మళ్లీ ‘మైక్రో’ పడగ! | Expanding Micro Loan institutions in Telangana | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘మైక్రో’ పడగ!

Published Tue, Dec 3 2024 3:49 AM | Last Updated on Tue, Dec 3 2024 4:10 PM

Expanding Micro Loan institutions in Telangana

రాష్ట్రంలో విస్తరిస్తున్న సూక్ష్మ రుణ సంస్థలు 

మహిళలే టార్గెట్‌.. వారిని గ్రూపులుగా చేసి రుణాలు

వారానికి ఒక వాయిదా చెల్లించేలా నిబంధనలు 

వాయిదా చెల్లించకపోతే అడ్డగోలుగా అదనపు వసూళ్లు 

‘మైక్రో’ రుణాలపై 36 శాతం వరకు వడ్డీ భారం 

వాయిదా మీరితే రోజుకు రూ.100–200 ఫైన్‌ 

వసూళ్ల పేరిట వేధింపులు, ఆగడాలు..ఇప్పటికే పలువురి ఆత్మహత్య 

క్రమంగా వెలుగులోకి వస్తున్న దారుణాలు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:  తెలంగాణ జిల్లాల్లో మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు మళ్లీ పడగ విప్పుతున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి, అధిక వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. పెద్ద నగరాలు, పట్టణాలు, సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్రాంచీలు తెరిచాయి. పేదలు, మధ్య తరగతి వారి ఆర్థిక అవసరాలు, బలహీనతలను ఆసరాగా తీసుకుని వ్యాపారం చేస్తున్నాయి. మహిళలే టార్గెట్‌గా, వారిని గ్రూపులుగా చేసి అప్పులు ఇస్తున్నాయి. 

ఒకరు కట్టకుంటే మిగతా వారంతా కలసి కట్టాలనే నిబంధనలు పెడుతూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఒకవేళ వాయిదాలు కట్టలేకపోతే... ‘చస్తే చావండి.. డబ్బులు మాత్రం కట్టండి’ అంటూ తీవ్రంగా వేధింపులకు దిగుతున్నాయి. ఈ మైక్రో ఫైనాన్స్‌ల వలలో చిక్కి వేలాది కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. సంపాదించే కాసింత కూడా వడ్డీలకే సరిపోవడం లేదంటూ.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. 

రిజర్వు బ్యాంకు నిబంధనలు అంటూ... 
మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు పది నుంచి ఇరవై మంది వరకు మహిళలను గ్రూపుగా చేసి.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆధార్‌కార్డు, పాన్‌కార్డు జిరాక్స్‌లు తీసుకుని రుణాలు ఇస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకులుగా రిజిస్టర్‌ చేయించుకుని చట్టబద్ధంగానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా రికార్డుల్లో చూపుతున్నాయి. వివిధ పేర్లతో ముందుగానే కోతలు పెడుతున్నాయి. అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. 

ఉదాహరణకు గ్రూపులో ఒక్కో మహిళకు రూ.30వేల చొప్పున అప్పుగా ఇస్తారు. ఇందులోనూ బీమా, ప్రాసెసింగ్‌ ఫీజు పేరిట రూ.2 వేలు ముందే కోతపెట్టి.. రూ.28 వేలు మాత్రమే మహిళల చేతికి ఇస్తారు. ఈ అసలు, వడ్డీ కలిపి వారానికి రూ.800 చొప్పున ఏడాది పాటు చెల్లించాలి. అంటే రూ.28 వేలకుగాను.. మొత్తంగా రూ.44,800 కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ఏ వారమైనా వాయిదా సమయానికి చెల్లించకుంటే.. అదనంగా రూ.100 జరిమానా కింద వసూలు చేస్తారు. 

అసలు లక్ష్యం పక్కదారి పట్టి.. 
స్పందన, కీర్తన, ఫిన్‌కేర్, ఒరిగో, సౌత్‌ ఇండియా, అన్నపూర్ణ, యాక్సిస్, పిరమిల్, ఐ రిఫ్, క్రిస్, బంధన్, ఎపాక్, హోమ్‌ లోన్స్‌ ఫైనాన్స్, వెరిటాస్‌ మైక్రో ఫైనాన్స్, ప్యూజియన్‌ బ్యాంకు, ఆశీర్వాద్‌ బ్యాంకు, ఎఫ్‌ఎఫ్‌ఎల్, ఫెడరల్‌ బ్యాంకు వంటి సంస్థలు మైక్రో ఫైనాన్స్‌ చేస్తున్నాయి. వాస్తవానికి పేదలకు తక్కువ మొత్తంలో రుణాలు సులువుగా అందించడం, ఆర్థిక చేయూత ద్వారా పేదరికాన్ని తగ్గించడం లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్‌ వ్యవస్థల లక్ష్యం. సూక్ష్మరుణాల ద్వారా వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి, విస్తరించడానికి తోడ్పడాలి. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. 

