HCU వద్ద హైటెన్షన్‌.. భారీగా పోలీసుల మోహరింపు | Students Protests In HCU Over Land Issue | Sakshi
Sakshi News home page

HCU వద్ద హైటెన్షన్‌.. భారీగా పోలీసుల మోహరింపు

Published Mon, Mar 31 2025 9:28 AM | Last Updated on Mon, Mar 31 2025 12:26 PM

Students Protests In HCU Over Land Issue

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించ వద్దని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 200 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్‌ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపలా నడుమ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లోకి వచ్చారు. దట్టమైన పొదలు, చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. అది గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు.

ఈ క్రమంలో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదిస్తూ అక్కడికి చేరుకున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయారు. కాళ్లు, చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్‌ షీల్డ్‌తో విచక్షణా రహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.

బట్టలు చిరిగినా వదలకుండా..
పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లలను మహిళా పోలీసులు జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాను ఎక్కించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయాలపాలయ్యారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను లాకెళ్లారు. అడ్డుకోబోయిన యువకులను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్‌లో పడేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్‌ గేట్‌ ఎదుట బైఠాయించారు. బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement