GDP rate
-
ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయ్...
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధాన సాధారణీకరణ, వినియోగ డిమాండ్ రూపంలో ఆర్థిక వ్యవస్థకు ఎన్నో సవాళ్లున్నట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా తెలిపింది. జీడీపీ 8.2 శాతం మేర వృద్ధి చెందొచ్చని, ఇంతకంటే తగ్గే రిస్క్‌లు కూడా ఉన్నట్టు పేర్కొంది. సాగు రంగం స్థిరంగా 4 శాతం మేర వృద్ధి సాధించడం, సేవల రంగం బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా తెలిపింది. స్థూల అదనపు విలువ (జీవీఏ) 2021–22లో 8.5 శాతం అంచనా నుంచి 2022–23లో 7 శాతానికి, జీడీపీ వృద్ధి 2021–22లో అంచనా 9.3 శాతం నుంచి 2022–23లో 8.2 శాతానికి తగ్గొచ్చని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది. త్రైమాసికం వారీగా వృద్ధిలో హెచ్చుతగ్గులు ఉంటాయని నివేదికలో వివరించింది. 2022–23 మొదటి క్వార్టర్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని, నాలుగో త్రైమాసికంలో వార్షికంగా చూస్తే తక్కువ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం వ్యవస్థలో లిక్విడిటీ ఎక్కువగా ఉండగా.. దీన్ని సాధారణీకరించే దిశగా, ద్రవ్యోల్బణం నియంత్రణ దిశగా ఆర్బీఐ తీసుకునే చర్యలు, వినియోగ డిమాండ్‌పై పడే ప్రభావం జీడీపీ వృద్ధి అంచనాలను మరింత కిందకు తీసుకెళ్లే అంశాలుగా తెలిపింది. వినియోగంపై వడ్డీ రేట్ల ప్రభావం.. ‘‘బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి 6 శాతంగా ఉంటే.. రిటైల్ రుణాలకు డిమాండ్ బలంగా 12 శాతం మేర ఉంది. మానిటరీ పాలసీ సాధారణీకరించినట్టయితే రుణ రేట్లు పెరగొచ్చు. ఇది వినియోగ డిమండ్‌ను దెబ్బతీస్తుంది’’ అని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా పేర్కొంది. బలహీన రుతుపవనాల రూపంలోనూ మరో రిస్క్ ఉన్నట్టు తెలిపింది. 2022–23 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. -
జీడీపీలో 56 శాతానికి బ్యాంకింగ్ రుణాలు
ముంబై: బ్యాంకుల రుణ వృద్ధి 59 ఏళ్ల కనిష్ట స్థాయి అయిన 5.56 శాతానికి 2020–21 సంవత్సరంలో పడిపోగా.. నాణేనికి మరోవైపు అన్నట్టు దేశ జీడీపీలో బ్యాంకుల రుణ నిష్పత్తి 56 శాతానికి చేరుకుంది. 2015లో నమోదైన 64.8 శాతం తర్వాత ఇదే గరిష్ట స్థాయి. అయినప్పటికీ పోటీ దేశాల కంటే, జీ20 దేశాల సగటు కంటే తక్కువగానే ఉండడాన్ని గమనించాలి. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ క్రెడిట్స్ (బీఐఎస్) గణాంకాలను పరిశీలిస్తే ఇది తెలుస్తోంది. మొత్తం మీద బ్యాంకుల రుణాలు 2020 నాటికి 1.52 లక్షల కోట్ల డాలర్లు (రూ.112 లక్షల కోట్లు) గా ఉన్నాయి. మన దేశ బ్యాంకుల రుణాలు–జీడీపీ నిష్పత్తి ఆసియా దేశాల్లో రెండో కనిష్ట స్థాయి కాగా.. వర్ధమాన దేశాలతో పోలిస్తే 135.5 శాతంగాను, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 88.7 శాతంగాను ఉన్నట్టు బీఐఎస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన వ్యాపారాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో హామీలేని రుణ పథకాలు సైతం ఉన్నాయి. అయినాకానీ బ్యాంకుల రుణ వృద్ధి 59 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి అన్నది ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని సూచిస్తుందని.. బ్యాంకుల రుణాలు జీడీపీలో 100 శాతంగా ఉండడం ఆదర్శనీయమైనదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్రిక్స్ దేశాలను గమనిస్తే.. బ్యాంకుల రుణాలు–జీడీపీ రేషియో చైనాలో 161.75 శాతం, రష్యాలో 88.12 శాతం, బ్రెజిల్లో 50.8 శాతం, దక్షిణాఫ్రికాలో 40.1 శాతం చొప్పున ఉంది. -
జీడీపీ 7.7% క్షీణత!
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) మైనస్ 7.7 శాతానికి క్షీణించొచ్చని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) అంచనా వేసింది. కీలకమైన తయారీ, సేవల రంగాలను కరోనా గట్టిగా దెబ్బతీసిన నేపథ్యంలో కేంద్రం ఈ అంచనాలకు రావడం గమనార్హం. సాగు, విద్యుత్తు, గ్యాస్ తదితర యుటిలిటీ రంగాల పనితీరును కాస్త ఊరటగా కేంద్రం భావిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2019–20)లో జీడీపీ 4.2 శాతం వృద్ధికి పరిమితమైన విషయం తెలిసిందే. ‘‘వాస్తవ జీడీపీ లేదా స్థిరమైన ధరల వద్ద (2011–12 నాటి) జీడీపీ అన్నది 2020–21లో రూ.134.40 లక్షల కోట్ల స్థాయిని చేరుకునే అవకాశం ఉంది. 2019–20 సంవత్సరానికి వేసిన తాత్కాలిక జీడీపీ అంచనా రూ.145.66 లక్షల కోట్లు. 2019–20లో వృద్ధి రేటు 4.2 శాతంగా ఉండగా, 2020–21లో వాస్తవ జీడీపీ మైనస్ 7.7 శాతంగా ఉంటుంది’’ అని ఎన్ఎస్వో తెలిపింది. స్థూల జోడించిన విలువ (జీవీఏ) అన్నది కనీస ధరల ప్రకారం 2019–20లో రూ.133 లక్షల కోట్లుగా ఉంటే, 2020–21లో రూ.123.39 లక్షల కోట్లకు క్షీణిస్తుందని (7.2 శాతం క్షీణత).. ఎన్ఎస్వో తెలిపింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థలు భారత జీడీపీ విషయంలో వేసిన అంచనాలతో పోలిస్తే ఎన్ఎస్వో అంచనాలు కాస్త మెరుగ్గానే ఉండడం గమనార్హం. ఎన్ఎస్వో అంచనాలు ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం జీవీఏ 9.4 శాతం మేర క్షీణించొచ్చు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఫ్లాట్‌గా (0.03 శాతమే వృద్ధి) ఉంది. ► మైనింగ్, క్వారీయింగ్, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవల్లో ఎక్కువ క్షీణత ఉంటుంది. మైనింగ్, క్వారీయింగ్ జీవీఏ మైనస్ 12.4 శాతం, ఇతర రంగాల జీవీఏ మైనస్ 21.4 శాతం వరకు క్షీణించొచ్చు. ► అదే విధంగా నిర్మాణ రంగం కూడా మైనస్ 12.6 శాతానికి, ప్రజా పరిపాలన, రక్షణ, ఇతర సేవలు మైనస్ 3.7 శాతానికి, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నైపుణ్య సేవల్లో క్షీణత 0.8 శాతంగా ఉంటుంది. ► వ్యవసాయరంగం, ఫారెస్ట్రీ, మత్స్య రంగాల్లో వృద్ధి 3.4 శాతం నమోదు చేయవచ్చు. 2019–20లో ఇవే రంగాల్లో వృద్ధి 4 శాతంగా ఉంది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల్లో 2.7 శాతం మేర వృద్ధి నమోదవుతుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 4.1 శాతంగా ఉంది. ► ప్రస్తుత ధరల ప్రకారం జాతీయ తలసరి నికర ఆదాయం రూ.1,26,968గా ఉంది. 2019–20లో ఉన్న రూ.1,34,226తో పోలిస్తే 5.4 శాతం తక్కువ. స్థిరమైన వీ–షేప్ రికవరీని సూచిస్తున్నాయి ఎన్ఎస్వో విడుదల చేసిన ఆర్థిక వృద్ధి అంచనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పునరుజ్జీవాన్ని సంతరించుకుంటున్నట్టు, లాక్డౌన్ల తర్వాత స్థిరమైన వీ–షేప్ రికవరీ (ఏ తీరులో పడిపోయిందో.. అదే తీరులో తిరిగి కోలుకోవడం)ని సూచిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఈ ఏడాది భారత జీడీపీ.. మైనస్ 15%
ముంబై: అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇటు భారత్ ఎకానమీపై కరోనా తీవ్ర ప్రతికూల ప్రభావం తప్పదని పలు అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆయా సంస్థల అంచనాల ప్రకారం భారత్ ఆర్థిక వ్యవస్థ 2020–21లో మైనస్ 10 శాతం క్షీణత నుంచి మైనస్ 15 శాతం క్షీణత శ్రేణిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు క్రితం క్షీణ అంచనాలను మరింత పెంచడం ఆందోళన కలిగిస్తున్న అంశం. కాగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ కొంత పుంజుకునే వీలుందన్న అంచనాలనూ కొన్ని సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇందుకు బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణంగా ఉండడం గమనార్హం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ 2020లో మైనస్ 4.4 శాతం క్షీణత నమోదుచేసుకుంటుందని అంచనా వేసిన రేటింగ్ దిగ్గజ సంస్థ ఫిచ్, చైనా మాత్రం 2.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని విశ్లేషిస్తుండడం గమనార్హం. ముఖ్యాంశాలు ఇవీ... 14.8 శాతం క్షీణత... అమెరికా బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్: భారత్ ఎకానమీ 2020–21 ఆర్థిక సంవత్సరంలో 14.8% వరకూ క్షీణత నమోదు చేసుకుంటుంది. తీవ్ర ప్రతికూలత నేపథ్యంలో క్రితం అంచనా మైనస్ 11.8 శాతాన్ని మరింత పెంచాల్సి వస్తోంది. ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థల్లో భారీగా నష్టపోతోంది భారతదేశమే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మొదటి త్రైమాసికంలో 23.9% క్షీణిస్తే, సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 13.7%గా ఉండవచ్చు. డిసెంబర్ త్రైమాసికంలో 9.8%, చివరి త్రైమాసికంలో 6.7% క్షీణరేట్లు నమోదయ్యే వీలుంది. ఒక్క 2020 క్యాలెండర్ ఇయర్లో క్షీణత 11.1%గా ఉంటే, 2020–21లో మైనస్ 14.8%గా ఉంటుంది. అయితే 2021–22లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే వీలుంది. బేస్ రేటు (2020–21లో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి) క్షీణతలో ఉండడం వల్ల 2021–22లో వృద్ధి రేటు 15.7% ఉండొచ్చు. కఠినమైన లాక్డౌన్ కారణం.. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం... ఫిచ్: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మైనస్ 5 శాతమే క్షీణిస్తుందని తొలి అంచనా. అయితే ఈ అంచనాను మరింతగా 10.5 శాతానికి పెంచుతున్నాం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా ఎక్కువగా మైనస్ 23.9 శాతంగా ఉండడం గమనార్హం. ప్రపంచంలోనే ఏ దేశం అనుసరించని రీతిలో భారత్ లాక్‌డౌన్‌ను పాటించింది. దీనితో పెట్టుబడులు, వినియోగం విభాగాలు తీవ్ర ప్రతికూలతలు చూశాయి. భారత్ ఆర్థిక వ్యవస్థ ఊహించి నదానికన్నా ఎక్కువగా పతనం అవుతున్న నేపథ్యంలో వర్ధ మాన దేశాల (చైనా కాకుండా) మార్కెట్ల క్షీణ అంచనాలను కూడా క్రితం మైనస్ 4.7% క్షీణత నుంచి మైనస్ 5.7%కి సవరిస్తున్నాం. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, 2020లో మైనస్ 4.4 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది. అయితే క్రితం అంచనా మైసన్ 4.6 శాతం క్షీణత కన్నా ఇది తక్కువ. కాగా చైనా మాత్రం 2.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం. ఇంతక్రితం వృద్ధి అంచనా 1.2%. ఇక అమెరికా క్షీణ రేటు అంచనాను మైనస్ 5.6% నుంచి మైనస్ 4.6 శాతానికి సవరిస్తున్నాం. తిరోగమనంలోనే...! ఎస్బీఐ ఎకోర్యాప్ పరిశోధనా నివేదిక: భారత 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో క్షీణ రేటు అంచనాలకు మైనస్ 6.8 శాతం నుంచి మైనస్ 10.9 శాతానికి పెంచుతున్నాం. మొదటి త్రైమాసిక జీడీపీ భారీగా మైనస్ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకోగా, రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) ఆర్థిక వ్యవస్థ మైనస్ 12 శాతం నుంచి మైనస్ 15 శాతం వరకూ క్షీణిస్తుంది. మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) ఈ పరిమాణం మైనస్ 5%–మైనస్ 10% వరకూ ఉంటుంది. నాల్గవ త్రైమాసికం (జనవరి–మార్చి)లో ఈ క్షీణ రేటు మైనస్ 2% నుంచి మైనస్ 5 శాతం వరకూ ఉంటుంది. అయితే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల విషయంలో రుణ వృద్ధి రేటు కనిపిస్తుండడం, కొన్ని కీలక రంగాల్లో క్షీణరేట్లు తగ్గుతుండడం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న సానుకూల అంశాలు. నష్టం రూ.18.44 లక్షల కోట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్: కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు అంచనాలను క్రితం మైనస్ 5.3% నుంచి మైనస్ 11.8%కి పెంచాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏ త్రైమాసికంలోనూ వృద్ధి నమోదయ్యే పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థకు 18.44 లక్షల కోట్ల నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బేస్ ఎఫెక్ట్ వల్ల 2021–22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 9.9 శాతం వృద్ధి బాటకు మళ్లే వీలుంది. లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంది. 1951 నుంచీ జీడీపీ గణాంకాలు అందుబాటులో ఉండగా, 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లో క్షీణ రేట్లు నమోదయ్యాయి. 1980లో మైనస్ 5.2 శాతం క్షీణత చవిచూసింది. -
ఆ ఆర్థిక అంచనాలు తప్పు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభన కారణంగా ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి జీడీపీ వృద్ధి రేటు మైనస్‌లోకి పడిపోగా, భారత దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడమే కాకుండా సానుకూలంగా పురోభివృద్ది సాధిస్తోందని భారతీయ జనతా పార్టీ ఇటీవల ఓ ట్వీట్ చేసింది. అందులో కరోనా సంక్షోభ పరిస్థితులను తట్టుకొని నిలబడడమే కాకుండా పురోభివృద్ధి సాధించిన దేశాలు ప్రపంచంలో రెండో రెండని, అందులో ఒకటి భారత్‌కాగా, మరోటి చైనా అంటూ ఓ గ్రాఫ్‌ను కూడా విడుదల చేసింది. అందులో భారత్ పురోభివృద్ధి జీడీపీ రేటును 1.9గా, చైనా వృద్ధి రేటును 1.2గా పేర్కొంది. ఇక అమెరికా వృద్ధి రేటు మైనస్ 5.9, జర్మనీ వృద్ధి రేటు మైనస్ 7 శాతం, ఫ్రాన్స్ మైనస్ 7.2 శాతమని, ఇటలీ వృద్ది రేటు మైనస్ 9.1గా పేర్కొంది. ఈ డేటాను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి సేకరించిందని, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ తన పేరును నిలబెట్టుకుంటోందని ఐఎంఎఫ్ అభివర్ణించినట్లుగా కూడా బీజేపీ తన ట్వీట్లో పేర్కొంది. బీజేపీ ట్వీట్‌ను పలు పార్టీ ఎంపీలు మనోజ్ రాజోరియా, సుభాశ్ భామ్రి, రాజేశ్ వర్మ, పరిశోత్తం సబారియా, నిత్యానంద్ రాయ్, అర్జున్ ముండా తదితరులు రీ ట్వీట్లు కూడా చేశారు. భారత్ సానుకూల అభివృద్ధిని సాధించిందని ఐఎంఎఫ్ పేర్కొందా? అతివేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు భారత ఆర్థిక పరిస్థితిని ఐఎంఎఫ్ అంచనా వేసిందా? లేదనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ బలాబలాలపై ఐఎంఎఫ్ ప్రతి ఏటా ఏప్రిల్–మే, సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో తన అంచనాలను విడుదల చేస్తుంది. గత ఏప్రిల్ నెలలో ఐఎంఎఫ్ విడుదల చేసిన అంచనాల్లో భారత్ 1.9 శాతం వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తర్వాత ఐఎంఎఫ్ తన అంచనాలను సవరిస్తూ జూన్ నెలలో ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ అపేడేట్’ పేరిట నివేదిక విడుదల చేసింది. దానిలో భారత్ వృద్ధి రేటును ‘మైనస్–4.5’గా అంచనా వేసింది. బీజీపీ సరిగ్గా ఇక్కడే తప్పులో కాలేసింది. సవరించిన అంచనాలను పరిగణలోకి తీసుకోకుండా అంతకు రెండు నెలల ముందు, అంటే భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం అంతగా లేనప్పుడు వేసిన అంచనాలను పరిగణలోకి తీసుకుంది. భారత ఆర్థిక వృద్ధి రేటు సవ్యంగానే ఉంటే జీఎస్టీలో రాష్ట్రాల వాటాను చెల్లించలేనంటూ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేతులు ఎత్తేస్తుంది ? చదవండి: చైనా కవ్వింపు చర్యలు.. బదులిచ్చిన భారత్ -
మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలతో దెబ్బతిన్న భారత ఎకానమీకి ఊతమిచ్చే విధంగా కేంద్రం మరో దఫా ఆర్థిక ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సోమవారం తెలిపింది. ఈ విడత ప్యాకేజీ పరిమాణం.. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) సుమారు 1 శాతం మేర ఉండవచ్చని అంచనా వేసింది. భారత సార్వభౌమ రేటింగ్ అవుట్‌లుక్ ను ఫిచ్ గతవారమే స్టేబుల్ (స్థిర) నుంచి నెగటివ్ (ప్రతికూల) స్థాయికి డౌన్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదనంగా ప్రకటించబోయే ఉద్దీపనలను కూడా పరిగణనలో తీసుకున్నట్లు ఫిచ్ డైరెక్టర్ (సావరీన్ రేటింగ్స్) థామస్ రూక్మాకర్ తెలిపారు. ‘భారత్ జీడీపీలో 10 శాతం స్థాయిలో ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో ద్రవ్యపరమైన చర్యలు .. జీడీపీలో 1 శాతం మేర ఉంటాయి. మిగతా 9 శాతం అంతా ద్రవ్యేతర చర్యలే. ఇవి కాకుండా బాండ్ల జారీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. వీటిని బట్టి చూస్తే కష్టకాలంలో ఉన్న వర్గాలకు మరికాస్త తోడ్పాటు అందించే దిశగా కేంద్రం ఇంకో విడతగా జీడీపీలో 1 శాతం స్థాయిలో మరో దఫా ఉద్దీపన చర్యలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకునే భారత రేటింగ్‌పై అంచనాలను ప్రకటించాం’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన రూ. 21 లక్షల ఆర్థిక ప్యాకేజీలో ప్రభుత్వపరమైన ఉద్దీపనతో పాటు ఆర్బీఐ ద్రవ్యపరంగా ప్రకటించిన చర్యలు కూడా ఉన్నాయి. 2020–21 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి సమీకరించే నిధుల లక్ష్యాన్ని రూ. 7.8 లక్షల కోట్ల నుంచి రూ. 12 లక్షల కోట్లకు పెంచింది. అంచనాల కన్నా తక్కువే వృద్ధి.. స్వల్పకాలికంగా భారత వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 6.5–7% కన్నా మరికాస్త తక్కువగానే ఉండవచ్చని రూక్మాకర్ తెలిపారు. ‘మధ్యకాలికంగా భారత వృద్ధి అంచనాలు ఊహించిన దానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చు. అయితే, ఎంత స్థాయిలో తగ్గవచ్చన్నది ఇప్పుడే చెప్పలేము. రుణాల చెల్లింపులపై విధించిన మారటోరియం ఎత్తివేశాక ఆర్థిక రంగ సంస్థల పరిస్థితి ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది’ అని చెప్పారు. రాబోయే రోజుల్లో వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు సంస్కరణలు ఊతం ఇవ్వనున్నప్పటికీ, వ్యాపార.. ఆర్థిక రంగాలపై కరోనా ప్రభావం మీద ఇది ఆధారపడి ఉంటుందన్నారు. -
జీడీపీలో 10% కాదు 1.6 శాతమే!: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని, జీడీపీలో 10% అని అబద్ధాలు చెబుతూ కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ప్యాకేజీ నికరంగా రూ. 3.22 లక్షల కోట్లు మాత్రమేనని, అది జీడీపీలో 1.6% మాత్రమేనని పేర్కొంది. ప్రధాని మోదీ అవాస్తవాలు చెప్పడం మాని తామేం చేయగలరో స్పష్టంగా చెప్పాలని ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ప్యాకేజీపై చర్చకు సిద్ధమా? అని ఆర్థికమంత్రికి ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం వైఫల్యం వల్లనే లక్షలాది వలస కూలీలు కాలి నడకన వందలాది కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు వెళ్లే విషాద పరిస్థితి నెలకొంది’అని ఆరోపించారు. నంబర్లాట: లెఫ్ట్: ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ నంబర్లతో ఆడుతున్న మోసపూరిత ఆటలా ఉందని వామపక్షాలు విమర్శించాయి. రుణ పరిమితిలో రాష్ట్రాలు 14% మాత్రమే వాడుకున్నాయంటూ రాష్ట్రాలను ఆర్థికమంత్రి నిర్మల అవహేళన చేశారని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను అమ్మేసి స్వయం సమృద్ధి సాధించాలనుకుంటున్నారా? అని సీపీఐ నేత రాజా ఆర్థికమంత్రిని ప్రశ్నించారు. -
ఎకానమీకి కరోనా షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ, హైదరాబాద్‌లో కరోనా కేసులు వెలుగుచూడటంతో ఆర్థిక వ్యవస్ధపై దీని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 0.20 శాతం మేరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మందగమనంతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలవగా కరోనా వైరస్ మరింత నష్టం వాటిల్లనుంది. భారత్‌లో ఎలక్ర్టానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాలు కరోనా వైరస్‌తో దెబ్బతింటాయని, ఫలితంగా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని యూబీఎస్ సెక్యూరిటీస్ నివేదిక స్పష్టం చేసింది. 2020 మార్చి క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు 0.20 శాతం తగ్గవచ్చని తాము అంచనా వేస్తున్నామని ఈ నివేదిక వెల్లడించింది. ఇక 2020-21లో భారత ఎకానమీ 5.6 శాతమే వృద్ధి సాధిస్తుందని, మరుసటి ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు కోలుకోవచ్చని యూబీఎస్ నివేదిక అంచనా వేసింది. చదవండి : తెలంగాణలో మరో వ్యక్తికి కరోనా వైరస్ -
ఇంకా.. ఇంకా.. ఏం కావాలంటే!