పోటాపోటీగా పాగా.. అడ్డగోలు వడ్డీ 
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన టాప్‌ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు తెలంగాణలోనూ పాగా వేశాయి. అవి రూ.8 వేల నుంచి రూ.50 వేల వరకు మహిళలకు రుణాలు ఇస్తున్నాయి. రుణాలు ఇచ్చే సమయంలోనే కాల పరిమితిని బట్టి 36 శాతం వరకు వడ్డీ పడుతుందని ఒప్పంద పత్రంలోనే పేర్కొంటున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కోరకంగా డాక్యుమెంట్, ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ, బీమా వంటివాటి పేరిట రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు రుణంలో ముందే కోతపెడుతున్నాయి. అన్నీ కలిపి లెక్కేస్తే.. పేరుకు 36 శాతం అయినా, 50శాతం దాకా వడ్డీ పడుతున్న పరిస్థితి. పేదలు ఈ వడ్డీల భారం భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆవేదనతో ప్రాణాలు తీసుకోవడానికీ ప్రయత్నిస్తున్నారు. 

ఆర్‌బీఐ నిబంధనల మేరకే అంటూ.. 
2008లోనూ ఇలాగే మైక్రో ఫైనాన్స్‌ వేధింపులు పెరిగిపోవడంతో.. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కఠిన చర్యలు చేపట్టారు. మైక్రో ఫైనాన్స్‌ వసూళ్లపై కొంతకాలం మారటోరియం విధించారు. ఈ సమస్య పరిష్కారం కోసం 2010 అక్టోబర్‌ 14న ఒక ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు నాటి ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేధింపులకు పాల్పడే మైక్రో ఫైనాన్స్‌ నిర్వహకులకు కనీసం మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించాలని.. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయితే ఇప్పుడు రూటు మార్చిన మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు బ్యాంకుల పేరిట ఆర్‌బీఐ నిబంధనలంటూ దందాకు శ్రీకారం చుట్టాయి. 

సంపాదన.. అప్పు, వడ్డీ కిందకే పోతోంది 
చిన్న వ్యాపారానికి పెట్టుబడి కోసం మైక్రో ఫైనాన్స్‌లో రూ.85 వేల రుణం తీసుకున్నాం. వారానికి రూ.1,400 చొప్పున 90 వారాలు చెల్లించాలి. రోజూ గిన్నెలు విక్రయించగా వచ్చే మొత్తంలో కొంత ఇంటి అవసరాలకుపోగా మిగతా అంతా ఫైనాన్స్‌కు చెల్లిస్తున్నా. ఒక్కోసారి వ్యాపారం సాగకపోయినా వాయిదా మాత్రం చెల్లించాల్సి వస్తోంది. ఏ మాత్రం ఆలస్యమైనా జమానత్‌ ఉన్నవారిపై ఒత్తిడి తెస్తున్నారు. 20 ఏళ్ల నుంచి చేస్తున్న ఈ చిన్నపాటి వ్యాపారంతో సంపాదించిందంతా అప్పు, వడ్డీకే పోతోంది. 
– బానాల శంకర్, కమ్మర్‌పల్లి, నిజామాబాద్‌ జిల్లా 

అటువంటి రుణాలతో మోసపోవద్దు 
మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసి అధిక వడ్డీతో రుణాలు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎవరైనా భద్రత, సెక్యూరిటీ లేని సంస్థల నుంచి రుణాలు పొందేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి లోన్లతో మోసపోవద్దు. సభ్యులను బ్యాంకు సిబ్బంది లేదా తోటి సభ్యులు ఇబ్బంది పెడితే పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేయాలి. 
– పి.సంపత్‌రావు, డీఎస్పీ, భూపాలపల్లి 


ఈ చిత్రంలోని వ్యక్తి పేరు దుబాసి సాయికృష్ణ (27). రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌ నగర్‌లో ఉండేవారు. ఆయన భార్య రజిత పేరిట మైక్రో ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నారు. ఆ వాయిదాలు చెల్లించలేకపోవడంతో వేధింపులు ఎదురయ్యాయి. దాంతో నూతి అనిల్‌ అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.20వేలు అప్పు చేసి.. ఆ వాయిదాలు కట్టారు. కానీ ఈ అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో సాయికృష్ణను నిలదీసిన అనిల్‌.. అతడి సెల్‌ఫోన్‌ లాక్కుని వెళ్లాడు. సాయికృష్ణ ఈ అవమానం భరించలేక ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ కేసులో అప్పు ఇచ్చి వేధించిన నూతి అనిల్‌ జైలుకు వెళ్లాడు. కానీ మైక్రో ఫైనాన్స్‌ నిర్వాహకులు బలవంతపు వసూళ్లు చేస్తున్నా చర్యలు లేవు.


నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆవాల భారతి భర్త పదేళ్ల కిందే మరణించాడు. ఆమె గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ గాజులు, బొమ్మలు, దండలు అమ్ముతూ.. కొడుకు, కూతురును పోషించుకుంటోంది. ఇటీవల వ్యాపారం కోసం మైక్రో ఫైనాన్స్‌లో రూ.50 వేలు రుణం తీసుకుని వారానికి రూ.5 వేలు చెల్లిస్తోంది. గిరాకీ సరిగా లేక ఇబ్బంది ఎదురైనా రుణం వాయిదా చెల్లించాల్సి వస్తోందని.. లేకుంటే జమానత్‌ దారుపై ఒత్తిడి తెచ్చి వసూలు చేసుకుంటున్నారని వాపోతోంది. ఈ వాయిదాలు చెల్లించడం కోసం మరో ఫైనాన్స్‌లో రుణం తీసుకుని కడుతున్నానని... సంపాదించే కాస్త కూడా వడ్డీలకే పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement