న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) మైనస్ 7.7 శాతానికి క్షీణించొచ్చని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) అంచనా వేసింది. కీలకమైన తయారీ, సేవల రంగాలను కరోనా గట్టిగా దెబ్బతీసిన నేపథ్యంలో కేంద్రం ఈ అంచనాలకు రావడం గమనార్హం. సాగు, విద్యుత్తు, గ్యాస్ తదితర యుటిలిటీ రంగాల పనితీరును కాస్త ఊరటగా కేంద్రం భావిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2019–20)లో జీడీపీ 4.2 శాతం వృద్ధికి పరిమితమైన విషయం తెలిసిందే. ‘‘వాస్తవ జీడీపీ లేదా స్థిరమైన ధరల వద్ద (2011–12 నాటి) జీడీపీ అన్నది 2020–21లో రూ.134.40 లక్షల కోట్ల స్థాయిని చేరుకునే అవకాశం ఉంది. 2019–20 సంవత్సరానికి వేసిన తాత్కాలిక జీడీపీ అంచనా రూ.145.66 లక్షల కోట్లు. 2019–20లో వృద్ధి రేటు 4.2 శాతంగా ఉండగా, 2020–21లో వాస్తవ జీడీపీ మైనస్ 7.7 శాతంగా ఉంటుంది’’ అని ఎన్‌ఎస్‌వో తెలిపింది. స్థూల జోడించిన విలువ (జీవీఏ) అన్నది కనీస ధరల ప్రకారం 2019–20లో రూ.133 లక్షల కోట్లుగా ఉంటే, 2020–21లో రూ.123.39 లక్షల కోట్లకు క్షీణిస్తుందని (7.2 శాతం క్షీణత).. ఎన్‌ఎస్‌వో తెలిపింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థలు భారత జీడీపీ విషయంలో వేసిన అంచనాలతో పోలిస్తే ఎన్‌ఎస్‌వో అంచనాలు కాస్త మెరుగ్గానే ఉండడం గమనార్హం.
ఎన్‌ఎస్‌వో అంచనాలు
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం జీవీఏ 9.4 శాతం మేర క్షీణించొచ్చు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఫ్లాట్‌గా (0.03 శాతమే వృద్ధి) ఉంది.
► మైనింగ్, క్వారీయింగ్, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవల్లో ఎక్కువ క్షీణత ఉంటుంది. మైనింగ్, క్వారీయింగ్ జీవీఏ మైనస్ 12.4 శాతం, ఇతర రంగాల జీవీఏ మైనస్ 21.4 శాతం వరకు క్షీణించొచ్చు.
► అదే విధంగా నిర్మాణ రంగం కూడా మైనస్ 12.6 శాతానికి, ప్రజా పరిపాలన, రక్షణ, ఇతర సేవలు మైనస్ 3.7 శాతానికి, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నైపుణ్య సేవల్లో క్షీణత 0.8 శాతంగా ఉంటుంది.
► వ్యవసాయరంగం, ఫారెస్ట్రీ, మత్స్య రంగాల్లో వృద్ధి 3.4 శాతం నమోదు చేయవచ్చు. 2019–20లో ఇవే రంగాల్లో వృద్ధి 4 శాతంగా ఉంది.
► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల్లో 2.7 శాతం మేర వృద్ధి నమోదవుతుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 4.1 శాతంగా ఉంది.
► ప్రస్తుత ధరల ప్రకారం జాతీయ తలసరి నికర ఆదాయం రూ.1,26,968గా ఉంది. 2019–20లో ఉన్న రూ.1,34,226తో పోలిస్తే 5.4 శాతం తక్కువ.
స్థిరమైన వీ–షేప్ రికవరీని సూచిస్తున్నాయి
ఎన్‌ఎస్‌వో విడుదల చేసిన ఆర్థిక వృద్ధి అంచనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పునరుజ్జీవాన్ని సంతరించుకుంటున్నట్టు, లాక్‌డౌన్‌ల తర్వాత స్థిరమైన వీ–షేప్ రికవరీ (ఏ తీరులో పడిపోయిందో.. అదే తీరులో తిరిగి కోలుకోవడం)ని సూచిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
జీడీపీ 7.7% క్షీణత!
Published Fri, Jan 8 2021 5:51 AM | Last Updated on Fri, Jan 8 2021 5:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment