
ఎంఎంటీఎస్ బోగీలో ఒంటరిగా ఉన్నయువతిపై ఆగంతకుడి దుశ్చర్య
తప్పించుకునేందుకు నడుస్తున్న రైలులోంచి దూకిన యువతి
గాయాలపాలైన బాధితురాలిని గాంధీకి తరలించిన స్థానికులు
త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం: జీఆర్‌పీ ఎస్పీ చందనదీప్తి వెల్లడి
22న రాత్రి 8 గంటల సమయంలో ఘటన.. మొదట రైలు నుంచి జారిపడ్డట్లు బాధితురాలి స్టేట్‌మెంట్
తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పటంతో వెలుగులోకి ఘటన
నిందితుడిని పట్టుకొనేందుకు రంగంలోకి నాలుగు బృందాలు
త్వరలోనే పట్టుకుంటాం: జీఆర్‌పీ ఎస్పీ చందనదీప్తి వెల్లడి
సికింద్రాబాద్/గాంధీ ఆస్పత్రి: ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకటంతో తీవ్రంగా గాయపడింది. ఈ నెల 22న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో కోలుకుంటోంది. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సికింద్రాబాద్ జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ జి.సాయీశ్వర్‌గౌడ్ తెలిపారు.
బోగీలో ఒంటరిగా ఉండటంతో..
అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది.
ఆమె ఎక్కిన లేడీస్ కోచ్‌లో ఉన్న మరో ఇద్దరు మహిళలు రాత్రి 8 గంటల సమయంలో అల్వాల్ స్టేషన్‌లో దిగిపోవటంతో బోగీలో బాధితురాలు ఒక్కరే మిగిలింది. అది గమనించిన ఒక ఆగంతకుడు బోగీలోకి ప్రవేశించి బాధి తురాలిపై అఘాయిత్యం చేయబోయాడు. భయాందోళనకు గురైన ఆమె కొంపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో నడుస్తున్న రైలు నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితికి చేరిన యువతిని గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
రెండు స్టేట్‌మెంట్లు
గాంధీ ఆస్పత్రిలో అదే రోజు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అయితే, తాను ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడ్డట్లు ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే పోలీసులు రికార్డు చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి వచ్చిన తన కుటుంబ సభ్యులకు తనపై అత్యాచార యత్నం జరిగిందన్న విషయాన్ని బాధితురాలు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోమారు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్న పోలీసులు అత్యాచార యత్నం కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నాలుగు బృందాలతో గాలింపు
బాధితురాలిని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) ఎస్పీ చందనదీప్తి సోమవారం పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. రెండు బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణలో ఉన్నాయని వివరించారు. నిందితుడిని గుర్తించడంలో పురోగతి సాధించామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
మెరుగైన వైద్యం అందించాం
బాధితురాలిని 22న రాత్రి 11.30 గంటలకు గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ తెలిపారు. ఆ సమయంలో ఆమె స్పృహలోనే ఉన్నప్పటికీ మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించిందని చెప్పారు. ఆమె చేయి మణికట్టు వద్ద విరిగిందని, శరీరంపై గాయాలున్నాయని వివరించారు. బాధితురాలికి వెంటనే ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు తగిన వైద్యసేవలు అందించారని, సీటీ స్కానింగ్ చేయించామని వెల్లడించారు.
కాగా, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సూచన మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. మంత్రుల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. లెఫ్ట్ ఎగనెస్ట్ మెడికల్ ఎడ్వైజ్ (లామా) ద్వారా బాధితురాలు గాంధీ ఆస్పత్రి నుంచి వెల్లిపోయినట్లు ప్రొఫెసర్ సునీల్ కుమార్ ఆ తర్వాత వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment