
హైదరాబాద్: హెచ్‌సీయూవిద్యార్థులపై నమోదు చేసిన కేసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నీర్ణయం తీసుకుంది. హెచ్ సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులపై ఏ కేసులు అయితే నమోదయ్యాయో వాటిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై హెచ్ సీయూ విద్యార్థులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కంచ భూముల్ని అభివృద్ధి పేరుతో విక్రయిస్తే ఊరుకోబోమంటూ తెలంగాణ సర్కారును హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం చేపట్టబోతున్న చర్యలను కొన్ని రోజుల క్రితం అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారిపై కేసులు నమోదయ్యాయి. వీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ఈరోజు(సోమవారం) స్పష్టం చేయడంతో విద్యార్థులకు ఊరట లభించింది.
మంత్రుల కమిటీ సమావేశంలో నిర్ణయం
HCU కంచె గచ్చిబౌలి సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సెక్రటేరియట్ లోసమావేశమైంది. ఈ భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ నటరాజన్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి యూనివర్శిటీస్ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు. ఈ మేరకు పలు విజ్ఞప్తులు చేశారు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు.
ఇందులో విద్యార్థులపై కేసులతో పాటు యూనివర్శటీ క్యాంపస్ నుంచి పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఇదిలా ఉంచితే, కంచ భూముల వ్యహహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఇటీవల కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.