నానాటికీ పడిపోతున్న జీడీపీ వృద్ధి.. కొండలా పెరిగిపోతున్న ద్రవ్య లోటు.. లేదు లేదని సర్ది చెప్పుకుంటున్నా వెంటాడుతున్న మందగమన భయాలు.. 45 ఏళ్ల గరిష్టానికి ఎగిసిన నిరుద్యోగిత రేటు.. ఒకటా రెండా.. మోదీ 2.0 రెండో రౌండ్లో పరిస్థితి మామూలుగా లేదు. ఏం చేస్తే ఎకానమీ గట్టెక్కుతుందో పాలుపోని పరిస్థితిలో సర్కార్ కొట్టుమిట్టాడుతోంది. సంస్కరణలెన్ని ప్రవేశపెడుతున్నా.. స్టాక్ మార్కెట్లు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ల్లో పైకి ఎగబాకేందుకు ఉపయోగపడుతున్నాయే తప్ప.. క్షేత్ర స్థాయిలో ఎకానమీ దౌడు తీసేలా ఊతం లభిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అటు ఆర్థిక మంత్రి.. ఇటు ప్రధాని ఎడాపెడా పరిశ్రమవర్గాలతో సమావేశాలు జరుపుతున్నారు. 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్‌ను నిలబెడతామంటూ పదేపదే చెబుతున్న మోదీ సర్కారు అందుకు తగిన కార్యాచరణను ప్రకటిస్తుందా? ఈ చిక్కుముడులన్నింటికీ ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే 2020–21 బడ్జెట్ సమాధానమిస్తుందా? బడ్జెట్‌పై వివిధ వర్గాల ఆశలు.. డిమాండ్లు, సూచనలతో నేటి నుంచి ‘సాక్షి బిజినెస్’ కౌంట్‌డౌన్... సామాన్యులు.. వేతన జీవులు.. టీవీలు, ఫ్రిజ్‌లు, కార్లు మొదలైనవన్నీ కూడా తమ భవిష్యత్ ఆదాయ అంచనాల ప్రాతిపదికన, రుణాల మీద తీసుకునే వారే ఎక్కువగా ఉంటారు. అయితే, కొన్నాళ్లుగా మందగమనాన్ని సూచిస్తూ.. బిస్కెట్లు మొýlలుకుని కార్ల దాకా అనేక ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా తగ్గినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధికి చోదకాలైన వేతన జీవులు, మధ్యతరగతి వర్గాలపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పన్ను రేట్లను తగ్గించడం ద్వారా వారి చేతుల్లో మరికాస్త మిగిలించగలిగితే, వినియోగం పెరగడానికి ఊతం లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ ఆదాయ పన్ను రేటుకు రెట్టింపు స్థాయిలో వ్యక్తిగత ఆదాయ పన్ను రేటు గరిష్టంగా 43 శాతంగా ఉన్నందున.. రెండింటి మధ్య భారీ వ్యత్యాసాలను తగ్గించేందుకు సత్వర చర్యలు అవసరమన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. గ్రామీణ ఎకానమీ... పంటలకు మెరుగైన ధర కల్పించాలని, రుణాలు రద్దు చేయాలని గడిచిన రెండేళ్లుగా పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లో ఉన్నన్నాళ్లూ.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల ఆదాయాలు ఒకే స్థాయిలో స్థిరపడిపోయాయి. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మందగించడం వల్ల ఆ రంగంలో కూలీలు కూడా ప్రత్యామ్నాయంగా వ్యవసాయ రంగంవైపు మళ్లుతుండటంతో కూలీల సంఖ్య పెరిగిపోయి.. డిమాండ్ తగ్గిందన్నది నిపుణుల విశ్లేషణ. దీనితో సహజంగానే రేటూ తగ్గి, వారు ఇతరత్రా జరిపే వ్యయాలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయదారులు, కూలీల ఆదాయాలు మరింత మెరుగుపడే దిశగా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండాలని కోరుకుంటున్నారు. జీడీపీ నేలచూపులు.. డిమాండ్, తయారీ, పెట్టుబడులు.. అన్నీ మందగించిన నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నానాటికీ పడిపోతోంది. భారత్.. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీని పోగొట్టుకుంది. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో ఏకంగా ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5%కి క్షీణించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కనాకష్టంగా 5% ఉండొచ్చని అంచనా. ద్రవ్యలోటు..పోటు.. గత బడ్జెట్లో ద్రవ్య లోటును స్థూల దేశీయోత్పత్తిలో 3.3 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కానీ ఇది 3.7 శాతం నుంచి 4 శాతం దాకా ఉండొచ్చని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి గర్గ్ ఇటీవలే పేర్కొన్నారు. తగ్గిన ఆదాయాలు, బడ్జెట్‌యేతర వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది ఏకంగా 5.5 శాతం దాకా కూడా ఎగియొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. 2019–20లో రూ. 13 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల టార్గెట్ పెట్టుకుంటే నవంబర్ నాటికి కేవలం రూ. 5 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ. 5.26 లక్షల కోట్ల టార్గెట్ కాగా.. నవంబర్ ఆఖరు నాటికి వచ్చినది... రూ. 3.26 లక్షల కోట్లే. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సమీకరణ కూడా లక్ష్యంగా పెట్టుకున్న దానికన్నా 40% తగ్గొచ్చని అంచనా. ఎగుమతులు ..డీలా.. ఎగుమతులు వరుసగా నాలుగో నెలా నవంబర్‌లో క్షీణించాయి. 2018–19 ఏప్రిల్– నవంబర్ మధ్య ఎగుమతుల విలువ 216.23 బిలియన్ డాలర్లు కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం అదే వ్యవధిలో 211.93 బిలియన్ డాలర్లే. పెట్టుబడులకు ఊతం.. వ్యాపార సంస్థలు మరింతగా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదనలు ఉంటాయని అంచనా. ఉద్యోగాల కల్పనకు అత్యధికంగా అవకాశాలున్న రంగాల కంపెనీలకు పన్నుపరమైన మినహాయింపులు, ప్రోత్సాహకాలు కల్పించవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా నాలుగు అంశాల చుట్టూ ఈ బడ్జెట్ తిరగవచ్చని భావిస్తున్నారు. అవి.. ఉద్యోగాల కల్పన... ప్రతి నెలా దాదాపు 12 లక్షల పైచిలుకు యువ జనాభా.. జాబ్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. కానీ వారికి ఉద్యోగావకాశాలు కల్పించడమే కష్టతరంగా మారింది. మోదీ ప్రభుత్వ హయాంలో అత్యంత భారీ వైఫల్యం ఇది కూడానంటూ విపక్షాలు సమయం చిక్కినప్పుడల్లా దండెత్తుతున్నాయి. ఆటోమేషన్ వంటి టెక్నాలజీల కారణంగా కొన్ని రంగాల్లో ఉద్యోగాల్లో కోత పడుతుండగా.. మరికొన్ని రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఏయే రంగాల్లో అర్థవంతమైన రీతిలో ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశముందో ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మార్కెట్ అక్కడక్కడే
ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకున్నా మన మార్కెట్లో మాత్రం ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో జీడీపీ ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం, నవంబర్ నెల వాహన విక్రయాలు నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో వాహన, బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో ఆర్బీఐ పాలసీ విధానాన్ని ప్రకటించనుండటంతో పలువురు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 40,802 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8 పాయింట్లు తగ్గి 12,048 పాయింట్ల వద్ద ముగిశాయి. మొబైల్ చార్జీలు 40 శాతం మేర పెరగడంతో టెలికం కంపెనీల షేర్లు జోరుగా పెరిగాయి. -
పరిశ్రమలు.. రివర్స్‌గేర్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో తీవ్ర నిరాశకు గురిచేసింది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు అద్దం పట్టింది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం– 2019 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –4.3 శాతం క్షీణించింది. అంటే 2018 సెప్టెంబర్‌తో పోల్చిచూస్తే (అప్పట్లో 4.6 శాతం వృద్ధిరేటు) పారిశ్రామిక ఉత్పత్తి అసలు పెరక్కపోగా –4.3 శాతం క్షీణించిందన్నమాట. ఇంత తీవ్ర స్థాయి క్షీణత గడచిన ఎనిమిదేళ్లలో ఎన్నడూ నమోదుకాలేదు. 2011 అక్టోబర్‌లో ఐఐపీ 5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అటు తర్వాత ఇంత తీవ్ర ప్రతికూల గణాంకం రావడం ఇదే తొలిసారి. ఆగస్టులో కూడా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణతనే (–1.4 శాతం) నమోదుచేసుకోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో అంశం. భారీ యంత్రపరికరాల ఉత్పత్తిని సూచించే క్యాపిటల్ గూడ్స్, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి దీర్ఘకాలిక వినియోగ ఉత్పత్తులుసహా కీలకమైన తయారీ, మౌలికం, నిర్మాణం ఉత్పత్తుల్లోనూ సెప్టెంబర్‌లో ‘మైనస్’ ఫలితం వచ్చింది. గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► తయారీ: సూచీలో దాదాపు 60 శాతంపైగా వాటా కలిగిన తయారీ రంగం ఉత్పత్తిలో –3.9 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రంగంలో 4.8 శాతం వృద్ధి నెలకొంది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 17 క్షీణతను నమోదుచేసుకున్నాయి. మోటార్ వాహనాలు ప్రత్యేకించి భారీ, మధ్యస్థాయి వాహన ఉత్పత్తి విభాగంలో –24.8 శాతం క్షీణత నమోదయితే, –23.6 శాతం క్షీణతతో తరువాతి స్థానంలో ఫర్నిచర్ ఉంది. ► విద్యుత్: ఈ విభాగంలో 8.2 శాతం ఉత్పత్తి వృద్ధి రేటు –2.6 క్షీణతలోకి జారింది. ► మైనింగ్: గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ 0.1 శాతం వృద్ధి నమోదయ్యింది. 2019 సెప్టెంబర్‌లో వృద్ధిలేకపోగా –8.5 శాతం క్షీణత వచ్చింది. ► క్యాపిటల్ గూడ్స్: ఈ విభాగం ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా – 20.7 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 సెప్టెంబర్‌లో ఈ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 6.9 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఉత్పత్తి –9.9 శాతం క్షీణించింది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా – 0.4 శాతం క్షీణత రావడం గమనార్హం. ► మౌలిక, నిర్మాణ రంగ ఉత్పత్తుల్లో కూడా 6.4 శాతం క్షీణత నమోదయ్యింది. త్రైమాసికంగా –0.4 శాతం క్షీణత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో పారిశ్రామిక ఉత్పత్తి – 0.4 శాతం క్షీణించింది. మొదటి త్రైమాసికంలో 3 శాతం వృద్ధి రేటు రాగా, 2018–19 రెండవ త్రైమాసికంలో 5.3 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇక ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే, దాదాపు నిశ్చలంగా 1.3%గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధిరేటు 5.2 శాతం. క్యూ2 జీడీపీపై ప్రతికూల ప్రభావం? ఏప్రిల్–జూన్‌లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 5 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికంలోనైనా (జూలై–సెప్టెంబర్) కొంత మెరుగైన ఫలితం వస్తుందన్న ఆశలపై తాజా పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు నీళ్లు జల్లుతున్నాయి. నవంబర్ 29న జూలై– సెప్టెంబర్ జీడీపీ డేటా వెలువడనుంది. -
జీడీపీ.. ఢమాల్!
న్యూఢిల్లీ: భారత ఆర్థికరంగం తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని ఏప్రిల్–జూన్ త్రైమాసిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 5 శాతంగా నమోదయ్యింది. 2012–13 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కేవలం 4.9 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. అటు తర్వాత ఈ రేటు మళ్లీ ఈ స్థాయిని చూస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) తొలి త్రైమాసికంలో భారీగా 8 శాతం వృద్ధి సాధించినా, ఏడాది తిరిగే సరికి ఈ రేటు భారీగా పడిపోవడం గమనార్హం. జనవరి–మార్చి త్రైమాసికంలో (గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలు) కూడా వృద్ధి రేటు కనీసం 5.8 శాతం నమోదయ్యింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో తీవ్ర నిరాశకు కీలక తయారీ, వ్యవసాయ రంగాలు రెండూ ఈ కాలంలో మొండిచేయి చూపించడం దీనికి ప్రధాన కారణం. తాజా సమీక్షా కాలంలో కనీసం 5.7 శాతం అన్నా వృద్ధి రేటు ఉంటుందని మార్కెట్ అంచనావేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనాంశం. కాగా చైనా ఇదే త్రైమాసికంలో 6.2 శాతం వృద్ధిని (27 సంవత్సరాల కనిష్టం) నమోదుచేసుకుంది. అయితే భారత్ వృద్ధి ఇంతకన్నా తక్కువ నమోదయినందున (5 శాతం) ఈ నిర్దిష్ట త్రైమాసికంలో ‘ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం’ హోదాను భారత్ కోల్పోయినట్లయ్యింది. కేంద్రం శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారంకొన్ని కీలక రంగాలను చూస్తే... ♦ తయారీ: కేవలం 0.6 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. 2018–19 ఇదే త్రైమాసికంలో ఈ రేటు 12.1 శాతంగా ఉండడం గమనార్హం. ♦ వ్యవసాయం, అటవీ, మత్స్యసంపద: వృద్ధి 5.1 శాతం నుంచి 2 శాతానికి జారింది. ♦ గనులు, తవ్వకాలు: ఈ రంగం కొంచెం బెటర్. వృద్ధి రేటు 0.4% నుంచి 2.7 శాతానికి ఎగసింది. ♦ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: ఈ రంగంలో కూడా వృద్ధి రేటు 6.7 శాతం నుంచి 8.6 శాతానికి చేరింది. ♦ నిర్మాణం: ఈ రంగంలో వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 5.7 శాతానికి పడిపోయింది. ♦ ట్రేడ్, హోటెల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్, సేవలు: 7.8% నుంచి 7.1 శాతానికి చేరింది. ♦ ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: వృద్ధి రేటు 6.5% నుంచి 5.9 శాతానికి దిగింది. ♦ జీఎఫ్‌సీఎఫ్:పెట్టుబడులకు సంబంధించిన పరిస్థితిని తెలియజేసే గ్రాస్ ఫిక్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ (జీఎఫ్‌సీఎఫ్) విలువ రూ.11.21 లక్షల కోట్ల (2018–19 క్యూ1లో) నుంచి కేవలం రూ.11.66 లక్షల కోట్లకు చేరింది.కాగా, వృద్ధి పడిపోడానికి దేశీయ, అంతర్జాతీయ అంశాలు కారణమని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. విలువలు చూస్తే... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం– 2018–19 మొదటి త్రైమాసికంలో జీడీపీ విలువ 34.14 లక్షల కోట్లు. 2019–20 మొదటి త్రైమాసికంలో ఈ రేటు రూ.35.85 లక్షల కోట్లకు చేరింది. అంటే వృద్ధి రేటు ఇక్కడ 5 శాతమన్నమాట. 2019–2020 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. తాజా పరిస్థితి చూస్తుంటే, ఈ స్థాయి వృద్ధి రేటు అయినా, సాధ్యమైనా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మొదటి త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి 5.1 శాతం నుంచి 3.6 శాతానికి పడిపోయిన క్రమంలోనే తాజా జీడీపీ పేలవ ఫలితాలూ వెలువడ్డాయి. ఆటోమొబైల్ అమ్మకాలు, రైలు రవాణా, దేశీయ విమాన ట్రాఫిక్, దిగుమతులు (ఆయిల్, పసిడి, వెండి యేతర) పడిపోవడం వినియోగం తగ్గుదలను సూచిస్తోంది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం సైతం వ్యవస్థలో మందగమనానికి సంకేతం. భారత్ పాసింజర్ వాహన పరిశ్రమ అమ్మకాలు జూలైలో 31 శాతం పడిపోయాయి. గడచిన 19 సంవత్సరాల్లో ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. రేటు కోత నిర్ణయాలు తీసుకుంటూ (వరుసగా నాలుగు ద్వైమాసికాల్లో 1.10 శాతం తగ్గింపు– ప్రస్తుతం 5.4 శాతం) ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నా అంతగా ఫలితం ఉండడంలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాసింజర్ వాహనాలు, సిమెంట్ వంటి రంగాలపై వస్తు, సేవల పన్ను తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే భారీగా ఉపాధి అవకాశాలు కోల్పోవచ్చని హెచ్చరిస్తున్నాయి. 2018 జూలైతో పోల్చుకుంటే, 2019 జూలైలో నిరుద్యోగ రేటు 5.66 శాతం నుంచి 7.51 శాతానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వివరించింది. -
మందగించిన జీడీపీ వృద్ధి రేటు
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు బాగా మందగించింది. సెంబర్ 2018తో ముగిసిన మూడో త్రైమాసికంలో జీడీపీవృద్ధి రేటు 6.6 శాతంగా నమోదైంది. గత అయిదు త్రైమాసికాల్లో అంటే సెప్టెంబర్ 2017తో ముగిసిన క్వార్టర్ తర్వాత ఇదే అత్యంత నెమ్మదైన జీడీపీ వృద్ధి. అక్టోబర్-డిసెంబర్ మాసానికి సంబంధించిన జీడీపీ వృద్ధి గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సీఎస్ఓ) గురువారం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని గత నెల సీఎస్ఓ ముందుగా అంచనా వేసింది. గత ఏడాది ఇది 7 శాతంగా ఉంది. రాయిటర్స్ సర్వేలో 55 మంది ఆర్థిక నిపుణులు వృద్ధిరేటు 6.9 శాతంగా ఉంటుందని అంచనావేశారు. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ తక్కువ వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం. 2018-19 ఆర్థిక సంవత్సరంలో స్థిర (2011-12) ధరల దగ్గర వాస్తవ జీడీపీ రూ.141.00 లక్ష కోట్ల స్థాయికి చేరనుందని అంచనా. జనవరి 31, 2019న ప్రకటించిన వివరాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరానికి అంతకుముందు సవరించిన జీడీపీ అంచనా రూ.131.80 లక్షల కోట్లుగా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతం ఉంటుందని అంచనా. 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉందని సీఎస్ఓ పేర్కొంది. -
‘అభివృద్ధి’లో ఈ తప్పుడు లెక్కలు ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశాభివృద్ధి అంటే జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రేటు 7.3 శాతమని, అంతకుముందు యూపీఏ ప్రభుత్వం హయాంలో ఈ జీడీపీ రేటు 6.7 శాతంగా ఉందని ‘సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్’, నీతి అయోగ్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు అనుసరించిన ఆర్థిక సూత్రం లెక్కల ప్రకారం యూపీఏ హయాంలో జీడీపీ వద్ధిరేటు 7.75 ఉండగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పన్ను కారణంగా జీడీపీ రేటు 5.7కు పడిపోయిందని తేలింది. ఈ లెక్కలను మోదీ ప్రభుత్వం తప్పని తిరస్కరించడమే కాకుండా జీడీపీని లెక్కిస్తున్న సూత్రమే తప్పని తేల్చింది. మరో ఆర్థిక సూత్రాన్ని అనుసరించి కొత్త జీడీపీ రేటును లెక్కించాల్సిందిగా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌ను మోదీ ప్రభుత్వం ఆదేశించింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీడీపీ రేటును లెక్కించాలని ప్రభుత్వం పెద్దలు ముందుగా సూచించారు. కొత్త ఆర్థిక సూత్రం ప్రకారం జీడీపి రేటును లెక్కించాల్సి వచ్చినప్పుడు అంతకుముందు ఐదేళ్ల క్రితం జీడీపీ రేటు ఎంత ఉందో కూడా లెక్కించడం చట్ట ప్రకారం తప్పనిసరని అధికారులు, ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో అలాగే కానిమ్మని మోదీ ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ఆర్థిక సూత్రం ప్రకారం మోదీ ప్రభుత్వం హయాంలో జీడీపీ రేటు 7.6 శాతం ఉన్నట్లు తేలింది. అంతకుముందు ఐదేళ్ల క్రితం అంటే, యూపీఏ ప్రభుత్వం హయాంలో జీడీపీ రేటు 10.1 శాతం ఉన్నట్లు తేలింది. ఈ వివరాలను వెల్లడించడం కోసం నవంబర్ 12వ తేదీన సీఎస్ఓ పత్రికా విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎలాంటి కారణం చెప్పకుండా హఠాత్తుగా నాడు ఆ విలేకరుల సమావేశాన్ని రద్దు చేసింది. అంతకుముందు సీఎస్ఓ వెబ్సైట్లో పేర్కొన్న యూపీఏ హయంలోని జీడీపి రేటు 10.1 శాతాన్ని తొలగించింది. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చైర్మన్‌గా వ్యవహరించే ‘నీతి అయోగ్’ సీఎస్ఓతో కలిసి భారత జీడీపీ రేటు అంచనాలకు కసరత్తు చేసింది. నీతి ఆయోగ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫామ్ ఇండయా)వైస్ చైర్మన్‌ను ప్రభుత్వం నియమిస్తుంది. ప్రస్తుతం ఆ పదవిలో రాజీవ్ కుమార్ కొనసాగుతున్నారు. ఇలా ప్రభుత్వం చేతుల్లో ఉండే రాజకీయ విభాగం సీఎస్ఓ లెక్కల్లో జోక్యం చేసుకోవడం ఏమిటో! సంప్రదాయం ప్రకారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించాల్సిందిపోయి ఓ ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించడం ఏమిటో, అప్పోడోరకం, ఇప్పుడోరకం లెక్కలేమిటో విజ్ఞులకే తెలియాలి? ఏదోరకంగా నరేంద్ర మోదీ హయాంలో జరిగిన జీడీపీ రేటును లెక్కించడానికి లేదా అంచనా వేయడానికి ప్రభుత్వానికి మూడేళ్లు పట్టింది. రఘురామ్ రాజన్ నుంచి అర్వింద్ పనగారియా వరకు, ఆ మాటకొస్తే మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియం లాంటి మహా మహా ఆర్థిక నిపుణలు మోదీ హయాంలోనే పనిచేశారు. వారిలో ఎవరిని అడిగినా చిటికలో లెక్కలు తేల్చేవారు. -
జీఎస్టీతో ఆర్థిక వృద్ధి : ఎంపీ మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ వల్ల రెండు శాతం మేర జీడీపీ రేటు వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయని, ఇది దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. జీఎస్టీ ప్రారంభం నేపథ్యంలో ప్రత్యేక పార్లమెంటు సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒకే దేశం ఒకే పన్ను పేరుతో వస్తున్న జీఎస్టీ కాలక్రమంలో ఒక గొప్ప సంస్కరణగా నిలుస్తుంది. జీడీపీ రెండు శాతం పెరుగుతుందని అంటున్నారు. అంతా సవ్యంగా సాగితే ఇది దేశ ఆర్థికాభివృద్ధికి మంచి ఊపునిస్తుంది. దేశంలో మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి. భవిష్యత్తు బాగుంటుంది. యూపీఏ హయాంలోనే ప్రతిపాదన వచ్చినా ఏకాభిప్రాయం రాలేదు. ఇప్పుడు అందరూ అంగీకరించిన మీదట జీఎస్టీ అమలులోకి వస్తోంది. అయితే జీఎస్టీ గురించి చిన్న తరహా వర్తకులు భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందరి ప్రయోజనాలు కాపాడాలి. మైనారిటీలు, దళితులు, బలహీన వర్గాలు ఎవరైనా కూడా తమకు భద్రత లేదన్న భావన పొరపాటున కూడా రాకూడదు. కేంద్ర ప్రభుత్వం అందరి ప్రయోజనాలు కాపాడుతుందన్న భావన రావాలి. అందుకు వీలుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని చెప్పారు. గోరక్ష పేరుతో దాడులు తగవని స్వయంగా ప్రధాని పిలుపునిచ్చిన విషయం అందరూ గమనించాలన్నారు. దేశంలో అందరి ప్రయోజనాలకు రక్షణ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.