
బంజారాహిల్స్(హైదరాబాద్): తనను చంపుతామని బెదిరించిన హీరో ప్రభాస్ పీఆర్వోగా చెప్పుకుంటున్న వ్యక్తిపై యూట్యూబర్ చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–44లో డయల్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్‌లో విజయ్‌సాధు అనే జర్నలిస్ట్ అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. తన డయల్ స్యూస్ ఛానల్‌లో ఈ నెల 4న హీరో ప్రభాస్‌కు మేజర్ సర్జరీ జరిగిందంటూ ఓ వీడియోను విజయసాధు పోస్ట్ చేశాడు.
ఈ వీడియో వైరల్ అయ్యింది. మరుసటి రోజు సురేష్ కొండి అనే వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రభాస్ పీఆర్వోనని పరిచయం చేసుకున్నాడు. డార్లింగ్ ఇన్ డేంజర్ అనే హెడ్డింగ్‌తో ప్రభాస్‌కు మేజర్ సర్జరీ జరిగిందంటూ, అనారోగ్యం బారిన పడ్డాడంటూ డయల్ న్యూస్ యూట్యూబ్‌లో పెట్టిన పోస్ట్‌కు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని సురేష్ ప్రశ్నించాడు. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. అయితే ఈ వీడియోను విజయ్‌సాధు డిలీట్ చేయలేదు. దీంతో సురేష్ ఈ పోస్ట్‌ను ప్రభాస్ ఫ్యాన్స్‌కు పంపించాడు.
ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానులు ఫోన్‌కాల్, ఎస్‌ఎంఎస్, వాట్సప్ మెసేజ్‌లలో విజయసాధును తీవ్రంగా దూషిస్తూ నిన్ను చంపేస్తాం..నీ ఆఫీసును తగలబెడతాం..అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా ఈ నెల 6వ తేదీన ఉదయం 10 మంది యువకులు యూట్యూబ్ కార్యాలయానికి వచ్చి తాము ప్రభాస్ అభిమానులం అంటూ న్యూసెన్స్ చేయగా భయాందోళనకు గురైన విజయసాధు డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని అల్లరి మూకలను పంపించి వేశారు. న్యూసెన్స్‌కు కారణమైన సురేష్ కొండిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.