్స్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయని పేర్కొన్నారు. అందరూ ఇంటికే పరిమితం కావడం, ఇంటి నుంచే పని చేస్తున్నందున డేటాకు డిమాండ్ భారీగా ఉంటుందని కనుక టెలికం కంపెనీలను సైతం పెట్టుబడులకు పరిశీలించొచ్చని సూచించారు. అలాగే, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ రంగాలపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావం తక్కువే ఉంటుందన్నారు. -
వీడని కరోనా కష్టాలు : 29వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. కరోనా కల్లోలం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. దీంత దేశీయంగా కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. సెన్సెక్స్ ప్రారంభంలోనే వెయ్యి పాయింట్లను కోల్పోయింది. బ్యాంకులు, ఫార్మ రంగ షేర్లతో పాటు దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్పస్ 839 పాయింట్లు పతనమైన 28998 వద్ద, నిప్టీ 218 పాయింట్లు నష్టంతో 8452 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా 29 వేల దిగువకు చేరింది. నిప్టీ కూడా 8400 దిగువకు చేరింది. నిఫ్టీ బ్యాంకు కూడా ఇదే బాటలో వుంది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎం అండ్ ఎం, ఓఎన్జీసీ, యూపిఎల్, శ్రీసిమెంట్స్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. కాగా టీసీఎస్, ఐటీసీ మాత్రం స్వల్పంగా లాభపడుతున్నాయి. అటు డాలరు మారకంలో రుపీ కూడా నెగిటివ్ గా వుంది. -
సెన్సెక్స్, నిఫ్టీ మహా పతనం
-
మహమ్మారి ముంచేసింది!
కోవిడ్–19 (కరోనా) వైరస్‌ను మహమ్మారి వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఇక ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా యూరప్ నుంచి ప్రయాణాలను నెల రోజుల పాటు అమెరికా రద్దు చేయడంతో ఆర్థిక మందగమనం భయాలు ఉవ్వెత్తున ఎగిశాయి. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్ బుధవారం బేర్ దశలోకి చేరింది. ఫలితం...గురువారం మన మార్కెట్ కనీవినీ ఎరుగని స్థాయిలో నష్టపోయింది. మన మార్కెట్ కూడా బేర్ దశలోకి జారిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 33,000 పాయింట్లు, నిఫ్టీ 9,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 3,204 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరకు 2,919 పాయింట్ల నష్టంతో 32,778 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 868 పాయింట్లు క్షీణించి 9,590 పాయింట్లకు పడిపోయింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సెన్సెక్స్, నిఫ్టీలు అత్యధిక పాయింట్లు నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.11 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 82 పైసలు క్షీణించి 74.50కు పడిపోవడం, ముడి చమురు ధరలు 8 శాతం పతనం కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. వివరాలు... ఏడాది కనిష్టానికి అన్ని సూచీలు.... శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 8.2 శాతం, నిఫ్టీ 8.3 శాతం చొప్పున నష్టపోయాయి. ఈ రెండు సూచీలు రెండున్నర సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు పతనం కావడం ఇదే మొదటిసారి. కాగా గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఈ సూచీలు అత్యధిక పాయింట్లు నష్టపోవడం ఇది రెండోసారి. ఈ నెల 9(సోమవారం) సెన్సెక్స్, నిఫ్టీలు అత్యధిక పాయింట్లు నష్టపోవడం తెలిసిందే. గురువారం అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్‌సూచీ జీవిత కాల కనిష్టానికి, వాహన సూచీ 6 ఏళ్ల కనిష్టానికి, లోహ సూచీ మూడేళ్ల కనిష్టానికి, నిఫ్టీ బ్యాంక్ సూచీ రెండేళ్ల కనిష్టానికి పడ్డాయి. అన్ని రంగాల నిఫ్టీ సూచీలు ఏడాది కనిష్టానికి చేరాయి. నష్టాలు ఎందుకంటే... ► కోవిడ్–19 వైరస్...మహమ్మారి... కోవిడ్–19 వైరస్‌ను మహమ్మారి వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. అసలే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ –19 వైరస్ కల్లోలంతో మాంద్యంలోకి జారిపోతుందనే ఆందోళనతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇక భారత్‌లో కోవిడ్–19 వైరస్ కేసులు 73కు పెరిగాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, ఈ వైరస్ సోకిన వ్యక్తులు 1.26 లక్షలకు చేరగా, మరణించిన వారి సంఖ్య 4,600కు చేరింది. ► ‘యూరప్’ ప్రయాణాలపై నిషేధం కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి యూరప్ నుంచి అమెరికాకు అన్ని రకాల ప్రయాణాలపై నెల రోజుల పాటు అమెరికా నిషేధం విధించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పర్యాటకంపై ఆంక్షలు విధించాయి. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలన్నీ అతలాకుతలమవుతాయని ఆందోళనలు చెలరేగుతున్నాయి. ► బేర్ దశలోకి అమెరికా మార్కెట్.... బుధవారం ఆరంభంలోనే అమెరికా స్టాక్ సూచీలు 7 శాతం నష్టపోతే, ట్రేడింగ్‌ను 15 నిమిషాల పాటు నిలిపేశారు. ఆ తర్వాత ట్రేడింగ్ మొదలైనా ఈ సూచీలు 6–8 శాతం మేర పతనమయ్యాయి. ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, బుధవారం అమెరికా స్టాక్ సూచీలు 20 శాతం మేర నష్టపోయి బేర్ దశలోకి జారిపోయాయి. ► ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్‌ను మహమ్మారి వ్యాధిగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం, అమెరికా స్టాక్ మార్కెట్ బేర్ దశలోకి ప్రవేశించడంతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఆసియా మార్కెట్లు 1.5–4.4% నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 6% నష్టాలతో మొదలై 11–12% నష్టాల్లో ముగిశాయి. ► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గత నెల 24 నుంచి మన మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. కరోనా కల్లోల భయాలే దీనికి కారణం. 13 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ.36,252 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పసిడి, క్రూడ్.. క్రాష్ కోవిడ్–19 భయాల నేపథ్యంలో అన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనాల నుంచీ డబ్బును వెనక్కుతీసుకుని, క్యాష్‌గానే భద్రపరచుకోడానికి ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఆర్థిక వ్యవస్థల తిరోగమన భయాల నేపథ్యంలో... పసిడి ధర భారీగా పెరగాల్సి ఉంది. అయితే ఇందుకు భిన్నంగా గురువారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రా) ధర ఈ వార్త రాసే రాత్రి 10 గంటల సమయానికి 4 శాతం పతనమై (65 డాలర్లు) 1,577 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,560 డాలర్ల కనిష్టాన్ని కూడా చూడ్డం గమనార్హం. రెండు వారాల క్రితం పసిడి 1,704 డాలర్ల స్థాయిని నమోదు చేసుకుంది. ఇక లైట్‌స్వీట్ నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర కూడా 35 డాలర్ల కీలక స్థాయిని అధిగమించలేక గురువారం ఒక దశలో 30 స్థాయికి పడిపోయింది. మరోవైపు ఆరు దేశాల కరెన్సీతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 98 వద్ద ట్రేడవుతుండడం గమనార్హం. ఒడిదుడుకులు తగ్గేదాకా వేచి చూడండి...! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ నుంచి ప్రయాణాలపై నిషేధం విధించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్ కూడా బేర్ దశలోకి జారిపోయిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దీపక్ జసాని పేర్కొన్నారు. మాంద్యం భయాలు ముప్పిరగొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మార్కెట్ మరింతగా పతనమయ్యే అవకాశాలున్నాయని బే కాపిటల్ ఎనలిస్ట్ సిద్ధార్థ మెహతా అంచనా వేస్తున్నారు. రానున్న 5–10 ఏళ్లలో మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలిగిన, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. అయితే ఒడిదుడుకులు సద్దుమణిగేదాకా వేచి చూస్తే మేలని ట్రేడింగ్‌బుల్స్ సీఈఓ అమిత్ గుప్తా సూచించారు. 11,00,000 కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.11.27 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.11,27,161 కోట్లు హరించుకుపోయి రూ.1,25,86,398 కోట్లకు పడిపోయింది. సోమవారం రూ.7 లక్షల కోట్ల మేర ఆవిరైన సంపదను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ వారంలో ఇప్పటివరకూ మొత్తం రూ.18 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. -
ప్రపంచవ్యాప్తంగా స్టాక్, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం
ట్రంప్ ట్రేడ్‌వార్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేస్తోంది. ఇక కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్న కరోనా.. ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తోంది. ఈ రెండింటికీ సౌదీ అరేబియా–రష్యా మధ్య మొదలైన చమురు ధరల యుద్ధం ఆజ్యం పోసింది. ఇక చెప్పేదేముంది! మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు మహా పతనాన్ని చవిచూశాయి. చమురు ఊచకోతకు గురైంది. ఒక్క జపాన్ యెన్ మినహా... ప్రపంచ కరెన్సీలన్నీ ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా, ఏ దశలోనూ ఇన్వెస్టర్లకు ఉపశమనం కనిపించలేదు. ♦ ముడిచమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్ కూటమి – రష్యా మధ్య రేగిన విభేదాలతో.. సౌదీ భారీగా రేట్లు తగ్గించేసింది. ఫలితం.. ఒకేరోజు ముడి చమురు ధరలు ఏకంగా 30 శాతానికిపైగా పతనమయ్యాయి. ఒక దశలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 31 డాలర్ల స్థాయికి పడిపోయి, తర్వాత కాస్త కోలుకుంది. 1991 గల్ఫ్ యుద్ధ సమయం తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. ♦ తాజా పరిణామాలతో రూపాయి ఏకంగా 17 నెలల కనిష్టానికి క్షీణించి డాలర్‌తో పోలిస్తే 74.17 వద్ద క్లోజయ్యింది. జపాన్ యెన్ మినహా అమెరికా డాలర్, ఇతర కరెన్సీలూ రూపాయి దార్లోనే వెళ్లాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయానికి అమెరికా మార్కెట్ల ప్రామాణిక సూచీ డోజోన్స్ 1,600 పాయింట్లకు పైగా నష్టంతో (6 శాతం) ట్రేడవుతోంది. జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్ మార్కెట్లు సైతం 5 నుంచి 7 శాతం మధ్యలో భారీగా నష్ట పోయాయి. మంగళవారం హోలీ సందర్భంగా మన మార్కెట్లకు సెలవు కావటంతో.. పతనానికి కూడా తాత్కాలికంగానైనా విరామం దొరికినట్లయింది. ఆయిల్ వార్, కరోనా ఫియర్ స్టాక్ మార్కెట్లను కుదిపేయడంతో ఆసియా నుంచి అమెరికా దాకా సోమవారం బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు భారీ నష్టాలతో ముగిశాయి. అదుపులోకి రాని కరోనా వైరస్ పెట్టుబడిదారులను బెంబేలెత్తించడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతం కుప్పకూలింది. మరో ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటామేమోననే భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దశాబ్దకాలంలో అతిపెద్ద సింగిల్–డే పతనంతో మార్చి 9వతేదీ ,2020 భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండేగా నిలిచిపోయింది.7లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. క్రూడ్(ముడి చమురు) ధరల పతనానికి బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 1,942 పాయింట్లు కుప్పకూలింది. చరిత్రలో ఇదే అత్యంత భారీ పతనం. కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలానికి ముడి చమురు ధరల పోరు జత కావడంతో స్టాక్ మార్కెట్ కనీవినీ ఎరుగని రీతిలో క్షీణించింది. సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ప్రస్తుతం మందగమనంలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ... కోవిడ్–19 వైరస్, ముడి చమురు ధరల పోరు కారణంగా మాంద్యంలోకి జారిపోతుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇక దేశీయంగా యస్‌బ్యాంక్ సంక్షోభం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు తగ్గడం వంటి అంశాలు కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో 2,467 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ చివరకు 1942 పాయింట్లు క్షీణించి 35,635 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 695 పాయింట్లు పతనమైన నిఫ్టీ చివరకు 538 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్దకు చేరింది. శాతాలపరంగా చూస్తే, సెన్సెక్స్ 5.1 శాతం, నిఫ్టీ 4.9 శాతం చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, ఈ రెండు సూచీలు గత ఐదేళ్లలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఒక్క రోజులోనే ఇన్నేసి పాయింట్లు నష్టపోవడం (ఇంట్రాడే, ముగింపులో కూడా)ఇదే మొదటిసారి. ఆరంభంలోనే భారీ నష్టాలు.... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ భారీ నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 627 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సమయం Výæడిచే కొద్దీ నష్టాలు పెరిగాయే కానీ తరగలేదు. అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ నష్టాలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్ 5,088 పాయింట్లు (12.4 శాతం), నిఫ్టీ 1,511 పాయింట్లు(12.6 శాతం) చొప్పున క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు ముప్పిరిగొన్నందున సెంటిమెంట్ బలహీనంగా ఉందని, మన మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టీ మద్దతు స్థాయిలు 10,295–10,138 పాయింట్లని, ఒక వేళ పుల్ బ్యాక్ ర్యాలీ చోటు చేసుకుంటే నిరోధ స్థాయిలు 10,637–10,744 పాయింట్లని విశ్లేషకులు పేర్కొన్నారు. పతనానికి పంచ కారణాలు... ♦ చమురు ధరల పతనం... చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఉత్పత్తి కోతకు సంబంధించి చర్చలు విఫలమయ్యాయి. ఒపెక్ దేశాలు ప్రతిపాదించిన ఉత్పత్తి కోతను రష్యా వ్యతిరేకించడం.. నచ్చని సౌదీ అరేబియా ప్రతి చర్యలు ప్రకటించింది. తాము ఉత్పత్తి చేసే క్రూడ్ ధరలను తగ్గించడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఇది అంతర్జాతీయంగా వృద్ధి మరింతగా దెబ్బతీస్తుందన్న భయాలు మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులంటున్నారు. కోవిడ్–19 విలయం భారత్‌లో కోవిడ్–19 (వైరస్) బాధితుల సంఖ్య 43కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య 3,600కు పెరిగాయి. ఇటలీలో ఒక్క రోజులోనే 130కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కోటిన్నరకు పైగా ప్రజలను ఈ దేశం క్వారంటైన్లో ఉంచింది. మరిన్ని దేశాలకు ఈ వైరస్ విస్తరిస్తుండటంతో మరిన్ని కష్టాలు ముందు ముందు ఉంటాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ మరింత విస్తరిస్తే, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా తదితర అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యంలోకి జారిపోతాయని మూడీస్ సంస్థ హెచ్చరించడం ఆందోళన రేకెత్తించింది. ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్ విస్తరిస్తుండటం, ముడి చమురు ధరల హఠాత్ పతనం కారణంగా ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి సురక్షిత సాధనాలైన పుత్తడి, అమెరికా డాలర్, బాండ్లలోకి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఫలితంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలు 5 శాతం మేర క్షీణించాయి. ఆరంభంలోనే 6% మేర నష్టపోయిన యూరప్ మార్కెట్లు అదే స్థాయిలో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు... కరోనా కల్లోలానికి సెంటిమెంట్ దెబ్బతినడంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ నికర కొనుగోలుదారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగుతున్నాయి. సోమవారాన్ని కూడా కలుపుకుంటే వరుసగా 11వ రోజూ విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగానే నిలిచారు. ఈ 11 ట్రేడింగ్ సెషన్లలో రూ.25,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. యస్ బ్యాంక్ సంక్షోభం .. భారత బ్యాంకింగ్ రంగం స్థిరత్వంపై ఆందోళనను, సంశయాలను పెంచింది. పలు ఆర్థిక సంస్థలు యస్ బ్యాంక్ బాండ్లలో ఇన్వెస్ట్ చేశాయి. ఈ బాండ్ల రేటింగ్‌ను పలు రేటింగ్ సంస్థలు డౌన్‌గ్రేడ్ చేశాయి. మరోవైపు బాసెల్ టూ, టైర్–1 బాండ్ల వడ్డీ చెల్లింపుల్లో యస్ బ్యాంక్ విఫలమైంది. మొత్తం మీద యస్ బ్యాంక్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదన్న భయాలు నెలకొన్నాయి. నేడు మార్కెట్లకు సెలవు నేడు హోలీ పండుగ సందర్భంగా సెలవు. సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడయ్యింది. ఆరంభంలోనే ఏడు శాతం మేర çపతనమై లోయర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో ట్రేడింగ్‌ను నిలిపేశారు. 15 నిమిషాల అనంతరం ఆరంభమైనప్పటికీ నష్టాలు తగ్గలేదు. కరోనా ప్రభావం పెరుగుతుండటం, ముడి చమురు ధరలు తగ్గడం ప్రభావం చూపాయి. రాత్రి గం.11.30 ని. లకు డోజోన్స్ 1,794 పాయింట్లు, నాస్డాక్ 500 పాయింట్ల నష్టాల్లో ట్రేడయ్యాయి. మంగళవారం సెలవు కావడంతో మేలైందని, లేకుంటే అమెరికా, యూరప్ మార్కెట్ల నష్టాల ప్రభావంతో మన మార్కెట్‌కు భారీ నష్టాలు ఉండేవని విశ్లేషకులంటున్నారు. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ మహా పతనం కారణంగా రూ. 7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.6, 84, 278 కోట్లు హరించుకుపోయి రూ.1,37,46,947 కోట్లకు పడిపోయింది. షేర్లు కకావికలం... ♦ ఓఎన్జీసీ.. 15 ఏళ్ల కనిష్టానికి ముడి చమురు ధరలు 30 శాతం మేర పతనం కావడంతో చమురు అన్వేషణ, తయారీ ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్జీసీ భారీగా నష్టపోయింది. 16 శాతం నష్టంతో రూ.74.65 వద్ద ముగిసింది. ఇది దాదాపు 15 ఏళ్ల కనిష్ట స్థాయి. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ♦ రెండో స్థానానికి రిలయన్స్ చమురు ఉత్పత్తి రంగంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ కూడా బాగా పతనమైంది. 12 శాతం నష్టంతో రూ.1,113 వద్దకు చేరింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్లు ఆవిరైంది. ఈ నష్టం కారణంగా అత్యధిక మార్కెట్ క్యాప్‌గల భారత కంపెనీ అనే ఘనతను కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. మొదటి స్థానం టీసీఎస్ షేర్‌కు దక్కింది. ♦ యస్ బ్యాంక్ జోరు... ఎస్బీఐ బేజారు.... సంక్షోభంలో చిక్కుకున్న యస్‌బ్యాంక్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేయనున్న ఎస్బీఐ షేర్ 6 శాతం పతనమై రూ.254కు చేరింది. మరోవైపు యస్ బ్యాంక్ షేర్ 31 శాతం లాభపడి రూ.21 వద్ద ముగిసింది. ♦ చమురు షేర్లు రయ్... ముడి చమురు ధరలు 30 శాతం మేర తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌పీసీఎల్ షేర్ 6 శాతం లాభంతో రూ.213కు, బీపీసీఎల్ షేర్ 5.2 శాతం పెరిగి రూ.424కు పెరిగాయి. ♦ ఏడాది కనిష్టానికి 800 షేర్లు... దాదాపు 800కు పైగా షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. బీఎస్ఈ 500 సూచీలో ప్రతి నాలుగు షేర్లలో ఒక షేర్ ఏడాది కనిష్టానికి పడిపోయింది.∙ప్రపంచ పరిణామాలకు యస్ బ్యాంకు సంక్షోభం తోడవటంతో బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఒక్కరోజే 1,942 (5.1%) పాయింట్లు కుదేలైంది. చరిత్రలో ఇదే అత్యంత దారుణ పతనం. నిఫ్టీ సైతం 538 పాయింట్లు (4.9%) నష్టపోయింది. శాతాల పరంగా గత ఐదేళ్లలో ఇదే భారీ నష్టం కాగా.. పాయింట్ల పరంగా ఇది రికార్డు. ఓఎన్జీసీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు సైతం 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా ఒక్కరోజే ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. -
కోవిడ్ ‘విశ్వ’రూపం... గుబేర్!
చైనా కాకుండా కొత్త దేశాలకు కోవిడ్–19(కరోనా) వైరస్ విస్తరిస్తుండటం, ఆయా దేశాల్లో కొత్త కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన స్టాక్ మార్కెట్ కూడా బుధవారం నష్టపోయింది. ఈ క్యూ2లో 4.5 శాతంగా ఉన్న వృద్ధి రేటు ఈ క్యూ3లో కూడా అదే రేంజ్లో ఉండగలదన్న అంచనాలు ప్రతికూల ప్రభావం చూపాయి. రేపు (శుక్రవారం) ఈ క్యూ3 జీడీపీ గణాంకాలు వెలువడతాయి. సెన్సెక్స్ కీలకమైన 40,000 పాయింట్ల దిగువకు పతనం కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 200 రోజుల చలన సగటు(డీఎమ్ఏ) దిగువకు క్షీణించింది. ఇంట్రాడేలో 521 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 392 పాయింట్లు పతనమై 39,889 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 119 పాయింట్లు క్షీణించి 11,679 పాయింట్ల వద్దకు చేరింది. టెలికం రంగ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు పుంజుకున్నా (ఇంట్రాడేలో), ముడి చమురు ధరలు 1.7 శాతం మేర పతనమైనా, మన మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. మహమ్మారిగా కోవిడ్–19 వైరస్! చైనాలో కొత్త కేసులు తగ్గినప్పటికీ, కోవిడ్–19 (కరోనా) వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,700కు, వ్యాధి సోకిన వారి సంఖ్య 80,000కు పెరిగాయి. ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్పెయిన్ వంటి కొత్త దేశాలకు ఈ వైరస్ వ్యాపిస్తోంది. చైనా తర్వాత దక్షిణ కొరియాలో అధికంగా ఈ వైరస్ బాధితులున్నారు. ఈ దేశంలో కొత్త కేసుల సంఖ్య 169కు, మొత్తం బాధితుల సంఖ్య 1,146కు, మృతుల సంఖ్య 11కు పెరిగింది. కోవిడ్ 19 వైరస్ మహమ్మారిగా మారనున్నదని, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఈ వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదన్న ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో... యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఈక్విటీ నుంచి పెట్టుబడులు సురక్షిత పెట్టుబడి సాధనాలైన అమెరికా బాండ్లు, డాలర్, పుత్తడిలోకి తరలిపోతున్నాయి. ► సన్ ఫార్మా 3.6% నష్టంతో రూ.375 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► బంధన్ బ్యాంక్ ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. బ్రాంచ్‌ల విస్తరణకు ఆర్బీఐ అనుమతినివ్వడంతో ట్రేడింగ్ మొదట్లో 5% లాభంతో రూ.423ను తాకింది. చివరకు 2.3% నష్టంతో రూ.394 వద్ద ముగిసింది. ► 300కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. హీరో మోటో, జిల్లెట్ ఇండియా, ఎల్ అండ్ టీ, థెర్మాక్స్.... తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినా, ఇండియా సిమెంట్స్ షేర్ 20% అప్పర్ సర్క్యూట్‌తో రూ.105వద్ద ముగిసింది. గత రెండు రోజుల్లో ఈ షేర్ 37% ఎగసింది. ఏస్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ, ఆయన సోదరుడు గోపీకిషన్ దమానీ ఈ కంపెనీలో వాటాను 11.58%కి పెంచుకున్నారన్న వార్తలు దీనికి కారణం. n ఒక్కో షేర్‌కు రూ.349 డివిడెండ్‌ను ప్రకటించడంతో సనోఫీ ఇండియాఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ. 7,638ను తాకింది. చివరకు 1.6% లాభంతో రూ. 7,114 వద్ద ముగిసింది. గత ఏడాదికి గాను రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.106 డివిడెండ్‌ను, రూ.243 ప్రత్యేక డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 4 రోజుల్లో 1,434 పాయింట్లు డౌన్ వరుసగా నాలుగో రోజూ స్టాక్ మార్కెట్ పతనమైంది. గత 4 రోజుల్లో సెన్సెక్స్ 1,434 పాయింట్లు, నిఫ్టీ 402 పాయింట్ల మేర నష్టపోయాయి. ఈ నాలుగు రోజుల్లో రూ.5.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. నేడు(గురువారం) ఫిబ్రవరి సిరీ స్ డెరివేటివ్స్ ముగింపు, నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు కావడంతో సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఎకానమీకి ముప్పేు.. కోవిడ్ వైరస్, అమెరికా–ఈయూ వాణిజ్య యుద్ధం, గల్ఫ్ ఉద్రిక్తతలను ప్రస్తావించిన ఈఐయూ 2020లో వృద్ధి 2.9 శాతమని అంచనా న్యూఢిల్లీ: కోవిడ్–19 వైరస్, అమెరికా–యూరోపియన్ యూనియన్ వాణిజ్య యుద్ధం, అమెరికా–ఇరాన్ సంఘర్షణల నేపథ్యంలో తలెత్తుతున్న గల్ఫ్ ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పుగా తయారయ్యాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజం– ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విశ్లేషించింది. 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి రేటు కేవలం 2.9 శాతంగా అంచనావేసింది. ఇదే జరిగితే ఇది దశాబ్దపు కనిష్టస్థాయి అవుతుంది. ఈ మేరకు విడుదలైన ఒక శ్వేతపత్రంలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► 2020లో ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. అమెరికా వృద్ధి రేటు అంతంతమాత్రంగానే ఉంటుంది. కోవిడ్ వైరస్ సంక్షోభం చైనాను కుదేలు చేయడమే కాకుండా, ఆసియా వృద్ధి అవకాశాలను దెబ్బతీస్తోంది. ► 2020లో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 2020లోనూ ఇదే కొనసాగవచ్చు. ఇది ఇటు విధాన నిర్ణేతలకూ అటు వ్యాపారవేత్తలకూ సమస్యగా ఉంటుంది. ► పలు ఆర్థిక వ్యవస్థలు రుణ భారాలను ఎదుర్కొంటున్నాయి. కరోనా సమస్యలతో వాణిజ్యపరమైన సరఫరాల సమస్య తలెత్తవచ్చు. ‘కోవిడ్’ ప్రభావాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అనుకున్న సమయానికే బ్యాంకింగ్ విలీనం న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 (కరోనా) వైరస్ ప్రభావాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం ఇక్కడ ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. అనుకున్న సమయంలో ఇది పూర్తవుతుందనీ, ఈ విషయంలో ఎటువంటి అనిశ్చితీ లేదనీ వివరించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లను ఉద్ధేశించి ప్రసంగించారు. బ్యాంకర్లు తీసుకున్న వాణిజ్య నిర్ణయాల్లో నిజాయితీ ఉంటే, ఆయా నిర్ణయాల అమల్లో కొన్ని వ్యాపార కారణాల వల్ల తప్పు జరిగినా, బ్యాంకర్లకు వేధింపులు ఉండబోవని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 10 బ్యాంకుల విలీన కీలక నిర్ణయాన్ని గత ఆగస్టులో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ మొత్తం పూర్తయితే, 2017లో 27 ఉన్న మొత్తం ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గుతుంది. 2017 ఏప్రిల్‌లో భారతీయ మహిళా బ్యాంకుసహా అయిదు అనుబంధ బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. కేంద్రం గతేడాది ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీన ప్రక్రియలో భాగంగా 10 బ్యాంకులను నాలుగింటిగా మార్చనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2020 ఏప్రిల్ 1 డెడ్‌లైన్‌గా కేంద్రం నిర్దేశించింది. అక్టోబర్–డిసెంబర్ మధ్య వృద్ధి 4.5 శాతమే: ఎస్బీఐ గత ఏడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు దాదాపు 4.5 శాతంగానే ఉంటుందని ఎస్బీఐ ఆర్థికవేత్తల నివేదిక అంచనావేసింది. 28వ తేదీ మూడవ త్రైమాసిక ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఈ నివేదిక వెలువడింది. కోవిడ్–19 ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని పేర్కొంది. చైనా నుంచి భారత్ వివిధ వస్తువులను దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2019–20లో భారత్ జీడీపీ దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. 2019–20లో వృద్ధి 4.7 శాతం ఉంటుందని ఎస్బీఐ ఎకనమిస్ట్ నివేదిక పేర్కొంది. -
12,200 దిగువకు నిఫ్టీ
జీడీపీ అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) తగ్గించడం, కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. చైనాలో కరోనా వైరస్ ప్రబలుతోందన్న ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం, డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 205 పాయింట్లు పతనమై 41,324 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 12,170 పాయింట్ల వద్ద ముగిశాయి. డిమాండ్ మందగమనం...: భారత జీడీపీ గత ఏడాదికి గాను 4.8 శాతమే ఉండగలదని ఐఎమ్ఎఫ్ వెల్లడించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ) రంగంలో ఒత్తిడి నెలకొన్నదని, గ్రామీణ ఆదాయ వృద్ధి బలహీనంగా ఉందని, అందుకనే వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నామని వివరించింది. ఇక ఇటీవల వెల్లడైన నిఫ్టీ సూచీలోని కొన్ని కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఏజీఆర్ బకాయిల చెల్లింపునకు సంబంధించి టెలికం కంపెనీల తాజా విన్నపాలను వచ్చే వారం విచారించేందుకు సుప్రీం కోర్ట్ అంగీకరించడంతో టెలికం షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈలో ఐడియా షేర్ 21 శాతం లాభంతో రూ.5.92 వద్ద స్థిరపడింది. భారతీ ఎయిర్టెల్ షేర్ 0.4 శాతం లాభంతో రూ.511 వద్ద ముగిసింది. -
లాభాల స్వీకరణతో మార్కెట్ వెనక్కి..
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపినా, బలహీన అంతర్జాతీయ సంకేతాలు గురువారం స్టాక్ మార్కెట్‌ను పడగొట్టాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై ప్రతిష్టంభన కొనసాగుతుండటం, రెండు రోజుల లాభాల నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 93 పాయింట్ల లాభపడినప్పటికీ సెన్సెక్స్ చివరకు 76 పాయింట్ల నష్టంతో 40,575 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 31 పాయింట్లు పతనమై 11,968 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ స్పల్పంగా పుంజుకున్నా, మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. అమెరికా–చైనా ఒప్పందం హుళక్కి ! ఐదు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతే కాకుండా రెండేళ్ల వరకూ స్పెక్ట్రమ్ చార్జీలు వసూలు చేయబోమంటూ టెలికం కంపెనీలకు ఊరటనిచ్చింది. ఈ అంశాలు ఆరంభంలో ఒకింత సానుకూల ప్రభావం చూపించాయి. అయితే హాంగ్‌కాంగ్ నిరసనకారులకు మద్దతుగా రెండు బిల్లులను అమెరికా ఆమోదించింది. అంతేకాకుండా మానవ హక్కుల విషయమై చైనాకు హెచ్చరిక జారీ చేసింది. దీంతో అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో మరింత అనిశ్చితి నెలకొన్నది. ఈ ఏడాది ఒప్పందం కుదిరే అవకాశాల్లేవంటూ వార్తలు వచ్చాయి. ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా నష్టపోయింది. 211 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... లాభాల్లోనే మొదలైన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఎన్ఎస్ఈ వీక్లీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో స్టాక్ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. ఒక దశలో 93 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 118 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 211 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక మార్కెట్ దృష్టి వచ్చే వారం వెలువడే క్యూ2 జీడీపీ గణాంకాలపై ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ► టాటా స్టీల్ షేర్ 3.5 శాతం నష్టంతో రూ.385 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► రుణ భారం తగ్గించుకునే నిమిత్తం జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో 16.5 శాతం వాటాను విక్రయించనున్నామని ఎస్సెల్ గ్రూప్ బుధవారం వెల్లడించింది. దీంతో గురువారం జీ ఎంటర్టైన్మెంట్ షేర్ 12 శాతం లాభంతో రూ.345 వద్ద ముగిసింది. ► స్పెక్ట్రమ్ చార్జీల చెల్లింపులను రెండేళ్లపాటు వాయిదా వేయడంతో టెలికం షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఇటీవల వరకూ లాభపడిన ఎయిర్టెల్, ఐడియా షేర్లు నష్టపోయాయి. వొడాఫోన్ ఐడియా షేర్ 6 శాతం నష్టంతో రూ.6.64 వద్ద, భారతీ ఎయిర్టెల్ 2.5 శాతం నష్టంతో రూ.426 వద్ద ముగిశాయి. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినప్పటికీ, పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ, ఇంద్రప్రస్థ గ్యాస్, ఆవాస్ ఫైనాన్షియర్స్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, పాలీక్యాబ్ ఇండియా, ఆఫిల్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 1,131 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 6 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,205 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.1,131 కోట్లకు చేరిందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.31,915 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.37,425 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండ్అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.909 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 28 శాతం తగ్గి రూ.655 కోట్లకు తగ్గిందని, ఆదాయం మాత్రం రూ.18,262 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.22,760 కోట్లకు ఎగసిందని వివరించింది. రూ.3,712 కోట్ల పన్ను వ్యయాల కారణంగా లాభం తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.6,417 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.8,057 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 3.33 శాతం నుంచి 3.64 శాతానికి చేరిందని తెలిపింది. మెరుగుపడిన రుణ నాణ్యత... నికర లాభం తగ్గినా, ఈ బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ2లో 8.54 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 6.37 శాతానికి అలాగే నికర మొండి బకాయిలు 3.65 శాతం నుంచి 1.60 శాతానికి తగ్గాయని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు కూడా తగ్గాయి. మొత్తం కేటాయింపులు రూ.3,994 కోట్ల నుంచి రూ.2,506 కోట్లకు తగ్గాయి. ఆల్‌టైమ్ హైకి ఐసీఐసీఐ బ్యాంక్... నికర వడ్డీ ఆదాయం, నికర వడ్డీ మార్జిన్లు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించడంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ఆదివారం జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌లో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.473ను తాకింది. చివరకు స్వల్ప నష్టంతో రూ.469 వద్ద ముగిసింది. -
ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6 శాతమే: ప్రపంచ బ్యాంక్
వాషింగ్టన్: భారత జీడీపీ వృద్ధి రేటు 2019–20 ఆర్థిక సంవత్సరానికి 6 శాతంగానే నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతేడాది నమోదైన 6.8 శాతంతో పోలిస్తే గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. అయినప్పటికీ భారత్ ఇప్పటికే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉందని వ్యాఖ్యానించింది. 2021లో 6.9 శాతం, 2021లో 7.2 శాతానికి భారత వృద్ధి రేటు పుంజుకుంటుందని తన తాజా నివేదికలో అంచనా వేసింది. 2018–19లో 6.8 శాతం, 2017–18లో 7.2 శాతంగా జీడీపీ వృద్ధి రేటు నమోదైన విషయం గమనార్హం. ‘ఇటీవల మందగమనం చోటు చేసుకున్నా కానీ.. ఎంతో సామర్థ్యంతో భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉంది. ప్రపంచంలో ఎన్నో దేశాల కంటే భారత వృద్ధి రేటు అధికం.’ అని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ తెలిపారు. -
జీడీపీలో 7కు తగ్గిన భారత్ ర్యాంక్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల్లో భారత్ ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి దిగజారింది. 2018లో జీడీపీ పరంగా 2.72 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో బ్రిటన్, ఫ్రాన్స్‌ల తర్వాత స్థానానికి వెళ్లింది. టాప్ 6 దేశాల్లో... అమెరికా (20.5 ట్రిలియన్ డాలర్లు), చైనా (13.6 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.9 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (3.9 ట్రిలియన్ డాలర్లు), బ్రిటన్ (2.82 ట్రిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (2.77 ట్రిలియన్ డాలర్లు) భారత్ కంటే ముందున్నాయి. 2024 నాటికి జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. 2017లో భారత్ ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. స్వల్ప తేడాతో బ్రిటన్ను కూడా దాటేసింది. 2017లో భారత జీడీపీ 2.65 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే, బ్రిటన్ జీడీపీ 2.64 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ జీడీపీ 2.59 ట్రిలియన్ డాలర్లకే పరిమితం కాగా, తిరిగి 2018లో భారత్‌ను దాటి ఈ రెండు దేశాలు ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ ఐదేళ్ల కనిష్ట స్థాయికి( 5.8%) పడిపోవడం గమనార్హం. 2018–19 సంవత్సరానికి కూడా జీడీపీ 6.8%కి క్షీణించింది. కరెన్సీ విలువల్లో హెచ్చుతగ్గులు, జీడీపీ వృద్ధి నిదానించడం అంతర్జాతీయ జీడీపీ ర్యాంకుల్లో భారత్ కిందకు రావడానికి కారణాలుగా ఈఅండ్‌వై ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. ఎగుమతులు తగ్గడం, డిమాండ్ పడిపోవడం వంటి పరిస్థితులను గుర్తు చేశారు. వృద్ధి తిరిగి గాడిన పడాలంటే ద్రవ్య ప్రోత్సాహకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. -
నష్టాల బాటలో స్టాక్ మార్కెట్లు
ముంబై : గ్లోబల్ స్లోడౌన్‌పై అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల బాట పట్టాయి. ఆర్థిక మందగమనం భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. వడ్డీ రేట్లను భవిష్యత్‌లో తగ్గించబోమనే ఫెడ్ సంకేతాలూ ఆందోళన రేకెత్తించాయి. పలు రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్లు కోల్పోయి 37,267 పాయిట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయి 11,054 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. వేదాంత, హెచ్డీఎఫ్సీ, యస్ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
బడ్జెట్.. ముంచెన్!
విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను పోటు మరింతగా పెరుగుతుందనే ఆందోళనతో సోమవారం మన స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 38,800 పాయింట్ల దిగువకు, నిఫ్టీ, 11,600 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఇంట్రాడేలో 907 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 793 పాయింట్ల నష్టంతో 38,721 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో 288 పాయింట్ల మేర క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 11,559 పాయింట్ల వద్దకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాది బాగా నష్టపోయింది ఈ రోజే. సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, 2016, ఏప్రిల్ తర్వాత ఈ సూచీలు అత్యధికంగా నష్టపోవడం ఇదే మొదటిసారి. ఆర్థిక, వాహన, చమురు షేర్లు బాగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అంచనాలు తల్లకిందులు... మందగమనంలో ఉన్న వినియోగ రంగానికి జోష్‌నివ్వడానికి కేంద్రం బడ్జెట్లో తాయిలాలు ఇవ్వగలదని అందరూ అంచనా వేశారని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ సునీల్ శర్మ పేర్కొన్నారు. ఈ అంచనాలన్నీ తల్లకిందులు కావడం, మరోవైపు రానున్న ఆర్థిక ఫలితాలు మరింత అధ్వానంగా ఉండబోతున్నాయన్న ఆందోళనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని వివరించారు. సెన్సెక్స్ భారీ నష్టాల్లో ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ ఎలాంటి ఊరటలేకపోగా, ఈ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. మరిన్ని విశేషాలు.. ► ఇటీవల ప్రతిరోజూ ఆల్‌టైమ్ హైలను తాకుతున్న బజాజ్ ఫైనాన్స్ షేర్ 8 శాతం నష్టంతో రూ.3,415 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► అమ్మకాలు తగ్గుతుండటంతో వాహన కంపెనీలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయన్న వార్తలు వాహన షేర్లను పడగొట్టాయి. హీరో మోటోకార్ప్ 5.3 శాతం, మారుతీ సుజుకీ 5.2 శాతం, టాటా మోటార్స్ 3.4 శాతం, బజాజ్ ఆటోలు 2 శాతం చొప్పున నష్టపోయాయి. ► ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఓఎన్జీసీ 5.4 శాతం, ఎల్ అండ్ టీ 4.3 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.85 శాతం చొప్పున కుదేలయ్యాయి. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ భారీగా పతనమైంది. భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు సంబంధించిన ఖాతాలో రూ.3,800 కోట్ల మోసం జరిగిందన్న విషయం వెలుగులోకి రావడంతో బీఎస్ఈలో పీఎన్బీ షేర్ 11 శాతం నష్టంతో రూ.72.80 వద్ద ముగిసింది. ► ఎల్ అండ్ టీ కంపెనీ ఇటీవలనే బలవంతంగా చేజిక్కించుకున్న మైండ్‌ట్రీ షేర్ 10 శాతం నష్టంతో రూ.774 వద్ద ముగిసింది. మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు కృష్ణకుమార్ నటరాజన్, ఎన్ఎస్. పార్థసార«థి, రోస్టో రావణన్‌లు తమ తమ డైరెక్టర్ల పదవులకు, కంపెనీ పదవులకు రాజీనామా చేయడం దీనికి కారణం. ► దాదాపు 300కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్; హీరో మోటోకార్ప్, ఈరోస్ మీడియా, ఎస్కార్ట్స్, సన్ టీవీ, కాక్స్ అండ్ కింగ్స్, గోవా కార్బన్, గ్రాఫైట్ ఇండియా తదితర షేర్లు ఈ పతన జాబితాలో ఉన్నాయి. ► ఎల్ అండ్ టీ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, బ్యాంక్ ఆఫ్ అమెరికా డౌన్‌గ్రేడ్ చేయడంతో ఎల్ అండ్ టీ షేర్ 4% నష్టంతో రూ.1,490 వద్ద ముగిసింది. ఎందుకు పడిందంటే... ఎఫ్‌పీఐలపై పన్ను సంపన్న వర్గాలపై మరింత పన్ను విధించాలన్న ప్రతిపాదన.. భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న 2,000కు పైగా విదేశీ ఫండ్స్‌పై తీవ్రంగానే ప్రభావం చూపగలదని నిపుణులంటున్నారు. ట్రస్ట్‌ల మార్గంలో భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న ఎఫ్‌పీఐలపై తాజా సర్‌చార్జీ భారం మరింతగా పెరుగుతుందని, ఫలితంగా పన్ను పరంగా భారత్‌కు ఉన్న ఆకర్షణ తొలగుతుందని, విదేశీ పెట్టుబడులు నీరసిస్తాయని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా ప్రతిపాదన కారణంగా విదేశీ ఇన్వెస్టర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ) భారం మరింతగా పెరుగుతుంది. ఈ పన్ను విషయమై త్వరలోనే వివరణ ఇస్తామని సీబీడీటీ చైర్మన్ పేర్కొనగా, ఇక ఎలాంటి వివరణ అవసరం లేదని, అంతా స్పష్టంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెగేసి చెప్పారు. దీంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బడ్జెట్ ప్రతిపాదనలు... లిస్టెడ్ కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో షేర్ల సప్లై పెరిగి లిక్విడిటీ ఆవిరైపోతుంది. ఐటీ, పీఎస్‌యూ షేర్లపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక ఎమ్ఎన్సీలు మన మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి ప్రయత్నాలు చేస్తాయి. ఇక సంపన్నులపై అధిక పన్నులు విధించడం, షేర్ల బైబ్యాక్‌పై 20 శాతం పన్ను తదితర ప్రతిపాదనలు కూడా మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావమే చూపుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం... అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతకు సిద్ధమవుతోంది. అయితే గత శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించాయి. ఆర్థిక వ్యవస్థ బానే ఉందన్న సంకేతాలు ఈ గణాంకాలు ఇవ్వడంతో ఫెడరల్ రిజర్వ్ రేట్లకోత విషయంలో పునరాలోచించే అవకాశాలున్నాయన్న అంచనాలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మోర్గాన్ స్టాన్లీ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లను డౌన్‌గ్రేడ్ చేయడమే కాకుండా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తన పెట్టుబడులను తగ్గించుకోవాలని(ఇది దాదాపు ఐదేళ్ల కనిష్ట స్థాయి) నిర్ణయించుకోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ కారణాలన్నింటి వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా షాంఘై సూచీ 2.5 శాతం, హాంగ్‌సెంగ్ సూచీ 1.5 శాతం, జపాన్ నికాయ్ సూచీ 1 శాతం, దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక యూరప్సూచీలు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. జూన్ క్వార్టర్ ఫలితాలు.. ఎలా ఉంటాయో ? వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉన్న నేపథ్యంలో నేటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. బ్యాంక్‌లు మినహా ఇతర రంగాల కంపెనీల ఆర్థిక ఫలితాల్లో పెద్దగా మెరుపులు ఉండకపోవచ్చని, అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న ఆందోళన నెలకొన్నది. 2 రోజులు..రూ. 5 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా సోమవారం ఇన్వెస్టర్ల సంపద రూ.3.39 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.3,39,193 కోట్లు ఆవిరై రూ.1,47,96,303 కోట్లకు పడిపోయింది. బడ్జెట్ రోజు సంపద నష్టాన్ని కూడా కలుపుకుంటే మొత్తం రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.5,61,773 కోట్లు హరించుకుపోయింది. ఎదురీదిన యస్ బ్యాంక్ అన్ని షేర్లు క్షీణించినా, యస్ బ్యాంక్ మాత్రం ఎదురీదింది. ఆరంభంలోనే ఐదేళ్ల కనిష్ట స్థాయి, రూ.85.70కు పడిపోయిన ఈ షేర్ తర్వాత పుంజుకొని 5.5 శాతం లాభంతో రూ.93 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులు భేషుగ్గా ఉన్నాయని యాజమాన్యం స్పష్టతనివ్వడంతో పాటు ఉన్నత స్థాయిల్లోని నిర్వహణ పదవులను భర్తీ చేయడం కూడా కలిసి వచ్చింది. సెన్సెక్స్‌లో ఈ షేర్‌తో పాటు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే లాభపడ్డాయి. మొత్తం మీద 31 సెన్సెక్స్ షేర్లలో 28 షేర్లు నష్టపోయాయి. -
స్విస్ ఖాతాల్లో సొమ్ము తగ్గింది!!
జ్యూరిక్/న్యూఢిల్లీ: స్విస్ ఖాతాల్లో భారతీయులు దాచుకునే నగదు పరిమాణం గణనీయంగా తగ్గుతోంది. 2018లో ఇది 955 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు (దాదాపు రూ. 6,757 కోట్లు) పడిపోయింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం తగ్గుదల కాగా, దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయి కూడా కావడం గమనార్హం. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అయితే, ఇలా దాచుకున్న డిపాజిట్లలో వివాదాస్పద నల్లధనం ఎంత? సక్రమమైన డిపాజిట్ల మొత్తమెంత? అనే వివరాలు ఇందులో లేవు. అలాగే, వివిధ దేశాల నుంచి వేర్వేరు సంస్థలు, వ్యక్తుల పేరిట భారతీయులు, ప్రవాస భారతీయులు చేసిన డిపాజిట్లకు సంబంధించిన వివరాలు కూడా ఈ డేటాలో లేవు. భారత్‌లోని స్విస్ బ్యాంకుల శాఖల్లో ఉన్న డిపాజిట్ల పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఎస్ఎన్బీ ఈ డేటా రూపొందించింది. స్విస్ ఖాతాల్లో బ్లాక్‌మనీ దాచుకునే నల్ల కుబేరులపై కేంద్రం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎస్ఎన్బీ గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకు ఖాతాల్లో విదేశీ ఖాతాదారుల సొమ్ము దాదాపు 4 శాతం క్షీణించి 1.4 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంకుల (దాదాపు రూ. 99 లక్షల కోట్లు) స్థాయికి తగ్గింది. -
10% తగ్గిన హెచ్1బీ వీసాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన వలస విధానం దెబ్బ హెచ్–1బీ వీసాల జారీపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. అత్యంత నైపుణ్యం కలిగిన భారత్, ఇతర విదేశీ ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగానికి వీలు కల్పించే ఈ వీసాల జారీ బాగా తగ్గిపోయింది. అంతకుమందు ఏడాదితో పోలిస్తే 2018 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం మేర తగ్గింది. అమెరికా పౌరసత్వ, వలస సర్వీసుల సంస్థ (యూఎస్సీఐఎస్) 2018లో కొత్త వీసాలు, రెన్యువల్స్ కలిపి మొత్తం 3,35,000 హెచ్1బీలపై ఆమోద ముద్ర వేసింది. 2017లో 3,73,400 వీసాలిచ్చారు. 2017లో ప్రతి 100 దరఖాస్తులకు 93 వీసాలు మంజూరైతే, 2018లో ప్రతి 100 దరఖాస్తులకు 85 వీసాలు మంజూరయ్యాయి. అమెరికాలో విదేశీ వర్కర్లు పని చెయ్యాలంటే హెచ్1బీ వీసా తప్పనిసరి. హెచ్1 బీ వీసా నిబం«ధనల్ని అతిక్రమించే సంస్థల చుట్టూ ట్రంప్ ఉచ్చు బిగించారు. అమెరికా పౌరులకు ఉద్యోగాలు నిరాకరించే ఐటీ కంపెనీలపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. అమెరికా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు చెల్లించేలా, వారికి ఆర్థిక భరోసా కల్పించేలా నిబంధనల్ని మార్చేశారు. దీంతో వీసాల సంఖ్య తగ్గిపోయింది. -
‘జెట్’లో జోక్యం చేసుకోం
న్యూఢిల్లీ: రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. సంస్థను గట్టెక్కించేందుకు డీల్స్ కుదర్చడంలో కేంద్రం పాత్రేమీ ఉండదని పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్లో నేరుగా వాటాదారులైన బ్యాంకులే.. కంపెనీ వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయని, ఈ నేపథ్యంలో తమ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని మంత్రి విలేకరులతో చెప్పారు. ‘ప్రభుత్వ శాఖ ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. రైల్వే విషయంలోనూ నేను ఇదే పాటించాను. జెట్‌కి సంబంధించినంతవరకూ అది బ్యాంకులు, మేనేజ్మెంట్కి మధ్య వ్యవహారం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, భద్రతాపరమైన అంశాలపై మాత్రం కచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. తన సంస్థ దివాలా తీస్తుంటే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. జెట్‌ను మాత్రం గట్టెక్కించడానికి ప్రయత్నిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయంటూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరు మాల్యా ఆరోపించిన నేపథ్యంలో సురేష్ ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్ ఎయిర్వేస్పై దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయింది. బ్యాంకుల షరతులకు ఒప్పుకున్నా: గోయల్ జెట్ ఎయిర్వేస్కి తక్షణం నిధుల సహాయం అందించేందుకు బ్యాంకులు విధించిన షరతులన్నింటికీ తాను అంగీకరించినట్లు సంస్థ ప్రమోటరు, మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వెల్లడించారు. జెట్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రుణపరిష్కార ప్రణాళిక అమలు కోసం పూర్తి సహకారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రణాళిక కింద సంస్థ యాజమాన్య అధికారాలను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకోవడంతో పాటు రూ. 1,500 కోట్ల నిధులివ్వనున్నాయి. ఎగురుతున్నది 28 విమానాలే.. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ కేవలం 28 విమానాలే నడుపుతోందని, ఇందులో 15 విమానాలు దేశీ రూట్లలో తిరుగుతున్నాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. ముందుగా జెట్ 15 కన్నా తక్కువ సంఖ్యలో విమానాలే నడుపుతోందంటూ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పిన ఖరోలా.. ఆ తర్వాత తాజా వివరణనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విదేశీ రూట్లకు సర్వీసులు నడిపే విషయంలో జెట్ సామర్ధ్యాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఒకప్పుడు దాదాపు 119 విమానాలతో సర్వీసులు నడిపిన జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం లీజులు కట్టలేక, ఇతర కారణాలతో పలు విమానాలను నిలిపివేసింది. మార్చి జీతాలు వాయిదా .. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులకు మార్చి నెలకు జరపాల్సిన జీతాల చెల్లింపులను జెట్ వాయిదా వేసింది. సంక్లిష్టమైన అంశాల వల్ల రుణ పరిష్కార ప్రణాళిక ఖరారుకు మరింత సమయం పట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు పంపిన లేఖలో చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా తెలిపారు. చెల్లింపులు ఎప్పటికిల్లా జరుగుతాయన్నది చెప్పకపోయినప్పటికీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఏప్రిల్ 9న మరోసారి అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. జెట్‌లో 16,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. షేరు 5 శాతం డౌన్.. విమానాల అద్దెలు చెల్లించలేకపోవడంతో మరో 15 విమానాలను పక్కన పెట్టినట్లు జెట్ ఎయిర్వేస్ వెల్లడించడంతో బుధవారం సంస్థ షేరు 5 శాతం పైగా క్షీణించింది. బీఎస్ఈలో సంస్థ షేరు 5.21 శాతం నష్టంతో రూ. 251.10 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 6.37 శాతం క్షీణించి రూ. 248కి కూడా తగ్గింది. -
రెండోరోజూ... రూపాయి పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజూ కిందకు జారింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 42 పైసలు తగ్గి, 69.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పటిష్టత దీనికి నేపథ్యం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనితో వడ్డీరేట్లు తగ్గిస్తూ, సరళతర ఆర్థిక విధానాలవైపు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఆసియా దేశాల కరెన్సీలూ ఒత్తిడికి గురవుతున్నాయి. ట్రేడింగ్‌లో 69.04 వద్ద ప్రారంభమైన రూపాయి ఒక దశలో 69.35నూ తాకింది. బుధవారం రూపాయి 2 పైసల నష్టంతో రూ.68.88 వద్ద ముగిసింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా 2 నెలల క్రితం గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్లు పడిపోవడంతో రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ తాజా కనిష్ట స్థాయిల నుంచి 13 డాలర్లకుపైగా పెరగడంతో ఆతర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. 2 నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమయ్యింది. తాజాగా 68.50 స్థాయిని చూసింది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
5.5% తగ్గిన బంగారం దిగుమతులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 11 నెలల కాలంలో బంగారం దిగుమతులు 5.5 శాతం తగ్గాయి. విలువ పరంగా చూస్తే 29.5 బిలియన్ డాలర్ల మేర బంగారం దిగుమతి అయింది. తద్వారా కరెంటు ఖాతా లోటుపై బంగారం భారం తగ్గిపోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల కాలంలో బంగారం దిగుమతులు 31.2 బిలియన్ డాలర్ల మేర ఉండడం గమనార్హం. ఈ వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. అయితే, బంగారం దిగుమతుల విలువ తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గడమే కారణమని ట్రేడర్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో బంగారం దిగుమతుల విలువ ప్రతికూలంగా ఉండగా, జనవరిలో మాత్రం 38.16 శాతం పెరిగి 2.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కానీ, ఫిబ్రవరిలో తిరిగి 10.8 శాతం క్షీణించి దిగుమతులు 2.58 బిలియన్ డాలర్లకు పరిమితయ్యాయి. బంగారాన్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. ముఖ్యంగా ఆభరణాల కోసమే మనదగ్గర ఎక్కువ కొనుగోళ్లు జరుగుతుంటాయి. జెమ్స్, జ్యుయలరీ ఎగుమతుల్లో క్షీణత ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో జెమ్స్, జ్యూయలరీ ఎగుమతులు 6.3 శాతం తగ్గి 28.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు (ఎగుమతులు, దిగుమతుల విలువ మధ్య అంతరం) జీడీపీలో 2.9 శాతానికి పెరిగిన విషయం గమనార్హం. 2017–18లో బంగారం దిగుమతులు 22.43 శాతం పెరిగి 955.16 టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 780 టన్నులుగా ఉండడం గమనార్హం. బంగారం దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలను కూడా అమల్లోకి తెచ్చింది. -
10,900 పాయింట్ల పైకి నిఫ్టీ
అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, షేర్ల వారీ కదలికల కారణంగా గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,900 పాయింట్లపైకి ఎగబాకింది. 15 పాయింట్లు పెరిగి 10,905 పాయింట్లకు చేరింది. 300 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 53 పాయింట్ల లాభంతో 36,374 పాయింట్ల వద్ద ముగిసింది. మరో మూడు వారాల్లో మధ్యంతర బడ్జెట్ రానుండటం, కీలక కంపెనీల క్యూ3 ఫలితాల నేపథ్యంలో అనిశ్చితి నెలకొనడంతో స్టాక్ సూచీలు లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. ఇటీవల పుంజుకున్న ముడి చమురు ధరలు 1% మేర పతనం కావడం, గత ఐదు రోజులుగా పతనమవుతున్న రూపాయి పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు నష్టపోగా, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ, వాహన షేర్లు లాభపడ్డాయి. 297 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ లాభాల్లోనే కొనసాగింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతులో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఒక దశలో 147 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరొక దశలో 150 పాయింట్లవ వరకూ పతనమైంది. మొత్తం మీద రోజంతా 297 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కొరియా సూచీ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ► క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో యాక్సిస్ బ్యాంక్ షేర్ లాభపడింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.679ను తాకిన ఈ షేర్ చివరకు 2 శాతం లాభంతో రూ.676 వద్ద ముగిసింది. గత రెండు వారాల్లో ఈ షేర్ 12 శాతం పెరిగింది. ► సన్ ఫార్మా షేర్ 5.7% నష్టపోయి రూ.427 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్ షేర్లు చెరో 1 శాతం నష్టపోయాయి. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ రెండు కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. -
తీవ్ర ఒడిదుడుకులు
తీవ్ర హెచ్చుతగ్గుల్లో సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ అక్కడక్కడే ముగిసింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితిల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ట్రేడింగ్ మొత్తంలో 184 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 3 పాయింట్ల లాభంతో 36,321 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 3 పాయింట్లు పెరిగి 10,890 పాయింట్ల వద్దకు చేరింది. ఆరంభ లాభాలు ఆవిరి... చైనా కేంద్ర బ్యాంక్ బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా 8,300 కోట్ల డాలర్ల నిధులను గుమ్మరించనున్నదన్న వార్తల కారణంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. దీంతో సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. బ్రెగ్జిట్ బిల్లు వీగిపోవడంతో యూరప్ మార్కెట్లు మిశ్రమంగా మొదలయ్యాయి. దీంతో మన మార్కెట్లో ఆటు పోట్లు నెలకొన్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 144 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 40 పాయింట్ల వరకూ పతనమైంది. మొత్తం మీద రోజంతా 184 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్రిటన్‌లో అనిశ్చితి... యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ బిల్లు బ్రిటన్ పార్లమెంట్లో భారీ మెజారిటీతో వీగిపోయింది. దీంతో ఈ బిల్లును ప్రవేశపెట్టిన బ్రిటన్ ప్రధాని థెరిసా మేపై అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశముందని, ఎన్నికలు కూడా రావచ్చనే రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. లండన్ ఎఫ్టీఎస్ఈ 0.6 శాతం పతనం కాగా, ఇతర యూరప్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ల లిస్టింగ్ ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో క్యాపిటల్ ఫస్ట్ కంపెనీ విలీనం కారణంగా ఏర్పడిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. బీఎస్ఈలో ఈ షేర్ రూ.47 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 2.7 శాతం లాభంతో రూ.48 వద్ద ముగిసింది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.23,071 కోట్లుగా ఉంది. ఈ బ్యాంక్ రుణాలు రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 32 శాతంగా ఉన్నాయి. ► జెట్ ఎయిర్వేస్ కంపెనీ పునరుజ్జీవన ప్రణాళికపై అనిశ్చితి నెలకొనడంతో జెట్ ఎయిర్వేస్ షేర్లు నష్టపోయాయి. ఈ కంపెనీ భాగస్వామి ఎతిహాద్ జెట్ ఎయిర్వేస్లో మరింత వాటాను కొనుగోలు చేయనున్నదని, అయితే ఒక్కో షేర్‌ను రూ.150కు మాత్రమే ఆఫర్ ఇచ్చిందన్న వార్తల కారణంగా ఈ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ 8 శాతం తగ్గి రూ.271 వద్ద ముగిసింది. ► క్యూ3లో ఆర్థిక ఫలితాలు అదిరిపోవడంతో స్పెషాల్టీ రెస్టారెంట్ షేర్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.98 వద్ద ముగిసింది. -
పడేసిన పారిశ్రామిక గణాంకాలు
పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చైనా దిగుమతి, ఎగుమతి గణాంకాలు కూడా బలహీనంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమవడం, డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు ఒకింత తగ్గాయి. బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 36,000 పాయింట్ల దిగువకు, నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 10,750 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. స్టాక్ సూచీలు వరుసగా మూడవ ట్రేడింగ్ సెషన్లోనూ నష్టపోయాయి. సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 35,854 పాయింట్ల వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు పతనమై 10,738 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, లోహ, మౌలిక రంగ షేర్లు నష్టపోగా, ఫార్మా షేర్లు పెరిగాయి. ప్రపంచ మార్కెట్ల పతనం.... చైనా దిగుమతులు డిసెంబర్లో 7.6 శాతం, ఎగుమతులు 4.4 శాతం మేర తగ్గాయి. దీంతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో మందగమనం చోటు చేసుకుందని, ఇది ప్రపంచ ఆర్థిక మందగమనానికి దారితీస్తుందన్న ఆందోళన నెలకొన్నది. దీనికి తోడు 21 వ రోజూ అమెరికా షట్‌డౌన్ కొనసాగడం, బ్రెగ్జిట్‌పై యూకేలో నేడు (మంగళవారం) ఓటింగ్ జరగనుండడం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. జపాన్ మినహా ఇతర ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మన దగ్గర పారిశ్రామికోత్పత్తి 17 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, ఇప్పటివరకూ వెల్లడైన క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 43 పైసలు క్షీణించి నెల కనిష్టానికి చేరడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. 433 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనా, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 115 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 318 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 433 పాయింట్ల రేంజ్లో కదలాడింది. చివర్లో కొనుగోళ్ల దన్నుతో నష్టాలు రికవరీ అయ్యాయి. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 180 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల మేర రికవరీ అయ్యాయి. ► ఎమ్డీ, సీఈఓ పదవుల నుంచి ఈ నెల 31న వైదొలగనున్న రాణా కపూర్ వారసుడిగా రెండు పేర్లను యస్‌బ్యాంక్ షార్ట్ లిస్ట్ చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బ్రహ్మదత్ పేరు ఖరారు కావడం కూడా సానుకూల ప్రభావం చూపడంతో ఈ షేర్ 6.2 శాతం లాభంతో రూ.195 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ఇతర ఐటీ షేర్లు తగ్గినా... ఇన్ఫోసిస్ 2.5% లాభంతో రూ.701 వద్ద ముగిసింది. ఈ కంపెనీ క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నా, ఈ ఆర్థిక సంవత్సర ఆదాయ అంచనాలు బాగా ఉండటం, రూ.800 ధరకు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించడం, ఒక్కో షేర్‌కు రూ.4 ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించడం సానుకూల ప్రభావం చూపించాయి. -
35,540 దిగువన డౌన్‌ట్రెండ్
మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్డీఏ ఓటమిచెందడం, రిజర్వుబ్యాంక్ గవర్నర్ ఉర్జిత్పటేల్ రాజీనామా, ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వంటి పలు ప్రతికూలాంశాల నడుమ వరుసగా ఏడురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్ మార్కెట్...శుక్రవారం అంతర్జాతీయ ట్రెండ్‌కు తలొగ్గింది. అమెరికా మార్కెట్లయితే ఊపిరి పీల్చుకోకుండా పడుతున్నాయి. జపాన్‌లో సైతం ఇదే తంతు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ పరిమాణం రెట్టింపయ్యింది. అక్కడ ఇదే ట్రెండ్ కొనసాగితే ఇండియాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ తీవ్రమైన బేర్కక్ష్యలోకి మళ్లే ప్రమాదం వుంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ రెండోవారం నుంచి విదేశీ, స్వదేశీ ఫండ్స్ మన మార్కెట్లో తీసుకున్న భారీ లాంగ్ పొజిషన్లను జనవరికి రోలోవర్ చేస్తారా లేదా వారి పొజిషన్లను పూర్తిగా ఆఫ్‌లోడ్ చేస్తారా అనే అంశం ఇక్కడ కీలకం. సెన్సెక్స్ సాంకేతికాలు... డిసెంబర్ 21తో ముగిసిన వారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 35,800 మద్దతును పరిరక్షించుకుని వేగంగా 36,555 గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం భారీ పతనాన్ని చవిచూసి 35,695 కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 221 పాయింట్ల నష్టంతో 35,742 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 200 రోజుల చలనసగటు రేఖ (200 డీఎంఏ) కదులుతున్న 35,540 పాయింట్ల స్థాయి కీలకం. ఈ స్థాయి దిగువన సోమవారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ మొదలైతే వేగంగా 35,445 పాయింట్ల స్థాయికి పడిపోవొచ్చు. ఈ లోపున 50 డీఎంఏ రేఖ చలిస్తున్న 35,175 పాయింట్ల వరకూ సెన్సెక్స్‌కు సాంకేతిక మద్దతు ఏదీ లేదు. ఈ లోపున ముగిస్తే 34,420 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 36,050 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 36,200 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఆపైన ముగింపు..సెన్సెక్స్‌ను 36,480 పాయింట్ల స్థాయికి చేర్చవచ్చు. 10,765 దిగువన నిఫ్టీ బలహీనం గతవారం ప్రథమార్ధంలో 10,985 పాయింట్ల వరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో 10,738 పాయింట్ల స్థాయికి పతనమయ్యింది. చివరకు అంతక్రితంవారంకంటే 51 పాయింట్ల లాభంతో 10,754 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 200 డీఎంఏ రేఖ 10,765 పాయింట్ల వద్ద కదులుతున్నది. ఈ రేఖ ఎగువకు గత నెలరోజుల్లో రెండోదఫా నిఫ్టీ చేరినప్పటికీ, ఈ రెండు సందర్భాల్లో ఆపైన నిలదొక్కుకోలేకపోయింది. ఈ కీలక స్థాయి దిగువన నిఫ్టీ తిరిగి డౌన్‌ట్రెండ్‌లోకి జారుకునే ప్రమాదం వుంది. ఈ స్థాయి దిగువన సోమవారం నిఫ్టీ మొదలైతే వేగంగా 10,650 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున 50 డీఎంఏ రేఖ సంచరిస్తున్న 10,565 పాయింట్ల వద్దకు పతనం కావచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 10,330 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ 10,765 పాయింట్ల స్థాయి ఎగువన స్థిరపడితే 10,820 వరకూ పెరగవచ్చు. అటుపై 10,880 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఆపైన కీలక అవరోధస్థాయి 10,965 పాయింట్లు. -
దిగొచ్చిన ఉల్లి!
సాక్షి, సిటీబ్యూరో: కొన్ని నెలలుగా వినియోగదారులను కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధరలు బుధవారం భారీగా తగ్గుముఖం పట్టాయి. హోల్‌సేల్‌గా కిలో రూ.3, రిటైల్‌గా రూ.7 పలికాయి. ఈ ఏడాది ఇదే కనిష్ట ధర అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఉల్లి పంట నగరంలోని మలక్‌పేట్ మార్కెట్‌కు భారీగా దిగుమతి కావడంతో తక్కువ ధర పలికింది. దిగుమతుల పెరుగుదలే కారణం.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మలక్‌పేట్ మార్కెట్‌కు నిత్యం దాదాపు వెయ్యి టన్నుల ఉల్లి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం మలక్‌పేట్ హోల్‌సేల్ మార్కెట్‌కు తెలుగు రాష్ట్రాల్లోని మెదక్, తాండూరు, మహబూబ్‌నగర్, కర్నూలు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలనుంచి ఉల్లి దిగుమతులు పెరిగాయి. దీంతో హోల్‌సేల్‌గా కిలో ఉల్లి రూ.3కు చేరింది. వారం పది రోజుల క్రితం హోల్‌సేల్ మార్కెట్లో క్వింటా లు ఉల్లి రూ.800–1000 వరకు ఉండేది. దీం తో రిటైల్ మార్కెట్లో కిలో రూ.15– 20 పలి కింది. ప్రస్తుతం కొత్త పంట వస్తుండడంతో ధరలు భారీగా తగ్గాయి. ఫస్టు క్వాలిటీ ఉల్లి కిలోకు రూ.7 ఉండగా, మధ్య రకం క్వాలిటీ రూ.5గా ఉంది. దీంతో రిటైల్ మార్కెట్లో ఒకే సారి సాధారణ ఉల్లి ధరలు పడిపోయాయి. భారీగా కొత్త ఉల్లి.. తాండూరు, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డితో పాటు కర్ణా టక, మహారాష్ట్ర ల నుంచి ఎక్కువ మొత్తంలో కొత్త ఉల్లి దిగుమతి అవుతోంది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏజెంట్లు అక్రమాలకు పాల్పడితే రైతులు ఫిర్యాదు చేయాలి. అతిత్వరలో ట్రోల్ ఫ్రీ నంబర్ ప్రారంభిస్తున్నాం. – జె.అనంతయ్య, సెలక్షన్ గ్రేడ్–1కార్యదర్శి, హైదరాబాద్ మార్కెట్ సొసైటీ -
ఉల్లి మెల్లగా జారింది..!
గడచిన నాలుగు నెలలుగా కొండెక్కిన ఎర్రగడ్డ ఎట్టకేలకు కొండ దిగింది. సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. కిలో రూ.20 లోపు పలుకుతోంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి దిగుమతి పెరగడంతో ధరలు తగ్గి నట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో బాగా తగ్గి న కూరగాయల ధరలు మళ్లీ కాస్త పెరగడం గమనార్హం. తిరుపతి తుడా: ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎర్రగడ్డల సమస్య ఉత్పన్నమవుతుంది. 2016 చివర, 2017 జనవరిలో కిలో ఎర్రగడ్డల ధర రూ.100లు దాటింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి (2017 నవంబర్, డిసెంబర్, 2018 జనవరి) రూ.60లకే ఎర్రగడ్డలు లభించినా.. గడ్డల్లో నాణ్యత లోపించింది. పంటపై ప్రభావం అధికంగా ఉండటంతో ఈసారి ఫిబ్రవరి నెల వరకు ఎర్రగడ్డల ధర అధికంగానే ఉంది. ఎట్టకేలకు మన రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి ఉల్లిపాయల దిగుమతులు పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. కూరగాయల ధరలూ భారీగానే తగ్గినా, ఇటీవల కాస్త పైకెక్కి కూర్చున్నాయి. ఇందులో టమాట, బీట్రూట్, ఆకుకూర, వంకాయ, బీన్స్ ధరలు తక్కువగా ఉన్నాయి. ధరలు కొండెక్కడానికి ఇదీ కారణం.. నిరుడు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ముసురు పట్టుకుంది. ఫలితంగా మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో, మహారాష్ట్రలోనూ ఎర్రగడ్డ పంటలు బాగా దెబ్బతిన్నాయి. పంట దిగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎర్రగడ్డల ధరలు అమాంతం పెరిగాయి. కర్నూలు జిల్లాలో రబీలో సీజన్లో సాధారణంగా 20,764 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 13వేల హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేశారు. భారీ వర్షాలతో సుమారు 4 వేల హెక్టార్లలో పంట దిబ్బతింది. మహారాష్ట్రలో 38వేల హెక్టార్లకు గాను 27వేల హెక్టార్లలో మాత్రమే పంట వేశారు. ఇక్కడా సుమారు 10 వేల హెక్టార్లలో వర్షం కారణంగా పంట నాశనమైంది. దిగుబడులు తగ్గడంతో రైతుల వద్దే రూ.30 ధర పలికింది. మహారాష్ట్రలో రైతుల వద్దే రూ.35 పలకడం, ఇవి జిల్లాకు చేరి విక్రయానికి వచ్చేసరికి రూ.50, 60లు అయిందని దుకాణదారులు చెబుతున్నారు. కొత్త పంటతో దిగిన ధరలు.. నీటివనరులు పుష్కలంగా ఉండటంతో మహారాష్ట్రతో పాటు ఏపీలోని కర్నూలు, అనంతపురం, కడప జిలాల్లోనూ ఎర్రగడ్డల సాగు ఆశాజనకంగా సాగుతోంది. ఇప్పటికే కర్నూలు గడ్డలతోపాటు మహారాష్ట్ర గడ్డల దిగుమతులు పెరుగుతున్నాయి. రాబోవు రోజుల్లో మరింతగా పంట దిగుమతులు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దిగుమతులు పెరుగుతుండటంతో ఉల్లిపాయల ధరలు కిందికి జారుతున్నాయి. మార్కెట్లో కిలో ఎర్రగడ్డలు రూ.18– 20లు పలుకుతోంది. రైతుబజార్లో రూ.16లకే విక్రయిస్తున్నారు. పడిపోయిన టమాట.. గతేడాదితో పోలిస్తే అన్ని రకాల కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో సకాలంలో వర్షాలు పడటంతో పడమటి మండలాల్లో చెరువులు నిండుకుండల్లా మారాయి. బావుల్లోనూ పుష్కలంగా నీరు ఉండటంతో పడమటి మండలాల్లో కూరగాయల పంటల సాగు జోరందుకుంది. దీంతో టమాట ధరలు పూర్తి స్థాయిలో పడిపోయాయి. తిరుపతి మార్కెట్లో కిలో రూ.4– 5లకే దొరుకుతోంది. భారీగా తగ్గి.. కాస్త పెరిగిన కూరగాయలు.. జనవరి నెల్లో కిలో టమాట రూ.60, బీన్స్ రూ.70, బీట్రూట్ రూ.90, చిక్కుడు రూ.50, మునగ రూ.100.. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు రూ.50 పైమాటే. ప్రస్తుతం అన్ని రకాలు కూరగాయలు ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే టమాట మినహా, అన్ని కూరకాయల ధరలు ఫిబ్రవరి నెలతో పోలిస్తే కాస్త పెరిగాయి. -
'బంగారం'లాంటి చాన్స్..!
నరసాపురం : బంగారం ధరలు మళ్లీ నేల చూపులు చూస్తున్నాయి. చాలారోజుల తరువాత బంగారం ధరలు తగ్గుతున్నాయి. మూడు నెలల క్రితం రూ.30 వేలు మార్కు దాటిన బంగారం ధర తగ్గుతూ వస్తోంది. వెండిదీ అదే దారి. క్రిస్మస్, సంక్రాంతి పండగళ వేళ బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో బంగారం కొనుగోళ్లకు ఇదే అనువుగా జనం భావిస్తున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు జ్యూయలరీ షాపులకు క్యూ కడుతున్నారు. బంగారం దుకాణాలు కళకళలాడుతున్నాయి. అయితే ధరలు ఇంకా తగ్గొచ్చనే అంచనాలతో కొందరిలో ఇప్పుడే బంగారం కొనాలా? మరికొన్ని రోజులు ఆగాలా ? అనే సందిగ్ధం కూడా నెలకొని ఉంది. మరీ భారీగా ధరలు తగ్గవని, బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయమని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రూ.30 వేల దిగువకు బంగారం ధరలు చేరుకున్నాయి. కాసు రూ.21,760 సోమవారం నరసాపురం గోల్డ్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.29,110గా ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు రూ.27,220గా నమోదైంది. అంటే ఆభరణాల బంగారం కాసు (8 గ్రాములు) ధర రూ.21,760గా ట్రేడవుతోంది. గత రెండు, మూడు నెలలుగా కాస్త అటు, ఇటుగా ఇవే ధరలు ట్రేడవుతున్నాయి. అయితే గతవారం రోజుల నుంచి కాసు బంగారం ధరలో దాదాపు రూ.950 తగ్గుదల కనిపిస్తోంది. దీంతో కొన్ని నెలలుగా బంగారం వైపు చూడటానికి జంకిన పేద, మధ్య తరగతి వారు పండగవేళలు కూడా కావడంతో జ్యూయలరీ షాపుల మెట్లెక్కుతున్నారు. వెండి ధరల్లో అయితే ఒకరకంగా భారీ తగ్గుదల కనిపిస్తోంది. కిలో వెండి ధర రూ.36–37 వేల మధ్య ట్రేడవుతోంది. కిలో వెండి ధర దాదాపు 3 వేల వరకూ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు మరికాస్త తగ్గుతాయని భావిస్తున్నారు. ఒడిదుడుకుల నుంచి గాడిలోకి.. ఐదేళ్ల క్రితం వరకూ బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. 2013లో అయితే ఏకంగా 10 గ్రాముల బంగారం రూ. 34 వేలకు చేరి ఆల్‌టైమ్ హై నమోదు చేసుకుంది. బంగారం దిగుమతి సుంకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చైనా, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా దేశాలు భారీగా బంగారం నిల్వలను అమ్మకాలకు పెట్టడంతో అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ తగ్గి ధరలు దిగి వచ్చాయి. ఈ దశలో గత రెండేళ్ల నుంచి బంగారం ధరలు నిలకడగా ఉంటున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో ధరలు విపరీతంగా తగ్గుతాయని అంచనా కట్టారు. కానీ అలా జరగలేదు. ధరలు పెరగడంతో బులియన్ వ్యాపారం ఒడిదుడుకుల్లో సాగింది. కొనుగోలుదారుల్లో కూడా అయోమయం. ఎక్కువ ధరల్లో బంగారం కొన్న జిల్లావాసులు దారుణంగా నష్టపోయారు. ఇప్పుడూ అదేరకమైన అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. ధరల హెచ్చుతగ్గుల్లో స్వల్పమార్పులే ఉంటాయని బులియన్ వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. భారీగా పెరిగిన అమ్మకాలు ధరలు తగ్గడంతో జిల్లాలో రోజుకు రూ.2 కోట్ల వరకూ అమ్మకాలు పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఒక్క నరసాపురం మార్కెట్లోనే హోల్‌సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.3 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతాయి. జిల్లాలో ఇక్కడి నుంచి భారీగా హోల్‌సేల్ వ్యాపారం జరుగుతుంది. నరసాపురంతో పాటు ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్దెత్తున అమ్మకాలు జరుగుతాయి. ధరలు తగ్గడంతో జిల్లా మొత్తం మీద రోజుకు అదనంగా రూ.2 కోట్ల వరకు అమ్మకాలు పెరిగాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వరుస పండగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ముందు ఉండడంతో అమ్మకాలు మరింత పెరగవచ్చని అంచనా. మరోవైపు బంగారాన్ని అనువైన పెట్టుబడిగా భావించే ముదుపర్లు కూడా బిస్కెట్ కొనుగోళ్లపై దృష్టిపెడుతున్నట్టు నరసాపురం జ్యూయలరీ అసోసియేషన్ కార్యదర్శి వినోద్‌కుమార్‌జైన్ తెలిపారు. ఇప్పట్లో పెద్దగా ధరలు పెరగవు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితుల రీత్యా ధరలు పెరగవు. అలాగని ఇంకా భారీగా తగ్గే అవకాశాలు కనిపించడంలేదు. ప్రస్తుతం అమ్మకాలు బాగా పెరిగాయి. ధరలు ఇలాగే ఉంటే సంక్రాంతి నాటికి అమ్మకాలు మరింత పెరుగుతాయి. – అజిత్‌కుమార్ జైన్, జ్యూయలరీ వ్యాపారి -
కలగా.. కమల వికాసం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అన్నీ ఉన్నా... అల్లుని నోట్లో శని అనే సామెత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి అతికినట్లు సరిపోతుంది. కేంద్రంలో అధికారంలో ఉండీ, పార్టీకి అండగా కార్యకర్తల యంత్రాంగం ఉన్నా... ప్రజల్లోకి వెళ్లడంలో పార్టీ నాయకత్వం విఫలమవుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా శాసనసభ నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం లేక ఓటర్ల ముందుకు వెళ్లలేకపోయిన పార్టీ... ఇప్పటికైనా సెగ్మెంట్ల వారీగా ఎదిగేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేకపోతోంది. మాట్లాడితే టీఆర్‌ఎస్‌కుప్రత్యామ్నాయం అని చెప్పుకునే కమలనాథులు నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై గానీ, ప్రజల సమస్యలపై గానీ రోడ్లపైకి వచ్చిన సంఘటనలను వేళ్లమీద లెక్కించవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, పది అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉన్నప్పటికీ, నైరాశ్యంతో అడుగు ముందుకు పడడం లేదు. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను మంచిర్యాలలో నిర్వహిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయిలో పేరున్న నాయకులు హాజరయ్యే ఈ సమావేశాలతోనైనా స్థానిక నాయకత్వం నిద్ర లేస్తుందో లేదో వేచి చూడాలి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అదే తీరు.. ఆదిలాబాద్, మంచిర్యాల, ముథోల్, సిర్పూర్, నిర్మల్ నియోజకవర్గాల్లో బీజేపీ సానుభూతిపరులు ఎక్కువ. ఆయా ప్రాంతాల్లో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఉనికి చాటుకుంది కూడా. మున్సిపాలిటీల పరిధిలో కూడా పార్టీకి ఓటర్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే నిత్యం ప్రజల్లో ఉంటే తప్ప గుర్తింపు లభించని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నరేంద్రమోదీ హవానే వచ్చే ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందన్న ధీమాతో నాయకులు కదలడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ సైద్ధాంతిక విధానాలకు విరుద్ధంగా తీసుకునే మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అక్కడక్కడ ఆందోళనలు జరిగినా, ఇక్కడ పార్టీ ప్రకటనలతోనే సరిపుచ్చుకుంది. టీఆర్ఎస్ హామీలైన డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు భూ పంపిణీ, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు వంటి అంశాల్లో కూడా బీజేపీ ఉమ్మడి జిల్లాల నాయకత్వం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ప్రజా సమస్యలపై పోరాటాలతోనే ప్రజాభిమానం సాధ్యమవుతుందన్న విషయాన్ని జిల్లాల నాయకత్వం మరిచిపోవడంతో పార్టీ ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయింది. వలస నేతల పీఛేమూడ్! ఉత్తరప్రదేశ్ ఎన్నికల అనంతరం బీజేపీకి దేశవ్యాప్తంగా వచ్చిన ఊపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా కనిపించింది. పార్లమెంటరీ కస్టర్ల సమావేశాల పేరుతో ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాల్లో జరిపిన మీటింగ్‌లు కొత్త ఉత్సాహాన్ని తెస్తాయని భావించారు. అందులో భాగంగానే టీఆర్ఎస్కు చెందిన ఆసిఫాబాద్ జెడ్పీటీసీ ఏమాజీ అధికార పార్టీని కాదని బీజేపీలో చేరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి పోటీ చేసే లక్ష్యంతో బీజేపీలోకి ఆయన రాగా, జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సహా టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ జిల్లా నాయకత్వం గానీ, జిల్లా ఇన్చార్జిలు గానీ తగిన విధంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో రమేష్ రాథోడ్ అధికార టీఆర్ఎస్లో చేరగా, మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావుతో పాటు సిర్పూర్‌కు చెందిన రావి శ్రీనివాస్ వంటి నాయకులు రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యామ్నాయ శక్తి అనే భరోసా లేకనే... కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తి తామేననే భరోసా ఇవ్వడంలో బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో విఫలం కావడం ఉమ్మడి ఆదిలాబాద్‌ను కూడా ప్రభావితం చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల ముగిసిన సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ 24వేల ఓట్లకు పైగా సాధించగా, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీల ప్రత్యామ్నాయంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ కూటమి ఓడిపోయినా... 19 వేల ఓట్లు సాధించి సత్తా చాటాయి. అదే బీజేపీ అనుబంధ కార్మిక çసంఘం బీఎంఎస్ 250 ఓట్లు కూడా సాధించలేకపోయింది. ఈ విషయాన్ని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావిస్తూ బీజేపీని ఎద్దేవా చేయడం వంటిæ పరిణామాలు ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ కోల్పోయే పరిస్థితిని కల్పిస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే మంచిర్యాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు తండ్రి లక్ష్మణ్‌రావు పేరిట ప్రభుత్వ భూమిలో 57.04 ఎకరాల భూమి ఆన్‌లైన్‌లోకి ఎక్కడం, ఆ అంశాన్ని కాంగ్రెస్, కమ్యూనిస్టులు తమకు అనుకూలంగా మలుచుకున్న తీరులో కూడా బీజేపీ నాయకులు స్పందించకపోవడం పార్టీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి కలిగించింది. ఉన్న అవకాశాలను వినియోగించుకోకుండా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కలేనని వారు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల కేంద్రంగా జరుగుతున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. -
రొయ్యకు రాహుకాలం
భీమవరం/పాలకోడేరు/ఆకివీడు : రొయ్య రైతులకు రాహుకాలం దాపురించింది. ధరల పతనంతో రైతులు ఘొల్లుమంటున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం, వాతావరణ మార్పులతో రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ 70–80 కౌంట్ దశలోనే పట్టుబడులు పట్టి అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల పట్టుబడులు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితిని వ్యాపారులు అవకాశంగా తీసుకుని రొయ్యల ప్యాకింగ్‌కు ఐస్ దొరకడం లేదంటూ ధరలను దారుణంగా తగ్గించేశారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. డాలర్ల పంట డీలా జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో రొయ్యల పెంపకం సాగుతోంది. డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగుపై చేపల రైతులు సైతం మక్కువ చూపుతున్నారు. చేపల చెరువులను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. రొయ్యల సాగు పర్యావరణానికి ప్రమాదకరంగా మారిందని.. సాగునీటితోపాటు పర్యావరణం కలుషితమవుతున్నందున రొయ్యల చెరువుల్ని ధ్వంసం చేస్తామని రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. ఈ నిర్ణయంతో బెంబేలెత్తుతున్న రైతులు.. ఇదే దశలో ధరలు పతనం కావడంతో ఆందోళన చెందుతున్నారు. 15 రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకోవడంతో చెరువుల్లోని రొయ్యలు ఉన్నట్టుండి తేలిపోతున్నాయి. వాటిని రక్షించుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్లు, వివిధ రకాల మందుల్ని రైతులు వాడుతున్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరిగిపోతున్నాయే తప్ప రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలగటం లేదు. ఎకరం చెరువులో రొయ్యల పెంపకానికి రూ.3 లక్షల వరకు పెట్టుబడి అవుతోందని, వాతావరణ మార్పుల వల్ల 70నుంచి 80 కౌంట్ దశలోనే అవి చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. వ్యాపారుల సిండికేట్ ఐస్ కొరతను సాకుగా చూపించి రొయ్యల వ్యాపారులంతా సిండికేట్ అయి ధరలను దారుణంగా తగ్గించేశారని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ప్రధానంగా 22 రొయ్యల ప్లాంట్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా వందలాది కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయి. 15 రోజుల క్రితం 40 కౌంట్ రొయ్యల ధర రూ.430 ఉండగా.. ప్రస్తుతం రూ.330కు తగ్గించేశారు. ఇదేం దారుణమని రైతులు అడుగుతుంటే.. ఐస్ లేక ప్లాంట్లలోని రొయ్యలు కుళ్లిపోతున్నాయని, అందువల్ల కొనలేకపోతున్నామని చెబుతున్నారు. తాము అడిగిన ధరకు ఇస్తే తీసుకుంటామని, లేదంటే సరుకును తీసుకెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. దిక్కులేని స్థితిలో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. సాధారణంగా వేసవిలో ఐస్‌కు డిమాండ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఐస్ కొరత లేదు. ఐస్ ప్లాంట్ల నిర్వాహకులు రేయింబవళ్లు పనిచేస్తూ ఐస్ ఉత్పత్తి చేస్తున్నారు. నీటికొరత లేకుండా ముందుగానే చిన్నపాటి చెరువులు, కుంటలు తవ్వి మంచినీటిని నిల్వ చేసుకున్నారు. మరోవైపు బోర్ల నుంచి నీటిని కొనుగోలు చేసి మరీ తీసుకువెళ్లి ఐస్ తయారీకి వినియోగిస్తున్నారు. అయితే, ధరను మాత్రం కొంతమేర పెంచారు. ఆక్వా ప్లాంట్ల యాజమాన్యాలు మాత్రం ఐస్ దొరకడం లేదంటూ రైతులను నిలువునా దోచేస్తున్నారు. దరల్ని తగ్గించేశారు రొయ్యల ధర దారుణంగా పడిపోయింది. మేత, లీజు, విద్యుత్, ఆయిల్ ధరలు పెరిగిపోవడంతో రొయ్యల సాగుకు భారీ వ్యయమవుతోంది. వాతావరణం బాగుండకపోవడంతో కౌంటుకు రాని రొయ్యలను కూడా పట్టి అమ్మేయాల్సి వస్తోంది. ధరలను తగ్గించేయడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. – వి.రామరాజు, ఆకివీడు సిండికేట్‌గా మారి ముంచేస్తున్నారు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టి రొయ్యల సాగు చేస్తున్నాం. పంట చేతికొచ్చేసరికి కొనుగోలుదారులంతా సిండికేట్‌గా మారి అమాంతం ధరలను తగ్గించేస్తున్నారు. రైతులను నిలువునా ముంచేస్తున్నారు. ఇలాగైతే రొయ్యల సాగు చేయడం కష్టం. – మంతెన బాపిరాజు, పాలకోడేరు ప్రభుత్వం పట్టించుకోవాలి ఐస్ కొరత పేరుతో రొయ్యల ధరలను కిలోకు రూ.100 నుంచి రూ.130 వరకూ తగ్గించేస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా కావాలనే ధర తగ్గించారు. రొయ్యల ధరలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. రైతులు నష్టపోకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. – పెన్మెత్స శివరామరాజు, మోగల్లు అబ్బే.. సిండికేట్ కాలేదు మేం సిండికేట్ అవ్వలేదు. ఇతర రాష్ట్రాల్లోనూ రొయ్యలు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. దీనివల్ల ఇక్కడ ధర తగ్గింది. ఐస్ కొరత అధికంగా ఉన్నమాట వాస్తవం. ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. – పలయన్ అప్పన్, ఖాదర్ ఎక్స్‌పోర్ట్స్, గొల్లలకోడేరు -
తెల్లారితే శుభకార్యం.. ఇంతలో ప్రమాదం
జంగారెడ్డిగూడెం: తెల్లారితే ఆ ఇంట్లో శుభకార్యం జరుగనుంది. ఇంతలో కుటుంబ యజమాని ప్రమాదవశాత్తు డాబాపై నుంచి పడి మృతిచెందడంతో తీరని విషాదం నెలకొంది. పగలంతా తన కుమారుడు ఒడుగు నిమిత్తం ఏర్పాట్లలో నిమగ్నమై పనులన్నీ పూర్తిచేసి అలసటతో నిద్రించిన అతడు బుధవారం వేకువజామున మృత్యుఒడికి చేరుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెం 20వ వార్డు రాజీవ్‌నగర్‌లో సయ్యద్ అక్బర్ జానీ (31) పిట్టగోడ లేని డాబాపై నుంచి పడి మృతిచెందాడు. అక్బర్ జానీ ఏడేళ్ల కుమారుడు ఇలియాజ్‌కు బుధవారం ఒడుగు కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం బంధువులు, మిత్రులను పిలుచుకుని శుభకార్యం నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. మంగళవారం రాత్రి వంటకు సంబంధించిన టిప్‌టాప్ సామాన్లు తీసుకువచ్చి ఇంటి వద్ద ఉంచి పనులు పూర్తయిన తర్వాత డాబాపైకి వెళ్లి నిద్రించాడు. వేకువజామున పిట్టగోడ లేని డాబాపై నుంచి కింద ఉన్న ఇనుపపొయ్యి పైపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జానీ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.అక్బర్ జానీకి భార్య, కుమారుడు ఇలియాజ్, కుమార్తె రహీమా ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోవడంతో వీరంగా అనాథలుగా మిగిలారు. అక్బర్ జానీ కుటుంబాన్ని టీడీపీ నాయకులు షేక్‌ముస్తఫా, పెనుమర్తి రామ్‌కుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు, మందపల్లి లక్ష్మయ్య తదితరులు పరామర్శించారు. జానీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. -
రైతు కంట్లో కారం
– పడిపోయిన పచ్చి మిరప ధర – కర్నూలు మార్కెట్లో 10 కిలోల ధర కేవలం రూ.30 మాత్రమే – రవాణా చార్జీలు కూడా గిట్టని వైనం – గగ్గోలు పెడుతున్న రైతులు కర్నూలు (అగ్రికల్చర్): మొన్నటి వరకు వినయోగదారులను కన్నీళ్లు పెట్టించిన కూరగాయల ధరలు ప్రస్తుతం రైతులను ఏడుపిస్తున్నాయి. ఇప్పటికే ఉల్లి, టమాట ధరలు పడిపోయి రైతులు నష్టాలు మూటగట్టుకోగా.. అదే వరుసలో పచ్చిమిరప రైతు చేరాడు. మిరప ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సరిగ్గా నెల రోజులు క్రితం మిరప ధర సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు కొనలేనంతగా స్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో పంట లేదు. అక్కడక్కడ సాగు చేసిన రైతులు కొంత లాభ పడ్డారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగుచేసిన పంట మార్కెట్‌కు చేరుతున్న సమయంలో ధరలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లోని కూరగాయల మార్కెట్లో మిరప ధరలు నేలను తాకాయి. జిల్లాలో ఈ ఏడాది దాదాపు 18వేల హెక్టార్లలో మిరప సాగు చేశారు. కర్నూలు, కల్లూరు, ఆదోని, ఆలూరు, సి.బెళగల్, కోడుమూరు, ఆళ్లగడ్డ, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి, కష్ణగిరి, దేవనకొండ, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, శిరువెళ్ల, రుద్రవరం, గోస్పాడు తదితర మండలాల్లో మిరప అత్యధికంగా సాగు చేశారు. దిగుబడులు ఎక్కువగా రావడంతో మార్కెట్‌కు తరలివస్తోంది. దీంతో ఒక్క సారిగా డిమాండ్ పడిపోవడంతో ధరలు పడిపోయాయి. బుధవారం రాత్రి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డలోని కూరగాయల హోల్‌సేల్ మార్కెట్లో 10 కిలోల మిరప ధర రూ.30 మాత్రమే పలికింది. ఎపుడూ లేని విధంగా మిరప ధరలు పడిపోవడంతో రైతులకు కూలీ, రవాణా ఖర్చులు కూడ దక్కడం లేదు. 10 కిలోలకు లభించిన ధర అయిన చేతికి లభిస్తుందా అంటే అదికూడా లేదు. అన్లోడింగ్, ఏజెంటు కమీషన్ తదతర వాటికి క్వింటాలుకు రూ.15 వరకు కోత పడుతోంది. మిరప ధరలు ఇంత దారుణంగా పడిపోవడం రెండేళ్ల కాలంలో ఇదే మొదటి సారి. మిగిలిన కూరగాయలది అదే పరిస్థితి: టమాట, ఉల్లి రైతులు కొన్ని రోజులుగా కూలి, రవాణా ఖర్చులు గిట్టక నష్టపోతుంటే తాజాగా మిరప, ఇతర కూరగాయల ధరలు పడిపోవడంతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. మిరపతో పాటు బెండ, చెవుళ, బీర తదితర వాటికి ధరలు నేలచూపు చూస్తున్నాయి. జూన్‌లో విస్తారంగా వర్షాలు పడటంతో కూరగాయల పంటలు భారీగా సాగు చేశారు. అన్ని ప్రాంతాల్లో ఒకే సారి పంట మార్కెట్లోకి రావడంతో డిమాండ్ పడిపోయి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఖర్చులకు కూడా రాలేదు: మధు రైతు వెల్దుర్తి మండలం బోయినపల్లిలో ఒక ఎకరాలో మిరప సాగు చేశాను. పెట్టుబడి దాదాపు రూ. 60వేలు పెట్టాను. బుధవారం కర్నూలు మార్కెట్‌కు 13 సంచుల్లో మిరప తీసుకవచ్చాను. మిరపను తెంపడానికి ఆరుగురు కూలీలకు రూ. 600 ఖర్చు అయ్యింది. పొలం నుంచి మార్కెట్‌కు తీసుకరావడానికి బస్తాకు రూ.30 చెల్లించాల్సి వచ్చింది. మార్కెట్లో 10 కిలోలకు రూ.30 మాత్రమే ఇస్తున్నారు. ఇందులో కమీషన్ ఏజెంటుకు కమీషన్ అన్లోడింగ్ చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. వచ్చిన మొత్తం ఖర్చులకు కూడా సరిపోలేదు. ధరలు ఇంత అధ్వానంగా ఉంటే రైతులు ఎలా బాగుపడతారు. ప్రభుత్వం మిరప రైతులకు న్యాయం చేయాలి. -
రూపీ పతనంతో ఎన్నారైల సంబరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పుడు ఏ ఇద్దరు ఎన్నారై స్నేహితులు కలిసినా ఒక్క విషయంపైనే చర్చించుకుంటున్నారు.‘‘ఏరా ఇంటికి ఎంత పంపావనే?’’. అది అమెరికాలోనైనా, బ్రిటన్, ఒమన్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశమైనా వారి దృష్టంతా స్వదేశానికి సాధ్యమైనంత అధికంగా డబ్బు పంపుదామనే. దీనికంతటికీ కారణం రూపాయి విలువ అనూహ్యంగా క్షీణించడమే. ఎన్నడూ లేని విధంగా స్వల్ప కాలంలోనే డాలరుతో రూపాయి మారకం విలువ 15 శాతం క్షీణించడంతో ప్రవాస భారతీయుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. కేవలం డాలరుతోనే కాకుండా ఇతర దేశాల కరెన్సీలతో కూడా రూపాయి విలువ గణనీయంగా క్షీణించడంతో విదేశాల్లో నివసిస్తున్న 4 కోట్లమంది భారతీయులు స్వదేశానికి నగదు పంపేపనిలో ఉన్నారు. ముఖ్యంగా గత రెండు వారాల నుంచి ఎన్నారైలు పెద్ద మొత్తంలో ఇండియాకి నగదు పంపుతున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. నెల రోజుల క్రితం రోజుకు రూ.125 కోట్లు పంపితే ఇప్పుడా మొత్తం రూ.250 కోట్లు దాటిందని ఫెడరల్ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. వారం రోజులతో పోలిస్తే రెమిటెన్స్‌లు 20 శాతం పెరిగినట్లు హైదరాబాద్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అప్పు అయినా సరే... రూపాయి విలువ భారీగా క్షీణించడంతో ఇంతకాలం దాచుకున్న మొత్తాలను పంపడమే కాకుండా కొంతమంది మరో అడుగు ముందుకేసి అప్పులు తీసుకొని మరీ స్వదేశానికి పంపుతున్నారు. ఇప్పటికే రూపీ విలువ 15 శాతం క్షీణించడం, అలాగే డిపాజిట్లపై 9 శాతం వడ్డీ రావడంతో ఖర్చులు పోను 22 శాతం వరకు స్థిరమైన రాబడి వస్తోందని, దీంతో అప్పులు తీసుకోవడానికి వెనుకాడటం లేదని ఎన్నారైలు చెపుతున్నారు. నెల క్రితం 1,000 బెహ్రెయిన్ దినార్లు పంపితే రూ.1.30 లక్షలు వచ్చేవని, ఇప్పుడా మొత్తం రూ.1.62 లక్షలు దాటడంతో అప్పు తీసుకొని మరీ రెండు వేల దినార్లు పంపినట్లు ఒక ప్రవాస భారతీయుడు పేర్కొన్నారు. 2007లో డాలరు విలువ రూ.39గా ఉన్నప్పటి నుంచి రిటైర్మెంట్ కోసం దాచుకున్న మొత్తాన్ని మొన్న రూ.58కి వచ్చినప్పుడు స్వదేశానికి పంపేశానని, కాని ఇప్పుడు ఆ విలువ రూ.65 దాటడంతో ఇంకొంత కాలం ఆగి ఉండాల్సిందని బాధపడుతున్నట్లు అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేర్కొన్నాడు. రియల్టీలో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రవాస భారతీయుల విచారణల్లో 35 శాతం వృద్ధి కనిపిస్తున్నట్లు అసోచామ్ తాజా సర్వేలో వెల్లడయ్యింది. అలాగే ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరికొంతమంది స్వదేశంలో తీసుకున్న గృహరుణాలు వంటివాటిని ముందుగానే చెల్లించే యోచనలో ఉన్నారు. గల్ఫ్ దేశాల నుంచి... ప్రవాస భారతీయులు అత్యధికంగా ఉండే గల్ఫ్ దేశాల నుంచి ఈ మొత్తం మరింత అధికంగా ఉంది. గడచిన సంవత్సరం మొత్తం మీద యునెటైడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఈ) నుంచి 8 బిలియన్ డాలర్లు ఇండియాకి వస్తే ఈ ఆరు నెలల్లో ఈ మొత్తం దాటినట్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్స్‌లు అందుకునే భారత్‌కు గత సంవత్సరం 70 బిలియన్ డాలర్లు వచ్చినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో ఎన్నారైలు 549 కోట్ల డాలర్లు పంపినట్లు తెలుస్తోంది. దీంతో జూన్ నాటికి ఎన్నారై డిపాజిట్ల మొత్తం విలువ 7,107 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. చాలా సంవత్సరాలుగా నేను ఒమన్‌లో పనిచేస్తున్నా.. ఎప్పుడూ లేని విధంగా నెల క్రితం రియాల్ మారకం ధర రూ.155 చేరినప్పుడు అప్పు చేసి మరీ స్వదేశానికి పంపాను. కాని ఇప్పుడు దీని విలువ రూ.165 దాటింది.. మళ్ళీ అప్పు చేసి పంపాలని ఉన్నా ధైర్యం సరిపోవడం లేదు.. మరికొంత కాలం వేచి చూస్తాను. - జి.రామకృష్ణ, మెకానికల్ ఇంజనీర్, ఒమన్. నేను ఇండియాలో హౌసింగ్ లోన్ తీసుకున్నా. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నా.. దీనికి సంబంధించిన ఈఎంఐని ప్రతి నెలా నేను డాలర్ల రూపంలో పంపుతున్నా. ఎప్పుడూ పంపే విధంగానే పంపుతున్నా.. రూపీ పతనం వలన ప్రతి నెలా నా రుణ భారం రూ.10,000 అదనంగాా తగ్గుతోంది. రూపీ మరింత క్షీణిస్తే మరిన్ని డాలర్లు పంపడం ద్వారా రుణాన్ని తొందరగా తీర్చే ఆలోచనలో ఉన్నా. -సీహెచ్.లక్ష్మీ నారాయణ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాలిఫోర్నియా. పౌండ్ రూ.85 వద్ద ఉన్నప్పుడు పది సంవత్సరాల నుంచి దాచుకున్న మొత్తాన్ని ఇండియాకు పంపాను. కాని ఇప్పుడు పౌండ్ రూ.100 దాటింది.. ఈ ప్రయోజనం పొందుదామంటే... చేతిలో చిల్లి గవ్వలేదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. - డాక్టర్ పి.శ్రీనివాస్, లండన్.