ముంబై: బ్యాంకుల రుణ వృద్ధి 59 ఏళ్ల కనిష్ట స్థాయి అయిన 5.56 శాతానికి 2020–21 సంవత్సరంలో పడిపోగా.. నాణేనికి మరోవైపు అన్నట్టు దేశ జీడీపీలో బ్యాంకుల రుణ నిష్పత్తి 56 శాతానికి చేరుకుంది. 2015లో నమోదైన 64.8 శాతం తర్వాత ఇదే గరిష్ట స్థాయి. అయినప్పటికీ పోటీ దేశాల కంటే, జీ20 దేశాల సగటు కంటే తక్కువగానే ఉండడాన్ని గమనించాలి. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ క్రెడిట్స్ (బీఐఎస్) గణాంకాలను పరిశీలిస్తే ఇది తెలుస్తోంది. మొత్తం మీద బ్యాంకుల రుణాలు 2020 నాటికి 1.52 లక్షల కోట్ల డాలర్లు (రూ.112 లక్షల కోట్లు) గా ఉన్నాయి. మన దేశ బ్యాంకుల రుణాలు–జీడీపీ నిష్పత్తి ఆసియా దేశాల్లో రెండో కనిష్ట స్థాయి కాగా.. వర్ధమాన దేశాలతో పోలిస్తే 135.5 శాతంగాను, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 88.7 శాతంగాను ఉన్నట్టు బీఐఎస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన వ్యాపారాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో హామీలేని రుణ పథకాలు సైతం ఉన్నాయి. అయినాకానీ బ్యాంకుల రుణ వృద్ధి 59 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి అన్నది ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని సూచిస్తుందని.. బ్యాంకుల రుణాలు జీడీపీలో 100 శాతంగా ఉండడం ఆదర్శనీయమైనదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్రిక్స్ దేశాలను గమనిస్తే.. బ్యాంకుల రుణాలు–జీడీపీ రేషియో చైనాలో 161.75 శాతం, రష్యాలో 88.12 శాతం, బ్రెజిల్‌లో 50.8 శాతం, దక్షిణాఫ్రికాలో 40.1 శాతం చొప్పున ఉంది.
జీడీపీలో 56 శాతానికి బ్యాంకింగ్ రుణాలు
Published Sat, Jun 26 2021 8:59 AM | Last Updated on Sat, Jun 26 2021 8:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment