
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ(హెచ్ సీయూ) భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థి లోకం ఆందోళన చేపట్టింది. భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ గత రాత్రి(శనివారం) నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో యూనివర్శిటీ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించి ఆందోళనను అణిచివేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు’(ఆదివారం) యూనివర్శిటీ పరిధిలోని పచ్చచెట్లను నరికివేయడానికి ప్రభుత్వం పూనుకుంది.
వర్శిటీ పక్కన ఉన్న భారీ స్థలంలో చెట్లను కొట్టివేస్తుండగా విద్యార్ధులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీ మెయిన్ గేటుకు తాళం వేశారు పోలీసులు. యూనివర్శిటీ ప్రాంగణంలో జేసీబీలతో చెట్లను కూల్చివేసి నేలను చదును చేసే యత్నం చేస్తున్నారు.
విద్యార్థులు అరెస్టు..ఎస్‌ఎఫ్‌ఐ ఖండన
ఆందోళనకు దిగిన విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఆందోళనను అణచివేసే క్రమంలో పెద్ద ఎత్తున అరెస్టులు కొనసాగుతున్నాయి. దీన్ని తెలంగాణ ఎస్ఎఫ్ఐ ఖండించింది. అహంకారంతో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేసిన విద్యార్థులను విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది.
HCU విద్యార్ధులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించండి. ఎక్కడ ఎడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం , నియంతృత్వం, అహంకారం తో వ్యవరిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి.@VP_Sanu @KTRBRS @TV9Telugu @NtvTeluguLive @ndtv @V6News @MayukhDuke pic.twitter.com/49WFvdScad
— SFI Telangana (@TelanganaSfi) March 30, 2025
ఇదీ వివాదం..
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.
తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్‌సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.
హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్‌సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
చుట్టూ ఐటీ కారిడార్ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.