
ఆకతాయిలు, అసాంఘికశక్తులకు అడ్డాలుగా బోగీలు
ఎంఎంటీఎస్ స్టేషన్‌లు, రైళ్లలో కొరవడిన ఆర్పీఎఫ్ నిఘా
అల్వాల్‌స్టేషన్ సమీపంలో ఘటన నేపథ్యంలో ప్రశ్నార్థకంగా మహిళల భద్రత
సాక్షి.హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైళ్లు, స్టేషన్లలో మహిళా ప్రయాణికుల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్‌లోని మహిళా కోచ్‌లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి ప్రయాణికురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడడం, అతడి నుంచి తప్పించుకొనేందుకు ఆమె కదులుతున్న రైలులోంచి దూకి తీవ్ర గాయాలపాలు కావడంతో ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు నడుస్తున్న కొన్ని రైళ్లలో ఆరీ్పఎఫ్ శక్తి బృందాలు, జీఆర్‌పీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ డివిజన్ పరిధిలో ఎంఎంటీఎస్‌లలో మహిళలకే కాకుండా సాధారణ ప్రయాణికుల భద్రతపైన కూడా ఆందోళన నెలకొంది. తరచూ ఏదో ఒక స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి దాడులకు పాల్పడుతున్నారు.
ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్, మేడ్చల్, నాంపల్లి, తదితర మార్గాల్లో నడిచే రైళ్లపైన ఎలాంటి నిఘా వ్యవస్థలు పని చేయడం లేదు. ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ భద్రత కూడా లేదు. నగరంలో సుమారు 30 ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా కేవలం 10 స్టేషన్ల మాత్రమే ఆరీ్పఎఫ్ విధులు నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ డివిజన్‌లో ఒక ఎస్‌ఐతోపాటు 16 మంది మహిళా కానిస్టేబుళ్లతో శక్తి టీమ్‌ను ఏర్పాటు చేశారు. కానీ ఈ బృందాల పనితీరు కొన్ని స్టేషన్‌లకు పరిమితం. అలాంటి నిఘా, భద్రతా బృందాలు హైదరాబాద్ డివిజన్‌లో లేకపోవడం గమనార్హం.
సీసీ కెమెరాల నిఘా లేదు...
ప్రస్తుతం లింగంపల్లి–ఫలక్‌నుమా, మేడ్చల్–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్–మేడ్చల్, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో ప్రతి రోజు సుమారు 75 సరీ్వసులు నడుస్తున్నాయి. ఈ సరీ్వసుల సమయ పాలన, నిర్వహణ, భద్రతను అధికారులు కొంతకాలంగా గాలికి వదిలేశారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఏ రైలుఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి ట్రైన్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా కోచ్‌ను ఏర్పాటు చేసినా ఆయా బోగీల్లోకి పురుషులు యథేచ్చగా రాకపోకలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.
మహిళలు అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోకుండా కొందరు ఆకతాయిలు ఇష్టారాజ్యంగా ఒక స్టేషన్‌లో ఎక్కి మరో స్టేషన్‌లో దిగిపోతూ మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. మగ ప్రయాణికులు ఈ బోగీల్లోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ప్రతి బోగీలో ఆరీ్పఎఫ్ మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. మరోవైపు అన్ని బోగీల్లోనూ సీసీకెమెరాలను ఏర్పాటు చేసి ఆరీ్పఎఫ్ డివిజన్ కార్యాలయాలతో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, బేగంపేట్, హైటెక్‌సిటీ, లింగంపల్లి, మల్కాజిగిరి, చర్లపల్లి, ఘట్కేసర్ వంటి ప్రధానమైన స్టేషన్లలో మినహా మిగతా స్టేషన్లలో కూడా సీసీ కెమెరాలు సరిగ్గా పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
‘ప్రస్తుతం దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో మాత్రమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది. ఆ దిశగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.’అని ఆరీ్పఎఫ్ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. సిబ్బంది కొరత దృష్ట్యా అన్ని చోట్ల ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చునని, సీసీకెమెరాలు ఉంటే పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా నిరోధించవచ్చునని పేర్కొన్నారు.
భద్రతా విభాగాల మధ్య సమన్వయం కరువు
మరోవైపు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా నేరాల నియంత్రణ సవాల్‌గా మారిందనే అభిప్రాయం కూడా ఉంది. ప్రయాణికుల భద్రత తమ పరిధిలోని అంశం కాదన్నట్లుగా, రైల్వే ఆస్తుల రక్షణ మాత్రమే తమ బాధ్యత అన్నట్లుగా ఆర్పీఎఫ్ వ్యవహరిస్తుందని జీఆర్‌పీ పోలీసులు ఆరోపిస్తున్నారు. కానీ జీఆర్‌పీ నిర్వర్తించాల్సిన విధులను తామే నిర్వహిస్తున్నామని, జీఆర్‌పీ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆర్పీఎఫ్ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇలా ఇరువర్గాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా నేరస్తులకు అవకాశంగా మారుతోంది.